కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి”

“ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి”

అధ్యాయం 17

“ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి”

1, 2. (ఎ) యెహోవాసాక్షుల కూటాల్లో క్రొత్తగా వచ్చేవారిని ఏది తరచు ముగ్ధుల్ని చేస్తుంది? (బి) మన సమావేశాల్లో ఈ లక్షణపు ఏ ఇతర రుజువును వారు గమనిస్తారు?

మొదటిసారి ప్రజలు యెహోవాసాక్షుల సంఘకూటాలకు వచ్చినప్పుడు, అక్కడ చూపబడే ప్రేమకు వారు తరచు ముగ్ధులౌతారు. వారు దానిని వారి సహవాస ఆప్యాయతయందు, వ్యక్తిగతంగా తమకు వారిచ్చే ఆహ్వానమందు గమనిస్తారు.

2 మన సమావేశాలకు వచ్చే సందర్శకులు అక్కడకు వచ్చేవారిలో అత్యధికులు చాలాచక్కగా ప్రవర్తించడాన్ని కూడ గమనిస్తారు. అలాంటి ఒక సమావేశాన్నిగూర్చి ఒక వార్తాపత్రిక విలేఖరి ఇలా వ్రాశాడు: ‘అక్కడెవరూ మాదక ద్రవ్యాల, లేదా మత్తుపానీయాల ప్రభావం క్రింద లేరు. అరుపులు, కేకలు లేవు. త్రొక్కిసలాట లేదు. తోసుకోవడం లేదు. తిట్టుకోవడం, శాపనార్థాలు పెట్టుకోవడం లేదు. జుగుప్సాకరమైన ఛలోక్తులు, దుర్భాషయు లేదు. పొగత్రాగడం లేదు. దొంగతనం లేదు. ఎవరూ ఖాళీడబ్బాల్ని పచ్చికపై పారవేయడం లేదు. అది నిజంగా అసాధారణం.’ ఇదంతా ‘అమర్యాదగా నడువని, స్వప్రయోజనం కోరని’ ప్రేమకు నిదర్శనం.—1 కొరిం. 13:4-8.

3. (ఎ) మనమీ ప్రేమను ప్రదర్శించే విషయంలో యుక్తకాలమందు ఏది రుజువుకావాలి? (బి) క్రీస్తును అనుకరించడంలో, మనమెట్టి ప్రేమను పెంచుకోవాలి?

3 ప్రేమ ప్రతి నిజ క్రైస్తవున్ని గుర్తించే లక్షణం. (యోహా. 13:35) మనం ఆత్మీయంగా పెరిగేకొలది, దీనిని మనం మరింత సంపూర్ణంగా వ్యక్తపర్చాలి. తన సహోదరుల ప్రేమ “అంతకంతకు అభివృద్ధిపొందవలెనని” అపొస్తలుడైన పౌలు ప్రార్థించాడు. (ఫిలి. 1:9; 1 థెస్స. 3:12) తమ ప్రేమను “సహోదర సహవాసమంతటికి” విస్తరింపజేయాలని పేతురు కూడ తోటి క్రైస్తవులకు ఉద్బోధించాడు. (1 పేతు. 2:17) వ్యక్తిగతంగా మనం తెలుసుకొనేందుకు పెద్దగా ప్రయత్నించాల్సిన పనిలేని ప్రజలతో కేవలం కూటాలకు హాజరుకావడంకంటే ఎక్కువేచేయడానికి మన ప్రేమ మనల్ని పురికొల్పాలి. దానిలో అప్పుడప్పుడు ఏదో “హలో” అని చెప్పడంకంటే ఎక్కువే ఇమిడియుండాలి. అది స్వయంత్యాగంతో కూడుకున్నదై ఉండాలని అపొస్తలుడైన యోహాను చూపాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆయన [దేవుని కుమారుడు] మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.” (1 యోహా. 3:16; యోహా. 15:12, 13) మనమింకా ఆ విధంగా చేయలేదు. అయితే వాస్తవమందు మనం మన సహోదరుల కొరకు జీవాన్ని పెట్టుదుమా? మనకు అనుకూలంగా లేకపోయినా సరే, మనమెంత మేరకు వెళ్లి వారికి సహాయం చేయగలము?

