‘రాజ్యమును మొదట వెదకండి’
అధ్యాయం పదకొండు
‘రాజ్యమును మొదట వెదకండి’
1. (ఎ) రాజ్యాన్ని మొదట వెదకమని యేసు తన శ్రోతలకు ఎందుకు ఉద్బోధించాడు? (బి) మనం ఏమని ప్రశ్నించుకోవాలి?
దాదాపు 1,900 సంవత్సరాల క్రితం గలిలయలో ఇచ్చిన ప్రసంగంలో యేసు తన శ్రోతలకు ఇలా ఉద్బోధించాడు: “మీరు ఆయన [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి.” కాని అది ఎందుకంత అత్యవసరం? క్రీస్తుకు రాజ్యాధికారం ఇవ్వబడేది అనేక శతాబ్దాల తర్వాత కదా? అది నిజమే, కాని ఆ మెస్సీయ రాజ్యంతోనే యెహోవా తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకొని, భూమికి సంబంధించి తన దివ్య సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఆ విషయాల ప్రాముఖ్యతను నిజంగా గ్రహించినవారు ఆ రాజ్యానికి తమ జీవితాల్లో మొదటి స్థానమిస్తారు. మొదటి శతాబ్దంలోనే అది అంత ప్రాముఖ్యమైతే, క్రీస్తు రాజుగా సింహాసనాసీనుడైన ఈ కాలంలో అది ఇంకెంత ప్రాముఖ్యమో కదా! కాబట్టి ఇప్పుడు మనం వేసుకోవలసిన ప్రశ్న, నా జీవన విధానం నేను దేవుని రాజ్యాన్ని మొదట వెదకుతున్నట్లు చూపిస్తోందా?—మత్తయి 6:33.
2. సాధారణ ప్రజలు వేటిని అమితాసక్తితో వెంబడిస్తున్నారు?
2 నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది నిజంగానే రాజ్యాన్ని మొదట వెదకుతున్నారు. వారు యెహోవాకు తమను తాము సమర్పించుకొని ఆయన చిత్తం చేయడంపైనే తమ జీవితాలను కేంద్రీకరిస్తూ ఆ రాజ్య పరిపాలనకు తమ మద్దతునిస్తున్నారు. దానికి భిన్నంగా మానవుల్లో అధికశాతం ఇహలోక సంబంధమైనవాటిని వెదకడంలో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజలు ధన సంపదలను, డబ్బుతో కొనగల ఇతర సుఖాలను వెంబడిస్తున్నారు. లేదా తమ జీవన వృత్తిలో ఇంకా పైకి ఎదగడానికి తమ సర్వశక్తులను ధారపోస్తున్నారు. వారి జీవన విధానం స్వార్థం, వస్తుసంపదలు, సుఖభోగాలు వంటివాటిలోనే మునిగి ఉండడాన్ని ప్రతిబింబిస్తోంది. ఒకవేళ వారు దేవుణ్ణి నమ్మినా, తమ జీవితాల్లో ఆయనకు రెండవ స్థానమే ఇస్తున్నారు.—మత్తయి 6:31, 32.
3. (ఎ) ఎలాంటి ధనాన్ని వెదకమని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు, ఎందుకు? (బి) భౌతిక విషయాల గురించి అధికంగా చింతించవలసిన అవసరం ఎందుకు లేదు?
