మనందరం ఎదుర్కోవలసిన వివాదాంశం
అధ్యాయం ఆరు
మనందరం ఎదుర్కోవలసిన వివాదాంశం
1, 2. (ఎ) ఏదెనులో సాతాను లేవదీసిన వివాదాంశమేమిటి? (బి) అతడు చెప్పినదాంట్లో ఆ వివాదాంశం ఎలా సూచించబడింది?
మానవాళి క్రితమెన్నడూ ఎదుర్కోని అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశంలో మీరు కూడా చేరివున్నారు. ఆ వివాదాంశానికి సంబంధించి మీ స్థానం మీ నిత్య భవిష్యత్తును నిర్ధారిస్తుంది. ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పుడు ఈ వివాదాంశం తలెత్తింది. అప్పుడు సాతాను, “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” అని హవ్వను ప్రశ్నించాడు. ఒక వృక్షానికి సంబంధించి మాత్రం, ‘మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు’ అని దేవుడు చెప్పాడని ఆమె సమాధానమిచ్చింది. అప్పుడు సాతాను, ఆదాము జీవితం లేదా హవ్వ జీవితం దేవునికి విధేయత చూపడంపై ఆధారపడిలేదని చెబుతూ దేవుడు అబద్ధికుడని సూటిగా ఆరోపించాడు. దేవుడు తన సృష్టిప్రాణులకు మేలైనదానిని, అంటే వారు తమ జీవితానికి సంబంధించి స్వంత ప్రమాణాలను ఏర్పాటు చేసుకునే సామర్థ్యాన్ని ఇవ్వడంలేదని సాతాను వాదించాడు. సాతాను వారికిలా నమ్మబలికాడు: ‘మీరు చావనేచావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచిచెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.’—ఆదికాండము 3:1-5.
2 వాస్తవానికి మానవులు దేవుని నియమాలకు విధేయత చూపడంకంటే స్వంతగా నిర్ణయాలు తీసుకోవడమే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సాతాను చెబుతున్నాడు. ఆ విధంగా అతను దేవుని పరిపాలనా విధానాన్ని సవాలు చేశాడు. అది దేవుని విశ్వ సర్వాధిపత్యానికి అంటే ఆయన పరిపాలించే హక్కుకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశాన్ని లేవదీసింది. ఈ ప్రశ్న లేవదీయబడింది: మానవులకు శ్రేష్ఠమైనదేమిటి, యెహోవా పరిపాలనా విధానమా లేక ఆయన నుండి స్వతంత్రంగా స్వంతగా పరిపాలించుకోవడమా? ఆ వివాదాంశం తలెత్తిన వెంటనే యెహోవా ఆదాము హవ్వలకు మరణశిక్ష విధించి ఉండవచ్చు, కాని అది సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాన్ని సంతృప్తికరంగా పరిష్కరించి ఉండేది కాదు. దీర్ఘకాలంపాటు మానవ సమాజం అభివృద్ధి చెందడానికి అనుమతించడం ద్వారా దేవుడు తన నుండి, తన నియమాల నుండి స్వతంత్రంగా ఉండడంవల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో సరిగ్గా చూపించగలిగాడు.
3. సాతాను ఎలాంటి రెండవ వివాదాంశాన్ని లేవదీశాడు?
3 యెహోవా పరిపాలనా హక్కుపై సాతాను చేసిన దాడి ఏదెనులో జరిగిన సంఘటనతో ఆగిపోలేదు. ఇతరులు యెహోవాకు విశ్వసనీయంగా ఉండే విషయాన్ని కూడా అతడు ప్రశ్నించాడు. ఇది మొదటి దానితో దగ్గర సంబంధమున్న రెండవ వివాదాంశంగా మారింది. అతని సవాలు ఆదాము హవ్వల సంతానంతోపాటు దేవుని ఆత్మ సంబంధ కుమారులందరికి, అలాగే యెహోవాకు ప్రియాతి ప్రియమైన జ్యేష్ఠ పుత్రునికి కూడా వర్తించేలా తయారయ్యింది. ఉదాహరణకు యోబు కాలంలో, యెహోవాను సేవించేవారు దేవునిపట్ల, ఆయన పరిపాలనా విధానంపట్ల ప్రేమతో కాదుగాని స్వార్థపూరిత కారణాలతోనే సేవిస్తున్నారని సాతాను వాదించాడు. కష్టాలొస్తే, వారందరూ తమ స్వార్థపూరిత కోరికలకు లొంగిపోతారని అతను వాదించాడు.—యోబు 2:1-6; ప్రకటన 12:10.
