కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీ మధ్య ప్రేమ ఉండాలి’

‘మీ మధ్య ప్రేమ ఉండాలి’

‘మీ మధ్య ప్రేమ ఉండాలి’

“నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”​—యోహాను 13:34, 35.

ఆ మాటలకు అర్థం ఏంటి? యేసు తన అనుచరుల్ని ఎంతగా ప్రేమించాడో, వాళ్లు కూడా ఒకరినొకరు అంతే ప్రేమించుకోవాలని ఆయన చెప్పాడు. యేసు వాళ్లను ఎంతగా ప్రేమించాడు? యేసు తన కాలంలో మిగతావాళ్లలా కాకుండా, ప్రజలు ఏ జాతి వాళ్లైనా, వాళ్లు ఆడవాళ్లైనా మగవాళ్లైనా అందర్నీ ఒకేలా ప్రేమించాడు. (యోహాను 4:7-10) ఆ ప్రేమవల్లే యేసు తన వ్యక్తిగత సౌకర్యాల్ని పక్కనపెట్టి, ఇతరులకు సహాయం చేయడం కోసం తన సమయాన్ని, శక్తిని వెచ్చించాడు. (మార్కు 6:30-34) చివరికి, యేసు తన ప్రేమను సాటిలేని విధంగా చూపించాడు. దాని గురించి ఆయనిలా అన్నాడు, “నేను మంచి కాపరిని; మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు.”​—యోహాను 10:11.

తొలి క్రైస్తవులు దాన్ని ఎలా పాటించారు? మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఒకరినొకరు “సహోదరుడు,” “సహోదరి” అని పిలుచుకునేవాళ్లు. (ఫిలేమోను 1, 2) అన్ని దేశాల ప్రజల్ని క్రైస్తవ సంఘంలోకి ఆహ్వానించేవాళ్లు. ఎందుకంటే “యూదుడు, గ్రీసు దేశస్థుడు అనే తేడా ఏమీ లేదు. అందరికీ ప్రభువు ఒక్కడే” అని వాళ్లు నమ్మేవాళ్లు. (రోమీయులు 10:11, 12) సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, యెరూషలేములో ఉన్న శిష్యులు “తమ భూముల్ని, ఆస్తిపాస్తుల్ని అమ్మి, వచ్చిన డబ్బును అందరికీ వాళ్లవాళ్ల అవసరాన్ని బట్టి పంచిపెడుతూ ఉన్నారు.” వాళ్లు ఎందుకలా చేశారు? కొత్తగా బాప్తిస్మం తీసుకున్నవాళ్లు యెరూషలేములోనే ఉండి “అపొస్తలులు బోధించేవాటిని పట్టుదలతో నేర్చుకుంటూ” ఉండాలని వాళ్లు అలా చేశారు. (అపొస్తలుల కార్యాలు 2:41-45) అలా చేసేలా వాళ్లను ఏది కదిలించింది? అపొస్తలులు చనిపోయిన సుమారు 200 సంవత్సరాలకు, టెర్టూలియన్‌ అనే చరిత్రకారుడు క్రైస్తవుల గురించి ఇతరులు ఏమన్నారో రాశాడు: “వాళ్లు ఒకరినొకరు ఎంతో ప్రేమించుకుంటారు . . . చివరికి ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు.”

నేడు దాన్ని ఎవరు పాటిస్తున్నారు? ద హిస్టరీ ఆఫ్‌ ద డిక్లైన్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ ద రోమన్‌ అంపైర్‌ (1837) పుస్తకం ఏం చెప్పిందంటే, వందల సంవత్సరాలుగా క్రైస్తవులమని చెప్పుకుంటున్న వాళ్లపట్ల ‘మతాసక్తి గల అన్యులు చేసిన దారుణాల కన్నా ఒకరిపట్ల ఒకరు చేసుకున్న దారుణాలు చాలా ఎక్కువ.’ ఇటీవల అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో, ఏదోక మతానికి చెందినవాళ్లే ఎక్కువగా జాతి వివక్ష చూపిస్తున్నారని తేలింది, అందులో ఎక్కువమంది క్రైస్తవులమని చెప్పుకునేవాళ్లే. వేర్వేరు దేశాల్లో నివసించే ఒకే చర్చీ శాఖవాళ్లు సాధారణంగా ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు, అందుకే ఏదైనా అవసరం వస్తే వాళ్లు తోటి విశ్వాసులకు సహాయం చేయలేరు లేదా చేయాలనుకోరు.

2004 లో, రెండు నెలల్లో వెంటవెంటనే వచ్చిన నాలుగు తుఫానుల వల్ల ఫ్లోరిడా అతలాకుతలం అయినప్పుడు, ఫ్లోరిడా ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ కమిటీ ఛైర్మన్‌ తాము అందిస్తున్న సరుకులు సరిగ్గా ఉపయోగిస్తున్నారో లేదో పరిశీలించాడు. యెహోవాసాక్షులంత పద్ధతిగా ఏ గుంపూ పనిచేయలేదని ఆయన చెప్పాడు, అలాగే వాళ్లకు ఏవైనా కావాల్సి ఉంటే ఏర్పాటు చేస్తానని అన్నాడు. గతంలో అంటే 1997 లో, యెహోవాసాక్షుల విపత్తు సహాయక బృందం ఒకటి డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఉన్న తోటి విశ్వాసులకు, ఇతరులకు సహాయం చేయడానికి మందులు, ఆహారం, బట్టలు తీసుకొని అక్కడికి వెళ్లింది. అప్పుడు యూరప్‌లో ఉన్న తోటి సాక్షులు ఒక మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువ చేసే సరుకులు విరాళంగా ఇచ్చారు.