కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుత్థాన నిరీక్షణా శక్తి

పునరుత్థాన నిరీక్షణా శక్తి

అధ్యాయం తొమ్మిది

పునరుత్థాన నిరీక్షణా శక్తి

1. పునరుత్థాన నిరీక్షణ లేకపోతే మృతుల స్థితి ఎలా ఉంటుంది?

 మీ ప్రియమైన వారు మరణించారా? పునరుత్థానమే లేకపోతే వారిని మళ్ళీ చూస్తామనే నిరీక్షణే ఉండదు. వారు బైబిలు వర్ణించిన స్థితిలోనే ఇలా ఉండిపోతారు: “చచ్చినవారు ఏమియు ఎరుగురు; . . . నీవు పోవు పాతాళమునందు [సమాధిలో] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”​—⁠ప్రసంగి 9:5, 10.

2. పునరుత్థానం ద్వారా ఎలాంటి మహత్తరమైన ఉత్తరాపేక్ష సాధ్యం చేయబడింది?

2 యెహోవా దయాపూర్వకంగా పునరుత్థానం ద్వారా, మరణించిన కోట్లాదిమందికి, మృతస్థితి నుండి తిరిగి వచ్చి నిత్యజీవం అనుభవించే అమూల్యమైన అవకాశాన్ని అందించాడు. అంటే మరణించి నిద్రిస్తున్న మీ ప్రియమైన వారిని భవిష్యత్తులో ఒకరోజు దేవుని నూతనలోకంలో తిరిగి కలుసుకునే హృదయానందకర నిరీక్షణ మీకున్నదని దానర్థం.​—⁠మార్కు 5:​35, 41, 42; అపొస్తలుల కార్యములు 9:​36-41.

3. (ఎ) యెహోవా సంకల్పం నెరవేరడంలో పునరుత్థానం ఏయే విధాలుగా ప్రాముఖ్యం? (బి) పునరుత్థాన నిరీక్షణ ప్రత్యేకించి ఎలాంటి పరిస్థితుల్లో మనకు బలానికి మూలాధారంగా ఉంటుంది?

3 పునరుత్థాన నిరీక్షణ ఉంది కాబట్టి మనం మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును” అని సాతాను ద్వేషపూరితంగా ఆరోపించాడు, యెహోవా తన నమ్మకమైన సేవకులకు శాశ్వత హాని కలుగనివ్వకుండానే, తన ఆరోపణను నిరూపించుకోవడానికి తన శక్తిమేరకు ప్రయత్నించేందుకు సాతానును అనుమతించగలడు. (యోబు 2: 4) యేసు మరణ పర్యంతం విశ్వసనీయంగా ఉన్నందువల్ల దేవుడు ఆయనను పరలోక జీవితానికి పునరుత్థానం చేశాడు. ఆ విధంగా యేసు మన ప్రాణాల రక్షణార్థం తన పరిపూర్ణ మానవ బలి విలువను తన తండ్రి సింహాసనము ఎదుట అర్పించగలిగాడు. క్రీస్తుతోపాటు సహపరిపాలకులుగా ఉండే ‘చిన్న మందకు’ చెందినవారు కూడా పునరుత్థానం ద్వారానే పరలోక రాజ్యంలో క్రీస్తుతో ఏకమవడానికి నిరీక్షిస్తారు. (లూకా 12:​32) ఇతరులకు భూపరదైసు మీద నిత్యజీవానికి పునరుత్థానమయ్యే నిరీక్షణ ఉంది. (కీర్తన 37:​11, 29) క్రైస్తవులు మరణించవలసినంతటి తీవ్రమైన శ్రమలను అనుభవించినప్పుడు, పునరుత్థాన నిరీక్షణ వారందరికి “బలాధిక్యము” కలుగజేసే మూలాధారంగా ఉంటుంది.​—⁠2 కొరింథీయులు 4: 7.

క్రైస్తవ విశ్వాసానికి ఎందుకు మూలాధారం?

4. (ఎ) పునరుత్థానం ఏ భావంలో ఒక “మూలోపదేశము”? (బి) సాధారణ ప్రపంచానికి పునరుత్థానపు భావమేమిటి?

