కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఆరాధకులు అనుభవించే స్వాతంత్ర్యం

యెహోవా ఆరాధకులు అనుభవించే స్వాతంత్ర్యం

అధ్యాయం ఐదు

యెహోవా ఆరాధకులు అనుభవించే స్వాతంత్ర్యం

1, 2. (ఎ) మొదటి మానవజతకు దేవుడు ఎలాంటి స్వాతంత్ర్యం ఇచ్చాడు? (బి) ఆదాము హవ్వల కార్యకలాపాలను నడిపించిన కొన్ని నియమాలను పేర్కొనండి.

 యెహోవా మొదటి స్త్రీపురుషులను సృష్టించినప్పుడు వారు నేటి మానవులకంటే ఎంతో ఎక్కువ స్వాతంత్ర్యాన్ని అనుభవించారు. వారు పరదైసులో అంటే అందమైన ఏదెను తోటలో నివసించారు. వారి మనస్సులు, శరీరాలు పరిపూర్ణం కాబట్టి ఎలాంటి అనారోగ్యం వారి జీవితానందాన్ని పాడుచేయలేదు. వారి తర్వాతి వారందరికోసం వేచివున్నట్లు మరణం వారి కోసం వేచివుండలేదు. అంతేకాక, వారు మర మనుషులుగా కాక స్వేచ్ఛా చిత్తమనే అద్భుత వరంగల ప్రాణులుగా ఉండేవారు, వారికి స్వంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండేది. అయితే అలాంటి గొప్ప స్వాతంత్ర్యాన్ని వారు నిరంతరం అనుభవించాలంటే, దేవుని నియమాలను వారు గౌరవించాలి.

2 ఉదాహరణకు, దేవుడు స్థాపించిన భౌతిక నియమాల గురించి ఆలోచించండి. నిజమే ఈ నియమాలు వ్రాతపూర్వకంగా తెలియజేయబడి ఉండకపోవచ్చు, అయితే ఆదాము హవ్వలు సహజ సిద్ధంగానే ఆ నియమాలకు లోబడేలా సృష్టించబడ్డారు. ఆకలి వారు భుజించాలని, దాహం వారు నీళ్ళు తాగాలని, సూర్యాస్తమయాలు వారు నిద్రించాలని సూచించాయి. యెహోవా వారికి ఒక పని కూడా అప్పగించాడు. వారికివ్వబడిన ఆ పని నిజానికి ఒక నియమం, ఎందుకంటే అది వారి జీవనవిధానాన్ని నిర్దేశిస్తుంది. వారు పిల్లలను కనాలి, భూమిపై ఉన్న అనేకరకాల ప్రాణులను ఏలాలి, పరదైసు సరిహద్దులను భూగోళమంతా విస్తరింపజేయాలి. (ఆదికాండము 1:​28; 2:​15) అది ఎంత దయాపూర్వకమైన, ప్రయోజనకరమైన నియమమో కదా! అది వారికి సంపూర్ణ సంతృప్తినిచ్చే పనినిచ్చింది, వారి నైపుణ్యాలను ప్రయోజనకరమైన రీతిలో సంపూర్ణంగా ఉపయోగించే శక్తినిచ్చింది. అంతేకాక తమ పనిని ఎలా చెయ్యాలి అనే విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి కావలసినంత స్వేచ్ఛ వారికుంది. ఇంతకంటే ఎక్కువ ఎవరు అడగగలరు?

3. ఆదాము హవ్వలు నిర్ణయాలు తీసుకునే విషయంలో తమకివ్వబడిన స్వాతంత్ర్యాన్ని తెలివిగా ఉపయోగించడం ఎలా నేర్చుకోగలరు?

