కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టండి

దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టండి

అధ్యాయం 3

దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టండి

1. (ఎ) ప్రాచీన ఇశ్రాయేలీయులు దేవునివాక్య సత్యసంధతను ఎలా అనుభవించారు? (బి) అది మనకెందుకు ఆసక్తికరంగా ఉంది?

“మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను.” వాగ్దాన దేశమందు స్థిరపడ్డ తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దలకు యెహోషువ ఇలా జ్ఞాపకం చేశాడు. అయితే ఆ తర్వాతి సంవత్సరాల్లో దానికి పొందికగా వారు దేవుని వాక్యాన్ని తమ హృదయానికి తీసుకొని దాన్ని అన్వయించలేదు. దాని ఫలితమేమి? యెహోవా ఆశీర్వాద వాగ్దానాలు నమ్మదగినవిగా రుజువైనట్లే, తాను సెలవిచ్చిన అవిధేయతా పర్యవసానాలు సంభవించేలా ఆయన చేశాడని బైబిలు స్పష్టం చేస్తుంది. (యెహో. 23:14-16) ఆ చరిత్రతోబాటు మిగిలిన బైబిలంతా—“మనకు నిరీక్షణ కలుగుటకు” ఆలాగే ఆ నిరీక్షణను పోగొట్టుకొనేలా మనమే పొరపాటు చేయకుండునట్లు మనకు ఉపదేశం కొరకు భద్రపర్చబడింది.—రోమా. 15:4.

2. (ఎ) ఏ భావమందు బైబిలు “దైవావేశమువలన” కలిగినది? (బి) దీనినెరిగిన ఎడల మనకెట్టి బాధ్యత కలదు?

2 దాదాపు 40 మంది మానవ “లేఖికులు” బైబిలు వ్రాయడానికి ఉపయోగింపబడిననూ, యెహోవాయే దాని నిజమైన గ్రంథకర్త. అంటే దానిలో వ్రాయబడిన ప్రతివిషయాన్ని ఆయనే చురుకుగా నిర్దేశించాడని దాని భావమా? అవును. అపొస్తలుడైన పౌలు సత్యవంతముగా చెప్పినట్లు ‘ప్రతి లేఖనం దైవావేశం’ వలన కలిగినదే. ఆ ఒప్పుదల కలిగిన మనం కృషి చేస్తున్నట్లుగానే బైబిల్ని లక్ష్యపెట్టి, అందలి సందేశం ప్రకారం తమ జీవితాల్ని మలుచుకొమ్మని ప్రతి ప్రాంతమందలి ప్రజలకు మనం ఉద్బోధిస్తాము.—2 తిమో. 3:16; 1 థెస్స. 2:13.

దానిని అభినందించడానికి ఇతరులకేది సహాయం చేస్తుంది?

3. బైబిలు దేవుని వాక్యమని ఒప్పుదలలేని అనేకులకు సహాయపడటానికి ఏది శ్రేష్ఠమైన మార్గం?

3 నిజమే, మనం మాట్లాడే అనేకులు బైబిలు నిజంగా దేవుని వాక్యమనే మన ఒప్పుదలయందు భాగం వహించరు. మనం వారికెలా సహాయపడగలం? తరచు శ్రేష్ఠమైన మార్గమేదంటే, బైబిలు తెరచి దానియందలి విషయాల్ని వారికి చూపించడమే. “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, . . . హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీ. 4:12) “దేవుని వాక్యము” బైబిల్లో వ్రాయబడిన ఆయన వాగ్దానమే. అది మృత చరిత్ర కాదుగాని సజీవముగా, నిరాటంకముగా నెరవేర్పుకై ముందుకుసాగిపోవు వృత్తాంతమే. అందునుబట్టి, దాన్ని నేర్చుకునేవారు నిజమైన హృదయ స్పందనగల వ్యక్తులుగా అందలి షరతులను పాటించువారని బాహాటంగా కనబడతారు. మనం వ్యక్తిగతంగా చెప్పగల దేనికంటెను దాని ప్రభావం మరెంతో శక్తివంతంగా ఉంటుంది.

4. బైబిలు సత్యాల ఏ సాధారణ వివరాలు బైబిలుయెడల కొందరు కలిగివున్న దృక్పథాలను మార్చాయి? ఎందుకు?

4 బైబిల్లో కేవలం దేవుని నామాన్ని చూడటమే అనేకమంది జీవితాల్లో ఒకపెద్ద మలుపుగా మారింది. జీవిత సంకల్పాన్ని గూర్చి, దేవుడు ఎందుకు దుష్టత్వాన్ని అనుమతిస్తున్నాడు, ప్రస్తుత సంఘటనల విశేషత లేదా దేవుని రాజ్యంపై కేంద్రీకరింపబడిన వాస్తవమైన నిరీక్షణను గూర్చి అది తెలిపే విషయాల్ని ఇతరులకు చూపినప్పుడు వారు బైబిలు పఠించడానికి తీర్మానించుకున్నారు. దుష్టాత్మలు ప్రజల్ని అమితంగా పట్టి పీడించేటట్టుచేసే మత అభ్యాసాలున్న దేశాల్లో, దీనికిగల కారణాన్ని, విడుదల ఎలా పొందాలో తెల్పే బైబిలు వివరణ ఎంతో ఆసక్తిని పుట్టించింది. ఈ అంశాలు వారిపై ఎందుకంతగా ముద్రవేశాయి? ఎందుకంటే ఈ ప్రాముఖ్యమైన విషయాలకు బైబిలు మాత్రమే నమ్మదగిన సమాచారమిచ్చే మూలమైయుంది.—కీర్త. 119:130.

5. తాను బైబిలును నమ్మనని ఒక వ్యక్తి చెప్పినప్పుడు, దానికి కారణమేమై ఉండవచ్చు? అతనికి మనమెలా సహాయపడవచ్చు?

5 అయినా, తాను బైబిలును నమ్మనని ఒక వ్యక్తి సూటిగా మనతో చెబితే అప్పుడేమి? అంతటితో సంభాషణ ఆగిపోవాలా? అతను తర్కించడానికి ఇష్టపడితే ఆగనక్కర్లేదు. దేవునివాక్య పక్షంగా ఒప్పుదలతో మాట్లాడే బాధ్యత మనకుందని మనం భావించాలి. బహుశ అతడు బైబిల్ని క్రైస్తవ మతసామ్రాజ్య పుస్తకంగా దృష్టిస్తున్నాడేమో. వేషధారణతోకూడిన దాని చరిత్ర, రాజకీయాల్లో తలదూర్చడం, ఆలాగే అదేపనిగా చందాలు వసూలు చేయడం వంటివి అతనిలో బైబిలుపై ప్రతికూల భావాన్ని కల్గించియుండవచ్చు. విషయమదే అయితే ఎందుకు అడుగకూడదు? క్రైస్తవ మతసామ్రాజ్యానికి నిజ క్రైస్తవత్వానికి మధ్యవున్న భేదాల్ని ప్రస్తావించడంతోసహా క్రైస్తవ మతసామ్రాజ్య లౌకిక విధానాల్ని బైబిలు ఖండించడం అతనిలో ఆసక్తిని రేకెత్తించవచ్చు.—మత్తయి 15:7-9; యాకోబు 4:4; మీకా 3:11, 12 పోల్చండి.

6. (ఎ) బైబిలు దేవుని వాక్యమేనని వ్యక్తిగతంగా మిమ్మల్నేది ఒప్పింపజేస్తున్నది? (బి) బైబిలు నిజంగా దేవునినుండే వచ్చిందని గుణగ్రహించడానికి ప్రజలకు సహాయం చేయుటలో మరేవిధమైన తర్కనలను ఉపయోగించవచ్చును?

6 మరికొందరికి, ప్రేరణను గూర్చిన రుజువులతో సూటిగాచేసే చర్చ సహాయకరంగా ఉంటుంది. బైబిలు దేవునినుండి కలిగినదని మీకు ఏది స్పష్టంగా నిరూపిస్తున్నది? బైబిలే దాని మూలమును గూర్చి చెప్పడమా? (2 తిమో. 3:16, 17; ప్రక. 1:1) లేక భవిష్యత్తును గూర్చిన వివరణాత్మక జ్ఞానాన్ని ప్రతిబింబించే అనేక ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయని, అందువలన ఆ ప్రవచనాలు తప్పక మానవాతీత మూలాన్నుండి వచ్చాయన్న వాస్తవమా? (2 పేతు. 1:20, 21; యెష. 42:9) అనేకమంది మనుష్యులు 1,610 సంవత్సరాలకు పైగాగల కాలనిడివిలో వ్రాసినా బైబిల్లోగల అంతర్గత పొందికా? లేక ఆ కాలంలోని ఇతర వ్రాతలకు భిన్నంగా దానియందలి విజ్ఞానశాస్త్ర ప్రామాణికతా? లేక దాని రచయితల యథార్థతా? లేక దానిని నాశనం చేయలానే దుష్ట ప్రయత్నాల మధ్యనూ అది పరిరక్షింపబడటమా? ఇతరులకు సహాయం చేయడానికి మిమ్మల్ని ముగ్ధుల్ని చేసిన ఏ విషయాన్నైనా మీరు ఉపయోగించవచ్చును.

