కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉపదేశం వినండి, క్రమశిక్షణ అంగీకరించండి

ఉపదేశం వినండి, క్రమశిక్షణ అంగీకరించండి

అధ్యాయం పదిహేను

ఉపదేశం వినండి, క్రమశిక్షణ అంగీకరించండి

1. (ఎ) మనందరికి ఉపదేశం, క్రమశిక్షణ ఎందుకు అవసరం? (బి) మనమే ప్రశ్న గురించి ఆలోచించాలి?

 “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” అని యాకోబు 3:2 వ వచనంలో బైబిలు చెబుతోంది. దేవుని వాక్యం ఉద్బోధిస్తున్నట్లుగా ఉండడంలో విఫలమైన అనేక సందర్భాలు మనం గుర్తుచేసుకోవచ్చు. కాబట్టి “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము [“ఉపదేశం విని క్రమశిక్షణ,” NW] అంగీకరించుము అని బైబిలు చెప్పినప్పుడు అది నిజమని మనం ఒప్పుకుంటాము. (సామెతలు 19:​20) నిస్సందేహంగా, మనం బైబిలు బోధలకు అనుగుణంగా జీవించడానికి ఇప్పటికే సర్దుబాట్లు చేసుకున్నాము. అయితే మన తోటి క్రైస్తవుడు ఒకానొక విషయంలో మనకు ఉపదేశం ఇస్తే మనమెలా ప్రతిస్పందిస్తాము?

2. మనకు వ్యక్తిగత ఉపదేశం ఇవ్వబడినప్పుడు మనమేమి చెయ్యాలి?

2 కొందరు తమను తాము సమర్థించుకోవడానికి, పరిస్థితి గంభీరతను తగ్గించడానికి లేదా ఆ నిందను మరొకరిపై నెట్టడానికి ప్రయత్నిస్తారు. కాని ఉపదేశం విని దానిని అన్వయించుకోవడం మంచిది. (హెబ్రీయులు 12:​11) అయితే ఎవ్వరూ ఇతరుల నుండి పరిపూర్ణతను ఆశించకూడదు, అలాగే ప్రతి చిన్నదానికి లేదా బైబిలు వ్యక్తిగత నిర్ణయానికి వదిలేసినవాటి గురించి అదేపనిగా ఉపదేశించకూడదు. అంతేకాక, ఉపదేశించే వ్యక్తి బహుశా వాస్తవాలన్నింటిని పరిగణలోకి తీసుకోకపోయి ఉండవచ్చు, అప్పుడు గౌరవపూర్వకంగా వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్ళవచ్చు. కాని ఈ క్రింది చర్చలో, ఇవ్వబడిన ఉపదేశం లేదా క్రమశిక్షణ సముచితమని, బైబిలు ఆధారితమని మనం భావిద్దాము. ఒక వ్యక్తి ఎలా ప్రతిస్పందించాలి?

ఉపదేశించబడినప్పుడు గుర్తుంచుకోవలసిన ఉదాహరణలు

3, 4. (ఎ) ఉపదేశం, క్రమశిక్షణకు సంబంధించి సరైన దృక్కోణం వృద్ధిచేసుకోవడానికి మనకు సహాయపడగల ఏ విషయాలు బైబిల్లో ఉన్నాయి? (బి) రాజైన సౌలు ఉపదేశానికి ఎలా ప్రతిస్పందించాడు, దాని ఫలితమేమిటి?

3 అవసరమైన ఉపదేశం పొందిన వ్యక్తుల నిజజీవిత అనుభవాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. కొన్నిసార్లు ఉపదేశంతోపాటు క్రమశిక్షణ కూడా ఇవ్వబడింది. అలాంటి ఒక వ్యక్తి ఇశ్రాయేలు రాజైన సౌలు. ఆయన అమాలేకీయుల విషయంలో యెహోవాకు విధేయత చూపించలేదు. అమాలేకీయులు దేవుని సేవకులను వ్యతిరేకించారు, కాబట్టి అమాలేకీయులు, వారి పశువులు నాశనం చేయబడాలని యెహోవా తీర్పు తీర్చాడు. కాని సౌలు రాజు అమాలేకీయుల రాజును, క్రొవ్విన పశువులను నాశనం చేయకుండా విడిచిపెట్టాడు.​—⁠1 సమూయేలు 15:​1-11.

