కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఎడతెగక రాజ్యమును మొదట వెదకండి’

‘ఎడతెగక రాజ్యమును మొదట వెదకండి’

అధ్యాయం 11

‘ఎడతెగక రాజ్యమును మొదట వెదకండి’

1. (ఎ) యేసు 1,900 సంవత్సరాల క్రితమే రాజ్యాన్ని మొదట వెదకుడని ఎందుకు చెప్పాడు? (బి) మనకైమనమే ఏ ప్రశ్న వేసుకోవాలి?

దాదాపు 1,900 సంవత్సరాల క్రితం గలిలయలో ఇచ్చిన ప్రసంగమందు యేసు తన శిష్యులకిలా ఉద్బోధించాడు: “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి.” కాని ఎందుకు? అనేక శతాబ్దాల తర్వాత కదా క్రీస్తు సింహాసనం అధిరోహించేది? అవును. అయితే ఆ మెస్సీయ రాజ్యం ద్వారానే యెహోవా పరిశుద్ధ నామము మహిమపర్చబడి, భూమియెడలగల ఆయన దివ్య సంకల్పం నెరవేర్చబడుతుంది. దీని ప్రాముఖ్యతను నిజంగా గుణగ్రహించువారెవరైనా ఆ రాజ్యానికి తమ జీవితంలో మొదటి స్థానం ఇస్తారు. మొదటి శతాబ్దంలో అది నిజమైంది, మరి ఆ రాజ్య పాలన జరుగుతున్న ఈ కాలంలో అది మరింత వాస్తవమే. దేవుని రాజ్యాన్ని మీరు మొదట వెదకుతున్నారని మీ జీవనశైలి చూపిస్తున్నదా?—మత్త. 6:33.

2. సాధారణ ప్రజానీకం ఆత్రంగా ఎట్టి విషయాలను వెంబడిస్తున్నారు?

2 సాధారణ ప్రజానీకం ఇతర విషయాలయెడల ఎక్కువ శ్రద్ధ కలిగివున్నారు. ఆత్రంగా వారు ఐశ్వర్యాన్ని, దుస్తుల్ని, ఆహారాన్ని, ఇతర వస్తుసంపదల్ని, డబ్బుకొనగల ఇతర సుఖాల్ని వెంబడిస్తున్నారు. (మత్త. 6:31, 32) వారి జీవనశైలి వారు స్వార్థంతో, సుఖాలతో నిండివుండటాన్ని ప్రతిబింబిస్తుంది. ఒకవేళ వారు దేవున్ని నమ్మినా, వారి జీవితాల్లో ఆయనకు రెండవ స్థానమే ఇస్తున్నారు.

3. (ఎ) ఎట్టి ధనాన్ని వెదకమని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు, ఎందుకు? (బి) వస్తుదాయక అవసరతలయెడల అమితంగా ఎందుకు చింత కలిగియుండనవసరం లేదు?

3 అయితే అట్టి ఆస్తుల్లో ఏవియు శాశ్వతంకాదు గనుక యేసు తన శిష్యులనిలా హెచ్చరించాడు: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు.” దానికి బదులు, యెహోవాను సేవించుట ద్వారా “పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడని” ఆయనన్నాడు. ఒకే విషయంమీద అనగా దేవుని చిత్తం చేయుటపై దృష్టినిల్పుతూ వారి కళ్లను “తేటగా” ఉంచుకొమ్మని ఆయన తన శిష్యులకు ఉద్బోధించాడు. “మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరని” ఆయన వారికి చెప్పాడు. అయితే వస్తుదాయక అవసరతలైన ఆహారము, దుస్తులు, ఇల్లు అనువాటి విషయమేమి? “చింతింపకుడని” యేసు సలహాయిచ్చాడు. దేవుడు పోషించే ఆకాశపక్షులవైపు ఆయన వారి అవధానం మళ్లించాడు. పువ్వులను దేవుడే అందంగా అలంకరిస్తున్నాడని చెబుతూ, వాటినుండి పాఠం నేర్చుకొమ్మని ఆయన తన అనుచరులను ప్రోత్సహించాడు. యెహోవాయొక్క తెలివిగల మానవ సేవకులు వీటిలో వేటికంటెను మిక్కిలి విలువగల వారుకారా? “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడునని” యేసు చెప్పాడు. (మత్త. 6:19-34) మీరు దానిని నమ్ముతున్నారా? ఆలాగని మీ క్రియలు చూపిస్తున్నాయా?

