కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఎన్నటికి నాశనం కాని’ రాజ్యము

‘ఎన్నటికి నాశనం కాని’ రాజ్యము

అధ్యాయం పది

‘ఎన్నటికి నాశనం కాని’ రాజ్యము

1. మానవజాతి చరిత్రంతటా ప్రపంచ సంఘటనలు ఏ వాస్తవాన్ని నొక్కిచెప్పాయి?

 యెహోవా సర్వాధిపత్యాన్ని తిరస్కరించి స్వయంగా పరిపాలించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మానవులు సంతోషం పొందలేకపోయారని ప్రతిదిన ప్రపంచ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఏ మానవ ప్రభుత్వ విధానమూ మానవజాతికి నిష్పాక్షిక ప్రయోజనాలు తీసుకురాలేదు. మానవులు అసాధారణ రీతిలో తమ వైజ్ఞానిక జ్ఞానాన్ని వృద్ధిచేసుకున్నారు, అయినా కనీసం ఒక్క వ్యక్తిని కూడా అనారోగ్యం నుండి, మరణం నుండి తప్పించలేకపోయారు. మానవ పరిపాలన యుద్ధాన్ని, హింసను, నేరాన్ని, అవినీతిని లేదా పేదరికాన్ని నిర్మూలించలేదు. అణచివేసే ప్రభుత్వాలు అనేక దేశాల్లోని ప్రజలపై ఇప్పటికి అధికారం చెలాయిస్తున్నాయి. (ప్రసంగి 8: 9) సాంకేతిక పరిజ్ఞానం, దురాశ, అజ్ఞానం వెరసి భూమిని, నీటిని, గాలిని కలుషితం చేస్తున్నాయి. అధికారుల ఆర్థిక అపనిర్వహణ కారణంగా చాలామందికి కనీస జీవితావసరాలు తీరడం లేదు. వేల సంవత్సరాల మానవ పరిపాలన ఈ వాస్తవాన్ని స్పష్టం చేసింది: ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.’​—⁠యిర్మీయా 10:​23.

2. మానవాళి సమస్యలకు ఒకే ఒక పరిష్కారమేమిటి?

2 పరిష్కారమేమిటి? దేవుని రాజ్యం, దాని కోసమే ప్రార్థించమని యేసు తన అనుచరులకు బోధించాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:​9, 10) దేవుని పరలోక రాజ్యము 2 పేతురు 3:​13 లో ‘క్రొత్త ఆకాశములు’ అని వర్ణించబడింది, అది నీతియుక్త మానవ సమాజమైన ‘క్రొత్త భూమిని’ పరిపాలించనుంది. దేవుని పరలోక రాజ్యము ఎంత ప్రాముఖ్యమైనదంటే యేసు దానిని తన ప్రకటనా పనికి కేంద్రబిందువుగా చేసుకున్నాడు. (మత్తయి 4:​17) మన జీవితాల్లో దానికి ఉండవలసిన స్థానం చూపిస్తూ ఆయనిలా ఉద్బోధించాడు: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి.”​—⁠మత్తయి 6:​33.

3. దేవుని రాజ్యం గురించి ఇప్పుడు నేర్చుకోవడం ఎందుకు అత్యవసరం?

3 దేవుని రాజ్యం గురించి ఇప్పుడు నేర్చుకోవడం అత్యవసరం, ఎందుకంటే ఆ రాజ్యం త్వరలోనే ఈ భూమిపైనున్న పరిపాలనను శాశ్వతంగా మార్చివేసేందుకు చర్య తీసుకుంటుంది. దానియేలు 2: 44 వ వచనం ఇలా ప్రవచిస్తోంది: “ఆ రాజుల [ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వాల] కాలములలో పరలోకమందున్న దేవుడు [పరలోకంలో] ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు [మానవులు ఈ భూమిని మళ్ళీ ఎన్నడూ పరిపాలించరు]; అది ముందు చెప్పిన [ప్రస్తుత] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” ఆ విధంగా ఆ రాజ్యం ఈ దుష్ట విధానాన్ని సమూలంగా నాశనం చేయడంతో ఈ అంత్యదినాలు ముగుస్తాయి. ఆ తర్వాత భూమిపై పరలోక రాజ్య పరిపాలన నిర్వివాదంగా ఉంటుంది. అది తీసుకువచ్చే ఉపశమనం ఇప్పుడు అతి సమీపంగా ఉన్నందుకు మనమెంత కృతజ్ఞులుగా ఉండాలో కదా!