4 సౌలును గద్దించేందుకు యెహోవా సమూయేలు ప్రవక్తను పంపించాడు. సౌలు ఎలా ప్రతిస్పందించాడు? తాను అమాలేకీయులను జయించానని వారి రాజును మాత్రమే వదిలేద్దామనుకున్నానని ఆయన వాదించాడు. అయితే అది యెహోవా ఆజ్ఞకు విరుద్ధం. (1 సమూయేలు 15:​20) పశువులను నాశనం చేయకుండా విడిచిపెట్టిన నిందను ప్రజలపై వేయడానికి ప్రయత్నిస్తూ సౌలు ఇలా అన్నాడు: ‘జనులకు జడిసి నేను వారి మాట విన్నాను.’ (1 సమూయేలు 15:​24) ఆయన తన స్వాతిశయం గురించే ఎక్కువగా చింతించినట్లు అనిపిస్తుంది, ప్రజల ఎదుట తనను ఘనపరచమని కూడా సమూయేలును అడిగాడు. (1 సమూయేలు 15:​30) చివరకు యెహోవా సౌలును రాజుగా తిరస్కరించాడు.​—⁠1 సమూయేలు 16: 1.

5. రాజైన ఉజ్జియా ఉపదేశం తిరస్కరించినప్పుడు ఆయనకేమి జరిగింది?

5 యూదా రాజైన ఉజ్జియా “ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము” చేశాడు. (2 దినవృత్తాంతములు 26:​16) అయితే నియమానుసారంగా యాజకులు మాత్రమే అలా ధూపం వేయాలి. ప్రధాన యాజకుడు ఉజ్జియాను ఆపడానికి ప్రయత్నించినప్పుడు, ఆ రాజు కోపం తెచ్చుకున్నాడు. తర్వాత ఏమి జరిగింది? బైబిలు ఇలా చెబుతోంది: “అతని నొసట కుష్ఠరోగము పుట్టెను . . . యెహోవా తన్ను [అతనిని] మొత్తెను . . . రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియై యుండెను.”​—⁠2 దినవృత్తాంతములు 26:​19-21.

6. (ఎ) సౌలు ఉజ్జియాలు ఉపదేశం ఎందుకు నిరాకరించారు? (బి) ఉపదేశం నిరాకరించడం నేడు గంభీరమైన సమస్యగా ఎందుకుంది?

6 సౌలుకు, ఉజ్జియాకు ఉపదేశం అంగీకరించడం ఎందుకు కష్టమనిపించింది? వారి ప్రాథమిక సమస్య అహంకారం, ఇద్దరూ తమను తాము ఎంతో ఉన్నతంగా ఎంచుకున్నారు. ఈ లక్షణం కారణంగానే అనేకమంది తమపైకి దుఃఖం తెచ్చుకుంటారు. ఉపదేశం అంగీకరించడం, తమలోని లోపాన్ని సూచిస్తుందని లేదా తమ ప్రతిష్ఠకు నష్టం తెస్తుందని వారు భావిస్తున్నట్లు అనిపిస్తుంది. కాని అహంకారం ఒక బలహీనత. అహంకారం ఒకరి ఆలోచనలను కప్పివేస్తుంది, అందువల్ల అతను యెహోవా తన వాక్యం ద్వారా, తన దృశ్య సంస్థ ద్వారా ఇచ్చే సహాయం నిరాకరించేందుకే మొగ్గు చూపుతాడు. యెహోవా ఇలా హెచ్చరిస్తున్నాడు: “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.”​—⁠సామెతలు 16:​18; రోమీయులు 12: 3.

ఉపదేశం అంగీకరించడం

7. మోషే ఉపదేశానికి ప్రతిస్పందించిన విధానం నుండి, మనం ఎలాంటి క్షేమాభివృద్ధికరమైన పాఠాలు నేర్చుకోగలం?

7 ఉపదేశం అంగీకరించిన వ్యక్తుల చక్కని ఉదాహరణలు కూడా లేఖనాల్లో ఉన్నాయి, మనం వాటి నుండి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. మోషే విషయం ఆలోచించండి, తన పని భారం తగ్గించుకునే విషయంలో ఆయన మామ ఆయనకు ఉపదేశమిచ్చాడు. మోషే ఆయన ఉపదేశం విని, వెంటనే దానిని అమలుపరిచాడు. (నిర్గమకాండము 18:​13-24) మోషేకు గొప్ప అధికారంవున్నా ఆయన ఉపదేశం ఎందుకు అంగీకరించాడు? ఎందుకంటే ఆయన నమ్రతగలవాడు. “మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.” (సంఖ్యాకాండము 12: 3) ఈ సాత్వికం ఎంత ప్రాముఖ్యం? అది మన ప్రాణాలను కాపాడుతుందని జెఫన్యా 2: 3 చూపిస్తోంది.

8. (ఎ) దావీదు ఎలాంటి పాపాలు చేశాడు? (బి) నాతాను గద్దించినప్పుడు దావీదు ఎలా ప్రతిస్పందించాడు? (సి) దావీదు పాపాలకు ఎలాంటి పరిణామాలు కలిగాయి?

8 రాజైన దావీదు బత్షెబతో వ్యభిచరించి, ఆమె భర్త ఊరియాను చంపించడం ద్వారా ఆ తప్పు కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. యెహోవా దావీదును గద్దించడానికి నాతాను ప్రవక్తను పంపించాడు. ఆయన పశ్చాత్తాపపడి వెంటనే ఇలా ఒప్పుకున్నాడు: “నేను పాపముచేసితిని.” (2 సమూయేలు 12:​13) దేవుడు దావీదు పశ్చాత్తాపాన్ని అంగీకరించినప్పటికి, తన తప్పు వల్ల కలిగిన పరిణామాలు ఆయన అనుభవిస్తాడు. ‘[ఆయన] యింటివారికి సదాకాలము యుద్ధము కలుగునని,’ ఆయన భార్యలు ఆయన “చేరువ వానికి” అప్పగించబడతారని, ఆయన వ్యభిచారంవల్ల ‘పుట్టిన బిడ్డ నిశ్చయముగా చనిపోతుందని’ యెహోవా ఆయనకు చెప్పాడు.​—⁠2 సమూయేలు 12:​10, 11, 14.

9. మనకు ఉపదేశం లేదా క్రమశిక్షణ ఇవ్వబడితే మనమే విషయం మరచిపోకూడదు?

9 మంచి ఉపదేశం వినడంవల్ల కలిగే ప్రయోజనం గురించి దావీదు రాజుకు తెలుసు. ఒక సందర్భంలో, ఉపదేశం ఇచ్చినవారిని బట్టి ఆయన దేవునికి కృతజ్ఞత తెలియజేశాడు. (1 సమూయేలు 25:​32-35) మనమలా ఉన్నామా? అలాగైతే, ఆ తర్వాత మనకు బాధకలిగించగలవాటిని అనకుండా, చేయకుండా మనం కాపాడబడతాము. అయితే మనకు ఉపదేశం లేదా క్రమశిక్షణ కూడా ఇవ్వబడే పరిస్థితులు ఎదురైతే అప్పుడెలా? మన నిత్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని యెహోవా చూపిస్తున్న ప్రేమకు ఇది నిదర్శనమనే వాస్తవాన్ని మనం మరచిపోకూడదు.​—⁠సామెతలు 3:​11, 12; 4:​13.

పెంపొందించుకోవలసిన అమూల్య లక్షణాలు

10. రాజ్యంలో ప్రవేశించే వారికి ఏ లక్షణం ఉండాలని యేసు చూపించాడు?

10 యెహోవాతో, మన క్రైస్తవ సహోదరులతో మంచి సంబంధం కలిగివుండడానికి మనం కొన్ని లక్షణాలు పెంపొందించుకోవాలి. యేసు తన శిష్యుల మధ్య ఒక బిడ్డను నిలబెట్టి మాట్లాడినప్పుడు ఆ లక్షణాల్లో ఒకదానిని పేర్కొంటూ ఇలా అన్నాడు: “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు . . . కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.” (మత్తయి 18:​3, 4) యేసు శిష్యులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు కాబట్టి వారు వినయం వృద్ధిచేసుకోవాలి.​—⁠లూకా 22:​24-27.