3 ఆదాము హవ్వలకు స్వంతగా నిర్ణయాలు తీసుకునే ఆధిక్యత ఇవ్వబడిందంటే దానర్థం, వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సత్ఫలితాలనే తీసుకువస్తుందని కాదు. వారు నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యాన్ని దేవుని నియమాల, సూత్రాల హద్దుల్లోనే వినియోగించుకోవాలి. వాటిని వారు ఎలా నేర్చుకోగలరు? తమ సృష్టికర్త చెప్పినమాట విని, ఆయన కార్యాలను గమనించడం ద్వారానే. ఆదాము హవ్వలకు, తాము నేర్చుకున్నవాటిని అన్వయించుకోవడానికి అవసరమైన తెలివితేటలను దేవుడు అనుగ్రహించాడు. వారు పరిపూర్ణులుగా సృష్టించబడ్డారు కాబట్టి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారు సహజ సిద్ధంగానే దేవుని లక్షణాలను ప్రతిబింబించడానికి మొగ్గుచూపుతారు. దేవుడు తమ కోసం చేసినదానికి వారు నిజంగా కృతజ్ఞతతో ఉండి, దేవుణ్ణి సంతోషపరచాలని కోరుకుంటే వారు ఆయన లక్షణాలను ప్రతిబింబించడంలో నిశ్చయంగా జాగ్రత్తగా ఉంటారు.​—⁠ఆదికాండము 1:​26, 27; యోహాను 8:​29.

4. (ఎ) ఒక వృక్ష ఫలం తినకూడదని ఆదాము హవ్వలకు ఇవ్వబడిన ఆజ్ఞ వారికి స్వాతంత్ర్యం లేకుండా చేసిందా? (బి) ఆ ఆజ్ఞ ఎందుకు న్యాయమైనది?

4 కాబట్టి వారి జీవదాతగా తనపట్ల వారికిగల భక్తిని, తాను ఆజ్ఞాపించిన పరిధిలోనే నిలిచి ఉండడానికి వారు చూపే సుముఖతను దేవుడు పరీక్షించాలనుకోవడం న్యాయమే. యెహోవా ఆదాముకు ఇలా ఆజ్ఞాపించాడు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆదికాండము 2:​16, 17) హవ్వ సృష్టించబడిన తర్వాత ఆమెకు కూడా ఆ నియమం గురించి తెలియజేయబడింది. (ఆదికాండము 3:​2, 3) ఆ ప్రతిబంధం వారికి స్వాతంత్ర్యం లేకుండా చేసిందా? ఎంతమాత్రం లేదు. వారు ఆ ఒక్క వృక్ష ఫలం తినవలసిన అవసరం లేకుండా వారికి అనేక రకాల రుచికరమైన ఆహారం సమృద్ధిగా ఉంది. (ఆదికాండము 2:​8, 9) భూమిని సృష్టించింది దేవుడే కాబట్టి సబబుగానే అది ఆయనదేనని వారు గుర్తించాలి. కాబట్టి ఆయన సంకల్పానికి, మానవాళికి ప్రయోజనకరమైన నియమాలను స్థాపించే హక్కు ఆయనకు ఉంది.​—⁠కీర్తన 24:​1, 10.

5. (ఎ)ఆదాము హవ్వలు తమ మహిమాన్విత స్వాతంత్ర్యాన్ని ఎలా పోగొట్టుకున్నారు? (బి) ఆదాము హవ్వలు అనుభవించిన స్వాతంత్ర్యం స్థానాన్ని ఏది ఆక్రమించుకుంది, దానివల్ల మనపై ఎలాంటి ప్రభావం పడింది?

5 కాని ఏమి జరిగింది? స్వార్థపూరిత కోరికతో పురికొల్పబడిన ఒక దేవదూత తన స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగపరచుకొని సాతానుగా మారాడు, ఆ మాటకు “వ్యతిరేకించేవాడు” అని అర్థం. అతను దేవుని చిత్తానికి విరుద్ధంగా మరిదేనినో ఆశచూపించి హవ్వను మోసగించాడు. (ఆదికాండము 3:​4, 5) దేవుని నియమాన్ని ఉల్లంఘించడంలో ఆదాము కూడా హవ్వతో చేతులు కలిపాడు. వారు తమకు చెందని దానిని తీసుకొని తమ మహిమాన్విత స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నారు. పాపము వారి యజమానిగా తయారయింది, దేవుడు హెచ్చరించినట్లుగానే చివరికి వారు మరణించారు. వారు తమ సంతానానికి పాపాన్ని వారసత్వంగా అందజేశారు, ఆ పాపము మానవుల్లో తప్పు చేయాలనే సహజ స్వభావంలో స్పష్టంగా కనిపిస్తుంది. పాపము వ్యాధులకు, వృద్ధాప్యానికి, మరణానికి కారణమయ్యే బలహీనతలను కూడా తెచ్చింది. తప్పు చేయాలనే సహజ స్వభావానికి సాతాను ప్రభావం తోడవడంతో అది కోట్లాదిమంది మానవుల మరణానికి దారితీసిన ద్వేషాలతో, నేరాలతో, హింసతో, యుద్ధాలతో నిండిన చరిత్రగల మానవ సమాజం ఏర్పడింది. దేవుడు మొదట్లో మానవజాతికి ఇచ్చిన స్వాతంత్ర్యానికి ఇదెంత భిన్నంగా ఉందో కదా!​—⁠ద్వితీయోపదేశకాండము 32:​4, 5; యోబు 14:​1, 2; రోమీయులు 5:​12; ప్రకటన 12: 9.

స్వాతంత్ర్యం ఎక్కడ లభిస్తుంది?

6. (ఎ) నిజమైన స్వాతంత్ర్యం ఎక్కడ లభిస్తుంది? (బి) యేసు ఎలాంటి స్వాతంత్ర్యం గురించి మాట్లాడాడు?

6 నేడు సర్వత్రా వ్యాపించివున్న చెడు పరిస్థితుల దృష్ట్యా, ప్రజలు ఎక్కువ స్వాతంత్ర్యాన్ని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే నిజమైన స్వాతంత్ర్యం ఎక్కడ లభిస్తుంది? యేసు ఇలా చెప్పాడు: “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:​31, 32) యేసు మాట్లాడిన స్వాతంత్ర్యం, ఒక పరిపాలకుడిని లేదా ప్రభుత్వాన్ని తిరస్కరించి మరో పరిపాలకుడిని లేదా ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ప్రజలు ఆశించే స్వాతంత్ర్యం కాదు. బదులుగా, ఈ స్వాతంత్ర్యం మానవ సమస్యల మూలాన్ని తొలగిస్తుంది. పాపపు దాసత్వం నుండి పొందే స్వాతంత్ర్యం గురించి యేసు చర్చిస్తున్నాడు. (యోహాను 8:​24, 34-36) కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు నిజ శిష్యుడైనప్పుడు, ఆయన తన జీవితంలో గమనార్హమైన మార్పును అంటే విడుదలను అనుభవిస్తాడు!

7. (ఎ) మనం ఇప్పుడు ఏ భావంలో పాపం నుండి స్వతంత్రులుగా ఉండవచ్చు? (బి) ఆ స్వాతంత్ర్యం మనకు ఉండాలంటే మనమేమి చేయాలి?

7 అంటే దానర్థం నిజ క్రైస్తవులు సహజ సిద్ధమైన పాపభరిత ప్రవర్తనా ప్రభావాలకు లోనుకారని కాదు. వారు పాపాన్ని వారసత్వంగా పొందారు కాబట్టి వారు ఇప్పటికి దానితో పోరాడవలసిందే. (రోమీయులు 7:21-25) అయితే ఒకవ్యక్తి నిజంగా యేసు బోధలకు అనుగుణంగా జీవిస్తే, ఆయన ఇంకెంత మాత్రం పాపానికి దాసునిగా ఉండడు. ఆజ్ఞలు జారీచేస్తూ వాటికి గ్రుడ్డిగా లోబడాల్సిందేనని ఆదేశించే నియంతగా పాపము ఆయనపై అధికారం చెలాయించదు. దోషభరిత మనస్సాక్షికి కారణమయ్యే సంకల్పరహిత జీవనవిధానానికి సంబంధించిన ఉరిలో ఆయన చిక్కుకోడు. క్రీస్తు బలిపై ఆయనకున్న విశ్వాసం ఆధారంగా గత పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఆయనకు దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది. పాపభరిత కోరికలు తలెత్తి అధికారం చెలాయించడానికి ప్రయత్నించవచ్చు, కాని ఆయన క్రీస్తు స్వచ్ఛమైన బోధనలను మనసుకు తెచ్చుకొని పాపభరిత కోరికల ప్రకారం ప్రవర్తించడానికి నిరాకరించినప్పుడు, పాపం ఇక తనపై యజమానిగా లేదని నిరూపిస్తాడు.​—⁠రోమీయులు 6:​12-17.

8. (ఎ) నిజ క్రైస్తవత్వం మనకు ఎలాంటి గొప్ప స్వాతంత్ర్యాలను ఇస్తుంది? (బి) లోకసంబంధ పరిపాలకులపట్ల మనకెలాంటి దృక్పథం ఉండాలి?

8 క్రైస్తవులుగా మనం అనుభవించే స్వాతంత్ర్యాల గురించి ఆలోచించండి. అబద్ధ బోధల ప్రభావాల నుండి, మూఢనమ్మకాల దాసత్వం నుండి, పాపపు బానిసత్వం నుండి మనం విడుదల చేయబడ్డాము. మరణించినవారి పరిస్థితి, పునరుత్థానం గురించిన అద్భుత సత్యాలు, అకారణ మరణ భయం నుండి మనలను స్వతంత్రులను చేశాయి. త్వరలోనే అసంపూర్ణ మానవ ప్రభుత్వాల స్థానంలో నీతియుక్తమైన దేవుని రాజ్యం స్థాపించబడుతుందనే జ్ఞానం మనలను నైరాశ్యం నుండి విడుదల చేస్తుంది. (దానియేలు 2:​44; మత్తయి 6:​10) అయితే, అలాంటి స్వాతంత్ర్యం ప్రభుత్వాధికారులపట్ల, వారి నియమాలపట్ల అగౌరవాన్ని సమర్థించదు.​—⁠తీతు 3:​1, 2; 1 పేతురు 2:​16, 17.

9. (ఎ) మానవులకు ఇప్పుడు సాధ్యమయ్యే గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి యెహోవా ప్రేమపూర్వకంగా మనకెలా సహాయం చేస్తున్నాడు? (బి) మనం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?

9 వివిధ రీతుల్లో మనమే స్వయంగా ప్రయత్నించి శ్రేష్ఠమైన జీవన మార్గమేదో కనుగొనాలని యెహోవా కోరడు. మనమెలా సృష్టించబడ్డామో, మనకేది నిజమైన సంతృప్తినిస్తుందో, మనకు శాశ్వతంగా ప్రయోజనమిచ్చేదేమిటో ఆయనకు తెలుసు. ఒక వ్యక్తికి తనతో, తోటి మానవులతో ఉన్న సంబంధాన్ని పాడుచేసి, బహుశా అతను నూతనలోకంలోకి సహితం ప్రవేశించకుండా అడ్డగించే తలంపుల గురించి, ప్రవర్తన గురించి ఆయనకు తెలుసు. ప్రేమపూర్వకంగా యెహోవా వాటన్నింటి గురించి బైబిలు ద్వారా, తన దృశ్య సంస్థ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. (మార్కు 13:​10; గలతీయులు 5:​19-23; 1 తిమోతి 1:​12, 13) కాబట్టి మనమెలా ప్రతిస్పందిస్తామో నిర్ణయించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించడం మనకే వదలివేయబడింది. ఆదాములా కాక, మనకు బైబిలు చెబుతున్న విషయాలను మనం లక్ష్యపెడితే మనం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటాము. యెహోవాతో మంచి సంబంధం కలిగివుండడమే మన జీవిత ప్రధాన లక్ష్యమని మనం చూపిస్తాం.

మరోవిధమైన స్వాతంత్ర్యాన్ని కోరుకోవడం

10. యెహోవాసాక్షులైన కొందరు ఎలాంటి స్వాతంత్ర్యం కావాలని కోరుకున్నారు?

10 కొన్నిసార్లు కొంతమంది యౌవన యెహోవాసాక్షులు, అలాగే ఇతర వయోజనులు కూడా తమకు మరోవిధమైన స్వాతంత్ర్యం కావాలని భావిస్తుండవచ్చు. లోకం వారికి ఆకర్షణీయంగా కన్పించవచ్చు, వారు దాని గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, ఈ లోక ప్రజలకు ఇష్టమైన క్రైస్తవ విరుద్ధ పనులు చేయాలనే కోరిక వారిలో అంత బలంగా తయారవుతుంది. అలాంటివారు మాదకద్రవ్యాలను దుర్వినియోగపరచాలని, మద్యపానీయాలను అతిగా సేవించాలని, వ్యభిచరించాలని పథకాలు వేసుకోకపోవచ్చు. కాని వారు నిజ క్రైస్తవులు కానివారితో సహవసించడం ప్రారంభించి, వారి ఆమోదం పొందాలని కోరుకుంటుండవచ్చు. వారు ఆ ప్రజల మాటతీరును, ప్రవర్తనను అనుకరించడం కూడా ప్రారంభించవచ్చు.​—⁠3 యోహాను 11.

11. తప్పు చేయాలనే శోధన కొన్నిసార్లు ఎవరి నుండి వస్తుంది?

11 కొన్నిసార్లు క్రైస్తవ విరుద్ధంగా ప్రవర్తించాలనే శోధన, యెహోవాను సేవిస్తున్నాను అని చెప్పుకొనే వ్యక్తి నుండే వస్తుంది. కొందరు తొలి క్రైస్తవుల విషయంలో అలాగే జరిగింది, మనకాలంలో కూడా అలా జరిగే అవకాశముంది. అలాంటి వ్యక్తులు తమకు ఆనందాన్నిస్తాయని వారు భావించేవి చేయడానికే తరచూ కోరుకుంటారు, కాని అలాంటివి దేవుని నియమాలకు విరుద్ధమైనవి. “సరదాగా ఉండండి” అని వారు ఇతరులను బలవంతపెడతారు. ‘తామే భ్రష్టత్వానికి దాసులైయుండి, ఇతరులకు స్వాతంత్ర్యం ఇస్తామని’ వారు వాగ్దానం చేస్తారు.​—⁠2 పేతురు 2:​19.

12. దేవుని నియమాలకు, సూత్రాలకు విరుద్ధమైన ప్రవర్తనవల్ల ఎలాంటి విషాదకరమైన ఫలితాలు వస్తాయి?

12 స్వాతంత్ర్యం అని పిలువబడే అలాంటి ప్రవర్తన దేవుని నియమాలకు అవిధేయత చూపడమే కాబట్టి దాని ఫలితాలు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటాయి. ఉదాహరణకు, అక్రమ సంబంధం మానసిక ఆందోళన, వ్యాధులు, అవాంఛిత గర్భధారణ, బహుశా వివాహ విచ్ఛిన్నత వంటి పరిణామాలకు దారితీయగలదు. (1 కొరింథీయులు 6:​18; 1 థెస్సలొనీకయులు 4:​3-8) మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల చికాకు, మాట మాంద్యము, దృష్టి లోపం, కళ్ళు తిరగడం, ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోవడం, భ్రమపడడం, చివరికి మరణం కూడా సంభవించే అవకాశముంది. అది వ్యసనంగా మారవచ్చు, అది నేరాలకు పాల్పడేందుకు దారి తీయవచ్చు. మద్యపానీయాల దుర్వినియోగం వల్ల కూడా ఇలాంటి పర్యవసానాలే కలుగుతాయి. (సామెతలు 23:​29-35) ఇలా ప్రవర్తించేవారు తాము స్వతంత్రులమని భావిస్తుండవచ్చు, కాని తాము పాపానికి దాసులమయ్యామని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. పాపం ఎంత క్రూరమైన యజమానో కదా! ఈ విషయమై ఇప్పుడే తర్కించడం, మనం అలాంటి అనుభవానికి గురికాకుండా మనలను మనం సంరక్షించుకునేందుకు సహాయపడుతుంది.​—⁠గలతీయులు 6: 7, 8.

సమస్యలు ఎక్కడ ఆరంభమవుతాయి?

13. (ఎ) సమస్యలకు దారితీసే కోరికలు తరచూ ఎలా ప్రేరేపించబడతాయి? (బి) “దుష్టసాంగత్యము” అంటే ఏమిటో అర్థంచేసుకోవడానికి మనకు ఎవరి దృక్కోణం అవసరం? (సి) 13వ పేరాలో ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలిస్తుండగా, మీరు యెహోవా దృక్కోణాన్ని నొక్కిచెప్పండి.

13 సమస్యలు తరచూ ఎక్కడ ఆరంభమవుతాయో ఆలోచించండి. బైబిలిలా వివరిస్తోంది: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” (యాకోబు 1:​14, 15) కోరిక ఎలా ప్రేరేపించబడుతుంది? మనస్సులోకి ప్రవేశించేవాటి ద్వారానే. బైబిలు సూత్రాలను పాటించని ప్రజలతో సహవసించడం వలన తరచూ ఇలా జరుగుతుంది. నిజమే, “దుష్టసాంగత్యము”నకు దూరంగా ఉండాలని మనందరికి తెలుసు. (1 కొరింథీయులు 15:​33) కాని, ఎలాంటి సహవాసాలు చెడ్డవి? ఈ విషయాన్ని యెహోవా ఎలా దృష్టిస్తున్నాడు? ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలను తర్కించడం, సూచించబడిన లేఖనాలను చూడడం మనం సరైన ముగింపుకు చేరుకోవడానికి సహాయపడుతుంది.

కొందరు వ్యక్తులు గౌరవనీయులుగా కనిపిస్తున్నారనే వాస్తవం, వారు మంచి సహవాసులని సూచిస్తుందా? (ఆదికాండము 34: 1, 2, 18, 19)

వారి సంభాషణ, బహుశా వారు విసిరే ఛలోక్తులు, మనం వారి సన్నిహిత సహవాసులుగా ఉండాలో లేదో సూచించగలవా? (ఎఫెసీయులు 5:​3, 4)

యెహోవాను ప్రేమించని ప్రజలతో మనం సన్నిహితంగా సహవసిస్తే, ఆయనెలా భావిస్తాడు? (2 దినవృత్తాంతములు 19:​1, 2)

మన విశ్వాసాలను పంచుకోనివారితో కలిసి మనం పనిచేసినా లేదా పాఠశాలకు వెళ్ళినా, మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎందుకుంది? (1 పేతురు 4:​3, 4)

టీవీ మరియు సినిమాలు చూడడం, ఇంటర్నెట్‌ను ఉపయోగించడం, పుస్తకాలు, పత్రికలు, వార్తాపత్రికలు చదవడం కూడా ఇతరులతో సహవసించడానికి మార్గాలు. ఇలాంటి మాధ్యమాలు అందించే ఎలాంటి సమాచారం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? (సామెతలు 3:​31; యెషయా 8:​19; ఎఫెసీయులు 4:​17-19)

మన సహవాసుల ఎంపిక మనమెలాంటి ప్రజలమని యెహోవాకు తెలియజేస్తుంది? (కీర్తన 26: 1, 4, 5; 97:​10)

14. దేవుని వాక్యంలోని ఉపదేశాన్ని ఇప్పుడు నమ్మకంగా అన్వయించుకొనే వారికి భవిష్యత్తులో ఎలాంటి మహిమాన్విత స్వాతంత్ర్యం వేచివుంది?

14 దేవుని నూతనలోకం మనకు అత్యంత సమీప భవిష్యత్తులో ఉంది. దేవుని పరలోక రాజ్య ప్రభుత్వం ద్వారా మానవాళి సాతాను ప్రభావం నుండి, అతని పూర్తి దుష్ట విధానపు ప్రభావం నుండి విడుదల పొందుతుంది. విధేయులైన మానవుల నుండి క్రమేపి పాపపు ప్రభావాలన్ని తొలగించబడతాయి, తత్ఫలితంగా మనస్సులు, శరీరాలు పరిపూర్ణతకు చేరుకుంటాయి, ఆ విధంగా మనం పరదైసులో నిత్యజీవితాన్ని ఆనందించగలుగుతాం. సమస్త సృష్టి చివరకు ‘యెహోవా ఆత్మకు’ సంపూర్ణ పొందికగల స్వాతంత్ర్యం అనుభవిస్తుంది. (2 కొరింథీయులు 3:​17) దేవునివాక్య ఉపదేశాన్ని ఇప్పుడు నిర్లక్ష్యంచేసి, వాటన్నింటిని పోగొట్టుకొనే ప్రమాదంలో పడడం జ్ఞానయుక్తంగా ఉంటుందా? నేడు మన క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తూ, మనం నిజంగా కోరుకునేది “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” అని స్పష్టంగా చూపిద్దాం.​—⁠రోమీయులు 8:​20-21.

పునఃసమీక్షా చర్చ

• మొదటి మానవజత ఎలాంటి స్వాతంత్ర్యం అనుభవించింది? ఆ స్వాతంత్ర్యానికి ఇప్పుడు మానవాళి అనుభవిస్తున్న దానికి ఎలాంటి తేడావుంది?

• నిజ క్రైస్తవులకు ఎలాంటి స్వాతంత్ర్యం ఉంది? స్వాతంత్ర్యమని లోకం పరిగణిస్తున్న దానితో అదెలా భిన్నంగా ఉంది?

• చెడు సహవాసానికి దూరంగా ఉండడం ఎందుకంత ప్రాముఖ్యం? ఆదామువలే కాక, మంచి చెడులను నిర్ధారించడంలో మనం ఎవరి నిర్ణయాలను అంగీకరిస్తాం?

[అధ్యయన ప్రశ్నలు]

[46వ పేజీలోని చిత్రాలు]

దేవుని వాక్యం ఇలా హెచ్చరిస్తోంది: “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును”