కంటెంట్‌కు వెళ్లు

కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట

కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట

కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట

భూమియందంతటా నిజమైన న్యాయం అమలులో ఉన్నప్పుడు సంతోషసమాధానాలతో జీవించాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాను! అని నిశ్చయంగా మీరు సమాధానమిస్తారు. మానవజాతి చరిత్రంతటిలో, నీతిని ప్రేమించే వారందరికి ఇది సహజ అభీష్టంగా ఉండినది. అయితే, దుష్టులు మరియు అన్యాయస్థులు ఉన్నంతవరకు శాశ్వతమైన మనశ్శాంతి మరియు ఆనందం మీకైనా, మరెవరికైనా ఉండవు.

2. బాధను మరియు అన్యాయాన్ని తీసివేయడానికి మానవుడు ఎలా ప్రయత్నించాడు?

2 అసంతోషకరంగా, ఈ కారణంచేతనే, అన్యాయాన్ని తుడిచివేసి, నీతిమంతుల కొరకు సంతోషాన్ని స్థాపించాలన్న మానవ ప్రయత్నాలలో, మానవచరిత్ర యుద్ధంచేత కళంకితమైంది. ప్రాచీన భారతదేశంలోని కురుక్షేత్రమందు జరిగిన యుద్ధం, అలాంటి యుద్ధాలలో ఒకటిగా కన్పడ్తుంది. చెడుపై దేవుని మంచితనం విజయం సాధించాలన్న మానవ అభిలాష మూలంగా, కాలక్రమేణ కురుక్షేత్ర యుద్ధభూమి భారతదేశం యొక్క ప్రఖ్యాత మతకావ్యమైన మహాభారతానికి, ప్రాముఖ్యంగా ఆ కావ్యానికి కేంద్రమైన భగవద్గీతకు పూర్వరంగమైంది. భగవద్గీత యొక్క గ్రంథకూర్పు సంబంధంగా చెప్పబడుతున్న తేదీలు చాలా భిన్నంగా ఉన్నాయని, అది క్రీ.పూ. 400 నుండి క్రీ.పూ. 200 సంవత్సరాల మధ్యకాలంలో ఎప్పుడో వ్రాయబడి ఉంటుందనే అనేక ఊహలున్నాయని హిందూ గ్రంథకర్తయైన కే. ఎమ్‌. సెన్‌ వ్రాస్తున్నాడు.

3-6. (ఎ) స్పష్టంగా అలాంటి ఏ ప్రయత్నం ప్రాచీన భారతదేశంలో జరిగింది? (బి) శాశ్వతమైన పరిష్కారం సాధించబడలేదని మనకెలా తెలుసు?

3 మిత్రపక్షాల నాయకుడైన అర్జునుడు, యుద్ధానికి బారులు తీరివున్న సైన్యాన్ని పరీక్షిస్తుండగా, దగ్గరి బంధువులు ఒకరికొకరు వ్యతిరేకంగా, వ్యతిరేకపక్షాల్లో నిలిచి ఉండటం గమనించి కలతచెందాడని అనేకులు విశ్వసిస్తారు. భగవద్గీత ఒకటవ అధ్యాయం 26-29, 47 వచనాలు తెలుగులో ఇలా చదువబడుతున్నాయి: “తదుపరి అర్జునుడచట రెండు సేనలయందును నిల్చియున్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, స్నేహితులను, మామలను, హితైషులను (అందరిని) చూచెను. కుంతీ పుత్రుడు (అర్జునుడు) యుద్ధభూమియందు నిలబడియున్న ఆ బంధువులందరిని బాగుగ పరికించి దయార్ద్రహృదయుడై, దుఃఖించుచు నిట్లు పలికెను—ఓ కృష్ణమూర్తీ! యుద్ధముచేయుటకై ఇచట సమకూడిన ఈ బంధుజనులను జూచి నా అవయవములు పట్టుదప్పుచున్నవి, నోరెండుకొని పోవుచున్నది; శరీరమందు వణకు పుట్టుచున్నది; గగుర్పాటు కలుగుచున్నది; యుద్ధభూమియందర్జును డీ ప్రకారముగ జెప్పి శోకముచే కలతనొందిన చిత్తముగలవాడై, బాణముతో గూడిన వింటిని పారవైచి రథముపై చతికిలబడెను.”

4 అర్జునుని రథసారథి మరియు కృష్ణుని పాత్రలో ఉన్న విష్ణు దేవుడు, అంతర్యుద్ధాన్ని సమర్థిస్తూ, తన క్షత్రియ ధర్మాన్ని నిర్వహించమని అర్జునునికి ఉద్బోధిస్తూ ఇలా చెప్పినట్లు నివేదించబడుతుంది: “ఇక నీవు ధర్మయుక్తమగు ఈ యుద్ధమును చేయకుందువేని, దానిచే నీవు స్వధర్మమును నిరసించినవాడవై, కీర్తిని బోగొట్టుకొని పాపమును బొందగలవు. సుఖదుఃఖములందును, లాభనష్టములందును, జయాపజయములందును సమబుద్ధిగలిగి యుద్ధమునకు సంసిద్ధుడవగుము. ఇట్లు చేసితివేని నీవు పాపమును పొందకుందువు.”—భగవద్గీత 2:33, 38.