3 అయితే అలాంటి సంపదలేవీ శాశ్వతం కాదు కాబట్టి, యేసు తన శిష్యులకు ఇలా ఉపదేశించాడు: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు.” దానికి బదులు యెహోవాను సేవిస్తూ “పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి” అని ఆయన చెప్పాడు. దేవుని చిత్తం చేయడంపైనే దృష్టినిలిపి, ఆయన చిత్తం చేయడానికి తమ శక్తిసామర్థ్యాలను ఉపయోగిస్తూ తమ కళ్ళను “తేటగా” ఉంచుకొమ్మని యేసు తన శిష్యులకు ఉద్బోధించాడు. “మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు” అని ఆయన వారికి చెప్పాడు. అయితే ఆహారము, దుస్తులు, ఇల్లు వంటి భౌతిక అవసరాల విషయమేమిటి? “చింతింపకుడి” అని యేసు ఉపదేశించాడు. ఆయన వారి అవధానాన్ని ఆకాశపక్షులవైపు మళ్ళించాడు, దేవుడే వాటిని పోషిస్తున్నాడు. పువ్వుల నుండి పాఠం నేర్చుకొమ్మని యేసు తన అనుచరులను ప్రోత్సహించాడు, దేవుడే వాటిని అలంకరిస్తున్నాడు. బుద్ధిసూక్ష్మతగల మానవులైన యెహోవా సేవకులు వాటికంటె విలువైన వారు కారా? “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు [అవసరమైనవి] మీకనుగ్రహింపబడును” అని యేసు చెప్పాడు. (మత్తయి 6:19-34) మీరు ఆ మాటలను నమ్ముతున్నారని మీ క్రియలు చూపిస్తున్నాయా?
రాజ్య సత్యం అణచివేయబడనివ్వకండి
4. ఒక వ్యక్తి భౌతిక విషయాలకు అమిత ప్రాముఖ్యతనిస్తే, దాని ఫలితమెలా ఉండవచ్చు?
4 ఒక వ్యక్తి తనకు, తన కుటుంబానికి సంబంధించిన భౌతిక అవసరాలకు సరిపడా సంపాదించుకోవాలనుకోవడం సరైనదే. అయితే ఒక వ్యక్తి భౌతిక విషయాల గురించి అతిగా చింతిస్తే దాని ఫలితాలు విపత్కరంగా ఉండవచ్చు. తనకు రాజ్యంపై విశ్వాసముందని చెప్పుకున్నా, అతని హృదయంలో ఇతర విషయాలకు ప్రథమ స్థానమిస్తే, రాజ్య సత్యం అణచివేయబడుతుంది. (మత్తయి 13:18-22) ఉదాహరణకు ఒక సందర్భంలో, ధనవంతుడైన ఒక యౌవనాధికారి యేసును ఇలా ప్రశ్నించాడు: ‘నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి?’ అతను నైతికంగా జీవిస్తూ ఇతరులను బాగా చూసుకొనేవాడు కాని అతను తన భౌతిక సంపదలనే అమితంగా ప్రేమించాడు. క్రీస్తు అనుచరుడయ్యేందుకు అతడు వాటిని విడిచిపెట్టలేకపోయాడు. ఆ విధంగా అతను పరలోక రాజ్యంలో క్రీస్తుతో ఉండే అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఆ సందర్భంలో యేసు ఇలా చెప్పాడు: ‘ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం!’—మార్కు 10:17-23.
5. (ఎ) వేటితో సంతృప్తి కలిగియుండమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు, ఎందుకు? (బి) సాతాను “ధనాపేక్షను” నాశనకరమైన ఉరిగా ఎలా ఉపయోగిస్తాడు?
5 చాలా సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు సంపన్న వాణిజ్య కేంద్రమైన ఎఫెసులో ఉన్న తిమోతికి లేఖ వ్రాశాడు. పౌలు ఆయనకు ఇలా జ్ఞాపకం చేశాడు: “మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొనిపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” తనకు తన కుటుంబానికి కావలసిన “అన్నవస్త్రములు” సమకూర్చడానికి పనిచేయడం సరైనదే. కాని పౌలు ఇలా హెచ్చరించాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.” సాతాను బహుమోసగాడు. అతను మొదట ఒక వ్యక్తికి చిన్నచిన్న విషయాల ఆశ చూపి వలలో వేసుకోవచ్చు. ఆ తర్వాత అతను ఎక్కువ ఒత్తిడి తీసుకురావచ్చు, అంటే అంతకుముందు ఆధ్యాత్మిక విషయాలకు కేటాయించిన సమయాన్ని ఆక్రమించుకునే ఎక్కువ జీతంగల ఉద్యోగం లేదా పదోన్నతి స్వీకరించేందుకు ఒత్తిడి చేయవచ్చు. మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఎంతో ప్రాముఖ్యమైన రాజ్య సంబంధ విషయాలను “ధనాపేక్ష” అణచివేయగలదు. దాని గురించే పౌలు ఇలా చెప్పాడు: “కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”—1 తిమోతి 6:7-10.
