కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దురాత్మల సమూహాలతో పోరాటం’

‘దురాత్మల సమూహాలతో పోరాటం’

అధ్యాయం ఎనిమిది

‘దురాత్మల సమూహాలతో పోరాటం’

1. దుష్టాత్మల కార్యకలాపాలు మనకెందుకు ప్రత్యేకంగా ఆసక్తికరం?

 దుష్టాత్మలు ఉన్నాయనే తలంపునే చాలామంది అపహాస్యం చేస్తారు. కాని అది నవ్విపారేసే విషయం కాదు. ప్రజలు నమ్మినా, నమ్మకపోయినా దుష్టాత్మలు ఉనికిలో ఉన్నాయి, అవి ప్రతి ఒక్కరిపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాయి. యెహోవా ఆరాధకులకు దానిలో మినహాయింపు లేదు. వాస్తవానికి వారే ప్రధాన గురి. ఆ వాస్తవం గురించి మనలను హెచ్చరిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని [అదృశ్య] ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” (ఎఫెసీయులు 6:​12) మన కాలంలో దుష్టాత్మల ఒత్తిడి మునుపటి కంటే ఎంతో తీవ్రంగా ఉంది, ఎందుకంటే సాతాను పరలోకం నుండి పడద్రోయబడ్డాడు, తనకు సమయం కొంచమే అని తెలుసుకొని అతను బహు క్రోధంతో ఉన్నాడు.​—⁠ప్రకటన 12:​12.

2. మానవాతీత ఆత్మలతో చేసే పోరాటంలో మనమెలా విజయం సాధించవచ్చు?

2 మానవాతీత ఆత్మ శక్తులతో చేసే పోరాటంలో విజయం సాధ్యమేనా? సాధ్యమే, కాని యెహోవాపై పూర్తిగా ఆధారపడడం ద్వారానే అది సాధ్యమవుతుంది. మనం ఆయన మాట విని ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. అలాచేస్తే, మనం సాతాను అదుపులోవున్న ప్రజలు అనుభవిస్తున్న భౌతిక, నైతిక, మానసిక హాని నుండి తప్పించుకోగలము.​—⁠యాకోబు 4: 7.

ఆకాశమండలంలో లోకపాలకులు

3. సాతాను ఎవరిని క్రూరంగా వ్యతిరేకిస్తాడు, ఎలా?

3 పరలోకంలోని తన మహోన్నత స్థానం నుండి ప్రపంచ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న యెహోవా దానిని మనకు స్పష్టంగా వర్ణిస్తున్నాడు. ఆయన అపొస్తలుడైన యోహానుకు ఒక దర్శనం ఇచ్చాడు, అందులో సాతాను “యెఱ్ఱని మహాఘటసర్పము”గా చూపించబడ్డాడు. పరలోకమందు 1914వ సంవత్సరంలో దేవుని మెస్సీయ రాజ్యం స్థాపించబడిన వెంటనే, సాధ్యమైతే ఆ రాజ్యాన్ని మింగివేయాలని అతను చూశాడు. అలా చేయడంలో విఫలుడైన సాతాను, భూమిపైవున్న ఆ రాజ్య ప్రతినిధులపై క్రూరమైన వ్యతిరేకతతో దాడి చేశాడు. (ప్రకటన 12: 3, 4, 13, 17) సాతాను ఈ యుద్ధం ఎలా చేస్తాడు? తన స్వంత మానవ ప్రతినిధుల ద్వారా చేస్తాడు.

4. మానవ ప్రభుత్వాల బలానికి మూలాధారం ఎవరు, అది మనకెలా తెలుసు?

4 యోహానుకు ఆ తర్వాత ఏడు తలలు, పది కొమ్ములుగల ఒక క్రూరమృగం చూపించబడింది, అది “ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆయా భాషలు మాటలాడు వారిమీదను ప్రతి జనము మీదను అధికారము”గల క్రూరమృగం. ఆ మృగం భూవ్యాప్త రాజకీయ వ్యవస్థంతటికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దానికి “ఆ ఘటసర్పము [అపవాదియగు సాతాను] తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను” అని యోహానుకు తెలియజేయబడింది. (ప్రకటన 13:1, 2, 7) అవును, మానవ ప్రభుత్వాల బలానికి, అధికారానికి సాతానే మూలాధారం. కాబట్టి, అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లుగా మానవ ప్రభుత్వాలను అదుపుచేసే “ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములు” నిజమైన “లోకనాథులు.” యెహోవా ఆరాధకులందరు దాని పూర్తి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి.​—⁠లూకా 4: 5, 6.