5 ఆ యుద్ధంలో, ప్రముఖ నాయకులలో, అర్జునుడు మరియు అతనితోపాటు అతని నలుగురు సహోదరులు మరియు కృష్ణుడు మాత్రమే మిగిలి ఉండే వరకు ఆ యుద్ధం 18 దినాలు ముమ్మరంగా జరిగిందని అనేకులు విశ్వసిస్తున్నారు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో న్యాయం వైపు ఉన్నవారు హతశేషులయ్యారని, న్యాయం తీర్చబడిందని వారు తేల్చిచెబుతారు. ఆ తర్వాత కొంతకాలంవరకు శాంతి ప్రబలంగా ఉంది. అయితే ఎంత కాలంవరకు?

6 దుఃఖకరంగా, చరిత్రలో క్రితం ఎన్నడూ లేనంత తీవ్రంగా, అధిక స్ధాయిలో ఈనాడు మానవజాతి యావత్తు అన్యాయం మరియు కష్టాలచేత బాధించబడుతుంది. కాబట్టి, చరిత్రలో జరిగిన యుద్ధాలలో ఏదీ కూడా దేవుని పరిపాలనకు మరియు ఎక్కువ దుష్టత్వానికి దారి తీసిన మానవ పరిపాలనా వ్యవస్థలకు మధ్యగల వివాదాంశాన్ని శాశ్వతంగా పరిష్కరించలేదని తప్పక అంగీకరించాలి. శాశ్వత శాంతి భద్రతలు మానవజాతిని ఎడతెగక వంచిస్తూనే వచ్చాయి. అందువలన, నిజమైన న్యాయానికిగల కారణం నేడింకనూ తీర్చబడాలి. అయితే ఎలా?

7. శాశ్వతమైన పరిష్కారం ఎలా సాధించబడుతుంది?

7 కురుక్షేత్రమందు జరిగిందని విశ్వసించబడుతున్న దానికన్నా మరో మార్గమేమీ లేదు. అది నిజంగా శాశ్వతమైన ఫలితాలను తెచ్చే విస్తృత పరిధిలో జరిగే యుద్ధం. అయినా అది మానవజాతి భద్రపర్చబడ్తుందనే అభయాన్ని నీతిమంతులైన హతశేషులకు ఇచ్చే ఓ యుద్ధాన్ని కోరుతుంది. అలాంటి ఓ యుద్ధాన్ని గురించి ముందుగానే చెప్పబడింది. మరి ఏ సమయంలోనైనా విరుచుకుపడ్తుందని లక్షలాదిమంది ఎదురు చూస్తున్నారు. అలాంటి యుద్ధం కొరకు మానవజాతి యొక్క పరిస్థితులు సరిగ్గా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, ప్రకటన 16:14, 16లో బైబిలు ఇలా చెబుతుంది: “అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి, హెబ్రీ భాషలో హార్‌మెగిద్దోనను, చోటుకు వారిని పోగుచేసెను.”

8. అర్మగిద్దోను అంటే ఏమిటి, మరియు అది ఎంత విస్తృతంగా ఉంటుంది?

8 భూమియందంతటనున్న రాజుల సామూహిక సైనిక బలగాలన్నీ ఈ యుద్ధంలో చేరతాయని, తద్వారా అది ఓ భౌగోళికపరమైన, యావత్‌ ప్రపంచ యుద్ధం అవుతుందని బైబిలునుండి మనం గమనించవలసి ఉన్నాము. అందువలన, హార్‌-మెగిద్దోను లేక అర్మగిద్దోను అనే స్థలం కురుక్షేత్రం వలె స్థానిక యుద్ధక్షేత్రం కాదు. ఈ కారణంచేత అర్మగిద్దోననే పేరు, ఒక అక్షరార్థ స్థలాన్ని కాక మానవ రాజకీయవేత్తలు సామూహికంగా, యెహోవా అనే నామంగల దేవుని పరిశుద్ధ ఆసక్తులను వ్యతిరేకిస్తూ ఢీకొనే స్థితిని సూచిస్తూ, అది ఓ సూచనార్ధకభావాన్ని సంతరించుకుంటోంది.—కీర్తన 83:18, పరిశుద్ధ బైబిలు.

9, 10. అర్మగిద్దోను ఎందుకు అవసరం, మరియు ఎవరు నాశనం చేయబడతారు?

9 అర్మగిద్దోను సత్యం న్యాయముల కొరకు పోరాడుతుంది. దేవుని ప్రాచీన క్రైస్తవపూర్వ దైవగీతం, దేవుని ప్రముఖ యుద్ధశూరుని గూర్చి చెబుతూ మనకిలా అభయాన్నిస్తుంది: “సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును.” (కీర్తన 45:4) కురుక్షేత్ర యుద్ధంలో జరిగినట్లుగానే సామూహిక నరమేధం జరుగుతుంది. అర్మగిద్దోను యుద్ధానంతరపు “యుద్ధభూమిని” గూర్చి బైబిలిలా చెబుతుంది:

10 “భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—జనమునుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలువెళుచున్నది. ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.”—యిర్మీయా 25:31-33.

11. అర్మగిద్దోను యుద్ధ హతశేషులు ఎవరు?