4 హెబ్రీయులు 6:1, 2 వచనాల్లో చెప్పబడినట్లు పునరుత్థానం ఒక “మూలోపదేశము.” అది విశ్వాసపు పునాదిలో భాగం, ఆ పునాది లేకుండా మనమెన్నటికి పరిణతి చెందిన క్రైస్తవులం కాలేము. (1 కొరింథీయులు 15:​16-19) అయితే బైబిల్లోని పునరుత్థాన బోధ ఈ లోక సంబంధ ఆలోచనకు అసాధారణమైనదిగా ఉంటుంది. ఆధ్యాత్మికత లేమి కారణంగా, కేవలం ఇదే నిజ జీవితమని దృష్టించే ప్రజలు అంతకంతకు పెరిగిపోతున్నారు. ఆ కారణంగా వాళ్ళు సుఖభోగాల వేటలో పడతారు. క్రైస్తవమత సామ్రాజ్యం లోపలా వెలుపలా సాంప్రదాయ మతాలకు హత్తుకొని ఉండే ప్రజలు కూడా ఉన్నారు, వారు తమకు అమర్త్యమైన ఆత్మ ఉందని తలస్తారు. కాని ఆ నమ్మకం బైబిల్లోని పునరుత్థాన బోధకు పొందికలేనిది, ఎందుకంటే మానవులకు అమర్త్యమైన ఆత్మ ఉంటే వారికి పునరుత్థానమే అవసరముండదు. ఈ రెండు సిద్ధాంతాలను మిళితంచేయడానికి ప్రయత్నిస్తే అది నిరీక్షణా స్ఫూర్తినిచ్చేదిగా కాక తికమక పెట్టేదిగా ఉంటుంది. సత్యం తెలుసుకోవాలని కోరుకునే యథార్థ హృదయులకు మనమెలా సహాయం చేయవచ్చు?

5. (ఎ) ఒక వ్యక్తి పునరుత్థానం విలువ గ్రహించే ముందు ఆయన ఏమి తెలుసుకోవలసిన అవసరముంది? (బి) మృతుల స్థితిని వివరించడానికి మీరు ఏ లేఖనాలను ఉపయోగిస్తారు? (సి) ఎవరైనా సత్యాన్ని మరుగుచేస్తున్నట్లు అనిపించే బైబిలు అనువాదం ఉపయోగిస్తే ఏమి చేయవచ్చు?

5 అలాంటివారు పునరుత్థానం ఎంతటి అద్భుతమైన ఏర్పాటో గ్రహించే ముందు వారికి మృతుల స్థితి గురించి సరైన అవగాహన ఉండాలి. బైబిలు సత్యం కోసం పరితపించే వ్యక్తికి ఈ విషయాలను స్పష్టంచేయడానికి తరచూ కొన్ని లేఖనాలు మాత్రమే సరిపోతాయి. (కీర్తన 146:​3, 4; ప్రసంగి 9:​5,10) అయితే కొన్ని ఆధునిక బైబిలు అనువాదాలు, భావానువాదాలు మానవులకు ఒక అమర్త్యమైన ఆత్మ ఉందని సూచిస్తూ సత్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. కాబట్టి బైబిలు ఆదిమభాషల్లో ఉపయోగించబడిన పదాలను పరిశీలించడం అవసరం కావచ్చు.

6. సోల్‌ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మీరు ఒక వ్యక్తికి ఎలా సహాయం చేయవచ్చు?

6 ఇలా పరిశీలించడానికి ప్రత్యేకించి నూతనలోక అనువాదము (ఆంగ్లం) ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది, ఎందుకంటే అది హీబ్రూ పదమైన నెఫెష్‌ను, దాని సమాంతర గ్రీకు పదమైన సైఖెను “సోల్‌” అని ఏకరీతిగా అనువదించింది. ఆ అనువాదపు అనుబంధంలో ఈ పదాలు కనబడే అనేక వచనాలు ఇవ్వబడ్డాయి. ఇతర బైబిలు అనువాదాలు ఆ పదాలను ఏకరీతిగా అనువదించకుండా అవే మూలపదాలను “ప్రాణి,” “జీవి,” “వ్యక్తి,” “జీవము” అని, “నా నెఫెష్‌” అనే పదబంధాన్ని “నేను” అని, “నీ నెఫెష్‌” అనే పదబంధాన్ని “నీవు” అని కూడా అనువదించవచ్చు. ఇతర బైబిలు అనువాదాలను నూతనలోక అనువాదముతో పోల్చిచూడడం, “సోల్‌” అని అనువదించబడిన మూలభాషా పదాలు మానవులను, జంతువులను కూడా సూచిస్తాయని గ్రహించేందుకు యథార్థపరుడైన విద్యార్థికి సహాయం చేస్తుంది. అయితే ఈ పదాలు సోల్‌ అదృశ్యమైనదని, ఒక వ్యక్తి మరణించినప్పుడు అది అతని శరీరం నుండి వేరై మరోచోట ఉనికిలో ఉంటుందని సూచించడంలేదు.