5. రాజకీయ పాలకులు దేనికోసం పోగుచేయబడుతున్నారు?

5 చాలామంది రాజకీయ పాలకులు తాము మతాభిమానులమని చెప్పుకుంటారు, కాని ఏ దేశం కూడా యెహోవా పరిపాలనకు లేదా ఆయన నియమిత రాజైన యేసుక్రీస్తు పరిపాలనకు లోబడడంలేదు. అందరూ తమ స్వంత అధికారాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా సంఘర్షిస్తున్నారు. ప్రకటనలోని వృత్తాంతం చూపిస్తున్నట్లుగా నేడు ‘దయ్యముల ఆత్మలు,’ హార్‌మెగిద్దోను వద్ద “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు” లోకపాలకులను పోగుచేస్తున్నాయి.​—⁠ప్రకటన 16:​13-16; 19:​17-19.

6. సాతాను విధానానికి మద్దతిచ్చే పావులు కాకుండా తప్పించుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండడం ఎందుకు అవసరం?

6 మానవ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పోరాటాలు అనుదినం ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పోరాటాల్లో ప్రజలు మాట ద్వారా లేదా మరో విధంగా తమ దేశం, తెగ, భాష లేదా సామాజిక తరగతి పక్షం వహించడం సర్వసాధారణం. ప్రజలు ఒకానొక పోరాటంలో ప్రత్యక్షంగా భాగం వహించకపోయినా, వారు ఒక పక్షాన్ని తిరస్కరించి మరో పక్షాన్ని అభిమానిస్తుంటారు. వారు మద్దతునిచ్చే వ్యక్తులు ఎవరైనా, కారణాలు ఏవైనా నిజానికి వారు ఎవరికి మద్దతిస్తున్నారు? బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహాను 5:​19) అలాంటప్పుడు మిగతా మానవులతోపాటు తను కూడా మోసగించబడకుండా ఒక వ్యక్తి ఎలా తప్పించుకోవచ్చు? దేవుని రాజ్యానికి పూర్తి మద్దతునివ్వడం ద్వారా, ప్రపంచ పోరాటాల విషయంలో సంపూర్ణ తటస్థతను పాటించడం ద్వారా మాత్రమే తప్పించుకోవచ్చు.​—⁠యోహాను 17:​15, 16.

దుష్టుని మోసపూరిత పన్నాగాలు

7. అబద్ధమతాన్ని ఉపయోగించడంలో సాతాను తెలివి ఎలా చూపబడింది?

7 చరిత్రంతటిలో ప్రజలను సత్యారాధన నుండి దూరం చేయడానికి సాతాను మౌఖిక, శారీరక హింసను ఉపయోగించాడు. అతను అనేక కుతంత్రాలను అంటే కపట చర్యను, మోసపూరిత పన్నాగాలను కూడా ఉపయోగించాడు. తాము దేవుణ్ణి సేవిస్తున్నామని తలంచేలా చేస్తూ అతను మానవుల్లోని అధికశాతం మందిని అబద్ధమతం ద్వారా తెలివిగా అంధకారంలో ఉంచాడు. దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానం, సత్యంపట్ల ప్రేమ లేకపోవడం వల్ల వారు మార్మికమైన, భావావేశమైన మతాచారాలకు ఆకర్షితులు కావచ్చు లేదా అద్భుతక్రియలను బట్టి ముగ్ధులు కావచ్చు. (2 థెస్సలొనీకయులు 2:​9, 10) అయితే సత్యారాధనలో ఒకప్పుడు భాగం వహించినవారిలో సహితం “కొందరు . . . మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని” మనకు హెచ్చరించబడింది. (1 తిమోతి 4: 1) అదెలా జరగవచ్చు?