11 అయితే సంతోషకరంగా, కురుక్షేత్రమందు సంభవించిందని కొందరు ప్రజలు విశ్వసిస్తున్నట్లుగా, హతశేషులు ఉంటారు. అర్మగిద్దోను యొక్క యుద్ధ హతశేషులు మన మానవజాతిని సజీవంగా భద్రపర్చేందుకు యోగ్యులుగా మన సృష్టికర్తచేత సరిదిద్దబడిన నీతిమంతులైన వ్యక్తులై ఉండాలి. అయినా, ఈ నీతిమంతులైన హతశేషులు ఆ యుద్ధంలో పాల్గొనరు. ఇది ఎలా సాధ్యమవుతుందో యెహోవా ప్రాచీన సేవకుడైన యెషయా ప్రవచించినప్పుడు చూపబడింది: “నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము. ఉగ్రత తీరిపోవువరకు కొంచెము సేపు దాగియుండుము.” (యెషయా 26:20, 21) కాబట్టి, అర్మగిద్దోను కేవలం మనుష్యులమధ్య జరిగే పోరాటమో “ప్రపంచ యుద్ధమో” కాదుగాని అది, దేవునియొక్క అదృశ్యసేనలు పాల్గొనే యుద్ధం అని స్పష్టమవుతుంది.

అర్మగిద్దోను కొరకైన సమయం

12, 13. చాలాకాలం క్రితం ఏ ప్రశ్న అడగబడింది, సత్యాన్వేషకులు నిజంగా తెలుసుకోగోరిందేమిటి?

12 దేవుని యుద్ధమైన అర్మగిద్దోను ఎప్పుడు సంభవిస్తుంది? అది ఆసన్నమైందని తెలిపే సూచన ఏమై ఉంటుంది? చాలాకాలం క్రితం యథార్థపరులైన పరిశోధకులు దీనికి సంబంధించిన ఒక ప్రశ్నను అడిగారు, వారికి లభించిన జవాబును మనం పరిశీలించడం అతి ప్రాముఖ్యమై ఉంది. వారి ప్రశ్న ఏమిటంటే: “ఈ విషయాలు ఎప్పుడు జరుగును? నీ ప్రత్యక్షతకును ఈ విధానవిషయాల సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుము.” (మత్తయి 24:3, NW) విధానవిషయాలు అనే పదబంధం గ్రీకు పదమైన ఎయాన్‌ నుండి అనువదించబడింది. ఈ మాటకు “యుగము” అనే సమానార్ధమిచ్చే పదం కొన్నిసార్లు ఉపయోగింపబడింది. కాబట్టి ది ఎంఫాటిక్‌ డయగ్లాట్‌ మత్తయి 24:3ను ఇలా అనువదించింది: “ఇవి ఎప్పుడు జరుగును? మరియు నీ రాకడకును ఈ యుగనాశనమునకును సూచన ఏమి? మాతో చెప్పుమనిరి.” మత్తయి 24:3లో సంస్కృత బైబిలు ఎయాన్‌ అనేమాటను “యుగం” అని అనువదించింది. యుగం అనే మాటకు నిర్వచనం, “లోకం యొక్క ఒక దీర్ఘకాలము” లేక “ప్రపంచపు ఒక దీర్ఘకాల పరిమితిగల సంవత్సరాలు, అట్టి యుగాలు నాల్గు ఉన్నాయి, వాటిలో మూడు యుగాలు గతించాయి, ఇప్పుడు మనమున్న యుగం కలి అనే పేరుగలది.” ఆ విధంగా 1978 నాటి న్యూ హిందీ బైబిల్‌ మత్తయి 24:3లో “యుగం యొక్క అంతం” అని అర్థమిచ్చే యుగాంతము అనే పదాన్ని ఉపయోగించింది.

13 కాబట్టి, సత్యాన్ని వెదుకుతున్న ఆ అన్వేషకులు ఇలా అడిగారు, ‘ప్రస్తుత యుగాంతము యొక్క సూచనలేవి?’ దీన్ని కొందరు కలియుగమని సూచిస్తున్నారు.

14. హిందూపారంపర్యాచారం ప్రకారం, ఈ యుగాంతం యొక్క సూచన ఏమిటి?

14 దీనికి ప్రత్యుత్తరంగా హిందూ గ్రంథమైన విష్ణు-పురాణం ఇలా చెబుతుంది: “కులం, అంతస్థు మరియు స్థితిని గూర్చిన ఆచార సాంప్రదాయాలు ఉనికియందుండవు . . . సిరిసంపదలను వృథా చేయడంలో మతం మునిగి ఉంటుంది . . . రాజులు తమ ప్రజలను కాపాడే బదులు వారిని దోచుకుంటారు మరియు పన్నులు పెంచే సాకుతో వ్యాపారస్థుల ధనాన్ని అపహరిస్తారు. అటు తర్వాత లోకం యొక్క ఆఖరి యుగంలో మానవ హక్కులు తారుమారవుతాయి. సిరిసంపదలు సురక్షితంగా ఉండవు, ఏ విధమైన సంతోషం మరియు సమృద్ధి నిరంతరం ఉండదు.” గ్రంథకర్తయైన ఏ. ఎల్‌. బాషామ్‌ ఇలా చెబుతున్నాడు: “ఎన్నో కావ్యాల ప్రకరణాల ప్రకారం, వర్గాలలో గలిబిలి, ఏర్పరచుకున్న ప్రమాణాలు ధ్వంసం చేయబడటం, అన్ని మతాచార క్రియలు ఆగిపోవడం, మరియు క్రూరమైన అన్యరాజుల పరిపాలన అనేవి కలియుగాంతాన్ని సూచిస్తాయి.” ఈ వివరణలన్నీ మన 20వ శతాబ్దపు పరిస్థితులకు కొంతమేరకు వాస్తవంగా లేవా? నాస్తికత్వపు ఆలోచనావిధానం వ్యాప్తి చెందుతుండగా, మౌలికమైన మరియు అనాధ్యాత్మిక ప్రభావాలు మానవుని పరిపాలనలను అంతకంతకు కలుషితం చేస్తున్నాయి. గర్భస్రావం మరియు సలింగసంయోగం చట్టబద్ధమైన గుర్తింపును పొందుతుండగా, ఏర్పరచబడిన ప్రమాణాలు కూలద్రోయబడుతున్నాయి, అలాగే క్రూరమైన ఉగ్రవాదం నైతిక పతనం ప్రపంచమంతటా ప్రబలుతూ, ఉరవడిని పొందుతున్నాయి.

