కంటెంట్‌కు వెళ్లు

మద్యం విషయంలో సరైన అభిప్రాయంతో ఉండడం

మద్యం విషయంలో సరైన అభిప్రాయంతో ఉండడం

మద్యం విషయంలో సరైన అభిప్రాయంతో ఉండడం

అతిగా తాగడం వల్ల కొన్నేళ్ల క్రితం ఆక్సిడెంట్‌లో చనిపోయిన టోనీ తనకు మద్యపానం విషయంలో సమస్య ఉందని అంగీకరించి ఉంటే, అతని జీవితం వేరుగా ఉండేది. అతను ఎంత తాగినా బయటికి తెలిసేది కాదు కాబట్టి, తన జీవితం తన అదుపులోనే ఉందని అనుకునేవాడు. అతను అలా ఆలోచించడం ఎందుకు తప్పు?

ఎక్కువగా మద్యం తాగడం వల్ల అతను సరిగ్గా ఆలోచించలేకపోయాడు. అతను గుర్తించినా గుర్తించకపోయినా, అతని శారీరక, మానసిక, భావోద్వేగ స్థితిని నియంత్రించే అతని మెదడు సరిగ్గా పనిచేయడం లేదు, అది పూర్తిగా మద్యం ప్రభావం కిందకి వెళ్లిపోయింది. అతను ఎక్కువగా తాగేకొద్దీ, పరిస్థితిని అంచనా వేసే అతని మెదడు సామర్థ్యం తగ్గిపోతూ ఉంది.

టోనీ అలా తప్పుగా ఆలోచించడానికి ఇంకో కారణం, మద్యం తాగే అలవాటును మానుకోవడానికి అతను ఏమాత్రం ఇష్టపడకపోవడం. అలెన్‌ కూడా తనకు మద్యపానం విషయంలో సమస్య ఉందని మొదట్లో ఒప్పుకునేవాడు కాదు. అతను ఇలా అంటున్నాడు: “నేను నా అలవాటును దాచిపెట్టేవాణ్ణి, సాకులు చెప్పేవాణ్ణి, మరీ ఎక్కువేం తాగడంలేదని అనేవాణ్ణి. నా ఏకైక లక్ష్యం, తాగుతూనే ఉండడం.” టోనీ, అలెన్‌ ఎక్కువగా తాగుతున్నారని ఇతరులు చెప్తున్నా, అంతా మామూలుగానే ఉందని వాళ్లను వాళ్లు సమర్థించుకునేవాళ్లు. వాళ్లిద్దరూ మద్యపాన అలవాటును అదుపులో పెట్టుకోవడానికి కొన్ని పనులు చేసుండాలి. ఏంటవి?

చర్య తీసుకోండి!

మద్యం ఎక్కువగా తాగిన చాలామంది యేసు ఇచ్చిన ఈ సలహా పాటించి, ఆ అలవాటు మానుకోగలిగారు: “కాబట్టి నీ కుడి కన్ను నీతో పాపం చేయిస్తుంటే, దాన్ని పీకేసి దూరంగా పడేయి. నీ శరీరమంతా గెహెన్నాలో పడేయబడడం కన్నా నీ అవయవాల్లో ఒకదాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు.”​—మత్తయి 5:29.

యేసు ఇక్కడ నిజంగా అవయవాల్ని నరుక్కోవాలని చెప్పట్లేదు. బదులుగా, దేవుని నుండి మనల్ని దూరం చేసే దేన్నైనా తీసిపారేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. నిజమే అలా చేయడం చాలా బాధగా ఉండవచ్చు. కానీ అలా చేయడం అతిగా తాగడానికి దారితీసే ఆలోచనా తీరుకు, పరిస్థితులకు దూరంగా ఉండడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మీరు అతిగా తాగుతున్నారని ఎవరైనా చెప్తే, దాన్ని అదుపు చేసుకోవడానికి చర్యలు తీసుకోండి. a ఒకవేళ అదుపు చేసుకోవడం మీవల్ల కాదని మీకు అనిపిస్తే, దాన్ని పూర్తిగా మీ జీవితంలో నుండి తీసేయడానికి సిద్ధంగా ఉండండి. అది ఎంతో బాధగా అనిపించవచ్చు, కానీ జీవితాన్ని నాశనం చేసుకున్నప్పుడు వచ్చే బాధతో పోలిస్తే అది చిన్నదే.

