మనం ఎందుకు ప్రార్థించాలి?
బైబిల్లో ఎంతో ఆసక్తిని, కుతూహలాన్ని కలిగించే కొన్ని అంశాల్లో ప్రార్థన ఒకటి. ప్రార్థన గురించి సాధారణంగా అడిగే ఏడు ప్రశ్నలు ఏమిటో, వాటికి బైబిలు ఏమని జవాబిస్తుందో పరిశీలించండి. ఈ ఆర్టికల్స్ మీరు ప్రార్థన చేయడానికి, అంటే ప్రార్థించడం మొదలుపెట్టడానికి లేదా మీ ప్రార్థనల్ని మెరుగుపర్చుకోవడానికి సహాయం చేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంస్కృతిలో, మతంలో ప్రజలు ప్రార్థించడాన్ని మనం గమనిస్తాం. వాళ్లు ఒంటరిగా, గుంపులుగా ప్రార్థిస్తారు. చర్చీల్లో, ఆలయాల్లో, సమాజమందిరాల్లో, మసీదుల్లో, మంటపాల్లో ప్రార్థిస్తారు. ప్రార్థించేటప్పుడు వాళ్లు ప్రార్థన రగ్గుల్ని, జపమాలల్ని, ప్రార్థన చక్రాల్ని, ప్రతిమల్ని, ప్రార్థన పుస్తకాల్ని ఉపయోగిస్తారు, లేదా చిన్న బోర్డు మీద ప్రార్థన రాసి ఒకచోట తగిలిస్తారు.
ప్రార్థన అనేది భూమ్మీద ఉన్న ఇతర ప్రాణులన్నిటి నుండి మనుషుల్ని వేరు చేస్తుంది. నిజమే, జంతువులకు మనకు మధ్య చాలా పోలికలు ఉన్నాయి. వాటిలాగే మనకు ఆహారం, గాలి, నీరు కావాలి. వాటిలాగే మనం పుడతాం, బ్రతుకుతాం, చనిపోతాం. (ప్రసంగి 3:19) కానీ మనుషులు మాత్రమే ప్రార్థిస్తారు. ఎందుకు?
ఎందుకంటే, ప్రార్థన చేయాల్సిన అవసరం మనకు ఉంది. సాధారణంగా ప్రజలు తాము దేన్నైతే పవిత్రమైనదిగా, శాశ్వతమైనదిగా ఎంచుతారో దాన్ని చేరుకోవడానికి ప్రార్థనను ఒక మార్గంగా చూస్తారు. అలాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండేలా మనుషులు తయారు చేయబడ్డారని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 3:11) యేసుక్రీస్తు ఒకసారి ఇలా చెప్పాడు: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”—మత్తయి 5:3.
మనుషులు రకరకాల మందిరాలు, కళాకృతులు నిర్మించుకొని గంటల తరబడి ప్రార్థనలు చేసేది ఆ అవసరాన్ని తీర్చుకోవడానికే. నిజమే, కొంతమంది తమకున్న ఆ అవసరాన్ని తామే స్వయంగా తీర్చుకోవడానికి చూస్తారు లేదా ఇతరుల మీద ఆధారపడతారు. కానీ ఈ విషయంలో తగినంత సహాయం చేసే సామర్థ్యం మనుషులకు లేదని మీరు ఒప్పుకోరా? మనం బలహీనులం, కొంతకాలమే జీవిస్తాం, దూరదృష్టి ఉండదు. కాబట్టి మనకన్నా ఎంతో తెలివి, శక్తి కలిగిన, ఎక్కువకాలం ఉండే వ్యక్తి మాత్రమే మనకు అవసరమైన వాటిని ఇవ్వగలడు. ఇంతకీ ప్రార్థించేలా మనల్ని ప్రేరేపించే ఆ అవసరాలు ఏంటి?
ఈ విషయం గురించి ఆలోచించండి: మీరెప్పుడైనా నిర్దేశం కోసం, తెలివి కోసం, మనుషులు సొంత జ్ఞానంతో తెలుసుకోలేని ప్రశ్నలకు జవాబుల కోసం తపించారా? బాగా కావాల్సినవాళ్లు చనిపోయినప్పుడు ఓదార్పు, కష్టమైన నిర్ణయం తీసుకోవడానికి నిర్దేశం, తప్పు చేసినప్పుడు క్షమాపణ అవసరం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
బైబిలు చెప్తున్న ప్రకారం, అవన్నీ ప్రార్థన చేయడానికి సరైన కారణాలే. ఈ అంశం గురించి అత్యంత నమ్మదగిన సమాచారం బైబిల్లో ఉంది, అలాగే ఎంతోమంది నమ్మకమైన స్త్రీపురుషులు చేసిన ఎన్నో ప్రార్థనలు కూడా బైబిల్లో ఉన్నాయి. వాళ్లు ఓదార్పు కోసం, నిర్దేశం కోసం, క్షమాపణ కోసం, అత్యంత కష్టమైన ప్రశ్నలకు జవాబుల కోసం ప్రార్థించారు.—కీర్తన 23:3; 71:21; దానియేలు 9:4, 5, 19; హబక్కూకు 1:3.
అలాంటి ప్రార్థనలు వేర్వేరుగా ఉన్నా, వాటన్నిటిలో ఒక విషయం సాధారణంగా కనిపిస్తుంది. అదేంటంటే, అసలైన ప్రార్థనకు ఉండాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటో వాళ్లకు తెలుసు; ప్రార్థనలు ఎవరికి చేయాలో వాళ్లకు తెలుసు. కానీ విచారకరంగా ఈ రోజుల్లో చాలామందికి అది తెలీదు లేదా వాళ్లు దాన్ని పట్టించుకోవడం లేదు.