15. ప్రస్తుత—దినపరిస్థితులు, సాంప్రదాయిక నిరీక్షణలను సఫలం చేస్తాయా?

15 దానికితోడు, పరిశ్రమలు మరియు సాంకేతిక విజ్ఞానం మానవ సమాజంలోని సాంప్రదాయిక వర్గాలను గలిబిలి చేస్తున్నాయి. పారిశ్రామిక కర్మాగారాలు, వైద్యశాలలు మరియు వైద్యవృత్తి, పెద్దపెద్ద విద్యా సంస్థలు మరి ఆధునిక ప్రజారవాణా ఏర్పాట్లు అన్ని రకాల ప్రజలను మిళితం చేస్తూ, ఎప్పటినుండో నిలిచి ఉండిన సామాజిక భేదాలను తుడిచివేశాయి. పారిశ్రామిక ప్రపంచంలో తీరికలేని జీవితం మూలంగా లక్షలాదిమంది ప్రజలు, సమయాన్ని ఎక్కువగా తీసుకునే మతాచార సంప్రదాయాలను మరియు ఆచారాలను మానుకోవడానికి సుముఖత చూపారు మరియు అంగీకరించారు. ప్రస్తుత యుగంయొక్క అంతం వేగంగా సమీపిస్తుందని ఈ పరిస్థితులు చూపిస్తున్నాయి. కాలవృత్తాంతం మాత్రమే నిర్ణయించే కారకం కాదన్నది స్పష్టం. బదులుగా, ప్రస్తుత మానవ వ్యవస్థ పతనంవైపుకు తిరుగులేకుండా ప్రయాణించడమే, దేవుడు తన అర్మగిద్దోను యుద్ధాన్ని ప్రారంభించేందుకు అత్యంత ముఖ్యకారణమైయుంది!

16. (ఎ) ఈ యుగం యొక్క “అంత్యదినముల”ను బైబిలు ఎలా వివరిస్తుంది? (బి) కుటుంబ జీవితం ఎలా ప్రభావితం చెందింది?

16 ప్రస్తుతయుగం యొక్క “అంత్యదినములు” మరియు వాటిని గుర్తించే పరిస్థితులు బైబిలులో 2 తిమోతి 3:1-5నందు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఈ వచనాలను మనం చదువుతుండగా, అక్రమాన్ని మరియు కుటుంబ విచ్ఛిన్నాన్ని దయచేసి గమనించండి. “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.” సహజమైన అనురాగం లేక కుటుంబీకుల మధ్య అనురాగం క్షీణించడం ద్వారా, పిల్లలు తలిదండ్రులకు అవిధేయులవ్వడం ద్వారా, ఇతర క్రూరమైన సూచనలచేత “అంత్యదినములు” గుర్తించబడ్డాయి. సమాజానికి మూలాధారమైన కుటుంబం విచ్ఛిన్నమైనప్పుడు, అది సమాజంపై చెడు ప్రభావాన్ని కలుగజేస్తుంది. అధికారంపట్ల అగౌరవభావం వృద్ధి అవుతుంది, అక్రమం విస్తరిస్తుంది. దైవీకశాసనాలు అలక్ష్యం చేయబడతాయి, కుటుంబాలన్నీ అక్రమాలకు పాల్పడతాయి.

17. అర్మగిద్దోను సమీపించిందని చూపే సూచనను ఏ పరిస్థితులు గుర్తిస్తాయి?

17 ఇదే ధోరణిలో భగవద్గీత ఇలా తెలియజేస్తుంది: “కులము నశించుటచే అనాదిగవచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును.” (1:40) ఈ పరిస్థితులే కురుక్షేత్ర యుద్ధాన్ని రేపాయన్నది స్పష్టమౌతుంది. అతి ప్రాముఖ్యంగా, అలాంటి పరిస్థితులు మన కాలంలో ప్రబలమై, ప్రస్తుత దుష్టవిధానం యొక్క ‘అంత్యదినములను’ సూచిస్తున్నాయి. అర్మగిద్దోను సమీపించిందనేందుకు అవి సూచనలై ఉన్నాయి. నేడు, నీతిని ప్రేమించేవారు దైవీక జోక్యాన్ని ఆహ్వానిస్తారు, అది దుష్టులను తీసివేసి, హతశేషులకు శాంతిభద్రతలను చేకూర్చుతుంది.

18. “అంత్య దినములను” గురించిన ఏ ప్రశ్నలు తలెత్తుతాయి?

