కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యదేవునిగా యెహోవాను ఘనపర్చండి

సత్యదేవునిగా యెహోవాను ఘనపర్చండి

అధ్యాయం 2

సత్యదేవునిగా యెహోవాను ఘనపర్చండి

1. (ఎ) సత్య దేవుడెవరు? (బి) మనమాయనను గూర్చి నేర్చుకొనుచుండగా, మన జీవితాలెలా ప్రభావం చెందాలి?

దేవతలని పిలువబడిన వారు అనేకులున్ననూ, “మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. . . . ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు” అని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు వ్రాశాడు. (1 కొరిం. 8:5, 6) పౌలు సూచించిన ఆ “ఒక్కడే దేవుడు” సమస్తాన్ని సృష్టించిన యెహోవాయే. (ద్వితీ. 6:4; ప్రక. 4:11) ఆయన లక్షణాల్ని, మానవజాతికి ఆయన చేసిన వాటిని నేర్చుకుని, మెప్పుదలచూపే వ్యక్తులు నిరాటంకముగా ఆయనకు దగ్గరౌతారు. దాని ఫలితం? వారు సహజంగానే తాము మిక్కిలి శ్లాఘించే ఆ వ్యక్తిని ఇటు మాటల ద్వారా, అటు క్రియల ద్వారా మహిమపరుస్తారు. దేవునియెడల వారి ప్రేమ పెరుగుచుండగా, ఆయనను గూర్చి ఇతరులకు చెప్పడానికి వారు పురికొల్పబడతారు, మానవులుగా తమకు సాధ్యమైనంత మేరకు ఆయనను అనుకరించుటకు వారు ఇచ్ఛయిస్తారు. అలాచేయాలని మనందరిని ప్రోత్సహిస్తూ బైబిలిలా చెబుతున్నది: “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి . . . ప్రేమగలిగి నడుచుకొనుడి.” (ఎఫె. 5:1, 2) ఆ సలహాను అన్వయించడానికి యెహోవా నిజంగా ఎట్టివాడో మనం తెలుసుకోవాలి.

యెహోవా వ్యక్తిత్వం

2. ఆయనను స్తుతించడానికి మనల్ని పురికొల్పే దేవుని కొన్ని ప్రముఖ లక్షణాలు ఏవి?

2 దేవుని ప్రముఖ లక్షణాల్ని సూటిగా గుర్తించే వాక్యాలు బైబిలంతటిలో అనేకం ఉన్నాయి. మీరు వీటిని చదివినప్పుడు, నిజానికి ఆ లక్షణాలేమిటి, అవి మీకెంత ప్రాముఖ్యమో తలంచడానికి సమయం తీసుకోండి. ఉదాహరణకు: “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహా. 4:8) “ఆయన చర్యలన్నియు న్యాయములు.” (ద్వితీ. 32:4) ‘ఆయనయొద్ద జ్ఞానమున్నది.’ (యోబు 12:13) ఆయన “బలాతిశయము” గొప్పది. (యెష. 40:26) ఈ లక్షణాల్ని ధ్యానిస్తుండగా, ఆయనను కొనియాడుటకు దేవునియెడల మీకున్న మెప్పుచే మీరు కదలింపబడతారా?

3. యెహోవా వ్యక్తిత్వంలోని ఏ ఇతర విషయాలు బహుగా చెప్పుకోదగినవిగా ఉన్నాయి?

3 చెప్పుకోదగిన ఆయన వ్యక్తిత్వాన్ని మనకు మరింత పరిచయంజేస్తూ, యెహోవా ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు.’ (నిర్గ. 34:6) ‘యెహోవా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు.’ (కీర్త. 86:5) ‘తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నదని.’ (2 దిన. 16:9) ‘దేవుడు పక్షపాతి కాడని, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించునని.’ (అపొ. 10:34, 35) యెహోవా ‘ధారాళముగా దయచేయువాడని,’ ‘శ్రీమంతుడగు దేవుడని’ బైబిలు మనకు తెలియజేస్తున్నది. (యాకో. 1:5; 1 తిమో. 1:11) సాటిలేని ఈ దేవుని సేవిస్తూ ఆయన ప్రేమగల శ్రద్ధను చవిచూచుట ఎంత ఉపశమనాన్నిస్తుందో గదా!

4. (ఎ) ఎలాంటి భక్తిని యెహోవా కోరుతున్నాడు, అదెంత ప్రాముఖ్యం? (బి) దేనిలో భాగం వహించుడని కీర్తన 34:3 మనల్ని ఆహ్వానిస్తున్నది?

4 ఈ లక్షణాలకు పొందికగా ఆయన “రోషముగల దేవుడను” మాట కూడ వాస్తవం. (నిర్గ. 20:5) ఆమోదయోగ్యంగా ఆయనను సేవించడానికి మనమాయనయెడల సంపూర్ణ భక్తిని ప్రదర్శించాలి. అదే సమయంలో సాతాను దేవతగానున్న ఈ లోకాన్నికూడ మనం ప్రేమించలేము. (1 యెహా. 2:15-17; 2 కొరిం. 4:3, 4) కపటనీతిని యెహోవా పసిగట్టగలడు. మనమేమి చేస్తామనేదే కాకుండా దాన్నిగూర్చి మన భావమేమిటి, మనమెట్టి వ్యక్తులుగా ఉండ ప్రయత్నిస్తున్నామో కూడ ఆయనకు పూర్తిగా తెలుసు. మనం నిజంగా నీతిని ప్రేమిస్తే, ఆయన మనకు సహాయం చేస్తాడు. (యిర్మీ. 17:10; సామె. 15:9) యెహోవా అట్టివాడైయున్నందున, “నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము” అని బైబిలు కీర్తనల రచయిత ఇచ్చిన ఆహ్వానాన్ని భూవ్యాప్తంగా లక్షలాదిమంది సంతోషంగా అంగీకరించారు. (కీర్త. 34:3) వారిలో మీరునూ ఒకరైయున్నారా?

5. యెహోవా వ్యక్తిత్వాన్ని గూర్చిన మన అధ్యయనం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి మనకేది సహాయం చేస్తుంది?

5 ఆయన ఉన్నత లక్షణాల్ని మీరు నిశితంగా పరిశీలిస్తే, దేవుని గూర్చి మాట్లాడాలనే మీ కోరిక మరింత బలపడుతుంది, ఆయనను అనుకరించడానికి మీరుచేసే ప్రయత్నాల్లో మీకెంతో సహాయం లభిస్తుంది. (1) కచ్చితంగా ప్రతి లక్షణం ఏమైయున్నది, బహుశ దీన్ని ఏది ఇతర లక్షణాలతో విభిన్నమైన దానిగా చేస్తుంది, (2) యెహోవా దీనినెలా ఎవరియెడల ప్రదర్శించాడు, ఆలాగే (3) మీరు దీన్నెలా కనబరచగలరు లేదా మీ దృక్కోణంపై ఇదెలా ప్రభావం చూపాలో అన్న విషయాలను తెలుసుకోండి.

6. ప్రేమనొక ఉదాహరణగా ఉపయోగిస్తూ, యెహోవా లక్షణాల్ని మీరెలా పరీక్షించవచ్చో చూపండి. మీ జవాబుల్లో లేఖనాల్ని చేరుస్తూ, ఈ పేరా చివర ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబివ్వడం ద్వారా దీన్ని చేయండి.

6 ఇక్కడ ఓ ఉదాహరణను పరిశీలించండి. “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెప్పునప్పుడు దాని భావమేమి? (1 యెహా. 4:8) నిజమే, ప్రేమలో అనేక రకాలున్నాయి. ఈ వచనంలో ఉపయోగింపబడిన గ్రీకు పదము అగాపే, ఇది యెహోవా దేవునియందే మూర్తీభవింపబడినట్లు అత్యున్నతమైన ప్రేమను సూచిస్తున్నది. అట్టి ప్రేమ పూర్తిగా నిస్వార్థంతో వ్యక్తపర్చేదైయున్నది. దానిని మనస్సులో ఉంచుకొని, చూపబడిన లేఖనాలు ఉపయోగిస్తూ ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు మీ స్వంత మాటల్లో జవాబులు చెప్పండి.

యెహోవా సృష్టికార్యాల్లో ఈ లక్షణమెట్లు ప్రదర్శింపబడింది? (అపొ. 14:16, 17)

మానవజాతియెడల యెహోవాచూపిన ప్రేమకు అత్యంత విశేషమైన మాదిరి ఏమైయుంది? (యోహా. 3:16) మనిషి మంచితనాన్నిబట్టే యెహోవా దీనిని చేశాడా? (రోమా. 5:8)

యెహోవా తన కుమారునిద్వారా చేసింది మనం మన జీవితాల్ని ఉపయోగించే విధానంపై ఎలా ప్రభావం చూపాలి? (2 కొరిం. 5:14, 15, 18, 19)

క్రైస్తవులుగా మన తోటి క్రైస్తవులయెడల అదే విధమైన ప్రేమను కలిగియున్నామని ఏయే విధాలుగా మనం చూపవచ్చు? (1 కొరిం. 13:4-7; 1 యోహా. 4:10, 11; 3:16-18)

మరింకెవరియెడల కూడా మనం ప్రేమ చూపాలి, ఎలా? (మత్త. 5:43-48; 28:19, 20; గల. 6:10)

7. మీ వ్యక్తిగత పఠనంలో, యెహోవా ఇతర లక్షణాల్ని గూర్చి ఇదే విధమైన సమాచారాన్ని మీరెలా కనుగొనగలరు?

7 యెహోవా ఇతర లక్షణాలను మరికొన్నింటిని కూడ పరిశోధించాలని మీరిష్టపడుచున్నారా? ఆరంభించడానికి, మీ వ్యక్తిగత పఠనంలో “న్యాయం,” “జ్ఞానం,” ఆ తర్వాత బహుశ “కృప,” “కనికరం” అనే లక్షణాల్ని తెలిసికోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? కావలికోట ప్రచురణల విషయసూచికల్ని (ఆంగ్లం), బైబిలు ఆకారాదిసూచిక (ఆంగ్లం) నుపయోగించుట ద్వారా విజ్ఞానదాయకమైన సమాచార నిధిని మీరు కనుగొంటారు.

దేవుని గూర్చిన సత్యాన్ని నేర్చుకోవడానికి ఇతరులకు సహాయపడండి

8. (ఎ) లోకమందలి ప్రజలు ఎటువంటి దేవుళ్లను ఆరాధిస్తున్నారు? (బి) ఈ గందరగోళమంతటి వెనుక ఎవరున్నారు, అలా మీరెందుకు చెప్తారు?

8 సత్యదేవుని ఆరాధనకు వ్యతిరేకంగా మానవులు అక్షరార్థంగా లక్షలాది ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు. నాల్గవ శతాబ్దంలో క్రైస్తవ మతసామ్రాజ్యం అంతకుముందు బబులోనీయులు, ఐగుప్తీయులు, హిందువులు, బౌద్ధులు బోధించిన “త్రిత్వాన్ని” హత్తుకొంది. దేవుని గూర్చిన ఈ నమ్మకానికి తోడుగా, శక్తిమంతులైన పరిపాలకులు, ప్రముఖ క్రీడాకారులు, గాయకులు దేవతలుగా ఆరాధింపబడుతున్నారు. డబ్బు, స్వార్థం, లైంగికత్వం కూడా దేవుళ్లుగా భక్తితో పూజింపబడుతున్నాయి. వీటన్నిటి వెనుక ఎవరున్నారు? “ఈ యుగ సంబంధమైన దేవత” అయిన అపవాదియగు సాతానే. (2 కొరిం. 4:4; 1 కొరిం. 10:20) ఊహకొచ్చే ప్రతివిధమైన కుతంత్రము ద్వారా ప్రజలను యెహోవానుండి దూరం చేయడానికి లేదా కనీసం వారి భక్తిని విభజించడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు.

9. దేవుని గూర్చిన సత్యాన్ని నేర్చుకోవడానికి ఎవరికైనా సహాయం చేయడానికున్న శ్రేష్ఠమైన మార్గమేది?

9 దేవుని గూర్చిన సత్యాన్ని తెలుసుకోవడానికి అట్టి వ్యక్తులకు అనగా నామకార్థ క్రైస్తవులైనా లేక ఇతరులైనా వారికి మనమెలా సహాయపడగలం? సత్యదేవుడెవరు, ఆయనెటువంటి వ్యక్తియని బైబిలు స్వయంగాచెప్పే విషయాల్ని సహాయకరంగా చూపడమే ఒక శ్రేష్ఠమైన విధానం. ఆ పిమ్మట మనం మన స్వంత జీవితాల్లో దైవ లక్షణాల్ని ప్రతిబింబించే ప్రవర్తన ద్వారా దానిని బలపర్చాలి.—1 పేతు. 2:12.

10. ఒక త్రిత్వవాదితో మాట్లాడేటప్పుడు, అతడు నమ్మునదేదో మనకు కచ్చితంగా తెలుసునని తలంచుట ఎందుకు జ్ఞానయుక్తం కాదు?

10 అయితే క్రైస్తవ మతసామ్రాజ్య చర్చీల సభ్యులు కొందరు “త్రిత్వము”నందలి తమ నమ్మకము లేఖనసహితమని మీతో వాదిస్తే అప్పుడేమి? “త్రిత్వ” సిద్ధాంతానికి అధికారిక వ్యాఖ్యలున్ననూ, దాని విషయంలో అనేకమందికి తమ స్వంత అభిప్రాయాలున్నవని మొదట గ్రహించాలి. వారెరిగిన దానిని వ్యక్తపరచుటకు వారినాహ్వానించి, ఆ పిమ్మట వారి బైబిలునుండే వారి నమ్మకాలను పోల్చిచూచుటకు సహాయపడండి. యుక్తసమయంలో, చర్చి అధికారిక బోధను కూడ దేవుని వాక్యంతో పోల్చిచూచుటకు వారిని ప్రోత్సహించండి.

11. ఈ ఐదు ముఖ్యాంశాల్లో ఒక్కొక్కటి మాత్రమే తీసుకుంటూ, లేఖనరహిత “త్రిత్వ” సిద్ధాంతంపై తర్కించడానికి ఈ పేరాలో ఇవ్వబడిన ప్రశ్నల్ని, లేఖనాల్ని ఉపయోగించండి.

11 యథార్థపరులకు సహాయం చేయాలనే కోరికను మనస్సునందుంచుకొని, క్రింద ఇవ్వబడిన లేఖనాలు చూపే అంశాలనుబట్టి తర్కించడానికి ఆ వచనాల్ని మీరెలా ఉపయోగించగలరో పరిశీలించండి:

(1) (తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే) దైవములు ముగ్గురున్ననూ, వారు ఏకదేవునిగానే ఉన్నారను అభిప్రాయాన్ని కొందరు త్రిత్వవాదులు నొక్కిచెబుతుంటారు.

కాని అపొ. కార్యములు 2:4, 17 “పరిశుద్ధాత్మ,” లేక “పవిత్రాత్మ” ఒక వ్యక్తి అని సూచిస్తున్నాయా?

ఈ క్రింది లేఖనాల్లో ప్రతిదానిలో ఎంతమంది వ్యక్తులు సూచింపబడ్డారో గమనించుట ఎందుకు సహాయకరంగా ఉంటుంది? (యోహా. 17:20-22; అపొ. 7:56; ప్రక. 7:10)

(2“త్రిత్వము”నందలి సభ్యులందరూ ఒకే మహిమగలవారని అంటే ఒకరికంటే మరొకరు గొప్పవారిగా లేదా తక్కువ వారిగా లేరని, అందువల్ల వారు సర్వసమానులని సర్వకాలాల్లో ఉన్నవారని కొందరు నమ్ముతారు.

లేఖనాలు దానికి అంగీకరిస్తున్నాయా? (జవాబు కొరకు, యోహాను 14:28; మత్తయి 24:36; ప్రకటన 3:14 చూడండి.)

(3“త్రిత్వమునకు” రుజువుగా కొందరు యోహాను 1:1ని చూపిస్తారు. ఇక్కడ గ్రీకు గ్రంథమందు (“ఒక”) అనే అనిర్దిష్ట ఉపపదం లేదు కాబట్టి ఆ లేఖనాన్ని, “ఒక దేవుడని” కాకుండ “వాక్యము దేవుడై యుండెను” అని చదవాలని వారు వాదిస్తారు.

అయితే యోహాను 1:1 లో ఎంతమంది వ్యక్తులు ప్రస్తావించబడ్డారు? ముగ్గురా? లేక ఇద్దరా? యోహాను 1:18 కూడా “త్రిత్వ” సిద్ధాంతానికి ఎలా భిన్నంగావుంది?

నిజమే, గ్రీకు భాషలో అట్టి అనిర్దిష్ట ఉపపదం లేదు, కాని అనేక భాషల్లో ఉంది. ఆలాగే తలంపులను సరిగా వ్యక్తపర్చుటకు ఆయాభాషల్లో అది ఉపయోగింపబడుతూనేవుంది. యోహాను 1:1ని అనువదించేటప్పుడు అట్టి అనిర్దిష్ట ఉపపదాన్ని ఉపయోగించడం తప్పని ఎవరైనా భావిస్తే, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌, మరితర భాషాంతరాల ప్రకారం అపొస్తలుల కార్యములు 28:6 లో కూడా దానిని వదలివేయడానికి అతడు కోరుకుంటాడా? (యోహాను 1:1ని “వాక్యము దైవికమై యుండెను” అని అనువదించే మరో విధానం ఎన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌లో చూపబడింది, అంటే దేవునికున్న అవే దైవలక్షణాల్ని ఆయన కల్గివున్నాడని దానిభావం.)

(4ఆదికాండము 1:1, 26లో “దేవుడు” అని అనువదింపబడిన ఎలోహిమ్‌ హెబ్రీపదమని, ఇది హెబ్రీలో బహువచనమని, దానికి నిజానికి “దేవుళ్లు” అనే భావం ఉందని కూడా త్రిత్వవాదులు వాదిస్తారు.

“ఏకదేవునిలో” దైవములు ముగ్గురున్నారనే బోధను అదెందుకు బలపర్చదు?

ఆదికాండము 1:1 లో అది “త్రిత్వమును” సూచిస్తే, న్యాయాధిపతులు 16:23 లో బహువచనముగా కాక హెబ్రీ క్రియాపదంతో “దేవత” అని ఏకవచనంగా వాడబడిన ఎలోహిమ్‌ దేన్ని సూచిస్తున్నది?

హెబ్రీలో ఈ వచనాలందు దేవునికి బహువచనం ఎందుకు ఉపయోగింపబడింది? మహిమను లేక ఘనతను తెలియజేయడానికి హెబ్రీలో ఇదో విధానం. ఒకరికంటే ఎక్కువమందిని గూర్చి మాట్లాడితే, వెంటవ్రాయబడు క్రియాపదాలు కూడా బహువచనాలై ఉంటాయి, అయితే పై సందర్భాల్లో విషయమలా లేదు.

(5చర్చీలు యేసుకే అధిక ప్రాధాన్యతయిస్తున్నందున (ఆలాగే అనేక బైబిలు తర్జుమాలనుండి నిజానికి యెహోవా అనే పేరును తొలగించుట వలన), దేవుడని ప్రస్తావించినప్పుడు కొందరు కేవలం యేసును గూర్చే ఆలోచిస్తారు.

అయితే మనం అనుకరించడానికి ఆరాధన విషయంలో యేసు ఎలాంటి మాదిరినుంచాడు? (లూకా 4:8)

12. సరియైన రీతిలో యేసు ఎందుకు తన తండ్రిని “అద్వితీయ సత్యదేవుడని” పిలిచాడు?

12 లేఖనాల్లో యేసు “ఒక దేవుడని,” ఆలాగే “బలవంతుడైన దేవుడని” కూడా చెప్పబడిననూ ఆయన “నా దేవుడును మీ దేవుడును” అని సూచిస్తూ తన తండ్రిని ఘనపర్చాడు. (యోహా. 1:1; 20:17; యెష. 9:6) ‘యెహోవాయే సత్యదేవుడని, ఆయన తప్ప మరియొకడు లేడని’ అంతకుముందు చెప్పిన మోషే మాటలతో ఆయన ఏకీభవించాడు. (ద్వితీ. 4:35) ఆరాధింపబడు విగ్రహాలకు, దేవుళ్లుగా భావించబడిన మానవులకు, అపవాదియగు సాతానుకు పూర్తి భిన్నంగా యెహోవా ఉన్నాడు. అట్టి వారందరికి భిన్నంగా, యేసు పిలిచినట్టుగానే యెహోవా “అద్వితీయ సత్యదేవుడు.”—యోహా. 17:3.

‘యెహోవా నామమందు నడవండి’

13, 14. యెహోవా “నామమెరుగుటలో,” ఆ నామమందు ‘నడుచుకొనుటలో’ ఏమి ఇమిడియుంది?

13 దేవుని గుర్తింపు విషయమై అనేక సంవత్సరాల గందరగోళం తర్వాత, అనేకులు తమ బైబిల్లో దేవుని నామమగు యెహోవాను మొదటిసారి చూసినప్పుడెంతో పులకించిపోతారు. (నిర్గ. 6:3) అయితే వారు ‘అనునిత్యము యెహోవా నామమందు నడిస్తేనే’ వారీ జ్ఞానమును బట్టి శాశ్వతకాల ప్రయోజనం పొందుతారు. (మీకా 4:5) దీనిలో కేవలం యెహోవా నామం తెలుసుకొనుట లేదా యెహోవాసాక్షులమని చెప్పుకొనుటకంటే మరెంతో ఇమిడియుంది.

14 దేవుని నామ విశేషతను గూర్చి కీర్తన 9:10 ఇలా చెబుతున్నది: “యెహోవా . . . నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.” దీనిలో ఏమి ఇమిడియున్నది? దీనిలో కేవలం యెహోవా అను నామమెరుగుట కంటే ఎక్కువ ఇమిడియుంది, అంటే యాంత్రికంగా యెహోవాయందు నమ్మికయుంచుటని దానర్థం కాదు. ఇక్కడ దేవుని “నామమెరుగుట” అనగా యెహోవా దేవుడు ఎట్టి వ్యక్తో గుణగ్రహించుట, ఆయన అధికారాన్ని గౌరవించుట, ఆయన ఆజ్ఞలకు లోబడుటని అర్థము. ఆలాగే ‘యెహోవా నామమందు నడుచుకొనుట’ అనగా ఆయనకు సమర్పించుకొని, ఆయన ఆరాధికుల్లో ఒకనిగా ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తూ, తన జీవితాన్ని నిజంగా దేవుని చిత్తానికనుగుణ్యముగా ఉపయోగించుటని భావం. (లూకా 10:27) మీరలా చేస్తున్నారా?

15. మనం నిత్యం యెహోవాను సేవించాలంటే కర్తవ్యపాలనకు తోడుగా మరింకేమి కావాలి?

15 మనం యెహోవాను నిత్యమూ సేవించాలంటే, కేవలం కర్తవ్యపాలన అనే భావంకంటే ఎక్కువైనదేదో మనల్ని పురికొల్పాలి. అప్పటికే అనేక సంవత్సరాలుగా యెహోవాను సేవిస్తున్న తిమోతికి అపొస్తలుడైన పౌలు ఇలా ఉద్బోధించాడు: “దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.” (1 తిమో. 4:7) దేవభక్తి హృదయంనుండి వస్తుంది; అది చూపబడే వ్యక్తి కొరకైన మెప్పుద్వారా అది పురికొల్పబడుతుంది. “దేవభక్తి” అంటే వ్యక్తిగా యెహోవాకు చూపే లోతైన గౌరవమే. ఆయనయెడల, ఆయన మార్గాలయెడల మెప్పునుబట్టి ఆయనతోవున్న ప్రేమపూర్వక సంబంధాన్ని అది ప్రదర్శిస్తుంది. ప్రతివారు ఆయన నామాన్ని అత్యంత ఉన్నతంగా చూడాలనే మన కోరికకు ఇది కారణమౌతుంది. నిత్యమూ సత్యదేవుడైన యెహోవా నామమందు నడుచుకోవాలంటే, “దేవభక్తిని” మన జీవిత గమ్యంగా లేదా లక్ష్యంగా పెంపొందించుకోవాలి.—కీర్త. 37:4; 2 పేతు. 3:11.

పునఃసమీక్షా చర్చ

• యెహోవా ఎలాంటి వ్యక్తి? ఆయన ప్రతి లక్షణాన్ని స్పష్టంగా అర్థం చేసుకొనుట ద్వారా మనమెట్లు ప్రయోజనం పొందుతాము?

• దేవుని గూర్చిన సత్యాన్ని నేర్చుకోవడానికి ఇతర ప్రజలకు మనమెట్లు సహాయపడగలం?

• యెహోవా “నామమెరుగుటలో,” ఆ నామమందు ‘నడుచుకొనుటలో’ ఏమి ఇమిడియుంది?

[అధ్యయన ప్రశ్నలు]