8. మనం యెహోవాను ఆరాధిస్తున్నా, సాతాను మనలను అబద్ధ మతంలోకి ఎలా ఆకర్షించగలడు?

8 అపవాది కుయుక్తితో మన బలహీనతలను తన స్వార్థానికి ఉపయోగించుకుంటాడు. మనకు ఇప్పటికి మనుష్యుల భయముందా? అలాగైతే, అబద్ధమత సంబంధిత ఆచారాల్లో పాల్గొనమని బంధువులనుండి లేదా పొరుగువారినుండి కలిగే ఒత్తిడికి మనం లొంగిపోయే అవకాశముంది. మనం గర్విష్ఠులమా? అలాగైతే, ఎవరైనా మనకు సలహా ఇచ్చినప్పుడు లేదా మనం సమర్థించే ఆలోచనలను ఇతరులు అంగీకరించనప్పుడు మనం అవమానించబడినట్లు భావించవచ్చు. (సామెతలు 15:​10; 29:​25; 1 తిమోతి 6:​3, 4) మనం క్రీస్తు మాదిరికి అనుగుణంగా మన దృక్కోణాన్ని సవరించుకొనే బదులు, కేవలం బైబిలు చదువుతూ మంచి జీవితం జీవిస్తే చాలని ‘మన చెవులకింపైన’ మాటలు చెప్పే వారిని ఇష్టపడవచ్చు. (2 తిమోతి 4: 3) సాతానుకు, మనం మతం మార్చుకుంటామా లేక మన స్వంత మతాన్నే హత్తుకొని ఉంటామా అన్నది ముఖ్యం కాదు, అతనికి కావలసిందల్లా, దేవుడు తన వాక్యం ద్వారా తన సంస్థ ద్వారా నడిపించే విధంగా మనం యెహోవాను ఆరాధించకుండా ఉండడమే.

9. సాతాను తన లక్ష్య సాధనకు లైంగిక సంబంధాలను కుయుక్తితో ఎలా ఉపయోగిస్తాడు?

9 సాతాను కపటోపాయంతో, సహజ కోరికలను తప్పుడు మార్గాల్లో తీర్చుకొనేందుకు కూడా ప్రజలను ప్రలోభపెడతాడు. అతడు లైంగిక వాంఛల విషయంలో అలా చేశాడు. బైబిలు నైతిక విలువలను తిరస్కరిస్తూ లోకంలోని అనేకులు అవివాహితుల మధ్య లైంగిక సంబంధాలు న్యాయసమ్మతమైన సుఖమని లేదా తాము ఎదిగినవారమని నిరూపించుకునే మార్గమని దృష్టిస్తారు. మరి వివాహితుల విషయమేమిటి? చాలామంది వ్యభిచారం చేస్తారు. తమ వివాహ భాగస్వాములు తమకు ద్రోహం చేయకపోయినా చాలామంది ప్రజలు కేవలం మరో వ్యక్తితో కలిసి జీవించడానికి వీలుగా విడాకుల కోసం లేదా విడిపోవడం కోసం ప్రయత్నిస్తారు. ప్రజలు తమకు అలాగే ఇతరులకు, మరిముఖ్యంగా యెహోవాతో ఆయన కుమారునితో తమ సంబంధానికి కలిగే దీర్ఘకాలిక పరిణామాలు నిర్లక్ష్యంచేసేలా వారిని ప్రలోభపెట్టి కేవలం ఇప్పటి సుఖం కోసమే జీవించేలా వారిని ప్రభావితం చేయడమే సాతాను కుయుక్తుల లక్ష్యం.​—⁠1 కొరింథీయులు 6:​9, 10; గలతీయులు 6: 7, 8.

10. అనైతికత, హింస విషయంలో మన వైఖరిని మార్చడానికి సాతాను వేటి ద్వారా ప్రయత్నిస్తాడు?