4. రాజ్యానికి సంబంధించి 1914 లో పరలోకంలో ఏమి సంభవించింది, అది మనకెందుకు ప్రాముఖ్యము?

4 యేసుక్రీస్తు 1914 లో రాజుగా నియమించబడ్డాడు, ఆయనకు ‘[తన] శత్రువులమధ్య పరిపాలన చేయడానికి’ అధికారం ఇవ్వబడింది. (కీర్తన 110:​1, 2) అదే సంవత్సరంలో ప్రస్తుత దుష్ట విధానపు ‘అంత్యదినములు’ ఆరంభమయ్యాయి. (2 తిమోతి 3:​1-5, 13) అదే సమయంలో, దానియేలు ప్రవచనార్థక దర్శనంలో చూసిన సంఘటనలు వాస్తవంగా పరలోకంలో సంభవించాయి. “మహావృద్ధుడగు” యెహోవా దేవుడు, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుకు “సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” అనుగ్రహించాడు. ఆ దర్శనం గురించి చెబుతూ దానియేలు ఇలా వ్రాశాడు: “ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దానియేలు 7:​13, 14) యేసుక్రీస్తు అధికారంలోని ఈ పరలోక రాజ్యము ద్వారా, దేవుడు మన మొదటి మానవ తలిదండ్రులను పరదైసులో ఉంచినప్పుడు సంకల్పించిన అనేక ప్రయోజనాలను, నీతిని ప్రేమించేవారు అనుభవించేలా చేస్తాడు.

5. రాజ్యం గురించిన ఎలాంటి వివరాలు మనకు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి, ఎందుకు?

5 ఆ రాజ్యంలో విశ్వసనీయ పౌరుడిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే, ఆ పరలోక ప్రభుత్వ స్వరూపం, దాని పరిపాలనా విధానం గురించి మీరు ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. అది ప్రస్తుతం ఏమి చేస్తోంది, భవిష్యత్తులో ఏమి సాధిస్తుంది, అది మీ నుండి ఏమి కోరుతుందో తెలుసుకోవడానికి మీరు ఇష్టపడతారు. మీరు ఆ రాజ్యాన్ని నిశితంగా పరిశీలిస్తుండగా దానిపట్ల మీ కృతజ్ఞత అధికం కావాలి. మీరు దాని పరిపాలనకు స్పందిస్తే, విధేయులైన మానవులకు దేవుని రాజ్యం నెరవేర్చే అద్భుత విషయాల గురించి ఇతరులకు చెప్పేందుకు మీరు మరింత సంసిద్ధంగా ఉంటారు.​—⁠కీర్తన 48:​12, 13.

దేవుని రాజ్య పరిపాలకులు

6. (ఎ) మెస్సీయ రాజ్యం ద్వారా ఎవరి సర్వాధిపత్యం ప్రదర్శించబడుతుందో లేఖనాలు ఎలా చూపిస్తున్నాయి? (బి) రాజ్యం గురించి మనం నేర్చుకొనే విషయాల ద్వారా మనమెలా ప్రభావితులం కావాలి?

