కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘వాళ్ళు పట్టించుకోలేదు’

‘వాళ్ళు పట్టించుకోలేదు’

‘వాళ్ళు పట్టించుకోలేదు’

హెచ్చరికలను తేలికగా తీసిపారేయడం వినాశకరం.

అది 1974, ఆస్ట్రేలియాలోని డార్విన్‌ నగరమంతా పండుగ వేడుకల కోసం సిద్ధపడుతున్న సమయంలో తుఫాను రాబోతుందని తెలిపే సైరన్లు మోగాయి. దాదాపు 30 సంవత్సరాలుగా డార్విన్‌ నగరానికి తుఫానువల్ల ఎలాంటి నష్టం కలుగలేదు, కాబట్టి ఇప్పుడు మాత్రం ఏమి జరుగుతుందిలే అని ఆ పట్టణ నివాసులు తలంచారు. ప్రచండమైన గాలులు వీయడం ప్రారంభమైనప్పుడు వాళ్ళు రక్షణ కోసం ఇళ్ళలోకి పరుగెత్తారు, ఆ గాలులకు ఇళ్ళ పైకప్పులు ఎగిరిపోవడం, గోడలు కూలిపోవడం మొదలయ్యేవరకూ చాలామంది ఆ ప్రమాదం నిజంగానే గంభీరమైనదని భావించలేదు. తర్వాతి రోజు ఉదయానికల్లా ఆ నగరం సర్వనాశనమయ్యింది.

కొలంబియాలో 1985వ సంవత్సరం నవంబరులో ఒక అగ్నిపర్వతం బ్రద్ధలయ్యింది. కరుగుతున్న మంచును చీల్చుకుంటూ ప్రవహించిన బురద ఆర్మెరో పట్టణానికి చెందిన 20,000 కంటే ఎక్కువమంది నివాసులను సజీవంగా పూడ్చిపెట్టింది. వాళ్ళకు ముందుగా హెచ్చరిక ఇవ్వబడలేదా? ఆ పర్వతం ఎన్నో నెలలుగా కంపిస్తూనే ఉంది. అయితే అగ్నిపర్వతం పక్కన జీవించడానికి అలవాటుపడడంవల్ల ఆర్మెరోలోని చాలామంది దానిని పట్టించుకోలేదు. త్వరలోనే విపత్తు సంభవిస్తుందని అధికారులకు హెచ్చరిక అందినప్పటికీ వాళ్లు ప్రజలను హెచ్చరించడానికి ఎలాంటి చర్యా తీసుకోలేదు. ప్రమాదమేమీ లేదని ప్రజలకు హామీ ఇవ్వడానికి రేడియోలో ప్రకటనలు చేయబడ్డాయి. ప్రశాంతంగా ఉండమని ప్రజలకు చెప్పడానికి చర్చీలోని లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించబడ్డాయి. అయితే సాయంత్రం రెండు పెద్ద విస్ఫోటనాలు జరిగాయి. మీకే ఆ పరిస్థితి ఎదురయ్యుంటే మీరు మీ వస్తుసంపదలను వదిలేసి పారిపోయి ఉండేవారా? మరీ ఆలస్యమైపోయేంత వరకు చాలామంది తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించలేదు.

భూగర్భ శాస్త్రజ్ఞులు భూకంపాలు ఎక్కడ సంభవిస్తాయో తరచూ చాలా ఖచ్చితంగా చెబుతారు. అయితే అవి ఎప్పుడు సంభవిస్తాయో మాత్రం వాళ్ళు సరిగ్గా చెప్పలేరు. 1999వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన భూకంపాలు దాదాపు 20,000 మంది ప్రాణాలను బలిగొన్నాయి. చనిపోయినవారిలో చాలామంది తమకు ఎప్పటికీ అలా జరగదని భావించినవాళ్ళే.

దేవుడే స్వయంగా చేసే హెచ్చరికలకు మీరెలా స్పందిస్తారు?

అంత్యదినాలను సూచించే సంఘటనలను బైబిలు ఎంతోకాలం ముందే స్పష్టంగా వర్ణించింది. ఆ వర్ణనకు సంబంధించి “నోవహు దినముల”ను పరిశీలించమని అది మనల్ని ప్రోత్సహిస్తోంది. “జలప్రళయమునకు ముందటి దినములలో” దౌర్జన్యం పెరిగిపోవడంవల్ల ప్రజలు చింతించినా వాళ్ళు తమ జీవిత కార్యకలాపాల్లోనే నిమగ్నులైవున్నారు. దేవుడు తన సేవకుడైన నోవహు ద్వారా ఇచ్చిన హెచ్చరికను వాళ్ళు “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి [“పట్టించుకోలేదు,” NW].” (మత్తయి 24:​37-39) మీరైతే ఆ హెచ్చరికను పట్టించుకునేవారా? మీరు ఇప్పుడు అలా చేస్తున్నారా?

మీరు అబ్రాహాము సోదరుని కుమారుడైన లోతు నివసించిన కాలంలో, మృత సముద్రానికి సమీపంలోవున్న సొదొమ నగరంలో నివసించినట్లయితే ఏమి చేసేవారు? ఆ చుట్టుప్రక్కల ప్రాంతం అందమైన ఉద్యానవనంలా ఉండేది. ఆ పట్టణం వర్ధిల్లుతుండేది. ప్రజలు చీకూచింతా లేకుండా జీవించేవారు. లోతు దినములలో వాళ్ళు “తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.” అయితే వాళ్ళు జీవిస్తున్న సమాజం నైతికంగా ఎంతో దిగజారిపోయింది. లోతు ఆ దుష్ట క్రియలను ఖండించినప్పుడు మీరు ఆ హెచ్చరికను లక్ష్యపెట్టి ఉండేవారా? దేవుడు సొదొమను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడని ఆయన మీకు చెప్పినప్పుడు మీరు విని ఉండేవారా? లేక లోతు కాబోయే అల్లుళ్ళలా, అదొక పరిహాసమన్నట్లు భావించేవారా? మీరు పారిపోవడం ప్రారంభించినప్పటికీ లోతు భార్యలా వెనక్కు తిరిగేవారా? ఇతరులు ఆ హెచ్చరికను గంభీరంగా తీసుకోకపోయినప్పటికీ లోతు సొదొమ నుండి బయటకు వచ్చిన రోజున “ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.”​—⁠లూకా 17:​28, 29.

మన కాలంలో కూడా అధికశాతం మంది హెచ్చరికలను పట్టించుకోరు. కానీ ఈ ఉదాహరణలు మనకు హెచ్చరికలుగా ఉండడానికి, మనల్ని అప్రమతంగా ఉండండి! అని ప్రోత్సహించడానికి దేవుని వాక్యంలో భద్రం చేయబడ్డాయి.

[22వ పేజీలోని బాక్సు/చిత్రం]

భూవ్యాప్త జలప్రళయం నిజంగానే వచ్చిందా?

చాలామంది విమర్శకులు జలప్రళయం రాలేదని చెబుతారు. కానీ అది వచ్చిందని బైబిలు చెబుతోంది.

యేసుక్రీస్తు స్వయంగా దాని గురించి మాట్లాడాడు, అది జరిగినప్పుడు ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయన దానిని పరలోకం నుండి చూశాడు.

[23వ పేజీలోని బాక్సు/చిత్రం]

సొదొమ గొమొఱ్ఱాలు నిజంగానే నాశనం చేయబడ్డాయా?

ఆ సంఘటన జరిగిందని పురావస్తుశాస్త్రం నిర్ధారిస్తోంది.

లౌకిక చరిత్ర దానిని ప్రస్తావిస్తోంది.

యేసుక్రీస్తు దానిని ధృవీకరించాడు, జరిగిన దాని గురించి బైబిల్లోని 14 పుస్తకాలు ప్రస్తావిస్తున్నాయి.