కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గృహమందే మనము దైవభక్తిని అభ్యసించాలి

గృహమందే మనము దైవభక్తిని అభ్యసించాలి

అధ్యాయం 18

గృహమందే మనము దైవభక్తిని అభ్యసించాలి

1. (ఎ) వివాహాన్ని గూర్చిన యెహోవా కట్టడలను నేర్చుకున్న తర్వాత, అనేకమంది వ్యక్తులు ఎట్టి మార్పులు చేసికున్నారు? (బి) కాని క్రైస్తవ కుటుంబ జీవితంలో మరెక్కువ ఏది ఇమిడివుంది?

మన తొలి బైబిలుపఠన సమయంలో మనం నేర్చుకున్న హృదయానందకరమైన సత్యాల్లో వివాహం, కుటుంబ జీవనానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. వివాహానికి మూలకర్త యెహోవా అని గుర్తించాము, ఆలాగే కుటుంబాలకు ఆయన బైబిలునందు అత్యంత శ్రేష్ఠమైన నడిపింపునిచ్చాడని చూశాము. ఆ నడిపింపు ఫలితంగా, అనేకమంది వ్యక్తులు మెచ్చుకొనదగిన విధంగా లైంగిక అవినీతికర జీవితాన్ని విసర్జించి తమ వివాహాల్ని సరియైన రీతిలో రిజస్టరు చేయించుకున్నారు. అయితే క్రైస్తవ కుటుంబ జీవితానికి అంతకంటే ఎక్కువేవుంది. శాశ్వత వివాహంయెడల మన దృక్పథం, కుటుంబంలో మన బాధ్యతల్ని నెరవేర్చడం, ఇతర కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహరించాలనే విషయాలు కూడ ఇందులో ఇమిడివున్నాయి.—ఎఫె. 5:33–6:4.

2. (ఎ) బైబిలునుండి తామెరిగిన వాటిని ప్రతి ఒక్కరు తమ గృహమందు అన్వయిస్తారా? (బి) అలాచేసే ప్రాముఖ్యతనెలా యేసు మరియు పౌలు నొక్కితెల్పారు?

2 ఈ విషయాల్ని గూర్చి బైబిలు చెప్పే విషయాలు లక్షలాదిమందికి తెలుసు. అయితే తమ స్వగృహమందు సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు, వారు దానిని అన్వయించరు. మరి మన విషయమేమిటి? నామకార్థంగా కాస్త మతపరమైన భక్తివుంటే చాలని తర్కిస్తూ పిల్లలు వారి తలిదండ్రులను సన్మానించాలని చెప్పే బైబిలు నియమాన్ని త్రోసిపుచ్చిన వారిని యేసు ఖండించాడు, మనం నిశ్చయంగా వారివలే ఉండాలని ఇచ్ఛయించము. (మత్త. 15:4-9) పైకి భక్తిగలవారివలే కన్పిస్తూ తమ ‘తమ ఇంటిలో’ దైవభక్తి నభ్యసించని ప్రజలుగా ఉండాలని మనం కోరుకొనము. బదులుగా, మనం “గొప్ప లాభసాధకమైన” నిజమైన దైవభక్తిని కనబరచుటకిష్టపడతాము.—1 తిమో. 5:4; 6:6; 2 తిమో. 3:5.

వివాహం ఎంతకాలం నిలుస్తుంది?

3. (ఎ) అనేక వివాహాలకు ఏమి జరుగుతున్నది, కాని మన తీర్మానమేమై ఉండాలి? (బి) శాశ్వత వివాహానికి సంబంధించి పైన పేర్కొనబడిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు మీ బైబిలును ఉపయోగించండి.