6 అలాంటి పరిశీలనలో మొదట వెల్లడయ్యే విషయాల్లో ఒకటి, ఈ మెస్సీయ రాజ్యం యెహోవా సర్వాధిపత్యాన్ని ప్రదర్శిస్తుందనే విషయం. తన కుమారునికి “ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” ఇచ్చింది యెహోవాయే. దేవుని కుమారునికి రాజ్యపాలన ఆరంభించే అధికారం ఇవ్వబడిన తర్వాత, పరలోకంలోని స్వరం సముచితంగానే ఇలా ప్రకటించింది: “ఈ లోక రాజ్యము మన ప్రభువు [యెహోవా దేవుని] రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను; ఆయన [యెహోవా] యుగయుగముల వరకు ఏలును.” (ప్రకటన 11:​15) కాబట్టి మనం ఆ రాజ్యం గురించి, అది నెరవేర్చే వాటిని గురించి తెలుసుకునే ప్రతి అంశం మనలను యెహోవాకు మరింత సన్నిహితం చేయగలదు. మనం నేర్చుకునే విషయాలు, ఆయన సర్వాధిపత్యానికి నిత్యం లోబడాలనే కోరికను మనలో పుట్టించాలి.

7. యేసుక్రీస్తు యెహోవాకు పరిపాలక ప్రతినిధి అనే విషయం మనకు ఎందుకు ప్రత్యేకంగా ఆసక్తికరమైనది?

7 యెహోవా తన పరిపాలక ప్రతినిధిగా యేసుక్రీస్తును సింహాసనంపై కూర్చోబెట్టాడనే వాస్తవం గురించి కూడా ఆలోచించండి. ఈ భూమిని, మానవులను సృష్టించడంలో దేవుని ప్రధానశిల్పిగా పనిచేసిన యేసుకు మన అవసరతల గురించి మనకంటే బాగా తెలుసు. అంతేకాక మానవ చరిత్ర ఆరంభం నుండి ఆయన ‘నరులను చూసి ఆనందించాడు.’ (సామెతలు 8:​30, 31; కొలొస్సయులు 1:​15-17) మానవులపై ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన స్వయంగా ఈ భూమికివచ్చి మన తరఫున తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించాడు. (యోహాను 3:​16) ఆ విధంగా ఆయన మనకు పాపమరణాల నుండి విడుదలను, నిత్యం జీవించే అవకాశాన్ని ఇచ్చాడు.​—⁠మత్తయి 20:​28.

8. (ఎ) మానవ ప్రభుత్వాలకు భిన్నంగా, దేవుని ప్రభుత్వం ఎందుకు శాశ్వతంగా నిలిచివుంటుంది? (బి) పరలోక ప్రభుత్వానికి ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ ఎలాంటి సంబంధం ఉంది?

8 దేవుని రాజ్యం స్థిరమైన, శాశ్వతమైన ప్రభుత్వం. యెహోవా అమర్త్యుడు అనే వాస్తవం ఆ రాజ్యం శాశ్వతమైనదనే అభయమిస్తోంది. (కీర్తన 146:​3-5, 10) మానవ పరిపాలకులకు భిన్నంగా, దేవుడు రాజ్యాధికారం ఇచ్చిన యేసుక్రీస్తు కూడా అమర్త్యుడే. (రోమీయులు 6: 9; 1 తిమోతి 6:​15, 16) ‘ఆయా భాషలు మాటలాడు వారిలోనుండి, ప్రతి ప్రజలోనుండి, ప్రతి జనములోనుండి’ వచ్చిన దేవుని విశ్వసనీయ సేవకులైన 1,44,000 మంది క్రీస్తుతోపాటు పరలోక సింహాసనాలపై కూర్చుంటారు. వారికి కూడా అమర్త్య జీవితం ఇవ్వబడుతుంది. (ప్రకటన 5:​9, 10; 14:​1-4; 1 కొరింథీయులు 15:​42-44, 53) వారిలో అధికశాతం ఇప్పటికే పరలోకంలో ఉన్నారు, వారిలోని శేషం ఈ భూమిపై ప్రస్తుతం ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ తరగతిగా ఆ రాజ్య సంబంధిత కార్యాలను విశ్వసనీయంగా విస్తరింపజేస్తున్నారు.​—⁠మత్తయి 24:​45-47.

