కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దీనంతటి భావమేమిటి?

దీనంతటి భావమేమిటి?

దీనంతటి భావమేమిటి?

యుద్ధాలు, ఆహార కొరతలు, తెగుళ్ళు, భూకంపాలు వంటివి ‘యుగసమాప్తికి’ సూచనలని యేసుక్రీస్తు చెప్పాడు.​—⁠మత్తయి 24:​1-8; లూకా 21:​10, 11.

1914 నుండి, దేశాల మధ్యా వివిధ జాతుల మధ్యా జరుగుతున్న యుద్ధాలవల్ల జీవితం అతలాకుతలం అయ్యింది, అలాంటి యుద్ధాలు మత నాయకులు రాజకీయాల్లో కలుగజేసుకోవడంవల్ల లేదా ఎంతో ప్రబలమౌతోన్న తీవ్రవాదుల దాడులవల్ల ప్రారంభమైనవే.

విజ్ఞానశాస్త్రం ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ, భూవ్యాప్తంగా కోట్లాదిమంది తీవ్రమైన ఆహార కొరతతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ఆకలితో అలమటించి మరణిస్తున్నారు.

తెగుళ్ళు అంటే విస్తృతంగా వ్యాపించిన అంటువ్యాధులు కూడా యేసు చెప్పిన సూచనలో భాగమే. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్లూ జ్వరం మహమ్మారి 2,10,00,000 కంటే ఎక్కువమంది ప్రాణాలను బలిగొన్నది. గతంలో నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితమైన తెగుళ్ళలా కాకుండా అది భూవ్యాప్తంగా అనేక దేశాలకే కాక మారుమూల ద్వీపాలకు కూడా వ్యాపించింది. ఇప్పుడు ఎయిడ్స్‌ భూగోళాన్ని కబళిస్తోంది, క్షయ, మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ జ్వరం వంటి వ్యాధులు వర్ధమాన దేశాల్లోని ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి.

ప్రతి సంవత్సరం వేర్వేరు తీవ్రతలుగల వేలాది భూకంపాలు సంభవిస్తున్నాయని నివేదించబడుతోంది. ఎన్ని సాధనాలు అందుబాటులోవున్నా, నివేదికలు అందించే పద్ధతులు ఎంత మెరుగుపడినా అధిక జనాభాగల ప్రాంతాల్లో సంభవించే భూకంపాలు చేసే వినాశనం వార్తల్లో ముఖ్యాంశాల స్థానాన్ని ఆక్రమించుకుంటూనే ఉంది.

బైబిలు ఇలా కూడా ప్రవచించింది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.”​—⁠2 తిమోతి 3:​1-5.

మనం ‘అపాయకరమైన కాలాల్లోనే’ జీవిస్తున్నామని మీరు అంగీకరించరా?

అధికశాతం ప్రజలు స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా, అహంకారంతో ప్రవర్తించేవారిగా ఉన్నారని మీరు గమనించారా?

తమ ఇష్ట ప్రకారమే జరగాలని పట్టుపట్టేవారు, కృతజ్ఞతలేనివారు, దేనికీ సమ్మతించనివారు, విశ్వాసఘాతకులు వంటివారితో ప్రపంచం నిండివుందనే విషయాన్ని ఎవరు కాదంటారు?

తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం, కలవరపరిచే అనురాగరాహిత్యం కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాదుగానీ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయాయని మీకు తెలుసా?

సుఖభోగాలను ప్రేమించడంలో మునిగితేలుతూ మంచిని ప్రేమించడంలో ఘోరంగా విఫలమవుతున్న లోకంలో మనం జీవిస్తున్నామని మీరు గ్రహించేవుంటారు. “అంత్యదినములలో” ప్రబలంగా ఉండే వైఖరులను బైబిలు అచ్చం ఇలాగే వర్ణిస్తోంది.

మనం జీవిస్తున్న కాలాన్ని గుర్తించడానికి ఇంతకంటే ఎక్కువ ఆధారాలు అవసరమా? ఈ కాలంలోనే దేవుని రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడుతుందని కూడా యేసు ప్రవచించాడు. (మత్తయి 24:​14) మరి ఆ పని జరుగుతోందా?

యెహోవా రాజ్య సువార్తను ప్రకటించడానికే అంకితం చేయబడిన కావలికోట అనే బైబిలు ఆధారిత పత్రిక ఇతర పత్రికలన్నింటి కంటే ఎక్కువ భాషల్లో క్రమంగా ప్రచురించబడుతోంది.

దేవుని రాజ్యం గురించి ఇతరులకు వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వడానికి యెహోవాసాక్షులు ప్రతి సంవత్సరం వందకోట్లకంటే ఎక్కువ గంటలను వెచ్చిస్తున్నారు.

ప్రస్తుతం యెహోవాసాక్షులు బైబిలును వివరించే సాహిత్యాలను దాదాపు 400 భాషల్లో ప్రచురిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాట్లాడే, చాలా తక్కువమంది మాట్లాడే భాషల్లో కూడా వాళ్ళు సాహిత్యాలను ప్రచురిస్తున్నారు. యెహోవాసాక్షులు అన్ని దేశాలకు సువార్తను చేరవేస్తున్నారు; వాళ్ళు రాజకీయపరంగా గుర్తింపు పొందలేనంత చిన్నగావున్న అనేక ద్వీపాల్లో, ప్రాంతాల్లో కూడా ప్రకటిస్తున్నారు. చాలా దేశాల్లో వాళ్ళు బైబిలు విద్యా కార్యక్రమాన్ని క్రమంగా నిర్వహిస్తున్నారు.

నిజమే దేవుని రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడుతోంది, అయితే అది లోకాన్ని మార్చడానికి కాక సాక్ష్యమివ్వడానికి మాత్రమే ప్రకటించబడుతోంది. భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఉందో లేదో, అలా సృష్టించిన వ్యక్తి నియమాలను గౌరవిస్తారో లేదో, తమ పొరుగువారిపట్ల ప్రేమను ప్రదర్శిస్తారో లేదో నిరూపించుకోవడానికి అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు అవకాశం ఇవ్వబడుతోంది.​—⁠లూకా 10:​25-27; ప్రకటన 4:​10.

త్వరలోనే దేవుని రాజ్యం భూమిపై నుండి దుష్టులందరినీ నిర్మూలించి, భూమిని పరదైసుగా మారుస్తుంది.​—⁠లూకా 23:​43.

[6వ పేజీలోని బాక్సు]

దేనికి అంత్యదినాలు?

అంత్యదినాలు మానవాళికి కాదు. దేవుని చిత్తం చేసేవారికి బైబిలు నిరంతరం జీవించే ఉత్తరాపేక్షను అందిస్తోంది.​—⁠యోహాను 3:​16, 36; 1 యోహాను 2:​17.

అంత్యదినాలు భూమికి కూడా కాదు. మానవులు నివసించే భూమి నిరంతరం నిలుస్తుందని దేవుని వాక్యం వాగ్దానం చేస్తోంది.​—⁠కీర్తన 37:​29; 104:⁠5; యెషయా 45:​18.

అయితే దౌర్జన్యపూరితమైన, ప్రేమరహితమైన ఈ వ్యవస్థకూ ఈ వ్యవస్థ మార్గాలను అంటిపెట్టుకొని ఉండేవారికీ ఇవి అంత్యదినాలు.​—⁠సామెతలు 2:⁠21, 22.

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

బైబిలు నిజంగా దేవుని వాక్యమేనా?

బైబిలు ప్రవక్తలు “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అని పదేపదే వ్రాశారు. (యెషయా 43:​14; యిర్మీయా 2:⁠2) దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ‘నేను మీతో చెబుతున్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు’ అని నొక్కిచెప్పాడు. (యోహాను 14:​10) స్వయంగా బైబిలే ‘ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది’ అని స్పష్టంగా చెబుతోంది.​—⁠2 తిమోతి 3:​16.

బైబిలు 2,200 కంటే ఎక్కువ భాషల్లో ప్రచురించబడిందని యునైటెడ్‌ బైబిల్‌ సొసైటీస్‌ నివేదించింది, ఇతర పుస్తకాలేవీ ఇన్ని భాషల్లో ప్రచురించబడలేదు. నాలుగు లక్షలకోట్ల కంటే ఎక్కువ బైబిళ్ళు పంపిణీ చేయబడ్డాయి, ఇతర పుస్తకాలేవీ ఇంత విస్తృతంగా పంపిణీ చేయబడలేదు. మరి మొత్తం మానవాళి కోసమని దేవుడిచ్చిన సందేశం అలాగే ఉండాలని మీరు అనుకోరా?

బైబిలు దేవునిచే ప్రేరేపించబడింది అనడానికిగల రుజువులపై సమగ్ర చర్చ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషుర్‌ చూడండి.

మీరు బైబిలు చదివి అది నిజంగానే దేవుని వాక్యమనే వాస్తవాన్ని అంగీకరిస్తే, ఎంతో ప్రయోజనం పొందుతారు.

[8వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

దేవుని రాజ్యమంటే ఏమిటి?

అది భూమ్యాకాశాల సృష్టికర్త, సత్యదేవుడు అయిన యెహోవా పరిపాలించడానికి స్థాపించిన ప్రత్యేక ప్రభుత్వం.​—⁠యిర్మీయా 10:10, 12.

దేవుడు ఆ ప్రభుత్వం ద్వారా పరిపాలించే అధికారాన్ని యేసుక్రీస్తుకు ఇచ్చాడని బైబిలు చెబుతోంది. (ప్రకటన 11:​15) యేసు భూమ్మీద ఉన్నప్పుడు తనకు అప్పటికే దేవుడు ఎంతో అధికారాన్నిచ్చాడని ప్రదర్శించాడు, ప్రకృతి శక్తులను అదుపు చేయడానికి, అన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి, చివరకు చనిపోయినవారిని పునరుత్థానం చేయడానికి కూడా ఆ అధికారం ఆయనకు సహాయం చేసింది. (మత్తయి 9:​2-8; మార్కు 4:​37-41; యోహాను 11:​11-44) “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు” దేవుడు ఆయనకు “ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” కూడా ఇస్తాడని ప్రేరేపిత బైబిలు ప్రవచనం ముందే తెలియజేసింది. (దానియేలు 7:​13, 14) ఆ ప్రభుత్వమే పరలోక రాజ్యము అని పిలువబడుతోంది; యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకం నుండే పరిపాలిస్తున్నాడు.

[7వ పేజీలోని చిత్రాలు]

భూవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతోంది