కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘వారు లోకసంబంధులు కారు’

‘వారు లోకసంబంధులు కారు’

అధ్యాయం పద్దెనిమిది

‘వారు లోకసంబంధులు కారు’

1. (ఎ) యేసు తాను మరణించడానికి ముందు తన శిష్యుల తరఫున ఏమని ప్రార్థించాడు? (బి) “లోకసంబంధులు” కాకుండా ఉండడం ఎందుకంత ప్రాముఖ్యం?

 యేసు తాను చంపబడడానికి ముందు రాత్రి, తన శిష్యుల తరఫున ప్రార్థించాడు. సాతాను వారిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడని తెలిసిన యేసు, తన తండ్రితో ఇలా అన్నాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:​15, 16) లోకంనుండి వేరుగా ఉండడం ఎందుకంత ప్రాముఖ్యం? ఎందుకంటే సాతాను ఈ లోక పరిపాలకుడు. కాబట్టి అతని ఆధీనంలో ఉన్న లోకంతో సంబంధం పెంచుకోవాలని క్రైస్తవులు కోరుకోరు.​—⁠లూకా 4:​5-8; యోహాను 14:​30; 1 యోహాను 5:​19.

2. ఏయే విధాలుగా యేసు “లోకసంబంధి” కాడు?

2 లోకసంబంధి కాకుండా ఉండడం అంటే దానర్థం యేసుకు ఇతరులపై ప్రేమ లేదని కాదు. దానికి భిన్నంగా, ఆయన రోగులను స్వస్థపరిచాడు, మృతులను లేపాడు, దేవుని రాజ్యం గురించి ప్రజలకు బోధించాడు. ఆయన మానవజాతి కోసం తన ప్రాణమే అర్పించాడు. కాని సాతాను లోకపు స్వభావాన్ని కనపరిచే ప్రజల భక్తిహీన దృక్పథాలను, క్రియలను ఆయన ప్రేమించలేదు. అందుకే అనైతిక కోరికలు, ధనాపేక్షగల జీవన విధానం, ప్రధానత్వం కొరకు ప్రాకులాడడం వంటివాటికి దూరంగా ఉండమని ఆయన హెచ్చరించాడు. (మత్తయి 5:​27, 28; 6:​19-21; లూకా 20:​46, 47) కాబట్టి, యేసు కూడా లోక రాజకీయాలకు దూరంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆయన యూదుడే అయినా రోమన్లకు, యూదులకు మధ్యగల రాజకీయ వివాదాల్లో ఆయన ఎవరి పక్షమూ వహించలేదు.

“నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు”

3. (ఎ) పిలాతు దగ్గర యూదా మతనాయకులు యేసును ఏమని నిందించారు, ఎందుకు? (బి) మానవునిగా రాజు కావాలనే ఆసక్తి యేసుకు లేదని ఏది చూపిస్తోంది?

3 యూదా మతనాయకులు యేసును బంధించి, రోమా అధికారియైన పొంతిపిలాతు వద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. నిజానికి, యేసు ఆ నాయకుల వేషధారణను బయటపెట్టినందుకు వారు కలవరపడ్డారు. ఆ అధికారి యేసుపై చర్య తీసుకొనేలా చేసేందుకు ఆయన ఎదుట వారు యేసును ఇలా నిందించారు: “ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమి.” (లూకా 23: 2) అది అబద్ధమన్నది స్పష్టం, ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం యేసును రాజుగా చేయాలని ప్రజలు తలంచినప్పుడు, ఆయన తిరస్కరించాడు. (యోహాను 6:15) భవిష్యత్తులో తాను పరలోకపు రాజుగా ఉంటానని ఆయనకు తెలుసు. (లూకా 19:​11, 12) అంతేకాక ఆయనను ఏ మానవుడు కాదుగాని స్వయంగా యెహోవాయే సింహాసనాసీనుడిని చేస్తాడు.

4. పన్ను చెల్లించే విషయంలో యేసు ఎలాంటి దృక్పథాన్ని చూపించాడు?

4 యేసు బంధించబడడానికి కేవలం మూడు రోజుల ముందు, పన్ను చెల్లించే విషయంలో నేరారోపణ చేయడానికి వీలుగా యేసు ఏదైనా అనేలా చేయడానికి పరిసయ్యులు ప్రయత్నించారు. కాని ఆయన, “ఒక దేనారము [రోమా ప్రభుత్వ నాణెము] నాకు చూపుడి. దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివి?” అని ప్రశ్నించాడు. వారు “కైసరువి” అని చెప్పినప్పుడు ఆయన వారికిలా సమాధానమిచ్చాడు: “ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి.”​—⁠లూకా 20:​20-25.

5. (ఎ) యేసు తాను బంధించబడిన సమయంలో తన శిష్యులకు ఏ పాఠం నేర్పించాడు? (బి) యేసు తన చర్యల భావమేమిటో ఎలా వివరించాడు? (సి) ఆ న్యాయవిచారణ ఫలితమేమిటి?

5 ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని యేసు బోధించలేదు. యేసును బంధించడానికి రోమా సైనికులు, ఇతర పురుషులు వచ్చినప్పుడు, పేతురు కత్తి దూసి వారిలో ఒకరి చెవి నరికాడు. కాని యేసు ఇలా అన్నాడు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్తయి 26:​51, 52) ఆ తర్వాతి రోజు యేసు పిలాతుకు తన చర్యల భావమేమిటో వివరిస్తూ ఇలా అన్నాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు.” (యోహాను 18:​36) యేసుపై “మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు” అని పిలాతు ఒప్పుకున్నాడు. కాని జనసమూహపు ఒత్తిడికి తలవొగ్గి ఆయన యేసును వ్రేలాడదీయడానికి అప్పగించాడు.​—⁠లూకా 23:​13-15; యోహాను 19:​12-16.

శిష్యులు యేసు నాయకత్వాన్ని అనుసరించారు

6. తొలి క్రైస్తవులు తాము లోక స్వభావానికి దూరంగా ఉంటూనే ప్రజలను ప్రేమిస్తున్నామని ఎలా చూపించారు?

6 ఆ విధంగా, లోకసంబంధులు కాకుండా ఉండడమంటే ఏమిటో యేసు శిష్యులు అర్థం చేసుకున్నారు. దైవభక్తిలేని స్వభావానికి, లోకసంబంధ కార్యాలకు దూరంగా ఉండడం అంటే రోమన్‌ సర్కస్‌కు, థియేటర్‌లలో ప్రదర్శించబడే హింస, లైంగిక దుర్నీతిగల వినోదానికి దూరంగా ఉండడం అని దానర్థం. ఆ కారణంగానే శిష్యులు మానవ ద్వేషులు అని పిలువబడ్డారు. అయితే వారు తమ తోటి మానవులను ద్వేషించే బదులు, రక్షణకొరకు దేవుడు చేసిన ఏర్పాట్లనుండి ప్రయోజనం పొందేలా ఇతరులకు సహాయపడేందుకు ఎంతో కృషి చేశారు.

7. (ఎ) లోకసంబంధులు కాకుండా ఉన్నందువల్ల తొలి శిష్యులు ఏమి అనుభవించారు? (బి) రాజకీయ పాలకులను, పన్ను చెల్లించడాన్ని వారు ఎలా దృష్టించారు, ఎందుకు?

7 యేసులాగే ఆయన అనుచరులు కూడా, తరచూ తప్పుడు సమాచారం ఇవ్వబడిన ప్రభుత్వాధికారులచేత హింసించబడ్డారు. అయినప్పటికి, దాదాపు సా.శ. 56 లో, అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులకు ఉద్బోధిస్తూ ఇలా వ్రాశాడు: “పై అధికారులకు [రాజకీయ పాలకులకు] లోబడియుండ వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు.” అంటే యెహోవాయే లౌకిక ప్రభుత్వాలను స్థాపించాడని కాదుగాని ఈ భూమంతటిపై తన రాజ్యం మాత్రమే పరిపాలించే కాలం వచ్చేవరకు ఆ ప్రభుత్వాలు ఉండడానికి ఆయన అనుమతిస్తున్నాడు. కాబట్టి లౌకిక అధికారులను గౌరవించి, పన్ను చెల్లించాలని పౌలు క్రైస్తవులకు సముచితంగానే సలహా ఇచ్చాడు.​—⁠రోమీయులు 13:​1-7; తీతు 3: 1, 2.

8. (ఎ) క్రైస్తవులు పై అధికారులకు ఎంతమేరకు లోబడివుండాలి? (బి) తొలి క్రైస్తవులు యేసు మాదిరిని ఎలా అనుసరించారు?

8 అయితే ప్రభుత్వ పాలకులకు సాపేక్షిక విధేయత చూపించాలే తప్ప సంపూర్ణ విధేయత కాదు. యెహోవా నియమాలతో, మానవ నియమాలు విభేదించినప్పుడు, యెహోవా సేవకులు ఆయన నియమాలకే లోబడాలి. ఆన్‌ ద రోడ్‌ టు సివిలైజేషన్‌​—⁠ఎ వరల్డ్‌ హిస్టరీ అనే పుస్తకం తొలి క్రైస్తవుల గురించి ఏమని చెబుతుందో గమనించండి: “క్రైస్తవులు రోమన్‌ పౌరుల విధులు కొన్ని పాటించడానికి నిరాకరించారు. ఆ క్రైస్తవులు . . . సైనిక సేవ చేయడం తమ విశ్వాస ఉల్లంఘనగా భావించారు. వారు రాజకీయ పదవులను చేపట్టలేదు. వారు చక్రవర్తిని ఆరాధించలేదు.” యూదుల మహాసభ ప్రకటించవద్దని శిష్యులకు ‘ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు,’ వారిలా సమాధానమిచ్చారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.”​—⁠అపొస్తలుల కార్యములు 5:​27-29.

9. (ఎ) యెరూషలేములోని క్రైస్తవులు సా.శ. 66వ సంవత్సరంలో తీసుకున్న చర్య ఎందుకు తీసుకున్నారు? (బి) అది ఏ విధంగా ఒక విలువైన ప్రమాణం?

9 రాజకీయ, సైనిక వివాదాలకు సంబంధించి శిష్యులు సంపూర్ణ తటస్థతను పాటించారు. సా.శ. 66వ సంవత్సరంలో యూదయలోని యూదులు కైసరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. రోమా సైన్యాలు వెంటనే యెరూషలేమును చుట్టుముట్టాయి. ఆ నగరంలోని క్రైస్తవులు ఏమి చేశారు? ఆ నగరం నుండి వెళ్ళిపోవాలని యేసు ఇచ్చిన సలహాను వారు జ్ఞాపకం చేసుకున్నారు. రోమా సైన్యం తాత్కాలికంగా ఉపసంహరించుకున్నప్పుడు, క్రైస్తవులు యొర్దాను నది దాటి పెల్లా అనే కొండల ప్రాంతానికి పారిపోయారు. (లూకా 21:​20-24) వారి తటస్థత, ఆ తర్వాతి నమ్మకమైన క్రైస్తవులకు ఒక ప్రమాణంగా పనిచేస్తోంది.

అంత్యదినాల్లో క్రైస్తవుల తటస్థత

10. (ఎ) యెహోవాసాక్షులు నిర్విరామంగా ఏ పని చేస్తున్నారు, ఎందుకు? (బి) వారు ఏ విషయంలో తటస్థంగా ఉన్నారు?

10 తొలి క్రైస్తవులను అనుకరిస్తూ ఈ అంత్యదినాల్లో తటస్థత కాపాడుకొన్న గుంపు ఏదైనా ఉందని చరిత్ర చూపిస్తోందా? అవును, యెహోవాసాక్షులు అలా చేశారని చూపిస్తోంది. ఈ కాలమంతటిలో వారు, నీతిని ప్రేమించేవారికి శాశ్వతమైన శాంతి సౌభాగ్యాలను, సంతోషాన్ని కేవలం దేవుని రాజ్యమే తీసుకువస్తుందని ప్రకటిస్తూనే ఉన్నారు. (మత్తయి 24:​14) అయితే వివిధ దేశాల వివాదాలకు సంబంధించి మాత్రం వారు సంపూర్ణ తటస్థతను పాటించారు.

11. (ఎ) సాక్షుల తటస్థత, మతనాయకుల పనులకు ఎలా భిన్నంగా ఉంది? (బి) రాజకీయాలకు సంబంధించి ఇతరులు చేసేవాటిని యెహోవాసాక్షులు ఎలా దృష్టిస్తారు?

11 దానికి పూర్తి భిన్నంగా, ఈ ప్రపంచ మతాల మతనాయకులు రాజకీయ వ్యవహారాల్లో కూరుకుపోయారు. కొన్నిదేశాల్లో వారు అభ్యర్థులకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా చురుగ్గా ప్రచారం చేశారు. కొందరు మతనాయకులు రాజకీయ పదవులు కూడా చేపట్టారు. మరికొందరైతే, మతనాయకులు ఆమోదించే కార్యక్రమాలనే ఆదరించాలని రాజకీయ నాయకులపై ఒత్తిడి తెచ్చారు. అయితే యెహోవాసాక్షులు రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. రాజకీయ పార్టీలో చేరడం, రాజకీయ పదవి చేపట్టడం లేదా ఎన్నికల్లో ఓటు వేయడం వంటివి చేయకుండా ఇతరులను ఆపుచేయడానికి వారు ప్రయత్నించరు. తన శిష్యులు లోకసంబంధులు కారని యేసు చెప్పాడు కాబట్టి, యెహోవాసాక్షులు రాజకీయాల్లో పాలుపంచుకోరు.

12. ఈ లోకపు మతాలు తటస్థంగా లేనందువల్ల ఏమి జరిగింది?

12 యేసు ప్రవచించినట్లుగా దేశాలు పదేపదే యుద్ధాలు చేశాయి. ఆయా దేశాల్లోని చీలిక వర్గాలు సహితం పరస్పరం పోరాడాయి. (మత్తయి 24: 3, 6, 7) మతనాయకులు దాదాపు అన్ని సందర్భాల్లో ఒక దేశానికో లేదా చీలిక వర్గానికో మద్దతునిచ్చి, తమ అనుచరులు కూడా అలాగే చేయాలని వారిని ప్రోత్సహించారు. దాని ఫలితం? ఒకే మతానికి చెందిన సభ్యులు కేవలం తమ దేశం లేదా తెగ విభేదాల కారణంగా ఒకరినొకరు పోరాటాల్లో చంపుకున్నారు. అది దేవుని చిత్తానికి విరుద్ధం.​—⁠1 యోహాను 3:​10-12; 4:​8, 20.

13. యెహోవాసాక్షుల తటస్థత గురించిన వాస్తవాలు ఏమని చూపిస్తున్నాయి?

13 అయితే యెహోవాసాక్షులు పోరాటాలన్నింటిలోను తమ తటస్థత కాపాడుకొన్నారు. నవంబరు 1, 1939, కావలికోట (ఆంగ్లం) సంచిక ఇలా నివేదించింది: “ప్రభువు పక్షాన ఉన్నవారందరు యుద్ధంచేస్తున్న దేశాలకు సంబంధించి తటస్థంగా ఉంటారు.” అన్ని దేశాల్లోని యెహోవాసాక్షులు అన్ని పరిస్థితుల్లో ఇదే స్థానం కాపాడుకొంటారు. తమ అంతర్జాతీయ సహోదరత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ లోకపు విభాగించే రాజకీయాలకు, యుద్ధాలకు తావివ్వరు. వారు ‘తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొడతారు.’ వారు తటస్థంగా ఉంటూ యుద్ధం చేయడాన్ని నేర్చుకోవడం మానివేస్తారు.​—⁠యెషయా 2:​3, 4; 2 కొరింథీయులు 10: 3, 4.

14. లోకమునుండి వేరుగా ఉండడం వల్ల యెహోవాసాక్షులు ఏమి అనుభవించారు?

14 వారి తటస్థతకు ఒక ఫలితమేమిటి? యేసు ఇలా అన్నాడు: “మీరు లోకసంబంధులు కారు; . . . అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.” (యోహాను 15:19) దేవుని సేవకులుగా ఉన్నందుకు యెహోవాసాక్షులు అనేకులు జైళ్ళ పాలయ్యారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు జరిగినట్లే కొందరు చిత్రహింసలపాలయ్యారు, చివరకు చంపబడ్డారు. ఎందుకంటే “ఈ యుగ సంబంధమైన దేవత” అయిన సాతాను, లోక సంబంధులుకాని యెహోవా సేవకులను వ్యతిరేకిస్తున్నాడు.​—⁠2 కొరింథీయులు 4: 4; ప్రకటన 12:​12.

15. (ఎ) దేశాలన్ని ఎటువైపు పయనిస్తున్నాయి, యెహోవాసాక్షులు దేనిని తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉన్నారు? (బి) లోకంనుండి వేరుగా ఉండడం ఎందుకంత గంభీరమైన విషయం?

15 యెహోవా సేవకులు తాము ఈ లోక సంబంధులు కానందుకు సంతోషిస్తున్నారు, ఎందుకంటే ఈ లోకపు దేశాలన్ని హార్‌మెగిద్దోనులో అంతం కావడానికి ముందుకు సాగుతున్నాయి. (దానియేలు 2:​44; ప్రకటన 16:​14, 16; ప్రకటన 19:​11-21) మనం ఈ లోకం నుండి వేరుగా ఉన్నాము కాబట్టి ఆ దుస్థితి నుండి తప్పించుకుంటాము. భూవ్యాప్తంగా ఐక్యమైన ప్రజలుగా మనం దేవుని పరలోక రాజ్యానికి విశ్వసనీయంగా ఉంటాము. నిజమే, ఈ లోకసంబంధులు కానందువల్ల, మనం ఈ లోకపు ఎగతాళికి, హింసకు గురవుతాము. అయితే అతి త్వరలోనే, సాతాను ఆధీనంలో ఉన్న ప్రస్తుత దుష్టలోకము శాశ్వతంగా నాశనం చేయబడుతుంది కాబట్టి అవి గతించిపోతాయి. మరోవైపున యెహోవాను సేవించేవారు దేవుని రాజ్యాధికారంలో ఆయన నీతియుక్త నూతనలోకంలో నిరంతరం జీవిస్తారు.​—⁠2 పేతురు 3:​10-13; 1 యోహాను 2:​15-17.

[అధ్యయన ప్రశ్నలు]

పునఃసమీక్షా చర్చ

• “లోకసంబంధులు” కాకుండా ఉండడంలో ఏమి చేరివుందో యేసు ఎలా చూపించాడు?

• తొలి క్రైస్తవులు (ఎ) లోక వైఖరి పట్ల, (బి) లౌకిక పరిపాలకుల పట్ల, (సి) పన్నులు చెల్లించడం పట్ల ఎలాంటి దృక్పథాన్ని చూపించారు?

• ఆధునిక కాలాల్లోని యెహోవాసాక్షులు ఏయే విధాలుగా తమ క్రైస్తవ తటస్థతకు నిదర్శనం ఇచ్చారు?

[165వ పేజీలోని చిత్రం]

తాను తన అనుచరులు “లోకసంబంధులు కారు” అని యేసు వివరించాడు