మీరు తాగుబోతు కాకపోయినా, అప్పుడప్పుడూ ఎక్కువగా తాగుతుంటారా? అలాగైతే, మద్యం విషయంలో సరైన అభిప్రాయంతో ఉండడం కోసం మీరు ఎలాంటి పనులు చేయవచ్చు?

సహాయం ఎక్కడ దొరుకుతుంది?

1. విశ్వాసంతో తరచుగా, మనస్ఫూర్తిగా ప్రార్థించండి. యెహోవాను సంతోషపెట్టాలని కోరుకునే వాళ్లందరికీ బైబిలు ఇలా సలహా ఇస్తుంది: “ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి; అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.” (ఫిలిప్పీయులు 4:6, 7) ఆ మనశ్శాంతిని పొందాలంటే మీరు ఏమని ప్రార్థించవచ్చు?

మీకు మద్యం విషయంలో సమస్య ఉందని నిజాయితీగా ఒప్పుకోండి. దానితో వ్యవహరించాల్సిన బాధ్యత మీదే. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దేవునికి చెప్తే, మనశ్శాంతి కోసం, మరిన్ని పెద్ద సమస్యల్లో చిక్కుకోకుండా ఉండడం కోసం మీరు చేసే ప్రయత్నాల మీద దేవుని దీవెనలు ఉంటాయి. “తన దోషాన్ని కప్పిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడి మీద కరుణ చూపించబడుతుంది.” (సామెతలు 28:13) “మమ్మల్ని ప్రలోభానికి లొంగిపోనివ్వకు, దుష్టుని [లేదా, చెడ్డదాని] నుండి మమ్మల్ని కాపాడు” అని ప్రార్థించమని కూడా యేసు చెప్పాడు. (మత్తయి 6:13) అయితే, మీ ప్రార్థనల ప్రకారం మీరు ఏమేం చేయవచ్చు? మీ విన్నపాలకు జవాబులు ఎలా కనుగొనవచ్చు?

2. దేవుని వాక్యం ద్వారా శక్తి పొందండి. “దేవుని వాక్యం సజీవమైనది, చాలా శక్తివంతమైనది. ... హృదయంలోని ఆలోచనల్ని, ఉద్దేశాల్ని వెల్లడిచేస్తుంది.” (హెబ్రీయులు 4:12) ఒకప్పుడు మద్యం అతిగా తాగిన చాలామంది, రోజూ బైబిలు వచనాల్ని చదివి ధ్యానించడం వల్ల ప్రయోజనం పొందారు. భక్తిపరుడైన ఒక కీర్తనకర్త ఇలా రాశాడు, ‘దుష్టుల సలహా ప్రకారం నడుచుకోకుండా ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు. అతను యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, పగలూ రాత్రీ దాన్ని ధ్యానిస్తాడు. అతను చేసే ప్రతీది సఫలమౌతుంది.’​—కీర్తన 1:1-3.

యెహోవాసాక్షులతో బైబిలు స్టడీ చేయడం ద్వారా, అతిగా మద్యం తాగే అలవాటు నుండి బయటపడిన అలెన్‌ ఇలా చెప్తున్నాడు, “బైబిలు, బైబిలు సూత్రాల సహాయంతో నేను తాగే అలవాటును మానుకోగలిగాను, లేదంటే ఈపాటికి నేను చనిపోయి ఉండేవాణ్ణి అని ఖచ్చితంగా చెప్పగలను.”

3. ఆత్మనిగ్రహం పెంచుకోండి. క్రైస్తవ సంఘంలో ఒకప్పుడు తాగుబోతులుగా ఉన్నవాళ్లను ‘దేవుడు తన పవిత్రశక్తితో’ శుభ్రం చేశాడని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 6:9-11) ఎలా? ఒక విధానం ఏమిటంటే, వాళ్లు ఆత్మనిగ్రహం పెంచుకోవడం ద్వారా తాగుబోతుతనానికి, విచ్చలవిడి విందులకు దూరంగా ఉండగలిగారు. ఆత్మనిగ్రహం అనేది దేవుని పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం. “మద్యం మత్తులో ఉండకండి, అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. బదులుగా పవిత్రశక్తితో నింపబడుతూ ఉండండి” అని బైబిలు చెప్తుంది. (ఎఫెసీయులు 5:18; గలతీయులు 5:21-23) “పరలోకంలో ఉన్న తండ్రి తనను అడిగేవాళ్లకు ... పవిత్రశక్తిని ఇస్తాడు” అని యేసుక్రీస్తు మాటిచ్చాడు. కాబట్టి, “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది.”​—లూకా 11:9, 13.