11. (ఎ) మనం ఎవరి ఎదుట నమ్రతగా ఉండాలి, ఎందుకు? (బి) మనం నమ్రతగలవారమైతే, ఉపదేశించబడినప్పుడు మనమెలా ప్రతిస్పందిస్తాము?

11 అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (1 పేతురు 5: 5) మనం దేవుని ఎదుట నమ్రతతో ఉండాలని మనకు తెలుసు, అయితే ఈ లేఖనం, మనం మన తోటి విశ్వాసులతో కూడా నమ్రతతో ఉండాలని తెలియజేస్తోంది. మనమలా ఉంటే, ఇతరులు యుక్తమైన సలహాలు ఇచ్చినప్పుడు ఆగ్రహించే బదులు వారి నుండి మనం నేర్చుకుంటాము.​—⁠సామెతలు 12:​15.

12. (ఎ) ఏ ప్రాముఖ్యమైన లక్షణానికి, నమ్రతకు సన్నిహిత సంబంధముంది? (బి) మన ప్రవర్తన ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం ఎందుకు ఆలోచించాలి?

12 నమ్రతకు, ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధ చూపించడానికి సన్నిహిత సంబంధముంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను. . . . కాబట్టి మీరు భోజనము చేసినను పానముచేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. యూదులకైనను, గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి.” (1 కొరింథీయులు 10:​24-33) మన వ్యక్తిగత ఇష్టాలన్నింటిని పక్కన పెట్టాలని పౌలు చెప్పడం లేదు, కాని తన మనస్సాక్షి తప్పని చెప్పిన పని చేయడానికి వేరొక వ్యక్తిని ప్రోత్సహించే ఎలాంటి పనినీ చేయవద్దని ఆయన మనకు ఉద్బోధించాడు.

13. మనం లేఖనాధారిత ఉపదేశం అన్వయించుకోవడం అలవాటు చేసుకుంటున్నామా లేదా అని ఏ ఉదాహరణ సూచించవచ్చు?

13 మీరు మీ స్వంత ఇష్టాలకంటే ఇతరుల సంక్షేమాన్ని ముందుంచుతున్నారా? మనందరం అలా చేయడం నేర్చుకోవాలి. అలా చేయడానికి అనేక మార్గాలున్నాయి. ఉదాహరణకు వస్త్రధారణ, కేశాలంకరణను పరిశీలించండి. అణకువగా, చక్కగా, పరిశుభ్రంగా ఉండే విషయంలో లేఖనాధార మార్గనిర్దేశాలను అతిక్రమించనంతవరకు ఇవి వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన విషయాలే. అయితే మీరు నివస్తున్న ప్రాంతంలోని ప్రజల జీవన నేపథ్యం కారణంగా, మీ వస్త్రధారణ లేదా కేశాలంకరణ, ఇతరులు రాజ్య సందేశం వినకుండా ఆటంకపరుస్తుందని మీకు తెలిస్తే, మీరు సర్దుబాట్లు చేసుకుంటారా? నిశ్చయంగా, మనకు ఇష్టమైనదే చేయడంకంటే వేరొక వ్యక్తి నిత్యజీవం పొందడానికి సహాయం చేయడమే ప్రాముఖ్యం.

14. నమ్రతను, ఇతరులపట్ల శ్రద్ధచూపే లక్షణాన్ని పెంపొందించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

14 వినయంగా ఉంటూ, ఇతరులపట్ల శ్రద్ధ చూపే విషయంలో యేసు మాదిరి ఉంచాడు, ఆయన తన శిష్యుల కాళ్ళు కూడా కడిగాడు. (యోహాను 13:​12-15) ఆయన గురించి దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, . . . విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.”​—⁠ఫిలిప్పీయులు 2:​5-8; రోమీయులు 15: 2, 3.