రాజ్యసత్యాన్ని అణగారిపోనివ్వకండి

4. వస్తుదాయక విషయాలకు ఒక వ్యక్తి అమిత ప్రాముఖ్యతనిస్తే, దాని ఫలితమేమైయుంటుంది? ఉదహరించండి.

4 వస్తుసంపదపై ఒక వ్యక్తికి అమితమైన చింతవుంటే, దాని ఫలితాలు విపత్కరంగా ఉండగలవు. తనకు రాజ్యాసక్తి ఉన్నదని అతడు చెప్పుకొన్ననూ, హృదయమందు ఇతర సంగతులకు ప్రథమ స్థానమిస్తే, అతనిలోని రాజ్యాసక్తి అణగారిపోతుంది. (మత్త. 13:18, 19, 22) ఉదాహరణకు, ఓ సందర్భంలో ధనవంతుడైన ఒక యౌవన అధికారి, “నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని” యేసును అడిగాడు. యేసు జవాబుకు అతడిచ్చిన ప్రత్యుత్తరము అతడు నైతిక జీవితాన్ని గడుపుతూ, ఇతరులను మంచిగా చూసేవాడని చూపింది. అయితే అతడు అమితంగా తన ఆస్తిపాస్తులను అంటిపెట్టుకున్నాడు. క్రీస్తు అనుచరుడయ్యేందుకు అతడు వాటిని విడిచిపెట్టలేకపోయాడు. అలా అతడు పరలోక రాజ్యమందు క్రీస్తుతోడి పరిపాలకుడుకాగల మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఆ సందర్భమందు యేసు చెప్పినట్లుగా, “ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.”—మార్కు 10:17-23.

5. (ఎ) వేటితో తృప్తికలిగి ఉండమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు, ఎందుకు? (బి) సాతాను “ధనాపేక్షను” నాశనకరమైన ఉరిగా ఎలా ఉపయోగిస్తాడు?

5 అనేక సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు సంపన్న వాణిజ్య కేంద్రమగు ఎఫెసులోనున్న తిమోతికి లేఖ వ్రాస్తూ ఆయనకిలా జ్ఞాపకంచేశాడు: “మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొనిపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తిపొందియుందము.” తనకు తన కుటుంబం కొరకు తగిన “అన్నవస్త్రములు” సమకూర్చుటకు పనిచేయుట సరియే. అయితే పౌలు ఇలా హెచ్చరించాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.” సాతాను వట్టి మోసకారి. మొదట అతడు ఒక వ్యక్తిని చిన్న విషయాల్లోకి లాగవచ్చు. అయితే తరచు వాటివెంట మరి పెద్దదైన ఒత్తిడి అనగా అంతకుముందు బహుశ ఆత్మీయ విషయాలకు కేటాయించిన సమయాన్నే కోరే ఎక్కువ జీతంవచ్చే ప్రమోషన్‌ కొరకైన అవకాశంవంటి ఒత్తిడే రావచ్చును. మనం జాగ్రత్తగా ఉండనట్లయిన, అన్నింటికంటే ప్రాముఖ్యమైన రాజ్యాసక్తులను ఈ “ధనాపేక్ష” అణగార్చివేయగలదు. పౌలు అన్నట్లుగా, “కొందరు దానిని [ధనాన్ని] ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మునుతామే పొడుచుకొనిరి.”—1 తిమో. 6:7-10.

6. (ఎ) ఆ ఉరిలో చిక్కుకొనకుండా తప్పించుకొనుటకు, మనమేమి చేయాలి? (బి) నేటి ప్రపంచ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది ఆచరణయోగ్యమా?

6 తన క్రైస్తవ సహోదరునిపైగల నిజమైన ప్రేమతో పౌలు తిమోతినిలా వేడుకున్నాడు: “నీవైతే వీటిని విసర్జించి,” “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము.” (1 తిమో. 6:11, 12) మన చుట్టువున్న ఐశ్వర్యాసక్తిగల జీవన విధానంతోపాటు కొట్టుకొనిపోకుండా తప్పించుకోవాలంటే మనం చిత్తశుద్ధితో కృషిచేయాల్సిన అవసరముంది. ఆలాగే మన విశ్వాసానికి పొందికగా మనమీ పోరాటంచేస్తే, యెహోవా మనల్ని ఎన్నడూ ఎడబాయడు. ధరలెట్లున్నా, నిరుద్యోగమెంత విస్తారంగావున్నా, మనకు నిజంగా అవసరమైన వాటిని ఆయన నిశ్చయంగా దయచేస్తాడు.—హెబ్రీ. 13:5, 6.

తొలిశిష్యులు మాదిరినుంచారు

7. ఇశ్రాయేలునందు ప్రకటించుటకు యేసు తన శిష్యులను పంపినప్పుడు, వారికెటువంటి ఉపదేశాలిచ్చాడు, అవెందుకు సరియైయుండెను?

7 తన అపొస్తలులకు తగిన శిక్షణనిచ్చిన తర్వాత ఇశ్రాయేలునందు సువార్త ప్రకటించడానికి యేసు వారిని పంపాడు. “పరలోకరాజ్యము సమీపించియున్నది.” అదెంత పులకింత కలుగజేయు వర్తమానమో గదా! మెస్సీయ రాజగు యేసుక్రీస్తు వారి మధ్య ఉన్నాడు. అపొస్తలులు దేవుని సేవకు సమర్పించుకుంటున్నారు గనుక, వారియెడల దేవుడు శ్రద్ధ చూపిస్తాడనే నమ్మకం కలిగివుండుడని యేసు వారికి ఉద్బోధించాడు. ఆయనిలా చెప్పాడు: “మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొనిపోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.” (మత్త. 10:5-10; లూకా 9:1-6; 10:4-7) ఇశ్రాయేలీయుల మధ్య క్రొత్తవారికి ఆతిథ్యమిచ్చుట ఆచారము గనుక, ఆ తోటివారి ద్వారా వారి అవసరతలు తీర్చబడునట్లు యెహోవా చూడగలడు.

8. (ఎ) తన మరణానికి కొంచెంముందు యేసు వారికెందుకు భిన్నమైన ఉపదేశాలిచ్చాడు? (బి) అయిననూ, వారి జీవితాల్లో ఇంకనూ ఏది మొదటి స్థానంలో ఉండాలి?

8 తన అపొస్తలులు మారిన పరిస్థితులందు పనిచేయాల్సి ఉంటుందనే వాస్తవిక విషయాన్ని ఆ తర్వాత, అనగా తన మరణానికి కొద్దికాలం ముందు యేసు వారికి గుర్తుచేశాడు. అధికారికంగా కలిగే వ్యతిరేకత ఫలితంగా ఇశ్రాయేలునందు ఆతిథ్యమివ్వడం జరుగకపోవచ్చు. అంతేకాకుండ, వారు త్వరలోనే రాజ్య వర్తమానాన్ని అన్యులయొద్దకు తీసుకొనివెళ్తారు. ఇప్పుడు వారు తమతోకూడ “సంచియు జాలెయు” తీసుకెళ్లాలి. అయిననూ, వారు తమ కవసరమయ్యే అన్నవస్త్రాలు సంపాదించే తమ ప్రయత్నాల్ని దేవుడు ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో యెహోవా రాజ్యాన్ని ఎడతెగక మొదట వెదకాలి.—లూకా 22:35-37.

9. (ఎ) పౌలు ఎలా రాజ్యాన్ని మొదటి స్థానంలో ఉంచాడు? (బి) ఆయన భౌతికావసరతలు ఎలా తీర్చబడ్డాయి? (సి) ఈ విషయాల మీద ఆయన ఇతరులకు ఏ సలహానిచ్చాడు?

9 యేసు సలహాను ఎలా అన్వయించాలో చూపుటకు అపొస్తలుడైన పౌలు చక్కని మాదిరిని ఉంచాడు. పరిచర్య చుట్టే పౌలు తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. (అపొ. 20:24, 25) ప్రకటించడానికి ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు, ఆయన డేరాలు కుడుతూ తనకవసరమైనవి తానే సమకూర్చుకున్నాడు. ఇతరులు తనను పోషించాలని ఆయన ఎదురుచూడలేదు. (అపొ. 18:1-4; 1 థెస్స. 2:9; 1 కొరిం. 9:18) అయిననూ, తమ ప్రేమాభిమానాల్ని వ్యక్తపర్చడానికి ఇతరులు ఆతిథ్యాన్ని, బహుమతుల్ని ఇచ్చినప్పుడు ఆయన కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరించాడు. (అపొ. 16:15, 34; ఫిలి. 4:15-17) ప్రకటించ వెళ్లడానికి తమ కుటుంబ బాధ్యతల్ని నిర్లక్ష్యపరచుటకు ఆయన క్రైస్తవ స్త్రీపురుషులను ప్రోత్సహించలేదు, బదులుగా వివిధ బాధ్యతల్ని వారు సమతూకంగా నిర్వర్తించాలని ఆయనన్నాడు. తమ చేతులతో పనిచేయాలని, తమ కుటుంబాల్ని ప్రేమించాలని, విరివిగా ఇతరులతో పంచుకోవాలని ఆయన వారికి సలహాయిచ్చాడు. (ఎఫె. 4:28; 2 థెస్స. 3:7-12; తీతు 2:3-5) ఆస్తిపాస్తులందు కాక, దేవునియందు నమ్మకముంచి, జీవితంలో మరి ప్రాముఖ్యమైనవేవో తాము నిజంగా అర్థం చేసుకున్నామని చూపించేలా వారు జీవించాలని కూడ ఆయన వారికి ఉద్బోధించాడు. యేసు బోధల కనుగుణ్యముగా, దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదకుటయే దానర్థం.—ఫిలి. 1:9-11.

మీ జీవితంలో ఆ రాజ్యాన్ని మొదట ఉంచండి

10. (ఎ) ‘మొదట రాజ్యాన్ని వెదకుడి’ అంటే దానిభావమేమి? (బి) అయితే దేనిని నిర్లక్ష్యం చేయకూడదు?

10 వ్యక్తిగతంగా మనమెంతమేరకు రాజ్య సువార్తను ఇతరులతో పంచుకుంటున్నాము? అది కొంతమేరకు మన పరిస్థితులపై, అంతకంటే ఎక్కువగా మన ప్రగాఢ ప్రశంసపై ఆధారపడివుంటుంది. ‘మీకేం పనిలేనప్పుడు ఆ రాజ్యాన్ని వెదకమని’ యేసు చెప్పలేదని గుర్తుంచుకోండి. లేక ‘అప్పుడప్పుడు ఆ రాజ్యాన్ని గూర్చి మీరు మాట్లాడినంత కాలం, మీరు అవసరమైన దానినే చేస్తున్నారనీ’ ఆయన అనలేదు. లేదా ‘రాజ్యాసక్తుల్ని ఆసక్తిగా ఆరంభించండి, అయితే నూతన విధానం రావడం ఇంకా ఆలస్యం అవుతుందని అన్పించినప్పుడు, ఎక్కువగా ఇతర ప్రజలవలె జీవిస్తూ దేవుని సేవలో ఏదొకటి చేస్తుండండి’ అనీ ఆయన చెప్పలేదు. ఆ రాజ్య ప్రాముఖ్యతను బాగుగా ఎరిగియుండి, ఆ విషయమై తన తండ్రి చిత్తాన్ని వ్యక్తంచేస్తూ ఆయనిట్లన్నాడు: “ఆయన రాజ్యమును ఎడతెగక వెదకుడి.” లేదా, అపొస్తలుడైన మత్తయి వ్రాసినట్లుగా: “ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుచునే యుండుడి.” (లూకా 12:31 NW; మత్త. 6:33 NW) మన కుటుంబాల భౌతిక అవసరతలు తీర్చడానికి మనలో ఎక్కువమంది ఏదోక పనిచేయాల్సి ఉన్ననూ, మనకు నిజమైన విశ్వాసముంటే, దేవునిరాజ్య సంబంధముగా ఆయన మనకిచ్చిన పనిచుట్టే మన జీవితాలు పరిభ్రమిస్తుంటాయి. అదే సమయంలో మనం మన కుటుంబ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయము.—1 తిమో. 5:8; సామె. 29:15.

11. (ఎ) రాజ్య వర్తమానం వ్యాప్తిచేయుటలో అందరూ ఒకేలా పనిచేయలేరనే వాస్తవాన్ని యేసు ఎలా ఉదహరించాడు? (బి) ఏయే విషయాలు దీనిపై ప్రభావం చూపుతాయి?

11 మనలో కొందరం ప్రాంతీయ పరిచర్యలో ఇతరులకంటే ఎక్కువ సమయం వెచ్చించగల వారిగా ఉంటాము. అయితే వివిధ రకాల నేలలను గూర్చిచెప్పిన తన ఉపమానమందు మంచి నేలను పోలిన హృదయంగల వారందరు ఫలిస్తారని యేసు చెప్పాడు. ఎంతమేరకు? ఆయావ్యక్తుల పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. వయస్సు, ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. అయితే నిజమైన ప్రశంస ఉన్నప్పుడు ఎంతో నెరవేర్చవచ్చును.—మత్త. 13:19, 23.

12. యోగ్యమగు ఏ ఆత్మీయ గమ్యాన్నిగూర్చి ఆలోచించాలని యౌవనస్థులు ప్రత్యేకంగా ప్రోత్సహింపబడుతున్నారు?

12 రాజ్య పరిచర్యలో మన భాగాన్ని విస్తరింపజేయడానికి మనకు సహాయపడే గమ్యాల్ని కలిగివుండుట మంచిది. యౌవనస్థులు ఆసక్తిగల యౌవన క్రైస్తవుడగు తిమోతియొక్క శ్రేష్ఠమైన మాదిరిని గూర్చి గంభీరంగా ఆలోచించాలి. (ఫిలి. 2:19-22) పాఠశాల విద్యను వారు పూర్తిచేసినప్పుడు పూర్తికాల పరిచర్యలో ప్రవేశించుటకంటే వారికి మరేది శ్రేష్ఠమై ఉండగలదు? యోగ్యమైన ఆత్మీయ గమ్యాల్ని పెట్టుకోవడం ద్వారా పెద్దవారు సహితం ప్రయోజనం పొందుతారు.

13. (ఎ) రాజ్యసేవలో వ్యక్తిగతంగా మీరెంత చేయగలరో ఎవరు నిర్ణయిస్తారు? (బి) రాజ్యాన్ని మనం నిజంగా మొదట వెదకినట్లయిన, ఇది దేన్ని నిరూపిస్తుంది?

13 ఎక్కువ చేయగలరని మనం భావించిన వారిని విమర్శించుటకు బదులు, మన స్వంత పరిస్థితులు అనుమతించినంత మేరకు దేవుని పూర్తిగా సేవించులాగున వ్యక్తిగత పురోగతి కొరకు పనిచేయుటకు మనం విశ్వాసం ద్వారా కదలింపబడాలి. (రోమా. 14:10-12; గల. 6:4) యోబు విషయమందు చూపబడినట్లుగా, మనం ముఖ్యంగా మన ఆస్తిపాస్తులమీద, మన సుఖం, వ్యక్తిగత క్షేమంమీదే మనకు శ్రద్ధని, దేవుని సేవించే మన ఉద్దేశం స్వార్థపూరితమని సాతాను వాదం. అయితే మనం నిజంగా రాజ్యాన్ని మొదట వెదకినట్లయిన, అపవాది ఎప్పటివలెనే పచ్చి అబద్ధికుడని నిరూపించుటలో మనవంతు కలిగినవారమైయుంటాము. మన జీవితాల్లో ఆస్తిపాస్తులు లేదా మన వ్యక్తిగత సౌఖ్యం కాదుగాని దేవునిసేవయే ప్రథమ స్థానంలో ఉందని నిరూపిస్తాము. ఆ విధంగా మన మాటల్లో, చేతల్లో యెహోవాయెడల మనకున్న ప్రగాఢమైన ప్రేమను, ఆయన సర్వాధిపత్యానికి మన యథార్థ మద్దతును, మన తోటివారియెడల మనకున్న ప్రేమను రూఢిపరుస్తాము.—సామె. 27:11; యోబు 1:9-11; 2:4, 5.

14. (ఎ) ప్రాంతీయ సేవకొరకొక పట్టిక వేసికోవడం ఎందుకు ప్రయోజనకరం? (బి) ప్రాంతీయ పరిచర్యలో అనేకమంది సాక్షులు ఎంతమేరకు భాగం వహిస్తున్నారు, ఎందుకు?

14 ఓ పట్టిక వేసుకోవడంవలన బహుశ మనమిప్పుడు చేసేదానికంటే ఎక్కువ నెరవేర్చడానికి మనకు సహాయం చేస్తుంది. తన సంకల్పం నెరవేర్చడానికి యెహోవాయే ‘నిర్ణయకాలాలు’ కలిగివున్నందున మనమాయనను అనుకరించుట శ్రేష్ఠము. (నిర్గ. 9:5; మార్కు 1:15; గల. 4:4) సాధ్యమైతే ప్రతివారంలో ఒకటి రెండుసార్లు నియమిత సమయంలో ప్రాంతీయ పరిచర్యలో భాగం వహించుట మంచిది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యెహోవాసాక్షులు సహాయపయినీర్లుగా, ప్రతిరోజు సగటున రెండు లేదా అంతకంటే ఎక్కువగంటలు సువార్త సేవలో గడుపుతున్నారు. కొందరు దీనిని క్రమంగాచేస్తుండగా, మరికొందరు సంవత్సరంలో కొన్నిసార్లు చేస్తున్నారు. ఇంకా అనేక వేలమంది క్రమపయినీర్లు రాజ్య సువార్త ప్రకటించుటకు ప్రతిరోజు సగటున మూడుగంటలు వెచ్చిస్తున్నారు. మరితరులు ప్రత్యేకపయినీర్లుగా, మిషనరీలుగా రాజ్యసేవలో మరియెక్కువ సమయం గడుపుతున్నారు. మనం ప్రత్యక్షంగా ప్రాంతీయ పరిచర్యలో ఉన్ననూ లేకపోయిననూ, వినేవారుంటే సరియైన ప్రతి సందర్భంలో రాజ్య నిరీక్షణను వారితో పంచుకొనే అవకాశాలను మనం వెదకవచ్చు. (యోహాను 4:7-15 పోల్చండి.) “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని యేసుచెప్పిన ప్రవచన భావాన్నిగూర్చి మనందరము గంభీరంగా తలంచాలి. మన పరిస్థితులు అనుమతించిన మేరకు ఆ సేవలో పూర్తిగా భాగంవహించాలనే కోరిక మనకుండాలి.—మత్త. 24:14; ఎఫె. 5:15-17.

15. మన పరిచర్య సంబంధముగా, 1 కొరింథీయులు 15:58 నందలి సలహా సమయానుసారమైందని మీరెందుకు భావిస్తారు?

15 ఏ దేశమందు నివసించిననూ, ప్రపంచ వ్యాప్తంగా యెహోవాసాక్షులు ఏకభావంతో ఈ మహాగొప్ప సేవాధిక్యతయందు చురుకుగా పాల్గొంటున్నారు. ఈ ప్రేరేపిత బైబిలు సలహాను వారు తమకుతాము అన్వయించుకుంటున్నారు: “మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”—1 కొరిం. 15:58.

పునఃసమీక్షా చర్చ

• రాజ్యాన్ని మొదట వెదకుడని యేసు చెప్పినప్పుడు, దేనిని రెండవ స్థానంలో ఉంచమని ఆయన సూచిస్తున్నాడు?

• మన కుటుంబాల భౌతిక అవసరతలు తీర్చే విషయంలో మనమే దృక్కోణం కలిగివుండాలి? దేవుడు మనకెట్టి సహాయం చేస్తాడు?

• రాజ్యసేవలో భాగం వహిస్తున్నంత కాలం, దానిలో మనమెంత సేవ చేస్తున్నామనేది ప్రాముఖ్యమా? ఎందుకు?

[అధ్యయన ప్రశ్నలు]