6. (ఎ) ఐశ్వర్యాసక్తి ఉరిలో చిక్కుకొనకుండా ఉండేందుకు మనమేమి చేయాలి? (బి) నేటి ప్రపంచ ఆర్థిక పరిస్థితిలో కూడా మనమెలాంటి నమ్మకంతో ఉండవచ్చు?
6 తన క్రైస్తవ సహోదరుడిపై నిజమైన ప్రేమతో పౌలు తిమోతికి ఇలా ఉద్బోధించాడు: “నీవైతే వీటిని విసర్జించి . . . విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము.” (1 తిమోతి 6:11, 12) మన చుట్టూవున్న లోకంలోని ఐశ్వర్యాసక్తిగల జీవన విధానంతోపాటు కొట్టుకొనిపోకుండా ఉండేందుకు మనం మనఃపూర్వకంగా కృషిచేయవలసిన అవసరముంది. మనం మన విశ్వాసానికి అనుగుణంగా కృషి చేస్తే యెహోవా మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. అధిక ధరలు, నిరుద్యోగ సమస్య విస్తృతంగా ఉన్నా మనకు నిజంగా అవసరమైనవి మనకుండేలా ఆయన చూస్తాడు. పౌలు ఇలా వ్రాశాడు: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. —నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే [దేవుడే] చెప్పెను గదా. కాబట్టి—ప్రభువు [యెహోవా] నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.” (హెబ్రీయులు 13:5, 6) దావీదు రాజు ఇలా వ్రాశాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.”—కీర్తన 37:25.
తొలిశిష్యులు ఒక ప్రమాణం ఉంచారు
7. ప్రకటనా పనికి సంబంధించి యేసు తన శిష్యులకు ఎలాంటి ఆదేశాలను ఇచ్చాడు, అవి ఎందుకు సముచితమైనవి?
7 యేసు తన అపొస్తలులకు తగిన శిక్షణనిచ్చిన తర్వాత, “పరలోకరాజ్యము సమీపించియున్నది” అని ప్రకటిస్తూ సువార్త చెప్పడానికి వారిని ఇశ్రాయేలుకు పంపించాడు. అదెంత పులకరింపజేసే సందేశమో కదా! మెస్సీయ రాజైన యేసుక్రీస్తు వారి మధ్య ఉన్నాడు. అపొస్తలులు దేవుని సేవకు అంకితమవుతున్నందున, దేవుడు వారిని జాగ్రత్తగా చూసుకుంటాడనే దృఢనమ్మకంతో ఉండమని యేసు వారికి ఉద్బోధించాడు. కాబట్టి ఆయన ఇలా చెప్పాడు: “మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొనిపోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.” (మత్తయి 10:5-10; లూకా 9:1-6) తోటి ఇశ్రాయేలీయులు వారి అవసరాలు తీర్చేలా యెహోవా చూస్తాడు, వారి సమాజంలో కొత్తవారికి ఆతిథ్యమివ్వడం వాడుక.
8. (ఎ) యేసు తన మరణానికి కొద్దికాలం ముందు, ప్రకటనా పనికి సంబంధించి క్రొత్త ఆదేశాలను ఎందుకు ఇచ్చాడు? (బి) అయినప్పటికి యేసు అనుచరుల జీవితాల్లో దేనికి మొదటి స్థానం ఉండాలి?