మన వ్యక్తిగత బైబిలు పఠనము

7, 8. (ఎ) బైబిలు విషయమై మనందరము ఆయావ్యక్తులుగా ఏమిచేస్తుండాలి? (బి) వ్యక్తిగత బైబిలు పఠనమునకు తోడుగా మనకింకేమి అవసరం, దీనిని బైబిలే ఎలా చూపిస్తున్నది? (సి) యెహోవా సంకల్పాల్ని గూర్చిన అవగాహనను వ్యక్తిగతంగా మీరెలా పొందారు?

7 బైబిలును నమ్మడానికి ఇతరులకు సహాయపడ్డానికి తోడుగా, దానిని క్రమంగా చదవడానికి మనంకూడ సమయం తీసుకోవాలి. మీరలా చేస్తున్నారా? ఇప్పటివరకు ఉత్పత్తి చేయబడిన పుస్తకాల్లోకెల్లా ఇదెంతో ప్రాముఖ్యమైన గ్రంథం. అంటే దానిని చదివితేచాలు ఇక మనకింకేమీ అవసరం లేదని దాని భావం కాదు. మన వ్యక్తిగత పరిశోధన ద్వారా అందలి ప్రతి విషయాన్ని మనమే తెలుసుకొనగలమనుకుంటూ మనకైమనం వేరుండకూడదని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. మనం సమతూకంగల క్రైస్తవులుగా ఉండాలంటే, వ్యక్తిగత పఠనం క్రమంగా కూటాలకు హాజరుకావడం, ఈ రెండూ అవసరమే.—సామె. 18:1; హెబ్రీ. 10:24, 25.

8 మన ప్రయోజనార్థమై బైబిలు ఐతియొపీయుడైన ఒక అధికారి యెషయా ప్రవచనం చదువుతుండగా దేవదూత ఒకరు క్రైస్తవ సువార్తికుడైన ఫిలిప్పును ఆ యధికారినొద్దకు నడిపించడాన్ని గూర్చి చెబుతుంది. ఫిలిప్పు అతన్ని, “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని అడుగగా, దానికి ఆ ఐతియొపీయుడు వినయంగా “ఎవడైనను నాకు త్రోవచూపకుంటే ఏలాగు గ్రహింపగలనని” జవాబిచ్చాడు. ఆ లేఖన భాగాన్ని వివరించుమని ఆయన ఫిలిప్పును వేడుకున్నాడు. ఇక్కడ, లేఖనాలపై తన స్వంత అభిప్రాయం చెప్పడానికి ఫిలిప్పు కేవలం తనకుతానే స్వతంత్రంగా బైబిలు చదవడంలేదు. బదులుగా, ఆయన యెరూషలేము సంఘమందలి అపొస్తలులతో సన్నిహితంగా ఉంటూ, యెహోవా దృశ్య సంస్థలో ఒక సభ్యుడై యుండెనని చరిత్ర చూపిస్తోంది. కాబట్టి ఆయన ఆ సంస్థద్వారా యెహోవా అందుబాటులో ఉంచిన ఉపదేశంనుండి ఆ ఐతియొపీయుడు ప్రయోజనం పొందునట్లు సహాయం చేయగల్గాడు. (అపొ. 6:5, 6; 8:5, 14, 15, 26-35) అదే ప్రకారం నేడు, మనలో ఎవరు స్వంతగా యెహోవా సంకల్పాల్ని గూర్చిన స్పష్టమైన, సరియైన అవగాహనకు వచ్చారు? బదులుగా తన దృశ్య సంస్థద్వారా యెహోవా ప్రేమతో దయచేస్తున్న అట్టి సహాయం మనకు అవసరమైయుండెను, ఎడతెగక అది మనకింకనూ అవసరమే.

9. బైబిల్ని చదివే ఎలాంటి కార్యక్రమాలు మనందరికి ప్రయోజనమివ్వగలవు?

9 బైబిలును అర్థంచేసుకుని, దానినుపయోగించుటకు సహాయకంగా, యెహోవా సంస్థ మనకు కావలికోట మరియు తత్సంబంధ ప్రచురణల్లో అద్భుతమైన అంశాల్ని అందజేస్తున్నది. దానికితోడు, యెహోవాసాక్షుల సంఘాల్లో దైవపరిపాలనా పాఠశాలకు సంబంధించి బైబిల్ని చదవడం కొరకు మనకొక క్రమపట్టిక ఇవ్వబడుతుంది. కొందరు యెహోవాసాక్షులు దీనికితోడు అనుక్రమంగా బైబిల్ని చదువుతుంటారు. పరిశుద్ధ లేఖనాల్ని పరిశీలించడంలో వెచ్చించిన సమయం నుండి గొప్ప ప్రయోజనం కలుగగలదు. (కీర్త. 1:1-3; 19:7, 8) మీరు వ్యక్తిగతంగా బైబిలును పూర్తిగా చదివారా? లేనట్లయితే, అలాచేయడానికి ప్రత్యేక ప్రయత్నం చేయండి. ప్రతిదీ మీకు పూర్తిగా అర్థం కాకపోయినా, మొత్తంమీద దానిగూర్చిన దృక్పథం ఎంతో విలువగలదై ఉంటుంది. దినమునకు కేవలం నాలుగైదు పేజీలు చదివినాసరే, ఒక సంవత్సరంలో మీరు బైబిలు చదవడం పూర్తిచేస్తారు.

10. (ఎ) మీరెప్పుడు బైబిల్ని చదువుతారు? (బి) క్రమంగా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

10 ఈ బైబిల్ని చదవడం కొరకు మీరు వ్యక్తిగతంగా ఎప్పుడు ఏర్పాటుచేసుకోగలరు? ప్రతిదినము మీరు 10, 15 నిమిషాలు దీనికొరకు కేటాయించగల్గితే, అదెంత ప్రయోజనకరమో! అలాకాకపోతే, కనీసం ప్రతివారం ఓ క్రమమైన పట్టిక వేసుకొని, ఆ సమయ పట్టికకు కట్టుబడి ఉండండి. క్రమంగా ఆహారం భుజించునట్లే, బైబిలు చదవడం ఒక జీవితకాల అలవాటైయుండాలి. ఒక వ్యక్తి ఆహారపుటలవాట్లు కుంటుపడితే, అతని ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసు. మన ఆత్మీయత విషయంలోను అది వాస్తవమే. మన జీవం “దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలన” క్రమంగా పోషింపబడుటపై ఆధారపడివుంది.—మత్త. 4:4.

11. బైబిలును చదవడంలో మన ఉద్దేశమేమైయుండాలి?

11 బైబిలు చదవడంలో మన ఉద్దేశమేమై ఉండాలి? కేవలం నియమిత పేజీలు చదవడం లేదా కేవలం నిత్యజీవం పొందడమే మన లక్ష్యమైతే అది పొరపాటౌతుంది. శాశ్వత ప్రయోజనం కొరకు, మనం మరింత ఉన్నతమైన ఉద్దేశాలను అనగా దేవుని ఎడల ప్రేమను, ఆయనను మరింతగా తెలుసుకోవాలనే కోరికను కలిగివుంటూ, ఆయన చిత్తాన్ని అర్థంచేసుకొని, ఆయనకు అంగీకృతమగు రీతిలో ఆయన్ని ఆరాధించాలి. (యోహా. 5:39-42) మన దృక్పథం, “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము” అనిచెప్పిన బైబిలు రచయిత దృక్పథాన్ని పోలియుండాలి.—కీర్త. 25:4.

12. (ఎ) ‘కచ్చితమైన జ్ఞానము’ సంపాదించుట ఎందుకు అవసరం, దానిని పొందడానికి చదివేటప్పుడు ఎలాంటి కృషి అవసరమైయుండొచ్చు? (బి) ఇరవైయేడవ పేజీలో చూపబడినట్లు, మనం బైబిల్లో చదివేదానిని ఏ కోణాలనుండి ప్రయోజనకరంగా విశ్లేషించవచ్చు? (సి) ఈ పేరా చివర ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబిస్తూ, ఒక్కొక్కటిగా ఈ ఐదు అంశాల్ని ఉదహరించండి. మీ బైబిల్ని ఉపయోగించడం మర్చిపోవద్దు.

12 మనమా బోధను పొందుచుండగా, ‘కచ్చితమైన జ్ఞానము’ పొందాలనే కోరిక మనకుండాలి. అదిలేకుండా, మన స్వంత జీవితాల్లో దేవుని వాక్యాన్నెలా సరిగా అన్వయించగలము లేదా దానిని సరిగా ఇతరులకెలా వివరించగలము? (కొలొ. 3:10; 2 తిమో. 2:15) కచ్చితమైన జ్ఞానం సంపాదించడానికి మనం జాగ్రత్తగా చదవాలి, ఒకవేళ ఒకానొక భాగానికి లోతైన భావంవుంటే దానిని అర్థం చేసుకోవడానికి దానిని మనం ఒకసారికంటే ఎక్కువసార్లు చదవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని వివిధ కోణాలనుండి ఆలోచిస్తూ, ధ్యానించడానికి సమయం తీసుకుంటే కూడ మనం ప్రయోజనం పొందుతాము. ఆలోచనను రేకెత్తించే అమూల్యమైన ఐదు రంగాలు ఈ పుస్తకమందు 27వ పేజీలో ఉన్నతపర్చబడ్డాయి. వీటిలో ఒకటి లేక మరెక్కువ అంశాల్ని ఉపయోగిస్తూ లేఖనాల్లోని అనేక భాగాల్ని ప్రయోజనకరంగా విశ్లేషించవచ్చు. తర్వాతి పేజీల్లోని ప్రశ్నలకు జవాబిస్తుండగా అదెట్లో మీరు చూస్తారు.

(1తరచు మీరు చదివే లేఖన భాగం యెహోవా ఎలాంటి వ్యక్తో ఎంతోకొంత సూచిస్తుంది.

యెహోవా సృష్టి కార్యాలనుగూర్చి బైబిలు చెప్పుదానిని మనం ప్రశంసతో ధ్యానించినప్పుడు, ఆయనయెడల మన దృక్పథంపై అదెలా ప్రభావం చూపుతుంది? (కీర్త. 139:13, 14; యోబు 38-42 అధ్యాయాల నుండి ప్రత్యేకంగా 38:1, 2 మరియు 40:2, 8, ఆ తర్వాత 42:1-6 గమనించండి.)

యోహాను 14:9, 10 లో యేసు చెప్పిన దాని దృష్ట్యా, లూకా 5:12, 13 లో వ్రాయబడిన సంఘటనల నుండి యెహోవాను గూర్చి మనమే నిర్ణయానికి రాగలము?

(2బైబిలు మూలాంశానికి, అనగా వాగ్దత్త సంతానమగు యేసుక్రీస్తు అధికారంలోని రాజ్యం ద్వారా యెహోవా నామాన్ని మహిమపర్చడానికి ఆ వృత్తాంతం ఎలా దోహదపడుతుందో విచారించండి.

ఈ మూలాంశానికి ఐగుప్తు తెగుళ్లు ఎలా సంబంధం కలిగివున్నవి? (నిర్గమకాండము 5:2; 9:16; 12:12 చూడండి.)

మోయాబీయురాలైన రూతును గూర్చిన హృదయానందకరమైన వృత్తాంతం విషయమేమి? (రూతు 4:13-17; మత్త. 1:1, 5)

యేసు జన్మమును గూర్చి గబ్రియేలు మరియకు చేసిన ప్రకటన దీనికెట్లు సరిపోతుంది? (లూకా 1:26-33)

పెంతెకొస్తునాడు యేసు శిష్యులను పరిశుద్ధాత్మతో అభిషేకించుట ఎందుకు విశేషం? (అపొ. 2:1-4; 1 పేతు. 2:4, 5, 9; 2 పేతు. 1:10, 11)

(3ఆయా వచనాల భావంపై సందర్భం ప్రభావాన్ని కలిగివుంటుంది.

రోమీయులు 5:1; 8:16 ఎవరినుద్దేశించి చెప్పబడినవి? (రోమీయులు 1:7 చూడండి.)

మొదటి కొరింథీయులు 2:9 దేవుని నూతన క్రమంలోని భూజీవితాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తున్నట్లు దాని సందర్భము సూచిస్తున్నదా? ఆరునుండి ఎనిమిది వచనాల్లో చూపబడినట్లు పౌలు వ్రాస్తున్న సంగతులను ఎవరి కన్నులు, చెవులు గ్రహించుట లేదు?

(4మీరు చదివేదాన్ని వ్యక్తిగతంగా ఎలా అన్వయించుకోగలరో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

కయీను హేబెలును హత్యచేయడం కేవలం ఆసక్తిగల చారిత్రక వృత్తాంతమేనా లేక దానిలో మనకేమైనా హెచ్చరిక కలదా? (ఆది. 4:3-12; 1 యోహా. 3:10-15; హెబ్రీ. 11:4)

అరణ్యమందలి ఇశ్రాయేలీయుల అనుభవాల్ని గూర్చి (నిర్గమకాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు) చదువునప్పుడు, మనమే వ్యక్తిగత అన్వయింపు చేసుకోవాలి? (1 కొరిం. 10:6-11)

అభిషిక్త క్రైస్తవుల కొరకు వ్రాయబడిన ప్రవర్తనా సలహా భూమ్మీది నిత్యజీవ నిరీక్షణగల వ్యక్తులకు వర్తిస్తుందా? (సంఖ్యాకాండము 15:16; యోహాను 10:16 పోల్చండి.)

క్రైస్తవ సంఘమందు మనం మంచి స్థానంలో ఉన్ననూ, మనకిప్పటికే తెలిసివున్న బైబిలు సలహాను మరింత సంపూర్ణముగా అన్వయించగల మార్గాలను పరిశీలించు అవసరం ఉన్నదా? (2 కొరిం. 13:5; 1 థెస్స. 4:1)

(5మీరు చదువునది ఇతరులకు సహాయపడ్డానికి ఎలా ఉపయోగించవచ్చునో ఆలోచించండి.

యాయీరు కుమార్తె పునరుత్థాన వృత్తాంతముతో ఎవరికి సహాయము చేయవచ్చును? (లూకా 8:41, 42, 49-56)

13. క్రమంగా బైబిల్ని చదవడంనుండి, యెహోవా సంస్థతో క్రమంగా పఠించే కార్యక్రమంనుండి ఏ ఫలితాల్ని మనం అపేక్షించవచ్చు?

13 బైబిలు పఠనాన్ని ఈ విధంగాచేస్తే ఎంత ప్రతిఫలదాయకంగా ఉంటుందో గదా! నిశ్చయంగా, బైబిలు చదవడం ఒక సవాలే, ఎందుకంటే అది జీవితాంతం మనం ప్రయోజనకరంగా పనిచేయగల ఓ ప్రణాళికైయుంది. అయితే మనమలా చేస్తుండగా మనం ఆత్మీయంగా బలంగా ఎదుగుతాము. అది మనల్ని మన ప్రేమగల తండ్రియగు యెహోవాకు, మన క్రైస్తవ సహోదరులకు మరింత సన్నిహితుల్ని చేస్తుంది. “జీవవాక్యమును” గట్టిగా చేపట్టుడనే సలహాను లక్ష్యపెట్టుటకది మనకు సహాయం చేస్తుంది.—ఫిలి. 2:16.

పునఃసమీక్షా చర్చ

• బైబిలెందుకు వ్రాయబడి మనకాలం వరకు భద్రపర్చబడింది?

• దానిని అభినందించడానికి మనం ఇతరులకెలా సహాయపడగలం?

• క్రమమైన రీతిలో వ్యక్తిగతంగా బైబిల్ని చదవడం ఎందుకు లాభదాయకం? చదివేదానిని ఏ ఐదు కోణాలనుండి మనం ప్రయోజనకరంగా విశ్లేషించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[27వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీరు బైబిలు చదివేటప్పుడు వీటిని ఆలోచించండి—

ఒక వ్యక్తిగా యెహోవాను గూర్చి ప్రతి భాగం మీకేమి చెబుతుంది

బైబిలంతటి మూలాంశానికి అదెట్లు సంబంధం కలిగివుంది

భావంపై సందర్భం ఎలా ప్రభావం చూపుతుంది

మీ స్వంత జీవితంపై అదెలా ప్రభావం చూపాలి

ఇతరులకు సహాయపడేందుకు మీరు దాన్నెలా ఉపయోగించగలరు