“మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు”
“మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు”
“మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి.”—మత్తయి 26:41.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఇంతకుముందెన్నడూ అంత తీవ్రమైన ఒత్తిడిని అనుభవించలేదు. ఆయన భూజీవితం ముగిసే సమయం వచ్చింది. త్వరలోనే తాను బంధించబడతానని, తనకు మరణ శిక్ష విధించబడుతుందని, తాను హింసా కొయ్యపై కొరతవేయబడతానని యేసుకు తెలుసు. తాను తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి చర్యా తన తండ్రి నామంపై ప్రభావం చూపిస్తాయని ఆయనకు తెలుసు. మానవాళి భవిష్యత్ జీవిత ఉత్తరాపేక్షలు తన చేతుల్లోనే ఉన్నాయని కూడా యేసుకు తెలుసు. ఒకేసారి అంతటి ఒత్తిడి ఎదురైనప్పుడు ఆయన ఏమి చేశాడు?
2 యేసు తన శిష్యులతోపాటు గెత్సెమనే తోటకు వెళ్ళాడు. అది యేసుకు ఇష్టమైన ప్రదేశం. అక్కడ ఆయన తన శిష్యుల నుండి కొంచెం దూరంగా వెళ్ళాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, తన హృదయంలోని లోతైన తలంపులను భావాలను వ్యక్తం చేస్తూ తనకు శక్తినివ్వమని కోరుతూ తన పరలోక తండ్రికి తీవ్రంగా ప్రార్థించాడు, అలా ఒక్కసారి కాదు మూడుసార్లు ప్రార్థించాడు. యేసు పరిపూర్ణుడైనా, తనంతట తానే ఆ ఒత్తిడిని తట్టుకోగలనని భావించలేదు.—మత్తయి 26:36-44.
3 నేడు మనం కూడా తీవ్రమైన ఒత్తిడితో సతమతమవుతున్నాము. ఈ బ్రోషుర్ ప్రారంభంలో మనం ఈ దుష్ట వ్యవస్థకు అంత్యదినాల్లో జీవిస్తున్నామనడానికి రుజువులను చూశాము. సాతాను లోకపు శోధనలు, ఒత్తిళ్ళు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. సత్య దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునే మనలో ఎవరి నిర్ణయాలైనా, చర్యలైనా ఆయన నామంపై ప్రభావం చూపడమే కాక ఆయన నూతనలోకంలో జీవించడానికి మనకున్న నిరీక్షణపై కూడా గొప్ప ప్రభావం చూపిస్తాయి. మనం యెహోవాను ప్రేమిస్తున్నాము. మనం ‘అంతం వరకు సహించాలని’ అంటే ఈ వ్యవస్థే ముందు అంతమైనా లేదా మన జీవితమే మొదట ముగిసినా అంతవరకూ సహించాలని కోరుకుంటున్నాము. (మత్తయి 24:13) అయితే మనం మన అత్యవసర భావాన్ని కాపాడుకొంటూ అప్రమత్తంగా ఎలా ఉండవచ్చు?
4 మొదటి శతాబ్దంలోనూ నేడూ తన శిష్యులు కూడా ఒత్తిడికి గురవుతారని తెలిసే యేసు ఇలా చెప్పాడు: “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి.” (మత్తయి 26:41) నేడు మనకు ఆ మాటల భావమేమిటి? మీరు ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నారు? మీరు “మెలకువగా” అంటే అప్రమత్తంగా ఎలా ఉండవచ్చు?
ఎలాంటి శోధనలు?
5 మనమందరం ‘అపవాది ఉరిలో’ పడిపోయే శోధనను ప్రతిరోజు ఎదుర్కొంటాము. (2 తిమోతి 2:26) సాతాను ప్రాముఖ్యంగా యెహోవా ఆరాధకులను గురిగా చేసుకున్నాడని బైబిలు మనల్ని హెచ్చరిస్తోంది. (1 పేతురు 5:8; ప్రకటన 12:12, 17) ఎందుకు? మన ప్రాణాలు తీయాలనే కాదు. మనం దేవునికి నమ్మకంగా ఉండి మరణిస్తే అది సాతాను విజయం సాధించినట్లు కాదు. ఎందుకంటే యెహోవా తన నియమిత కాలంలో తన సేవకులను పునరుత్థానం చేస్తాడని సాతానుకు తెలుసు.—లూకా 20:37, 38.
