మీ జీవితం ఎటు వెళ్తోంది?
మీ జీవితం ఎటు వెళ్తోంది?
• చాలామంది తమ దైనందిన కార్యకలాపాల్లో ఎంతగా నిమగ్నులై ఉంటారంటే, తాము ఎటు వెళుతున్నామనే విషయాన్ని వాళ్ళు అసలు పట్టించుకోరు.
• బైబిలు జరగబోయే అద్భుతమైన సంఘటనల గురించి మనకు తెలియజేస్తోంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగావున్న మానవ సంస్థాపనల్లో గొప్ప మార్పు జరుగుతుందని కూడా అది మనల్ని హెచ్చరిస్తోంది. బైబిలు చెప్పే విషయాల నుండి ప్రయోజనం పొందడానికి, విపత్తు నుండి తప్పించుకోవడానికి మనం వెంటనే ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం అవశ్యం.
• కొంతమందికి బైబిలు ఏమి చెబుతోందో తెలుసు, వాళ్ళు దానిని అన్వయించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు, అయితే జీవిత చింతలవల్ల వాళ్ళు పక్కకు మళ్ళిపోతారు.
• మీ జీవితం వెళ్తోన్న దిశ మీకు తృప్తికరంగానే ఉందా? మీరు మీ కార్యకాలాపాలను ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు, అవి మీ జీవితంలోని దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా ప్రభావితం చేయగలవో ఆలోచిస్తారా?
[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
మీకు అత్యంత ప్రాముఖ్యమైనదేది?
ఈ క్రింద ఇవ్వబడినవాటిలో మీరు దేనికి ఏ స్థానమిస్తారు? మీరు వాటికిచ్చే ప్రాధాన్యత అనుసారంగా వాటి ప్రక్కన సంఖ్య వేయండి.
క్రింద ఇవ్వబడినవాటిలో చాలా విషయాలకు జీవితంలో సరైన స్థానం ఉంటుంది, కానీ మీరు ఎంపిక చేసుకోవలసి వస్తే, దేనికి మొదటి స్థానం ఇస్తారు? దేనికి రెండవ స్థానం ఇస్తారు? వగైరా.
․․․ వినోదం/ఉల్లాస కార్యకలాపాలు
․․․ నా ఉద్యోగం లేదా నా వృత్తి
․․․ నా ఆరోగ్యం
․․․ నా సంతోషం
․․․ నా జీవిత భాగస్వామి
․․․ నా తల్లిదండ్రులు
․․․ నా పిల్లలు
․․․ చక్కని ఇల్లు, మంచి బట్టలు
․․․ నేను ఏమి చేసినా దానిలో రాణించడం
․․․ దేవుని ఆరాధన
[10, 11వ పేజీలోని బాక్సు]
మీరు ఎంపిక చేసుకున్నవి మీరు నిజంగా వెళ్ళాలనుకుంటున్న చోటుకే మిమ్మల్ని నడిపిస్తున్నాయా?
ఈ ప్రశ్నలను పరిశీలించండి
వినోదం/ఉల్లాస కార్యకలాపాలు: నేను ఎంపిక చేసుకునే ఉల్లాస కార్యకలాపాలు నన్ను ఆహ్లాదపరుస్తున్నాయా? అవి నా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడవేసే లేదా నన్ను శాశ్వతంగా అంగవైకల్యానికి గురిచేసే సాహస కార్యాలకు సంబంధించినవా? ఆ కార్యకలాపాలు బహుశా కొన్ని గంటలు ఉత్తేజపరిచే “వినోదమే” అయినా, ఆ తర్వాత అవి నన్ను ఎంతోకాలం వరకు బాధపెట్టే అవకాశముందా? నేను ఎంపిక చేసుకునే వినోదం మంచిదే అయినా, మరింత ప్రాముఖ్యమైన విషయాలకు సమయం లేకుండా పోయేంతగా నేను దానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నానా?
నా ఉద్యోగం లేదా నా వృత్తి: అది నా జీవితావసరాలను తీర్చుకోవడానికి సహాయం చేస్తోందా లేక నేనే దానికి బానిసనవుతున్నానా? నా ఆరోగ్యం పాడయ్యేంతగా దానికి సమయం ఇవ్వాల్సి వస్తోందా? నేను పనివేళల తర్వాత అదనంగా పనిచేయడానికి ఇష్టపడుతున్నానా లేక నా జీవిత భాగస్వామితో, నా పిల్లలతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నానా? నా మనస్సాక్షిని అభ్యంతరపెట్టే పనులు చేయమని లేదా తరచూ నా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సమయం లేకుండా చేసేంతగా పని చేయమని నా యజమాని అధికారంతో అడిగితే, నేను నా ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి అలా చేస్తానా?
నా ఆరోగ్యం: నేను నా ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉంటానా లేక దానిని జాగ్రత్తగా కాపాడుకుంటానా? నేను నా ఆరోగ్యం గురించే ఎక్కువగా మాట్లాడుతుంటానా? నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం నాకు నా కుటుంబంపట్ల శ్రద్ధ ఉందని చూపిస్తోందా?
నా సంతోషం: నేను ఎప్పుడూ నా సంతోషానికే ప్రాధాన్యతనిస్తానా? నేను నా జీవిత భాగస్వామి సంతోషం కంటే లేదా నా కుటుంబ సంతోషం కంటే నా సంతోషానికే ప్రాముఖ్యతనిస్తానా? నేను నా సంతోషం కోసం చేసేవి, సత్య దేవుని ఆరాధకులు చేయదగినవేనా?
నా జీవిత భాగస్వామి: నేను నా జీవిత భాగస్వామిని నాకు అనుకూలించినప్పుడు మాత్రమే నా సహచరునిగా/సహచరిగా దృష్టిస్తున్నానా? నేను నా జీవిత భాగస్వామిని గౌరవించదగిన వ్యక్తిగా భావించి అతనితో/ఆమెతో గౌరవపూర్వకంగా వ్యవహరిస్తున్నానా? నాకు దేవుని మీద ఉన్న నమ్మకం, నేను నా జీవిత భాగస్వామిని దృష్టించే విధానాన్ని ప్రభావితం చేస్తోందా?
నా తల్లిదండ్రులు: ఇంకా మైనరే అయితే, నేను నా తల్లిదండ్రులకు విధేయత చూపించడం అంటే వాళ్ళకు గౌరవపూర్వకంగా సమాధానం చెప్పడం, వాళ్ళు చెప్పిన పనులు చేయడం, వాళ్ళు చెప్పిన సమయానికి ఇంటికి రావడం, వాళ్ళు చేయకూడదని చెప్పిన పనులను చేయకుండా ఉండడం, వాళ్ళు వద్దని చెప్పిన స్నేహితులకు దూరంగా ఉండడం వంటివి చేస్తున్నానా? యుక్తవయస్కులైతే, నేను నా తల్లిదండ్రులు చెప్పే విషయాలను గౌరవపూర్వకంగా వింటున్నానా, వాళ్ళకు అవసరమైనప్పుడు తగిన సహాయం చేస్తున్నానా? నేను వాళ్ళతో నాకు అనుకూలించిన విధంగా వ్యవహరిస్తున్నానా లేక దేవుని వాక్య ఉపదేశానుసారంగా వ్యవహరిస్తున్నానా?
నా పిల్లలు: నా పిల్లలకు సరైన నైతిక విలువలు నేర్పించవలసిన బాధ్యత నాదే అని భావిస్తున్నానా లేక ఆ పనిని స్కూళ్లే చేయాలని ఆశిస్తున్నానా? నేను నా పిల్లలతో సమయం గడుపుతున్నానా లేక వాళ్ళు బొమ్మలతో, టీవీతో, కంప్యూటర్‌తో సమయం గడపాలని ఆశిస్తున్నానా? నా పిల్లలు దేవుని జ్ఞాపికలను నిర్లక్ష్యం చేసినప్పుడల్లా నేను వారిని క్రమశిక్షణలో ఉంచుతున్నానా లేక నాకు కోపం వచ్చినప్పుడు మాత్రమే అలా చేస్తున్నానా?
చక్కని ఇల్లు, మంచి బట్టలు: నేను నా వ్యక్తిగత రూపానికి, నా వస్తుసంపదకు ప్రాముఖ్యతనిచ్చేది నా పొరుగువారిని ప్రభావితం చేయడానికా, నా కుటుంబ శ్రేయస్సు కోసమా, లేక నేను దేవుని ఆరాధకుడనైనందుకా?
నేను ఏమి చేసినా దానిలో రాణించడం: నేను చేసే పనులు చక్కగా చేయడం ప్రాముఖ్యమని భావిస్తున్నానా? నేను అందరికంటే బాగా పనులు చేయాలని కృషి చేస్తున్నానా? ఎవరైనా ఏదైనా నాకంటే బాగా చేస్తే నేను కలత చెందుతానా?
దేవుని ఆరాధన: నేను నా జీవిత భాగస్వామి, నా పిల్లల, నా తల్లిదండ్రుల లేదా నా యజమాని అంగీకారం పొందడం కంటే దేవుని అంగీకారం పొందడమే ప్రాముఖ్యమని భావిస్తున్నానా? నేను సౌకర్యవంతమైన జీవనశైలిని కాపాడుకోవడానికి దేవుని సేవను రెండవ స్థానంలోకి నెట్టివేయడానికి ఇష్టపడతానా?
బైబిలు ఉపదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి
మీ జీవితంలో దేవుని స్థానమేమిటి?
ప్రసంగి 12:13: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”
ఇలా ప్రశ్నించుకోండి: నేను ఆ లేఖనానుసారంగానే విషయాలను దృష్టిస్తున్నానని నా జీవితం చూపిస్తోందా? నేను ఇంట్లో, ఉద్యోగంలో, లేదా స్కూల్లో నా బాధ్యతలను నిర్వర్తించే విధానాన్ని దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం నిర్దేశిస్తోందా? నేను దేవుని కోసం సమయం కేటాయించడాన్ని ఇతర ఆసక్తులు, జీవిత ఒత్తిళ్ళు నిర్దేశిస్తున్నాయా?
మీకు దేవునితో ఎలాంటి సంబంధం ఉంది?
సామెతలు 3:5, 6: ‘నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.’
మత్తయి 4:10: ‘ప్రభువైన నీ దేవునికి [“నీ దేవుడైన యెహోవాకు,” NW] మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.’
ఇలా ప్రశ్నించుకోండి: పై లేఖనాలు చెబుతున్నట్లే నేను దేవుని గురించి భావిస్తున్నానా? నా దైనందిన కార్యకలాపాలు, నేను సమస్యలతో వ్యవహరించే విధానం అలాంటి విశ్వాసాన్నీ భక్తినీ ప్రదర్శిస్తున్నాయా?
బైబిలు చదవడాన్ని, దానిని అధ్యయనం చేయడాన్ని మీరు ఎంత ప్రాముఖ్యమైనవిగా దృష్టిస్తున్నారు?
యోహాను 17:3:“అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”
ఇలా ప్రశ్నించుకోండి: నేను దేవుని వాక్యాన్ని చదవడానికి, దాని గురించి ధ్యానించడానికి ఇస్తున్న ప్రాముఖ్యత, పై లేఖనంలో చెప్పబడిన విషయాన్ని నేను నిజంగా నమ్ముతున్నానని చూపిస్తోందా?
క్రైస్తవ సంఘ కూటాలకు హాజరవడం మీకు ఎంత ప్రాముఖ్యం?
హెబ్రీయులు 10:24, 25: ‘సమాజముగా కూడుట మానక, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.’
కీర్తన 122:1: “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.”
ఇలా ప్రశ్నించుకోండి: దేవుని వాక్యంలో ఇవ్వబడిన ఆ మార్గనిర్దేశాన్ని నేను విలువైనదిగా ఎంచుతున్నానని నా జీవిత విధానం చూపిస్తోందా? గత నెలలో నేను ఇతర విషయాలకు ప్రాముఖ్యతనివ్వడంవల్ల క్రైస్తవ కూటాల్లో దేనికైనా హాజరవలేకపోయానా?
దేవుని గురించి ఆయన సంకల్పం గురించి ఇతరులతో మాట్లాడడంలో మీరు అత్యంత ఆసక్తితో పాల్గొంటున్నారా?
మత్తయి 24:14: ‘ఈ రాజ్య సువార్త సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.’
మత్తయి 28:19, 20: ‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.’
కీర్తన 96:2: ‘యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.’
ఇలా ప్రశ్నించుకోండి: ఆ పని నా జీవితంలో ఉండవలసిన స్థానంలోనే ఉందా? ఆ పనిలో పాల్గొనడానికి నేను చేసే కృషి, మనం జీవిస్తున్న కాలాల గంభీరతను నేను గుర్తించినట్లు చూపిస్తోందా?