9, 10. (ఎ) ఎలాంటి విచ్ఛిన్నకరమైన, అవినీతికరమైన ప్రభావాలను ఆ రాజ్యం తొలగిస్తుంది? (బి) మనం దేవుని రాజ్య శత్రువులు కాకుండా ఉండాలంటే, ఎలాంటి ఉరులు తప్పించుకోవాలి?

9 త్వరలోనే తన నిర్ణీత కాలంలో యెహోవా ఈ భూమిని పరిశుభ్రం చేసేందుకు పరలోక సైన్యాలను పంపిస్తాడు. ఆయన సర్వాధిపత్యాన్ని గుర్తించడానికి ఉద్దేశపూర్వకంగా నిరాకరించేవారిని అలాగే యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసిన ప్రేమపూర్వక ఏర్పాట్లను ఉపేక్షించే మానవులను వారు శాశ్వతంగా నాశనం చేస్తారు. (2 థెస్సలొనీకయులు 1:​6-9) అదే యెహోవా దినము, ఆయన విశ్వ సర్వాధిపతి అని నిరూపించబడేందుకు దీర్ఘకాలంగా అపేక్షించబడిన కాలము. “యెహోవా దినము వచ్చుచున్నది. . . . పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.” (యెషయా 13: 9) “ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధకారమును కమ్ము దినము.”​—⁠జెఫన్యా 1:​15.

10 ఈ లోకపు అదృశ్య దుష్ట పరిపాలకుడు ఉపయోగించే అబద్ధ మతం, మానవ ప్రభుత్వాలు, వాటి సైన్యాలు శాశ్వతంగా నిర్మూలించబడతాయి. స్వార్థపూరితమైన, మోసపూరితమైన, అనైతిక జీవన విధానంతో ఈ లోక సంబంధులుగా ఉన్నవారందరు హతమార్చబడతారు. ఈ భూనివాసులతో సంబంధం లేకుండా సాతాను అతని దయ్యాలు తొలగించబడి, భద్రంగా వెయ్యి సంవత్సరాలపాటు అగాధంలో బంధించబడతారు. అప్పుడు దేవుని రాజ్యం భూ వ్యవహారాలన్నింటిపై సంపూర్ణ అధికారం కలిగివుంటుంది. నీతిని ప్రేమించేవారందరికి అది ఎంతటి ఉపశమనమో కదా!​—⁠ప్రకటన 18:​21, 24; 19:​11-16, 19-21; 20:​1, 2.

ఆ రాజ్య లక్ష్యాలు​—⁠అవి సాధించబడే విధానం

11. (ఎ) ఈ భూమికి సంబంధించి యెహోవా సంకల్పాన్ని మెస్సీయ రాజ్యం ఎలా నెరవేరుస్తుంది? (బి) అప్పుడు ఈ భూమిపై నివసించే ప్రజలకు రాజ్య పరిపాలన భావమేమై ఉంటుంది?

11 భూమికి సంబంధించి దేవుని ఆది సంకల్పాన్ని ఆ మెస్సీయ రాజ్యం సంపూర్ణంగా నెరవేరుస్తుంది. (ఆదికాండము 1:​28; 2:​8, 9, 15) ఇప్పటివరకు మానవాళి ఆ సంకల్పానికి మద్దతునివ్వడంలో విఫలమైంది. అయితే “ఆ రాబోవు లోకము” మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ఆధీనంలో ఉంటుంది. ఈ పాత విధానంపై యెహోవా తీసుకువచ్చే తీర్పులో రక్షించబడిన వారందరు, ఈ భూమినంతా పరదైసుగా మార్చేందుకు రాజైన క్రీస్తు అధికారము క్రింద ఆయన నడిపింపు ప్రకారం ఐక్యంగా, సంతోషంగా పనిచేస్తారు. (హెబ్రీయులు 2:​5-9) సర్వ మానవాళి తమ చేతిపనులను బట్టి ఆనందిస్తూ, భూమి సమృద్ధిగా పండించేవాటినుండి పూర్తి ప్రయోజనం పొందుతారు.​—⁠కీర్తన 72:1, 7, 8, 16-19; యెషయా 65:​21, 22.