యెహోవాకు నచ్చే విధంగా ఆయన్ని ఆరాధించాలని కోరుకునేవాళ్లు, బైబిల్ని చదవడం-అధ్యయనం చేయడం ద్వారా, హృదయపూర్వకంగా-తరచుగా ప్రార్థించడం ద్వారా ఆత్మనిగ్రహాన్ని పెంచుకోవచ్చు. నిరుత్సాహానికి గురయ్యే బదులు దేవుని వాక్యంలోని ఈ వాగ్దానంపై నమ్మకం ఉంచండి: “పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం విత్తే వ్యక్తి, పవిత్రశక్తి వల్ల శాశ్వత జీవితం అనే పంట కోస్తాడు. కాబట్టి మనం మానకుండా మంచిపనులు చేద్దాం; ఎందుకంటే, మనం అలసిపోకుండా ఉంటే సరైన సమయంలో పంట కోస్తాం.”​—గలతీయులు 6:8, 9.

4. మంచివాళ్లతో స్నేహం చేయండి. “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు ​చెడిపోతాడు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 13:20) మీరు మద్యం అలవాటును అదుపులో ఉంచాలని గట్టిగా నిర్ణయించుకున్నారని మీ స్నేహితులతో చెప్పండి. అయితే, “అతిగా తాగుతూ, విచ్చలవిడి విందులు చేసుకుంటూ, తాగుబోతుల విందుల్లో” పాల్గొనడం మీరు మానేసినప్పుడు, కొంతమంది పాత స్నేహితులు ‘ఆశ్చర్యపోతారు, మీ గురించి చెడుగా మాట్లాడతారు’ అని దేవుని వాక్యం ముందే హెచ్చరించింది. (1 పేతురు 4:3, 4) మద్యం అలవాటును అదుపులో ఉంచాలనే మీ నిర్ణయాన్ని నీరుగార్చే వాళ్లతో స్నేహం మానేయడానికి ఏమాత్రం సంకోచించకండి.

5. ఖచ్చితమైన హద్దులు పెట్టుకోండి. “ఇకమీదట ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి. బదులుగా మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. అలా మీరు మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోగలుగుతారు.” (రోమీయులు 12:2) కాబట్టి మీ స్నేహితులు లేదా “ఈ వ్యవస్థ” నిర్దేశించినట్టు కాకుండా దేవుని వాక్యంలోని సూత్రాల ప్రకారం మద్యం విషయంలో హద్దులు పెట్టుకుంటే, మీ జీవితంపై దేవుని ఆమోదం ఉంటుంది. మరైతే, మీరు ఎంత మోతాదులో తాగితే మంచిదో ఎలా తెలుసుకోవచ్చు?

మీరు తాగే మద్యం ఎంతైనా, అది మీ వివేచనా శక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని సన్నగిల్లేలా చేస్తే మీరు ఎక్కువగా తాగుతున్నారని అర్థం. కాబట్టి ఒకవేళ మీరు తాగాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితమైన హద్దులు పెట్టుకోండి. లేకపోతే, మీకు తెలీకుండానే మత్తులోకి జారిపోయే ప్రమాదం ఉంది. మరీ ఎక్కువేం తాగడం లేదని మిమ్మల్ని మీరు సమర్థించుకోకుండా, ఎంత తాగుతున్నారో నిజాయితీగా పరిశీలించుకోండి. ఎంత తాగితే మీకు హాని జరగకుండా ఉంటుందో, అతిగా తాగడంలోకి పడిపోకుండా ఉంటారో ఆలోచించి ఖచ్చితమైన, సరైన హద్దు పెట్టుకోండి.

