ఇంట్లో దైవభక్తిని అభ్యసించండి
అధ్యాయం పదిహేడు
ఇంట్లో దైవభక్తిని అభ్యసించండి
1. దేవుని వాక్య నడిపింపును అన్వయించుకోవడం, వివాహబంధాలపై ఎలాంటి ప్రభావం చూపింది?
యెహోవా వివాహానికి మూలకర్త, ఆయన వాక్యం కుటుంబాలకు అత్యుత్తమ నడిపింపునిస్తుంది. ఆ నడిపింపును అన్వయించుకోవడం వల్ల అనేకులు వివాహ జీవితంలో విజయం సాధించారు. మెచ్చుకోదగిన విషయమేమిటంటే, అంతకుముందు కేవలం కలిసి జీవితం గడిపిన కొందరు, తమ వివాహాలను చట్టబద్ధంగా రిజిస్టరు చేయించుకోవడానికి పురికొల్పబడ్డారు. మరికొందరు వివాహేతర లైంగిక సంబంధాలను విడిచిపెట్టారు. తమ భార్యాపిల్లలపై దౌర్జన్యం చేసిన క్రూరులైన పురుషులు, దయా వాత్సల్యం చూపించడం నేర్చుకున్నారు.
2. క్రైస్తవ కుటుంబ జీవితంలో ఏయే అంశాలు ఉన్నాయి?
2 క్రైస్తవ కుటుంబ జీవితంలో అనేక అంశాలు ఉన్నాయి, అంటే శాశ్వత వివాహబంధాన్ని మనమెలా దృష్టిస్తాము, కుటుంబంలో మన బాధ్యతలను నెరవేర్చడానికి మనమేమి చేస్తాము, కుటుంబంలోని ఇతర సభ్యులతో మనమెలా వ్యవహరిస్తాము వంటి అనేక అంశాలున్నాయి. (ఎఫెసీయులు 5:33–6: 4) కుటుంబ జీవితం గురించి బైబిలు చెప్పే విషయాలు మనకు తెలిసినా, బైబిలు ఉపదేశం అన్వయించుకోవడమనేది పూర్తిగా భిన్నమైన విషయం. దేవుని ఆజ్ఞలను అతిక్రమించినందుకు యేసు ఖండించినవారిలా ఉండాలని మనలో ఎవరమూ కోరుకోము. కేవలం మతపరమైన భక్తివుంటే చాలని వారు తప్పుగా తర్కించారు. (మత్తయి 15:4-9) మనం పైకి భక్తిగలవారివలే కనిపిస్తూ ఇంట్లో దైవభక్తి అభ్యసించని వారిలా ఉండాలని కోరుకోము. బదులుగా మనం “గొప్ప లాభసాధనమైన” నిజమైన దైవభక్తిని కనబరచాలని కోరుకుంటాము.—1 తిమోతి 5: 4; 6: 6; 2 తిమోతి 3: 5.
వివాహం ఎంతకాలం నిలుస్తుంది?
3. (ఎ) అనేక వివాహాలకు ఏమి సంభవిస్తోంది, అయినా మన కృతనిశ్చయమేమై ఉండాలి? (బి) మీ బైబిలు ఉపయోగించి, ఈ పేరా క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
3 వివాహబంధాలు అంతకంతకు సులభంగా తెగిపోయే బంధాలుగా తయారవుతున్నాయి. అనేక సంవత్సరాలు కలిసి జీవించిన కొందరు దంపతులు విడాకులు తీసుకొని వేరొకరిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. వివాహమైన కొంతకాలానికే విడిపోయిన యౌవన దంపతులు గురించి వినడం ఇప్పుడు సర్వసాధారణమయ్యింది. అయితే ఇతరులేమి చేసినా మనం మాత్రం యెహోవాను సంతోషపరచాలని కోరుకుంటాము. కాబట్టి శాశ్వతమైన వివాహబంధం గురించి దేవుని వాక్యం చెప్పే విషయాలను తెలుసుకొనేందుకు మనం ఈ క్రింది ప్రశ్నలను, లేఖనాలను పరిశీలిద్దాము.
ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు, వారు ఎంతకాలం కలిసి జీవించాలని కోరుకోవాలి? (మార్కు 10:6-9; రోమీయులు 7:2, 3)
మళ్ళీ పెళ్ళి చేసుకునే అవకాశంతో విడాకులు తీసుకోవడానికి దేవుని ఆమోదముగల ఏకైక ఆధారమేమిటి? (మత్తయి 5:31, 32; 19:3-9)
తన వాక్యం ఆమోదించని విడాకుల గురించి యెహోవా ఎలా భావిస్తాడు? (మలాకీ 2:13-16)
వైవాహిక సమస్యలను పరిష్కరించుకోవడానికి విడిపోవడమే మార్గమని బైబిలు చెబుతోందా? (1 కొరింథీయులు 7:10-13)
ఎలాంటి పరిస్థితులు, విడిపోవడానికి ఆధారంగా ఉండవచ్చు? (కీర్తన 11: 5; లూకా 4: 8; 1 తిమోతి 5: 8)
4. కొన్ని వివాహాలు ఎందుకు శాశ్వతంగా నిలుస్తున్నాయి?
4 కొన్ని వివాహాలు విజయవంతంగా శాశ్వతంగా నిలిచివుంటాయి. ఎందుకు? ఇరువురు పరిణతి చెందేవరకు వేచివుండడం ఒక ముఖ్యమైన అంశం, అయితే తమ ఇష్టాయిష్టాలను పంచుకొనే, విషయాలను దాచుకోకుండా చర్చించే జతను కనుగొనడం కూడా ప్రాముఖ్యం. అంతేగాక యెహోవాను ప్రేమించి, సమస్యలు పరిష్కరించడానికి ఆధారంగా ఆయన వాక్యాన్ని గౌరవించే జతను కనుగొనడం మరింత ప్రాముఖ్యం. (కీర్తన 119:97, 104; 2 తిమోతి 3:16, 17) అలాంటి వ్యక్తి, పరిస్థితులు అనుకూలించకపోతే విడిపోవచ్చు లేదా విడాకులు తీసుకోవచ్చు అని ఆలోచించడు. ఆ వ్యక్తి తన బాధ్యతలనుండి తప్పుకోవడానికి తన భాగస్వామి బలహీనతలను ఒక సాకుగా ఉపయోగించుకోడు. బదులుగా అతను జీవిత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని, ఆచరణాత్మకమైన పరిష్కారాలు కనుగొంటాడు.
5. (ఎ) వివాహబంధంలో, యెహోవాపట్ల విశ్వసనీయత ఎలాంటి పాత్ర పోషిస్తుంది? (బి) వ్యతిరేకత ఎదురైనా, యెహోవా ప్రమాణాలను హత్తుకొని ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగవచ్చు?
5 మనం బాధలనుభవించినప్పుడు యెహోవా మార్గాలు విడిచిపెడతామని సాతాను వాదిస్తున్నాడు. (యోబు 2:4, 5; సామెతలు 27:11) కాని తమ విశ్వాసాలను వ్యతిరేకించే భాగస్వామివల్ల బాధలనుభవించిన యెహోవాసాక్షులు అనేకులు తమ వివాహ ప్రమాణాలను వమ్ముచేయలేదు. వారు యెహోవాకు ఆయన ఆజ్ఞలకు విశ్వసనీయంగానే ఉన్నారు. (మత్తయి 5:37) కొందరు అనేక సంవత్సరాలు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికి అలాగే పట్టుదలతో కొనసాగినందుకు, చివరకు తమ జీవిత భాగస్వామి కూడా యెహోవాను సేవించడం ప్రారంభించిన ఆనందాన్ని స్వంతం చేసుకున్నారు! (1 పేతురు 3:1, 2) మారే సూచన కనిపించని భాగస్వామిగల లేదా యెహోవాను సేవిస్తున్నందుకు తమను విడిచి వెళ్ళిన భాగస్వామిగల క్రైస్తవులకు సహితం, తాము ఇంట్లో దైవభక్తి చూపిస్తున్నామని రుజువు చేసినందుకు ఆశీర్వదించబడతామని తెలుసు.—కీర్తన 55:22; 145:16.
