ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చారు
అధ్యాయం నాలుగు
ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చారు
1. యేసు మానవపూర్వ ఉనికిని గురించిన వాస్తవాలు, ఆయనకు యెహోవాతో ఉన్న సంబంధం గురించి ఏమి తెలియజేస్తున్నాయి?
‘తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడు.’ (యోహాను 5:19, 20) కుమారుడు తన తండ్రి యెహోవాతో ఎంత ప్రేమపూర్వక సంబంధం అనుభవించాడో కదా! ఆ సన్నిహిత సంబంధం ఆయన మానవుడిగా జన్మించడానికి అసంఖ్యాక సహస్రాబ్దాల పూర్వం ఆయన సృష్టించబడినప్పుడు ఆరంభమైంది. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, యెహోవా స్వయంగా సృష్టించిన ఏకైక వ్యక్తి. పరలోకంలో, భూమిపై ఉన్న మిగతా సృష్టంతా ఆదిసంభూతుడైన ఆ ప్రియకుమారుని ద్వారానే సృష్టించబడింది. (కొలొస్సయులు 1:15, 16) ఆయన దేవుని వాక్యముగా లేదా వాగ్దూతగా కూడా సేవచేశాడు, ఆయన ద్వారానే దేవుని చిత్తం ఇతరులకు తెలియజేయబడింది. ఈయనే, దేవునికి ఎంతో ప్రియమైన ఈ కుమారుడే యేసుక్రీస్తు అనే నరుడయ్యాడు.—సామెతలు 8:22-30; యోహాను 1:14, 18; 12:49, 50.
2. బైబిలు ప్రవచనాలు యేసు గురించి ఎంతమేరకు సూచించాయి?
2 దేవుని జ్యేష్ఠ కుమారుడు మానవ రూపంలో అద్భుతరీతిగా గర్భంలో ప్రవేశించకముందే, ఆయన గురించి అనేక ప్రేరేపిత ప్రవచనాలు వ్రాయబడ్డాయి. అపొస్తలుడైన పేతురు కొర్నేలికి ఇలా చెప్పాడు: ‘ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యమిస్తున్నారు.’ (అపొస్తలుల కార్యములు 10:43) యేసు పాత్ర గురించి బైబిల్లో ఎంతగా వ్రాయబడిందంటే ఒక దేవదూత అపొస్తలుడైన యోహానుకు ఇలా చెప్పాడు: ‘యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారము.’ (ప్రకటన 19:10) ఆ ప్రవచనాలు ఆయనే మెస్సీయ అని స్పష్టంగా గుర్తించాయి. దేవుని సంకల్పాల నెరవేర్పులో ఆయన పోషించే వివిధ పాత్రలవైపు అవి అవధానం మళ్ళించాయి. ఇదంతా నేడు మనకు అత్యంత ఆసక్తికరంగా ఉండాలి.
ప్రవచనాలు వెల్లడిచేసిన విషయాలు
3. (ఎ) ఆదికాండము 3:15 వచనాల్లోని ప్రవచనంలో సర్పము, “స్త్రీ,” ‘సర్పసంతానం’ ఎవరెవరిని సూచిస్తున్నాయి? (బి) ‘సర్పం తలమీద కొట్టబడడం’ యెహోవా సేవకులకు ఎందుకు అత్యంత ఆసక్తికరమైన విషయం?
3 అలాంటి ప్రవచనాల్లో మొదటిది ఏదెను తోటలో జరిగిన తిరుగుబాటు తర్వాత చెప్పబడింది. యెహోవా సర్పంతో ఇలా అన్నాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువు.” (ఆదికాండము 3:15) వాస్తవానికి ఆ ప్రవచనం, సర్పాన్ని ఉపయోగించుకొని మాట్లాడిన సాతానును ఉద్దేశించి చెప్పబడింది. ఆ “స్త్రీ” యెహోవాకు చెందిన యథార్థ పరలోక సంస్థ, అది ఆయనకు నమ్మకస్థురాలైన భార్యలాంటిది. సాతాను స్ఫూర్తిని ప్రదర్శించి యెహోవాను ఆయన ప్రజలను వ్యతిరేకించే దూతలు, మానవులు అందరు ‘సర్ప సంతానానికి’ చెందుతారు. ‘సర్పం తలమీద కొట్టబడడం,’ యెహోవాపై కొండెములు చెప్పి మానవజాతికి గొప్ప దుఃఖం కలుగచేసిన విరోధియైన సాతాను అంతిమ నాశనాన్ని సూచిస్తుంది. అయితే తలను చితకగొట్టే “సంతానము”లోని ప్రధాన భాగపు గుర్తింపు చిహ్నం ఏమిటి? శతాబ్దాలపాటు ఆ విషయం ఒక ‘పరిశుద్ధ మర్మముగా’ ఉండిపోయింది.—రోమీయులు 16:20, 25, 26.