6. వద్దు అని చెప్పడం అలవాటు చేసుకోండి. “మీ మాట ‘అవును’ అంటే అవును, ‘కాదు’ అంటే కాదు అన్నట్టే ఉండాలి.” (మత్తయి 5:37) మంచివాళ్లే అయినా సరైన ఉద్దేశాలు లేనివాళ్లు, తాగడానికి మిమ్మల్ని అదేపనిగా పిలుస్తూ ఉంటే, వీలుకాదని మర్యాదపూర్వకంగా చెప్పడం అలవాటు చేసుకోండి. “మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. అప్పుడు, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.”​—కొలొస్సయులు 4:6.

7. వేరేవాళ్ల సహాయం తీసుకోండి. మద్యాన్ని అదుపులో ఉంచాలనే మీ నిర్ణయాన్ని బలపర్చే, అలాగే మిమ్మల్ని దేవునికి దగ్గరయ్యేలా చేసే స్నేహితుల సహాయం తీసుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “ఒక్కరి కన్నా ఇద్దరు ఉండడం మంచిది, ఎందుకంటే వాళ్ల కష్టం వల్ల వాళ్లకు మంచి ప్రతిఫలం కలుగుతుంది. వాళ్లలో ఒకరు పడిపోతే, తోటివ్యక్తి అతన్ని పైకి లేపుతాడు.” (ప్రసంగి 4:9, 10; యాకోబు 5:14, 16) అమెరికాలోని ద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ ఆల్కహాల్‌ అబ్యూజ్‌ అండ్‌ ఆల్కహాలిజమ్‌ ఇలా సలహా ఇస్తుంది: “మద్యాన్ని అదుపులో పెట్టడం కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు. అలాంటప్పుడు మీ లక్ష్యాన్ని చేరుకునేలా సహాయం చేయమని మీ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని అడగండి.”

8. మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. బైబిలు ఇలా చెప్తుంది: “తప్పుడు ఆలోచనతో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ వాక్యాన్ని వినేవాళ్లుగా మాత్రమే ఉండకండి, దాన్ని పాటించేవాళ్లుగా ఉండండి. అయితే స్వేచ్ఛను ఇచ్చే పరిపూర్ణ నియమంలోకి పరిశీలనగా చూసి, దాన్ని పాటిస్తూ ఉండే వ్యక్తి ఊరికే విని మర్చిపోడు కానీ దాని ప్రకారం నడుచు​కుంటాడు; అలా చేయడంలో సంతోషం పొందుతాడు.”​—యాకోబు 1:22, 25.

వ్యసనం నుండి బయటపడడం

అతిగా తాగే ప్రతీఒక్కరు మద్యానికి బానిసలు కాకపోవచ్చు. కానీ కొంతమంది మరీ ఎక్కువగా, మరీ తరచుగా తాగుతూ దానికి బానిసలౌతారు. మద్యం అలవాటు ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా దానిమీద పూర్తిగా ఆధారపడేలా చేస్తుంది. అలాంటివాళ్లు ఆ వ్యసనం నుండి బయటపడాలంటే కేవలం దృఢసంకల్పం, ఆధ్యాత్మిక సహాయం సరిపోవు. అలెన్‌ ఇలా చెప్తున్నాడు, “నేను మద్యాన్ని వదిలేస్తున్నప్పుడు, ఒంట్లో బాగా నలతగా అనిపించేది. దాంతో నాకు ఆధ్యాత్మిక సహాయంతో పాటు, వైద్య సహాయం కూడా అవసరమని అర్థమైంది.”

దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఉద్దేశంతో మద్యం అలవాటు మానుకోవడానికి, మద్యానికి దూరంగా ఉండడానికి పోరాడే చాలామందికి వైద్య సహాయం అవసరం. b కొంతమందిని హాస్పిటల్‌లో చేర్పించడం కూడా అవసరం కావచ్చు. దానివల్ల, మద్యం మానేస్తున్నప్పుడు ఒంట్లో బాగా నలతగా అనిపించేవాళ్లకు చికిత్స చేస్తారు, తాగాలనే కోరిక చాలా బలంగా ఉన్నవాళ్లకు ఆ కోరిక తగ్గేలా చేస్తారు, అలాగే వాళ్లు మద్యానికి దూరంగా ఉండడానికి సహాయం చేస్తారు. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుని కుమారుడైన యేసు ఇలా అన్నాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం.”​—మార్కు 2:17.

దేవుని నిర్దేశాన్ని పాటించడం వల్ల ప్రయోజనాలు

మద్యం గురించి బైబిల్లో ఉన్న తెలివైన సలహాలు సత్య దేవుడు ఇచ్చినవి. ఆయన ఎప్పుడూ మన మంచే కోరుకుంటాడు, ఆయన నిర్దేశాలు మనకు ఇప్పుడే కాదు ఎప్పుడూ మేలు చేస్తాయి. మద్యం మానేసిన 24 ఏళ్ల తర్వాత అలెన్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “నేను మారగలనని, మారడానికి యెహోవా సహాయం చేయాలనుకుంటున్నాడని తెలుసుకున్నప్పుడు అద్భుతంగా అనిపించింది …” పాత విషయాలు గుర్తొస్తుంటే కన్నీళ్లు ఆపుకుంటూ అతను ఇలా అన్నాడు, “… యెహోవా నన్ను అర్థం చేసుకుంటాడని, నా గురించి పట్టించుకుంటున్నాడని, నాకు అవసరమైన సహాయం చేస్తాడని తెలుసుకోవడం ఎంతో ప్రోత్సాహంగా అనిపించింది.”

కాబట్టి మీరు అతిగా మద్యం తాగుతున్నా లేదా దానికి బానిసైనా, దాన్ని మానుకోవడం మీవల్ల కాదని, మీరెప్పటికీ మారలేరని నిరుత్సాహపడకండి. అలెన్‌, ఇంకా ఎంతోమంది ఒకప్పుడు మీలాగే అనుకున్నారు, కానీ వాళ్లిప్పుడు మద్యం అలవాటును అదుపులో పెట్టుకున్నారు లేదా పూర్తిగా మానేశారు. అలా చేసినందుకు వాళ్లు ఏమాత్రం బాధపడట్లేదు, మీరు కూడా ఎప్పటికీ అలా బాధపడరు.

మీరు మితంగా తాగాలని నిర్ణయించుకున్నా, లేదా పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నా, దేవుడు ప్రేమతో చెప్తున్న ఈ మాటల్ని గుర్తుంచుకోండి: “నువ్వు నా ఆజ్ఞల్ని శ్రద్ధగా వింటే ఎంత బావుంటుంది! అప్పుడు నీ శాంతి నదిలా, నీ నీతి సముద్ర తరంగాల్లా ఉంటుంది.”​—యెషయా 48:18.

[అధస్సూచీలు]

b అలాంటివాళ్లకు సహాయం చేసే చికిత్సా కేంద్రాలు, హాస్పిటళ్లు, కోలుకునేలా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ ఆర్టికల్‌ ప్రత్యేకంగా ఏ చికిత్సా విధానాన్ని సిఫారసు చేయడం లేదు. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా చికిత్సా విధానాల్ని పరిశీలించి, బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా లేని నిర్ణయం తీసుకోవాలి.

[బాక్సు/చిత్రం]

 నేను మద్యం గుప్పిట్లోకి వెళ్తున్నానా?

ఈ ప్రశ్నలు వేసుకోండి:

• నేను ముందుకన్నా ఎక్కువగా మద్యం తాగుతున్నానా?

• ముందుకన్నా తరచుగా తాగుతున్నానా?

• ఇంకా ఘాటుగా తాగుతున్నానా?

• ఒత్తిడిని లేదా సమస్యల్ని తప్పించుకోవడానికి తాగుతున్నానా?

• నా తాగే అలవాటు గురించి నా స్నేహితుల్లో లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆందోళన వ్యక్తం చేశారా?

• నేను తాగడం వల్ల ఇంట్లో, పనిచేసే చోట లేదా సెలవుల్లో బయటికి వెళ్లినప్పుడు సమస్యలు వచ్చాయా?

• ఒక వారంపాటు మద్యం తాగకుండా ఉండగలనా?

• ఇతరులు మద్యానికి దూరంగా ఉన్నప్పుడు నాకు ఇబ్బందిగా ఉంటుందా?

• నేను ఎంత తాగుతాననే విషయం ఇతరులకు తెలీకుండా చూసుకుంటున్నానా?

వీటిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రశ్నలకు మీ జవాబు “అవును” అయితే, మద్యం అలవాటును అదుపులో పెట్టుకోవడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి.

[బాక్సు/చిత్రం]

మద్యం విషయంలో తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?

తాగడానికి ముందు ఈ విషయాల గురించి ఆలోచించండి:

నేను మద్యం తాగడం మంచిదేనా లేక దానికి దూరంగా ఉండాలా?

సలహా: తాగే మోతాదును నియంత్రించుకోలేని వాళ్లు మద్యానికి దూరంగా ఉండాలి.

నేను ఎంత తాగాలి?

సలహా: మీరు సరిగ్గా ఆలోచించే స్థితిలో ఉన్నప్పుడే, ఎంత తాగాలో హద్దు పెట్టుకోండి.

నేను ఎప్పుడు తాగుతాను?

సలహాలు: డ్రైవింగ్‌ లేదా జాగ్రత్తగా ఉండాల్సిన పనులు చేసే ముందు తాగకూడదు; ఆరాధనకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే ముందు తాగకూడదు; గర్భవతిగా ఉన్నప్పుడు తాగకూడదు; అలాగే కొన్నిరకాల చికిత్సలు తీసుకుంటున్నప్పుడు తాగకూడదు.

నేను ఎక్కడ తాగుతాను?

సలహాలు: సురక్షితమైన చోటును ఎంచుకోండి; మీరు తాగుతున్నట్టు ఎవరికీ తెలీకుండా ఉండాలని రహస్యంగా తాగకండి; అలాగే మద్యాన్ని ఇష్టపడనివాళ్ల ముందు తాగకండి.

నేను ఎవరితో తాగుతాను?

సలహాలు: మీ మీద మంచి ప్రభావం చూపించే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పాటు తాగవచ్చు; తాగినప్పుడు వివేచన కోల్పోయే వాళ్లతో కలిసి తాగకండి.

[బాక్సు/చిత్రం]

ఒకప్పుడు తాగుబోతుగా ఉన్న వ్యక్తికి దేవుని వాక్యం సహాయం చేసింది

థాయ్‌లాండ్‌కు చెందిన సపొట్‌ ఒకప్పుడు విపరీతంగా తాగేవాడు. మొదట్లో అతను రాత్రి మాత్రమే తాగేవాడు. మెల్లమెల్లగా పొద్దున, ఆ తర్వాత మధ్యాహ్నం కూడా తాగడం మొదలుపెట్టాడు. అతను తరచూ కేవలం మత్తెక్కడానికే తాగేవాడు. కొంతకాలానికి అతను యెహోవాసాక్షులతో బైబిలు స్టడీ మొదలుపెట్టాడు. తాగుబోతుతనాన్ని యెహోవా దేవుడు ఇష్టపడడని తెలుసుకున్నప్పుడు అతను తాగడం మానేశాడు. కానీ కొంతకాలానికి మళ్లీ తాగడం మొదలుపెట్టాడు. దానివల్ల అతని కుటుంబసభ్యులు చాలా బాధపడ్డారు.

అయితే సపొట్‌ మనసులో యెహోవామీద ఇంకా ప్రేమ ఉంది, కాబట్టి సరైన విధంగా దేవుణ్ణి ఆరాధించాలని అనుకున్నాడు. అతని స్నేహితులు అతనికి సహాయం చేస్తూనే ఉన్నారు, అలాగే అతనితో ఎక్కువ సమయం గడపమని, అతని విషయంలో ఆశలు వదులుకోవద్దని అతని కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ సమయంలో 1 కొరింథీయులు 6:10 లో ఉన్న ‘తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు’ అనే మాటలు అతన్ని బలంగా పురికొల్పాయి. దాంతో మద్యం తాగే అలవాటును మానుకోవాలంటే పట్టుదలగా, శాయశక్తులా కృషిచేయాలని అతను గ్రహించాడు.

ఈసారి సపొట్‌ మద్యాన్ని పూర్తిగా మానేయాలని నిశ్చయించుకున్నాడు. చివరికి, దేవుని పవిత్రశక్తి సహాయంతో, దేవుని వాక్యం నిర్దేశంతో, కుటుంబ సభ్యులు-సంఘం ఇచ్చిన మద్దతుతో అతను మద్యం తాగే అలవాటును మానుకున్నాడు. అతను దేవునికి సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు అతని కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు. ఇప్పుడు అతను ఎంతగానో కోరుకున్నట్లుగా దేవునితో స్నేహాన్ని ఆనందిస్తున్నాడు, ఇతరులు దేవుని గురించి తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నాడు.