10 మరో సహజమైన కోరిక వినోదం. అది మంచిదైతే భౌతికంగా, మానసికంగా, భావోద్రేకంగా సేదదీర్చేదిగా ఉండగలదు. అయితే సాతాను మన ఆలోచనలను దేవుని నుండి దూరం చేసేందుకు మనం విశ్రమించే సందర్భాలను తెలివిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే మనమెలా ప్రతిస్పందిస్తాం? ఉదాహరణకు, యెహోవా లైంగిక అనైతికతను, హింసను అసహ్యించుకుంటాడని మనకు తెలుసు. సినిమాల్లో, దూరదర్శిని కార్యక్రమాల్లో లేదా థియేటరు ప్రదర్శనల్లో అలాంటివి కనిపించినప్పుడు మనం వాటిని అలాగే చూస్తూ కూర్చుంటామా? ‘దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోతారు’ కాబట్టి తను నాశనం చేయబడే కాలం సమీపిస్తున్న కొద్దీ సాతాను అలాంటి వినోదం మరింత నీచంగా తయారయ్యేలా చేస్తాడని గుర్తుంచుకోండి. (2 తిమోతి 3:​13; ప్రకటన 20:​1-3) కాబట్టి మనం సాతాను కుతంత్రాల విషయంలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి.​—⁠ఆదికాండము 6:​13; కీర్తన 11: 5; రోమీయులు 1:​24-32.

11. అభిచారం గురించి సత్యం తెలిసిన వ్యక్తి సహితం అప్రమత్తంగా లేకపోతే ఏయే విధాలుగా ఉరిలో పడవచ్చు?

11 అలాగే ఎలాంటి అభిచారమైనా అంటే సోదె చెప్పడం, మంత్ర ప్రయోగాలు చేయడం లేదా మృతులతో సంభాషించడానికి ప్రయత్నించడం వంటివి చేసేవారు యెహోవాకు హేయులు అని కూడా మనకు తెలుసు. (ద్వితీయోపదేశకాండము 18:10-12) ఆ విషయం గుర్తుంచుకొని మనం కర్ణపిశాచినడుగువారి దగ్గరకు వెళ్ళడం గురించి ఆలోచించము, వారు మన గృహాల్లో తమ పైశాచిక కళలు అభ్యసించడానికి వారిని మనం ఖచ్చితంగా ఆహ్వానించం. కాని మన దూరదర్శినిలో లేదా ఇంటర్నెట్‌లో వారు కన్పిస్తే వారు చెప్పేవి మనం వింటామా? మనం మంత్ర వైద్యుల చికిత్సను ఎన్నడూ అంగీకరించకపోయినా మనకు క్రొత్తగా జన్మించిన శిశువుకు ప్రమాదం వాటిల్లకుండా రక్షిస్తుందనే తలంపుతో ఆ శిశువు ముంజేతికి సూత్రం కడతామా? ఇతరులను మంత్రబద్ధులను చేయడాన్ని బైబిలు ఖండిస్తుందని తెలిసి మనం ఒక ఇంద్రజాలికుడు మన మనస్సులను నియంత్రించడానికి అనుమతిస్తామా?​—⁠గలతీయులు 5:19-21.

12. (ఎ) మనకు తప్పని తెలిసినవాటి గురించి మనం ఆలోచించేలా చేయడానికి సంగీతం ఎలా ఉపయోగించబడుతుంది? (బి) ఒక వ్యక్తి వస్త్రధారణ, కేశాలంకరణ, మాట్లాడే విధానం యెహోవా అంగీకరించని జీవనశైలి గలవారిపట్ల అతను ఆకర్షితుడైనట్లు ఎలా సూచించవచ్చు? (సి) సాతాను మోసపూరిత పన్నాగాలకు బలికాకుండా తప్పించుకోవాలంటే మన తరఫునుండి మనమేమి చెయ్యాలి?

12 జారత్వము, సకలవిధాల అపవిత్రత మన మధ్య (మలినమైన ఉద్దేశాలతో) ప్రస్తావనకు కూడా రాకూడదని బైబిలు చెబుతోంది. (ఎఫెసీయులు 5:​3-5) కాని అలాంటి అంశాలు ఆహ్లాదపరిచే శ్రావ్యమైన సంగీతంతో, ఆకట్టుకునే తాళంతో లేదా లయబద్ధమైన వాయిద్యాలతో మిళితమైవుంటే అప్పుడెలా? వివాహం కాకుండానే లైంగిక సంబంధాలు కలిగివుండడం, ఆనందం కోసం మాదకద్రవ్యాలను దుర్వినియోగం చేయడం, ఇతర పాపభరిత చర్యలను శ్లాఘించే పాటలను మనం వల్లెవేయడం ప్రారంభిస్తామా? లేదా అలాంటి క్రియల్లో పాల్గొనే ప్రజల జీవన విధానం మనం అనుకరించకూడదని తెలిసినా, మనం వారి వస్త్రధారణను, కేశాలంకరణను, వారి మాటలను అనుకరించడం ద్వారా వారిలాగే ఉన్నామని గుర్తించబడేందుకు మొగ్గు చూపుతామా? సాతాను తన భ్రష్ట ఆలోచనా ధోరణిలోనే మానవులు ప్రవర్తించేలా వారిని ప్రలోభపెట్టడానికి ఉపయోగించే పద్దతులు ఎంత నీచమైనవో కదా! (2 కొరింథీయులు 4:​3, 4) అతని మోసపూరిత పన్నాగాలకు బలికాకుండా ఉండాలంటే మనం ఈ లోకపు ప్రవాహంలో నెమ్మదిగా కొట్టుకొని పోకుండా తప్పించుకోవాలి. “అంధకారసంబంధులగు లోకనాథులు” ఎవరో గుర్తుపెట్టుకొని వారి ప్రభావానికి వ్యతిరేకంగా మనం చిత్తశుద్ధితో పోరాడుతూ ఉండాలి.​—⁠ఎఫెసీయులు 6:​12; 1 పేతురు 5: 8.

జయించడానికి సంసిద్ధులమవడం

13. అసంపూర్ణులమైన మనం సాతాను పరిపాలిస్తున్న ఈ లోకాన్ని జయించడం ఎలా సాధ్యమవుతుంది?

13 తన మరణానికి ముందు యేసు తన అపొస్తలులకు ఇలా చెప్పాడు: ‘ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను.’ (యోహాను 16:​33) వారు కూడా జయించగలరు. దాదాపు 60 సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?” (1 యోహాను 5: 5) యేసు ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ, యేసు ఆధారపడినట్లే దేవుని వాక్యంపై ఆధారపడడం ద్వారా మనం అలాంటి విశ్వాసం చూపించవచ్చు. ఇంకా ఏమి అవసరం? ఆయన శిరస్సుగానున్న సంఘానికి మనం సన్నిహితంగా ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి యేసు బలి ఆధారంగా దేవుని క్షమాపణ వేడుకోవాలి. ఈ విధంగా, మనకు అపరిపూర్ణతలున్నా, పొరపాట్లు చేసినా మనం కూడా జయించగలము.​—⁠కీర్తన 130: 3, 4.

14. ఎఫెసీయులు 6:13-17 చదివి, ఆధ్యాత్మిక కవచంలోని ఒక్కొక్క భాగంనుండి పొందగల ప్రయోజనాల గురించి చర్చించడానికి ఈ పేరాలో ఇవ్వబడిన ప్రశ్నలను, లేఖనాలను ఆధారంగా ఉపయోగించండి.

14 మనం జయించాలంటే “దేవుడిచ్చు సర్వాంగకవచమును” ధరించుకోవాలి, దానిలోని ఏ భాగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దయచేసి మీ బైబిలును ఎఫెసీయులు 6:13-17కు తెరచి ఆ కవచం గురించిన వర్ణనను చదవండి. ఆ తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ఆ కవచంలోని ప్రతి భాగం ఇచ్చే రక్షణనుండి మీరెలా ప్రయోజనం పొందగలరో ఆలోచించండి.