7. షియోల్‌లో, హేడిస్‌లో, గెహెన్నాలో ఉన్నవారి స్థితి గురించి మీరు బైబిలు నుండి ఎలా వివరిస్తారు?

7 నూతనలోక అనువాదము, హీబ్రూ పదమైన షయాల్‌ను ప్రతిలిఖించి షియోల్‌గా, గ్రీకు పదాలైన ఆథీస్‌ను హేడిస్‌గా, యయేనాను గెహెన్నాగా ఏకరీతిగా ఉపయోగిస్తోంది. “షియోల్‌” అనేది “హేడిస్‌”కు సమానార్థక పదం. (కీర్తన 16:​10; అపొస్తలుల కార్యములు 2:​27) షియోల్‌, హేడిస్‌ అనే ఈ రెండు పదాలు మానవజాతి సామాన్య సమాధిని సూచిస్తున్నాయని, అవి జీవానికి కాదుగాని మరణానికి సంబంధించినవని బైబిలు స్పష్టం చేస్తోంది. (కీర్తన 89:​48; ప్రకటన 20:​13) మానవజాతి సామాన్య సమాధి నుండి పునరుత్థానం పొందే ఉత్తరాపేక్షను కూడా లేఖనాలు సూచిస్తున్నాయి. (యోబు 14:​13; అపొస్తలుల కార్యములు 2:​31) దానికి భిన్నంగా గెహెన్నాలో పడవేయబడేవారికి భవిష్యత్తులో జీవించే నిరీక్షణ లేదు, అక్కడ సోల్‌ ఉనికిలో ఉంటుందని ఎక్కడా చెప్పబడలేదు.​—⁠మత్తయి 10:​28.

8. పునరుత్థానం గురించిన సరైన అవగాహన, ఒక వ్యక్తి దృక్పథాన్ని, ఆయన చర్యలను ఎలా ప్రభావితం చేయగలదు?

8 ఒక వ్యక్తికి ఈ విషయాలను అర్థంచేసుకోదగిన రీతిలో వివరించిన తర్వాత పునరుత్థానం తనకు ఎలాంటి భావాన్నిస్తుందో అర్థం చేసుకోవడానికి ఆయనకు సహాయపడవచ్చు. ఇలాంటి మహత్తర ఏర్పాటు చేయడంలో యెహోవా చూపిన ప్రేమకు ఆయన కృతజ్ఞత చూపించడం ప్రారంభించవచ్చు. తమ ప్రియమైనవారిని మరణం ద్వారా కోల్పోయినవారి దుఃఖాన్ని, దేవుని నూతనలోకంలో వారిని తిరిగి కలుసుకుంటామనే ఆనందంతో తగ్గించవచ్చు. ఈ విషయాలను అర్థం చేసుకోవడం, క్రీస్తు మరణ భావాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఎంతో ప్రాముఖ్యం. యేసుక్రీస్తు పునరుత్థానం ఇతరుల పునరుత్థానానికి మార్గం తెరుస్తుంది కాబట్టి, అది క్రైస్తవ విశ్వాసానికి మూలాధారం అని మొదటి శతాబ్దపు క్రైస్తవులు గ్రహించారు. వారు యేసు పునరుత్థానం గురించి, అదిచ్చే నిరీక్షణ గురించి అత్యంతాసక్తితో ప్రకటించారు. అదేవిధంగా నేడు పునరుత్థాన విలువను గ్రహించినవారు కూడా ఈ అమూల్యమైన సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి అత్యంతాసక్తితో ఉన్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 5:​30-32; 10:​42, 43.

