కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన సంస్థను ఎలా నడిపిస్తున్నాడు?

యెహోవా తన సంస్థను ఎలా నడిపిస్తున్నాడు?

అధ్యాయం పద్నాలుగు

యెహోవా తన సంస్థను ఎలా నడిపిస్తున్నాడు?

1. యెహోవా సంస్థ గురించి ఎలాంటి సమాచారాన్ని బైబిలు వెల్లడి చేస్తోంది, అది మనకెందుకు ప్రాముఖ్యం?

 దేవునికి ఒక సంస్థ ఉందా? ఆయనకు ఒక సంస్థ ఉందని ప్రేరేపిత లేఖనాలు మనకు చెబుతున్నాయి. ఆయన తన వాక్యంలో, ఆ సంస్థలోని అత్యద్భుత పరలోక భాగం గురించి మనకు కొంచెం తెలియజేస్తున్నాడు. (యెహెజ్కేలు 1:​1, 4-14; దానియేలు 7: 9, 10, 13, 14) ఆ అదృశ్య భాగాన్ని మనం చూడలేకపోయినా, అది నేడు సత్యారాధకులను ఎంతో ప్రభావితం చేస్తుంది. (2 రాజులు 6:​15-17) యెహోవా సంస్థకు ఈ భూమిపై ఒక దృశ్య భాగం కూడా ఉంది. ఆ సంస్థ ఏమిటి, దానిని యెహోవా ఎలా నడిపిస్తున్నాడు అనేవి అర్థంచేసుకోవడానికి మనకు బైబిలు సహాయంచేస్తుంది.

దృశ్య భాగాన్ని గుర్తించడం

2. దేవుడు ఏ క్రొత్త సంఘాన్ని స్థాపించాడు?

2 ఇశ్రాయేలు జనాంగము 1,545 సంవత్సరాలపాటు దేవుని సంఘంగా ఉండింది. (అపొస్తలుల కార్యములు 7:​38) కాని ఇశ్రాయేలు దేవుని నియమాలను పాటించడంలో విఫలమై ఆయన స్వంత కుమారుణ్ణే తిరస్కరించింది. తత్ఫలితంగా యెహోవా ఆ సంఘాన్ని తిరస్కరించి దానిని వదిలేశాడు. యేసు యూదులకు ఇలా చెప్పాడు: “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.” (మత్తయి 23:​38) ఆ తర్వాత దేవుడు ఒక క్రొత్త సంఘాన్ని స్థాపించి, దానితో ఒక క్రొత్త నిబంధన చేశాడు. తన కుమారునితోపాటు పరలోకంలో కలిసి ఉండడానికి దేవుడు ఎంపిక చేసుకొనే 1,44,000 మందితో ఆ సంఘం రూపొందుతుంది.​—⁠ప్రకటన 14:​1-4.

3. దేవుడు ఇప్పుడొక క్రొత్త సంఘాన్ని ఉపయోగిస్తున్నాడనేందుకు స్పష్టమైన రుజువుగా సా.శ. 33 పెంతెకొస్తునాడు ఏమి సంభవించింది?

3 ఆ క్రొత్త సంఘంలోని తొలిసభ్యులను సా.శ. 33 పెంతెకొస్తునాడు యెహోవా పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. గమనార్హమైన ఆ సంఘటన గురించి మనం ఇలా చదువుతాము: “పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై[రి].” (అపొస్తలుల కార్యములు 2:​1-4) ఆ విధంగా, దేవుడు పరలోకంలో యేసుక్రీస్తు ఆధ్వర్యంలో తన సంకల్ప నెరవేర్పుకు ఉపయోగించే సంఘం అదేనని దేవుని పరిశుద్ధాత్మ స్పష్టంగా రుజువుచేసింది.

4. నేడు యెహోవా దృశ్య సంస్థగా ఎవరు రూపొందారు?

