కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రవక్తలందరూ సాక్ష్యమిచ్చిన వ్యక్తి

ప్రవక్తలందరూ సాక్ష్యమిచ్చిన వ్యక్తి

అధ్యాయం 4

ప్రవక్తలందరూ సాక్ష్యమిచ్చిన వ్యక్తి

1. యేసు మానవపూర్వ ఉనికిని గూర్చిన వాస్తవాలు యెహోవాతో ఆయనకున్న సంబంధాన్ని గూర్చి ఏమి చూపిస్తున్నాయి?

యెహోవాతో తనకున్న సన్నిహిత సంబంధాన్ని వర్ణిస్తూ యేసు ఇలా చెప్పాడు: “తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడు.” (యోహా. 5:19, 20) ఆయన మానవజన్మకు పూర్వమే, లక్షలకోట్ల సంవత్సరాల క్రితం ఆయనను సృజించినప్పుడే ఆ సన్నిహిత సంబంధం ఆరంభమైంది. ఆయన దేవుని జనితైక కుమారుడును, యెహోవాచే సూటిగా సృజింపబడిన ఏకైక వ్యక్తియైయున్నాడు. ఆ తర్వాత పరలోకమందేమి, భూమ్మీదనేమి సమస్తమును ఆదిసంభూతుడైన ఆ ప్రియకుమారుని ద్వారానే సృష్టింపబడ్డాయి. ఆయన దేవుని వాక్యముగా లేక దేవునికి బదులు మాట్లాడు ప్రతినిధిగా సేవచేశాడు, అలా ఆయన ద్వారా దైవచిత్తం ఇతరులకు అందజేయబడింది. దేవునికెంతో ఇష్టుడైన ఈ కుమారుడు యేసుక్రీస్తను మనుష్యుడయ్యాడు.—కొలొ. 1:15, 16; యోహా. 1:14; 12:49, 50.

2. ఎంతమేరకు బైబిలు ప్రవచనాలు యేసును సూచిస్తున్నాయి?

2 అద్భుతరీతిలో ఆయన మానవునిగా జన్మించకముందే, ఆయనను గూర్చి అనేక ప్రేరేపిత ప్రవచనాలు వ్రాయబడ్డాయి. అపొస్తలుడైన పేతురు కొర్నేలికి సాక్ష్యమిచ్చినట్లుగా, “ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు.” (అపొ. 10:43) సత్యారాధనకు సంబంధించి యేసు వహించిన పాత్రనుగూర్చి బైబిల్లో ఎంతగా వ్రాయబడిందంటే ఓ దేవదూత అపొస్తలుడైన యోహానుకిలా చెప్పాడు: “దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారము.” (ప్రక. 19:10) ఆ ప్రవచనాలు స్పష్టంగా ఆయనను గుర్తించి, మనకీనాడు ఆసక్తికరమైన ఆయనను గూర్చిన దేవుని సంకల్పంయొక్క వివిధ అంశాలవైపు అవధానం మళ్లిస్తున్నాయి.

ప్రవచనాలేమి వెల్లడించాయి

3. (ఎ) ఆదికాండము 3:14, 15 లోని ప్రవచనమందలి, ‘సర్పము,’ ‘స్త్రీ,’ ‘సర్పసంతానం’ ఎవరెవరిని సూచిస్తున్నారు? (బి) ‘సర్పం తల చితకగొట్టుట’ యెహోవా సేవకులకెందుకు అత్యంత ఆసక్తికరమైన విషయమైయుంటుంది?

3 అట్టి ప్రవచనాల్లో మొదటిది ఏదెనులో తిరుగుబాటు జరిగిన తర్వాత చెప్పబడింది. సర్పాన్ని ఉద్దేశించి యెహోవాచెప్పిన తీర్పులో అది చేర్చబడింది. యెహోవా ఇట్లన్నాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువు.” (ఆది. 3:14, 15) దాని భావమేమైయుండెను? దేవుని నియమిత కాలంలో ఇతర ప్రవచనాలు దానిని స్పష్టపరచి, దానికి విశాల భావాన్నిచ్చాయి. ఫలితంగా సర్పమని ఎవరినుద్దేశించి చెప్పబడిందో అతడు అపవాదియగు సాతనును సూచిస్తున్నాడని మనకు తెలిసింది. ఆ “స్త్రీ” యెహోవాయొక్క యథార్థమైన పరలోక సంస్థ, ఆయనకు నమ్మకమైన భార్యను పోలియున్నది. ‘సర్ప సంతానమందు’ అపవాది ఆత్మను కనుబరచునట్టి, యెహోవాను ఆయన ప్రజల్ని వ్యతిరేకించునట్టి దూతలు మరియు మానవులు చేరియున్నారు. ఏదెనులో అపవాది సర్పాన్ని ఉపయోగించిన విధానం దృష్ట్యా, ‘సర్పం తల చితకగొట్టుట,’ యెహోవాపై కొండెములు చెప్పి మానవజాతికి ఎంతో గొప్ప దుఃఖము కలుగజేసిన దేవుని ఈ తిరుగుబాటు కుమారుని అంతిమ నాశనాన్ని సూచిస్తున్నట్లు ప్రవచనానుసారంగా గ్రహించవచ్చును. అయితే తల చితకగొట్టు ‘సంతానాన్ని’ గుర్తించుట చాలాకాలం వరకు ఒక పరిశుద్ధ మర్మముగానే నిలిచిపోయింది.—రోమా. 16:25, 26.

4. ఆయనే వాగ్దాన సంతానమని గుర్తించడానికి యేసు వంశావళి ఎలా సహాయం చేసింది?

4 మానవ చరిత్రలో దాదాపు 2,000 సంవత్సరాల తర్వాత యెహోవా మరిన్ని వివరాలను దయచేశాడు. అబ్రాహాము వంశావళిలో ఆ సంతానం వస్తాడని ఆయన సూచించాడు. (ఆది. 22:15-18) అయితే, సంతానానికి నడుపు వంశావళి కేవలము శరీర సంబంధమైన వారసత్వంపై కాదుగాని దేవుని ఎంపికపై ఆధారపడివుంటుంది. తన దాసియైన హాగరుకు జన్మించిన తన కుమారుడగు ఇష్మాయేలు మీద అబ్రాహాముకు ప్రేమవున్ననూ, యెహోవా నిర్మొహమాటంగా ఆయనతో ఇట్లన్నాడు: “శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదను.” (ఆది. 17:18-21; 21:8-12) ఆ తర్వాత ఆ నిబంధన ఇస్సాకు ప్రథమ పుత్రుడైన ఏశావుతో కాదుగాని ఇశ్రాయేలు జనాంగపు 12 గోత్రములు ఎవరినుండి ఉద్భవించెనో ఆ యాకోబుతో స్థిరపర్చబడింది. (ఆది. 28:10-14) యుక్తకాలంలో ఆ సంతానము యూదాగోత్రంలో, దావీదు కుటుంబమందు జన్మిస్తాడని సూచింపబడింది.—ఆది. 49:10; 1 దిన. 17:3, 4, 11-14.

5. యేసు భూపరిచర్య తొలికాలంలోనే, మరియేదికూడ ఆయనే మెస్సీయని రుజువుచేసింది?

5 దాదాపు 700 సంవత్సరాలకు ముందే, మానవునిగా ఆ సంతానం జన్మించే స్థలం బేత్లెహేమని చెప్పడమే కాకుండా ఆయన పరలోకంలో సృష్టింపబడిన “పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము” ఉనికిలో ఉండెననికూడ బైబిలు వెల్లడిచేస్తున్నది. (మీకా. 5:2) యెహోవాచే అభిషేకింపబడిన మెస్సీయగా ఆయన ఈ భూమిపై అవతరించే కాలాన్ని దానియేలు ప్రవక్త ముందే చెప్పాడు. (దాని. 9:24-26) ఆలాగే ఆయన పరిశుద్థాత్మచే అభిషేకించబడినప్పుడు, పరలోకంనుండి ఒక స్వరం ఆయనను గుర్తించింది. (మత్త. 3:16, 17) కాబట్టి, యేసు అనుచరుడైన తర్వాత గట్టి ఒప్పుదలతో ఫిలిప్పు, “ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు [దత్తత తీసుకున్న] కుమారుడైన నజరేయుడగు యేసు అని” చెప్పగల్గాడు.—యోహా. 1:45.

