కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఈ రాజ్య సువార్త ప్రకటించబడుతుంది’

‘ఈ రాజ్య సువార్త ప్రకటించబడుతుంది’

‘ఈ రాజ్య సువార్త ప్రకటించబడుతుంది’

“అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”​—మత్తయి 24:14.

ఆ మాటలకు అర్థం ఏంటి? యేసు, “దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ ఒక నగరం నుండి ఇంకో నగరానికి, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ప్రయాణించాడు” అని సువార్త రచయిత లూకా రాశాడు. (లూకా 8:1) యేసే స్వయంగా ఇలా అన్నాడు: “నేను ..... దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.” (లూకా 4:43) ఆయన తన శిష్యుల్ని పట్టణాల్లో, గ్రామాల్లో సువార్త ప్రకటించమని పంపించాడు. తర్వాత వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “భూమంతటా మీరు నా గురించి ​సాక్ష్యమిస్తారు.”​—అపొస్తలుల కార్యాలు 1:8; లూకా 10:1.

తొలి క్రైస్తవులు దాన్ని ఎలా పాటించారు? యేసు శిష్యులు ఆయన చెప్పిన పనిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేశారు. “వాళ్లు ప్రతీరోజు ఆలయంలో, అలాగే ఇంటింటా మానకుండా బోధిస్తూ, క్రీస్తు గురించిన … మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.” (అపొస్తలుల కార్యాలు 5:42) ప్రకటనా పనిని కేవలం సంఘంలోని కొద్దిమంది ప్రముఖులు కాదుగానీ అందరూ చేశారు. చరిత్రకారుడైన నియాండార్‌ ఇలా చెప్పాడు: “క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా మొదటిగా రాసిన సెల్సస్‌ అనే అతను, ఉన్ని పనివాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లు, చర్మకారులు, ఏమాత్రం చదువులేనివాళ్లు, సామాన్య ప్రజలు ఉత్సాహంగా సువార్త ప్రకటించేవాళ్లని ఎగతాళి చేశాడు.” ది ఎర్లీ సెంచరీస్‌ ఆఫ్‌ ద చర్చ్‌ అనే తన పుస్తకంలో జాన్‌ బెర్నార్డీ ఇలా రాశాడు: ‘క్రైస్తవులు అన్నిచోట్లకు వెళ్లి అందరికీ ప్రకటించాలి. అంటే రహదారుల్లో, నగరాల్లో, నగర కూడళ్లలో, ఇళ్ల దగ్గర ప్రకటించాలి. ప్రజలు ఆహ్వానించినా, ఆహ్వానించకపోయినా వాళ్లు ప్రకటించాలి, అలా భూమంతటా ప్రకటించాలి.’

నేడు దాన్ని ఎవరు పాటిస్తున్నారు? “ఈ రోజుల్లో ప్రజలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి లేకపోవడానికి ఒక కారణం, ప్రకటనా-బోధనా పనికి చర్చీ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం” అని డేవిడ్‌ వాట్సన్‌ అనే ఆంగ్లికన్‌ ప్రీస్టు రాశాడు. వై ఆర్‌ ద క్యాథలిక్స్‌ లీవింగ్‌ అనే తన పుస్తకంలో హోసే లూయీస్‌ పెరెస్‌ గ్వాడాలూప్‌ అనే అతను ఇవాంజెలికల్‌, అడ్వెన్‌టిస్ట్‌, ఇతర చర్చీలవాళ్ల కార్యకలాపాల గురించి రాశాడు. ఆయనిలా అన్నాడు: “వాళ్లు ఇంటింటికీ వెళ్లి ప్రకటించరు.” అయితే యెహోవాసాక్షుల గురించి ఆయనిలా రాశాడు: “వాళ్లు ఒక పద్ధతి ప్రకారం ఇంటింటికీ వెళ్లి ప్రకటిస్తారు.”

జోనాతన్‌ టర్లీ గమనించిన ఒక ఆసక్తికరమైన, సహేతుకమైన విషయం క్యాటో సుప్రీం కోర్ట్‌ రివ్యూ 2001-2002 లో ఇలా ఉంది: “యెహోవాసాక్షుల పేరు ఎత్తగానే, వాళ్లు అననుకూలమైన సమయాల్లో ఇళ్లకు వచ్చి ప్రకటిస్తుంటారని ప్రజలు వెంటనే గుర్తుచేసుకుంటారు. ఇక యెహోవాసాక్షుల వైపు నుండి చూస్తే, ఇంటింటికి వెళ్లి ప్రకటించడం అనేది కేవలం మత వ్యాప్తి కోసం కాదు, అది వాళ్ల విశ్వాసంలో ముఖ్య భాగం.”

[బాక్సు]

మీరు గుర్తుపట్టారా?

ఈ ఆర్టికల్స్‌లో చర్చించిన లేఖనాల ఆధారంగా, నేడు నిజమైన క్రైస్తవులు ఎవరని మీరనుకుంటున్నారు? క్రైస్తవులమని చెప్పుకునే గుంపులు-శాఖలు వేలల్లో ఉన్నా, యేసు తన అనుచరులు గురించి ఇలా చెప్పాడని గుర్తుంచుకోండి: “‘ప్రభువా, ప్రభువా,’ అని నన్ను పిలిచే ప్రతీ ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి కోరేవాటిని చేసేవాళ్లే ప్రవేశిస్తారు.” (మత్తయి 7:21) తండ్రి కోరేవాటిని చేస్తూ నిజ క్రైస్తవుల్లా నడుచుకుంటున్న వాళ్లను గుర్తించి, వాళ్లతో సహవసిస్తే, దేవుని రాజ్యంలో ప్రవేశించి శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందుతాం. దేవుని రాజ్యం గురించి, అది తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి యెహోవాసాక్షుల్ని సంప్రదించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.​—లూకా 4:43.