4. యేసే వాగ్దత్త సంతానమని గుర్తించడానికి ఆయన వంశక్రమం ఎలా సహాయం చేసింది?
4 మానవ చరిత్రలో దాదాపు 2,000 సంవత్సరాలు గడిచిన తర్వాత, యెహోవా మరిన్ని వివరాలను తెలియజేశాడు. ఆ సంతానము, అబ్రాహాము వంశక్రమంలో వస్తాడని ఆయన సూచించాడు. (ఆదికాండము 22:15-18) అయితే, ఆ సంతానం జన్మించబోయే వంశం శరీరానుసారమైన వంశక్రమంపై కాక దేవుని ఎంపికపై ఆధారపడివుంటుంది. హాగరుకు జన్మించిన తన కుమారుడైన ఇష్మాయేలును అబ్రాహాము ప్రేమించినప్పటికి, యెహోవా ఇలా అన్నాడు: ‘శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదను.’ (ఆదికాండము 17:18-21) ఆ తర్వాత ఆ నిబంధన ఇస్సాకు జ్యేష్ఠ కుమారుడైన ఏశావుతో కాక యాకోబుతో స్థిరపరచబడింది, యాకోబునుండే ఇశ్రాయేలు జనాంగపు 12 గోత్రములు ఉద్భవించాయి. (ఆదికాండము 28:10-14) యుక్తకాలంలో, ఆ సంతానం యూదా గోత్రంలో దావీదు వంశంలో జన్మిస్తాడని సూచించబడింది.—ఆదికాండము 49:10; 1 దినవృత్తాంతములు 17:3, 4, 11-14.
5. యేసు తన భూపరిచర్యను ప్రారంభించినప్పుడు, ఆయనే మెస్సీయ అని ఏది నిరూపించింది?
5 ఆ సంతానాన్ని గుర్తించడానికి ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వబడ్డాయి? ఆ వాగ్దత్త సంతానం మానవునిగా జన్మించబోయే స్థలం పేరు బేత్లెహేము అని 700 సంవత్సరాలకంటే ముందుగానే బైబిలు చెప్పింది. ఆ సంతానం పరలోకంలో సృష్టింపబడినప్పటి నుండి అంటే, “పురాతన కాలము మొదలుకొని” ఉనికిలో ఉన్నాడని కూడా అది వెల్లడిచేసింది. (మీకా 5: 2) ఆయన ఈ భూమిపై మెస్సీయగా గుర్తించబడే ఖచ్చితమైన సమయం కూడా దానియేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. (దానియేలు 9:24-26) యేసు పరిశుద్ధాత్మచే అభిషేకించబడి యెహోవా అభిషిక్తునిగా మారినప్పుడు, పరలోకం నుండి వినిపించిన దేవుని స్వరం ఆయనను తన కుమారునిగా స్పష్టంగా గుర్తించింది. (మత్తయి 3:16, 17) ఆ సంతానం వెల్లడి చేయబడింది! అందుకే ఫిలిప్పు దృఢనమ్మకంతో ఇలా చెప్పగలిగాడు: “ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి.”—యోహాను 1:45.
6. (ఎ) లూకా 24: 27 ప్రకారం యేసు అనుచరులు ఏమి గ్రహించారు? (బి) ‘స్త్రీ సంతానంలోని’ ప్రధాన భాగం ఎవరు, ఆయన సర్పం తలమీద కొట్టడమంటే దాని భావమేమిటి?
6 ఆ తర్వాత, యేసుకు సంబంధించి అక్షరార్థంగా అనేక ప్రవచనాలు ప్రేరేపిత లేఖనాల్లో సమగ్రంగా వ్రాయబడ్డాయని ఆయన అనుచరులు గ్రహించారు. (లూకా 24:27) యేసే ఆ ‘స్త్రీ సంతానంలో’ ప్రధాన భాగమని, ఆయనే సర్పము తల చితకగొట్టి సాతానును ఉనికిలో లేకుండా నాశనం చేస్తాడని మరింత స్పష్టమయ్యింది. మానవజాతికి దేవుడు చేసిన వాగ్దానాలన్ని, మనం మనఃపూర్వకంగా కోరుకునేవన్ని యేసు ద్వారా నెరవేర్చబడతాయి.—2 కొరింథీయులు 1:20.
