కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమస్త సృష్టి ఎదుర్కోవాల్సిన వివాదాంశం

సమస్త సృష్టి ఎదుర్కోవాల్సిన వివాదాంశం

అధ్యాయం 6

సమస్త సృష్టి ఎదుర్కోవాల్సిన వివాదాంశం

1. (ఎ) ఏదెనులో సాతాను ఏ వివాదాంశాన్ని లేవదీశాడు? (బి) అతడు చెప్పిన దానినిబట్టి అదెలా వివాదాంశమనే గూఢార్థాన్ని కల్గియున్నది?

ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పుడు సమస్త సృష్టిపై ప్రభావంచూపే ఒక గంభీరమైన వివాదాంశం లేవదీయబడింది. సాతాను హవ్వను సమీపించి ఆమె, ఆమె భర్త ఆదాము తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పాడు. అతడిట్లు అడిగాడు: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” దేవుడు కేవలం ఒక వృక్షాన్ని గురించే, “మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని” హవ్వ జవాబిచ్చింది. అందుకు సాతాను సూటిగా దేవుడు అబద్ధికుడని ఆరోపిస్తూ, ఆదాము హవ్వల జీవితాలు దేవునికి లోబడటంపై ఆధారపడిలేవని చెప్పాడు. దేవుడు తన సృష్టిప్రాణులకు మేలైనది, అనగా జీవితంలో వారు తమ స్వంత నియమాలు పెట్టుకొనే సామర్థ్యాన్ని అడ్డగిస్తున్నాడని అతడన్నాడు. “మీరు చావనేచావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచిచెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని” సాతాను నమ్మబలికాడు. (ఆది. 3:1-5) స్వంతగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తనకు మేలు కలుగుతుందని సాతాను హవ్వను నమ్మించాడు. గూఢార్థంలో, అతడక్కడ దేవుని పరిపాలనా హక్కును, ఆయన పరిపాలనా విధానాన్ని సవాలు చేశాడు. లేవదీయబడిన ఆ వివాదాంశమందు వాస్తవానికి విశ్వ సర్వాధిపత్యము ఇమిడియుండెను.

2. మొదటి మానవజతను ఏది సంరక్షించియుండేది?

2 యెహోవా కొరకైన ప్రేమ హవ్వను సంరక్షించివుండేది. తన భర్త శిరస్సత్వం ఎడల గౌరవం కూడ ఆమె తప్పుచేయకుండా ఆపుజేసియుండేది. అయితే ఆమె తక్షణమే ప్రయోజనమిచ్చునట్లు కన్పించిన దానిని గూర్చి మాత్రమే తలంచింది. నిషేధింపబడింది ఆమె కన్నులకు కోరదగినదిగా కనబడింది. సాతాను తర్కముచే పూర్తిగా మోసగింపబడినదై, ఆమె దేవుని నియమాన్ని ఉల్లంఘించింది. ఆపై ఆమె ఆదాము తనతో చేరునట్లు చేసింది. సాతాను చెప్పిన అబద్ధముచే మోసగింపబడక పోయిననూ, అతను కూడ దేవుని ప్రేమయెడల ఏమాత్రం మెప్పు చూపలేదు. అతను యెహోవా శిరస్సత్వాన్ని లెక్కచేయక, తన తిరుగుబాటు భార్యతోనే ఆ భాగ్యం పంచుకోవడానికి ఎంచుకున్నాడు.—ఆది. 3:6; 1 తిమో. 2:13, 14.

3. (ఎ) యెహోవా సర్వాధిపత్యంపై సాతాను చేసిన ముట్టడికి మరింకే వివాదాంశం దగ్గర సంబంధం కలిగివుంది? (బి) దాని ప్రభావానికి ఎవరు గురయ్యారు?