18 “అంత్యదినములు” మన 20వ శతాబ్దమందు ఉన్నాయి గనుక మీరిలా అడగడం సమంజసమే, అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంతేగాక, “అంత్యదినములు” ఎంత కాలంవరకు కొనసాగుతాయి? ఒకవేళ యోగ్యులైతే వారు బ్రతికుండగల్గేందుకు, మన జీవితకాలమందే అర్మగిద్దోను యుద్ధం జరుగుతుందని ఒకరికి ఎలా తెలుస్తుంది? బైబిలులోని మత్తయి 24వ అధ్యాయాన్ని గురించిన మన చర్చను కొనసాగించడం ద్వారా మనం విశదంగా తెలుసుకోగలం. “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అనే ప్రశ్నను మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారు.

19, 20. (ఎ) బైబిలు ఏ సంఘటనలను “వేదనలకు ప్రారంభము” అని ముందుగా తెలియపర్చింది? (బి) మన ప్రస్తుతయుగం యొక్క “అంత్య దినములు” క్రీ.శ. 1914వ సంవత్సరంలో ఆరంభమయ్యాయని ఎందుకు చెప్పవచ్చు?

19 జవాబుగా ప్రవచనమిలా చెబుతుంది: “జనముమీదికి జనమును, రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును. ఇవన్నియు వేదనలకు ప్రారంభము. అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.” (మత్తయి 24:7, 8, 12) “వేదనలకు ప్రారంభ”మయిన సంవత్సరంగా, ఈ 20వ శతాబ్దంలో ఏ సంవత్సరాన్ని మీరు ప్రత్యేకించి చూపగలరు? మొదటి ప్రపంచయుద్ధం 1914లో ప్రారంభమైనది మొదలుకొని అసామాన్య రీతిలో బాధలు ప్రారంభమై, అంతకుముందు ఎన్నడూ లేనంత విస్తృతంగా, అవి తీవ్రంగా పెరిగాయన్నది వాస్తవం కాదా? మరి 1914 నుండి అంతకుముందు ఎన్నడూ లేనంత అధికస్థాయిలో యుద్ధంవలన లక్షలాదిమంది ప్రజలు దౌర్భాగ్యస్థితికి, బాధలకు మరియు మరణానికి గురౌతున్నారు. ఒకవేళ యుద్ధంవలన మరణించకపోయినా, ఆహారకొరతవలన లక్షలాది మంది చనిపోయారు, ఆహారకొరతవలన చనిపోనియెడల భూకంపం, అంటువ్యాధులు, అక్రమం, క్రూరమైన ఉగ్రవాదం మూలంగా మరణించారు. నేడు అధిక సంఖ్యాకుల మనస్సులలోనుండి దేవుని ఎడల మరియు పొరుగువాని ఎడల ప్రేమ పూర్తిగా చెరిగిపోయింది. ఇంత తక్కువ వ్యవధిలో మానవజాతి చరిత్రలో క్రితమెన్నడు ఇంత అత్యధికమైన స్థాయిలో మానవులు మిక్కుటమైన బాధల్ని గూర్చి నాస్తికత్వాన్ని గూర్చి చింత కలిగి ఉండలేదు!

20 నిశ్చయంగా, 1914వ సంవత్సరం చరిత్రలో అత్యంత గొప్ప మలుపు రాయి! ఒక వార్తాపత్రిక సంపాదకీయం ఇటీవలే ఇలా ప్రకటించింది: “1914వ సంవత్సరానికి పూర్వం ఆనందాతిశయాలతో జీవించినవారి క్షీణించిపోయే తరాన్ని ఎవరూ కాపాడలేరు. అయితే వారు ఆ దినాలకు మరియు ఈ దినాలకు మధ్యగల విచారకరమైన వ్యత్యాసాన్ని చెప్పగలరు.” కాబట్టి, ప్రస్తుతయుగం యొక్క “అంత్యదినములు” క్రీ.శ. 1914వ సంవత్సరంలో ఆరంభమయ్యాయి.

21. ఈ “అంత్యదినములు” ఎంతకాలం వరకు కొనసాగుతాయి, అర్మగిద్దోను యుద్ధం అపాయకరంగా ఎందుకు తప్పనిసరిగా సమీపించి ఉంది?

21 ఈ “అంత్యదినములు” ఎంత కాలంవరకు కొనసాగుతాయి? బైబిలు ఇలా జవాబిచ్చింది: “ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకును ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 24:33, 34 ఇటాలిక్కులు మావి.) ఇతర మాటల్లో చెప్పాలంటే, ఆ 1914 తరానికి చెందిన ప్రజలు ఎవరైతే ఇప్పుడు ‘క్షీణిస్తున్నారో,’ ఎవరైతే ఈ దుఃఖకరమైన సంగతుల ప్రారంభాన్ని చూశారో వారు దేవుని యుద్ధమైన అర్మగిద్దోను జరిగినప్పుడు ఇంకా జీవించే ఉంటారు. కాబట్టి ఒక మానవ తరానికే అంటే 1914లో జీవించి ఉండిన తరంవరకే “అంత్యదినముల” వ్యవధి పరిమితమై ఉంది. ఆ సంగతులను చూచిన ఆ తరానికి చెందినవారు—ఇప్పుడు 70 మరియు 80 పడుల్లో ఉన్నారు. అందువలన అర్మగిద్దోను యొక్క ప్రారంభం అపాయకరంగా సమీపిస్తుంది. ప్రపంచమంతటానున్న నీతిని ప్రేమించే అనేకులు ఆకస్మికంగా రానున్న దేవుని అనివార్యమైన యుద్ధం కొరకు ఇప్పుడు సిద్ధపడుతున్నారు.