“నడుమునకు సత్యమను దట్టి”

మనకు సత్యం తెలిసినప్పటికి, క్రమబద్ధమైన అధ్యయనం, బైబిలు సత్యాన్ని ధ్యానించడం, కూటాలకు హాజరవడం వంటివి మనలను ఎలా సంరక్షిస్తాయి? (1 కొరింథీయులు 10:​12, 13; 2 కొరింథీయులు 13: 5; ఫిలిప్పీయులు 4:​8, 9)

“నీతియను మైమరువు”

ఇది ఎవరి నీతి ప్రమాణం? (ప్రకటన 15:3)

యెహోవా నీతి మార్గాలను అనుసరించడంలో విఫలమైతే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక హానికి ఎలా గురవుతాడో వివరించండి. (ద్వితీయోపదేశకాండము 7:​3, 4; 1 సమూయేలు 15:​22, 23)

“పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు”

శాంతి కోసం దేవుడు చేసిన ఏర్పాట్ల గురించి ప్రజలతో మాట్లాడడానికి వెళ్ళేందుకు మన పాదాలను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించడం మనకెలా రక్షణగా ఉంటుంది? (కీర్తన 73:​2, 3; రోమీయులు 10:​15; 1 తిమోతి 5:​13)

“విశ్వాసమను డాలు”

మన విశ్వాసం స్థిరంగా పాదుకుని ఉంటే, మనకు సందేహం లేదా భయం కలిగించేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడు మనమెలా ప్రతిస్పందిస్తాము? (2 రాజులు 6:​15-17; 2 తిమోతి 1:​12)

“రక్షణయను శిరస్త్రాణము”

ఒక వ్యక్తి భౌతిక సంపదల గురించి ఎక్కువగా చింతించే ఉరిలో పడకుండా తప్పించుకోవడానికి రక్షణ నిరీక్షణ ఎలా సహాయం చేస్తుంది? (1 తిమోతి 6:​7-10, 19)

“ఆత్మ ఖడ్గము”

మన లేదా ఇతరుల ఆధ్యాత్మికతకు విరుద్ధంగా జరిగే భీకర దాడులను ఎదుర్కొనేటప్పుడు మనమెల్లప్పుడూ దేనిపై ఆధారపడాలి? (కీర్తన 119:​98; సామెతలు 3:​5, 6; మత్తయి 4:​3, 4)

ఆధ్యాత్మిక పోరాటాన్ని జయించడానికి ఇంకా ఏమి ఆవశ్యకం? దానిని ఎంత తరచుగా ఉపయోగించాలి? ఎవరి పక్షాన ఉపయోగించాలి? (ఎఫెసీయులు 6:​18, 19)

15. ఆధ్యాత్మిక పోరాటంలో మనమెలా బలంగా ఉండగలం?

15 క్రీస్తు సైనికులుగా మనం ఆధ్యాత్మిక యుద్ధంలో పాల్గొంటున్న పెద్ద సైన్యంలో భాగంగా ఉన్నాము. మనం మెలకువగా ఉండి దేవుడిచ్చిన సర్వాంగకవచాన్ని చక్కగా ఉపయోగిస్తే మనం ఈ యుద్ధంలో క్షతగాత్రులం కాము. బదులుగా, దేవుని సేవించే తోటి సేవకులను బలపరిచే సహాయకులముగా ఉంటాము. సాతాను హింసాత్మకంగా వ్యతిరేకిస్తున్న దేవుని మెస్సీయ రాజ్య సువార్తను వ్యాప్తిచేస్తూ, జరగబోయే దాడిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటాం.

పునఃసమీక్షా చర్చ

• ప్రపంచ పోరాటాలకు సంబంధించి యెహోవా ఆరాధకులు ఎందుకు సంపూర్ణంగా తటస్థంగా ఉంటారు?

• క్రైస్తవులను ఆధ్యాత్మికంగా నాశనం చేయడానికి సాతాను ఉపయోగించే కొన్ని మోసకరమైన పన్నాగాలు ఏవి?

• దేవుడిచ్చిన ఆధ్యాత్మిక కవచం మన ఆధ్యాత్మిక పోరాటంలో మనలను ఎలా సంరక్షిస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[76వ పేజీలోని చిత్రాలు]

దేశాలు హార్‌మెగిద్దోనుకు పోగుచేయబడుతున్నాయి