3 యెహోవా సర్వాధిపత్యంపై సాతాను చేసిన ముట్టడి ఏదెనులో సంభవించిన దానితోనే ఆగిపోలేదు. అక్కడ అతనికి లభించిన విజయం తర్వాత యెహోవాయెడల ఇతరుల యథార్థతను అతడు ప్రశ్నిస్తూవచ్చాడు. ఇది మొదటి దానితో దగ్గర సంబంధమున్న రెండవ వివాదాంశంగా తయారైంది. అతని సవాలునందు ఆదాము సంతానంతోపాటు దేవుని ఆత్మీయ కుమారులు, ఆలాగే యెహోవా ఎంతగానో ప్రేమించిన ఆయన ప్రథమ పుత్రుడు చేరియున్నారు. యోబు కాలంలో, యెహోవాను సేవించువారు దేవున్ని, ఆయన పరిపాలనా విధానాన్ని ప్రేమించుటనుబట్టి కాదుగాని స్వార్థంతోనే వారలా చేస్తున్నారని సాతాను వాదించాడు. కష్టమొస్తే వారు స్వార్థ కోరికలకే లొంగిపోతారని అతడు వాదించాడు. అతని వాదన సరియేనా?—యోబు 1:6-12; 2:1-6; ప్రక. 12:10.

వివాదాంశానికి వారెలా ప్రత్యుత్తరమిచ్చారు

4. అనేకమంది మానవులు ఎందుకు యెహోవా సర్వాధిపత్యాన్ని హత్తుకొనలేదు?

4 తిరుగుబాటునందు సాతానుతో ఇతరులు చేతులుకలిపే సాధ్యతను యెహోవా కొట్టిపారవేయలేదు. వాస్తవానికి, ఏదెనులో తీర్పువిధిస్తూ, దేవుడు ‘సర్పసంతానంగా’ తయారగు వారిని సూచించాడు. (ఆది. 3:15) యేసు మరణానికి పథకంవేసిన పరిసయ్యులు, క్రీస్తును అప్పగించిన ఇస్కరియోతుయూదా వారిలో ఉన్నారు. తమకు తెలియకుండానే వారు తప్పిదంలో పడలేదు. సరియైనదేదో వారికి తెలుసు, అయినా వారు ఉద్దేశపూర్వకంగా యెహోవాకు, ఆయన సేవకులకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అయితే, యెహోవా కట్టడల ప్రకారం నడచుకోని ఇతరులనేకమంది అజ్ఞానంతో ప్రవర్తించారు.—అపొ. 17:29, 30.

5. (ఎ) హవ్వవలె కాకుండ, యెహోవాయెడల యథార్థంగా నిలిచియున్నవారు ఆయన వాక్యాన్ని ఎలా దృష్టించారు? (బి) నోవహు తన యథార్థతను ఎలా నిరూపించుకున్నాడు, ఆయన మాదిరినుండి మనమెలా ప్రయోజనం పొందగలము?

5 వీరందరికి భిన్నంగా, విశ్వాసులైన స్త్రీపురుషులు తాముగా సృష్టికర్తను గూర్చి తెలిసికొని, సర్వాధిపతిగా ఆయనయెడల తమ యథార్థతను నిరూపించుకున్నారు. వారు దేవున్ని నమ్మారు. ఆయన మాటవిని, ఆయనకు లోబడుటపై తమ జీవితాలు ఆధారపడివున్నాయని వారికి తెలుసు. నోవహు అలాంటి మనిషే. కాబట్టి, దేవుడు నోవహుతో “సమస్త శరీరుల . . . అంతము వచ్చియున్నది; . . . నీకొరకు ఓడను చేసికొనుము” అని చెప్పినప్పుడు, నోవహు యెహోవా నడిపింపుకు లోబడ్డాడు. ఆ కాలమందలి ఇతర ప్రజలు హెచ్చరిక ఇవ్వబడిననూ, అసాధారణమైనదేదీ సంభవింపబోవడం లేదని తమ దైనందిన జీవిత వ్యవహారాల్లో మునిగిపోయారు. అయితే నోవహు ఓ పెద్ద ఓడను నిర్మించి, యెహోవా నీతి మార్గాల్నిగూర్చి అవిశ్రాంతంగా ఇతరులకు ప్రకటించాడు. వ్రాయబడిన వృత్తాంతం చెబుతున్నట్లుగా “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.”—ఆది. 6:13-22; హెబ్రీయులు 11:7 మరియు 2 పేతురు 2:5 కూడ చూడండి.

6. (ఎ) యథార్థపరుల్లో మరింకే విశేషగుణాలున్నవి? (బి) ఈ లక్షణాల్ని శారా ఎలా కనబరచింది, ఆమె మాదిరినుండి మనమేవిధంగా ప్రయోజనం పొందగలము?

6 శిరస్సత్వపు సూత్రంయెడల అమిత గౌరవంతోపాటు, యెహోవా కొరకైన వ్యక్తిగత ప్రేమకూడ యథార్థపరుల్లో ప్రముఖంగా ఉండేది. తన భర్తకంటే ముందే నిర్ణయం తీసుకున్న హవ్వవలె వారు లేరు. లేక యెహోవా నియమాన్ని పెడచెవినబెట్టిన ఆదామువలెనూ వారు లేరు. అబ్రాహాము భార్యయైన శారా ఈ చక్కని లక్షణాల్ని ప్రదర్శించింది. మాటల్లోనే కాదు ఆమె హృదయంలో కూడ అబ్రాహాము ఆమె ‘యజమానిగా’ ఉండెను. అంతేకాకుండ, ఆమె వ్యక్తిగతంగా యెహోవాను ప్రేమించిన, విశ్వాసురాలైన స్త్రీయై ఉండెను. అబ్రాహాముతో కలిసి ఆమె, “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణము [దేవుని రాజ్యము] కొరకు” ఎదురుచూసింది.—1 పేతు. 3:5, 6; హెబ్రీ. 11:10-16.

7. (ఎ) ఏ పరిస్థితుల క్రింద మోషే యెహోవా సర్వాధిపత్యాన్ని హత్తుకున్నాడు? (బి) ఆయన మాదిరి మనకెలా ప్రయోజనమిస్తుంది?

7 అబ్రాహాము తన స్వదేశం విడిచిన దాదాపు 430 సంవత్సరాల తర్వాత, ఐగుప్తు ఫరోను ముఖాముఖిగా ఎదుర్కొన్న సందర్భంలో మోషే యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించాడు. మోషే స్వయంగా ధైర్యస్థుడైనందున అలాచేయలేదు, బదులుగా ఆయన సరిగ్గా మాట్లాడే తన సామర్థ్యాన్నే సందేహించాడు. అయితే ఆయన యెహోవాకు లోబడ్డాడు. యెహోవా మద్దతుతోను, తన అన్న అహరోను సహాయంతోను మోషే పదేపదే ఫరోకు యెహోవా వాక్కు ప్రకటించాడు. ఫరో మూర్ఖంగా ప్రవర్తించాడు. ఇశ్రాయేలు కుమారుల్లో సహితం కొందరు మోషేయెడల ఎంతో కఠినంగా ప్రవర్తించారు. అయిననూ మోషే యథార్థంగా యెహోవా తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు, కాగా ఆయన మూలంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడిపించబడ్డారు.—నిర్గ. 7:6; 12:50, 51.

8. (ఎ) యెహోవాయెడల చూపే యథార్థతయందు దేవుడు ప్రత్యేకంగా వ్రాతపూర్వకంగా చెప్పినదానికంటే ఎక్కువే ఇమిడియుందని ఏది చూపిస్తున్నది? (బి) ఈ విధమైన యథార్థతయెడల మెప్పు 1 యోహాను 2:15ను అన్వయించుటకు మనకెలా సహాయంచేస్తుంది?

8 యెహోవా ఎడల యథార్థంగా ఉన్నవారు కేవలం ధర్మశాస్త్రంలో ఉన్నదాని ప్రకారమే ప్రవర్తించాలని, దేవుడు వ్రాయింపజేసిన దానికి మాత్రమే లోబడాలని తర్కించలేదు. తనతో వ్యభిచరించునట్లు యోసేపును లోబరచుకోవడానికి పోతీఫరు భార్య ప్రయత్నించినప్పుడు, వ్యభిచారాన్ని ప్రత్యేకంగా నిషేధించిన దేవుని లిఖిత నియమేమియు అక్కడ లేకుండెను. అయినను ఏదెనులో యెహోవా స్థాపించిన వివాహ ఏర్పాటునుగూర్చి తనకున్న జ్ఞానంపై ఆధారపడ్డ యోసేపు, వేరొకరి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం యెహోవాకు అప్రీతికరమని ఎరిగియుండెను. ఐగుప్తీయులవలె ఉండడానికి దేవుడు తనను అనుమతిస్తాడని కడవరకు హద్దుల్ని పరీక్షించుటకు యోసేపు ఆసక్తి చూపలేదు. మానవజాతితో దేవుని వ్యవహారాల్ని ధ్యానిస్తూ, ఆపై దేవుని చిత్తమని తాను వివేచించిన దానిని మనఃపూర్వకంగా అన్వయించుట ద్వారా ఆయన యెహోవా మార్గాల్ని హత్తుకున్నాడు.—ఆది. 39:7-12; కీర్తన 77:11, 12 పోల్చండి.

9. యోబు కాలంలో తానుచేసిన ఆరోపణలోనే అపవాది అబద్ధికుడని పదేపదే ఎలా నిరూపించబడ్డాడు?

9 ఎంతతీవ్రంగా పరీక్షింపబడిననూ, యెహోవాను నిజంగా ఎరిగినవారు ఆయననుండి వైదొలగరు. యోబు ఒకవేళ తన ఆస్తినంతా పొగొట్టుకుంటే లేదా భౌతికంగా హీనపర్చబడితే, యెహోవా గొప్పగా మాట్లాడిన ఈ వ్యక్తికూడ దేవున్ని విడిచిపెడతాడని సాతాను ఆరోపించాడు. అయితే తనను ముంచెత్తిన విపత్తు అంతా ఎందుకు జరిగిందో తెలియనప్పటికిని యోబు అపవాదిని అబద్ధికుడని నిరూపించాడు. (యోబు 2:3, 9, 10) తన పంతమే నెగ్గాలని ప్రయత్నిస్తూ సాతాను ఆ తర్వాత, బబులోను రాజు నిలబెట్టిన ప్రతిమకు వంగి నమస్కరించకపోతే మండే కొలిమిలో పడవేసి చంపుతానని ఆ ముగ్గురు హెబ్రీ యువకుల్ని రాజు కోపంతో బెదిరించేలా చేశాడు. ఇటు రాజాజ్ఞ అటు యెహోవా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా విగ్రహారాధన, ఏదిచేయాలో నిర్ణయించుకొనే ఒత్తిడిలో వారు తాము యెహోవాను సేవించేవారమని, ఆయనే వారి సర్వోన్నత సర్వాధిపతియని స్థిరంగా తెలియజేశారు. వారికి తమ ప్రాణాలకంటే దేవునియెడల నమ్మకత్వమే మరింత అమూల్యమైయుండెను.—దాని. 3:14-18.

10. అసంపూర్ణ మానవులమైన మనం యెహోవాయెడల నిజంగా యథార్థంగా ఉన్నామని నిరూపించుకొనుట ఎలాసాధ్యం?

10 దీనినిబట్టి మనం యెహోవాకు యథార్థంగా ఉండాలంటే ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా ఉండాలని, ఒక తప్పిదంచేస్తే అతడిక పూర్తిగా విఫలమైనట్లేననే ముగింపుకు మనం రావాలా? అలా ఎంతమాత్రం రానవసరం లేదు! మోషే తప్పులుచేసిన సమయాల్ని గూర్చి బైబిలు మనకు తెలియజేస్తున్నది. యెహోవా అయిష్టపడ్డాడు, కాని ఆయన మోషేను తిరస్కరించలేదు. అపొస్తలులు అనేక విషయాల్లో మాదిరికరంగా ఉన్ననూ, వారికి వారి బలహీనతలుండెను. యథార్థతకు హృదయంనుండివచ్చే సరియైన విధేయత కావాలి. అయితే, మనకు వారసత్వంగా కలిగిన అసంపూర్ణతను పరిగణలోనికి తీసుకొన్న యెహోవా, మనం ఉద్దేశపూర్వకంగా ఏ రకంగాను ఆయన చిత్తాన్ని అలక్ష్యం చేయనట్లయిన సంతోషిస్తాడు. ఒకవేళ బలహీనతనుబట్టి మనం తప్పిదంచేస్తే, మనం యథార్థంగా పశ్చాత్తాపపడి దాన్నొక అలవాటుగా చేసుకోకుండా ఉండటం ప్రాముఖ్యం. ఆ విధంగా మనం యెహోవా మంచిదని చెప్పేదాన్నే నిజంగా ప్రేమిస్తాము, ఆలాగే ఆయన చెడ్డదని చూపించేదాన్ని మనం ద్వేషిస్తాము. పాపపరిహారార్థ విలువగల యేసు బలియందలి మన విశ్వాసం ఆధారంగా, మనం దేవునియెదుట నిర్దోషమైన స్థానాన్ని కలిగియుండగలము.—ఆమో. 5:15; అపొ. 3:19; హెబ్రీ. 9:14.

11. (ఎ) మనుష్యుల్లో ఎవరు పరిపూర్ణ దైవభక్తిని కాపాడుకున్నారు, ఇది దేనిని నిరూపించింది? (బి) ఆయన చేసినదానినిబట్టి మనమెలా సహాయం పొందాము?

11 అయిననూ, పరిపూర్ణ దైవభక్తి మానవులకు ఏమాత్రం సాధ్యంకానిదా? దీనికి జవాబు దాదాపు 4,000 సంవత్సరాలపాటు ఒక పరిశుద్ధ “మర్మము”గానే ఉండిపోయింది. (1 తిమో. 3:16) ఆదాము పరిపూర్ణంగా సృజింపబడిననూ, దైవభక్తి విషయంలో పరిపూర్ణ మాదిరిచూపలేదు. ఎవరు చూపగలరు? నిశ్చయంగా అతని పాపసహిత సంతానమందు ఎవరునూ అలా చూపలేరు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే అలాచేయగలడు. ఆదాము నిజంగా కోరితే, తనకున్న మరిన్ని అనుకూల పరిస్థితుల్నిబట్టి అతను పరిపూర్ణ యథార్థతను కాపాడుకొనగల్గేవాడని, యేసు నెరవేర్చినది చూపింది. దేవుని సృష్టి కార్యమందు లోపము లేదు. కాబట్టి దైవ నియమానికి విధేయతను మాత్రమేగాక, విశ్వ సర్వాధిపతియైన యెహోవాయెడల వ్యక్తిగత భక్తినికూడ ప్రదర్శించుటలో యేసుక్రీస్తు మనమనుకరించుటకు కృషిచేయగల ఒక ఆదర్శమూర్తిగా ఉన్నాడు.

మన వ్యక్తిగత జవాబేమైయుంది?

12. యెహోవా సర్వాధిపత్యంయెడల మన దృక్పథం విషయంలో మనమెందుకు సదా అప్రమత్తంగా ఉండాలి?

12 నేడు మనలో ప్రతి ఒక్కరు విశ్వవివాదమును ఎదుర్కొనవలసిందే. మనం దానిని తప్పించుకోలేము. మనమొకవేళ యెహోవా పక్షమని బహిరంగముగా చెప్పివుంటే, సాతాను మనల్ని ఒక లక్ష్యంగా చేసుకుంటాడు. ఊహాశక్యమైన ప్రతి దిశనుండి అతడు ఒత్తిడి తీసుకువస్తాడు, అంతేకాదు ఈ దుష్ట విధానాంతము వరకు అతడలా నిర్విరామంగా చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. (1 పేతు. 5:8) ఈ సర్వోన్నత వివాదాంశమందు మనమెక్కడ ఉన్నామో మన ప్రవర్తన చూపుతుంది.

13. (ఎ) మనం అబద్ధాన్ని, దొంగతనాన్ని విసర్జించునట్లు చేయడానికి అసలు వాటి మూలమేమిటి? (బి) కొంతమంది ప్రజల్ని అట్టి తప్పిదాల్లో పడవేసే పరిస్థితుల్ని గూర్చి, ఒక్కొక్కటిగా ఈ పేరా చివరగల ప్రశ్నలకు జవాబివ్వండి.

13 లోకంలో యథార్థత లోపించిన ప్రవర్తన సర్వసాధారణమైనందున, అదంత ప్రాముఖ్యం కాదని పరిగణించే సాహసం మనం చేయలేము. యథార్థతను కాపాడుకోవడానికి మన జీవిత ప్రతి ఆకృతిలో యెహోవా నీతి మార్గాల్ని అన్వయించడం అవసరం. ఉదాహరణకు, ఈ క్రింది విషయాల్ని పరిశీలించండి:

(1మన ఆది తలిదండ్రులు పాపము చేయునట్లు నడిపించడానికి సాతాను అబద్ధాన్ని ఉపయోగించాడు. అతడు ‘అబద్ధమునకు జనకుడయ్యాడు.’ (యోహా. 8:44)

ఎట్టి పరిస్థితుల్లో యౌవనస్థులు కొన్నిసార్లు తమ తలిదండ్రులతో సత్యవంతముగా ఉండుటలో తప్పిపోతారు? క్రైస్తవ యౌవనులు దీనిని విసర్జించుట ఎందుకు ప్రాముఖ్యము? (సామె. 6:16-19)

ఎలాంటి వ్యాపార అభ్యాసాలు ఒక వ్యక్తిని సత్యదేవునితో కాకుండ ‘అబద్ధమునకు జనకుని’ సంబంధియని గుర్తించవచ్చును. (మీకా 6:11, 12)

ఎవరికీ హాని కల్గించకపోతే, మనల్నిగూర్చి అసలు వాస్తవానికంటే ఎక్కువచేసి చెప్పుకోవడం దోషమా? (కీర్త. 119:163; అపొ. కార్యములు 5:1-11 పోల్చండి.)

ఎవరైనా ఒక గంభీరమైన తప్పిదమందు చిక్కుకుంటే, అబద్ధాలుచెప్పి దాన్ని కప్పిపుచ్చుటకు ప్రయత్నించకుండుట ఎందుకు ప్రాముఖ్యము? (సామె. 28:13)

(2మంచిచెడ్డల విషయంలో స్వంతగా నిర్ణయం చేసుకొమ్మని సాతాను బలవంతపెట్టినట్లుగానే ఆదాము హవ్వలు ప్రవర్తించినప్పుడు, మొట్టమొదట వారు తమకు చెందని దానిని తీసుకొన్నారు. వారు దొంగలయ్యారు.

ఒక వ్యక్తి అవసరంలో ఉన్నప్పుడు దొంగిలిస్తే లేదా తానెవరి సొమ్మును దొంగిలిస్తాడో ఆ వ్యక్తికి విస్తారంగా ఉంటే, ఆ దొంగతనం సమర్థించబడుతుందా? (సామె. 6:30, 31; 1 పేతు. 4:15)

మనం నివసించే ప్రదేశంలో అది సర్వసాధారణమైతే లేదా తీసుకొన్నది అత్యల్పమైతే అది తక్కువ అభ్యంతరకరమౌతుందా? (రోమా. 12:2; ఎఫె. 4:28; లూకా 16:10)

14, 15. (ఎ) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతమందు యావత్‌ మానవజాతికి ఎలాంటి పరీక్ష ఉంటుంది? (బి) మనమిప్పుడు చేసేది అప్పుడు మనకు కలిగే ఫలితంపై ఎట్లు ప్రభావం కలిగి ఉంటుంది?

14 క్రీస్తు వెయ్యేండ్ల పాలనలో, మానవజాతిపై ప్రభావం చూపకుండా సాతాను అతని దయ్యాలు అగాధంలో పడవేయబడతారు. అదెంత ఉపశమనాన్నిస్తుందో కదా! అయితే వెయ్యేండ్ల తర్వాత, వారు కొద్దికాలం విడిచిపెట్టబడతారు. సాతాను అతని అనుచరులు, ‘పరిశుద్ధులపై’ అనగా తమ యథార్థతను నిలుపుకుంటూ పునరుద్ధరింపబడిన మానవజాతిపై ఒత్తిడి తెస్తారు. ఆ “ప్రియమైన పట్టణము” అనగా పరలోక నూతన యెరూషలేము భూమిపై నెలకొల్పిన నీతిని తుడిచిపెట్టుటకు యుద్ధరంగంలోవలె అతడా పట్టణంపై దూకుతాడు.—ప్రక. 20:7-10.

15 యెహోవాయెడల యథార్థత లేనివారిగా ప్రవర్తించునట్లు మానవులను లోబరచుకోవాలని ప్రయత్నిస్తూ, గతంలోవలెనే సాతాను మోసాన్ని, దానితోపాటు స్వార్థాన్ని, అహంకారాన్ని ప్రయోగించే అవకాశం ఎంతైనావుంది. అప్పటికి సజీవులుగా ఉండే ఆధిక్యతే మనకూవుంటే, మనం వ్యక్తిగతంగా ఎలా ప్రతిస్పందిస్తాం? విశ్వ వివాదాంశం విషయంలో మన హృదయాలు ఎక్కడవుంటాయి? అప్పుడు సమస్త మానవజాతి పరిపూర్ణంగా ఉంటుంది గనుక, ఎలాంటి అపనమ్మకమైన పనైనా అది ఉద్దేశపూరితమై ఉంటుంది, తత్ఫలితంగా నిత్య నాశనం సంభవిస్తుంది. కాబట్టి మనమప్పుడు యథార్థపరులమని నిరూపించుకొనుటకు, తన వాక్యంద్వారా లేదా తన సంస్థద్వారా యెహోవా మనకిస్తున్న నడిపింపుకు అనుకూలంగా సిద్ధమనస్సుతో ప్రతిస్పందించే అలవాటును ఇప్పుడే పెంపొందించుకొనుట ఎంత అవశ్యము! అలాచేయుట ద్వారా మనం విశ్వ సర్వాధిపతిగా ఆయనయెడల నిజమైన యథార్థతను చూపిన వారమౌతాం.

పునఃసమీక్షా చర్చ

• సమస్త సృష్టి ఎదుర్కోవాల్సిన గొప్ప వివాదాంశమేమై ఉన్నది? అందులో మనమెలా ఇమిడియున్నాము?

• నలభై తొమ్మిదవ పేజీలో చూపబడిన స్త్రీపురుషులలో ప్రతిఒక్కరు యెహోవాయెడల తమ యథార్థతను నిరూపించుకున్న విధానాల్లోని విశిష్ఠత ఏమిటి?

• మన ప్రవర్తన ద్వారా ప్రతిదినం యెహోవాను ఘనపర్చుటకు జాగ్రత్తగా ఉండుట ఎందుకు అవశ్యము?

[అధ్యయన ప్రశ్నలు]

[49వ పేజీలోని చిత్రం]

వారు యెహోవా సర్వాధిపత్యాన్ని హత్తుకున్నారు

నోవహు

శారా

మోషే

యోసేపు

యోబు

వారి మాదిరినుండి మనమెలా ప్రయోజనం పొందగలము?