22. దుష్టులు ఎప్పుడు నాశనమౌతారనే దాని గురించి బైబిలు, భగవద్గీత ఏమి సూచిస్తున్నాయి?

22 అర్మగిద్దోను సంభవించే సంవత్సరాన్ని సరిగ్గా ముందే తెలపడం సాధ్యమౌతుందా? లేదు. బైబిలు సరళంగా ఇలా చెబుతుంది: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (ఎరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్తయి 24:36) భగవద్గీత సహితం ఆ సంవత్సరాన్ని తెలపడం లేదు. భగవద్గీత కేవలం ఇలా చెబుతుంది: “ఓ భరతా (అర్జునా), ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధియగుచుండునో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును (నేను అవతరించుచుందును). సాధు, సజ్జనులను సంరక్షించుటకొఱకును, దుర్మార్గులను వినాశమొనర్చుట కొఱకును, ధర్మమును లెస్సగ స్థాపించుట కొఱకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును. [యుగే యుగే].” (4:7, 8) కాబట్టి, నీతి నానాటికి క్షీణిస్తున్నప్పుడు అవినీతి ప్రబలమౌతున్నప్పుడు దైవీకజోక్యం అపేక్షించవలసి ఉందని అనేకులు నమ్ముతున్నారు. దుష్టుల మీద దేవుడు తన న్యాయవిధులను అమలులోనికి తెచ్చేసమయం ఆసన్నమైంది!

అర్మగిద్దోను యొక్క చారిత్రాత్మకమైన భవిష్యత్‌ జ్ఞానం

23. చారిత్రాత్మకమైన ఏ సంఘటన అర్మగిద్దోనుకు ముంగుర్తు నిచ్చింది?

23 అర్మగిద్దోనులో ఏమి సంభవిస్తుందని అపేక్షించవచ్చో తెలుసుకోవడానికి చరిత్ర మనకెంతో సహాయం చేస్తుంది. నోవహు యుగంనాటి మహాజలప్రళయం, సమీపిస్తున్న దేవుని యుద్ధానికి ముంగుర్తైవుంది. చారిత్రాత్మకమైన జలప్రళయాన్ని గూర్చి ప్రపంచమంతటా 90 కంటే ఎక్కువ భిన్నమైన కథలు ఉన్నాయి. హిందువులమధ్య, ఇది జలప్రళయం అని తెలియబడుతుంది. జలం అంటే “నీరు” అని అర్థం, ప్రళయం అంటే “నాశనం,” కాబట్టి “నీటి ద్వారా నాశనం.” జీవంగల ప్రాణులన్నీ జలప్రళయంలో నశించాయని విశ్వసించబడుతుంది. అయితే, మను తన దేవుని అనుగ్రహంపొంది తను, తనతోపాటు ఏడుగురు ఋషులు (సాధువులు), మొత్తం ఎనమండుగురు రక్షించుకోవడానికి ఒక ఓడను నిర్మించుకోవాలని ముందుగా హెచ్చరించబడ్డాడు. ఉత్తరంవైపు ఒక పర్వతంపై ఆ ఓడ నిలిచినప్పుడు, ప్రవాహమట్టం తగ్గిపోయింది, ఈ ప్రస్తుతయుగంలో తన దైవానికి మొదటి బలి అర్పించడానికి మను బయటకు వచ్చాడు. మానవజాతికి ధర్మశాస్త్రాన్ని మొదట నియమించినది మను అని విశ్వసించబడుతుంది. వాస్తవానికి, తర్వాత వచ్చే ప్రతి మానవజాతి యొక్క పూర్వికుడు మను అని పిలువబడ్డాడని వివిధ హిందూ కథనాలు స్థిరంగా తెలియజేస్తున్నాయి.

24, 25. హిందూమత జలప్రళయ ఇతిహాసానికి మరియు బైబిల్లో వ్రాయబడి ఉన్న జలప్రళయానికి ఏ సంగతులలో పోలికలు ఉన్నాయి?

24 మనుకు హెచ్చరిక ఇచ్చి, జలప్రళయంలో అతన్ని కాపాడినది విష్ణు దేవుడని ఒక హిందూ గ్రంథం చెబుతుంది. ఆసక్తికరంగా, విష్ణువు అనేమాటలో “వి” అనే శబ్దం లేకపోతే (అనగా ఆరవ అక్షరం డిగమ్మ లేకుండ) ఇష్‌-నుహ్‌ అవుతుంది, కల్దీయుల భాషలో ఈ మాటకు, “నోవహు అను మనుష్యుడు” లేక, “విశ్రమించువాడు” అని అర్థము. సముద్రంపై చుట్టుకొని తేలుతున్న శేషుడు అని పిలువబడే పాముపై విష్ణువు ‘విశ్రమించాడని’ లేక నిద్రించాడని హిందూ పురాణంలో ఉంది. శేషు అంటే “మిగిలినది” అని అర్థం, జాగ్రత్తగల పరిశోధకుల ప్రకారం, ఒక యుగాంతమందు విశ్వం నాశనం చేయబడిన తర్వాత ‘మిగిలిన దాన్ని’ శేషుడు సూచిస్తాడు. జలప్రళయాన్ని గూర్చి మరియు అందులోని నివాసులతో సహా కాపాడబడేందుకు ఉన్న ఆ ఓడను గురించిన బైబిలు యొక్క చారిత్రాత్మకమైన వృత్తాంతాన్ని ఈ ఇతిహాసం సూచిస్తుందన్నది స్పష్టం.