4 నేడు ఆ 1,44,000 మందిలో శేషించబడినవారు మాత్రమే భూమిపై ఉన్నారు. కాని బైబిలు ప్రవచన నెరవేర్పు ప్రకారం, “వేరే గొఱ్ఱెల” ‘గొప్పసమూహానికి’ చెందిన లక్షలాది మంది అభిషిక్త శేషంతో కలిసి పనిచేయడానికి జతచేయబడ్డారు. మంచి కాపరియైన యేసు, ఆ వేరే గొఱ్ఱెలు, శేషించబడినవారు తన క్రింద అంటే ఒకే కాపరి క్రింద ఒకే మందగా ఉండేందుకు వారిని ఒక్కటిగా చేశాడు. (యోహాను 10:​11, 16; ప్రకటన 7:​9) వారందరు ఐకమత్యంగా ఒకే సంస్థగా అంటే యెహోవా దృశ్య సంస్థగా రూపొందారు.

దైవపరిపాలనా సంస్థ

5. దేవుని సంస్థను ఎవరు నడిపిస్తారు, ఎలా నడిపిస్తారు?

5 “జీవముగల దేవుని సంఘము” అనే లేఖనాధారిత పదబంధం ఆ సంస్థ ఎవరి ద్వారా నడిపించబడుతుందో స్పష్టంగా తెలియజేస్తోంది. అది దైవపరిపాలన లేదా దేవుడు పరిపాలించే సంస్థ. ఆ సంఘానికి అదృశ్య శిరస్సుగా నియమించిన యేసు ద్వారా, తన స్వంత ప్రేరేపిత వాక్యమైన బైబిలు ద్వారా యెహోవా తన ప్రజలకు నడిపింపునిస్తున్నాడు.​—⁠1 తిమోతి 3:​14, 15; ఎఫెసీయులు 1:​22, 23; 2 తిమోతి 3:​16, 17.

6. (ఎ) మొదటి శతాబ్దంలో సంఘానికి పరలోక నడిపింపు ఉందని ఎలా వెల్లడయ్యింది? (బి) ఇప్పటికీ యేసే సంఘ శిరస్సుగా ఉన్నాడని ఏది చూపిస్తోంది?

6 అలాంటి నడిపింపు పెంతెకొస్తు రోజున చాలా స్పష్టంగా కనిపించింది. (అపొస్తలుల కార్యములు 2:​14-18, 32, 33) సువార్త ఆఫ్రికాకు వ్యాపించేలా యెహోవా దూత నడిపించినప్పుడు, తార్సువాడైన సౌలు మారిన సమయంలో యేసు స్వరం ఆదేశాలను ఇచ్చినప్పుడు, పేతురు అన్యుల మధ్య ప్రకటనా పని ప్రారంభించినప్పుడు అది స్పష్టమయ్యింది. (అపొస్తలుల కార్యములు 8:​26, 27; 9:​3-7; 10:​9-16, 19-22) అయితే కొంతకాలం తర్వాత పరలోకము నుండి స్వరాలు వినబడడం, దేవదూతలు కనిపించడం, అద్భుతంగా ఆత్మసంబంధ వరాలు ఇవ్వబడడం ఆగిపోయింది. అయినా యేసు ఇలా వాగ్దానం చేశాడు: ‘ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉంటాను.’ (మత్తయి 28:​20; 1 కొరింథీయులు 13: 8) నేడు యెహోవాసాక్షులు యేసు నడిపింపును అంగీకరిస్తారు. ఆయన నడిపింపు లేకుండా, తీవ్ర వ్యతిరేకతలో రాజ్య సందేశాన్ని ప్రకటించడం అసాధ్యమవుతుంది.

7. (ఎ) ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ ఎవరుంటారు, ఎందుకు? (బి) ఆ ‘దాసునికి’ ఎటువంటి నియామకం ఇవ్వబడింది?

7 యేసు మరణించడానికి కొద్దికాలం ముందు తన శిష్యులకు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ గురించి చెప్పి, యజమానుడిగా తాను ఆ దాసునికి ప్రత్యేక బాధ్యత అప్పగిస్తానని చెప్పాడు. ప్రభువు పరలోకానికి వెళ్లినప్పుడు ఆ ‘దాసుడు’ భూమ్మీదే ఉండి, క్రీస్తు అదృశ్యంగా రాజ్యాధికారం పొందేవరకు కష్టపడి పనిచేస్తూనే ఉంటాడు. ఆ అభివర్ణన ఎవరో ఒక వ్యక్తిని కాదుగాని క్రీస్తు అభిషిక్త సంఘాన్ని మాత్రమే సరిగ్గా సూచిస్తుంది. ఆ సంఘాన్ని తన రక్తముతో కొన్నాడు కాబట్టి యేసు దానిని తన ‘దాసుడు’ అని సూచించాడు. శిష్యులను చేసి, వారికి “తగినవేళ [ఆధ్యాత్మిక] అన్నము” పెడుతూ క్రమంగా పోషించమని ఆయన ఆ సభ్యులకు ఆజ్ఞాపించాడు.​—⁠మత్తయి 24:​45-47; 28:​19; యెషయా 43:​10; లూకా 12:​42; 1 పేతురు 4:​10.

8. (ఎ) దాసుని తరగతికి ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి? (బి) దేవుని మాధ్యమం ద్వారా ఇవ్వబడే ఉపదేశానికి మన ప్రతిస్పందన ఎందుకు ప్రాముఖ్యం?

8 ఆ యజమాని 1914 లో అదృశ్యంగా అధికారానికి వచ్చినప్పుడు ఆ దాసుని తరగతివారు విశ్వసనీయంగా ఆయన పని చేస్తున్నారు కాబట్టి వారికి 1919 లో విస్తృత బాధ్యతలు అప్పగించబడ్డాయని రుజువయ్యింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో భూవ్యాప్తంగా రాజ్యం గురించి సాక్ష్యమివ్వబడుతోంది, అంతేకాక మహాశ్రమలనుండి రక్షించబడేందుకు యెహోవా ఆరాధకుల గొప్పసమూహం సమకూర్చబడుతోంది. (మత్తయి 24:​14, 21, 22; ప్రకటన 7:​9, 10) వారికి కూడా ఆధ్యాత్మిక ఆహారం అవసరం, దాసుని తరగతి ఆ ఆహారాన్ని అందిస్తోంది. కాబట్టి మనం యెహోవాను సంతోషపరచాలంటే, ఈ మాధ్యమం ద్వారా ఆయన అందజేస్తున్న ఉపదేశాన్ని అంగీకరించి దానికి అనుగుణంగా ప్రవర్తించాలి.

9, 10. (ఎ) మొదటి శతాబ్దంలో సిద్ధాంతాలకు సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించేందుకు, సువార్త ప్రకటనా పనికి నడిపింపునిచ్చేందుకు ఎలాంటి ఏర్పాటు ఉంది? (బి) యెహోవా ప్రజల కార్యకలాపాలను సమన్వయపరచేందుకు నేడు ఎలాంటి ఏర్పాటు ఉంది?

9 కొన్నిసార్లు సిద్ధాంతాలు, కార్యవిధానానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతాయి. అప్పుడెలా? క్రైస్తవులుగా మారిన అన్యులకు సంబంధించిన ఒక వివాదం ఎలా పరిష్కరించబడిందో అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం మనకు చెబుతోంది. ఆ విషయం, ఆ కాలంలో కేంద్ర పరిపాలక సభగా పనిచేసిన యెరూషలేములోని పెద్దల, అపొస్తలుల దృష్టికి తేబడింది. ఆ పురుషులు పాపరహితులు కాదు, అయినా దేవుడు వారిని ఉపయోగించుకున్నాడు. వారు ఆ విషయానికి సంబంధించిన లేఖనాలను, అలాగే అన్యులకు సువార్త ప్రకటించబడడానికి దేవుని ఆత్మ నడిపింపు ఉందనడానికి రుజువులను పరిశీలించారు. ఆ తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవుడు ఆ ఏర్పాటును ఆశీర్వదించాడు. (అపొస్తలుల కార్యములు 15:​1-29; 16:​4, 5) రాజ్య ప్రకటనా పనిని విస్తృతపరచేందుకు ఆ కేంద్ర పరిపాలక సభ ఆయా వ్యక్తులను పంపించింది.