6 అందుకే సాతాను మన ప్రస్తుత జీవితం కంటే ఎంతో విలువైనదానిని అంటే దేవునిపట్ల మన యథార్థతను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. మనం యెహోవా నుండి దూరమయ్యేలా తాను చేయగలనని నిరూపించుకోవడానికి సాతాను తాపత్రయపడుతున్నాడు. కాబట్టి సాతాను మనల్ని అవిశ్వసనీయులుగా చేయగలిగితే, అంటే సువార్తను ప్రకటించడం మానివేసేలా లేదా క్రైస్తవ ప్రమాణాలను వదిలిపెట్టేలా చేయగలిగితే అది అతనికి విజయమే! (ఎఫెసీయులు 6:11-13) అందుకే “ఆ శోధకుడు” మనల్ని శోధిస్తాడు.—మత్తయి 4:3.
ఎఫెసీయులు 6:11, జ్యూయిష్ న్యూ టెస్ట్‌మెంట్) అతడు మనల్ని ఐశ్వర్యాసక్తితో, భయంతో, సందేహాలతో, లేదా సుఖభోగాల అన్వేషణతో శోధించవచ్చు. అయితే అతడు ఉపయోగించే అత్యంత సమర్థవంతమైన పద్ధతుల్లో నిరుత్సాహం ఒకటి. జిత్తులమారి అవకాశవాదియైన సాతానుకు, నిరుత్సాహం మనల్ని ఆధ్యాత్మికంగా బలహీనపరచి శోధనలకు లొంగిపోయేలా చేయగలదని తెలుసు. (సామెతలు 24:10) అందుకే అతడు మనం భావోద్వేగపరంగా ‘నలిగిపోయి’ ఉన్నప్పుడు దేవుని ఆరాధనను విడిచిపెట్టేందుకు మనల్ని శోధిస్తాడు.—కీర్తన 38:8.
7 సాతాను “మోసపూరితమైన పన్నాగాలుగా” వేర్వేరు పద్ధతులను ఉపయోగిస్తాడు. (8 మనం అంత్యదినాల అంతాన్ని సమీపిస్తున్న కొలది, నిరుత్సాహానికి కారణాలు అధికమవుతున్నట్లు కనిపిస్తోంది, వాటి ప్రభావాలకు మనం అతీతులమేమీ కాదు. (“నిరుత్సాహపరిచే కొన్ని విషయాలు” అనే బాక్సు చూడండి.) కారణమేదైనప్పటికీ నిరుత్సాహం మనల్ని బలహీనపరుస్తుంది. మీరు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా అలసిపోయివున్నప్పుడు బైబిలు అధ్యయనం చేయడం, క్రైస్తవ కూటాలకు హాజరవడం, పరిచర్యలో పాల్గొనడం వంటి ఆధ్యాత్మిక బాధ్యతలను నిర్వహించేందుకు ‘సమయాన్ని సద్వినియోగం’ చేసుకోవడం సవాలుగా మారవచ్చు. (ఎఫెసీయులు 5:15, 16) శోధకుడైన సాతాను మీరు దేవుణ్ణి ఆరాధించడం మానుకోవాలని కోరుకుంటున్నాడని గుర్తుంచుకోండి. కానీ దేవుని సేవలో మందగించడానికి గానీ మనం జీవిస్తున్న కాలాలకు సంబంధించి అత్యవసర భావాన్ని కోల్పోవడానికి గానీ ఇది సమయం కాదు! (లూకా 21:34-36) మీరు శోధనలను ఎదిరించి అప్రమత్తంగా ఎలా ఉండవచ్చు? సహాయకరంగా ఉండగల నాలుగు సలహాలను పరిశీలించండి.
