కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారి ఆధునిక పెరుగుదల, అభివృద్ధి

వారి ఆధునిక పెరుగుదల, అభివృద్ధి

వారి ఆధునిక పెరుగుదల, అభివృద్ధి

ఒక వందకంటే కొంచెం ఎక్కువ సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైనదే ఈ ఆధునిక యెహోవాసాక్షుల చరిత్ర. అమెరికాకు చెందిన పెన్సిల్వేనియానందలి ప్రస్తుతం పిట్స్‌బర్గ్‌లో భాగమైన అల్లీగెనీ నగరంలో 1870వ దశకారంభంలో గుర్తుతెలియని ఒక బైబిలు అధ్యయన గుంపు ఆవిర్భవించింది. చార్షెస్‌ తేజ్‌ రస్సెల్‌ అనే ఆయన ముఖ్యంగా ఈ గుంపుకు నడిపింపునిచ్చాడు. జూలై 1879లో జైయన్స్‌ వాచ్‌టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రజెన్స్‌ అనే పత్రిక మొదటి సంచిక వెలువడింది. పద్దెనిమిది వందల ఎనభై నాటికెల్లా ఆ చిన్న బైబిలు అధ్యయన గుంపునుండి చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. జైయన్స్‌ వాచ్‌టవర్‌ ట్రాక్ట్‌ సొసైటీ 1881లో ఏర్పడి, 1884లో రస్సెల్‌ అధ్యక్షునిగా అది సంస్థీకరించబడింది. తర్వాత సొసైటీ పేరు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీగా మార్పుచేయబడింది. అనేకమంది బైబిలు సాహిత్యాలను అందిస్తూ, ఇంటింటా సాక్ష్యమిస్తూ ఉండిరి. ఈ పూర్తికాల సేవను 1888లో 50 మంది మాత్రమే చేస్తుండగా, ప్రస్తుతం వారిసంఖ్య ప్రపంచవ్యాప్తంగా సరాసరి 6,20,000కు పెరిగింది.

ఈ పని 1909వ సంవత్సరానికల్లా అంతర్జాతీయంగా చేయబడడంతో, సంస్థ ముఖ్యకార్యాలయాలు ప్రస్తుతమున్న న్యూయార్క్‌నందలి బ్రూక్లిన్‌కు తరలించబడ్డాయి. అచ్చువేసిన ప్రసంగాలు వార్తాపత్రికల్లో క్రమంగా వెలువడేవి, 1913 నాటికెల్లా ఇవి అమెరికా, కెనడా, ఐరోపాలోని 3,000 వార్తాపత్రికల్లో నాలుగు భాషల్లో వెలువడేవి. లక్షలాది పుస్తకాలు, చిన్నపుస్తకాలు, కరపత్రాలు పంచిపెట్టబడ్డాయి.

ఈ సేవ 1912లో ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌ అనే చిత్రప్రదర్శన పని ప్రారంభమైంది. ధ్వనితో కూడిన చలన చిత్రాలు, స్రైడ్‌ల ద్వారా, ఇది భూమిని సృష్టించడంతో ఆరంభమై క్రీస్తు వెయ్యేండ్ల పాలనతో ముగిసేది. ప్రతిదినం 35,000 మంది తిలకించిన యీ ప్రదర్శనలు 1914లో ప్రారంభమయ్యాయి. ధ్వనితో కూడిన చలన చిత్రాలను ప్రదర్శించడంలో ఈ సంస్థ ముందడుగువేసింది.

1914వ సంవత్సరం

ఒక కీలక సమయం ఆసన్నమౌతున్న కాలమది. 1876లో బైబిలు విద్యార్థియైన చార్షెస్‌ తేజ్‌ రస్సెల్‌ “అన్యరాజుల కాలములు: అవి ఎప్పుడు అంతమగును?” అనే శీర్షికను న్యూయార్క్‌నందలి బ్రూక్లిన్‌లో ప్రచురించిన బైబిల్‌ ఎగ్జామినర్‌ అనే పత్రికకు వ్రాసి ఇచ్చాడు, అది దాని అక్టోబరు సంచికలో 27వ పేజీనందు ఇలా చెప్పింది, “సా.శ. 1914లో ఏడు కాలములు అంతమౌతాయి.” ఈ అన్యరాజుల కాలములనే యేసు “అన్యజనముల కాలములు” అని సూచించాడు. (లూకా 21:24) పందొమ్మిది వందల పద్నాలుగులో జరుగుతుందని అనుకున్నదంతా జరగలేదు, కాని అది అన్యరాజుల కాలముల అంతాన్ని గుర్తించింది, మరియు అది ప్రత్యేకంగా ప్రాముఖ్యతగల సంవత్సరం. అనేకమంది చరిత్రకారులు, వ్యాఖ్యాతలు 1914 ఒక ప్రాముఖ్యమైన సంవత్సరమని ఒప్పుకుంటున్నారు. దీనిని ఈ క్రింది వ్యాఖ్యానాలు చూపెడుతున్నాయి:

