కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘తీర్పు తీర్చే గడియ’ వచ్చింది

‘తీర్పు తీర్చే గడియ’ వచ్చింది

‘తీర్పు తీర్చే గడియ’ వచ్చింది

బైబిల్లోని ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథము, ఆకాశమధ్యమున ఎగురుతున్న ఒక దేవదూత ‘నిత్యసువార్త’ ప్రకటిస్తున్నాడని మనకు తెలియజేస్తోంది. ఆ దేవదూత బిగ్గరగా ఇలా చెబుతున్నాడు: “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను.” (ప్రకటన 14:​6, 7) ఆ ‘తీర్పుతీర్చే గడియలో’ దైవిక తీర్పు చెప్పబడి, అమలు చేయబడుతుంది. ఒక “గడియ” అంటే చాలా తక్కువ సమయం. దైవిక తీర్పు అమలు చేయబడే సమయం ‘అంత్యదినాలకు’ ముగింపుగా వస్తుంది. మనం ఇప్పుడు అంత్యదినాల్లోనే జీవిస్తున్నాము.​—⁠2 తిమోతి 3:⁠1.

అయితే ‘తీర్పుతీర్చే గడియ’ నీతిని ప్రేమించేవారికి సంతోషకరమైనది. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు ఈ దౌర్జన్యపూరిత, ప్రేమరహిత వ్యవస్థ చేతుల్లో ఎన్నో కష్టాలు అనుభవించిన తన సేవకులకు ఉపశమనం కలిగిస్తాడు.

ప్రస్తుత దుష్ట వ్యవస్థ నాశనంతో ఆ ‘తీర్పుతీర్చే గడియ’ ముగియకముందే “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి” అని మనకు ఇప్పుడు ఉద్బోధించబడుతోంది. మీరలా చేస్తున్నారా? అలా చేయడమంటే కేవలం “నేను దేవుణ్ణి నమ్ముతున్నాను” అని చెబితే సరిపోదు. (మత్తయి 7:21-23; యాకోబు 2:​19, 20) దేవునిపట్ల మనకు సరైన భయం ఉంటే మనం ఆయనపట్ల భక్తిని ప్రదర్శించాలి. మనం చెడుతనానికి దూరంగా ఉండాలి. (సామెతలు 8:​13) మంచిని ప్రేమించి, చెడును ద్వేషించాలి. (ఆమోసు 5:​14, 15) మనం దేవుణ్ణి గౌరవిస్తే, ఆయన చెప్పే విషయాలను జాగ్రత్తగా వింటాము. ఆయన వాక్యమైన బైబిలును క్రమంగా చదవలేనంతగా ఇతర పనుల్లో నిమగ్నమై ఉండము. మనం ఎల్లప్పుడూ పూర్ణ హృదయంతో ఆయనపై విశ్వాసముంచుతాము. (కీర్తన 62:⁠8; సామెతలు 3:​5, 6) ఆయనను నిజంగా గౌరవించేవారు, భూమ్యాకాశాలను సృష్టించిన వ్యక్తిగా ఆయనే విశ్వసర్వాధిపతి అని గుర్తించి, తమ జీవితాలకు కూడా ఆయనే సర్వాధిపతి అని ఆయనకు ప్రేమపూర్వకంగా లోబడతారు. ఈ విషయాలకు మనం మరింత అవధానం ఇవ్వాలని గ్రహిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే అలా లోబడదాం.

ఆ దేవదూత చెప్పిన, తీర్పు అమలు చేయబడే సమయం “యెహోవా దినము” అని కూడా పిలువబడుతోంది. అలాంటి “దినము” సా.శ.పూ. 607లో ప్రాచీన యెరూషలేముపైకి వచ్చింది, ఎందుకంటే యెరూషలేము నివాసులు యెహోవా తన ప్రవక్తల ద్వారా ఇచ్చిన హెచ్చరికలను లక్ష్యపెట్టలేదు. యెహోవా దినము ఇంకా సమీపించలేదని తలంచడం ద్వారా వాళ్ళు తమ జీవితాలను మరింత ప్రమాదంలో పడవేసుకున్నారు. యెహోవా వారినిలా హెచ్చరించాడు: “[ఆ] దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” (జెఫన్యా 1:​14) సా.శ.పూ. 539లో ప్రాచీన బబులోనుపైకి మరో “యెహోవా దినము” వచ్చింది. (యెషయా 13:​1, 6) బబులోనీయులు తాము నిర్మించుకున్న ప్రాకారాలపై, తమ దేవుళ్ళపై నమ్మకం పెట్టుకుని యెహోవా ప్రవక్తలు చేసిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారు. కానీ కేవలం ఒక్క రాత్రిలోనే ఆ గొప్ప బబులోనును మాదీయులు, పారసీకులు జయించారు.

నేడు మన విషయమేమిటి? మన ఎదుట మరో ‘యెహోవా దినము’ ఉంది, దాని ప్రభావాలు మరింత విస్తృతంగా ఉంటాయి. (2 పేతురు 3:​11-14) “మహాబబులోను”పై దైవిక తీర్పు తీర్చబడింది. ప్రకటన 14:8 ప్రకారం ఒక దేవదూత, “మహాబబులోను కూలిపోయెను” అని ప్రకటిస్తున్నాడు. అది ఇప్పటికే కూలిపోయింది. అది యెహోవా ఆరాధకులను ఇక ఎంతమాత్రం నిరోధించలేదు. దాని అవినీతి, అది యుద్ధాల్లో భాగం వహిస్తుందనే విషయం బట్టబయలు చేయబడ్డాయి. ఇప్పుడు దాని చివరి నాశనం సమీపించింది. ఆ కారణంగానే బైబిలు, అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఇలా ఉద్బోధిస్తోంది: “మీరు దాని [మహాబబులోను] పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.”​—⁠ప్రకటన 18:⁠4, 5.

మహాబబులోను అంటే ఏమిటి? అది ప్రాచీన బబులోను లక్షణాలుగల భూవ్యాప్త మత వ్యవస్థ. (ప్రకటన, 17, 18 అధ్యాయాలు) కొన్ని సారూప్యతలను పరిశీలించండి:

• ప్రాచీన బబులోను మతనాయకులు ఆ దేశానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. నేడు కూడా అనేక మతాల్లో అలాగే జరుగుతోంది.

• బబులోను మతనాయకులు తరచూ యుద్ధాలను ప్రోత్సహించేవారు. నేడు కూడా యుద్ధాలు చేసే దేశాల సైనికులను ఆశీర్వదించడానికి ఆధునిక దిన మతనాయకులే ముందుంటున్నారు.

• ప్రాచీన బబులోను బోధలవల్ల, దాని ఆచారాలవల్ల ఆ దేశం ఘోరమైన లైంగిక అనైతికతలో కూరుకుపోయింది. నేడు కూడా మతనాయకులు నైతికత విషయంలో బైబిలు ప్రమాణాలను పక్కకి నెట్టేస్తున్నారు, తత్ఫలితంగా మతనాయకుల్లోను సామాన్య ప్రజల్లోను లైంగిక అనైతికత ప్రబలంగా ఉంది. మహాబబులోను ఈ లోకంతో దాని రాజకీయ వ్యవస్థలతో వ్యభిచారం చేస్తోంది కాబట్టే ప్రకటన గ్రంథం దానిని ఒక వేశ్యగా వర్ణిస్తోందనే వాస్తవం గమనార్హం.

• మహాబబులోను “సుఖభోగముల”తో జీవిస్తుందని కూడా బైబిలు చెబుతోంది. ప్రాచీన బబులోనులోని ఆలయ వ్యవస్థ ఎన్నో భూములను స్వంతం చేసుకుంది, దాని మతనాయకులు వాణిజ్య కార్యకలాపాల్లో ప్రముఖులుగా ఉండేవారు. నేడు కూడా మహాబబులోనుకు ఆరాధనా స్థలాలతోపాటు ఎన్నో వ్యాపారాలు, ఎన్నో ఆస్తులు ఉన్నాయి. దాని బోధలు, దాని పండుగలు దానికీ, వ్యాపార లోకంలోని ఇతరులకూ ధనసంపదలను సమకూరుస్తున్నాయి.

• నేడు అనేక ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నట్లే ప్రాచీన బబులోనులో కూడా విగ్రహాలను, ఇంద్రజాలాన్ని, క్షుద్రవిద్యలను ఉపయోగించేవారు. మరణం, మరో విధమైన జీవితానికి వెళ్ళడానికి మార్గంగా దృష్టించబడేది. బబులోను తన దేవుళ్ళ గౌరవార్థం నిర్మించబడిన ఆలయాలతో మందిరాలతో నిండివుండేది, కానీ బబులోనీయులు యెహోవా ఆరాధకులను వ్యతిరేకించేవారు. అవే నమ్మకాలు, ఆచారాలు మహాబబులోనుకు గుర్తింపు చిహ్నాలుగా ఉన్నాయి.