6. (ఎ) యేసు మరణం తర్వాత ఆయన అనుచరులు ఏమి గ్రహించారు? (బి) ముఖ్యంగా ‘స్త్రీ సంతానం’ ఎవరు, ఆయన సర్పం తల చితకగొట్టడంలో ఏ భావమున్నది?

6 ఆ తర్వాత, యేసు అనుచరులు అక్షరార్థంగా ఆయనకు సంబంధించిన అనేక ప్రవచనాలు ప్రేరేపిత లేఖనాల్లో పొందుపర్చబడ్డాయని గ్రహించారు. తన మరణపునరుత్థానముల తర్వాత ఆయనే వ్యక్తిగతంగా “లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.” (లూకా 24:27) ముఖ్యంగా ఇప్పుడా ‘స్త్రీ సంతానం’ యేసని, ఆయనే “సర్పము” తలను ఎంతగా చితకగొట్టునంటే సాతాను చివరకు ఉనికిలో లేకుండాపోతాడనే విషయం స్పష్టమయ్యింది. యేసు మూలంగా మనం మనఃపూర్వకంగా కోరుకొనే అన్ని సంగతులు అనగా, మానవజాతికి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి.—2 కొరిం. 1:20.

7. ఈ ప్రవచనాల్లో సూచింపబడిన వ్యక్తిని గుర్తించడానికి తోడుగా మరిదేనిని కూడ పరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుంది?

7 ఈ ప్రవచనాల్లో కొన్నింటిని మొదట చదివినప్పుడు, బహుశ ఐతియొపీయుడైన నపుంసకునివలె మీరిలా ప్రశ్నించియుంటారు, “ప్రవక్త యెవనినిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు?” అయితే తనకు జవాబు లభించినప్పుడు తనకెందుకని ఆ నపుంసకుడు ఊరుకొనలేదు. ఫిలిప్పు ఇచ్చిన వివరణను జాగ్రత్తగా విన్న తర్వాత, ప్రవచనాన్ని యేసు నెరవేర్చిన విధానంయెడల మెప్పు తాను బాప్తిస్మం పొందుటద్వారా, తను చేపట్టవలసిన చర్యకు పిలుపునిచ్చిందని ఆయన గ్రహించాడు. (అపొ. 8:32-38; యెష. 53:3-9) మనం అదేరీతిగా ప్రతిస్పందిస్తామా? కొన్నిసార్లు ప్రవచనం అందింపబడిన విధానం మనల్ని బహుగా ప్రేరేపిస్తుంది, లేదా దాని నెరవేర్పు సూచింపబడినప్పుడు బైబిలే తేటగా తేల్చిచెప్పు విషయాలు మన హృదయాల్ని స్పర్శించవచ్చు.

8. ఇక్కడ యేసుక్రీస్తుకు సంబంధించిన నాలుగు ప్రవచనార్థక ఉదాహరణలు పరిశీలించబడ్డాయి. ఈ ప్రవచనాలు మనపై ఎలా ప్రభావం కలిగివుంటాయో చూపడానికి ఇవ్వబడిన ప్రశ్నలపై, లేఖనాలపై తర్కించండి. ఒక్కొక్కటిగా మాత్రమే విచారించండి.

8 యేసుక్రీస్తును గూర్చిన ఈ క్రింది ప్రవచనార్థక వాగ్దానాలు, ఉదాహరణలు ఆ ప్రకారమే ఎలావున్నాయో గమనించండి. చూపబడిన లేఖనాల సహాయంతో మీరే ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

(1) తన కుమారుని ద్వారా విమోచన క్రయధనాన్ని దయచేయడంలో యెహోవా చేసిన కార్యాన్ని అభినందించడానికి ఇస్సాకును బలియివ్వడానికి అబ్రాహాము చేసిన ప్రయతాన్ని గూర్చిన వృత్తాంతం మనకెలా సహాయం చేస్తుంది? (యోహా. 3:16; ఆది. 22:1-18 [రెండవ వచనంలో ఇస్సాకు ఎలా వర్ణించబడ్డాడో గమనించండి.])