25 మనులో గోచరమౌతున్న పురాణ సంబంధ వ్యక్తి—జలప్రళయాన్ని తప్పించుకోవడం, ప్రస్తుత మానవ వంశానికి పూర్వికుడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవారిలో మొదటివాడు జలప్రళయం తర్వాత మొదటి మత సంబంధ బలి అర్పించిన వ్యక్తి—ఇవన్నీ కూడా బైబిలు యొక్క నోవహు జీవితంలోని కొన్ని సంఘటనలను సహేతుకంగా దృఢపరుస్తున్నాయి. (ఆదికాండము 6:8, 13-22; 8:4, ఆదికాండము 8:18-9:7; 10:32 పోల్చండి.) అంతేకాక, ప్రేరేపిత లేఖనాల నివేదికలోని కొన్ని ముఖ్య విషయాలను జలప్రళయాన్ని గూర్చిన హిందూ వృత్తాంతం అంగీకరిస్తుంది, అవేవంటే, (1) కొంతమంది హత శేషుల కొరకు ఒక ఆశ్రయస్థానం, (2) నీళ్లవల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాణుల నాశనం, (3) మానవజాతి సంతానం భద్రపర్చబడడం.

26. (ఎ) జలప్రళయానికి ముందున్న పరిస్థితులను బైబిలు ఎలా వర్ణిస్తుంది? (బి) చరిత్రలోని గొప్ప జలప్రళయానికి, దేవుని యుద్ధమైన అర్మగిద్దోనుకు సంబంధించిన పరిస్థితులలో ఎటువంటి పోలికలున్నాయి?

26 అర్మగిద్దోనుయొక్క ఈ చారిత్రాత్మక ముంగుర్తును గూర్చి బైబిలిలా తెలియజేస్తుంది: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవువరకు ఎరుగకపోయిరి; అలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.” (మత్తయి 24:37-39) కాబట్టి, అర్మగిద్దోనులో మన లోకవిధానపు అంతానికి సంబంధించిన పరిస్థితులు, ఆ ప్రాచీనకాల జలప్రళయంతో సంబంధమున్న పరిస్థితుల్ని పోలి ఉంటాయి. అవేమంటే: (1) భూగ్రహం, దానిమీదున్న జంతువులు తప్పించబడతాయి; (2) జీవితంలోని సాధారణ ప్రక్రియల్లో పూర్తిగా మనస్సు నిలిపినందుకు చాలామంది ప్రజలు మన కాలాల ప్రాముఖ్యతను గుర్తించలేరు; (3) అర్మగిద్దోనును గూర్చిన దైవీక హెచ్చరికను మానవుల్లో అనేకులు నిర్లక్ష్యం చేస్తున్నారు; (4) అందువలన మానవజాతిలో అధికసంఖ్యాకులు అర్మగిద్దోనులో నశిస్తారు; మరియు (5) మానవజాతిలో కొద్దిమంది మాత్రమే దేవుని అనుగ్రహానికి పాత్రులై “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధములో” హతశేషులౌతారు. (ప్రకటన 16:14) తదనుగుణంగా, దేవుని యుద్ధాన్ని గూర్చిన మరియు ఆ యుద్ధంలో మరణించకుండ ఎలా తప్పించుకోవాలి అనే విషయాలను గూర్చిన ఈ సందేశాన్ని పరిశీలించడం బుద్ధిగల వ్యక్తులకు ఎంతో యుక్తమై ఉంది.

హతశేషుల్లో ఉండే వారెవరు?

27. అర్మగిద్దోను యుద్ధ హతశేషులయ్యేందుకు, ఏ సంగతులను గూర్చి మనం తెలుసుకోవాలి?

27 కార్యసిద్ధికి మరియు బుద్ధిగల పనికి నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని అర్జునునికి సలహా ఇవ్వబడింది. భగవద్గీత ఇలా చెబుతుంది: “అట్టి జ్ఞానమును నీవు తత్త్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారముచేసియు, సమయముచూచి వినయముగ ప్రశ్నించియు, సేవచేసియు, వారి వలననెఱుగుము. వారు తప్పక నీకుపదేశింపగలరు.” (4:34) అంతకుముందే, చేపట్టవలసిన బుద్ధిగల మార్గమేదో జెఫన్యా 2:3నందు బైబిలు ఈ విధంగా స్పష్టం చేసింది: “దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి: మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” అర్మగిద్దోను యెహోవా యుద్ధమన్నది స్పష్టము. కాబట్టి, యెహోవాను గూర్చి, ఆయన నీతిని గూర్చి, ఎవరు తెలుసుకుంటారో వారే అర్మగిద్దోను హతశేషులు. అయితే, యెహోవా ఎవరు? ఆయనను గూర్చిన జ్ఞానాన్ని మనమెలా సంపాదించుకోగలం?

28. ఋగ్వేదంలో దేవుని గుర్తింపును గూర్చిన ఏ ప్రశ్న ఉత్పన్నమైంది?