ప్రతివారు తమవంతు నెరవేర్చడం
6. వివాహం విజయవంతం కావడానికి ఏ ఏర్పాటును గౌరవించాలి?
6 వివాహం విజయవంతం కావడానికి కేవలం కలిసివుంటే సరిపోదు. ఒక ప్రాథమిక అవసరమేమిటంటే, దంపతులిరువురూ యెహోవా శిరస్సత్వ ఏర్పాటును గౌరవించాలి. ఇది ఇంట్లో మంచి క్రమ పద్ధతికి, భద్రతా భావానికి తోడ్పడుతుంది. 1 కొరింథీయులు 11: 3 లో మనమిలా చదువుతాం: ‘ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు దేవుడు.’
7. కుటుంబంలో శిరస్సత్వం ఎలా నిర్వర్తించబడాలి?
7 ఆ వచనం మొదట ఏమి ప్రస్తావించిందో మీరు గమనించారా? అవును ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, వారు ఆయనకు లోబడివుండాలి. అంటే భర్త, యేసు లక్షణాలను ప్రతిబింబించే విధంగా తన శిరస్సత్వం నిర్వర్తించాలని దానర్థం. క్రీస్తు యెహోవాకు లోబడివుంటాడు, సంఘాన్ని గాఢంగా ప్రేమిస్తాడు, దానికి కావలసినవి సమకూరుస్తాడు. (1 తిమోతి 3:15) చివరకు ఆయన ‘దానికొరకు తన్నుతాను అప్పగించుకొన్నాడు.’ యేసు గర్విష్ఠి, నిర్దయుడు కాదుగాని ఆయన ‘సాత్వికుడు, దీనమనస్సుగలవాడు.’ ఆయన శిరస్సత్వం క్రింద ఉండేవారి ‘ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది.’ ఒక భర్త తన కుటుంబంతో ఈ విధంగా వ్యవహరించినప్పుడు, తాను క్రీస్తుకు లోబడుతున్నానని ఆయన చూపిస్తాడు. అప్పుడు తన భర్తకు సహకరించడం, ఆయన శిరస్సత్వానికి లోబడివుండడం తనకు ప్రయోజనకరంగా విశ్రాంతిని కలుగజేసేదిగా ఉందని క్రైస్తవ భార్య గ్రహిస్తుంది.—ఎఫెసీయులు 5:25-33; మత్తయి 11:28, 29; సామెతలు 31:10, 28.
8. (ఎ) కొన్ని కుటుంబాల్లో క్రైస్తవ పద్ధతులు కోరిన ఫలితాలు తీసుకురానట్లు ఎందుకు అనిపించవచ్చు? (బి) అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనమేమి చేయాలి?
8 అయితే సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులు బైబిలు సూత్రాలు అన్వయించడం ఆరంభించకముందే, ఇతరుల మాట వినడానికి ఇష్టపడని స్వభావం అప్పటికే కొంతమేరకు వారిలో బలంగా పాతుకుని ఉండవచ్చు. దయాపూర్వక విన్నపాలు, ప్రేమపూర్వక వైఖరి సత్ఫలితాలు తీసుకువచ్చేలా కనిపించకపోవచ్చు. “కోపము, క్రోధము, అల్లరి, దూషణ” విసర్జించాలని బైబిలు చెబుతోందని మనకు తెలుసు. (ఎఫెసీయులు 4:31) కాని కుటుంబ సభ్యులకు అలా కోపంగా చెబితే గాని అర్థంకాదు అనిపిస్తే అప్పుడు మనమేమి చేయాలి? యేసు తనను బెదిరించి, దూషించిన వారికి బదులు అలా చేయలేదు, ఆయన తన తండ్రిపై ఆధారపడ్డాడు. (1 పేతురు 2:22, 23) కాబట్టి ఇంట్లో బాధ కలిగించే పరిస్థితులు తలెత్తినప్పుడు, లోకసంబంధ విధానాలు అవలంబించే బదులు యెహోవా సహాయం కోసం ప్రార్థించడం ద్వారా దైవభక్తి ప్రదర్శించండి.—సామెతలు 3:5-7.
9. అనేకమంది క్రైస్తవ భర్తలు తప్పులు పట్టే బదులు, ఏమి చేయడం నేర్చుకున్నారు?
9 అన్నిసార్లు మార్పులు వెంటనే రావు, కాని ఓపికతో, పట్టుదలతో బైబిలు ఉపదేశం అన్వయించుకుంటే అది నిజంగా పనిచేస్తుంది. యేసు సంఘంతో వ్యవహరించిన విధానం అర్థంచేసుకున్న తర్వాత తమ వివాహం మెరుగుపడడం ఆరంభమైందని చాలా మంది భర్తలు గ్రహించారు. ఆ సంఘం పరిపూర్ణ మానవులతో రూపొందించబడలేదు. అయినప్పటికి, యేసు ఆ సంఘాన్ని ప్రేమించాడు, దానికొక మాదిరినుంచాడు, దాని అభివృద్ధికి సహాయపడేలా లేఖనాలు ఉపయోగించాడు. ఆ సంఘం కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు. (1 పేతురు 2:21) మంచి శిరస్సత్వం చూపేందుకు, అభివృద్ధికి దోహదపడే ప్రేమపూర్వక సహాయం అందించేందుకు ఆయన మాదిరి అనేకమంది క్రైస్తవ భర్తలకు ప్రోత్సాహాన్నిచ్చింది. ఇది తప్పులు పట్టడం లేదా మాట్లాడకుండా ఉండడంకంటే మెరుగైన ఫలితాలు తెస్తుంది.
10. (ఎ) ఒక భార్య లేదా భర్త, చివరకు క్రైస్తవులమని చెప్పుకునే భార్య లేదా భర్త కూడా ఏయే విధాలుగా కుటుంబంలోని ఇతరుల జీవితాలను కష్టభరితం చేయవచ్చు? (బి) పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమి చేయవచ్చు?
10 ఒక భర్త తన కుటుంబ భావావేశ అవసరాలు పట్టించుకోకుండా ఉంటే లేదా కుటుంబ బైబిలు చర్చకు, ఇతర కార్యకలాపాలకు ఏర్పాట్లు చేయడానికి చొరవ తీసుకోకుండా ఉంటే అప్పుడెలా? లేక ఒక భార్య తన భర్తకు సహకరించకుండా, దైవభక్తిగల విధేయత చూపించకుండా ఉంటే ఎలా? అలాంటి సమస్యలను గౌరవపూర్వకంగా తమ కుటుంబంతో చర్చించడం ద్వారా కొందరు మంచి ఫలితాలు సాధిస్తారు. (ఆదికాండము 21:10-12; సామెతలు 15:22) అయితే మనం ఆశించిన ఫలితాలన్ని సాధించలేకపోయినా, మనలో ప్రతి ఒక్కరము మన జీవితంలో ఆత్మ ఫలాలు ఫలింపజేయడం ద్వారా, ఇతర కుటుంబ సభ్యులపట్ల ప్రేమపూర్వక శ్రద్ధాసక్తులు చూపించడం ద్వారా ఇంట్లో మెరుగైన వాతావరణం నెలకొనేందుకు తోడ్పడవచ్చు. (గలతీయులు 5:22) అవతలి వ్యక్తి ఏదో చేస్తాడని ఎదురుచూస్తూ ఉండకుండా మనం దైవభక్తిని అభ్యసించేవారమని చూపిస్తూ స్వయంగా మన వంతు మనం చేసినప్పుడే అభివృద్ధి కలుగుతుంది.—కొలొస్సయులు 3:18-21.
సమాధానాలు ఎక్కడ లభిస్తాయి?
11, 12. కుటుంబ జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి మనకు సహాయపడేందుకు యెహోవా ఎలాంటి ఏర్పాటు చేశాడు?
11 ప్రజలు తమ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి సలహాల కోసం అనేక చోట్ల సంప్రదిస్తారు. కాని దేవుని వాక్యంలోనే అత్యుత్తమ సలహా ఉందని మనకు తెలుసు, మనం ఆ సలహా అన్వయించుకోవడానికి దేవుడు తన దృశ్య సంస్థ ద్వారా సహాయం అందిస్తున్నందుకు మనమెంతో కృతజ్ఞులం. మీరు ఆ సహాయం నుండి పూర్తి ప్రయోజనం పొందుతున్నారా?—కీర్తన 119:129, 130; మీకా 4: 2.
12 సంఘ కూటాలకు హాజరవడంతోపాటు కుటుంబ బైబిలు అధ్యయనానికి మీరు క్రమంగా కొంత సమయం కేటాయిస్తున్నారా? అలా చేసే కుటుంబాలు ఆరాధనలో ఐక్యంగా ఉండేందుకు కృషి చేసినవారవుతారు. వారు తమ పరిస్థితులకు దేవుని వాక్యాన్ని అన్వయిస్తుండగా వారి కుటుంబ జీవితం వర్ధిల్లుతుంది.—ద్వితీయోపదేశకాండము 11:18-21.
13. (ఎ) కుటుంబ విషయాల్లో మనకేవైనా సందేహాలుంటే, అవసరమైన సహాయాన్ని మనం తరచూ ఎక్కడ కనుగొనవచ్చు? (బి) మనం తీసుకునే నిర్ణయాలన్ని దేనిని ప్రతిబింబించాలి?
13 కుటుంబ విషయాలకు సంబంధించి మీకు సందేహాలు ఉండవచ్చు. ఉదాహరణకు కుటుంబ నియంత్రణ విషయమేమిటి? గర్భస్రావం సమర్థనీయమేనా? ఒక పిల్లవాడు ఆధ్యాత్మిక విషయాలపట్ల అంతగా ఆసక్తి చూపించకపోతే వాడు కుటుంబ ఆరాధనలో ఎంతమేరకు భాగం వహించాలి? ఇలాంటి అనేక సందేహాలు, యెహోవాసాక్షులు ప్రచురించిన ప్రచురణల్లో చర్చించబడ్డాయి. వాటికి సమాధానాలు కనుగొనడానికి బైబిలు అధ్యయన సహాయకాలను, అకారాది సూచికలను ఉపయోగించడం నేర్చుకోండి. అకారాది సూచికలో నిర్దేశించబడిన ప్రచురణలు మీ వద్ద లేకపోతే, రాజ్యమందిరంలోని గ్రంథాలయంలో పరిశీలించండి. లేదా ఆ ప్రచురణలను మీ కంప్యూటర్‌లో చూడవచ్చు. మీరు మీ సందేహాలను పరిణతిగల క్రైస్తవ స్త్రీపురుషులతో కూడా చర్చించవచ్చు. కాని ప్రతి ప్రశ్నకు అవును లేక కాదు అనే సమాధానం ఆశించవద్దు. తరచూ మీరే స్వయంగా లేదా వివాహ దంపతులుగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు మీరు బయటేకాక ఇంట్లో కూడా దైవభక్తిని అభ్యసిస్తారని ప్రతిబింబించే నిర్ణయాలు తీసుకోండి.—రోమీయులు 14:19; ఎఫెసీయులు 5: 10.
పునఃసమీక్షా చర్చ
• ఒక వ్యక్తి తన వివాహ భాగస్వామికి నమ్మకంగా ఉండడంలో, యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం ఎలా చేరివుంది?
• కుటుంబ సమస్యలవల్ల ఒత్తిడి ఎదురైనప్పుడు, దేవుణ్ణి సంతోషపరిచేది చేసేలా మనకేమి సహాయం చేస్తుంది?
• కుటుంబంలోని ఇతరులు తప్పుచేసినా, పరిస్థితిని మెరుగుపరచడానికి మనమేమి చేయవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[155వ పేజీలోని చిత్రం]
భర్త శిరస్సత్వం యేసు లక్షణాలను ప్రతిబింబించాలి
[157వ పేజీలోని చిత్రం]
కుటుంబంతో క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం వల్ల కుటుంబం ఐక్యమవుతుంది