హెచ్చరికలను లక్ష్యపెట్టడం వారి ప్రాణాలను కాపాడింది
హెచ్చరికలను లక్ష్యపెట్టడం వారి ప్రాణాలను కాపాడింది
యెరూషలేములోని ఆలయం కేంద్రంగావున్న యూదా మత వ్యవస్థ అంతం కానున్నదని యేసుక్రీస్తు ముందుగానే హెచ్చరించాడు. అది ఏ రోజు సంభవిస్తుందో ఆయన వారికి చెప్పలేదు. కానీ ఆ నాశనానికి నడిపించే సంఘటనలను ఆయన వివరించాడు. అప్రమత్తంగా ఉండమని, ప్రమాద స్థలం నుండి పారిపొమ్మని ఆయన తన శిష్యులకు చెప్పాడు.
యేసు ముందుగానే ఇలా తెలియజేశాడు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి.” ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే . . . యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.” తమ వస్తుసంపదలను కాపాడుకోవడానికి వెనక్కి వెళ్ళవద్దని యేసు తన శిష్యులకు చెప్పాడు. వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే అక్కడినుండి పారిపోవడం అవశ్యం.—లూకా 21:20, 21; మత్తయి 24:15, 16.
ఎంతోకాలంగా జరుగుతున్న తిరుగుబాటును అణచివేయడానికి సా.శ. 66లో సెస్టియస్ గాలస్ రోమా సైన్యాలతో యెరూషలేముపైకి దండెత్తి వచ్చాడు. ఆయన పట్టణంలోకి కూడా ప్రవేశించి ఆలయాన్ని ముట్టడించాడు. పట్టణమంతా విపత్తు అలుముకుంది. అప్రమత్తంగా ఉన్నవారు, ముప్పు తప్పదని గ్రహించగలిగారు. కానీ పారిపోవడం సాధ్యమేనా? అయితే ఊహించని విధంగా సెస్టియస్ గాలస్ తన సైన్యాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. యూదా తిరుగుబాటుదార్లు వాళ్ళను వెంబడించారు. యెరూషలేము నుండి యూదయ నుండి తప్పించుకొని పారిపోవడానికి అదే మంచి సమయం!
ఆ తర్వాతి సంవత్సరం, వెస్పేసియన్ మరియు అతని కుమారుడు టైటస్ ఆధ్వర్యంలో రోమా సైన్యాలు తిరిగి వచ్చాయి. ఆ దేశమంతా యుద్ధంలో మునిగిపోయింది. సా.శ. 70వ సంవత్సరం తొలిభాగంలో రోమీయులు యెరూషలేము చుట్టూ గట్టు కట్టి ముట్టడివేశారు. తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. (లూకా 19:43, 44) పట్టణంలోని ప్రత్యర్థి వర్గాలకు చెందిన ప్రజలు ఒకరినొకరు చంపుకున్నారు. మిగతా ప్రజలు రోమీయుల చేతుల్లో చంపబడ్డారు లేదా బానిసలుగా తీసుకెళ్ళబడ్డారు. ఆ పట్టణము, దానిలోని ఆలయము పూర్తిగా నాశనం చేయబడ్డాయి. మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడైన జోసిఫస్ ప్రకారం పది లక్షలకంటే ఎక్కువమంది యూదులు హింసలనుభవించి మరణించారు. ఆ ఆలయం ఇక తిరిగి నిర్మించబడనేలేదు.
సా.శ. 70లో క్రైస్తవులు ఇంకా యెరూషలేములోనే ఉండివుంటే, వాళ్ళు కూడా మిగతా అందరితోపాటు చంపబడేవారు లేదా బానిసలుగా తీసుకెళ్ళబడేవారు. అయితే,
క్రైస్తవులు దేవుని హెచ్చరికను లక్ష్యపెట్టి యెరూషలేమునే కాక యూదయ మొత్తాన్ని వదిలి యొర్దాను నదికి తూర్పువైపున ఉన్న కొండలకు పారిపోయారు అని ప్రాచీన చరిత్రకారులు నివేదిస్తున్నారు. కొంతమంది పెరయ మండలంలోని పెల్లాలో స్థిరపడ్డారు. వాళ్ళు యూదయను పూర్తిగా విడిచిపెట్టాక మళ్ళీ అక్కడకు తిరిగివెళ్లలేదు. యేసు హెచ్చరికను లక్ష్యపెట్టడం వారి ప్రాణాలను కాపాడింది.నమ్మదగిన మూలాల నుండి వచ్చే హెచ్చరికలను మీరు లక్ష్యపెడతారా?
వాస్తవ రూపం దాల్చని అనేక హెచ్చరికలను విన్న తర్వాత చాలామంది అసలు హెచ్చరికలను పట్టించుకోవడమే మానేస్తారు. అయితే హెచ్చరికలను లక్ష్యపెట్టడం మీ ప్రాణాలను కాపాడవచ్చు.
చైనాలో 1975లో భూకంపం వస్తుందని హెచ్చరికలు చేయబడ్డాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రజలు కూడా ప్రతిస్పందించారు. ఎన్నో వేలమంది జీవితాలు రక్షించబడ్డాయి.
ఫిలిప్పీన్స్‌లోని పినాటూబో పర్వత ఏటవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామీణులు, 1991 ఏప్రిల్ నెలలో ఆ పర్వతం ఆవిరిని, బూడిదను ఎగజిమ్ముతోందని నివేదించారు. ‘ఫిలిప్పైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్కెనాలజీ అండ్ సీస్మాలజీ’ ఆ పరిస్థితిని రెండు నెలలపాటు కనిపెట్టిన తర్వాత రానున్న ప్రమాదం గురించి హెచ్చరించింది. వెంటనే వేలాదిమంది ప్రజలు ఆ స్థలం నుండి తరలించబడ్డారు. జూన్ 15 తెల్లవారుజామున పెద్ద విస్ఫోటనం జరిగింది, వందల కోట్ల టన్నుల పిండిలాంటి మెత్తని పదార్థం ఉవ్వెత్తున ఆకాశంలోకి ఎగిసి గ్రామీణ ప్రాంతంపై పడింది. హెచ్చరికను లక్ష్యపెట్టడం వేలాదిమంది ప్రాణాలను కాపాడింది.
ప్రస్తుత విధానం అంతమవుతుందని బైబిలు హెచ్చరిస్తోంది. మనం ఇప్పుడు అంత్యదినాల్లో జీవిస్తున్నాము. అంతం సమీపిస్తున్న కొలది మీరు అప్రమత్తంగా ఉంటున్నారా? ప్రమాద స్థలం దాటి సురక్షిత ప్రాంతంలో ఉండడానికి మీరు చర్యలు తీసుకుంటున్నారా? ఇతరులు కూడా అలాగే చర్యలు తీసుకునేలా మీరు అత్యవసర భావంతో వారిని హెచ్చరిస్తున్నారా?
[20వ పేజీలోని చిత్రం]
పినాటూబో పర్వతం బూడిదను ఎగజిమ్మినప్పుడు హెచ్చరికను లక్ష్యపెట్టడం అనేకుల ప్రాణాలను కాపాడింది
[21వ పేజీలోని చిత్రం]
యెరూషలేము సా.శ. 70లో నాశనం చేయబడినప్పుడు, యేసు హెచ్చరికను లక్ష్యపెట్టిన క్రైస్తవులు బ్రతికి బయటపడ్డారు