8 ఆ తర్వాత, తన మరణానికి ముందు, భవిష్యత్తులో వారు మారిన పరిస్థితుల్లో పనిచేయవలసి ఉంటుందనే వాస్తవం గురించి యేసు తన అపొస్తలులను అప్రమత్తం చేశాడు. వారి కార్యకలాపాలకు అధికారిక వ్యతిరేకత ఎదురవడం వల్ల ఇశ్రాయేలులో వారికి సత్వర ఆతిథ్యం లభించకపోవచ్చు. అంతేకాక వారు త్వరలోనే రాజ్య సందేశాన్ని అన్యదేశాలకు కూడా తీసుకొనివెళ్తారు. అప్పుడు వారు తమతోకూడ “సంచియు జాలెయు” తీసుకొనివెళ్ళాలి. అయితే తమకు అవసరమైన అన్నవస్త్రములను సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో వారు యెహోవా రాజ్యాన్ని మొదట వెదకాలి.—లూకా 22:35-37.
9. పౌలు తన భౌతిక అవసరాలను తీర్చుకొంటూనే తన జీవితంలో రాజ్యానికి మొదటి స్థానం ఎలా ఇచ్చాడు, ఈ విషయంలో ఆయన ఇచ్చిన ఉపదేశము ఏమిటి?
9 యేసు ఉపదేశం అన్వయించుకున్న వారిలో అపొస్తలుడైన పౌలు చక్కని మాదిరిగా ఉన్నాడు. పౌలు తన జీవితంలో పరిచర్యను కేంద్రబిందువుగా చేసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 20:24, 25) ఆయన ప్రకటించడానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, తనే స్వయంగా భౌతిక అవసరాలు తీర్చుకున్నాడు, దానికొరకు ఆయన డేరాలు కుట్టే పని కూడా చేశాడు. ఇతరులు తనను పోషించాలని ఆయన అపేక్షించలేదు. (అపొస్తలుల కార్యములు 18:1-4; 1 థెస్సలొనీకయులు 2: 9) అయితే, ఇతరులు ప్రేమకొద్దీ ఆతిథ్యం, బహుమతులు ఇచ్చినప్పుడు ఆయన వాటిని కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించాడు. (అపొస్తలుల కార్యములు 16:15, 34; ఫిలిప్పీయులు 4:15-17) ప్రకటనా పని కోసం తమ కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దని, బదులుగా తమకున్న వివిధ బాధ్యతలను సమతూకంగా నిర్వర్తించాలని పౌలు క్రైస్తవులను ప్రోత్సహించాడు. పని చెయ్యమని, తమ కుటుంబాలను ప్రేమించమని, తమకు ఉన్నవాటిని ఇతరులతో పంచుకొమ్మని ఆయన వారికి ఉపదేశించాడు. (ఎఫెసీయులు 4:28; 2 థెస్సలొనీకయులు 3:7-12) సంపదలపై కాక దేవునిపై నమ్మకముంచమని, జీవితంలో మరింత ప్రాముఖ్యమైనవేవో తాము నిజంగా గ్రహించామని చూపించేలా తమ జీవితాలను ఉపయోగించమని ఆయన వారికి ఉద్బోధించాడు. అంటే యేసు బోధనలకు అనుగుణంగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకుతూ జీవించమని దానర్థం.—ఫిలిప్పీయులు 1:9-11.
మీ జీవితంలో రాజ్యానికి మొదటి స్థానమివ్వండి
10. రాజ్యమును మొదట వెదకడం అంటే దాని భావమేమిటి?
10 వ్యక్తిగతంగా మనం ఎంతమేరకు రాజ్య సువార్తను ఇతరులతో పంచుకుంటాము? అది కొంతమేరకు మన పరిస్థితులపై, మన కృతజ్ఞతా స్థాయిపై ఆధారపడివుంటుంది. ‘మీకు వేరే పని లేనప్పుడు రాజ్యాన్ని వెదకండి’ అని యేసు చెప్పలేదని గుర్తుంచుకోండి. రాజ్య ప్రాముఖ్యత తెలిసినవాడై, తన తండ్రి చిత్తాన్ని ఆయన ఇలా వ్యక్తం చేశాడు: ‘ఎడతెగక ఆయన రాజ్యమును వెదకండి.’ (లూకా 12: 31) మనలో అధికశాతం మన స్వంత అవసరాలను, మన కుటుంబాల అవసరాలను తీర్చడానికి పని చేయవలసినా, మనకు విశ్వాసముంటే, దేవుడు మనకిచ్చిన రాజ్య పని చుట్టే మన జీవితాలు పరిభ్రమిస్తాయి. అదే సమయంలో మనం మన కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహిస్తాము.—1 తిమోతి 5: 8.
