కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

నేను నా గురించి మాత్రమే ఆలోచించేవాడిని

నేను నా గురించి మాత్రమే ఆలోచించేవాడిని
  • పుట్టిన సంవత్సరం: 1951

  • దేశం: జర్మనీ

  • ఒకప్పుడు: గర్విష్ఠిని, నాకు నచ్చినట్టు ఉండేవాణ్ణి

నా గతం:

నేను పుట్టినప్పుడు మా కుటుంబం తూర్పు జర్మనీలోని లీప్‌జిగ్‌కు దగ్గర్లో నివసించేది. అది చెక్‌, పోలండ్‌ సరిహద్దులకు దగ్గర్లో ఉంది. నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు, మా నాన్న ఉద్యోగం వల్ల మేము ముందు బ్రెజిల్‌కు, తర్వాత ఈక్వెడార్‌కు తరలివెళ్లాల్సి వచ్చింది.

నా 14వ ఏట నన్ను జర్మనీలోని ఒక బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు. మా అమ్మనాన్నలు ఎక్కడో దూరంగా దక్షిణ అమెరికాలో ఉండేవాళ్లు కాబట్టి నా బాగోగులు నేనే చూసుకోవాల్సి వచ్చేది. దాంతో నాకు నచ్చినట్టు బ్రతకడం అలవాటైంది. నా పనుల వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతున్నాయని అస్సలు ఆలోచించేవాణ్ణి కాదు.

నాకు 17 ఏళ్లున్నప్పుడు, అమ్మానాన్నలు జర్మనీకి తిరిగొచ్చారు. మొదట్లో వాళ్లతో కలిసి ఉండేవాణ్ణి. అప్పటివరకు నాకు నచ్చినట్టు బ్రతకడానికి అలవాటుపడ్డాను కాబట్టి, మళ్లీ అమ్మానాన్నల మాట వింటూ వాళ్లతో కలిసి ఉండలేకపోయాను. దాంతో 18వ ఏట ఇల్లు వదిలి వచ్చేశాను.

నాకు మనశ్శాంతి ఉండేది కాదు, జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. రకరకాల జీవన శైలులు, పోరాటాలు చూశాక ఒక విషయం అర్థమైంది. మనుషులు ఈ అందమైన భూమిని పూర్తిగా నాశనం చేయకముందే భూమంతా తిరిగి చూడాలని, నా జీవితంతో నేను చేయగల మంచిపని అదేనని నాకనిపించింది.

దాంతో మోటర్‌ సైకిల్‌ మీద జర్మనీ నుండి ఆఫ్రికాకు ప్రయాణం మొదలుపెట్టాను. కానీ కొంతకాలానికే, నా మోటర్‌ సైకిల్‌ పాడవడంతో యూరప్‌కు తిరిగొచ్చాను. ఆ తర్వాత ఒక రోజు నేను పోర్చుగల్‌లో బీచ్‌ దగ్గర ఉన్నప్పుడు, నా మోటర్‌ సైకిల్‌ని వదిలేసి పడవలో ప్రయాణం కొనసాగించాలనే ఆలోచన వచ్చింది.

దాంతో అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా ప్రయాణానికి సిద్ధమౌతున్న యౌవనుల గుంపులో చేరాను. వాళ్లలో ఒకామెను ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను, ఆమె పేరు లోరీ. మొదట మేము కరీబియన్‌ దీవులకు ప్రయాణించాం. తర్వాత ప్యూర్టోరికోలో కొంతకాలం ఉండి యూరప్‌కు తిరిగొచ్చేశాం. మాకు ఒక పడవ అంటూ దొరికితే, దానికి కొన్ని మార్పులు చేసి అందులో నివసిస్తూ ప్రయాణించాలని అనుకున్నాం. మేము మూడు నెలలు వెతికామో లేదో, నాకు జర్మన్‌ మిలిటరీలో చేరాలని ఆదేశాలు వచ్చాయి. దాంతో మా ఆలోచన ముందుకు వెళ్లలేదు.

నేను జర్మన్‌ నౌకాదళంలో 15 నెలలు పనిచేశాను. ఆ సమయంలో నేను, లోరీ పెళ్లిచేసుకున్నాం. మళ్లీ ఇద్దరం కలిసి ఆయా ప్రాంతాలకు తిరగాలని అనుకున్నాం. నా మిలిటరీ సేవకు కొంచెం ముందు, మేము ఒక లైఫ్‌బోట్‌ను కొన్నాం. నేను మిలిటరీలో సేవ చేస్తున్నప్పుడు, దాన్ని మెల్లమెల్లగా ఒక పడవలా మార్చాం. మేము అందులో నివసిస్తూ అందమైన భూమిని పరిశోధించాలని అనుకున్నాం. సరిగ్గా ఆ సమయంలోనే, అంటే మిలిటరీ సేవ ముగిసి పడవ తయారుచేయడం పూర్తికాక ముందు, యెహోవాసాక్షులు మమ్మల్ని కలిసి మాతో బైబిలు స్టడీ మొదలుపెట్టారు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

మొదట్లో, నా జీవితంలో మార్చుకోవాల్సిన విషయాలేవీ లేవని నాకనిపించేది. నేను కలిసి జీవిస్తున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాను, సిగరెట్లు తాగడం అప్పటికే మానేశాను. (ఎఫెసీయులు 5:5) ఇక ప్రపంచమంతా తిరగాలనే ఆలోచన విషయానికొస్తే, దేవుని అద్భుతమైన సృష్టిని చూడడానికి మా జీవితాల్ని అంకితం చేయడం ఖచ్చితంగా మంచి పనని నాకనిపించింది.