7. ప్రవచనాల్లో సూచించబడిన వ్యక్తిని గుర్తించడంతోపాటు, ఇంకా దేనిని గ్రహించడం ప్రయోజనకరంగా ఉంటుంది?
7 ఈ విషయం తెలుసుకోవడం మనలను ఎలా ప్రభావితం చేయాలి? రానున్న విమోచకుడు, మెస్సీయకు సంబంధించిన ఈ ప్రవచనాల్లోని కొన్నింటిని చదివిన ఐతియొపీయుడైన నపుంసకుడి గురించి బైబిలు చెబుతోంది. వాటిని అర్థంచేసుకోలేని ఆయన సువార్తికుడైన ఫిలిప్పును ఇలా అడిగాడు: “ప్రవక్త యెవనినిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు?” అయితే ఆ నపుంసకుడికి సమాధానం లభించిన తర్వాత ఆయన అంతటితో ఊరుకోలేదు. ఫిలిప్పు ఇచ్చిన వివరణను జాగ్రత్తగా విన్న తర్వాత, ఆ ప్రవచన నెరవేర్పును అర్థం చేసుకొని దానిపట్ల కృతజ్ఞత చూపేందుకు తనవైపునుండి చర్య తీసుకోవలసిన అవసరముందని ఆయన గ్రహించాడు. తాను బాప్తిస్మం తీసుకోవలసిన అవసరముందని ఆయన గ్రహించాడు. (అపొస్తలుల కార్యములు 8:32-38; యెషయా 53:3-9) మనం కూడా అలాగే ప్రతిస్పందిస్తామా?
8. (ఎ) ఇస్సాకును అర్పించడానికి అబ్రాహాము చేసిన ప్రయత్నం దేనికి పూర్వఛాయగా ఉంది? (బి) జనాంగాలన్ని ఆ సంతానము ద్వారా ఆశీర్వదించబడతాయని యెహోవా అబ్రాహాముతో ఎందుకు చెప్పాడు, అది నేడు మనకెలా వర్తిస్తుంది?
8 శారా ద్వారా తనకు కలిగిన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రాహాము చేసిన ప్రయత్నం గురించి వ్రాయబడిన హృదయాన్ని కదిలించే వృత్తాంతాన్ని కూడా పరిశీలించండి. (ఆదికాండము 22:1-18) అది యెహోవా చేయబోయే దానికి, అంటే తన అద్వితీయ కుమారుణ్ణి అర్పించడానికి పూర్వఛాయగా నిలిచింది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3: 16) యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చినట్లే మనకు ‘సమస్తమును అనుగ్రహిస్తాడనే’ నిశ్చయతను ఇది కలిగిస్తుంది. (రోమీయులు 8:32) మన తరఫునుండి మనమేం చేయాలి? ఆదికాండము 22: 18 లో వ్రాయబడినట్లుగా ‘అబ్రాహాము దేవుని మాట వినినందున’ జనాంగాలన్ని ఆ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయని యెహోవా అబ్రాహాముతో చెప్పాడు. మనం కూడా యెహోవా చెప్పినది, ఆయన కుమారుడు చెప్పినది వినాలి: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.”—యోహాను 3:36.
9. యేసు బలి ద్వారా సాధ్యపరచబడిన నిత్యజీవ నిరీక్షణపట్ల మనకు కృతజ్ఞతవుంటే, మనమేమి చేస్తాము?
9 యేసు బలి ద్వారా సాధ్యపరచబడిన నిత్యజీవ నిరీక్షణపట్ల మనకు కృతజ్ఞతవుంటే, యేసు ద్వారా యెహోవా మనకు చెప్పినవి చేయాలని మనం కోరుకుంటాము. వాటికి దేవునిపట్ల, పొరుగువారిపట్ల మనకున్న ప్రేమకు సన్నిహిత సంబంధముంది. (మత్తయి 22:37-39) యెహోవాపట్ల మనకున్న ప్రేమ, ‘[యేసు మనకు] ఆజ్ఞాపించిన వాటినన్నింటిని గైకొనాలని’ ఇతరులకు బోధించడానికి మనలను పురికొల్పుతుందని యేసు చూపించాడు. (మత్తయి 28:19, 20) మనం క్రమంగా “సమాజముగా కూడుట” ద్వారా, యెహోవాను సేవించే తోటివారితో ఆ ప్రేమను పంచుకోవాలని కోరుకుంటాము. (హెబ్రీయులు 10:24, 25; గలతీయులు 6:10) అంతేకాక దేవుడు, ఆయన కుమారుడు చెప్పినది వినడం అంటే వారు మన నుండి పరిపూర్ణతను ఆశిస్తున్నారని మనం భావించకూడదు. యేసు మన ప్రధానయాజకుడిగా, “మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు” అని హెబ్రీయులు 4: 15 చెబుతోంది. ప్రత్యేకంగా మన బలహీనతలను అధిగమించడానికి సహాయం చేయమని మనం క్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థించినప్పుడు అది మనకెంత ఓదార్పునిస్తుందో కదా!—మత్తయి 6:12.