‘హేడిస్‌ తాళపుచెవులను’ ఉపయోగించడం

9. యేసు మొదటిగా ‘మరణము యొక్కయు హేడిస్‌ యొక్కయు తాళపుచెవులను’ ఎలా ఉపయోగిస్తాడు?

9 క్రీస్తుతోపాటు పరలోక రాజ్యంలో సహపరిపాలకులుగా ఉండబోయేవారందరూ చివరకు మరణించాల్సిందే. అయితే ఆయన “నేను . . . మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము [హేడిస్‌] యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి” అని చెప్పినప్పుడు ఆ మాటల ద్వారా ఆయన ఇచ్చిన హామీ గురించి వారికి బాగా తెలుసు. (ప్రకటన 1:​18) ఆయన మాటల భావమేమిటి? ఆయన తన స్వంత అనుభవంవైపు అవధానం మళ్ళిస్తున్నాడు. ఆయన కూడా మరణించాడు. కాని దేవుడు ఆయనను హేడిస్‌లో విడిచిపెట్టలేదు. మూడవ రోజున యెహోవాయే స్వయంగా ఆయనను ఆత్మసంబంధ జీవానికి పునరుత్థానం చేసి ఆయనకు అమర్త్యతను అనుగ్రహించాడు. (అపొస్తలుల కార్యములు 2:​32, 33; 10:​40) అంతేకాక, మానవజాతి సామాన్య సమాధి నుండి, ఆదాము పాపపు ప్రభావాల నుండి ఇతరులను విడుదల చేసేందుకు ఉపయోగించడానికి దేవుడు ఆయనకు ‘మరణము యొక్కయు హేడిస్‌ యొక్కయు తాళపుచెవులు’ ఇచ్చాడు. యేసు దగ్గర ఆ తాళపుచెవులు ఉన్నాయి కాబట్టి ఆయన తన నమ్మకమైన అనుచరులను మరణం నుండి పునరుత్థానం చేయగలడు. ఆయన మొదట తన సంఘానికి చెందిన ఆత్మాభిషిక్తులను పునరుత్థానం చేసి, తన తండ్రి తనకు అనుగ్రహించినట్లే ఆయన వారికి అమూల్య వరమైన అమర్త్య పరలోక జీవాన్ని అనుగ్రహిస్తాడు.​—⁠రోమీయులు 6: 5; ఫిలిప్పీయులు 3:​20, 21.

10. నమ్మకమైన అభిషిక్త క్రైస్తవుల పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది?

10 నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు ఆ పరలోక పునరుత్థానాన్ని ఎప్పుడు పొందుతారు? అది ఇప్పటికే ఆరంభమైందని బైబిలు సూచిస్తోంది. వారు ‘క్రీస్తు ప్రత్యక్షత కాలంలో’ పునరుత్థానం చేయబడతారని పౌలు వివరించాడు, ఆ ప్రత్యక్షత 1914వ సంవత్సరంలో ఆరంభమైంది. (1 కొరింథీయులు 15:​23, NW) ఇప్పుడు ఆయన ప్రత్యక్షతా కాలంలో మరణించిన నమ్మకమైన అభిషిక్తులు, తమ ప్రభువు తిరిగివచ్చేంత వరకు మరణస్థితిలోనే ఉండవలసిన అవసరం లేదు. వారు మరణించిన వెంటనే “ఒక రెప్ప పాటున . . . మార్పుపొంది” ఆత్మసంబంధ శరీరంలో పునరుత్థానం చేయబడతారు. వారు చేసిన సత్క్రియలు ‘వారివెంట వెళ్తాయి’ కాబట్టి వారెంత ధన్యులో గదా!​—⁠1 కొరింథీయులు 15:​51, 52; ప్రకటన 14:​13.

11. సాధారణ ప్రజల కోసం ఎలాంటి పునరుత్థానం ఉంది, అదెప్పుడు ఆరంభమౌతుంది?