యెహోవా క్రమశిక్షణను తిరస్కరించకండి

15. (ఎ) దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిత్వం కలిగివుండడానికి మనమెలాంటి మార్పులు చేసుకోవాలి? (బి) యెహోవా మనందరికి ఉపదేశాన్ని, క్రమశిక్షణను ఏ విధంగా అందజేశాడు?

15 మనందరం పాపులం కాబట్టి, మనం మన దేవుని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే మన వైఖరిలో, మన ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలి. మనం “నవీనస్వభావమును” ధరించుకోవాలి. (కొలొస్సయులు 3:​5-14) మనం ఏ విషయాల్లో సవరింపులు చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో గుర్తించడానికి ఉపదేశం, క్రమశిక్షణ మనకు సహాయం చేస్తాయి. మనకు అవసరమైన ఉపదేశం ఇవ్వడానికి ప్రాథమిక మూలాధారం బైబిలే. (2 తిమోతి 3:​16, 17) యెహోవా సంస్థ అందించే బైబిలు సాహిత్యాలు, కూటాలు దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడానికి మనకు సహాయం చేస్తాయి. మనం ఫలాని ఉపదేశం ఇంతకుముందు విన్నప్పటికి, అది మనకు అవసరమని గ్రహించి, దానికి అనుగుణంగా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తామా?

16. యెహోవా మనకు వ్యక్తిగతంగా ఎలాంటి సహాయం అందిస్తున్నాడు?

16 యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధతో, మన సమస్యల విషయంలో మనకు సహాయం చేస్తాడు. గృహ బైబిలు అధ్యయనాల ద్వారా లక్షలాదిమందికి సహాయం చేయబడింది. హృదయవేదనకు కారణంకాగల ప్రవర్తన నుండి తమ పిల్లలను కాపాడేందుకు తలిదండ్రులు వారికి ఉపదేశాన్ని, క్రమశిక్షణను ఇస్తారు. (సామెతలు 6:​20-23) సంఘంలో కొందరు, క్షేత్ర పరిచర్యలో తమ ప్రయత్నాలను మెరుగుపరచుకోవడానికి ఉపదేశం, సూచనలు ఇవ్వమని అనుభవజ్ఞులైన పరిచారకులను తరచూ అడుగుతారు. కొన్నిసార్లు పెద్దలు పరస్పరం లేదా పరిచర్యలో అనుభవమున్న ఇతరులను ఉపదేశం ఇవ్వమని అడగవచ్చు. ఆధ్యాత్మిక అర్హతలున్నవారు, సాత్వికమైన మనస్సుతో అవసరమైనవారికి సహాయం చేసేందుకు బైబిలును ఉపయోగిస్తారు. మీరు ఉపదేశం ఇస్తే, ‘మీరు కూడా శోధింపబడతారేమో అని మీ విషయమై చూసుకొంటూ’ ఉండాలని గుర్తుంచుకోండి. (గలతీయులు 6:​1, 2) అవును మనం అద్వితీయ సత్య దేవుణ్ణి ఐక్యంగా ఆరాధించడానికి మనందరికి ఉపదేశం, క్రమశిక్షణ అవసరం.

పునఃసమీక్షా చర్చ

• వ్యక్తిగతంగా మనం ఎక్కడ సర్దుబాట్లు చేసుకోవాలో చూసేందుకు యెహోవా ప్రేమతో మనకు ఎలా సహాయం చేస్తున్నాడు?

• అవసరమైన ఉపదేశం అంగీకరించడం అనేకమందికి ఎందుకు కష్టమనిపిస్తుంది, ఇదెంత గంభీరమైన విషయం?

• ఉపదేశం అంగీకరించడానికి ఎలాంటి అమూల్య లక్షణాలు మనకు సహాయం చేస్తాయి, వాటికి సంబంధించి యేసు ఎలా మాదిరి ఉంచాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[142వ పేజీలోని చిత్రం]

ఉపదేశం తిరస్కరించిన ఉజ్జియా కుష్ఠవ్యాధితో మొత్తబడ్డాడు

[142వ పేజీలోని చిత్రం]

యిత్రో ఉపదేశం అంగీకరించడం ద్వారా మోషే ప్రయోజనం పొందాడు