కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు వినాలని వారు కోరే రాజ్యసువార్త

మీరు వినాలని వారు కోరే రాజ్యసువార్త

మీరు వినాలని వారు కోరే రాజ్యసువార్త

యేసు భూమిపైనున్నప్పుడు, ఆయన శిష్యులు తన దగ్గరకు వచ్చి, ఇలా అడిగారు: “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అనేక దేశాలు జోక్యం చేసుకునే యుద్ధాలు, కరవులు, వ్యాధులు, భూకంపాలు, అక్రమము విస్తరించడం, అబద్ధమత ప్రవక్తలు అనేకమందిని మోసగించడం, ఆయన నిజమైన అనుచరులను ద్వేషించి హింసించడం, అనేకమందిలో నీతి, ప్రేమ చల్లారడం మొదలైనవి జరుగుతాయని ఆయన సమధానమిచ్చాడు. ఇవి జరుగుట ఆరంభమైనప్పుడు, అది క్రీస్తు అదృశ్య ప్రత్యక్షతను, పరలోక రాజ్యం సమీపంలో ఉందనుటను సూచిస్తుంది. అదే వార్త—సువార్త! కాబట్టి యేసు ఈ మాటలను సూచనలో భాగంగా పొందుపర్చాడు: “ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:3-14.

ఇటీవల జరుగుతున్న ప్రపంచ సంఘటనలు వాటంతటవి చెడ్డవే, కాని వాటి ప్రాముఖ్యత, అంటే క్రీస్తు ప్రత్యక్షత అనేది మాత్రం మంచిదే. కాబట్టి, యేసు ఇలా చెప్పాడు: “ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.” (లూకా 21:28) ఇవన్నియు విస్తారంగా ప్రకటించబడిన ఆ సంవత్సరమే అంటే 1914 లోనే జరుగనారంభించాయి! అది అన్యరాజుల కాలములను, ఆలాగే మానవ పరిపాలన నుండి క్రీస్తు వెయ్యేండ్ల (మిలేనియల్‌) పరిపాలనకు మారే పరివర్తన ఆరంభకాలాన్ని గుర్తించింది.

పరివర్తనా కాలమనేది ఒకటుందని కీర్తన 110:1, 2 వచనాల్లోను, ప్రకటన 12:7-12 వచనాల్లోను సూచింపబడింది. తన రెండవ రాకడ వరకూ క్రీస్తు, దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడని అక్కడ చూపించబడింది. ఆ తర్వాత పరలోకంలో జరిగే యుద్ధం ఫలితంగా సాతాను భూమిపైకి పడద్రోయబడటం, తద్వారా భూమికి శ్రమ రావడం, క్రీస్తు తన శత్రువులుల మధ్య ఒక తరం మించకుండ పాలన చేయడం జరుగుతుంది. హార్‌మెగిద్దోను యుద్ధంలో “మహా శ్రమలు” తారాస్థాయికి చేరడంతో దుష్టత్వం పూర్తిగా నాశనం చేయబడుతుంది, తర్వాత క్రీస్తు వెయ్యేండ్ల శాంతి పరిపాలన మొదలౌతుంది.—మత్తయి 24:21, 33, 34; ప్రకటన 16:14-16.

బైబిలిలా చెబుతుంది, “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునైయుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.” (2 తిమోతి 3:1-5) ప్రస్తుతం, మానవ చరిత్రలో పూర్వం కూడా ఈ విషయాలన్నీ జరిగాయని కొందరు వాదించవచ్చు.

అయినప్పటికి, చరిత్రకారులు, వ్యాఖ్యాతలు చెబుతున్నట్లుగా, 1914 నుండి జరుగుచున్నట్లుగా భూమిపై మునుపెన్నడూ జరుగలేదు. పూర్వం ఎన్నడూ లేనంత విస్తృతంగా శ్రమలు కలుగుతున్నాయి. అంతేకాకుండా, చివరి దినాలను గూర్చి క్రీస్తు చెప్పిన సూచనలోని ఇతర విషయాలకు తగినట్లుగా, ఈ క్రింది వాస్తవాలను పరిశీలించాలి: చరిత్రలో క్రితమెన్నడూ జరగని స్థాయిలో క్రీస్తు ప్రత్యక్షతనుగూర్చి, రాజ్యాన్ని గూర్చి ప్రపంచమంతటా ప్రకటింపబడుతుంది. సువార్త ప్రకటించినందుకు యెహోవాసాక్షులపై విరుచుకుపడిన హింస వారు చేసిన సేవతో ఎన్నటికీ సరితూగనిది. వారిలో అనేక వందలమంది హిట్లరుయొక్క కాన్‌సెన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో ఛేదింపబడ్డారు. ఈనాటికి కూడ యెహోవాసాక్షులు అనేక దేశాల్లో నిషేధంలోనే ఉన్నారు, ఆలాగే ఇతర దేశాల్లో వారు బంధించబడి, ఖైదుచేయబడి, హింసించబడి, చంపబడుతున్నారు. ఇదంతయు యేసు ఇచ్చిన సూచనలోని భాగమే.

ప్రకటన 11:18లో ముందుగా ప్రవచించినట్లుగా, యెహోవా యొక్క నమ్మకమైన సాక్షులకు వ్యతిరేకంగా ‘జనములు కోపగించుకున్నాయి,’ మరి యెహోవా ‘తన కోపాన్ని’ ఆ జనములకు వ్యతిరేకంగా వ్యక్తంచేస్తాడని ఇది సూచిస్తుంది. దేవుడు, “భూమిని నశింపజేయు వారిని నశింపజేయు”నని ఈ లేఖనమే చెబుతుంది. చరిత్రలో మునుపెన్నడూ లేనంతరీతిగా, భూమి తనలోని జీవకోటిని కాపాడుటలో ముప్పునెదుర్కొంటుంది. అయినను, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది! మానవుడు భూమిని కలుషితం చేయడంలో కొనసాగితే, అది నివాసయోగ్యంగా ఉండదని అనేకమంది శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే యెహోవా “నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను,” వారు భూమిని నాశనం చేయడం ముగించకముందే కలుషితంచేసే వీరిని ఆయన తొలగిస్తాడు.—యెషయా 45:18.

రాజ్య పరిపాలనలో భూసంబంధ ఆశీర్వాదాలు

పరలోకంలో జీవించడానికి రక్షింపబడ్డామని తలంచే అనేకమంది బైబిలు విశ్వాసులకు, దేవుని రాజ్యంక్రింద ప్రజలు భూమిపై జీవిస్తారనే ఆలోచన వింతగా కన్పించవచ్చు. పరలోకానికి వెళ్లేవారు కేవలం కొద్దిమందేనని, భూమిపై నిరంతరం జీవించేవారు లెక్కింపశక్యంగాని ఒక గొప్ప సమూహమని బైబిలు చూపెడుతుంది. (ప్రకటన 14:1-5; 7:9; కీర్తన 37:11, 29) ఆ దేవుని రాజ్యమే క్రీస్తు పరిపాలనక్రింద భూమిని ప్రజలతో నింపి, వారిని ఏలునని బైబిలు పుస్తకమైన దానియేలులోని ప్రవచనంద్వారా చూపబడింది.

ఆ ప్రవచనంలో క్రీస్తు రాజ్యము, యెహోవా విశ్వాధిపత్యమనే పర్వతంనుండి నరకబడిన ఒక రాయిని సూచించింది. భూమిపైనున్న బలమైన రాజ్యాలను సూచించే ప్రతిమను అది విరుగగొట్టి నిర్మూలం చేస్తుంది, మరి “ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.” ఆ ప్రవచనం యింకను యిలా చెబుతుంది: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:34, 35, 44.

యెహోవాసాక్షులు ఇదే రాజ్యమును గూర్చి, ఆలాగే శుభ్రపరచబడిన, సుందరమైన భూమిపై నిరంతరం జీవించే లేఖనాధార నిరీక్షణనుగూర్చి మీకు చెప్పాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం జీవిస్తున్న లక్షలాదిమంది, సమాధుల్లోనున్న అనేక లక్షలమంది దానిలో నిరంతరం జీవించే ఆధిక్యతను పొందుతారు. ఆ తర్వాత, యేసుక్రీస్తు వెయ్యేండ్ల పాలనలో, భూమిని సృష్టించి, దానిలో మొదటి మానవజతను ఉంచుటలోగల యెహోవా ప్రథమ ఉద్దేశం నెరవేరుతుంది. ఈ భూపరదైసు ఎన్నడూ చికాకు పుట్టించేదిగా ఉండదు. ఏదెను వనంలో పనిచేయడానికి ఆదాము నియమించబడినట్లే, మానవజాతి భూమిని, దానిలోని వృక్షాలనూ జంతువులను సంరక్షించుటలో సవాలుతో కూడిన పథకాలను కల్గివుంటుంది. వారు తమ “చేతి పనులను పూర్తిగా అనుభవిస్తారు.”—యెషయా 65:22, రివైజ్డ్‌ స్టాండార్డ్‌ వర్హన్‌; ఆదికాండము 2:15.

యేసు మనకు నేర్పిన ప్రార్థనకు సమాధానం లభించినప్పుడు వుండే పరిస్థితులను వివరించడానికి అనేక లేఖనాలను చూపించవచ్చు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.” (మత్తయి 6:10) అయినను, ఇప్పటికి ఈక్రింది లేఖనం సరిపోతుంది: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.”—ప్రకటన 21:3-5.

[26వ పేజీలోని చిత్రం]

“అపాయకరమైన కాలములే,” అయితే “మీ విడుదల సమీపిస్తున్నది”