3 వివాహబంధాలు అంతకంతకు ఎక్కువగా మరింత సుళువుగా విచ్ఛిన్నమౌతున్నట్లు రుజువౌతున్నాయి. దాదాపు 20, 30 లేదా 40 సంవత్సరాలు కలసి కాపురంచేసిన దంపతుల్లో కొందరిప్పుడు వేరొకరితో “క్రొత్త జీవితం” ప్రారంభించడానికి తీర్మానించుకుంటున్నారు. ఆలాగే వివాహమైన కొద్దినెలలకే యౌవన దంపతులు విడిపోయారని వినుట ఇక ఎంతమాత్రం అసాధారణం కాదు. ఇతరులేమి చేస్తున్నా, యెహోవా ఆరాధికులుగా మనం దేవుని ప్రీతిపరచే కోరికను కలిగివున్నాము. దీనినిగూర్చి ఆయన వాక్యమేమి చెబుతున్నది?

ఒక పురుషుడూ ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు, వారెంతకాలం కలిసి జీవించుటకు అపేక్షించాలి? (రోమా. 7:2, 3; మార్కు 10:6-9)

డాకులకు కేవలం ఎట్టి ఆధారం మాత్రమే దేవునియెదుట చెల్లుతుంది? (మత్త. 19:3-9; 5:31, 32)

ఆయన వాక్యం ఆమోదించని విడాకులను యెహోవా ఎంత తీవ్రంగా భావిస్తాడు? (మలా. 2:13-16)

వైవాహిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి బైబిలు వేరుకావడాన్ని సిఫారసు చేస్తుందా? (1 కొరిం. 7:10-13)

4. ఆధునిక పోకడ ఎట్లున్ననూ, కొన్ని వివాహాలు ఎందుకు నిలిచి ఉంటున్నాయి?

4 నామకార్థ క్రైస్తవుల వివాహాలతో సహా ఇతర వివాహాలు విచ్ఛిన్నమౌతుండగా కొన్ని వివాహాలెందుకు నిలిచివుంటున్నాయి? ఇరు వర్గాలవారు పరిపక్వతకు ఎదిగేంతవరకు వేచియుండుట తరచు ఒక కీలకాంశం. తమ శ్రద్ధాసక్తుల్ని పంచుకొనే జతను కనుగొని, వారితో విషయాల్ని బాహాటంగా చర్చించుట కూడ ప్రాముఖ్యము. మరి ప్రాముఖ్యమైన విషయమేమంటే, ఆ వ్యక్తి నిజమైన దైవభక్తిని అభ్యసించే వ్యక్తిగా ఉండాలి. ఒక వ్యక్తి యెహోవాను నిజంగా ప్రేమించి, ఆయన మార్గాలు సరియైనవని ఒప్పింపబడినవాడైతే, అప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలతో వ్యవహరించడానికి సరియైన ఆధారం ఉంటుంది. (కీర్త. 119:97, 104; సామె. 22:19) అట్టి వ్యక్తితో వివాహం, పరిష్కారం కుదరకపోతే ఇక వేరుపడటం లేదా విడాకులు తీసుకోవడమనే దృక్పథంచే బలహీనపర్చబడదు. తన బాధ్యతలనుండి తప్పుకోవడానికి అట్టి వ్యక్తి తన జతచేసే తప్పులను ఒక సాకుగా తీసుకోడు. బదులుగా, అతడు జీవిత సమస్యల్ని ఎదుర్కొనడాన్ని, ఆచరింపదగు పరిష్కారాల్ని కనుక్కోవడాన్ని నేర్చుకుంటాడు.

5. (ఎ) యెహోవాయెడల యథార్థత ఎలా ఇమిడివుంది? (బి) తీవ్ర పరీక్షనెదుర్కొన్నప్పుడు సహితం, యెహోవా కట్టడలకు స్థిరంగా హత్తుకొనుటవలన ఎట్టి ప్రయోజనాలు రాగలవు?

5 మనం వ్యక్తిగతంగా బాధననుభవించినప్పుడు మనం యెహోవా మార్గాల్ని పెడచెవిన పెడతామని, మంచిచెడ్డలేవో మనకై మనమే తీర్మానించుకొనుట మంచిదనే నిర్ణయానికి వస్తామని అపవాది చేసే వాదన మనకు తెలియనిది కాదు. అయితే యెహోవా ఎడల యథార్థముగా ఉండే వ్యక్తులు అలా ఉండరు. (యోబు 2:4, 5; సామె. 27:11) అవిశ్వాసులైన తమ జతనుండి హింసననుభవించిన యెహోవాసాక్షుల్లో అనేకులు తమ వివాహప్రమాణాల్ని వమ్ముచేయలేదు. (మత్త. 5:37) కొన్ని సంవత్సరాలు గడచిన పిదప వారిలో కొందరు తమ జత యెహోవాను సేవించుటలో తమతో చేరిన ఆనందాన్ని అనుభవించారు. (1 కొరిం. 7:16; 1 పేతు. 3:1, 2) ఎట్టి మార్పుచూపని లేదా తమ విశ్వాసానికి గట్టిగా హత్తుకొన్న కారణంగా తమను విడిచిపెట్టిన జతగల వారి విషయానికొస్తే, వీరుకూడ యెహోవా కట్టడలను హత్తుకొనుట ద్వారా బహుగా ఆశీర్వదించబడ్డారని తెలుసుకున్నారు. ఏ విధంగా? వారి పరిస్థితులు వారు యెహోవాకు మరింత సన్నిహితులు కావడాన్ని నేర్పాయి. తీవ్ర వ్యతిరేకతయందునూ దైవ లక్షణాల్ని ప్రతిబింబించడాన్ని వారు నేర్చుకున్నారు. ఆ వ్యక్తుల జీవితాలు దైవభక్తికున్న శక్తిని నిరూపిస్తున్నాయి.—కీర్త. 55:22; యాకో. 1:2-4; 2 పేతు. 1:5, 6.

ప్రతివారు తమవంతు నెరవేర్చుట

6. విజయవంతమగు వివాహానికి, ఏ ఏర్పాటును తప్పక గౌరవించాలి?

6 నిజముగా విజయవంతమగు వివాహానికి కేవలం కలిసివుండుటకంటే ఎక్కువేకావాలి. ఒక ప్రాథమిక అవసరతయేమంటే, యెహోవాయొక్క శిరస్సత్వపు ఏర్పాటును కుటుంబ సభ్యులందరు గౌరవించాలి. ఇది మంచి క్రమానికి, గృహమందలి సురక్షిత భావానికి దోహదపడుతుంది.—1 కొరిం. 11:3; తీతు 2:4, 5; సామె. 1:8, 9; 31:10, 28.

7. కుటుంబంలో శిరస్సత్వాన్ని ఎలా నిర్వహించాలి?

7 ఆ శిరస్సత్వం ఎలా నిర్వహించబడాలి? అది యేసుక్రీస్తు లక్షణాల్ని ప్రతిబింబించేలా ఉండాలి. యెహోవా మార్గాల్ని ఉన్నతి చేయడంలో యేసు స్థిరంగా ఉన్నాడు; ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు. (హెబ్రీ. 1:8, 9) ఆలాగే ఆయన తన సంఘాన్ని గాఢంగా ప్రేమిస్తాడు, దానికి కావల్సిన నడిపింపునిస్తూ, దానియెడల శ్రద్ధచూపిస్తాడు. అహంకారిగా, నిర్దయునిగా ఉండక, ఆయన ‘సాత్వికునిగా, దీనమనస్సుగలవానిగా ఉన్నాడు’ గనుక ఆయన శిరస్సత్వం క్రిందికి వచ్చువారు ‘తమ ప్రాణములకు విశ్రాంతిని కనుగొంటారు.’ (మత్త. 11:28, 29; ఎఫె. 5:25-23ఎఫె. 5:25-33) ఓ భర్త మరియు తండ్రి తన కుటుంబపు వారితో ఆ విధంగా వ్యవహరిస్తే, దైవభక్తికి పరిపూర్ణ మాదిరివుంచిన క్రీస్తుకు తానే లోబడుతున్నాడని విస్పష్టమౌతుంది. క్రైస్తవ తల్లులు కూడ తమ పిల్లలతో వ్యవహరించేటప్పుడు అవే లక్షణాల్ని ప్రతిబింబించాలి.

8. (ఎ) కొన్ని గృహాల్లో క్రైస్తవ పద్ధతులు సత్ఫలితాలు సాధించనట్లుగా ఎందుకు కనబడవచ్చు? (బి) అట్టి పరిస్థితి ఎదురైనప్పుడు మనమేమి చేయాలి?

8 అయితే మానవ అసంపూర్ణత కారణంగా, సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కుటుంబంలో బైబిలు సూత్రాల్ని ఎవరూ అన్వయించనారంభించక ముందే కొందరిలో అప్పటికే పరులిచ్చే నడిపింపు అంటే గిట్టని స్వభావం కొంతమేరకు బలంగా పాతుకుపోయి ఉండవచ్చు. దయాపూర్వక విన్నపాలు, ప్రేమతో వ్యవహరించడం సత్ఫలితాలు సాధిస్తున్నట్లు కన్పించకపోవచ్చు. “కోపము, క్రోధము, అల్లరి, దూషణను” విసర్జించుడని బైబిలు చెబుతోందని మనకు తెలుసు. (ఎఫె. 4:31) కాని కొందరు దేనినీ అర్థంచేసికోనివారిగా కన్పిస్తే అప్పుడు మనమేమి చేయాలి? సరే, తీవ్ర ఒత్తిడి క్రింద ఉన్నప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు? ఆయనను బెదిరించి, దూషించిన వారిని ఆయన అనుకరించలేదు. బదులుగా, ఆయన తన తండ్రిపై ఆధారపడి, ఆయనకే తనను లోబరచుకున్నాడు. (1 పేతు. 2:22, 23) అదేరీతిలో, గృహమందు పరీక్షాపూర్వక పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, లోకమార్గాలను అవలంబించుటకు బదులు మనం యెహోవావైపు తిరిగి, సహాయం కొరకు ఆయనకు మనం ప్రార్థిస్తే దైవభక్తికి రుజువునిచ్చిన వారమౌతాము.—సామె. 3:5-7.

9. తప్పులు పట్టడానికి బదులు, అనేకమంది క్రైస్తవ భర్తలు ఏ పద్ధతులు ఉపయోగించడానికి నేర్చుకున్నారు?

9 అన్ని సమయాల్లో మార్పులు అంత త్వరగా రావు, అయితే బైబిలు సలహా నిజముగా పనిచేస్తుంది. తమ భార్యల తప్పులనుగూర్చి బహు కఠినమైన ఫిర్యాదులుచేసిన అనేకమంది భర్తలు, సంఘముతో యేసు వ్యవహరించిన విధానాన్ని మరినిండుగా గుణగ్రహించనారంభించినప్పుడు అభివృద్ధి జరగడం చూశారు. ఆ సంఘం పరిపూర్ణ మానవులతో తయారుచేయబడలేదు. అయినా యేసు ఆ సంఘాన్ని ప్రేమిస్తూ, దానికొక మాదిరినుంచాడు, పైగా దానికొరకు ఆయన తన జీవాన్ని అర్పించి, తనకు ప్రీతికరమగునంతగా అది అభివృద్ధిపొందేలా సహాయం చేయడానికి ఆయన లేఖనాల్ని ఉపయోగించాడు. (ఎఫె. 5:25-27; 1 పేతు. 2:21) మంచి మాదిరివుంచేలా పనిచేయడానికి, అభివృద్ధి సాధించేలా ప్రేమపూర్వక వ్యక్తిగత సహాయం అందించడానికి ఆయన మాదిరి అనేకమంది క్రైస్తవ భర్తలకు ప్రోత్సాహాన్నిచ్చింది. కఠినంగా తప్పులు పట్టుటకు లేదా మాట్లాడకుండా ఉండుటకు బదులు అట్టి పద్ధతులు చక్కని ఫలితాల్ని సాధిస్తాయి.

10. (ఎ) భర్త, తండ్రి—తాను క్రైస్తవుడనని చెప్పుకొనే వ్యక్తి సహితం—ఏయేవిధాలుగా గృహమందలి ఇతరుల జీవితాల్ని కష్టభరితం చేయవచ్చు? (బి) పరిస్థితిని చక్కదిద్దడానికి ఏమి చేయవచ్చు?

10 భర్త, తండ్రిచేసే తప్పులే గృహమందు సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణం కావచ్చు. అతడు తన కుటుంబ భావోద్రేక అవసరతల్ని పసిగట్టకుండా ఉన్నట్లైతే లేదా కుటుంబ బైబిలు చర్చకు, ఇతర కార్యకలాపాలకు ఏర్పాట్లు చేయుటకు నిజంగా నాయకత్వం తీసుకోనట్లయితే అప్పుడేమిటి? సమస్యల్ని గూర్చి నిర్మొహమాటంగా, గౌరవనీయంగా చర్చించిన తర్వాత మంచి ఫలితాలు రావడం కొన్ని కుటుంబాలు చూశాయి. (సామె. 15:22; 16:23; 31:26) మనమాశించిన ఫలితాలు రానప్పటికినీ, ప్రతివారు ఆత్మ ఫలాల్ని ఫలిస్తూ, ఇతర కుటుంబ సభ్యులయెడల ప్రేమపూర్వకమైన శ్రద్ధాసక్తులను చూపుటద్వారా అభివృద్ధిచెందిన కుటుంబ వాతావరణానికి విలువైన రీతిలో దోహదపడవచ్చు. వేరే వ్యక్తి ఏదైనా చేస్తాడని వేచియుండుట ద్వారా కాదుగాని, వ్యక్తిగతంగా గృహమందు దైవభక్తిని అభ్యసించే వారమని చూపిస్తూ, మనం మనవంతు నిర్వహించడం ద్వారానే అభివృద్ధి సాధింపబడుతుంది.—కొలొ. 3:18-20, 23, 24.

జవాబులు ఎక్కడ పొందాలి

11, 12. (ఎ) కుటుంబ జీవిత సమస్యల విషయంలో మనకు సహాయం చేసేందుకు యెహోవా ఎట్టి ఏర్పాట్లు చేశాడు? (బి) పూర్తిగా ప్రయోజనం పొందుటకు, మనమేమి చేయవలెనని సిఫారసు చేయబడింది?

11 తమ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన సలహాకొరకు ప్రజలు తిరిగే కేంద్రాలు అనేకం ఉన్నాయి. కాని దేవుని వాక్యం అతి శ్రేష్ఠమైన సలహా కలిగివున్నదని మనకు తెలుసు మరియు దానిని అన్వయించుటకు ఆయన తన దృశ్య సంస్థద్వారా సహాయం చేస్తున్నందుకు మనం కృతజ్ఞులమైయున్నాము. ఆ సహాయం నుండి మీరు పూర్తి ప్రయోజనం పొందుతున్నారా?—కీర్త. 119:129, 130; మీకా 4:2.

12 సంఘ కూటాలకు హాజరుకావడానికి తోడుగా, కుటుంబ బైబిలు పఠనానికి మీరు క్రమంగా కొంత సమయాన్ని కేటాయిస్తున్నారా? ప్రతివారం దీన్ని క్రమంగా చేయు కుటుంబాలు వారి ఆరాధనలో ఐక్యమౌతున్నవి. తమ పరిస్థితులకు దేవుని వాక్య అన్వయింపును వారు చర్చిస్తుండగా వారి కుటుంబ జీవనమెంతో ఉత్కృష్టమౌతోంది.—ద్వితీయోపదేశకాండము 11:18-21 పోల్చండి.

13. (ఎ) వైవాహిక లేదా కుటుంబ విషయాల్లో మనకేదైనా ప్రత్యేక ప్రశ్నవుంటే, అవసరమైన సహాయాన్ని తరచు మనం ఎక్కడ కనుగొనవచ్చు? (బి) మనంచేసే నిర్ణయాలన్నింటిలో ఏది ప్రతిబింబించబడాలి?

13 వైవాహిక లేదా కుటుంబ విషయాలకు సంబంధించిన ప్రత్యేక ప్రశ్నలు బహుశ మీకు చింతను కల్గిస్తూవుండవచ్చు. ఉదాహరణకు, కుటుంబ నియంత్రణ విషయమేమిటి? గర్భనిరోధక శస్త్రచికిత్స క్రైస్తవులకు సరియేనా? బిడ్డ బహుశ అంగవైకల్యంతో జన్మిస్తాడని అన్పించినప్పుడు గర్భస్రావం సమర్థనీయమేనా? భార్యాభర్తల మధ్య యుక్తమైన లైంగిక సంబంధాలకు ఏమైనా పరిమితులున్నాయా? కౌమారదశలోవున్న పిల్లవాడు ఆత్మీయ విషయాల్లో కొద్దిమాత్రమే ఆసక్తి చూపుతుంటే కుటుంబ ఆరాధనలో అతడెంతమేరకు భాగం వహించడం అవసరమౌతుంది? వీటిలో ప్రతిదానికి నిస్సందేహంగా మీకు ఓ అభిప్రాయం ఉంటుంది. కాని వాటికి మీరు బైబిలు ఆధారంగా జవాబులివ్వగలరా? ఈ ప్రశ్నలన్నీ కావలికోటలో చర్చించబడ్డాయి. అట్టి సమాచారాన్ని కనుగొనుటకు అందుబాటులోవున్న పదసూచికల్ని ఉపయోగించడం నేర్చుకోండి. పదసూచిక సూచించే పాత ప్రచురణలు ఒకవేళ మీయొద్ద లేకపోతే, రాజ్యమందిరమందలి గ్రంథాలయంలో పరిశీలించండి. ప్రతి ప్రశ్నకు అవును, కాదు అనే సమాధానాల్ని ఆశించవద్దు. కొన్నిసార్లు మీరే—వ్యక్తిగతంగా లేదా వివాహిత దంపతులుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే యెహోవాయెడల, మీ కుటుంబ సభ్యులయెడల మీకున్న ప్రేమను ప్రతిబింబించే నిర్ణయాలు చేయడం నేర్చుకోండి. దేవునికి బహు ప్రీతికరమైన వారిగా ఉండాలనే మీ యథార్థకోరికను రుజువుపర్చే నిర్ణయాలు చేయండి. మీరలాచేస్తే, దైవభక్తిని మీరు బయటేకాదు మీ కుటుంబమందునూ నిజంగా అభ్యసించేవారని ఇటు మిమ్మల్నెరిగిన ఇతరులకు అటు యెహోవాకు విస్పష్టమౌతుంది.—ఎఫె. 5:10; రోమా. 14:19.

పునఃసమీక్షా చర్చ

• ఒకని వివాహ ప్రమాణపు నమ్మకత్వమందు యెహోవా ఎడల యథార్థత ఎలా ఇమిడియుంది?

• కుటుంబ సమస్యల ఒత్తిడి క్రింద ఉన్నప్పుడు, దేవునికి ప్రీతికరమైనది చేయునట్లు మనకేది సహాయం చేస్తుంది?

• కుటుంబంలోని ఇతరులు తప్పుచేసినా, పరిస్థితిని చక్కదిద్దేందుకు మనమేమి చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]