పత్రిక ముఖ్యాంశం | దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు
సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేయగలదు
యేసు ఒకరోజు యెరూషలేములో తన తండ్రి యెహోవా గురించి మాట్లాడుతూ, ఆ కాలంనాటి మతనాయకుల తప్పుల్ని బయటపెడుతున్నాడు. (యోహాను 8:12-30) ఆ సందర్భంలో యేసు అన్న ఒక మాట, ప్రస్తుతం దేవుని గురించి ప్రాచుర్యంలో ఉన్న నమ్మకాలను ఎలా పరిశీలించాలో మనకు నేర్పిస్తుంది. ఆయన ఇలా అన్నాడు: “మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు. అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది.”—యోహాను 8:31, 32.
‘నా బోధలు పాటిస్తూ ఉండండి.’ ఇక్కడ యేసు, మత బోధలు ‘సత్యమా’ కాదా అని పరీక్షించడానికి ఒక కొలమానాన్ని ఇస్తున్నాడు. మీరు దేవుని గురించి ఏదైనా విన్నప్పుడు ఇలా ప్రశ్నించుకోండి, ‘ఇది యేసు చెప్పిన మాటలతో, మిగతా లేఖనాలతో సరిపోతుందా?’ పౌలు చెప్పిన మాటల్ని విని “తాము విన్న విషయాలు నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్లు ప్రతీరోజు లేఖనాల్ని జాగ్రత్తగా పరిశోధిస్తూ” వచ్చిన వాళ్లను అనుకరించండి.—అపొస్తలుల కార్యాలు 17:11.
మొదటి ఆర్టికల్లో చూసిన మార్కో, రోసా, రేమండ్ అనే ముగ్గురు యెహోవాసాక్షులతో బైబిలు స్టడీ చేయడం ద్వారా తమ నమ్మకాలను జాగ్రత్తగా పరిశీలించుకున్నారు. వాళ్లు ఏం తెలుసుకున్నారు?
మార్కో: “నాకు బైబిలు నేర్పించిన వ్యక్తి నాకూ నా భార్యకూ వచ్చిన ప్రతీ ప్రశ్నకు లేఖనాలు ఉపయోగించి జవాబు ఇచ్చాడు. మేము యెహోవాను ప్రేమించడం నేర్చుకున్నాం, అలాగే మేమిద్దరం ఒకరికొకరం ఇంకా దగ్గరయ్యాం!”
రోసా: “మొదట్లో, బైబిలు అంటే దేవుని విషయంలో మనుషుల ఆలోచనలు ఉన్న పుస్తకం మాత్రమే అనుకున్నాను. అయితే క్రమక్రమంగా నా ప్రశ్నలకు బైబిల్లో జవాబులు కనుగొనడం మొదలుపెట్టాను. ఇప్పుడు యెహోవా నాకు నిజమైన వ్యక్తిలా ఉన్నాడు, నేను ఆయన మీద నమ్మకం పెట్టుకోవచ్చు.”
రేమండ్: “తన గురించి తెలుసుకోవడానికి సహాయం చేయమని నేను దేవునికి ప్రార్థించాను. కొంతకాలానికే, నేనూ నా భర్త బైబిలు స్టడీ చేయడం మొదలుపెట్టాం. చివరికి, మేము యెహోవా గురించి సత్యం తెలుసుకున్నాం! దేవుని లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు మాకు కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేం.”
బైబిలు దేవుని గురించిన అబద్ధాల్ని బట్టబయలు చేయడమే కాదు, ఆయన అద్భుతమైన లక్షణాల గురించిన సత్యాన్ని తెలియజేస్తుంది. అది దేవుడు ప్రేరేపించిన వాక్యం, “దేవుడు ప్రేమతో మనకు ఇచ్చినవాటిని అర్థంచేసుకునేలా” అది సహాయం చేస్తుంది. (1 కొరింథీయులు 2:12) దేవుని గురించి, ఆయన సంకల్పం గురించి, భవిష్యత్తు గురించి ముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్నల్లో కొన్నిటికి, www.pr418.comలో “బైబిలు బోధలు > బైబిలు ప్రశ్నలకు జవాబులు” కింద జవాబులు చదవండి. అంతేకాదు, ఆ వెబ్సైట్ ద్వారా లేదా ఒక యెహోవాసాక్షి ద్వారా బైబిలు స్టడీ కోసం మీరు రిక్వెస్టు చేయవచ్చు. అలాచేస్తే, దేవుణ్ణి ప్రేమించడం మీరు ఎప్పుడూ ఊహించనంత తేలికని తెలుసుకుంటారు.