12. ఆ రాజ్య ప్రజలకు మానసిక, శారీరక పరిపూర్ణత ఎలా తీసుకురాబడుతుంది?

12 ఆదాము హవ్వలు సృష్టించబడినప్పుడు వారు పరిపూర్ణులు, వారి సంతానంతో ఈ భూమి నింపబడాలని, వారందరు మానసికంగా శారీరకంగా పరిపూర్ణత అనుభవించాలని దేవుడు సంకల్పించాడు. రాజ్య పరిపాలన క్రింద ఆ సంకల్పం మహత్తరమైన రీతిలో నిజమౌతుంది. అలా జరగాలంటే పాపపు ప్రభావాలన్ని తొలగించబడాలి, దానిని సాధించడానికి క్రీస్తు రాజుగా మాత్రమే కాక ప్రధాన యాజకుడిగా కూడా సేవచేస్తాడు. విధేయులైన తన ప్రజలు, తన మానవ జీవితానికి సంబంధించిన పాపపరిహారార్థ బలి విలువ నుండి ప్రయోజనం పొందేందుకు ఆయన ఎంతో ఓపికతో వారికి సహాయం చేస్తాడు.

13. రాజ్య పరిపాలన క్రింద ఎలాంటి భౌతిక ప్రయోజనాలు కలుగుతాయి?

13 రాజ్య పరిపాలన క్రింద భూనివాసులు అత్యద్భుతమైన భౌతిక ప్రయోజనాలు పొందుతారు. ఆ కాలంలో “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును.” (యెషయా 35:​5, 6) వృద్ధాప్యంవల్ల లేదా వ్యాధులవల్ల వికారంగా మారిన శరీరం బాలుర శరీరంకంటే ఆరోగ్యంగా తయారవుతుంది, దీర్ఘకాలిక బలహీనతల స్థానంలో మంచి ఆరోగ్యం ఉంటుంది. “అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.” (యోబు 33:​25) ‘నాకు దేహములో బాగులేదు’ అని అనడానికి ఎవరికి కారణమే ఉండని రోజు వస్తుంది. ఎందుకు? ఎందుకంటే దైవ భక్తిగల మానవులు పాపపు భారం నుండి దాని దారుణ పరిణామాలనుండి విముక్తులవుతారు. (యెషయా 33:​24; లూకా 13:​11-13) అవును దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”​—⁠ప్రకటన 21: 4.

14. మానవ పరిపూర్ణతను సంపాదించుకోవడంలో ఏమి చేరివుంది?

14 అయితే పరిపూర్ణతను సంపాదించుకోవడంలో, మంచి శరీరం, మంచి మనస్సు కలిగివుండడం కంటే ఎక్కువే ఉంది. మనం ‘దేవుని స్వరూపమందు, ఆయన పోలికచొప్పున’ చేయబడ్డాము కాబట్టి మనం యెహోవా లక్షణాలను సరైన విధంగా ప్రతిబింబించాలి. (ఆదికాండము 1:26) ఆ లక్ష్య సాధనకు ఎంతో విద్యాభ్యాసం అవసరం. నూతనలోకంలో ‘నీతి నివసిస్తుంది.’ అందువల్ల యెషయా ప్రవచించినట్లు ‘లోకనివాసులు నీతిని నేర్చుకుంటారు.’ (2 పేతురు 3:​13; యెషయా 26: 9) ఆ లక్షణం సమస్త జనాంగాల మధ్య, సన్నిహిత సహవాసుల మధ్య, కుటుంబాల్లో, మరి ముఖ్యంగా దేవునితో సమాధానానికి దారితీస్తుంది. (కీర్తన 85:​10-13; యెషయా 32:​17) నీతిని నేర్చుకొనేవారు తమ విషయంలో దేవుని చిత్తమేమిటో క్రమంగా నేర్చుకుంటారు. యెహోవాపై ప్రేమ వారి హృదయాల్లో బలంగా నాటుకొనేకొలది, వారు తమ జీవితంలోని ప్రతి రంగంలోను ఆయన మార్గాలను అనుసరిస్తారు. యేసులాగే వారు కూడా ఇలా చెప్పగలుగుతారు: ‘నా తండ్రి కిష్టమైన కార్యములనే నేను ఎల్లప్పుడు చేస్తాను.’ (యోహాను 8:​29) సమస్త మానవాళి విషయంలో అది నిజమైనప్పుడు జీవితమెంత ఆనందకరంగా ఉంటుందో కదా!