“చరిత్రలో పూర్తిగా ‘నెమ్మదిగా’ వున్న చివరి సంవత్సరమేమంటే మొదటి ప్రపంచ యుద్ధం జరగక ముందున్న సంవత్సరమైన 1913వ సంవత్సరమే.”—టైమ్స్‌ హెరాల్డ్‌, వాషింగ్టన్‌ డి.సి., మార్చి 13, 1949 లోని సంపాదకీయము.

ప్రతి ఒక్కరూ, 1914 నుండి లోకం పోకడ ఎరిగినవారై, ఎన్నడూ లేనటువంటి గొప్ప నాశనానికే విధి నిర్ణయమైనదా అన్నట్లు వారికి తోచడంతో వారు బహుగా కలతచెందారు. నాశనానికి నడిపే ముసుగును తప్పించడానికి ఏమీ చేయలేమని అనేకమంది పట్టింపుగల ప్రజలు భావించారు.”—బెర్త్రేండ్‌ రస్సెల్‌, ది న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌, సెప్టెంబరు 27, 1953.

“మొదటి ప్రపంచ యుద్ధంతోనే వాస్తవంగా మొత్తం ప్రపంచమే భగ్గుమంది, ఎందుకో మనకింకా అర్థం కాలేదు. అంతకు ముందు, ప్రజలు ఊహాజనిత లోకం దగ్గరలో ఉందని తలంచారు. అప్పుడు శాంతి, సౌభాగ్యాలుండేవి. ఆ తర్వాత అంతా ఆహుతైపోయింది. అప్పటినుండీ మనం అనిశ్చయతా స్థితిలోనే ఉంటూవచ్చాము . . . మొత్తం చరిత్రంతటిలోకెల్లా ఈ శతాబ్దంలోనే అనేకమంది ప్రజలు చనిపోయారు.”—డా. వాకర్‌ పెర్సీ, అమెరికన్‌ మెడికల్‌ న్యూస్‌, నవంబరు 21, 1977.

పందొమ్మిది వందల పద్నాలుగు తర్వాత 50 సంవత్సరాలకు, జర్మన్‌ దౌత్యవేత్తయైన కొన్రాడ్‌ ఆడినార్‌ యిలా వ్రాశాడు: “మానవుని జీవితంలో 1914 నుండి నెమ్మది, భద్రత అనేవి కన్పించకుండాపోయాయి.”—ది వెస్ట్‌ పార్కర్‌, క్లీవ్‌లాండ్‌ ఓహాయో, జనవరి 20, 1966.

సొసైటీ మొదటి అధ్యక్షుడైన సి. టి. రస్సెల్‌ 1916లో చనిపోగా, ఆ తర్వాతి సంవత్సరం ఆయన స్థానంలో జోసఫ్‌ రూథర్‌ఫర్డ్‌ అధికారానికి వచ్చాడు. అనేక మార్పులు జరిగాయి. ది వాచ్‌టవర్‌కు తోటిపత్రికయైన ది గోల్డెన్‌ ఏజ్‌ అని పిలువబడే పత్రిక పరిచయం చేయబడింది. (ప్రస్తుతము అది తెలుగులో తేజరిల్లు! అని పిలువబడుతూ, 60 భాషల్లో 1,20,00,000 కంటే ఎక్కువ ప్రతులు పంపిణీ అవుతున్నాయి.) ఇంటింట సాక్ష్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. క్రైస్తవమత సామ్రాజ్యానికి వేరుగా గుర్తింపబడడానికి, ఈ క్రైస్తవులు 1931లో యెహోవాసాక్షులు అనే నామాన్ని స్వీకరించారు. ఈ నామం యెషయా 43:10-12పై ఆధారపడివుంది.

పందొమ్మిది వందల ఇరవై మరియు ముప్పై దశకాల్లో రేడియో విస్తృతంగా ఉపయోగింపబడింది. బైబిలు ప్రసంగాలను ప్రసారం చేయడానికి సొసైటీ 1933 నాటికెల్లా 403 రేడియో స్టేషన్లను ఉపయోగిస్తూ ఉండేది. ఆ తర్వాత, ఫోనోగ్రాఫ్‌లు, రికార్డు చేయబడిన బైబిలు ప్రసంగాలతో సాక్షులు ఇంటింటిని దర్శించడం వృద్ధికావడంతో రేడియో ఉపయోగం చాలామట్టుకు తగ్గిపోయింది. ఆసక్తి చూపినచోట గృహ బైబిలు పఠనాలు మొదలయ్యాయి.

న్యాయస్థానంలో విజయాలు

పందొమ్మిది వందల ముప్పై మరియు నలభై దశకాల్లో, ఈ పనిచేస్తున్నందువల్ల అనేకమంది సాక్షులు నిర్బంధించబడ్డారు, అయితే మాట్లాడే, ముద్రించే, సమావేశమయ్యే, ఆరాధించే స్వాతంత్ర్యం కొరకు న్యాయస్థానంలో పోరాడేవారు. అమెరికాలో, దిగువస్థాయి న్యాయస్థానాలనుండి చేసిన విజ్ఞప్తుల ఫలితంగా ఉన్నత న్యాయస్థాన సమక్షంలో సాక్షులు 43 కేసులను గెలిచారు. ఆలాగే, వేరే దేశాల్లో కూడ ఉన్నత న్యాయస్థానాలు అనుకూలమైన తీర్పులనిచ్చాయి. న్యాయస్థానంలో పొందిన ఈ విజయాలనుగూర్చి, దీజ్‌ ఆల్సో బిలీవ్‌ అనే తన పుస్తకంలో ప్రొఫెసర్‌ సి. ఎస్‌. బ్రేడెన్‌ సాక్షులనుగూర్చి యిలా చెప్పాడు: “వారు తమ హక్కులను కాపాడుకోవడానికి చేసిన సమరం ద్వారా ప్రజాస్వామ్యానికి చైతన్యవంతమైన సేవలను చేశారు, ఎందుకంటే వారి పోరాటంలో అమెరికాలోని ప్రతి అల్ప సంఖ్యాక వర్గం కూడ ఆ హక్కులను కాపాడుకోవడానికి వారు చాలా కృషిచేశారు.”

ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు

పందొమ్మిది వందల నలభైరెండులో జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ చనిపోగా, ఆయన స్థానంలో ఎన్‌. హెచ్‌. నార్‌ అధ్యక్షునిగా అధికారానికి వచ్చారు. సంయుక్త శిక్షణా కార్యక్రమం ఆరంభమైంది. మిషనరీల కొరకు 1943లో వాచ్‌టవర్‌ బైబిల్‌ గిలియడ్‌ పాఠశాల అనే ఒక ప్రత్యేక శిక్షణ పాఠశాల స్థాపించబడింది. అప్పటినుండి, ఈ పాఠశాలనుండి ఉత్తీర్ణులైనవారు 140 కంటే ఎక్కువ దేశాలకు పంపబడ్డారు. ఇంతకు క్రితం సంఘాలులేని దేశాల్లో క్రొత్త సంఘాలు స్థాపించబడ్డాయి, ఆలాగే ప్రస్తుతం అంతర్జాతీయంగా స్థాపించబడిన కార్యాలయాలు దాదాపు 100 వరకూ ఉన్నాయి. అప్పుడప్పుడు, సంఘపెద్దలకు, కార్యాలయాల్లోని స్వచ్ఛంద సేవకులకు, సాక్ష్యమిచ్చేపనిలో పూర్తికాల సేవచేసేవారికి (పయినీర్లుగా) శిక్షణనివ్వడానికి ప్రత్యేక శిక్షణా తరగతులను స్థాపించారు.

ఎన్‌. హెచ్‌. నార్‌ 1977లో చనిపోయారు. సంస్థకు సంబంధించి మార్పులు చేయుటకు ఆయన చనిపోకముందు అధ్యక్షత వహించిన తుది మార్పులలో ఒకటేమంటే బ్రూక్లిన్‌లోని ప్రపంచ ప్రధానకార్యాలయాల్లో వున్న పరిపాలక సభను వృద్ధిచేయడం. కార్యనిర్వాహక బాధ్యతలు 1976లో విభాగింపడి, పరిపాలక సభలోని సభ్యులకు యివ్వబడ్డాయి. దీని 11 మంది సభ్యుల్లో (1993లో) ప్రతి ఒక్కరూ దాదాపు 50 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పూర్తికాల సాక్ష్యపు పని చేయడానికి సమర్పించుకున్నవారే.

ముద్రణా సౌకర్యాలు వృద్ధిచెందుట

ఆధునిక కాల యెహోవాసాక్షుల చరిత్ర నాటకీయమైన సంఘటనలతో నిండిపోయింది. పద్దెనిమిది వందల డెబ్భైలో చిన్న బైబిలు అధ్యయన గుంపుగావున్న సాక్షులు, 1993 నాటికెల్లా ప్రపంచవ్యాప్తంగా 73,000 సంఘాలుగా వృద్ధయ్యారు. మొదట, సాహిత్యాలన్నీ వాణిజ్య సంస్థలచే ముద్రించబడేవి; ఆ తర్వాత, 1920లో, సాక్షులు అద్దెకు తీసుకున్న భవనంలో కొన్ని సాహిత్యాలను ముద్రించారు. కాని 1927 నుండి, న్యూయార్క్‌నందు సంస్థీకరించబడిన వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ స్వంతం చేసుకున్న న్యూయార్క్‌లోని ఎనిమిది అంతస్థుల భవనంలో యింకా ఎక్కువ సాహిత్య ముద్రణ ప్రారంభమైంది. ఇది ఏడు ఫ్యాక్టరీ భవనాలుగాను, ఒక పెద్ద ఆఫీసు కాంప్లెక్స్‌గాను వృద్ధయ్యింది. ముద్రణా సౌకర్యాలను నడిపించడానికి అవసరమైన 3,000 మంది సేవకులకు గృహసదుపాయం కల్గించడానికి వాటికి సమీపంగా బ్రూక్లిన్‌లో ఇతర భవనాలు కూడా ఉన్నాయి. మరికొన్ని వందలమంది న్యూయార్క్‌, పేటర్‌సన్‌నందలి విద్యా కేంద్రంలో సేవచేస్తున్నారు. దీనితోపాటు, న్యూయార్క్‌ నందలి వాల్కిల్‌ సమీపంలో ఒక వెయ్యిమంది సేవకులను కల్గి, వ్యవసాయ క్షేత్రాలు కలిసివున్న ఫ్యాక్టరీ వాచ్‌టవర్‌, అవేక్‌! పత్రికల ముద్రణను నిర్వహిస్తూ, వేలకొలదిగావున్న ఈ స్వచ్ఛంద సేవకులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రతీ స్వచ్ఛంద సేవకుడు తనకు అవసరమైన ఖర్చుల నిమిత్తం కొంత నెలసరి భత్యం పొందుతాడు.

అంతర్జాతీయ సమావేశాలు

అమెరికాలోని ఇల్లీనాయిస్‌నందలి చికాగోలో 1893లో మొట్టమొదట పెద్ద సమావేశం నిర్వహించబడింది. దానికి 360 మంది హాజరుకాగా, 70 మంది బాప్తిస్మం తీసుకున్నారు. చివరిగా 1958లో, ఒక్కటే అంతర్జాతీయ సమావేశం న్యూయార్క్‌ నగరంలో జరిగింది. అప్పుడున్న పోలో గ్రౌండ్స్‌ను, యాంకీ స్టేడియంను ఆ సమావేశం ఉపయోగించింది. మొత్తం హాజరైనవారి సంఖ్య 2,53,922; క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్నవారి సంఖ్య 7,136. అప్పటినుండి అంతర్జాతీయ సమావేశాలు, పరంపరలుగా అనేక దేశాల్లో నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం అంతర్జాతీయ సమావేశ పరంపరలో 100 కంటే ఎక్కువ దేశాల్లోని 1,500 సమావేశాలు ఇమిడివున్నాయి.

[7వ పేజీలోని చిత్రం]

ధ్వనులతో కూడిన తొలి చలనచిత్రాలు

[8వ పేజీలోని చిత్రం]

మానవ చరిత్రలో కీలకమైన సమయం

[9వ పేజీలోని చిత్రం]

పౌర స్వేచ్ఛ కొరకు చేసిన చైతన్య సేవ

[7వ పేజీలోని చిత్రం]

ఒక్క భాషలో 6,000 ప్రతులున్న “వాచ్‌టవర్‌,” ప్రస్తుతం 115 కంటే ఎక్కువ భాషల్లో 1,60,00,000 కంటే ఎక్కువ ప్రతులుగా వృద్ధయ్యింది.

[21వ పేజీలోని చిత్రాలు]

న్యూయార్క్‌నందలి వాల్కిల్‌లోను,

. . . న్యూయార్క్‌నందలి బ్రూక్లిన్‌లోను వున్న ముద్రణాయంత్రాలు