క్రీస్తునందు విశ్వాసం చూపండి
10. యేసు లేకుండా రక్షణ ఎందుకు లేదు?
10 బైబిలు ప్రవచనం యేసు ద్వారా నెరవేరిందని యెరూషలేములోని ఉన్నత న్యాయస్థానానికి సూచించిన తర్వాత అపొస్తలుడైన పేతురు ఈ శక్తిమంతమైన మాటలతో ముగించాడు: “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” (అపొస్తలుల కార్యములు 4:12) ఆదాము సంతతి వారందరు పాపులే కాబట్టి, వారి మరణానికి ఇతరులను విమోచించగల విలువ లేదు. కాని యేసు పరిపూర్ణుడు, ఆయన ప్రాణానికి బలి విలువ ఉంది. (కీర్తన 49:6-9; హెబ్రీయులు 2:9) ఆయన ఆదాము కోల్పోయిన పరిపూర్ణమైన ప్రాణానికి సరిసమానమైన విమోచన క్రయధనాన్ని దేవునికి సమర్పించాడు. (1 తిమోతి 2:5, 6) దేవుని నూతనలోకంలో మనం నిత్యజీవం పొందేందుకు అది మనకు మార్గం తెరిచింది.
11. యేసు బలి ఎలా మనకు గొప్ప ప్రయోజనం చేకూర్చగలదో వివరించండి.
11 అంతేకాక మనం ఇప్పుడు కూడా ఇతర ప్రయోజనాలను పొందేందుకు ఆ విమోచన క్రయధనం మన కోసం మార్గం తెరిచింది. ఉదాహరణకు, మనం పాపులమైనప్పటికి, మనకు లభించే పాపక్షమాపణ కారణంగా మనం నిర్మలమైన మనస్సాక్షి కలిగివుండడాన్ని యేసు బలి సాధ్యం చేస్తుంది. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం క్రింద జంతుబలులు అర్పించి పొందిన పాపక్షమాపణ కంటే ఇది మరెంతో గొప్పది. (అపొస్తలుల కార్యములు 13:38, 39; హెబ్రీయులు 9:13, 14; 10:22) అయితే మనం ఆ క్షమాపణను పొందాలంటే, క్రీస్తు బలి మనకెంత అవసరమో మనం యథార్థంగా అంగీకరించాలి: “మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.”—1 యోహాను 1:8, 9.
12. దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షి పొందడానికి నీటి బాప్తిస్మం ఎందుకు ప్రాముఖ్యం?
12 పాపులు క్రీస్తునందు, ఆయన బలియందు తమ విశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేయవచ్చు? మొదటి శతాబ్దంలో ప్రజలు విశ్వాసులైనప్పుడు వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. ఎలా? వారు బాప్తిస్మం పొందారు. ఎందుకు? ఎందుకంటే తన శిష్యులందరు బాప్తిస్మం పొందాలని యేసు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 8:12; 18: 8) యేసు ద్వారా యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాటునుబట్టి ఒక వ్యక్తి హృదయం నిజంగా కదిలించబడితే ఆయన వెనుదీయడు. ఆయన తన జీవితంలో అవసరమైన ఎలాంటి మార్పులైనా చేసుకొని, ప్రార్థనలో దేవునికి సమర్పించుకొని, నీటి బాప్తిస్మం ద్వారా తన సమర్పణను సూచిస్తాడు. ఈ విధంగా తన విశ్వాసాన్ని ప్రదర్శించడం ద్వారా ఆయన ‘నిర్మలమైన మనస్సాక్షి కొరకు దేవునికి విన్నపం’ చేసుకుంటాడు.—1 పేతురు 3:21.
13. మనం పాపం చేశామని మనం గ్రహిస్తే, దాని విషయంలో మనమేమి చేయాలి, ఎందుకు చేయాలి?
13 అయితే దాని తర్వాత కూడా పాపభరిత లక్షణాలు పొడచూపుతూనే ఉంటాయి. మరి అప్పుడెలా? అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: “మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు.” (1 యోహాను 2:1, 2) అంటే మనమెలాంటి పాపం చేసినా, క్షమాపణ కోసం దేవునికి ప్రార్థిస్తే చాలు అది క్షమించబడుతుందని దాని భావమా? ఎంతమాత్రం కాదు. క్షమాపణ పొందడానికి కీలకం నిజమైన పశ్చాత్తాపం. క్రైస్తవ సంఘంలోని అనుభవముగల పెద్దవారినుండి సహాయం కూడా అవసరం కావచ్చు. మనం చేసిన తప్పును గుర్తించి, అది మళ్ళీ చేయకుండా ఉండేందుకు తీవ్రంగా కృషిచేసేలా దాని విషయంలో యథార్థంగా పశ్చాత్తాపపడాలి. (అపొస్తలుల కార్యములు 3:19; యాకోబు 5:13-16) మనమలా చేస్తే మనకు యేసు సహాయం లభిస్తుందని, యెహోవా అనుగ్రహం తిరిగిపొందుతామని మనం నిశ్చింతగా ఉండవచ్చు.
14. (ఎ) యేసు బలి మనకు ప్రయోజనమిచ్చిన ఒక ప్రాముఖ్యమైన మార్గాన్ని వివరించండి. (బి) మనకు నిజంగా విశ్వాసముంటే, మనమేమి చేస్తాము?
14 యేసు బలి, ఆదికాండము 3: 15 వ వచనంలోని సంతానానికి అనుబంధ భాగమైన ‘చిన్నమంద’ పరలోకంలో నిరంతరం జీవించేందుకు మార్గం తెరచింది. (లూకా 12:32; గలతీయులు 3:26-29) మానవాళిలోని కోట్లాదిమంది ఇతరులు భూపరదైసుపై నిరంతరం జీవించే అవకాశాన్ని కూడా అది తెరచింది. (కీర్తన 37:29; ప్రకటన 20:11, 12; 21:3, 4) నిత్యజీవము, ‘మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా దేవుడిచ్చే కృపావరము.’ (రోమీయులు 6:23; ఎఫెసీయులు 2:8-10) ఆ కృపావరంలో మనకు విశ్వాసముంటే, అది అందించబడిన విధానంపట్ల కృతజ్ఞత ఉంటే మనం దానిని తప్పకుండా ప్రదర్శిస్తాము. తన చిత్తం నెరవేర్చడంలో యెహోవా యేసును ఎంత అద్భుతంగా ఉపయోగించాడో, యేసు అడుగుజాడలను మనందరం జాగ్రత్తగా అనుసరించడం ఎంత ఆవశ్యకమో మనం గ్రహిస్తే, మనం క్రైస్తవ పరిచర్యను మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటిగా చేసుకుంటాం. దేవుని ఈ మహిమాన్విత కృపావరం గురించి మనం దృఢనమ్మకంతో ఇతరులకు తెలియజేసినప్పుడు మన విశ్వాసం వ్యక్తమవుతుంది.—అపొస్తలుల కార్యములు 20:24.
15. యేసుక్రీస్తునందు విశ్వాసానికి ఐక్యపరిచే ప్రభావం ఎలా ఉంది?
15 ఇలాంటి విశ్వాసానికి ఎంత శ్రేష్ఠమైన, ఐక్యపరిచే ప్రభావం ఉందో కదా! దాని మూలంగా మనం యెహోవాకు, ఆయన కుమారునికి, క్రైస్తవ సంఘంలో ఒకరికొకరం మరింత సన్నిహితమయ్యాము. (1 యోహాను 3:23, 24) యెహోవా దయతో తన కుమారునికి “పరలోకమందున్న వారిలో గాని, భూమిపై ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, [దేవుని నామము మినహా] ప్రతి నామమునకు పైనామమును” అనుగ్రహించాడని మనం ఆనందించేలా అది చేస్తుంది.—ఫిలిప్పీయులు 2:9-11.
పునఃసమీక్షా చర్చ
• మెస్సీయ గుర్తించబడినప్పుడు, దేవుని వాక్యాన్ని నిజంగా నమ్మినవారికి ఆయన గుర్తింపు ఎందుకు స్పష్టంగావుంది?
• యేసు బలిపట్ల మన కృతజ్ఞతను చూపించడానికి, మనం చేయవలసిన కొన్ని పనులు ఏవి?
• యేసు బలి ఇప్పటికే మనకు ఏయే విధాలుగా ప్రయోజనం చేకూర్చింది? మన పాపాలను క్షమించమని మనం యెహోవాకు ప్రార్థించినప్పుడు అది ఎలా సహాయపడుతుంది?
[అధ్యయన ప్రశ్నలు]
[36వ పేజీలోని చిత్రం]
దేవుని ఆజ్ఞలు పాటించాలని ఇతరులకు బోధించమని యేసు తన అనుచరులకు చెప్పాడు