11. (ఎ) రాజ్య సందేశం వ్యాప్తి చేయడంలో అందరూ ఒకేలా పని చేయలేరని యేసు ఎలా ఉదహరించాడు? (బి) మనం ఎంత చేయగలము అనేదానిపై ఎలాంటి అంశాలు ప్రభావం చూపుతాయి?
11 మనలో కొందరు సువార్తను ప్రకటించడానికి ఇతరులకంటే ఎక్కువ సమయం వెచ్చించగలుగుతున్నారు. కాని వివిధ రకాల నేలలను గురించి యేసు చెప్పిన ఉపమానంలో, మంచి నేలవంటి హృదయంగల వారందరు ఫలిస్తారని ఆయన చెప్పాడు. ఎంతమేరకు? ఆయావ్యక్తుల పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. వయస్సు, ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు వంటివాటిని పరిగణలోకి తీసుకోవాలి. అయితే నిజమైన కృతజ్ఞత ఉన్నప్పుడు మనం ఎంతో చేయవచ్చు.—మత్తయి 13:23.
12. యౌవనస్థులు ఎలాంటి యుక్తమైన ఆధ్యాత్మిక లక్ష్యం గురించి ఆలోచించాలని ప్రత్యేకంగా ప్రోత్సహించబడుతున్నారు?
12 రాజ్య పరిచర్యలో ఎక్కువగా భాగం వహించేందుకు సహాయపడే లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది. యౌవనస్థులు ఆసక్తిగల యౌవన క్రైస్తవుడైన తిమోతి ఉంచిన శ్రేష్ఠమైన మాదిరి గురించి గంభీరంగా ఆలోచించాలి. (ఫిలిప్పీయులు 2:19-22) వారు పాఠశాల విద్య పూర్తయిన తర్వాత పూర్తికాల పరిచర్య ప్రారంభించడం కంటే శ్రేష్ఠమైనది ఇంకేమి ఉండగలదు? యుక్తమైన ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పెద్దవారు కూడా ప్రయోజనం పొందుతారు.
13. (ఎ) రాజ్య సేవలో మనం వ్యక్తిగతంగా ఎంత చేయగలమో ఎవరు నిర్ణయిస్తారు? (బి) మనం నిజంగా రాజ్యాన్ని మొదట వెదకితే, మనం దేనిని రుజువు చేస్తాము?
13 ఎక్కువ చేయగలరని మనం భావించిన వారిని విమర్శించే బదులు, మన స్వంత పరిస్థితులు అనుమతించినంత మేరకు దేవుణ్ణి సంపూర్ణంగా సేవించేలా మన పురోభివృద్ధి కోసం కృషిచేయడానికి మన విశ్వాసం మనలను పురికొల్పాలి. (రోమీయులు 14:10-12; గలతీయులు 6:4, 5) యోబు విషయంలో చూసినట్లుగా, మనం ముఖ్యంగా మన సంపదలు, సుఖం, వ్యక్తిగత సంక్షేమం గురించే చింతిస్తామని, స్వార్థపూరిత ఉద్దేశంతోనే దేవుణ్ణి సేవిస్తామని సాతాను వాదిస్తాడు. కాని మనం నిజంగా రాజ్యాన్ని మొదట వెదకితే, వాస్తవానికి అపవాది పచ్చి అబద్ధికుడని నిరూపించడంలో మన వంతు మనం చేస్తాము. మన జీవితాల్లో దేవుని సేవకే ప్రథమ స్థానం ఉందని మనం రుజువు చేస్తాము. ఆ విధంగా మనం మన మాటల్లో, చేతల్లో యెహోవాపట్ల ప్రగాఢమైన ప్రేమను, ఆయన సర్వాధిపత్యానికి మన విశ్వసనీయమైన మద్దతును, తోటివారిపట్ల మన ప్రేమను రుజువు చేస్తాము.—యోబు 1:9-11; 2:4, 5; సామెతలు 27:11.
14. (ఎ) క్షేత్ర పరిచర్య కోసం పట్టిక వేసుకోవడం ఎందుకు ప్రయోజనకరం? (బి) సాక్షుల్లో అనేకులు క్షేత్ర పరిచర్యలో ఎంతమేరకు భాగం వహిస్తున్నారు?
14 ఒక పట్టిక వేసుకోవడం వల్ల, బహుశా మనం మామూలుగా చేసేదానికంటే ఎక్కువ చేయడానికి సహాయం లభించగలదు. తన సంకల్పం నెరవేర్చడానికి యెహోవాకు కూడా ‘ఒక నిర్ణయ కాలము’ ఉంది. (నిర్గమకాండము 9: 5; మార్కు 1:15) సాధ్యమైతే ప్రతివారం ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు నియమిత సమయాల్లో క్షేత్ర పరిచర్యలో పాల్గొనడం మంచిది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యెహోవాసాక్షులు సహాయ పయినీరు సేవ ప్రారంభించి, ప్రతిరోజు సువార్త ప్రకటించడానికి దాదాపు రెండు గంటలు వెచ్చిస్తున్నారు. వేలాదిమంది ఇతరులు క్రమ పయినీర్లుగా సేవ చేస్తున్నారు, వారు రోజుకు దాదాపు రెండున్నర గంటలు రాజ్య సందేశం ప్రకటించడానికి ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక పయినీర్లు, మిషనరీలు రాజ్య సేవలో మరిఎక్కువ సమయం గడుపుతున్నారు. వినడానికి సుముఖత చూపేవారికి అనియత సాక్ష్యమిచ్చి రాజ్య సందేశాన్ని పంచుకొనే అవకాశాల కోసం మనం కూడా వెదకవచ్చు. (యోహాను 4:7-15) మన పరిస్థితులు అనుమతించిన మేరకు ఆ సేవలో సంపూర్ణంగా పాల్గొనాలని మనం కోరుకోవాలి, ఎందుకంటే యేసు ఇలా ప్రవచించాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14; ఎఫెసీయులు 5:15-17.
15. మన పరిచర్యకు సంబంధించి, 1 కొరింథీయులు 15: 58 లోని సలహా సమయోచితమైనదని మీరెందుకు భావిస్తున్నారు?
15 యెహోవాసాక్షులు భూవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, తాము ఏ దేశంలో నివసిస్తున్నా ఈ సేవాధిక్యతలో ఐక్యంగా పాల్గొంటున్నారు. ఈ ప్రేరేపిత బైబిలు సలహాను వారు తమకు అన్వయించుకొంటున్నారు: “మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”—1 కొరింథీయులు 15:58.
పునఃసమీక్షా చర్చ
• ‘రాజ్యమును మొదట వెదకండి’ అని యేసు చెప్పినప్పుడు, రెండవ స్థానంలో దేనిని ఉంచమని ఆయన సూచిస్తున్నాడు?
• మన, మన కుటుంబాల భౌతిక అవసరాలను తీర్చే విషయంలో మన దృక్కోణం ఎలా ఉండాలి? దేవుడు మనకు ఎలాంటి సహాయం చేస్తాడు?
• రాజ్య సేవలో మనం ఏయే విధాలుగా భాగం వహించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[107వ పేజీలోని చిత్రం]
అంతం రాకముందు, నేడు యెహోవాసాక్షులు ప్రతి దేశంలో సువార్త ప్రకటిస్తున్నారు