ప్రాచీన కాలాల్లో యెహోవా తనను తన చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉండేవారిని శిక్షించడానికి బలమైన రాజకీయ శక్తులను, సైనిక శక్తులను ఉపయోగించుకున్నాడు. ఆ విధంగా సా.శ.పూ. 740లో సమరయను అష్షూరీయులు నాశనం చేశారు. యెరూషలేమును సా.శ.పూ. 607లో బబులోనీయులు, సా.శ. 70లో రోమీయులు నాశనం చేశారు. సా.శ.పూ. 539లో బబులోనును మాదీయులు పారసీకులు ఆక్రమించుకున్నారు. మన కాలంలో రాజకీయ ప్రభుత్వాలు ఒక క్రూరమృగంలా “వేశ్య”పై దాడి చేసి ఆమెను దిగంబరిగా చేసి ఆమె నిజస్వరూపాన్ని వెల్లడి చేస్తాయని బైబిలు ప్రవచిస్తోంది. అవి ఆమెను పూర్తిగా నాశనం చేస్తాయి.​—⁠ప్రకటన 17:​16.

ప్రపంచ ప్రభుత్వాలు నిజంగానే అలా చేస్తాయా? ‘దేవుడు వారికి ఆ బుద్ధి పుట్టిస్తాడు’ అని బైబిలు చెబుతోంది. (ప్రకటన 17:​17) అది హఠాత్తుగా, ఆశ్చర్యకరంగా, దిగ్భ్రాంతి కలిగించేదిగా, ఊహించలేని విధంగా ఒక్కసారిగా జరుగుతుంది.

మీరు ఎలాంటి చర్య తీసుకోవాలి? ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఇప్పటికీ మహాబబులోనుకు సంబంధించిన బోధలతో, ఆచారాలతో కలుషితం చేయబడిన మత సంస్థను అంటిపెట్టుకొని ఉన్నానా?’ మీరు అలాంటి మత సంస్థలో సభ్యునిగా లేకపోయినా, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘మహాబబులోను స్ఫూర్తి నాపై ప్రభావం చూపడానికి నేను అనుమతించానా?’ అదెలాంటి స్ఫూర్తి? దిగజారిపోయిన నైతిక విలువలను అంగీకరించే, దేవుణ్ణి ప్రేమించడానికి బదులు వస్తుసంపదలను సుఖభోగాలను ప్రేమించే, యెహోవా వాక్యాన్ని (చాలా చిన్న విషయాలుగా కనిపించేవాటిలోనైనా) ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసే స్ఫూర్తి. దీనికి మీరు ఇవ్వబోయే సమాధానం గురించి జాగ్రత్తగా ఆలోచించండి.

మనం యెహోవా అంగీకారాన్ని పొందాలంటే, మనం మహాబబులోనులో ఒక భాగంగా లేమని మన చర్యల ద్వారా మన హృదయంలోని కోరికల ద్వారా చూపించడం ఆవశ్యకం. ఇది ఆలస్యం చేయవలసిన సమయం కాదు. అంతం అకస్మాత్తుగా వస్తుందని మనల్ని హెచ్చరిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.”​—⁠ప్రకటన 18:​21.

అయితే ఆ తర్వాత జరగవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆ ‘తీర్పుతీర్చే గడియలో’ యెహోవా మరో పని కూడా చేస్తాడు. ఆయన ఈ భూవ్యాప్త రాజకీయ వ్యవస్థకు, దాని పరిపాలకులకు, యేసుక్రీస్తు చేతుల్లోవున్న తన పరలోక రాజ్యం ద్వారా తాను చేసే న్యాయమైన పరిపాలనను నిర్లక్ష్యం చేసేవారందరికీ తీర్పు తీరుస్తాడు. (ప్రకటన 13:1, 2; 19:​19-21) దానియేలు 2:​20-45 వచనాల్లో నమోదు చేయబడిన ప్రవచనాత్మక దర్శనం, ప్రాచీన బబులోను నుండి ఇప్పటివరకూ ఉన్న రాజకీయ పరిపాలనను బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టితో చేయబడిన ఒక పెద్ద ప్రతిమతో పోలుస్తోంది. మన కాలం గురించి ఆ ప్రవచనం ఇలా చెప్పింది: “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు.” యెహోవా ‘తీర్పుతీర్చే గడియలో’ ఆ రాజ్యము చేయనున్న పనుల గురించి బైబిలు ఇలా చెబుతోంది: “అది ముందు చెప్పిన [మానవ నిర్మిత] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”​—⁠దానియేలు 2:​44.

ఈ “లోకములో ఉన్నవాటిని” అంటే సత్య దేవునికి దూరమైపోయిన ఈ లోకం ప్రోత్సహించే జీవిత విధానాన్ని ప్రేమించకూడదని బైబిలు సత్యారాధకులను హెచ్చరిస్తోంది. (1 యోహాను 2:​15-17) మీరు పూర్తిగా దేవుని రాజ్యం వైపే ఉన్నారని మీ నిర్ణయాలు, మీ చర్యలు చూపిస్తున్నాయా? మీరు నిజంగానే దేవుని రాజ్యాన్ని మీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచుతున్నారా?​—⁠మత్తయి 6:​33; యోహాను 17:16, 17.

[14వ పేజీలోని బాక్సు]

అంతం ఎప్పుడు వస్తుంది?

“మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును.”​—⁠మత్తయి 24:​44.

“ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.”​—⁠మత్తయి 25:13.

“అది . . . జాగుచేయక వచ్చును.”​—⁠హబక్కూకు 2:3.

[14వ పేజీలోని బాక్సు]

అంతం ఎప్పుడు వస్తుందో తెలిస్తే మీ జీవనశైలి మరో విధంగా ఉంటుందా?

దేవుడు తీర్పుతీర్చే సమయం ఇంకా కొన్ని సంవత్సరాల వరకు రాదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు మీ జీవనశైలిని మార్చుకుంటారా? ఈ పాత వ్యవస్థ అంతం మీరు అనుకున్నదానికంటే ఇప్పటికే ఆలస్యమైనట్లయితే మీరు యెహోవా సేవలో ఇంతకుముందులాగ కొనసాగకుండా వెనకపడిపోయారా?​—⁠హెబ్రీయులు 10:​36-38.

మనకు ఖచ్చితమైన సమయం తెలియకపోవడంవల్ల మనం దేవుణ్ణి యథార్థమైన ఉద్దేశాలతోనే సేవిస్తున్నామని చూపించే అవకాశముంది. యెహోవా గురించి తెలిసినవారు, ఆఖరి నిమిషంలో అత్యంతాసక్తితో సేవ చేసినంత మాత్రాన అది హృదయంలో ఏముందో చూసే దేవుణ్ణి సంతోషపరచదని గ్రహిస్తారు.​—⁠యిర్మీయా 17:​10; హెబ్రీయులు 4:​13.

యెహోవాను నిజంగా ప్రేమించేవారు తమ జీవితాల్లో ఎల్లప్పుడూ ఆయనకే ప్రాధాన్యతను ఇస్తారు. ఇతర ప్రజల్లాగే నిజ క్రైస్తవులు కూడా ఉద్యోగం చేసుకుంటుండవచ్చు. అయితే వారి లక్ష్యం డబ్బు సంపాదించి ధనవంతులు కావాలని కాదు, కానీ అవసరమైన వస్తువులు ఉండాలనీ ఇతరులతో పంచుకోవడానికి కొంత ఎక్కువ ఉంటే మంచిదనీ వారు భావిస్తారు. (ఎఫెసీయులు 4:27; 1 తిమోతి 6:​7-12) అంతేకాక వాళ్ళు ఆరోగ్యవంతమైన ఉల్లాస కార్యకలాపాలను ఆనందిస్తూ దైనందిన జీవితం నుండి కాస్త భిన్నంగా కొంత సమయాన్ని గడుపుతారు, అయితే వారలా గడిపేది తమను తాము పునరుత్తేజపరచుకోవడానికే గానీ మిగతావాళ్ళు చేస్తున్నవాటిని తామూ చేయాలని మాత్రం కాదు. (మార్కు 6:31; రోమీయులు 12:2) యేసుక్రీస్తులాగే వాళ్ళు దేవుని చిత్తం చేయడంలోనే ఆనందిస్తారు.​—⁠కీర్తన 37:⁠4; 40:8.

నిజ క్రైస్తవులు నిరంతరం సజీవంగా ఉండి యెహోవాను సేవించాలని కోరుకుంటారు. ఆ ఆశీర్వాదాలను అనుభవించడానికి, కొంతమంది తాము అనుకున్నదానికంటే ఎక్కువ సమయం వేచివుండాల్సి వచ్చినంత మాత్రాన ఆ నిరీక్షణకున్న విలువ తగ్గిపోదు.

[15వ పేజీలోని బాక్సు/చిత్రం]

సర్వాధిపత్యపు వివాదం

దేవుడు ఇంత బాధను ఎందుకు అనుమతిస్తున్నాడో అర్థం చేసుకోవాలంటే మనం సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాన్ని అర్థం చేసుకోవాలి.

యెహోవా సృష్టికర్త కాబట్టి ఈ భూమినీ, భూమిపై నివసిస్తున్నవారందరినీ పరిపాలించే హక్కు ఆయనకు ఉంది. అయితే మానవ చరిత్రకు ఆరంభంలో యెహోవా సర్వాధిపత్యం సవాలు చేయబడిందని బైబిలు వివరిస్తోంది. అపవాదియైన సాతాను, యెహోవా అనవసరమైన నిర్బంధాలు విధిస్తాడని, మన మొదటి తల్లిదండ్రులు దేవుని నియమాలను నిర్లక్ష్యం చేసి తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కలిగే పరిణామాల విషయంలో అబద్ధం చెప్పాడని, వాళ్ళు దేవునిపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనులు చేసుకోవడమే మంచిదని వాదించాడు.​—⁠ఆదికాండము, 2, 3 అధ్యాయాలు.

ఆ తిరుగుబాటుదార్లను దేవుడు వెంటనే నాశనం చేసివుంటే ఆయన శక్తి ప్రదర్శించబడేది కానీ లేవదీయబడిన వివాదాలు పరిష్కరించబడేవి కాదు. తిరుగుబాటుదార్లను వెంటనే నాశనం చేయడానికి బదులు, ఆ తిరుగుబాటు ఫలితమేమిటో బుద్ధిసూక్ష్మతగల ప్రాణులందరూ చూసేందుకు యెహోవా అనుమతించాడు. అలా అనుమతించడం బాధలకు కారణమైనా మనమందరం జన్మించడానికి అది అవకాశాన్నిచ్చింది.

అంతేకాకుండా యెహోవా తనకు విధేయత చూపించి తన కుమారుని విమోచనా క్రయధన బలిపై విశ్వాసముంచే మానవులు పాపం నుండి, దాని ప్రభావాల నుండి విడుదల చేయబడి పరదైసులో జీవించడానికి ప్రేమపూర్వకంగా ఏర్పాట్లు చేసేందుకు గొప్ప త్యాగం చేశాడు. ఆయన అవసరమైతే మానవులను మృతులలో నుండి పునరుత్థానం చేసి పరదైసులో జీవించే అవకాశాన్ని కల్పిస్తాడు.

దేవుడు ఆ వివాదాన్ని పరిష్కరించడానికి సమయం ఇచ్చినందువల్ల, దేవుని సేవకులు తాము దేవుని ప్రేమకు ప్రతిస్పందించగలమని చూపించడానికీ, అన్ని పరిస్థితుల్లోను యెహోవాకు యథార్థంగా ఉంటామని నిరూపించుకోవడానికీ అవకాశం లభించింది. విశ్వంలోని నియమాలను అందరూ గౌరవించాలంటే, దేవుని సర్వాధిపత్యానికి సంబంధించిన ఈ వివాదంతోపాటు మానవుల యథార్థతకు సంబంధించిన వివాదం కూడా పరిష్కరించబడడం ఎంతో ఆవశ్యకం. విశ్వంలోని నియమాలను అందరూ గౌరవించకపోతే నిజమైన శాంతిని నెలకొల్పడం ఎప్పటికీ సాధ్యంకాదు. *

[అధస్సూచి]

^ పేరా 36 ఈ వివాదాలు, వాటికి సంబంధించిన విషయాలు యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాకు సన్నిహితమవండి అనే పుస్తకంలో మరింత వివరంగా చర్చించబడ్డాయి.

[చిత్రం]

భూవ్యాప్త రాజకీయ పరిపాలనా వ్యవస్థ అంతమవుతుంది