నెరవేర్పులు ఇప్పటికే స్పష్టంగా తెలుస్తున్నాయి

15. ఈ పేరాలోని ప్రశ్నలను ఉపయోగించి, ఆ రాజ్యం నెరవేర్చినవాటిని నొక్కిచెబుతూ మనం ఇప్పుడు చేస్తుండవలసిన పనులను వివరించండి.

15 దేవుని రాజ్యానికి సంబంధించిన అద్భుతమైన నెరవేర్పులు, ఆ రాజ్యానికి సంబంధించిన ప్రజలు ఎవరు అనే విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ నెరవేర్పుల్లో కొన్నింటిని, ఆ రాజ్య ప్రజలందరు చేయగల పనులను, ఇప్పుడు చేస్తుండవలసిన పనులను ఈ క్రింది ప్రశ్నలు మరియు లేఖనాలు మీకు గుర్తుచేస్తాయి.

రాజ్యం మొదట ఎవరిపై చర్య తీసుకుంది, దాని ఫలితమేమిటి? (ప్రకటన 12:​7-10, 12)

క్రీస్తు సింహాసనాసీనుడైనప్పటి నుండి ఏ గుంపుకు చెందిన మిగిలిన సభ్యులను సమకూర్చడంపై దృష్టి నిలుపబడింది? (ప్రకటన 14:​1-3)

మత్తయి 25:​31-33 వచనాల్లో నమోదుచేయబడినట్లు మహాశ్రమ ప్రారంభమైన తర్వాత తాను ఏ పని చేస్తానని యేసు ప్రవచించాడు?

నేడు ఎలాంటి పని ముందుగా నెరవేర్చబడుతోంది? దానిలో ఎవరు భాగం వహిస్తున్నారు? (కీర్తన 110: 3; మత్తయి 24:​14; ప్రకటన 14:​6, 7)

రాజకీయ, మత వ్యతిరేకులు ప్రకటనా పనిని ఎందుకు ఆపలేకపోయారు? (జెకర్యా 4: 6; అపొస్తలుల కార్యములు 5:​38, 39)

రాజ్య పరిపాలనకు లోబడే వ్యక్తుల జీవితాల్లో ఇప్పటికే ఎటువంటి మార్పులు జరిగాయి? (యెషయా 2: 4; 1 కొరింథీయులు 6:​9-11)

వెయ్యేండ్ల రాజ్యం

16. (ఎ) క్రీస్తు ఎంతకాలం పరిపాలిస్తాడు? (బి) ఆ పరిపాలనా కాలంలో, ఆ తర్వాత ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేయబడతాయి?

16 సాతానును, అతని దయ్యాలను అగాధంలో బంధించిన తర్వాత, యేసుక్రీస్తు, ఆయన సహపరిపాలకులైన 1,44,000 మంది రాజులుగా యాజకులుగా వెయ్యేండ్లు పరిపాలిస్తారు. (ప్రకటన 20: 6) ఆ వెయ్యేండ్లలో మానవాళి పరిపూర్ణతకు తీసుకురాబడుతుంది, పాపం, ఆదామువల్ల కలిగిన మరణం శాశ్వతంగా నిర్మూలించబడతాయి. ఆ వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో మెస్సీయ రాజుగా, యాజకుడిగా తన నియామకాన్ని విజయవంతంగా నెరవేర్చిన యేసు, ‘దేవుడే సర్వములో సర్వమయ్యేలా తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగిస్తాడు.’ (1 కొరింథీయులు 15:​24-28) ఆ సమయంలో, విమోచించబడిన మానవాళి యెహోవా విశ్వ సర్వాధిపత్యానికి మద్దతునిస్తుందా లేదా అని పరీక్షించేందుకు సాతాను కొద్దికాలం విడుదల చేయబడతాడు. ఆ చివరి పరీక్ష ముగిసిన తర్వాత, సాతానును అతని పక్షం వహించిన వ్యతిరేకులను యెహోవా నాశనం చేస్తాడు. (ప్రకటన 20:​7-10) యెహోవా సర్వాధిపత్యాన్ని అంటే ఆయన పరిపాలనా హక్కును సమర్థించినవారు తమ నిశ్చలమైన విశ్వసనీయతను సంపూర్ణంగా వ్యక్తం చేసివుంటారు. అప్పుడు వారు యెహోవాతో సరైన సంబంధాన్ని కలిగివుంటారు, ఆయన వారిని కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తాడు, వారు నిత్యజీవం కోసం దైవిక ఆమోదం పొందుతారు.​—⁠రోమీయులు 8:​20, 21.

17. (ఎ) వెయ్యేండ్ల ముగింపులో ఆ రాజ్యానికి ఏమి సంభవిస్తుంది? (బి) ఆ రాజ్యానికి “ఎన్నటికిని నాశనము కలుగదు” అనేది ఏ భావంలో నిజం?

17 కాబట్టి ఈ భూమికి సంబంధించి యేసు మరియు 1,44,00 మంది కార్యవిధానం మారుతుంది. వారి భావి కార్యకలాపాలేమిటి? దాని గురించి బైబిలు చెప్పడం లేదు. కాని మనం యెహోవా సర్వాధిపత్యాన్ని నమ్మకంగా సమర్థిస్తే, మనం వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో యెహోవా వారి కోసం, తన అత్యద్భుతమైన విశ్వం కోసం సంకల్పించినదేమిటో తెలుసుకునేందుకు జీవించి ఉంటాం. అయితే క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన “శాశ్వతమైనది,” ఆయన రాజ్యము “ఎప్పుడును లయముకాదు.” (దానియేలు 7:​14) ఏ భావంలో? అంటే ఆ పరిపాలనాధికారము వేర్వేరు లక్ష్యాలుగల ఇతరులకు అప్పగించబడదు, ఎందుకంటే యెహోవాయే పరిపాలకుడిగా ఉంటాడు. అంతేకాక ఆ రాజ్యానికి “ఎన్నటికిని నాశనము కలుగదు” ఎందుకంటే అది సాధించిన విషయాలు నిరంతరం నిలుస్తాయి. (దానియేలు 2:​44) రాజు, యాజకుడైన మెస్సీయ, ఆయన సహరాజులు, యాజకులు యెహోవాకు నమ్మకమైన సేవచేసిన కారణంగా నిరంతరం ఘనపరచబడతారు.

పునఃసమీక్షా చర్చ

• మానవాళి సమస్యలకు దేవుని రాజ్యమే ఏకైక పరిష్కారమని ఎందుకు చెప్పవచ్చు? దేవుని రాజ్యపు రాజు పరిపాలించడం ఎప్పుడు ప్రారంభించాడు?

• దేవుని రాజ్యం, అది సాధించేవాటి విషయంలో మిమ్మల్ని ఏది ప్రత్యేకంగా ఆకట్టుకుంది?

• ఆ రాజ్యం ఇప్పటికే సాధించిన ఏ కార్యాలను మనం చూడగలుగుతున్నాము, వాటిలో మనకే పాత్రవుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[92, 93వ పేజీలోని చిత్రం]

దేవుని రాజ్యం క్రింద ప్రజలందరూ నీతిని నేర్చుకుంటారు