కానీ నిజం ఏంటంటే, నేను కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది, ముఖ్యంగా నా వ్యక్తిత్వంలో. గర్వం వల్ల, నాకు నచ్చినట్టే బ్రతకడానికి అలవాటుపడడం వల్ల నేను ఎక్కువగా నా సామర్థ్యాల మీద, నేను సాధించినవాటి మీద మనసుపెట్టే వాడిని. నేను నా గురించి మాత్రమే ఆలోచించేవాడిని.

ఒకరోజు నేను ఎంతో పేరుగాంచిన యేసు కొండమీది ప్రసంగం చదివాను. (మత్తయి 5-7 అధ్యాయాలు) సంతోషంగా ఉండడం గురించి యేసు చెప్పిన విషయాలు మొదట్లో నాకు అర్థంకాలేదు. ఉదాహరణకు, ఆకలిగా-దాహంగా ఉన్నవాళ్లు సంతోషంగా ఉంటారని యేసు చెప్పాడు. (మత్తయి 5:6) అవసరమైనవి లేనప్పుడు ఒక వ్యక్తి ఎలా సంతోషంగా ఉంటాడని నేను ఆలోచించేవాణ్ణి. కానీ స్టడీ చేస్తుండగా, మనందరికీ దేవుని నిర్దేశం అవసరమని, దాన్ని తీర్చుకోవాలంటే ముందుగా ఆ అవసరం ఉందని వినయంగా గుర్తించాలని అర్థంచేసుకున్నాను. యేసు ఇలా చెప్పాడు: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”​—మత్తయి 5:3.

జర్మనీలో బైబిలు స్టడీ మొదలుపెట్టాక నేను, లోరీ మొదట ఫ్రాన్స్‌కు ఆ తర్వాత ఇటలీకి తరలివెళ్లాం. మేము ఎక్కడికి వెళ్లినా అక్కడ యెహోవాసాక్షుల్ని కలిశాం. వాళ్లు ఒకరిమీద ఒకరు చూపించుకునే కపటంలేని ప్రేమ, వాళ్ల ఐక్యత నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులంతా నిజంగా ఒక సోదర బృందంగా ఉన్నారని నేను గమనించాను. (యోహాను 13:34, 35) కొంతకాలానికి నేను, లోరీ యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకున్నాం.

బాప్తిస్మం తర్వాత కూడా నా వ్యక్తిత్వంలో మార్పులు చేసుకుంటూనే ఉన్నాను. నేను, లోరీ ఆఫ్రికా తీరం గుండా ప్రయాణించి, అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అలా ప్రయాణిస్తున్నప్పుడు, మహాసముద్రంలో చిన్న పడవలో మేమిద్దరం, చుట్టూ వేల మైళ్ల దూరం వరకు నీళ్లు తప్ప ఏమీ లేదు. ఆ సమయంలో నాకు, మన అద్భుతమైన సృష్టికర్త ముందు మనమెంత చిన్నగా ఉన్నామో అర్థమైంది. నాకు చాలా ఖాళీ సమయం ఉండేది (మహాసముద్రం మధ్యలో పెద్దగా ఏమీ చేయలేం) కాబట్టి ఎక్కువగా బైబిలు చదివేవాణ్ణి. ముఖ్యంగా, యేసు భూమ్మీది జీవితానికి సంబంధించిన లేఖనాలు నన్ను బాగా కదిలించాయి. యేసు పరిపూర్ణుడు, ఆయన సామర్థ్యాలు కనీసం నా ఊహకు కూడా అందవు. అలాంటి వ్యక్తి తననుతాను గొప్ప చేసుకోలేదు. ఆయన ఎప్పుడూ తన గురించి కాకుండా తన పరలోక తండ్రి గురించే ఆలోచించేవాడు.

దేవుని రాజ్యానికి నా జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలని గ్రహించాను

యేసు ఆదర్శం గురించి లోతుగా ఆలోచించినప్పుడు, నేను చేయాలనుకున్న వాటి మధ్య దేవుని రాజ్యానికి కొంత చోటు ఇస్తే సరిపోదు గానీ నా జీవితంలో దానికి మొదటి స్థానం ఇవ్వాలని గ్రహించాను. (మత్తయి 6:33) నేను, లోరీ చివరికి అమెరికాలో అడుగుపెట్టినప్పుడు, ఇక మా ప్రయాణాలు ఆపి అక్కడే స్థిరపడి మా ఆరాధన మీద దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాం.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

అంతకుముందు నేను సొంత తెలివి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, తరచూ ఫలితం ఎలా ఉంటుందో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు, అసలు తప్పిపోయే అవకాశమే లేని దేవుని తెలివి ప్రకారం నడుచుకుంటున్నాను. (యెషయా 48:17, 18) అంతేకాదు, ముందులా కాకుండా ఇప్పుడు నా జీవితానికి ఒక ఉద్దేశం ఉంది: దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన గురించి తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయాలి.

నేను, లోరీ బైబిలు సూత్రాలు పాటిస్తూ మా వివాహ బంధాన్ని ఎంతో బలపర్చుకున్నాం. మాకు ఒక అందమైన కూతురు ఉంది, తను యెహోవాను తెలుసుకుని ఆయన్ని ప్రేమిస్తుంది.

మా జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి. అయితే యెహోవా సహాయంతో పట్టువిడవకుండా సేవలో కొనసాగాలని, ఆయనమీద ఎప్పుడూ నమ్మకం ఉంచాలని నిర్ణయించుకున్నాం.​—సామెతలు 3:5, 6.