ఇది మనకెలాంటి దృఢనమ్మకాన్ని కల్గించాలి? (రోమా. 8:32, 38, 39)

అయితే మనమేమిచేయాలి? (ఆది. 22:18; యోహా. 3:36)

(2) యేసు, మోషేవంటి ప్రవక్తేనని సూచించడంలో, బైబిలు ఏ గంభీరమైన బాధ్యతను మనకు గుర్తుచేస్తోంది? (అపొ. 3:22, 23; ద్వితీ. 18:15-19)

యేసు మనకుచెప్పిన కొన్ని సంగతులేవి, అవి ఇప్పుడు ఎందుకు సమయానుకూలమై యున్నవి? (మత్త. 28:18-20; 19:4-9; 18:3-6)

(3) అహరోను యాజకత్వం ద్వారా ఛాయగా చూపబడిన దానిని వివరించునప్పుడు, ప్రధానయాజకునిగా యేసుకున్న ముచ్చటైన ఏ లక్షణాలవైపు బైబిలు మన అవధానాన్ని మళ్లిస్తుంది? (హెబ్రీ. 4:15–5:3; 7:26-28)

కాబట్టి మన బలహీనతల్ని అధిగమించడానికి సహాయం కొరకు క్రీస్తు ద్వారా ప్రార్థనయందు దేవుని సమీపించుటను మనమెలా భావించాలి?

(4) (మోషే ధర్మశాస్త్రం క్రింద అర్పింపబడిన బలులన్నిటి స్థానేవచ్చిన) యేసు బలి ఔన్నత్యం దృష్ట్యా, దేవుని అప్రీతిపరచునని మనకు తెలిసిన దేనినైనాచేసే అలవాటులో పడిపోకుండా తప్పించుకొనుటకు మనమెందుకు బహు జాగ్రత్తగా ఉండాలి? (హెబ్రీ. 10:26, 27)

యేసు బలిమూలంగా జీవ నిరీక్షణ సాధ్యపర్చబడిందని మనం నిజంగా అభినందిస్తే, మనమే సంగతులను పట్టుదలతో చేస్తాము? (హెబ్రీ. 10:19-25)

క్రీస్తునందు మనం విశ్వాసాన్ని ఎలా చూపగలం?

9. యేసుక్రీస్తు లేకుండా మనకెందుకు రక్షణ లేదు?

9 యెరూషలేము ఉన్నత న్యాయస్థానంలో, యేసునందు ప్రవచనమెలా నెరవేరిందో సూచించిన తర్వాత, అపొస్తలుడైన పేతురు గట్టిగా ఇలా తేల్చిచెప్పాడు: “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” (అపొ. 4:11, 12; కీర్త. 118:22) ఆదాము సంతతి వారందరు పాపులు గనుక పాపపు శిక్షగా వారు మరణిస్తున్నారు, వారిలో ఎవరికీ మరొకరిని విమోచించే అర్హత లేదు. అయితే యేసు పరిపూర్ణుడు గనుక ధారపోసే ఆయన జీవానికి బలివిలువ ఉంది. (కీర్త. 49:6-9; హెబ్రీ. 2:9) ఆదాము తన సంతతి కొరకు పోగొట్టుకున్న దానికి సరిసమానమైన విమోచన క్రయధనాన్ని ఆయన దేవునికి సమర్పించాడు. అది మనకెలా ప్రయోజనమిచ్చింది?—1 తిమో. 2:5, 6.

10. యేసు బలి మనకెంతో గొప్ప ప్రయోజనాన్నిచ్చిన ఒక మార్గాన్ని వివరించండి.

10 పాపక్షమాపణనుబట్టి మనం నిర్మలమైన మనస్సాక్షి కలిగివుండడాన్ని అది సాధ్యపరచింది, ఇది మోషే ధర్మశాస్త్రం క్రింద జంతుబలుల మూలంగా ఇశ్రాయేలీయులు పొందిన దానికంటే మరెంతో గొప్పది. (అపొ. 13:38, 39; హెబ్రీ. 9:13, 14) దీనిని కలిగివుండుటకు, మనకైమనం యథార్థంగా ఉండటం, యేసుక్రీస్తునందు నిజమైన విశ్వాసం కలిగివుండటం అవసరం. క్రీస్తు బలి మనకెంత అవసరమో మనం వ్యక్తిగతంగా గుణగ్రహిస్తున్నామా? “మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.”—1 యోహా. 1:8, 9.

11. దేవునియెడల నిర్మలమైన మనస్సాక్షిని సంపాదించుటకు నీటి బాప్తిస్మము ఎందుకు ప్రాముఖ్యం?

11 తాము పాపులమని తమకు తెలుసని, క్రీస్తునందు తమకు నమ్మకం కలదని చెప్పుకొంటూ, యేసువలె దేవుని రాజ్యాన్ని గూర్చి కొంతమేరకు ఇతరులకు ప్రకటించిననూ అట్టివారు కొందరు యేసునందు పూర్తి నమ్మకం చూపలేకపోవచ్చు. ఏ విధంగా? బైబిల్లో చూపబడినట్లుగా, మొదటి శతాబ్దంలో నిజంగా విశ్వాసులైన వారు బహిరంగముగా దానినెలా ప్రదర్శించారు? వారు బాప్తిస్మం పొందారు. ఎందుకు? ఎందుకనగా తన శిష్యులు బాప్తిస్మం పొందాలని యేసు ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19, 20; అపొ. 8:12; 18:8) యేసుక్రీస్తు ద్వారా యెహోవా ప్రేమతో చేసిన ఏర్పాటునుబట్టి ఒకవ్యక్తి హృదయం నిజంగా ప్రేరేపింపబడినప్పుడు అతడు వెనుకంజవేయడు. తన జీవితంలో అవసరమైన ఎట్టి మార్పులనైనా చేసుకుని, అతడు తనను దేవునికి సమర్పించుకుని దానిని నీటి బాప్తిస్మం ద్వారా ప్రదర్శిస్తాడు. బైబిలు చూపునట్లుగా, ఈ విధంగా తన విశ్వాసాన్ని ప్రదర్శించడం ద్వారా అతడు ‘నిర్మలమైన మనస్సాక్షి కొరకు దేవునికి విన్నపం’ చేసుకుంటాడు.—1 పేతు. 3:21.

12. పాపం చేశామని మనం గ్రహిస్తే దాని విషయమై మనమేం చేయాలి, ఎందుకు?

12 దాని తర్వాత కూడ పాపపు లక్షణాలు కనబడుతూనే ఉంటాయి. అప్పుడేమి? “మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను” అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు. గనుక, క్రియద్వారా, మాటద్వారా లేక స్వభావంద్వారా పాపం మనలో వ్యక్తపర్చబడినప్పుడు దాన్ని తేలికగా ఉపేక్షించకూడదు. అయినప్పటికిని, “ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.” (1 యోహా. 2:1, 2) అంటే మనమేమి చేసిననూ, ‘మా పాపములు క్షమించుమని’ దేవునికి ప్రార్థిస్తే ఇక అన్నీ చక్కబడినట్లేనని దాని భావమా? కాదు. క్షమాపణకు కీలకము నిజమైన పశ్చాత్తాపమే. క్రైస్తవసంఘ పెద్దలనుండి కూడ సహాయం అవసరం కావచ్చు. చేయబడిన తప్పిదాన్ని గుర్తించి, దానిని మరలా చేయకుండా ఉండుటకు యథార్థంగా ప్రయత్నించేలా దాని విషయమై మనం దుఃఖించాలి. (అపొ. 3:19; యాకో. 5:13-16) మనం దీనినిచేస్తే, మనకు యేసు సహాయం చేస్తాడనే హామి ఉంటుంది. ఆయన పాప విమోచన విలువగల బలియందు మన విశ్వాసం ఆధారంగా యెహోవా అనుగ్రహం తిరిగిపొందడం సాధ్యపడుతుంది మరియు మన ఆరాధన ఆయనకు అంగీకృతంగా ఉండాలంటే ఇది అవశ్యము.

13. (ఎ) యేసు బలి మనకు ప్రయోజనమిచ్చిన మరోమార్గాన్ని వివరించండి. (బి) దేవునికి మనంచేసే సేవ ఈ బహుమానాన్ని మనకెందుకు సంపాదించదు? (సి) అయితే మనకు నిజంగా విశ్వాసముంటే, మనమేం చేస్తుంటాము?

13 యేసు ఇచ్చిన బలి, “చిన్నమందకు” పరలోకమందు, మానవజాతిలోని ఇతర కోటానుకోట్ల మందికి పరదైసు భూమిపై నిత్యజీవపు అవకాశాన్ని కూడా తెరచింది. (లూకా 12:32; ప్రక. 20:11, 12; 21:3, 4) ఇది మనమే సంపాదించుకోగల బహుమానం కాదు. యెహోవా సేవలో మనమెంత చేసినా, దేవుడే మనకు జీవం రుణపడ్డాడనే అర్హతను మనమెన్నటికి సంపాదించలేము. “దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” (రోమా. 6:23; ఎఫె. 2:8-10) అయినప్పటికి, ఆ కృపావరమందు మనకు విశ్వాసమూ అది సాధ్యపర్చబడిన విధానం ఎడల అభినందన ఉంటే, దీనిని మనం కనబరుస్తాము. తన చిత్తం నెరవేర్చడంలో యెహోవా మహాద్భుతంగా యేసును ఉపయోగించడాన్ని, ఆలాగే యేసు అడుగుజాడల్ని మనందరం జాగ్రత్తగా అనుసరించడం ఎంత అవశ్యమో వివేచిస్తే మనం మన జీవితంలో క్రైస్తవ పరిచర్యనొక అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా చేస్తాము. దేవుని ఈ మహిమాన్విత కృపావరాన్ని గూర్చి ఒప్పుదలతో ఇతరులకు తెలియజేయుటలో మన విశ్వాసం స్పష్టమౌతుంది.—అపొ. కార్యములు 20:24 పోల్చండి.

14. యేసుక్రీస్తు నందలి అట్టి విశ్వాసం ఎలా ఐక్యపరచు ప్రభావం కలిగివుంది?

14 అట్టి విశ్వాసం ఎంత శ్రేష్ఠమైన, ఐక్యపరచే ప్రభావం కలిగివుందోగదా! దాని మూలంగా మనం యెహోవాకు, ఆయన కుమారునికి, క్రైస్తవ సంఘంలో ఒకరికొకరం మరింత చేరువౌతాం. (1 యోహా. 3:23, 24) యెహోవా దయతో తన కుమారునికి “పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, [దేవుని నామము మినహా] ప్రతి నామమునకు పైనామమును” అనుగ్రహించాడని ఆనందించుటకు మనకది కారణమౌతుంది.—ఫిలి. 2:9-11.

పునఃసమీక్షా చర్చ

• మెస్సీయ కనబడినప్పుడు, దేవుని వాక్యాన్ని నిజంగా నమ్మిన వారికి ఆయన గుర్తింపు ఎందుకు స్పష్టంగా ఉండెను?

• పేజీ 34 లో చూపబడినట్లు యేసునందు నెరవేరిన ప్రవచనార్థక ఉదాహరణలు మనపై ఎలా ప్రభావం చూపాలి?

• యేసు బలి ఇప్పటికే ఏయే విధాలుగా మనకు ప్రయోజనమిచ్చింది? దానియెడల మన మెప్పును మనమెలా చూపగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[34వ పేజీలోని బాక్సు/చిత్రం]

యేసును గూర్చిన ప్రవచనార్థక ఉదాహరణలు—అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేయాలి?

అబ్రాహాము ఇస్సాకును అర్పించుట

మోషే దేవుని ప్రతినిధిగా మాట్లాడుట

ప్రధాన యాజకునిగా అహరోను

జంతు బలులు