కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అన్నిటికంటె ముఖ్యముగా ఒకరియెడల ఒకరు మిక్కటమైన ప్రేమగలవారై ఉండండి’

‘అన్నిటికంటె ముఖ్యముగా ఒకరియెడల ఒకరు మిక్కటమైన ప్రేమగలవారై ఉండండి’

‘అన్నిటికంటె ముఖ్యముగా ఒకరియెడల ఒకరు మిక్కటమైన ప్రేమగలవారై ఉండండి’

‘అన్నిటి అంతము సమీపమైయున్నది. అన్నిటికంటె ముఖ్యముగా ఒకరియెడల ఒకరు మిక్కటమైన ప్రేమగలవారై ఉండండి.’​—⁠1 పేతురు 4:⁠7, 8.

యేసుకు, తాను తన అపొస్తలులతో గడపబోయే చివరి కొన్ని గంటలు చాలా అమూల్యమైనవని తెలుసు. అపొస్తలులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో ఆయనకు తెలుసు. వాళ్ళు ఒక బృహత్తరమైన పనిని నెరవేర్చాలి, అయితే తనలాగే వాళ్ళు కూడా ద్వేషించబడి, హింసించబడతారు. (యోహాను 15:​18-20) యేసు తన శిష్యులతో కలిసివున్న ఆ చివరి రాత్రి, వాళ్ళు ‘ఒకరి నొకరు ప్రేమించవలసిన’ అవసరత గురించి ఆయన ఒకటి కంటే ఎక్కువసార్లే గుర్తుచేశాడు.​—⁠యోహాను 13:​34, 35; 15:​12, 13, 17.

2 ఆ రాత్రి యేసుతోపాటు ఉన్న అపొస్తలుడైన పేతురుకు విషయం అర్థమయ్యింది. కొన్ని సంవత్సరాల తర్వాత యెరూషలేము నాశనమవడానికి ముందు పేతురు తన లేఖలో ప్రేమకున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఆయన క్రైస్తవులకు ఇలా ఉపదేశించాడు: ‘అన్నిటి అంతము సమీపమైయున్నది. అన్నిటికంటె ముఖ్యముగా ఒకరియెడల ఒకరు మిక్కటమైన ప్రేమగలవారై ఉండండి.’ (1 పేతురు 4:​7, 8) ఈ ప్రస్తుత విధానపు “అంత్యదినములలో” జీవిస్తున్నవారికి పేతురు మాటలు ఎంతో గమనార్హమైనవి. (2 తిమోతి 3:⁠1) “మిక్కటమైన ప్రేమ” అంటే ఏమిటి? మనం ఇతరులపట్ల అలాంటి ప్రేమ కలిగివుండడం ఎందుకు ప్రాముఖ్యం? మనకు ఇతరులపట్ల అలాంటి ప్రేమ ఉందని ఎలా చూపించవచ్చు?

“మిక్కటమైన ప్రేమ”​—⁠అంటే ఏమిటి?

3 ప్రేమ అంటే సహజంగా ఏర్పడవలసిన భావన అని చాలామంది అనుకుంటారు. కానీ పేతురు అలాంటి ప్రేమ గురించి మాట్లాడడం లేదు; ఆయన సర్వశ్రేష్ఠమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. 1 పేతురు 4:8లో “ప్రేమ” అని అనువదించబడిన పదానికి మూలం గ్రీకు పదమైన అగాపే. ఈ పదం సూత్రాలచేత నడిపించబడే లేదా నియంత్రించబడే నిస్వార్థమైన ప్రేమను సూచిస్తుంది. ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “అగాపే ప్రేమను ఉద్దేశపూర్వకంగా వృద్ధి చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక భావోద్వేగం మాత్రమే కాదు కానీ ఒక వ్యక్తి ఒక నిర్దిష్టమైన రీతిలో ప్రవర్తించడానికి ఉద్దేశపూర్వకంగా తీసుకునే నిర్ణయం.” మనం స్వార్థపూరితంగా ప్రవర్తించడానికి మొగ్గుచూపే లక్షణాలను వారసత్వంగా పొందాము కాబట్టి ఇతరులపట్ల ప్రేమ చూపించే విషయంలో, దేవుని సూత్రాలు నిర్దేశించిన విధంగా ప్రేమ చూపించే విషయంలో మనకు జ్ఞాపికలు అవసరం.​—⁠ఆదికాండము 8:​21; రోమీయులు 5:​12.

4 అయితే దానర్థం, మనం కేవలం నైతిక బాధ్యతగా ఇతరులపట్ల ప్రేమ చూపించాలని కాదు. అగాపే ప్రేమ ఎలాంటి ఆప్యాయత గానీ భావాలు గానీ లేని ప్రేమ కాదు. మనం ‘ఒకరియెడల ఒకరు మిక్కటమైన [అక్షరార్థంగా, “విస్తారమయ్యే”] ప్రేమ’ కలిగివుండాలని పేతురు చెప్పాడు. * (కింగ్‌డమ్‌ ఇంటర్లీనియర్‌) అయితే ఇలాంటి ప్రేమ చూపించేందుకు కృషి చేయడం అవసరం. “మిక్కటమైన” అని అనువదించబడిన గ్రీకు పదం గురించి ఒక విద్వాంసుడు ఇలా చెబుతున్నాడు: “అది ఒక క్రీడాకారుడు పరుగు పందెం చివరకు చేరుకోవడానికి తనలో మిగిలివున్న శక్తినంతటినీ కూడదీసుకునే తలంపునిస్తుంది.”

5 కాబట్టి మన ప్రేమ కేవలం సులభంగా చేయగల పనుల్లో చూపించడానికి మాత్రమే లేదా కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం కాకూడదు. క్రైస్తవ ప్రేమను చూపించడానికి మనం మన హృదయాన్ని “విస్తారం” చేసుకోవాలి, సవాలుదాయకమైన పరిస్థితుల్లో కూడా ప్రేమ చూపించాలి. (2 కొరింథీయులు 6:​11-13) ఒక క్రీడాకారుడు తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి శిక్షణ పొందుతూ కృషి చేసే విధంగానే మనం అలాంటి ప్రేమను చూపించాలంటే దాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. మనం ఇతరులపట్ల ఇలాంటి ప్రేమ చూపించడం ఆవశ్యకం. ఎందుకు? దానికి కనీసం మూడు కారణాలున్నాయి.

మనం ఒకరిపట్ల ఒకరు ఎందుకు ప్రేమ కలిగివుండాలి?

6 మొదటి కారణమేమిటంటే “ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది.” (1 యోహాను 4:⁠7) ఈ ప్రియ లక్షణానికి మూలమైన యెహోవా మనల్ని మొదట ప్రేమించాడు. అపొస్తలుడైన యోహాను ఇలా చెబుతున్నాడు: “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.” (1 యోహాను 4:⁠9) మనం “జీవించునట్లు,” దేవుని కుమారుడు మానవుడిగా మారి, తన పరిచర్యను నెరవేర్చి, హింసా కొయ్యపై మరణించడానికి ఈ ‘లోకములోనికి పంపించబడ్డాడు.’ దేవుడు మహోన్నతంగా ప్రదర్శించిన ఈ ప్రేమకు మనం ఎలా ప్రతిస్పందించాలి? “దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము” అని యోహాను చెబుతున్నాడు. (1 యోహాను 4:​11) యోహాను ‘దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా’ అని వ్రాశాడు అంటే నిన్ను అని వ్రాయకుండా మనలను అని వ్రాశాడని గమనించండి. విషయం స్పష్టంగా ఉంది: దేవుడు మన తోటి ఆరాధకులను ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళను ప్రేమించాలి.

7 రెండవ కారణమేమిటంటే, “అన్నిటి అంతము సమీపమైయున్నది” కాబట్టి అవసరంలోవున్న మన సహోదరులకు మనం సహాయం చేయాలంటే ఇప్పుడు మనం ఒకరిపట్ల ఒకరం ప్రేమ కలిగివుండడం ఎంతో అవసరం. (1 పేతురు 4:⁠7) మనం ‘అపాయకరమైన కాలములలో’ జీవిస్తున్నాము. (2 తిమోతి 3:⁠1) లోక పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యతిరేకత మనల్ని కష్టాలపాలు చేస్తాయి. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఒకరికొకరం మరింత సన్నిహితం కావాలి. ప్రగాఢమైన ప్రేమ మనల్ని ఐక్యపరచి మనం ఒకరినొకరం ‘పరామర్శించుకొనేందుకు’ మనల్ని పురికొల్పుతుంది.​—⁠1 కొరింథీయులు 12:​24-26.

8 మూడవ కారణమేమిటంటే, అపవాది మనల్ని ఉపయోగించుకొనేలా ‘అతనికి చోటివ్వడానికి’ మనం ఇష్టపడము కాబట్టి మనం ఒకరిపట్ల ఒకరం ప్రేమ కలిగివుండడం అవసరం. (ఎఫెసీయులు 4:​27) సాతాను మన తోటి విశ్వాసుల అపరిపూర్ణతలను అంటే వాళ్ళ బలహీనతలను, లోపాలను, తప్పిదాలను మనకు అవరోధాలుగా ఉపయోగించడంలో ముందుంటాడు. తోటి విశ్వాసుల్లో ఎవరైనా మనతో అనాలోచితంగా మాట్లాడితే లేదా దురుసుగా ప్రవర్తిస్తే, అది మనం సంఘం నుండి దూరమవడానికి కారణమవుతుందా? (సామెతలు 12:​18) మనలో ఒకరిపట్ల ఒకరికి ప్రగాఢమైన ప్రేమ ఉంటే అలా జరగదు! అలాంటి ప్రేమ మనమధ్య శాంతిని కాపాడుకోవడానికి “యేకమనస్కులై” దేవుణ్ణి ఐక్యంగా సేవించడానికి సహాయం చేస్తుంది.​—⁠జెఫన్యా 3:⁠9.

మీరు ఇతరులను ప్రేమిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

9ప్రేమ చూపించడం కుటుంబంలో ప్రారంభమవ్వాలి. యేసు తన నిజమైన అనుచరులు ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగివుంటారని, అదే వారి గుర్తింపు చిహ్నమని చెప్పాడు. (యోహాను 13:​34, 35) ప్రేమ కేవలం సంఘంలోనే కాక కుటుంబంలో కూడా అంటే వివాహ భాగస్వాముల మధ్యా తల్లిదండ్రుల పిల్లల మధ్యా కూడా వ్యక్తమవ్వాలి. కుటుంబ సభ్యులపట్ల ప్రేమ ఉంటే సరిపోదు; మనం ఆ ప్రేమను ప్రోత్సాహకరమైన పద్ధతుల్లో వ్యక్తపరచాలి.

10 వివాహ భాగస్వాములు ఒకరిపట్ల ఒకరు ప్రేమ ఎలా చూపించుకోవచ్చు? తన భార్యను నిజంగా ప్రేమించే భర్త, తాను తన భార్యను విలువైన వ్యక్తిగా ఎంచుతున్నానని తన మాటల ద్వారా తన చర్యల ద్వారా, ఇతరుల ముందూ అలాగే ఒంటరిగా ఉన్నప్పుడూ ఆమెకు తెలియజేస్తాడు. ఆయన ఆమెపట్ల గౌరవమర్యాదలు చూపిస్తూ ఆమె తలంపులను, దృక్కోణాలను భావాలను పరిగణలోకి తీసుకుంటాడు. (1 పేతురు 3:⁠7) ఆయన తన సంక్షేమంకంటే ఆమె సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆమె భౌతిక, ఆధ్యాత్మిక, భావోద్వేగపరమైన అవసరాలను తీర్చడానికి తనకు సాధ్యమైనదంతా చేస్తాడు. (ఎఫెసీయులు 5:​25, 28) తన భర్తను నిజంగా ప్రేమించే భార్య, తన భర్త అప్పుడప్పుడు తాను ఆశించినవిధంగా ప్రవర్తించకపోయినా ఆయనపట్ల “భయము” కలిగివుంటుంది అంటే ప్రగాఢ గౌరవం చూపిస్తుంది. (ఎఫెసీయులు 5:​22, 33) ఆమె తన భర్తకు మద్దతునిస్తూ ఆయనకు లోబడుతుంది, అనుచితమైన కోరికలు కోరకుండా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనివ్వడంలో ఆయనకు సహకరిస్తుంది.​—⁠ఆదికాండము 2:​18; మత్తయి 6:​33.

11 తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలపట్ల ప్రేమ ఎలా చూపించవచ్చు? వాళ్ళ భౌతిక అవసరాలను తీర్చడానికి మీరు కష్టపడి పనిచేసేందుకు సుముఖత చూపించడం వారిపట్ల మీకున్న ప్రేమకు నిదర్శనం. (1 తిమోతి 5:⁠8) అయితే పిల్లలకు ఆహారం, బట్టలు, ఇల్లు ఉంటే సరిపోదు. వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు సత్యదేవుణ్ణి ప్రేమించి, ఆయనకు సేవ చేయాలంటే వాళ్ళకు ఆధ్యాత్మిక శిక్షణ అవసరం. (సామెతలు 22:⁠6) అంటే కుటుంబమంతా కలిసి బైబిలు అధ్యయనం చేయడానికి, పరిచర్యలో పాల్గొనడానికి, క్రైస్తవ కూటాలకు హాజరవడానికి సమయం కేటాయించడం అవసరం. (ద్వితీయోపదేశకాండము 6:​4-7) అలాంటి కార్యకలాపాలకు క్రమంగా సమయం కేటాయించాలంటే, ప్రత్యేకించి ఈ అపాయకరమైన కాలాల్లో, కొన్ని త్యాగాలు చేయవలసి రావచ్చు. మీ పిల్లల ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ చూపించడం, వాటిని తీర్చడానికి కృషి చేయడం మీకు వారిపట్ల ప్రేమ ఉందని చూపిస్తాయి ఎందుకంటే అలా చేయడమనేది మీరు వారి నిరంతర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని చూపిస్తుంది.​—⁠యోహాను 17:⁠3.

12 తల్లిదండ్రులు తమ పిల్లల భావోద్వేగ అవసరాలను తీర్చడం ద్వారా కూడా తమ ప్రేమను చూపించడం అవసరం. పిల్లలు అమాయకులు; మీరు వాళ్ళను ప్రేమిస్తున్నారని వాళ్ళ లేత హృదయాలకు తెలిసేలా పదేపదే హామీ ఇవ్వాలి. మీరు వాళ్ళను ప్రేమిస్తున్నారని చెప్పండి, వాళ్ళను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తీకరణలు తాము ప్రేమించదగిన వారమనీ విలువైనవారమనీ వాళ్ళకు హామీ ఇస్తాయి. వాళ్ళను ఆప్యాయంగా యథార్థంగా మెచ్చుకోండి, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను మీరు గమనిస్తున్నారని వాటిని విలువైనవిగా ఎంచుతున్నారని అది వాళ్ళకు తెలియజేస్తుంది. వాళ్ళని ప్రేమతో శిక్షించండి, వాళ్ళు ఎలాంటి వ్యక్తులుగా తయారవుతున్నారనే విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారని వాళ్ళకు తెలుస్తుంది. (ఎఫెసీయులు 6:⁠4) ప్రేమను ఇలా వ్యక్తం చేయడం సంతోషకరమైన అనుబంధంగల కుటుంబాన్ని నిర్మించడానికి సహాయం చేస్తుంది, అలాంటి కుటుంబం ఈ అంత్యదినాల్లో వచ్చే ఒత్తిళ్ళను తట్టుకోవడానికి మరింత సిద్ధంగా ఉంటుంది.

13ఇతరుల తప్పిదాలను మన్నించడానికి ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. పేతురు తన పాఠకులను ‘ఒకరియెడల ఒకరు మిక్కటమైన ప్రేమగలవారై ఉండండి’ అని ప్రోత్సహించినప్పుడు అది ఎందుకంత ప్రాముఖ్యమో సూచిస్తూ “ప్రేమ అనేక పాపములను కప్పును” అని తెలియజేశాడని గుర్తు తెచ్చుకోండి. (1 పేతురు 4:⁠8) పాపములను ‘కప్పడం’ అంటే గంభీరమైన పాపాలను ‘కప్పిపుచ్చడం’ కాదు. అలాంటి గంభీరమైన పాపాల గురించి సంఘంలోని బాధ్యతగల వ్యక్తులకు తెలియజేయాలి, వాళ్ళు వాటితో వ్యవహరిస్తారు. (లేవీయకాండము 5:1; సామెతలు 29:​24) ఘోరమైన తప్పులు చేసిన పాపులు అమాయకులను బాధపెడుతూ మోసపరుస్తూ ఉండడానికి అనుమతించడం ప్రేమరహితం, అది లేఖనవిరుద్ధం.​—⁠1 కొరింథీయులు 5:​9-13.

14 చాలా సందర్భాల్లో తోటి విశ్వాసుల తప్పిదాలు, లోపాలు చాలా చిన్న విషయాలకు సంబంధించినవి. మనమందరం అప్పుడప్పుడు మన మాటల ద్వారా చర్యల ద్వారా ఇతరులను నిరుత్సాహపరుస్తాము లేదా బాధపెడతాము. (యాకోబు 3:⁠2) ఇతరుల బలహీనతలను మనం వెంటనే అందరికీ తెలియజేయాలా? అలాంటి పని సంఘంలో విభేదాలు సృష్టించడానికి మాత్రమే పనికివస్తుంది. (ఎఫెసీయులు 4:​1-3) మనం ప్రేమచేత నియంత్రించబడితే తోటి విశ్వాసిపై ‘అపనిందలు మోపము.’ (కీర్తన 50:​20) గోడలో సమంగా లేని భాగాలను సిమెంటు, సున్నం కప్పినట్టే, ప్రేమ ఇతరుల అపరిపూర్ణతలను కప్పుతుంది.​—⁠సామెతలు 17:⁠9.

15నిజంగా అవసరంలోవున్న వారికి సహాయం చేయడానికి ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. అంత్యదినాల్లో పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతుండగా, మన తోటి విశ్వాసులకు వస్తుపరమైన లేదా భౌతిక సహాయం అవసరమయ్యే సమయాలు రావచ్చు. (1 యోహాను 3:​17, 18) ఉదాహరణకు, మన సంఘంలోని సభ్యునికి తీవ్రమైన ఆర్థిక నష్టం కలిగిందా లేదా ఉద్యోగం పోయిందా? అలాంటప్పుడు మనం మన పరిస్థితులు అనుకూలించినంత మేరకు బహుశా కొంత డబ్బు సహాయం చేయవచ్చు. (సామెతలు 3:​27, 28; యాకోబు 2:​14-17) ఒక వృద్ధ విధవరాలి ఇంటికి మరమ్మతు చేయవలసిన అవసరం ఉందా? అలాంటప్పుడు ఆమెకు కొంత సహాయం చేయడానికి మనం చొరవ తీసుకోవచ్చు.​—⁠యాకోబు 1:​27.

16 మన ప్రేమ కేవలం మన ప్రాంతంలో నివసించేవారికి మాత్రమే పరిమితం కాకూడదు. కొన్నిసార్లు మనం ఇతర దేశాల్లో తీవ్రమైన తుఫానులవల్ల, భూకంపాలవల్ల లేదా అంతర్గత పోరాటాలవల్ల కష్టాలనుభవిస్తున్న దేవుని సేవకుల గురించి వినవచ్చు. వాళ్ళకు వెంటనే ఆహారం, బట్టలు, ఇతర వస్తువులు అవసరం కావచ్చు. వాళ్ళు వేరే తెగకు లేదా జాతికి చెందిన వాళ్ళైనా ఫరవాలేదు. మనం ‘సహోదరులందరినీ’ ప్రేమిస్తాము. (1 పేతురు 2:​17) కాబట్టి మొదటి శతాబ్దపు సంఘాల్లాగే మనం అలాంటి సహోదరుల సహాయార్థం వ్యవస్థీకరించబడిన సహాయ కార్యక్రమాలకు మద్దతునివ్వడానికి సంతోషిస్తాము. (అపొస్తలుల కార్యములు 11:27-30; రోమీయులు 15:​26) మనం ఇలాంటి పద్ధతుల్లో ప్రేమను ప్రదర్శించినప్పుడు ఈ అంత్యదినాల్లో మనల్ని ఐక్యపరిచే బంధాలను మరింత దృఢపరుస్తాము.​—⁠కొలొస్సయులు 3:​14.

17ఇతరులతో దేవుని రాజ్య సువార్తను పంచుకోవడానికి ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. యేసు మాదిరిని పరిశీలించండి. ఆయన ఎందుకు ప్రకటించి బోధించాడు? ఆధ్యాత్మికంగా జాలిగొలిపే స్థితిలో ఉన్న ప్రజలపై ఆయన ‘కనికరపడ్డాడు.’ (మార్కు 6:​34) వాళ్ళకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించి నిరీక్షణ గురించి తెలియజేయవలసిన అబద్ధ మత కాపరులు వాళ్ళను నిర్లక్ష్యం చేసి తప్పుదోవ పట్టించారు. కాబట్టి ప్రగాఢమైన హృదయపూర్వక ప్రేమతో కనికరంతో పురికొల్పబడిన యేసు ఆ ప్రజలకు “దేవుని రాజ్య సువార్త” ప్రకటించి వారిని ఓదార్చాడు.​—⁠లూకా 4:​16-21, 43.

18 నేడు కూడా చాలామంది ఆధ్యాత్మికంగా నిర్లక్ష్యం చేయబడ్డారు లేదా తప్పుదోవ పట్టించబడ్డారు, వాళ్ళు ఎలాంటి నిరీక్షణా లేకుండా ఉన్నారు. మనం యేసులాగే సత్య దేవుని గురించి ఇంకా తెలియని ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను గ్రహిస్తే, వాళ్ళకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రేమతో కనికరంతో పురికొల్పబడతాము. (మత్తయి 6:9, 10; 24:​14) మిగిలివున్న సమయం కొంచెమే కాబట్టి ప్రాణాలను కాపాడే ఈ సందేశాన్ని ప్రకటించడం ఇప్పుడు మునుపటికంటే అవశ్యం.​—⁠1 తిమోతి 4:​16.

“అన్నిటి అంతము సమీపమైయున్నది”

19 ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండమని చెప్పిన ఉపదేశానికి ముందు పేతురు ఇలా అన్నాడని గుర్తుంచుకోండి: “అన్నిటి అంతము సమీపమైయున్నది.” (1 పేతురు 4:⁠7) త్వరలోనే ఈ దుష్ట లోకం స్థానంలో దేవుని నీతియుక్తమైన నూతనలోకం ఉంటుంది. (2 పేతురు 3:​13) కాబట్టి ఇది ఆత్మసంతృప్తితో ఉండవలసిన సమయం కాదు. యేసు మనల్ని ఇలా హెచ్చరించాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.”​—⁠లూకా 21:​34, 35.

20 కాబట్టి మనం “అప్రమత్తంగా” ఉంటూ కాల ప్రవాహంలో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకొని జాగ్రత్తగా ఉందాం. (మత్తయి 24:​42, NW) మనల్ని పక్కకు మళ్ళించగల సాతాను శోధనల విషయంలో అప్రమత్తంగా ఉందాం. ఈ ఉదాసీనమైన ప్రేమరహితమైన లోకం మనం ఇతరులపట్ల ప్రేమ చూపించకుండా ఉండేలా చేయడానికి ఎన్నటికీ అనుమతించకుండా ఉందాం. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మనం సత్య దేవుడైన యెహోవాకు అంతకంతకూ సన్నిహితమవుదాం, ఆయన మెస్సీయ రాజ్యం త్వరలోనే ఈ భూమిపట్ల ఆయనకున్న మహిమాన్వితమైన సంకల్పాన్ని నెరవేరుస్తుంది.​—⁠ప్రకటన 21:⁠4, 5.

[అధస్సూచి]

^ పేరా 4 1 పేతురు 4:8 వ వచనాన్ని ఇతర బైబిలు అనువాదాలు మనం ఒకరినొకరు “యథార్థంగా,” “ప్రగాఢంగా,” లేదా “హృదయపూర్వకంగా” ప్రేమించాలి అని అనువదించాయి.

అధ్యయన ప్రశ్నలు

• యేసు తన శిష్యుల దగ్గర నుండి వెళ్ళిపోయేముందు వాళ్ళకు ఏమని ఉపదేశించాడు, పేతురుకు విషయం అర్థమయ్యిందని ఏది చూపిస్తోంది? (1-2 పేరాలు)

• “మిక్కటమైన ప్రేమ” అంటే ఏమిటి? (3-5 పేరాలు)

• మనం ఒకరిపట్ల ఒకరం ఎందుకు ప్రేమ కలిగివుండాలి? (6-8 పేరాలు)

• మీరు ఇతరులను ప్రేమిస్తున్నారని ఎలా చూపించవచ్చు? (9-18 పేరాలు)

• ఇది ఎందుకు ఆత్మసంతృప్తితో ఉండవలసిన సమయం కాదు, మనం ఏమి చేయాలని తీర్మానించుకోవాలి? (19-20 పేరాలు)

[29వ పేజీలోని చిత్రం]

ప్రేమానుబంధంగల కుటుంబం ఈ అంత్యదినాల్లో వచ్చే ఒత్తిళ్ళను తట్టుకోవడానికి మరింత సిద్ధంగా ఉంటుంది

[30వ పేజీలోని చిత్రం]

నిజంగా అవసరంలోవున్నవారికి సహాయం చేయడానికి ప్రేమ మనల్ని పురికొల్పుతుంది

[31వ పేజీలోని చిత్రం]

ఇతరులతో దేవుని రాజ్య సువార్త పంచుకోవడం ప్రేమపూర్వక చర్య