చరిత్ర నిరూపించినదేమిటి?
4, 5. మానవుడు తన స్వంత మార్గాన్ని నిర్దేశించుకోవడం విషయంలో చరిత్ర ఏమని రుజువుచేసింది?
4 సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశంలో ఇదొక ప్రాముఖ్యమైన అంశం: తన పరిపాలన నుండి స్వతంత్రంగా జీవించి కృతార్థులయ్యేందుకు దేవుడు మానవులను సృష్టించలేదు. వారి ప్రయోజనార్థమే తన నీతియుక్త నియమాలపై ఆధారపడి ఉండేలా ఆయన వారిని సృష్టించాడు. యిర్మీయా ప్రవక్త ఇలా అంగీకరించాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. యెహోవా . . . నన్ను శిక్షింపుము.” (యిర్మీయా 10:23, 24) అందుకే దేవుని వాక్యం ఇలా ఉద్బోధిస్తుంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.” (సామెతలు 3: 5) మానవాళి జీవించివుండడానికి వారిని నడిపించేందుకు భౌతిక నియమాలను పెట్టినట్లే ఆయన వారికి నైతిక నియమాలను కూడా ఇచ్చాడు, వాటికి విధేయులుగా ఉంటే సామరస్య మానవ సమాజం నెలకొంటుంది.
5 దేవుని పరిపాలన లేకుండా మానవ కుటుంబం స్వీయపాలనలో ఎన్నటికి విజయం సాధించలేదని ఆయనకు స్పష్టంగా తెలుసు. దేవుని పరిపాలన నుండి స్వతంత్రంగా ఉండేందుకు వ్యర్థంగా ప్రయత్నిస్తూ మానవులు విభిన్నమైన రాజకీయ, ఆర్థిక, మత వ్యవస్థలను స్థాపించుకున్నారు. ఈ భేదాలు ప్రజలు నిరంతరం ఒకరితో ఒకరు ఘర్షణపడడానికి, తత్ఫలితంగా అది హింసకు, యుద్ధానికి, మరణానికి దారితీసింది. ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొన్నాడు.’ (ప్రసంగి 8: 9) మానవ చరిత్రంతటా అదే జరిగింది. దేవుని వాక్యంలో ప్రవచించబడినట్లుగా దుర్జనులు, వంచకులు ‘అంతకంతకు చెడిపోతూనేవున్నారు.’ (2 తిమోతి 3:13) మానవాళి వైజ్ఞానికంగా, సాంకేతికంగా అత్యంత ఉన్నత శిఖరాలకు చేరుకున్న 20వ శతాబ్దం ఇంతకుముందెన్నడూ లేని అత్యంత ఘోర విపత్తులను చవిచూసింది. మానవులు తమ స్వంత మార్గాన్ని నిర్దేశించుకోవడానికి సృష్టించబడలేదని తెలియజేసిన యిర్మీయా 10:23 లోని మాటలు నిజమని విస్తృతంగా నిరూపించబడ్డాయి.
6. దేవునికి వేరుగా మానవుల స్వతంత్ర పరిపాలనా సమస్యను ఆయన ఎలా పరిష్కరిస్తాడు?
6 దేవునికి వేరుగా మానవుల స్వతంత్ర పరిపాలనవల్ల కలిగిన దీర్ఘకాల విషాదకర పరిణామాలు, మానవుల పరిపాలన ఎన్నటికి సఫలం కాదని సంపూర్ణంగా నిరూపించాయి. సంతోషం, ఐక్యత, ఆరోగ్యం, జీవం ఇవన్ని కేవలం దేవుని పరిపాలనవల్లే సాధ్యమవుతాయి. మానవుల స్వతంత్ర పరిపాలనపట్ల యెహోవా చూపిస్తున్న సహనం ఇంకెంతో కాలం ఉండదని దేవుని వాక్యం చూపిస్తోంది. (మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5) త్వరలోనే ఆయన మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని భూమిపై తన పరిపాలన స్థాపిస్తాడు. బైబిలు ప్రవచనం ఇలా తెలియజేస్తోంది: “ఆ రాజుల [ప్రస్తుత మానవ పరిపాలనల] కాలములలో పరలోకమందున్న దేవుడు [పరలోకములో] ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు [ఇకపై మానవులు ఎన్నడు భూమిని పరిపాలించరు]; అది ముందు చెప్పిన [ప్రస్తుత] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2: 44.
దేవుని నూతనలోకంలోకి సురక్షితంగా వెళ్ళడం
7. దేవుని పరిపాలన మానవ పరిపాలనను అంతం చేసినప్పుడు ఎవరు రక్షించబడతారు?
7 దేవుని పరిపాలన మానవ పరిపాలనను అంతం చేసినప్పుడు ఎవరు రక్షించబడతారు? బైబిలిలా సమాధానమిస్తోంది: “యథార్థవంతులు [దేవుని పరిపాలనా హక్కును సమర్థించేవారు] దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు [దేవుని పరిపాలనా హక్కును సమర్థించనివారు] దేశములో నుండకుండ నిర్మూలమగుదురు.” (సామెతలు 2:21, 22) అదేవిధంగా కీర్తనకర్త ఇలా ప్రకటించాడు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:10, 29.
8. దేవుడు తన సర్వాధిపత్యాన్ని సంపూర్ణంగా ఎలా నిరూపించుకుంటాడు?
8 సాతాను విధానం నాశనం చేయబడిన తర్వాత, దేవుడు తన నూతనలోకాన్ని ప్రవేశపెడతాడు. వేలాది సంవత్సరాలుగా మానవజాతిని బానిసగా చేసిన వినాశకర హింసను, యుద్ధాలను, పేదరికాన్ని, బాధలను, అనారోగ్యాన్ని చివరికి మరణాన్ని కూడా అది సమూలంగా తీసివేస్తుంది. విధేయులైన మానవాళి కోసం వేచివున్న ఆశీర్వాదాలను బైబిలు ఎంతో మనోహరంగా వర్ణిస్తోంది: ‘ఆయన [దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.’ (ప్రకటన 21:3, 4) క్రీస్తు అధికారంలో తన పరలోక రాజ్య ప్రభుత్వం ద్వారా, దేవుడు మనపై సర్వాధిపతిగా అంటే మన పరిపాలకుడిగా తన హక్కును సంపూర్ణంగా నిరూపించుకుంటాడు (లేదా సమర్థించుకుంటాడు).—రోమీయులు 16:20; 2 పేతురు 3:10-13; ప్రకటన 20:1-6.
వివాదాంశానికి వారు ప్రతిస్పందించిన విధానం
9. (ఎ) యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నవారు ఆయన వాక్యాన్ని ఎలా దృష్టించారు? (బి) నోవహు తన విశ్వసనీయతను ఎలా నిరూపించుకున్నాడు, ఆయన మాదిరి నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
9 చరిత్రంతటిలోను, సర్వాధిపతియైన యెహోవాకు తమ విశ్వసనీయతను నిరూపించుకున్న నమ్మకమైన స్త్రీపురుషులు ఉన్నారు. ఆయన మాట విని ఆయనకు విధేయత చూపించడంపైనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని వారికి తెలుసు. నోవహు అలాంటి వ్యక్తే. అందుకే దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: ‘నా సన్నిధిని సమస్త శరీరుల అంతము వచ్చియున్నది; నీకొరకు ఓడను చేసికొనుము.’ నోవహు యెహోవా నిర్దేశాన్ని శిరసావహించాడు. ఆ కాలంలోని ప్రజలకు హెచ్చరిక ఇవ్వబడినా, అసాధారణమైనదేదీ సంభవించబోవడం లేదన్నట్లు వారు తమ దైనందిన జీవన వ్యవహారాల్లో మునిగిపోయారు. కాని నోవహు పెద్ద ఓడను నిర్మించడమే కాక యెహోవా నీతియుక్త మార్గాల గురించి ఇతరులకు నిర్విరామంగా ప్రకటించాడు. ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.”—ఆదికాండము 6:13-22; హెబ్రీయులు 11: 7; 2 పేతురు 2: 5.
10. (ఎ) అబ్రాహాము శారాలు యెహోవా సర్వాధిపత్యాన్ని ఎలా సమర్థించారు? (బి) అబ్రాహాము శారాల ఉదాహరణల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
10 యెహోవా తమకు ఆజ్ఞాపించినవన్ని చేస్తూ ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థించడంలో అబ్రాహాము శారాలు కూడా చక్కని మాదిరులుగా ఉన్నారు. వారు సౌభాగ్యంతో వర్ధిల్లుతున్న ఊరు అనే కల్దీయుల పట్టణంలో నివసించేవారు. కాని యెహోవా అబ్రాహామును మరో దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు, అబ్రాహాముకు ఆ దేశం గురించి తెలియకపోయినా ఆయన ‘యెహోవా చెప్పిన ప్రకారము అక్కడకు వెళ్ళాడు.’ మంచి ఇల్లు, స్నేహితులు, బంధువులతో శారా సౌకర్యవంతమైన జీవితం గడిపేదనడంలో సందేహం లేదు. అయినా ఆమె యెహోవాకు తన భర్తకు లోబడి కనానులో ఎలాంటి పరిస్థితులు వేచివున్నాయో తెలియకపోయినా ఆ దేశానికి వెళ్ళింది.—ఆదికాండము 11:31-12: 4; అపొస్తలుల కార్యములు 7:2-4.
11. (ఎ) మోషే ఎలాంటి పరిస్థితుల్లో యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించాడు? (బి) మోషే మాదిరి మనకు ఎలా ప్రయోజనకరంగా ఉండవచ్చు?
11 యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించిన మరొక వ్యక్తి మోషే. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అంటే ఐగుప్తు ఫరోను ముఖాముఖి ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు కూడా ఆయన యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించాడు. దానర్థం మోషే ధైర్యస్థుడని కాదు. దానికి భిన్నంగా ఆయన తనకు సరిగ్గా మాట్లాడే సామర్థ్యం లేదని వెనుకాడాడు. కాని ఆయన యెహోవాకు విధేయత చూపించాడు. యెహోవా మద్దతుతో, తన సహోదరుడైన అహరోను సహాయంతో మోషే మొండిపట్టు వదలని ఫరోకు యెహోవా వాక్కును పదేపదే ప్రకటించాడు. ఇశ్రాయేలు కుమారుల్లో సహితం కొందరు మోషేపట్ల కఠినంగా ప్రవర్తించారు. అయినప్పటికీ మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటన్నింటిని విశ్వసనీయంగా చేశాడు, చివరికి ఆయన ద్వారానే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు.—నిర్గమకాండము 7: 6; 12:50, 51; హెబ్రీయులు 11:24-27.
12. (ఎ) యెహోవాకు విశ్వసనీయంగా ఉండడంలో, దేవుడు వ్రాతపూర్వకంగా తెలియజేసిన వాటిని చేయడం కంటే ఎక్కువేవుందని ఏది చూపిస్తోంది? (బి) ఇలాంటి విశ్వసనీయతను గురించిన అవగాహన, 1 యోహాను 2:15 ను అన్వయించుకోవడానికి మనకెలా సహాయం చేయవచ్చు?
12 యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నవారు, దేవుడు వ్రాతపూర్వకంగా ఆజ్ఞాపించిన వాటికి మాత్రమే విధేయత చూపిస్తే సరిపోతుందని తర్కించలేదు. పోతీఫరు భార్య తనతో వ్యభిచరించేందుకు యోసేపును లోబరచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, దేవుడు వ్యభిచారాన్ని నిషేధించాడు అని తెలియజేసే లిఖితపూర్వక ఆజ్ఞ లేదు. అయితే ఏదెనులో యెహోవా స్థాపించిన వివాహ ఏర్పాటు గురించి యోసేపుకు తెలుసు. వేరొకరి భార్యతో లైంగిక సంబంధాలు కలిగివుండడం దేవునికి అప్రీతికరమని ఆయనకు తెలుసు. తాను ఎంతమేరకు ఐగుప్తీయులవలె ఉండడానికి దేవుడు అనుమతిస్తాడో ఆ పరిమితులను పరీక్షించడానికి యోసేపు ఆసక్తి కనపరచలేదు. దేవుడు మానవాళితో వ్యవహరించిన విధానం గురించి ధ్యానించి, ఇది దేవుని చిత్తం అని తాను గ్రహించి దానిని మనఃపూర్వకంగా అన్వయించుకోవడం ద్వారా ఆయన యెహోవా మార్గాలను సమర్థించాడు.—ఆదికాండము 39:7-12; కీర్తన 77:11, 12.
13. (ఎ) యోబు విషయంలో (బి) ముగ్గురు హెబ్రీయుల విషయంలో సాతాను అబద్ధికుడని ఎలా నిరూపించబడ్డాడు?
13 యెహోవా గురించి నిజంగా తెలిసినవారు తీవ్రంగా పరీక్షించబడినా ఆయనను విడిచివెళ్ళరు. యెహోవా ఉన్నతంగా మాట్లాడిన యోబు కూడా తన సంపదను లేదా తన ఆరోగ్యాన్ని కోల్పోతే, దేవుణ్ణి విడిచిపెడతాడని సాతాను ఆరోపించాడు. అయితే తనను విపత్తులు ఎందుకు ముంచెత్తుతున్నాయో యోబుకు తెలియకపోయినా, ఆయన అపవాది అబద్ధికుడని నిరూపించాడు. (యోబు 2:9, 10) శతాబ్దాల తర్వాత, సాతాను తన పంతం నెగ్గించుకోవాలని ఇంకా ప్రయత్నిస్తూ, రాజు నిలబెట్టిన ప్రతిమకు వంగి నమస్కరించకపోతే మండే కొలిమిలో పడవేస్తానని ముగ్గురు హెబ్రీ యువకులను కోపం రగిలిన బబులోను రాజు బెదిరించేలా రెచ్చగొట్టాడు. రాజాజ్ఞకు విధేయత చూపడమా లేక విగ్రహారాధనను ఖండించే యెహోవా నియమానికి విధేయత చూపడమా ఏదోకటి ఎంపిక చేసుకోవలసి వచ్చిన ఆ యూదులు, తాము యెహోవా సేవకులమని ఆయనే తమ సర్వోన్నత సర్వాధిపతి అని స్థిరంగా తెలియజేశారు. వారు తమ ప్రస్తుత జీవితం కంటే దేవునికి నమ్మకంగా ఉండడాన్నే అమూల్యంగా ఎంచారు!—దానియేలు 3:14-18.
14. అపరిపూర్ణ మానవులుగా మనం నిజంగా యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నామని నిరూపించుకోవడం ఎలా సాధ్యమవుతుంది?
14 ఈ ఉదాహరణలను బట్టి ఒక వ్యక్తి యెహోవాకు విశ్వసనీయంగా ఉండాలంటే ఆయన పరిపూర్ణుడుగా ఉండాలని లేదా తప్పిదం చేసే వ్యక్తి పూర్తిగా విఫలమైనట్లేననే ముగింపుకు రావాలా? అలా ఎంతమాత్రం కాదు! మోషే కొన్నిసార్లు తప్పిపోయాడని బైబిలు చెబుతోంది. యెహోవా అసంతృప్తి చెందినప్పటికి, ఆయన మోషేను తిరస్కరించలేదు. యేసుక్రీస్తు అపొస్తలులకు కూడా బలహీనతలు ఉండేవి. మనం వారసత్వంగా పొందిన అపరిపూర్ణతను పరిగణలోకి తీసుకొని, మనం ఉద్దేశపూర్వకంగా ఆయన చిత్తాన్ని అలక్ష్యం చేయనట్లయితే యెహోవా సంతోషిస్తాడు. ఒకవేళ మన బలహీనత వల్ల మనం తప్పిదం చేసినా, మనం మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి ఆ తప్పును ఒక అలవాటుగా మార్చుకోకుండా ఉండడం ప్రాముఖ్యం. ఆ విధంగా మనం యెహోవా మంచిదని చెప్పినదాన్ని నిజంగా ప్రేమిస్తున్నామని, ఆయన చెడ్డదని చూపినదాన్ని ద్వేషిస్తున్నామని ప్రదర్శిస్తాము. పాపపరిహార విలువగల యేసు బలిపై మన విశ్వాసం ఆధారంగా, దేవుని ఎదుట మనం పరిశుభ్ర స్థానం కలిగివుండగలము.—ఆమోసు 5:15; అపొస్తలుల కార్యములు 3:19; హెబ్రీయులు 9:14.
15. (ఎ) మానవులందరిలో దేవునిపట్ల పరిపూర్ణ యథార్థతను ఎవరు కాపాడుకున్నారు, అది ఏమి నిరూపించింది? (బి) యేసు నెరవేర్చిన దాని నుండి మనకెలా సహాయం లభిస్తుంది?
15 అయితే యెహోవా సర్వాధిపత్యానికి పరిపూర్ణ విధేయత చూపించడం మానవులకు అసలు సాధ్యం కాదా? ఈ ప్రశ్నకు సమాధానం దాదాపు 4,000 సంవత్సరాలపాటు ఒక పరిశుద్ధ “మర్మము”గా ఉండిపోయింది. (1 తిమోతి 3:16) ఆదాము పరిపూర్ణుడిగా సృష్టించబడినా దైవభక్తి విషయంలో ఆయన పరిపూర్ణ మాదిరిగా నిలువలేదు. మరి అలా ఎవరు ఉండగలరు? అతని పాపభరిత సంతానంలో ఎవ్వరూ అలా ఉండలేరు. అలా ఉండగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. (హెబ్రీయులు 4:15) మరింత అనుకూల పరిస్థితులు ఉన్నందువల్ల ఆదాము నిజంగా కోరుకొనివుంటే అతను పరిపూర్ణ యథార్థతను కాపాడుకోగలిగేవాడని యేసు నెరవేర్చినది నిరూపించింది. లోపము దేవుని సృష్టికార్యములో లేదు. కాబట్టి దేవుని నియమానికి విధేయత చూపడమే కాక, విశ్వ సర్వాధిపతియైన యెహోవాకు వ్యక్తిగత భక్తి చూపించడంలో కూడా మనం అనుకరించడానికి కృషి చేయవలసిన మాదిరి యేసుక్రీస్తే.—ద్వితీయోపదేశకాండము 32:4, 5.
మన వ్యక్తిగత సమాధానమేమిటి?
16. యెహోవా సర్వాధిపత్యానికి సంబంధించి మన వైఖరి విషయంలో మనం ఎల్లప్పుడూ మెలకువగా ఎందుకు ఉండాలి?
16 నేడు మనలో ప్రతి ఒక్కరం విశ్వ సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశాన్ని ఎదుర్కోవలసిందే. మనం యెహోవా పక్షాన ఉన్నామని బహిరంగంగా తెలియజేస్తే సాతాను మనలను ఒక గురిగా పెట్టుకుంటాడు. అతడు ప్రతివైపు నుండి మనపై ఒత్తిడి తీసుకువస్తూ, ఈ దుష్ట విధానాంతం వరకూ అలా నిర్విరామంగా చేస్తూనే ఉంటాడు. మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. (1 పేతురు 5: 8) యెహోవా సర్వాధిపత్యానికి సంబంధించిన సర్వోన్నత వివాదాంశంలో, కష్టాల్లోనూ దేవునికి యథార్థంగా ఉండే రెండవ వివాదాంశంలో మనం ఎవరి పక్షాన ఉన్నామో మన ప్రవర్తన చూపిస్తుంది. అవిశ్వసనీయమైన ప్రవర్తన ఈ లోకంలో సర్వసాధారణం కాబట్టి అదంత ప్రాముఖ్యం కాదని దృష్టించే ప్రమాదాన్ని మనం కొనితెచ్చుకోము. యథార్థత కాపాడుకోవడానికి మనం మన జీవితంలోని ప్రతి రంగంలోను యెహోవా నీతి మార్గాలను అన్వయించుకోవడానికి కృషి చేయాలి.
17. మనం విసర్జించవలసిన అబద్ధాలు, దొంగతనాలు ఎలా ఉద్భవించాయి?
17 ఉదాహరణకు ‘అబద్ధానికి జనకుడైన’ సాతానును మనం అనుకరించలేము. (యోహాను 8:44) మనం మన వ్యవహారాలన్నింటిలోనూ సత్యవంతులుగా ఉండాలి. సాతాను విధానంలో యౌవనులు తరచూ తమ తల్లిదండ్రులతో సత్యం చెప్పరు. కాని క్రైస్తవ యౌవనులు అలా చేయరు, ఆ విధంగా వారు, దేవుని ప్రజలు పరీక్షించబడినప్పుడు తమ యథార్థత విడిచిపెడతారు అని సాతాను చేసిన ఆరోపణ అబద్ధమని నిరూపిస్తారు. (యోబు 1:9-11; సామెతలు 6:16-19) అంతేగాక, ఒక వ్యక్తి సత్య దేవుని పక్షాన కాక ‘అబద్ధానికి జనకుడైన’ వాని పక్షాన ఉన్నాడని సూచించే వ్యాపార అభ్యాసాలు ఉన్నాయి. మనం వాటిని విసర్జిస్తాం. (మీకా 6:11, 12) ఒక వ్యక్తి తన అవసరాన్నిబట్టి చేసినా, లేక ఒక ధనవంతుని నుండి దోచుకున్నా దొంగతనం ఎన్నటికి సమర్థనీయమైనది కాదు. (సామెతలు 6:30, 31; 1 పేతురు 4:15) మనం నివసిస్తున్న ప్రాంతంలో అది సాధారణ అలవాటైనా, దొంగలించిన సొమ్ము కొంచమే అయినా దొంగతనం దేవుని నియమాలకు విరుద్ధం.—లూకా 16:10; రోమీయులు 12: 2; ఎఫెసీయులు 4:28.
18. (ఎ) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ముగిసినప్పుడు సర్వ మానవాళికి ఎలాంటి పరీక్ష ఎదురౌతుంది? (బి) మనం ఇప్పుడు ఏ అలవాటును పెంపొందించుకోవాలి?
18 క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో, మానవాళిపై ప్రభావం చూపడానికి వీలులేకుండా సాతాను అతని దయ్యాలు అగాధంలో ఉంటారు. అదెంత ఉపశమనాన్నిస్తుందో కదా! అయితే వెయ్యేండ్ల తర్వాత, వారు కొద్ది సమయం విడిచిపెట్టబడతారు. సాతాను అతని అనుచరులు, దేవునిపట్ల తమ యథార్థతను కాపాడుకొంటున్న పునరుద్ధరింపబడిన మానవజాతిపై ఒత్తిడి తెస్తారు. (ప్రకటన 20:7-10) అప్పుడు సజీవులుగా ఉండే ఆధిక్యత మనకు ఉంటే, మనం విశ్వ సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశం విషయంలో ఎలా ప్రతిస్పందిస్తాం? అప్పుడు మానవులందరూ పరిపూర్ణులుగా ఉంటారు కాబట్టి, ఎలాంటి అవిశ్వసనీయ చర్యైనా ఉద్దేశపూర్వకంగా చేయబడినదై ఉంటుంది, తత్ఫలితంగా నిత్య నాశనం కలుగుతుంది. కాబట్టి యెహోవా తన వాక్యం ద్వారా లేదా తన సంస్థ ద్వారా మనకిచ్చే నిర్దేశం ఎలాంటిదైనా దానికి అనుకూలంగా ప్రతిస్పందించే అలవాటును ఇప్పుడే పెంపొందించుకోవడం ఎంత అవశ్యకమో కదా! అలాచేయడం ద్వారా, విశ్వ సర్వాధిపతిగా ఆయనపట్ల మనకున్న నిజమైన భక్తిని మనం చూపిస్తాము.
పునఃసమీక్షా చర్చ
• మనందరం ఎదుర్కోవలసిన గొప్ప వివాదాంశమేమిటి? అందులో మనమెలా భాగమయ్యాము?
• ప్రాచీన కాలంలోని స్త్రీపురుషులు యెహోవాకు తమ యథార్థతను నిరూపించుకున్న విధానాల్లోని విశిష్ఠత ఏమిటి?
• మనం ప్రతిదినం మన ప్రవర్తన ద్వారా యెహోవాను ఘనపరచడం ఎందుకు ప్రాముఖ్యం?
[అధ్యయన ప్రశ్నలు]