10 మన కాలంలో యెహోవా దృశ్య సంస్థకు చెందిన పరిపాలక సభ వివిధ దేశాల్లోని ఆత్మాభిషిక్త సహోదరులతో రూపొందించబడింది, అది యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఉంది. యేసుక్రీస్తు ఆధ్వర్యంలో ఈ పరిపాలక సభ, యెహోవాసాక్షుల వేలాది సంఘాలకు సంబంధించిన ప్రకటనా కార్యకలాపాలను సమన్వయపరుస్తూ ప్రతి దేశంలో స్వచ్ఛారాధనను విస్తరింపజేస్తోంది. పరిపాలక సభ సభ్యులు అపొస్తలుడైన పౌలు చూపిన దృక్కోణమే చూపిస్తారు, ఆయన తోటి క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.”​—⁠2 కొరింథీయులు 1:​24.

11. (ఎ) పెద్దలు, పరిచర్య సేవకులు ఎలా నియమించబడతారు? (బి) అలా నియమించబడిన వారికి మనం ఎందుకు సహకరించాలి?

11 ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు అర్హతగల సహోదరులను ఎంపిక చేయడానికి ఈ పరిపాలక సభ నడిపింపునే కోరతారు, కాగా అలా ఎంపిక చేయబడిన సహోదరులకు సంఘ అవసరాలు చూసుకోవడానికి పెద్దలను, పరిచర్య సేవకులను నియమించే అధికారం ఇవ్వబడుతుంది. అలా నియమించబడే వారికి ఉండవలసిన అర్హతలు బైబిల్లో ఇవ్వబడ్డాయి, అయితే వారుకూడా అపరిపూర్ణులని, తప్పులు చేస్తారని మనం గుర్తుంచుకోవాలి. సిఫారసు చేసే పెద్దలకు, నియామకం చేసేవారికి దేవుని ఎదుట గంభీరమైన బాధ్యత ఉంది. (1 తిమోతి 3:​1-10, 12, 13; తీతు 1:​5-9) కాబట్టి వారు దేవుని ఆత్మ సహాయం కోసం ప్రార్థించి ఆయన ప్రేరేపిత వాక్యం నుండి నడిపింపును వెదకుతారు. (అపొస్తలుల కార్యములు 6:​2-4, 6; 14:​23) మనందరం “విశ్వాసవిషయములో . . . ఏకత్వము” సాధించేందుకు మనకు సహాయం చేసే ఈ ‘మనుష్యులలోని ఈవులకు’ కృతజ్ఞత చూపిద్దాం.​—⁠ఎఫెసీయులు 4:​8, 11-16.

12. దైవపరిపాలనా ఏర్పాటులో యెహోవా స్త్రీలను ఎలా ఉపయోగిస్తాడు?

12 సంఘంలో పర్యవేక్షించే బాధ్యతను పురుషులు చేపట్టాలని లేఖనాలు నిర్దేశిస్తున్నాయి. అయితే అది స్త్రీలను తక్కువచేయడం లేదు, ఎందుకంటే స్త్రీలలో కొందరు పరలోకరాజ్య వారసులు, అంతేకాక ప్రకటనా పనిలో వారే అధికంగా భాగం వహిస్తున్నారు. (కీర్తన 68:​11) అలాగే, తమ కుటుంబ బాధ్యతలను నమ్మకంగా నిర్వహిస్తూ స్త్రీలు సంఘ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తారు. (తీతు 2:​3-5) కాని సంఘంలో బోధించడం మాత్రం నియమిత పురుషులు చేపడతారు.​—⁠1 తిమోతి 2:​12, 13.

13. (ఎ) పెద్దలు తమ స్థానాన్ని ఎలా దృష్టించాలని బైబిలు ఉద్బోధిస్తోంది? (బి) మనందరం ఎటువంటి ఆధిక్యతలో భాగం వహించవచ్చు?

13 ఈ లోకంలో ఉన్నత పదవిలోని వ్యక్తి ప్రముఖుడిగా పరిగణించబడతాడు, కాని దేవుని సంస్థలో, ‘అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడు’ అనేది నియమం. (లూకా 9:​46-48; 22:​24-26) దేవుని స్వాస్థ్యం మీద అధికారులుగా ఉండకుండా జాగ్రత్తపడమని, మందకు మంచి మాదిరిగా ఉండమని లేఖనాలు పెద్దలను ఉపదేశిస్తున్నాయి. (1 పేతురు 5:​2, 3) కేవలం కొందరికే కాక యెహోవాసాక్షుల్లోని స్త్రీపురుషులందరికి, విశ్వ సర్వాధిపతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన నామము గురించి వినయంగా మాట్లాడుతూ, ఆయన రాజ్యం గురించి సకల ప్రాంతాల ప్రజలకు తెలియజేసే ఆధిక్యత ఉంది.