నిరంతరం “ప్రార్థనచేయుడి”
9ప్రార్థన చేయడం ద్వారా యెహోవాపై ఆధారపడండి. గెత్సెమనే తోటలో యేసు ఉదాహరణ గుర్తు చేసుకోండి. తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడికి గురైనప్పుడు ఆయన ఏమి చేశాడు? ఆయన సహాయం కోసం యెహోవాను వేడుకుంటూ ఎంత తీవ్రంగా ప్రార్థించాడంటే ఆయన ‘చెమట నేలపై పడుతున్న గొప్ప రక్త బిందువులవలె అయ్యింది.’ (లూకా 22:44) ఒక్కసారి ఆలోచించండి. యేసుకు సాతాను గురించి బాగా తెలుసు. దేవుని సేవకులను ఉరిలో పడవేయడానికి కృషి చేస్తూ సాతాను ఉపయోగించే శోధనలన్నింటిని యేసు పరలోకం నుండి గమనించాడు. అయినప్పటికీ ఆ శోధకుడు తన ఎదుట ఎలాంటి శోధనలను ఉంచినా తాను సులభంగా అధిగమించగలనని యేసు భావించలేదు. పరిపూర్ణుడైన దేవుని కుమారుడే దేవుని సహాయం కోసం, శక్తి కోసం ప్రార్థించవలసిన అవసరతను గుర్తిస్తే మనం ఇంకెంతగా ఆ అవసరతను గుర్తించాలి!—1 పేతురు 2:21.
10 నిరంతరం “ప్రార్థనచేయుడి” అని తన శిష్యులకు చెప్పిన తర్వాత యేసు, “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము” అని అన్నాడని కూడా గుర్తు తెచ్చుకోండి. (మత్తయి 26:41) యేసు ఎవరి శరీరం గురించి మాట్లాడుతున్నాడు? ఆయన తన శరీరం గురించి మాట్లాడలేదన్నది నిస్సంశయం; ఆయన పరిపూర్ణమైన మానవ శరీరంలో బలహీనమైనదేదీ లేదు. (1 పేతురు 2:22) అయితే ఆయన శిష్యుల పరిస్థితి వేరు. వారసత్వంగా పొందిన అపరిపూర్ణత కారణంగా, పాపభరితమైన కోరికల కారణంగా వాళ్ళకు శోధనలను ఎదిరించడానికి ప్రత్యేకంగా సహాయం అవసరం. (రోమీయులు 7:) అందుకే శోధనలు ఎదురైనప్పుడు వాటితో సమర్థవంతంగా వ్యవహరించడానికి సహాయం కోసం ప్రార్థన చేయమని ఆయన తన శిష్యులకే కాక నిజ క్రైస్తవులందరికీ ఉద్బోధించాడు. ( 21-24మత్తయి 6:13) యెహోవా అలాంటి ప్రార్థనలకు సమాధానమిస్తాడు. (కీర్తన 65:2) ఎలా? కనీసం రెండు విధాలుగా ఆయన మన ప్రార్థనలకు సమాధానమిస్తాడు.
11 మొదటిగా, మనం శోధనలను గుర్తించడానికి దేవుడు సహాయం చేస్తాడు. సాతాను శోధనలు చీకటిగావున్న దారిలో పేర్చబడిన ఉరులవంటివి. మీరు వాటిని చూడకపోతే వాటిలో చిక్కుకుపోతారు. యెహోవా బైబిలు ద్వారా, బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా సాతాను ఉరులను మనం గుర్తించేలా చేసి మనం శోధనలకు లొంగిపోకుండా ఉండడానికి సహాయం చేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా, మనుష్యులకు భయపడడం, లైంగిక అనైతికత, ఐశ్వర్యాసక్తి మరియు సాతాను తీసుకువచ్చే ఇతర శోధనలకు సంబంధించి ముద్రిత ప్రచురణలూ సమావేశ కార్యక్రమాలూ మనల్ని పదేపదే అప్రమత్తం చేస్తున్నాయి. (సామెతలు 29:25; 1 కొరింథీయులు 10:8-11; 1 తిమోతి 6:9, 10) సాతాను పన్నాగాల గురించి మనల్ని హెచ్చరిస్తున్నందుకు మీరు యెహోవాకు కృతజ్ఞులుగా లేరా? (2 కొరింథీయులు 2:11) ఇలాంటి హెచ్చరికలన్నీ, శోధనలను ఎదిరించడానికి సహాయం చేయమని మనం చేసే ప్రార్థనలకు సమాధానాలే.