11 అయితే పునరుత్థానం, కేవలం రాజ్యవారసులు పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడడంతోనే ముగిసిపోదు. అది ప్రకటన 20: 6 వ వచనంలో “మొదటి పునరుత్థానము” అని పిలువబడిందనే వాస్తవం దాని తర్వాత మరొక పునరుత్థానం ఉందని సూచిస్తోంది. ఆ తర్వాత జరిగే పునరుత్థానం ద్వారా ప్రయోజనం పొందేవారికి పరదైసు భూమిపై నిత్యం జీవించే సంతోషకరమైన ఉత్తరాపేక్ష ఉంటుంది. అదెప్పుడు జరుగుతుంది? “భూమ్యాకాశములు,” అంటే ప్రస్తుత దుష్ట విధానం దాని పాలకులు తీసివేయబడిన తర్వాత అది జరుగుతుందని ప్రకటన గ్రంథం చూపిస్తోంది. ఈ పాత విధానాంతం చాలా సమీపంలో ఉంది. ఆ తర్వాత దేవుని నిర్ణీత కాలములో భూలోక పునరుత్థానం ఆరంభమౌతుంది.​—⁠ప్రకటన 20:​11, 12.

12. భూమిపై జీవించడానికి పునరుత్థానం చేయబడే నమ్మకమైన వారిలో ఎవరెవరు ఉంటారు, ఆ ఉత్తరాపేక్ష ఎందుకు పులకింపజేసేదిగా ఉంటుంది?

12 ఆ భూలోక పునరుత్థానంలో ఎవరెవరు ఉంటారు? ప్రాచీనకాలంలో యెహోవాకు నమ్మకంగా సేవచేసిన వారు అంటే పునరుత్థానంలో తమకున్న బలమైన విశ్వాసం కారణంగా ‘వేరే విధంగా విడుదల పొందడానికి ఇష్టపడని’ స్త్రీపురుషులు ఉంటారు. వారు హింసను, అకాల మరణాన్ని తప్పించుకోవడానికి దేవునిపట్ల తమకున్న యథార్థత విషయంలో రాజీపడరు. వారిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం, బైబిల్లో క్లుప్తంగా మాత్రమే వ్రాయబడిన సంఘటనల వివరాలను వారినుండి ప్రత్యక్షంగా వినడం ఎంత ఆనందకరంగా ఉంటుందో కదా! భూమిపై జీవించడానికి పునరుత్థానం చేయబడే వారిలో నమ్మకమైన మొదటి యెహోవా సాక్షి హేబెలు; జలప్రళయానికి ముందు దేవుని హెచ్చరికా సందేశాన్ని నిర్భయంగా ప్రకటించిన హనోకు, నోవహు; దూతలకు ఆతిథ్యమిచ్చిన అబ్రాహాము, శారా; సీనాయి పర్వతంవద్ద ధర్మశాస్త్రం ఇవ్వబడిన మోషే; సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చూసిన యిర్మీయావంటి ధైర్యవంతులైన ప్రవక్తలు; యేసు తన కుమారుడు అని దేవుడు స్వయంగా గుర్తించిన మాటలు విన్న బాప్తిస్మమిచ్చే యోహాను కూడా ఉంటారు. అంతేకాక ప్రస్తుత విధానపు అంత్యదినాల్లో మరణించిన అనేకమంది విశ్వసనీయులైన స్త్రీపురుషులు కూడా ఉంటారు.​—⁠హెబ్రీయులు 11:​4-38; మత్తయి 11:​11.

13, 14. (ఎ) హేడిస్‌కు దానిలోని మృతులకు ఏమి జరుగుతుంది? (బి) ఎవరెవరు పునరుత్థానం చేయబడతారు, ఎందుకు?

13 తగిన కాలంలో దేవుని నమ్మకమైన సేవకులతో పాటు ఇతరులు కూడా మృతులలో నుండి లేపబడతారు, మానవజాతి సామాన్య సమాధిలో ఎవ్వరూ విడిచిపెట్టబడరు. ఆ సమాధి ఎంతమేరకు ఖాళీచేయబడుతుందో, మానవజాతి పక్షాన యేసు ‘హేడిస్‌ తాళపుచెవులను’ ఉపయోగిస్తాడు అనే విషయం నుండి చూడవచ్చు. అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన ఒక దర్శనంలో అది చూపించబడింది, అందులో హేడిస్‌ ‘అగ్నిగుండములో పడవేయబడడాన్ని’ ఆయన చూశాడు. (ప్రకటన 20:​14) దాని భావమేమిటి? అంటే మానవజాతి సామాన్య సమాధి అయిన హేడిస్‌ సంపూర్ణంగా నాశనం చేయబడుతుంది. యేసు, యెహోవా నమ్మకమైన ఆరాధకులందరిని పునరుత్థానం చేయడమే కాక దయతో అనీతిమంతులను కూడా పునరుత్థానం చేస్తాడు కాబట్టి హేడిస్‌లో మృతులందరూ తీసివేయబడడంతో అది ఉనికిలో లేకుండా పోతుంది. దేవుని వాక్యం మనకిలా హామీ ఇస్తోంది: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.’​—⁠అపొస్తలుల కార్యములు 24:​14, 15.

14 ఈ అనీతిమంతుల్లో ఎవ్వరూ మళ్ళీ మరణశిక్ష పొందడానికి పునరుత్థానం చేయబడరు. దేవుని రాజ్యంలో భూవ్యాప్తంగా నెలకొనే నీతియుక్త వాతావరణంలో, యెహోవా మార్గాలకు అనుగుణంగా తమ జీవితాలు మార్చుకోవడానికి వారికి సహాయం చేయబడుతుంది. “జీవగ్రంథము” విప్పబడుతుందని ఆ దర్శనంలో చూపించబడింది. కాబట్టి వారి పేర్లు అందులో వ్రాయబడే అవకాశం ఉంటుంది. వారు తమ పునరుత్థానం తర్వాత చేసిన “క్రియలచొప్పున” వ్యక్తిగతంగా ‘తీర్పుపొందుతారు.’ (ప్రకటన 20:​12, 13) అందువల్ల తుది ఫలితాన్నిబట్టి చూస్తే, వారి పునరుత్థానం అనివార్యమైన ‘తీర్పు [శిక్షార్హమైన] పునరుత్థానంగా’ ఉండక ‘జీవ పునరుత్థానంగా’ నిరూపించబడే అవకాశం ఉంది.​—⁠యోహాను 5:​28, 29.

15. (ఎ) ఎవరు పునరుత్థానం చేయబడరు? (బి) పునరుత్థానం గురించిన సత్యానికి సంబంధించిన జ్ఞానం మనలను ఎలా ప్రభావితం చేయాలి?

15 అయితే ఇప్పటివరకు జీవించి మరణించిన వారందరూ పునరుత్థానం చేయబడరు. కొందరు క్షమాపణ సాధ్యంకాని పాపాలు చేశారు. అలాంటివారు హేడిస్‌లో కాదుగాని గెహెన్నాలో శాశ్వత నాశనం అనుభవిస్తారు. త్వరలో రానున్న “మహాశ్రమలో” మరణించేవారు కూడా వారిలో ఉంటారు. (మత్తయి 12:​31, 32; 23:​33; 24:​21, 22; 25:​41, 46; 2 థెస్సలొనీకయులు 1:​6-9) ఆ విధంగా హేడిస్‌లోని మృతులను విడుదల చేయడంలో యెహోవా అసాధారణమైన కనికరం చూపించినా, మనమిప్పుడు ఇష్టానుసారంగా జీవించేందుకు పునరుత్థాన నిరీక్షణ ఎలాంటి ఆధారమూ ఇవ్వదు. యెహోవా సర్వాధిపత్యానికి వ్యతిరేకంగా ఇష్టపూర్వకంగా తిరుగుబాటు చేసే వారెవరికైనా పునరుత్థానం సాధ్యం కాదు. ఈ జ్ఞానం, దేవుని చిత్తం ప్రకారం జీవించడం ద్వారా మనమాయన అనర్హ దయపట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని చూపించేందుకు మనలను పురికొల్పాలి.

పునరుత్థాన నిరీక్షణ ద్వారా బలపరచబడడం

16. పునరుత్థాన నిరీక్షణ ఎలా గొప్ప బలానికి మూలాధారంగా ఉండగలదు?