14. సూచించబడిన లేఖనాలు ఉపయోగిస్తూ, పేరా చివర్లో ఇవ్వబడిన ప్రశ్నలను చర్చించండి.

14 మనం వ్యక్తిగతంగా ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘యెహోవా తన దృశ్య సంస్థను నడిపించే విధానంపట్ల నాకు నిజమైన కృతజ్ఞత ఉందా? నా దృక్పథాలు, మాటలు, క్రియలు దానిని ప్రతిబింబిస్తున్నాయా?’ అలా విశ్లేషించుకోవడానికి ఈ క్రింది అంశాలను తర్కించడం మనలో ప్రతి ఒక్కరికి సహాయపడగలదు.

సంఘ శిరస్సైన క్రీస్తుకు నేను నిజంగా లోబడితే, ఈ క్రింది లేఖనాలు సూచించినట్లు నేనేమి చేస్తుండాలి? (మత్తయి 24:​14; 28:​19, 20; యోహాను 13:​34, 35)

దాసుని తరగతి ద్వారా, దాని పరిపాలక సభ ద్వారా వచ్చే ఆధ్యాత్మిక ఏర్పాట్లను నేను కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరించినప్పుడు, నేను ఎవరికి గౌరవం చూపిస్తున్నాను? (లూకా 10:​16)

సంఘంలోని ప్రతి ఒక్కరు, ప్రత్యేకించి పెద్దలు పరస్పరం ఎలా వ్యవహరించాలి? (రోమీయులు 12:​10)

15. (ఎ) యెహోవా దృశ్య సంస్థపట్ల మన వైఖరి ద్వారా మనమేమి ప్రదర్శిస్తాము? (బి) అపవాది అబద్ధికుడని నిరూపించి, యెహోవా హృదయాన్ని సంతోషపరచడానికి మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?

15 నేడు క్రీస్తు ఆధ్వర్యంలోని తన దృశ్య సంస్థ ద్వారా యెహోవా మనకు నడిపింపునిస్తున్నాడు. ఈ ఏర్పాటుపట్ల మన వైఖరి, సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదం గురించి మనమెలా భావిస్తున్నామో ప్రదర్శిస్తుంది. (హెబ్రీయులు 13:​17) స్వార్థమే మన ముఖ్య ఆలోచనని సాతాను వాదిస్తాడు. అయితే ఏ విధమైన సేవ అవసరమైతే ఆ విధంగా సేవచేస్తూ, మనపైకే అధికంగా అవధానం మళ్ళించేవాటికి దూరంగా ఉంటే అపవాది అబద్ధికుడని మనం నిరూపిస్తాము. మనలో నాయకత్వం వహిస్తున్నవారిని మనం ప్రేమించి గౌరవిస్తూ, ‘మన లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడడానికి’ నిరాకరిస్తే మనం యెహోవాను సంతోషపరుస్తాము. (యూదా 16; హెబ్రీయులు 13: 7) యెహోవా సంస్థపట్ల విశ్వసనీయంగా ఉండడం ద్వారా మనం యెహోవాయే మన దేవుడని, ఆయన ఆరాధనలో మనం ఐక్యమై ఉన్నామని చూపిస్తాము.​—⁠1 కొరింథీయులు 15:​58.

పునఃసమీక్షా చర్చ

• నేడు యెహోవా దృశ్య సంస్థ ఏది? దాని సంకల్పమేమిటి?

• సంఘ నియమిత శిరస్సు ఎవరు, ఎలాంటి దృశ్య ఏర్పాట్ల ద్వారా ఆయన మనకు ప్రేమపూర్వక నడిపింపునిస్తున్నాడు?

• యెహోవా సంస్థలోని వ్యక్తులపట్ల మనం ఎలాంటి ఆరోగ్యకరమైన స్వభావాలను పెంపొందించుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[133వ పేజీలోని చిత్రాలు]

క్రీస్తు ఆధ్వర్యంలోని తన దృశ్య సంస్థ ద్వారా యెహోవా మనలను నడిపిస్తున్నాడు