12 రెండవదిగా, శోధనలను సహించడానికి శక్తినివ్వడం ద్వారా యెహోవా మన ప్రార్థనలకు సమాధానమిస్తాడు. ఆయన వాక్యమిలా చెబుతోంది: ‘దేవుడు మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేస్తాడు.’ (1 కొరింథీయులు 10:13) మనం శోధనను ఎదిరించడానికి ఆధ్యాత్మిక శక్తే లేకుండా పోయేంతగా శోధింపబడడానికి దేవుడు ఎన్నడూ అనుమతించడు, అయితే దేవుడలా చేయాలంటే మనం ఎల్లప్పుడూ ఆయనపై ఆధారపడాలి. ఆయన మనకు “తప్పించుకొను మార్గమును” ఎలా కల్పిస్తాడు? ఆయన ‘తనను అడుగువారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు.’ (లూకా 11:13) సరైనదే చేయాలనే మన తీర్మానాన్ని బలపరిచే బైబిలు సూత్రాలను గుర్తు తెచ్చుకోవడానికి, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. (యోహాను 14:26; యాకోబు 1:5, 6) తప్పుడు కోరికలను అధిగమించడానికి కావలసిన లక్షణాలను ప్రదర్శించడానికి అది మనకు సహాయం చేస్తుంది. (గలతీయులు 5:22) తోటి విశ్వాసులు మనకు ‘ఆదరణ కలిగించేలా’ కూడా దేవుని పరిశుద్ధాత్మ వారిని పురికొల్పవచ్చు. (కొలొస్సయులు 4:11) సహాయం కోసం మీరు చేసే ప్రార్థనలకు యెహోవా ఇంత ప్రేమపూర్వకంగా ప్రతిస్పందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతగా లేదా?
మీరు మీ శక్తికి మించి ఆశించకండి
13 అప్రమత్తంగా ఉండడానికి మనం మన శక్తికి మించి ఆశించకూడదు. జీవితపు ఒత్తిళ్ళ కారణంగా మనమందరం అప్పుడప్పుడు విసిగిపోతాము. అయితే ఈ పాత విధానంలో మనం సమస్యలులేని జీవితం గడుపుతామని దేవుడు ఎన్నడూ వాగ్దానం చేయలేదని మనం గుర్తుంచుకోవాలి. బైబిలు కాలాల్లో కూడా దేవుని సేవకులు హింస, పేదరికం, మానసిక కృంగుదల, అనారోగ్యం వంటివాటితోపాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.—అపొస్తలుల కార్యములు 8:1; 2 కొరింథీయులు 8:1, 2; 1 థెస్సలొనీకయులు 5:14; 1 తిమోతి 5:23.
14 నేడు మనకు కూడా మనవంతు సమస్యలు ఉన్నాయి. మనం హింసను అనుభవించవచ్చు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, మానసిక కృంగుదలతో పోరాడుతుండవచ్చు, వ్యాధిగ్రస్తులం కావచ్చు, ఇంకా ఇతర విధాలుగా కష్టాలు అనుభవించవచ్చు. యెహోవా మనల్ని అన్ని కష్టాల నుండి అద్భుతరీతిలో కాపాడితే, సాతాను యెహోవాను నిందించడానికి అది హేతువు కాదా? (సామెతలు 27:11) తన సేవకులు శోధించబడడానికి, పరీక్షించబడడానికి, కొన్నిసార్లు వ్యతిరేకుల చేతుల్లో అకాలంగా మరణించడానికి కూడా యెహోవా అనుమతిస్తాడు.—యోహాను 16:2.
15 మరైతే యెహోవా వాగ్దానం చేసినదేమిటి? మనం ఇంతకుముందు పరిశీలించినట్లు మనం ఆయనపై సంపూర్ణ విశ్వాసముంచితే మనం ఎదుర్కొనే ఎలాంటి శోధననైనా ఎదిరించడానికి కావలసిన శక్తిని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. (సామెతలు 3:5, 6) ఆయన తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా, తన సంస్థ ద్వారా మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడుతూ ఆయనతో మనకున్న సంబంధాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తాడు. ఆయనతో మనకున్న సంబంధం పటిష్ఠంగా ఉంటే మనం చనిపోయినప్పటికీ విజయం సాధిస్తాము. దేవుడు తన విశ్వసనీయ సేవకులకు ప్రతిఫలం ఇవ్వకుండా ఏదీ ఆపలేదు, చివరకు మరణం కూడా ఆపలేదు. (హెబ్రీయులు 11:6) ఇప్పుడు ఎంతో సమీపంగావున్న నూతనలోకంలో, యెహోవా తనను ప్రేమించేవారి కోసం వాగ్దానం చేసిన అద్భుతమైన వాగ్దానాలన్నింటినీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు.—కీర్తన 145:16.
వివాదాంశాలను గుర్తుంచుకోండి
16 మనం అంతం వరకూ సహించాలంటే దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడానికి కారణమైన ప్రాముఖ్యమైన వివాదాంశాలను గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మన సమస్యలు భరించలేనట్లుగా అనిపించి మనం దేవుణ్ణి ఆరాధించడం మానివేయాలని శోధించబడితే, సాతాను యెహోవా సర్వాధిపత్యపు హక్కును సవాలు చేశాడని మనం గుర్తు చేసుకోవాలి. మోసగాడైన సాతాను దేవుని ఆరాధకుల భక్తిని, యథార్థతను కూడా సవాలు చేశాడు. (యోబు 1:8-11; 2:3, 4) ఆ వివాదాంశాలు, యెహోవా వాటిని పరిష్కరించడానికి ఎంచుకున్న విధానం మన జీవితాలకంటే ఎంతో ప్రాముఖ్యమైనవి. ఎందుకలా అనవచ్చు?
17 దేవుడు తాత్కాలికంగా కష్టాలను అనుమతించడంవల్ల ఇతరులు సత్యం అంగీకరించడానికి సమయం లభించింది. ఈ విషయం గురించి ఆలోచించండి: మనం జీవించివుండేందుకు యేసు కష్టాలు అనుభవించాడు. (యోహాను 3:16) దానికి మనం కృతజ్ఞులము కామా? అయితే ఇంకా ఎక్కువమంది జీవాన్ని సంపాదించుకోవడానికి వీలుగా మనం ఇంకొంతకాలం కష్టాలు సహించడానికి సుముఖంగా ఉన్నామా? అంతం వరకు సహించడానికి, మన జ్ఞానం కంటే యెహోవా జ్ఞానం ఎంతో గొప్పదని మనం గుర్తించాలి. (యెషయా 55:9) మన నిరంతర భవిష్యత్తుకు ప్రయోజనకరమైన విధంగా ఆ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఏది అత్యుత్తమమైన సమయమో అప్పుడే ఆయన దుష్టత్వాన్ని అంతం చేస్తాడు. ఆ వివాదాలను పరిష్కరించడానికి ఇంతకంటే మంచి పద్ధతేముంది? దేవుడు అన్యాయస్థుడు కాదు!—రోమీయులు 9:14-24.
“దేవునికి సన్నిహితమవండి”
18 మన అత్యవసర భావాన్ని కాపాడుకోవడానికి మనం యెహోవాకు సన్నిహితంగా ఉండాలి. యెహోవాతో మనకున్న మంచి సంబంధాన్ని చెడగొట్టడానికి సాతాను తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని ఎన్నడూ మరచిపోకండి. అంతం ఎప్పటికీ రాదని, సువార్తను ప్రకటించడం, బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా జీవించడం వ్యర్థమని మనల్ని నమ్మించడానికి సాతాను ప్రయత్నిస్తాడు. కానీ అతను ‘అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు.’ (యోహాను 8:44) మనం ‘అపవాదిని ఎదిరించడానికి’ తీర్మానించుకోవాలి. యెహోవాతో మనకున్న సంబంధాన్ని మనం ఎన్నడూ తేలికగా తీసుకోకూడదు. బైబిలు ప్రేమపూర్వకంగా మనకు ఇలా ఉద్బోధిస్తోంది: “దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు.” (యాకోబు 4:7, 8, NW) మీరు యెహోవాకు ఎలా మరింత సన్నిహితం కావచ్చు?
19 ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం ఆవశ్యకం. జీవితపు ఒత్తిళ్ళు మిమ్మల్ని ముంచెత్తుతున్నట్లు అనిపిస్తే మీ హృదయాన్ని యెహోవా ఎదుట కుమ్మరించండి. మీ సమస్యలను మీరు ఎంత స్పష్టంగా తెలియజేస్తే, దేవుడు మీ ప్రార్థనలకు ఇచ్చే సమాధానాలను చూడడం అంత సులభంగా ఉంటుంది. ఆయన ఇచ్చే సమాధానం ఖచ్చితంగా మీరు ఆశించినట్లే ఉండకపోవచ్చు కానీ మీరు ఆయనను ఘనపరచాలనీ మీ యథార్థతను కాపాడుకోవాలనీ కోరుకుంటే మీరు విజయవంతంగా సహించడానికి కావలసిన సహాయాన్ని ఆయన మీకు అందజేస్తాడు. (1 యోహాను 5:14) మీరు మీ జీవితంలో ఆయన మార్గనిర్దేశాన్ని చూసినప్పుడు మీరు ఆయనకు మరింత సన్నిహితమవుతారు. బైబిలులో వెల్లడిచేయబడిన యెహోవా లక్షణాల గురించి, ఆయన వ్యవహరించే విధానం గురించి చదవడం, ధ్యానించడం కూడా ఆవశ్యకమే. అలా ధ్యానించడం మీరు ఆయన గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది; అది మీ హృదయాన్ని కదిలించి, ఆయనపట్ల మీకున్న ప్రేమ ప్రగాఢమయ్యేలా చేస్తుంది. (కీర్తన 19:14) ఆ ప్రేమ, మిగతా వాటన్నింటికంటే ఎక్కువగా, మీరు శోధనలను ఎదిరించి అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేస్తుంది.—1 యోహాను 5:3.
20 యెహోవాకు సన్నిహితంగా ఉండడానికి, మనం మన తోటి విశ్వాసులకు సన్నిహితంగా ఉండడం కూడా ప్రాముఖ్యమే. దాని గురించి ఈ బ్రోషుర్‌లోని ఆఖరి భాగంలో చర్చించబడుతుంది.
అధ్యయన ప్రశ్నలు
• యేసు తన భూజీవితం ముగిసే సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఏమి చేశాడు, ఆయన తన శిష్యులను ఏమి చేయమని ప్రోత్సహించాడు? (1-4 పేరాలు)
• సాతాను యెహోవా ఆరాధకులను గురిగా ఎందుకు పెట్టుకున్నాడు, అతడు ఏయే విధాలుగా మనల్ని శోధిస్తాడు? (5-8 పేరాలు)
• శోధనను ఎదిరించడానికి మనం ఎందుకు నిరంతరం ప్రార్థించాలి (9-12 పేరాలు), మన శక్తికి మించి ఎందుకు ఆశించకూడదు (13-15 పేరాలు), వివాదాంశాలను ఎందుకు గుర్తుంచుకోవాలి (16-17 పేరాలు), ఎందుకు ‘దేవునికి సన్నిహితం కావాలి’ (18-20 పేరాలు)?
[25వ పేజీలోని బాక్సు]
నిరుత్సాహపరిచే కొన్ని విషయాలు
ఆరోగ్యం/వయసు. మనం దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నా లేదా పెరుగుతున్న వయసువల్ల పరిమితులు ఏర్పడినా, దేవుని సేవలో ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నామని కృంగిపోయే అవకాశం ఉంది.—హెబ్రీయులు 6:10.
నిరాశ. దేవుని వాక్యం ప్రకటించాలని మనం చేసే కృషికి సరైన ప్రతిస్పందన లభించకపోయినా మనం నిరుత్సాహపడవచ్చు.—సామెతలు 13:12.
నిష్ప్రయోజకులమన్న భావాలు. ఎన్నో సంవత్సరాలుగా అనుచిత వ్యవహారానికి గురైన వ్యక్తి తనను ఎవ్వరూ చివరికి యెహోవా కూడా ప్రేమించడంలేదనే నిర్ధారణకు రావచ్చు.—1 యోహాను 3:19, 20.
గాయపడిన మనోభావాలు. ఒక వ్యక్తిని తోటి విశ్వాసి తీవ్రంగా అభ్యంతరపరిస్తే, ఆ వ్యక్తి క్రైస్తవ కూటాలకు హాజరవడం లేదా క్షేత్ర పరిచర్యలో పాల్గొనడం మానేద్దామని శోధించబడేంతగా బాధపడుతుండవచ్చు.—లూకా 17:1.
హింస. మీ విశ్వాసాలను పంచుకోని ఇతరులు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు, హింసించవచ్చు, లేదా ఎగతాళి చేయవచ్చు.—2 తిమోతి 3:12; 2 పేతురు 3:3, 4.
[26వ పేజీలోని చిత్రం]
శోధనలను ఎదిరించేందుకు సహాయం కోసం నిరంతరం “ప్రార్థనచేయుడి” అని యేసు మనల్ని ప్రోత్సహించాడు