4. (ఎ) ప్రేమను మరింత సంపూర్ణంగా వ్యక్తపర్చగల్గునట్లు మరేయితర మార్గాన్ని మనం కనుగొనవచ్చు? (బి) ఒకరియెడల మరొకరం మరి మిక్కిలి ప్రేమ కలిగివుండుట ఎందుకు అవశ్యం?

4 స్వయంత్యాగ స్వభావాన్ని ప్రతిబింబించే క్రియలకు తోడుగా, మన సహోదరులయెడల యథార్థమైన ఆప్యాయత కలిగియుండుట కూడా ప్రాముఖ్యం. దేవునివాక్యం మనకిలా ఉద్బోధిస్తున్నది: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై” ఉండుడి. (రోమా. 12:10) మనందరం కొందరి విషయంలో అట్టి భావమే కలిగివుంటాము. అట్టి ఇష్టతగలవారి గుంపులో మనం మరికొందరిని కూడ చేర్చగలమా? ఈ పాత విధానాంతము సమీపిస్తుండగా, మన క్రైస్తవ సహోదరులకు మనం మరింత సన్నిహితులు కావడం ఎంతైనా అవశ్యం. “అన్నిటి అంతము సమీపమైయున్నది. . . . ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి” అని చెప్పుచు, బైబిలు మనలను అప్రమత్తుల్ని చేస్తున్నది.—1 పేతు. 4:7, 8.

5. సంఘ సభ్యులమధ్య సమస్యలుత్పన్నం కావనుకోవడం ఎందుకు తప్పు?

5 అసంపూర్ణులుగా ఉన్నంతకాలం, మనమితరులకు అభ్యంతరం కల్గించే సమయాలుంటాయి. వారుకూడ, వివిధ విషయాల్లో మనకు వ్యతిరేకంగా పాపం చేస్తారు. (1 యోహా. 1:8) మీరట్టి పరిస్థితుల్లోవుంటే మీరేంచేయాలి?

సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఏమిచేయాలి

6. (ఎ) అన్ని సమయాల్లో బైబిలు సలహా మన దృక్పథాలతో ఎందుకు అంగీకరించదు? (బి) అయితే దానిని అన్వయించుటవల్ల కలిగే ఫలితమేమిటి?

6 లేఖనాలు అవసరమైన నడిపింపునందిస్తున్నాయి. అయితే అవిచ్చే సలహా అసంపూర్ణ మానవులమైన మనం చేయాలనుకొనే వాటితో పొందికగా లేకపోవచ్చు. (రోమా. 7:21-23) అయినప్పటికిని, వాటిప్రకారం ప్రవర్తించడానికి మనంచేసే యథార్థమైన కృషి, యెహోవాను ప్రీతిపర్చడానికై మనకున్న నిజమైన కోరికను రుజువుచేస్తుంది, ఆలాగే అది ఇతరులయెడల మనకున్న ప్రేమను మరింత నాణ్యపరస్తుంది.

7. (ఎ) మనల్ని ఎవరైనా గాయపరిస్తే, మనమెందుకు ప్రతీకారం తీర్చుకోకూడదు? (బి) మనకభ్యంతరం కల్గించే సహోదరుని ఊరకనే మనమెందుకు దూరపర్చకూడదు?

7 గాయపర్చబడినప్పుడు ప్రజలు కొన్నిసార్లు తమనలా గాయపర్చినవారికీ అదే గతిపట్టించాలని మార్గాలు వెదకుతారు. అయితే అది పరిస్థితిని మరింత విషమింపజేస్తుంది. వారికి తగినట్లుగా జరగాలంటే, ఆ విషయాన్ని మనం దేవునికే వదలివేయాలి. (సామె. 24:29; రోమా. 12:17-21) మరికొందరైతే అలా చేసిన వ్యక్తిని తమ జీవితంనుండే వెలివేస్తారు, అంటే వారితో ఇక ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు. మనమైతే మన తోటి ఆరాధికుల విషయంలో అలా చేయలేము. మన ఆరాధన అంగీకరింపబడటం, కొంతమేరకు మన సహోదరులను ప్రేమించడంపై ఆధారపడివుంటుంది. (1 యోహా. 4:20) మనం మాట్లాడని లేదా వారి సన్నిధి అంటేనే గిట్టని మనం వారిని ప్రేమిస్తున్నామని యథార్థంగా చెప్పగలమా? మనమా సమస్యతో వ్యవహరించి, దానిని పరిష్కరించుకోవాలి. ఎలా?

8, 9. (ఎ) ఒక సహోదరునికి వ్యతిరేకంగా మనకేదైనా ఫిర్యాదుంటే, ఏమిచేయడం సరియైన పని? (బి) అయితే అతడు పదేపదే మనయెడల పాపంచేస్తే అప్పుడేమిటి? (సి) ఆ పరిస్థితితో మనమిలా ఎందుకు వ్యవహరించాలి, అలా చేయుటకు మనకేది సహాయం చేస్తుంది?

8 ఈ విషయమై అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొ. 3:13) మీరలా చేయగలరా? వివిధ రీతుల్లో ఆ వ్యక్తి మీకు వ్యతిరేకంగా పదేపదే పాపంచేస్తే అప్పుడేమిటి?

9 అపొస్తలుడైన పేతురుకు అదే ప్రశ్నవుండెను, అందుకే ఆయన తన సహోదరుని బహుశ ఏడుమారుల మట్టుకు క్షమించడానికి ప్రయత్నించాలని సూచించాడు. అందుకు యేసు ఇలా జవాబిచ్చాడు: “ఏడుమారులమట్టుకే కాదు, డెబ్బది ఏళ్లమారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.” కాని ఎందుకు? ఏ మానవుడైనా మనకు బహుశ రుణపడివుండగల దానికి పోలిస్తే దేవునికి మనం రుణపడివుండుట ఎంత విస్తారమో నొక్కితెల్పే ఉపమానంతో యేసు ఆ విషయాన్ని వివరించాడు. (మత్త. 18:21-35) ప్రతిదినం—కొన్నిసార్లు స్వార్థంతో, తరచు మనం మాట్లాడే ప్రవర్తించే విషయాలతో, ఆలాగే మనం చేయాల్సిన పనులు చేయలేకపోవడం ద్వారా మనమెన్నో విధాలుగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తుంటాము. అజ్ఞానంతో మనం చేసిన పనులు కొన్ని తప్పని మనం గ్రహించకపోవచ్చు, లేదా మన జీవన ఉరవడి వాటిని గురించి మనం గంభీరంగా తలంచకపోవచ్చు. మన పాపాలకు జీతంగా దేవుడు మన జీవాల్నే అడుగగలడు. (రోమా. 6:23) అయితే ఆయన మనయెడల ఎడతెగక కరుణ చూపిస్తున్నాడు. (కీర్త. 103:10-14) అందువల్ల మనము కూడ పరస్పరం అదేరీతిలో వ్యవహరించుకోవాలని ఆయన కోరడం ఎంతమాత్రం అసంమంజసం కాదు. (మత్త. 6:14, 15; ఎఫె. 4:1-3) పగ పెంచుకోవడానికి బదులు, మనమలా చేసినప్పుడు “అపకారమును మనస్సులో ఉంచుకొనని” ప్రేమను మనం సంపాదించుకున్నామని రుజువు చేస్తాము.—1 కొరిం. 13:4, 5; 1 పేతు. 3:8, 9.

10. ఒక సహోదరునికి మనపై ఏదైనా విరోధ స్వభావముంటే మనమేమి చేయాలి?

10 మన సహోదరునియెడల మనకే విరోధమూ లేదని మనకు తెలిసినా, మనపై అతనికి విరోధ భావముండే సమయాలు ఉండవచ్చు. మనమప్పుడు ఏమిచేయాలి? ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా అతనితో మాట్లాడి, సమాధానకరమైన సంబంధాలు నెలకొల్పుకోవడానికి కృషిచేయాలి. మనమే చొరవ తీసుకోవాలని బైబిలు మనకు ఉద్బోధిస్తున్నది. (మత్త. 5:23, 24) అలా చేయడం అంత సులభమేమీ కాదు. దానికి ప్రేమతోబాటు వినయంకూడ కావాలి. బైబిలు సలహామేరకు మీరలా చేయునంత బలంగా ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? కృషిచేయాల్సిన దిశలో ఇదో ప్రాముఖ్యమైన గమ్యం.

11. మనల్ని నిశ్చేష్టుల్నిచేసే పని మన సహోదరుడెవరైనా చేస్తే, దాని విషయంలో మనమేమిచేయాలి?

11 మరోవైపు, ఒక వ్యక్తిచేసే పనులు మనలను, ఇతరులను కూడ నిశ్చేష్టుల్ని చేయవచ్చు. అతనితో ఎవరోఒకరు మాట్లాడుట మంచిది కాదా? అలాచేయుట బహుశ మంచిదే. దయతో అతనికా సమస్యను వ్యక్తిగతంగా వివరిస్తే, అది మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే ముందు మీకైమీరిలా ప్రశ్నించుకోవాలి: ‘అతనుచేసే పనులు నిజంగా లేఖనరహితంగా ఉన్నాయా? లేక సమస్య ఎక్కువగా నా పూర్వ జీవిత చరిత్ర, నేను పొందిన శిక్షణ అతనికి భిన్నంగా ఉన్నందనా?’ అట్లయిన, మీ స్వంత నియమాలు ఏర్పర్చుకొని, వాటి ప్రకారం తీర్మానాలు చేయకుండా ఉండేందుకు జాగ్రత్తపడండి. (యాకో. 4:11, 12) యెహోవా సమస్త జీవనగతుల ప్రజల్ని నిష్పక్షపాతంగా అంగీకరిస్తున్నాడు, ఆలాగే ఆత్మీయంగా వారు పెరిగేకొలది వారియెడల ఆయన సహనం ప్రదర్శిస్తున్నాడు.

12. (ఎ) సంఘమందు ఎవరైనా ఘోరమైన తప్పుచేస్తే, ఆ విషయమై ఎవరు శ్రద్ధ చూపుతారు? (బి) అయితే ఎట్టి పరిస్థితుల్లో పాపము చేయబడిన వ్యక్తి మొదట చొరవ తీసుకునే బాధ్యత కలిగివుంటాడు? ఏ ఉద్దేశముతో?

12 అయితే, సంఘమందున్న ఓ వ్యక్తి ఘోరమైన తప్పుచేస్తే, వెంటనే దానికి శ్రద్ధనివ్వాల్సి ఉంటుంది. కాని ఎవరివ్వాలి? సాధారణంగా పెద్దలే. అయితే, అది సహోదరుల మధ్యగల ఒకానొక వ్యాపార విషయం, లేదా వేరొకరిని బహుగా గాయపర్చేంతగా నాలుకను దుర్వినియోగపర్చడం ఇమిడియుంటే, పాపము చేయబడిన వ్యక్తి ఆ పాపంచేసిన వ్యక్తికి వ్యక్తిగతంగా సహాయం చేయడానికి మొదట కృషిచేయాలి. అది కొందరికి కష్టంగా ఉండవచ్చు. అయితే ఆ సలహానే యేసు మత్తయి 18:15-17 లో ఇస్తున్నాడు. సహోదరునియెడల ప్రేమ, అతన్ని సహోదరునిగా ఉంచాలనే యథార్థమైన కోరిక, సాధ్యమైతే తప్పుచేసిన వ్యక్తి హృదయం చేరునట్లు పనిచేసేలా సహాయపడుతుంది.—సామె. 16:23.

13. మనకు, మరో సహోదరునికి మధ్య సమస్య ఉత్పన్నమైతే, ఆ విషయాన్ని సరిగా దృష్టించుటకు మనకేది సహాయం చేస్తుంది?

13 పెద్దదేగాని, చిన్నదేగాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు, యెహోవా దానినెలా దృష్టిస్తాడో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించుట మనకు సహాయం చేస్తుంది. అది ఏ రూపమందున్నా ఆయన పాపాన్ని క్షమించడు, అయినా ఆయన మనందరిలో దానిని చూస్తున్నాడు. తగిన కాలమందు ఆయన పశ్చాత్తాపము చూపక పాపమునభ్యసించు వారందరిని తన సంస్థలో లేకుండా చేస్తాడు. అయితే మిగిలివున్న మన విషయమేమిటి? మనందరం ఆయన దీర్ఘశాంతమునకు, కరుణకు పాత్రులమై ఉన్నాము. మనం అనుకరించాల్సిన మాదిరి ఆయన ఉంచుతున్నాడు. మనమలా చేసినప్పుడు, ఆయన ప్రేమను మనం ప్రతిబింబించిన వారమౌతాము.—ఎఫె. 5:1, 2.

‘విశాలపరచుకొనుటకు’ మార్గాలు వెదకండి

14. (ఎ) “విశాలపరచుకొనుడి” అని పౌలు ఎందుకు కొరింథీయులను ప్రోత్సహించాడు? (బి) దీనినిగూర్చి మనందరం ఆలోచించుట మంచిదని ఇక్కడ చూపబడిన లేఖనాలెలా సూచిస్తున్నాయి?

14 అపొస్తలుడైన పౌలు గ్రీసునందున్న కొరింథు సంఘాన్ని కట్టుటకు అనేక నెలలు కష్టపడ్డాడు. అక్కడి సహోదరులకు సహాయం చేయడానికి ఆయన చాలా కష్టపడి పనిచేశాడు, ఆయన వారిని ప్రేమించాడు. అయితే వారిలో కొందరు ఆయనయెడల ఆప్యాయత చూపలేదు. వారు బహు కఠినముగా ఉండిరి. అనురాగము చూపుతూ “విశాలపరచుకొనుడి” అని ఆయన వారికి ఉద్బోధించాడు. (2 కొరిం. 6:11-13; 12:15) ఇతరులయెడల ప్రేమను వ్యక్తపరస్తూ, ‘విశాలపరచుకొనుటకు’ ఎంతమేరకు మార్గాలు వెదకుతున్నామని మనందరం ఆలోచించుకొనుట మంచిది.—1 యోహా. 3:14; 1 కొరిం. 13:3.

15. వ్యక్తిగతంగా సన్నిహితులం కాలేమని భావించే వారిపై ప్రేమను వృద్ధిచేసుకోవడానికి మనకేది సహాయపడగలదు?

15 సన్నిహితులం కావడానికి మనకు కష్టమనిపించే వారు కొందరు సంఘమందున్నారా? మనయెడల వారుచేయాలని మనం కోరినట్లే, వారివైపున ఏవైనా చిన్నచిన్న తప్పులుంటే వాటిని కప్పివేస్తే, మనమధ్యగల సంబంధాల్ని అప్యాయతతో నింపడానికది సహాయపడగలదు. (సామె. 17:9; 19:11) వారి మంచి లక్షణాల్ని వెదకి, వాటిపై దృష్టి నిలుపుటకూడ వారియెడల మన భావాలను మెరుగుపర్చగలవు. ఈ సహోదరులను యెహోవా ఏయే విధాలుగా ఉపయోగిస్తున్నాడో మనం నిజంగా గమనించామా? ఇది నిశ్చయంగా వారియెడల మన ప్రేమ వృద్ధికావడానికి కారణమౌతుంది.—లూకా 6:32, 33, 36.

16. నిజానికి, మన సంఘమందున్న వారియెడల ప్రేమ చూపుటలో మనమెలా “విశాలపరచుకొన”గలము?

16 ఇతరులయెడల మనం చేయగల వాటికి పరిమితులున్నాయి, వాటిని మనం అంగీకరించాల్సిందే. ప్రతి కూటమందు ప్రతివారిని మనం శుభమని పలకరించలేకపోవచ్చు. భోజనానికి మనం స్నేహితుల్ని ఆహ్వానించినప్పుడు ప్రతి ఒక్కరిని అందులో చేర్చడం సాధ్యం కాకపోవచ్చు. ఇతరులకంటే ఎక్కువ సమయం గడిపే సన్నిహిత స్నేహితులను మనందరం కలిగివున్నాము. అయితే మనం “విశాలపరచుకొన”గలమా? సంఘమందు మన సన్నిహిత స్నేహితుడు కాని మరో వ్యక్తితో మంచి పరిచయం పెంచుకోనటానికి ప్రతివారం మనం కేవలం కొన్ని నిమిషాలు వెచ్చించగలమా? ప్రాంతీయ సేవలో మనతో కలిసి సేవచేయుటకు అప్పుడప్పుడు వీరిలో ఒకరిని ఆహ్వానించగలమా? మనం నిజంగా ఒకరియెడల మరొకరం మిక్కిలి ప్రేమ కలిగివుంటే, దానిని ప్రదర్శించుటకు నిశ్చయంగా మార్గాల్ని వెదకుతాం.

17. క్రితమెన్నడూ కలుసుకొనని సహోదరులమధ్య ఉన్నప్పుడు, వారియెడల కూడ మనకు మిక్కిలి ప్రేమవున్నదా లేదాయని ఏది చూపిస్తుంది?

17 మన ప్రేమయందు ‘విశాలపరచుకొనుటకు’ క్రైస్తవ సమావేశాలు చక్కని అవకాశాల్నిస్తాయి. వేలమంది అక్కడ హాజరుకావచ్చు. మనం వారందరిని కలుసుకోలేకపోవచ్చు. అయితే మనం వారిని ఇంతకు ముందెన్నడూ కలుసుకోనప్పటికీ, మన సౌలభ్యంకంటే వారి సంక్షేమాన్ని ముందుంచడాన్ని ప్రదర్శించే రీతిలో మనం ప్రవర్తించవచ్చు. కార్యక్రమ విరామ సమయాల్లో మన చుట్టూవున్న కొందరిని కలిసికొనుట ద్వారా మన వ్యక్తిగత శ్రద్ధను చూపగలము. ఏదోక రోజున ఈ భూమిపై జీవించు వారందరు, మనందరి తండ్రియగు, దేవుని ఆరాధనలో ఐక్యమైన సహోదర, సహోదరీలై ఉంటారు. వారందరిని, వారిలోగల అనేకమైన, వేర్వేరు లక్షణాల్ని తెలిసికొనుట ఎంత ఆనందదాయకంగా ఉంటుందో గదా! వారియెడల మనకుగల మిక్కిలి ప్రేమ మనమలా చేయునట్లు కోరుకోవడానికి మనల్ని పురికొల్పుతుంది. ఇప్పుడే ఎందుకు ప్రారంభించకూడదు?

పునఃసమీక్షా చర్చ

• సహోదరుల లేక సహోదరీల మధ్య సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, వీటినెలా పరిష్కరించుకోవాలి? ఎందుకు?

• మనం ఆత్మీయంగా ఎదిగేకొలది, ఏయే విధాలుగా మన ప్రేమకూడ వృద్ధి కావాలి?

• సన్నిహిత స్నేహితుల పరిధికిమించి మరెక్కువగా మిక్కిలి ప్రేమ చూపుట ఎలా సాధ్యం?

[అధ్యయన ప్రశ్నలు]