16 మనలో పునరుత్థాన నిరీక్షణను నిజంగా విశ్వసించేవారందరూ దాని నుండి గొప్ప బలం పొందగలుగుతున్నారు. ప్రస్తుతం, మనం వృద్ధులుగా ఉంటే మనమెలాంటి వైద్య చికిత్స చేయించుకున్నా మరణాన్ని ఎంతోకాలం వరకూ వాయిదా వేయలేమని మనకు తెలుసు. (ప్రసంగి 8:8) మనం యెహోవా సంస్థతో కలిసి ఆయనకు విశ్వసనీయంగా సేవచేస్తే, మనం దృఢనమ్మకంతో భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చు. దేవుని నిర్ణీత కాలంలో, పునరుత్థానం ద్వారా మనం మళ్ళీ జీవితాన్ని అనుభవించగలమని మనకు తెలుసు. అదెంత అద్భుతమైన జీవితమో కదా! అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా అది “వాస్తవమైన జీవము.”​—⁠1 తిమోతి 6:​18, 19; హెబ్రీయులు 6:​10-12.

17. యెహోవాపట్ల మన యథార్థతను కాపాడుకోవడానికి మనకేమి సహాయం చేయగలదు?

17 పునరుత్థాన ఏర్పాటు గురించి, ఆ ఏర్పాటుకు మూలాధారమైన వ్యక్తి గురించి తెలుసుకోవడం మనం మన విశ్వాసంలో దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. క్రూరమైన హింసకుల చేతుల్లో మరణించవలసి వచ్చినా మనం దేవునికి విశ్వసనీయంగా ఉండేందుకు అది మనలను బలపరుస్తుంది. ప్రజలను బానిసత్వంలో కట్టిపడవేయడానికి అకాల మరణ భయాన్ని సాతాను ఎంతోకాలంగా ఉపయోగిస్తున్నాడు. కాని యేసు అలా భయపడలేదు. ఆయన మరణం వరకు యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నాడు. యేసు తన విమోచన క్రయధన బలి ద్వారా ఇతరులను అలాంటి భయం నుండి విడుదల చేయడానికి మార్గం తెరిచాడు.​—⁠హెబ్రీయులు 2:​14, 15.

18. యథార్థవంతులుగా అసాధారణ చరిత్ర సృష్టించడానికి యెహోవా సేవకులకు సహాయపడినదేమిటి?

18 క్రీస్తు బలి ఏర్పాటులో, పునరుత్థానంలో విశ్వాసముంచడం ద్వారా యెహోవా సేవకులు యథార్థతను కాపాడుకొనే ప్రజలుగా ఒక అసాధారణ చరిత్ర సృష్టించారు. వారు ఒత్తిడి చేయబడినప్పుడు, యెహోవాకంటే ఎక్కువగా తమ స్వంత ‘ప్రాణములను ప్రేమించే వారము కాదని’ వారు నిరూపించుకున్నారు. (ప్రకటన 12:​11) జ్ఞానయుక్తంగా వారు తమ ప్రస్తుత జీవితం కాపాడుకునే ప్రయత్నంలో క్రైస్తవ సూత్రాలను విడిచిపెట్టరు. (లూకా 9:​24, 25) యెహోవా సర్వాధిపత్యాన్ని విశ్వసనీయంగా సమర్థించినందుకు ఇప్పుడు వారు తమ ప్రాణాలను కోల్పోయినా, పునరుత్థానం ద్వారా ఆయన తమకు ప్రతిఫలమిస్తాడని వారికి తెలుసు. మీకలాంటి విశ్వాసం ఉందా? మీరు యెహోవాను నిజంగా ప్రేమిస్తే, పునరుత్థాన నిరీక్షణ నిజ భావాన్ని హృదయానికి హత్తుకుంటే మీకలాంటి విశ్వాసం తప్పకుండా ఉంటుంది.

పునఃసమీక్షా చర్చ

• పునరుత్థాన విలువను గ్రహించడానికి ముందు ఒక వ్యక్తి మృతుల స్థితి అర్థం చేసుకోవడం ఎందుకు అవసరం?

• మృతుల్లోనుండి ఎవరు తిరిగివస్తారు, ఈ జ్ఞానం మనపై ఎలాంటి ప్రభావం చూపాలి?

• పునరుత్థాన నిరీక్షణ మనలను ఎలా బలపరుస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[85వ పేజీలోని చిత్రం]

నీతిమంతులు అనీతిమంతులు కూడా పునరుత్థానం చేయబడతారని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు