కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు మీకు దానిని చెప్పే పద్ధతులు

వారు మీకు దానిని చెప్పే పద్ధతులు

వారు మీకు దానిని చెప్పే పద్ధతులు

“సమస్త జనులను శిష్యులనుగా చేయుడి,” అని క్రైస్తవులకు ఆజ్ఞాపించబడింది, కాని వారు ఒత్తిడిచేసి, బలవంతంగా ఇతరులను మార్చాలని దీని భావం కాదు. యేసు ఆజ్ఞ, “దీనులకు సువర్తమానము ప్రకటించుటకు,” “నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకు,” “దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకు” ఇవ్వబడింది. (మత్తయి 28:19; యెషయా 61:1, 2; లూకా 4:18, 19) బైబిలునుండి సువార్తను ప్రకటించడంద్వారా యెహోవాసాక్షులు ఇలా చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రాచీనకాల ప్రవక్తయైన యెహెజ్కేలు వలే, ఈనాటి యెహోవాసాక్షులు ‘జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారిని’ గుర్తించడానికి ప్రయత్నిస్తారు.—యెహెజ్కేలు 9:4.

ప్రస్తుతమున్న పరిస్థితులద్వారా దుఃఖాక్రాంతులైనవారిని వారు కనుగొనుటకు శ్రేష్ఠమైన మార్గం ఇంటింటికి వెళ్లడమే. ఆ విధంగా వారు, “ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము” చేసినప్పుడు యేసు చేసినట్లుగానే, ప్రజలను చేరుకోడానికి వారు సరైన కృషి చేస్తారు. ఆయన తొలి శిష్యులు కూడ ఆలాగే చేశారు. (లూకా 8:1; 9:1-6; 10:1-9) ఈనాడు, అలా చేయడం సాధ్యమైనచోట, యెహోవాసాక్షులు ఒక సంవత్సరములో ప్రతీ యింటిని అనేకసార్లు దర్శిస్తూ, స్థానికంగా లేదా ప్రపంచంలో ఇటీవల జరుగుతున్న ఆసక్తిగల లేదా సంబంధిత విషయాలపై గృహస్థునితో కొద్ది నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. బహుశ ఒకటి రెండు లేఖనాలు పరిశీలించినమీదట, ఒకవేళ గృహస్థుడు ఆసక్తి కనబరిచినట్లయితే, గృహస్థునికి అనుకూలమైన సమయములో సాక్షి తిరిగి దర్శించి, యింకా చర్చించడానికి ఏర్పాటు చేయవచ్చును. బైబిళ్లు, బైబిలును వివరించే సాహిత్యాలు లభ్యం చేయబడుతున్నాయి, గృహస్థుడు కోరినట్లయిన, ఉచితంగా బైబిలు పఠనం నిర్వహించబడుతుంది. ఆ విధంగా ప్రపంచమంతటా 1993లో సరాసరి 45,00,000 బైబిలు పఠనములు నిర్వహించబడ్డాయి.

‘రాజ్యసువార్త ఇతరులకు ప్రకటించే’ మరొక పద్ధతి స్థానిక రాజ్యమందిరాలలో జరిగే కూటముల ద్వారానే. అచ్చట సాక్షులు వారానికొకసారి కూటములను నిర్వహిస్తారు. ప్రస్తుత అవసరతలకు సంబంధించిన విషయంపై బహిరంగ ప్రసంగం ఒకటుంటుంది, దాని తర్వాత కావలికోట పత్రికను ఆధారం చేసుకుని, కొన్ని బైబిలు అంశాలు లేదా ప్రవచనాల పఠనం ఉంటుంది. మరొక కూటమేమంటే సాక్షులను శ్రేష్ఠమైన సువార్త ప్రచారకులుగా తర్ఫీదునిచ్చే పాఠశాలే. దాని తర్వాత స్థానిక ప్రాంతంలో సాక్ష్యమిచ్చే పనిని గూర్చి చర్చించే కూటం ఉంటుంది. ఆలాగే, సాక్షులు వారానికొకసారి బైబిలు పఠనాలు చేయడానికి చిన్నచిన్న గుంపులుగా వ్యక్తిగత గృహాల్లో సమావేశమౌతారు.

ఈ కూటాలన్నింటికి ప్రజలందరు రావచ్చు. చందాలు ఎన్నడూ వసూలు చేయబడవు. అలాంటి కూటాలు అందరికీ ప్రయోజనకరమైనవి. బైబిలు ఇలా చెబుతుంది: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” వ్యక్తిగత పఠనం, అధ్యయనం చాలా ప్రాముఖ్యం, కాని ఇతరులతో సమావేశమవ్వడం పురికొల్పునిచ్చేదిగా ఉంటుంది: “ఇనుముచేత ఇనుము పదునగును, ఆలాగే ఒకడు మరొకనికి వివేకము పుట్టించును.”—హెబ్రీయులు 10:24, 25; సామెతలు 27:17, ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌.

సాక్షులు వారి ప్రతిదిన జీవితంలో ఇతరులను కలిసికొన్నప్పుడు సువార్తను గూర్చి మాట్లాడటానికి వీలున్న పరిస్థితులను కూడ సద్వినియోగం చేసుకుంటారు. అవి బస్సులో లేదా విమానంలో తమతోపాటు ప్రయాణించేవారితోనైనా లేదా పొరుగువారితోనైనా మాట్లాడే కొద్దిమాటలే కావచ్చు, లేదా స్నేహితునితోనైనా లేదా బంధువుతోనైనా చేసే సుదీర్ఘ ప్రసంగమే కావచ్చు, లేదా మధ్యాహ్న భోజన సమయంలో తోటి పనివానితో చేసే చర్చే కావచ్చు. యేసు భూమిపైనున్నప్పుడు అంటే సముద్రతీరాన నడిచేటప్పుడు, కొండప్రాంతంలో కూర్చున్నప్పుడు, ఎవరి యింట్లోనైనా విందుచేసినప్పుడు, వివాహానికి హాజరైనప్పుడు, లేదా గలిలయ సముద్రంమీద చేపలుపట్టే పడవలో ప్రయాణించినప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యము చాలామట్టుకు ఈ రకమైనదే. ఆయన సమాజమందిరాల్లోను, యెరూషలేములోని దేవాలయమందును బోధించాడు. ఆయన ఎక్కడున్ననూ, దేవుని రాజ్యాన్ని గూర్చి మాట్లాడే అవకాశాలను వినియోగించుకున్నాడు. ఈ విషయంలో కూడ యెహోవాసాక్షులు ఆయన అడుగుజాడలయందు నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు.—1 పేతురు 2:21.

మాదిరికరంగా సువార్తను ప్రకటించుట

వీటిని బోధించే వ్యక్తి ఈ బోధలను తనకుతాను అన్వయించుకొనకపోయినట్లైతే, మీకు సువార్త చెప్పే ఈ పద్ధతుల్లో ఏదీ మీకు అర్థవంతంగా ఉండదు. ఒక విషయం చెప్పి మరొకటి చేయడం వేషధారణే అవుతుంది, మరి మతానికి సంబంధించిన వేషధారణ లక్షలాదిమందిని బైబిలునుండి దూరం చేసింది. బైబిలును నిందించడం సరైందికాదు. శాస్త్రజ్ఞులు, పరిసయ్యులు హెబ్రీలేఖనాలను కల్గియుండిరి, కాని యేసు వారిని వేషధారులని నిందించాడు. వారు మోషే ధర్మశాస్త్రం చదివే వైఖరినిగూర్చి మాట్లాడి, తర్వాత తన శిష్యులకు యిలా చెప్పాడు: “వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.” (మత్తయి 23:3) గంటలకొలదిగా యిచ్చే ప్రసంగం కంటే ఒక క్రైస్తవుని మంచి ప్రవర్తనే ఎక్కువ విలువైంది. ఇది అవిశ్వాసులైన భర్తలున్న భార్యలకు నొక్కి చెప్పబడింది: “వారు భయముతోకూడిన మీ ప్రవర్తన చూచి, వాక్యము లేకుండగనే తమ భార్యల నడవడివలన రాబట్టవచ్చును.”—1 పేతురు 3:1, 2.

కాబట్టి, యెహోవాసాక్షులు ఇతరులకు సిఫారసు చేస్తున్న తమ క్రైస్తవ ప్రవర్తనలో తాము మాదిరిగా ఉంటూ కూడ సువార్తను స్వీకరించమని ఇతరులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారు. వారు ‘మనుష్యులు తమకు ఏమి చేయవలెనని కోరుకుంటారో ఆలాగుననే వారును ఇతరులకు చేస్తారు.’ (మత్తయి 7:12) వారు కేవలం తోటి క్రైస్తవులతో, స్నేహితులతో, పొరుగువారితో, లేదా బంధువులతో మాత్రమేకాకుండా మనుష్యులందరితోను ఈవిధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. అపరిపూర్ణులైన కారణంగా, వారు ఎల్లప్పుడూ 100 శాతం విజయవంతం కాలేరు. కాని వారు కేవలం మనుష్యులందరికీ సువార్త చెప్పడంద్వారానే కాకుండా సాధ్యమైనప్పుడల్లా చేయూతనివ్వడం ద్వారాకూడ ఇతరులకు మంచి చేయాలనే కోరిక వారి హృదయాలనుండి వచ్చినదే.—యాకోబు 2:14-17.

[32వ పేజీలోని చిత్రం]

వాక్యము లేకుండగనే రాబట్టుట

[31వ పేజీలోని చిత్రాలు]

ప్రయోగాత్మక నిర్మాణం కల్గిన రాజ్యమందిరాలు బైబిలు చర్చలకు నిలయాలైయున్నవి

[33వ పేజీలోని చిత్రాలు]

వారి కుటుంబ జీవితంలోనూ, ఇతరులతో వ్యవహరించేటప్పుడును సాక్షులు తాము చెప్పేదానిని ఆచరణలో పెట్టడానికి యథార్థంగా కృషిచేస్తారు