28 పైన చూసిన విధంగా, జ్ఞానం యొక్క ప్రాముఖ్యత భగవద్గీతలో నొక్కి వక్కాణించబడింది. హిందువులు మతపరమైన జ్ఞానం అతి ప్రాముఖ్యమని ఎల్లప్పుడు పరిగణించారు. వేదం అంటేనే జ్ఞానమని అర్థం. కాబట్టి, నాల్గు వేదాలు దైవజ్ఞానాన్ని కలిగి ఉన్నాయని చెప్పబడుతుంది. హిందూజ్ఞానం యొక్క ప్రాచీన గ్రంథసంచయం ఋగ్వేదము, దీనిలో చాలామట్టుకు క్రీ.పూ. మొదటి సహస్రాబ్దపు తొలి అర్ధభాగంలో సంకలనం చేయబడింది. దీని తదుపరి సంకలన దశ సమయంలో, ఋగ్వేదం యొక్క కవులు దేవుని గుర్తింపును గూర్చి ఆశ్చర్యపోవడం ప్రారంభించారు. కాబట్టి, ఋగ్వేదంలోని 10. 121వ శ్లోకానికి “తెలియబడని దేవునికి” అన్న పైవిలాసం ఇవ్వబడింది. దీనిలోని ప్రతివచనం, “మనం బలులు అర్పింపవలసిన దేవుడెవరు?” అనే ప్రశ్నతో ముగుస్తాయి. ఉదాహరణకు, 9వ వచనం ఇలా చెబుతుంది: “ఎవరైతే భూమిని ఆకాశాలను సృష్టించాడో ఆ నీతిమంతుడు మమ్ములను బాధించకుండును గాక, ఆయన వెలుగును బలమైన జలాలను కలుగజేసెను. మనం బలి అర్పింపవలసిన దేవుడెవరు?

29. దేవుని గురించి ప్రాచీన హిందువులు కొందరు ఏమని గుర్తించారు?

29ఋగ్వేదంలోని ఈ ప్రశ్నకు సత్యమైన ప్రత్యుత్తరమేమైయుంది? వేదాలు వ్రాసిన కవులు తమకు తెలియకుండా దైవభక్తిని అర్పించిన, భూమ్యాకాశాలను కలుగజేసిన ఆ ప్రారంభకుడెవరు? ప్రత్యుత్తరమిచ్చేందుకు ప్రయత్నిస్తూ, వందలాది సంవత్సరాలుపట్టే మతపర పురోభివృద్ధిని గూర్చి భగవద్గీత ఇలా వ్యక్తం చేసింది: “మీరు పరబ్రహ్మస్వరూపులు, పరంధాములు, పరమపావనరూపులు. మిమ్ము నిత్యులుగను, ప్రకాశస్వరూపులుగను, పరమపురుషులుగను, ఆదిదేవులుగను, జన్మరహితులుగను, సర్వవ్యాపకులుగను, మిమ్ము మీరే యెఱుగుదురు.” (10:12, 15) అందువలన, కొందరు ప్రాచీన హిందువులు, నిరంతరం ఉండే, సర్వోన్నతుడైన దేవుడు, దేవుళ్లలో మొదటివాడు, దేవుళ్లకు దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడని గుర్తించారు.

30-32. (ఎ) దేవుని శాశ్వతత్వాన్ని యస్‌. రాధాక్రిష్ణన్‌ ఏ వాక్యంతో వర్ణించాడు? (బి) ఈ వాక్యం ద్వారా బైబిలు ఎవరిని సూచిస్తుంది?

30 ప్రఖ్యాత హిందూమత తత్వవేత్తయైన యస్‌. రాధాక్రిష్ణన్‌, బ్రహ్మ యొక్క అపారమైన సహజ లక్షణాన్ని గూర్చి విశదపర్చేందుకు ప్రయత్నిస్తూ ఇలా అన్నాడు: “‘నేను ఉన్నవాడను అనువాడనైయున్నాను’ అని మాత్రమే మనం చెప్పగలం.” డాక్టర్‌ రాధాకృష్ణన్‌ ఈ విధంగా బ్రహ్మ యొక్క అపారమైన సహజలక్షణాన్ని, యెహోవా అను దేవుని నామాన్ని గూర్చిన బైబిలు నిర్వచనానికి జతచేసి చెబుతున్నాడు, అది నిర్గమకాండము 3:13, 14లో ఇలా చెబుతుంది: “మోషే—చిత్తగించుము నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి—మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు—ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని నడిగెను. అందుకు దేవుడు—నేను ఉన్నవాడను అనువాడనై యున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన—ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.”

31పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము అనే మరింత కచ్చితమైన, ఆధునిక ఆంగ్ల బైబిలు నిర్గమకాండము 3:14, 15నందు ఈ క్రింది విధంగా చెబుతుంది: “అందుకు దేవుడు మోషేతో ఇట్లనెను: నేనెట్లు నిరూపించుకొనకోరుదునో అట్లు నిరూపించుకొందును. నేను ఉన్నవాడను అనువాడనై యున్నానని మరియు ఆయన: “నేను నిరూపించుకొందును” అనువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.” ఆ పిమ్మట మరియొకసారి దేవుడు మోషేతో ఇట్లనెను:

32 “మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని” నీవు ‘ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. తరతరములకు ఇది నా జ్ఞాపకార్థకనామము.’

33. యెహోవా దేవుని మహత్తయిన లక్షణాలేవి?

33 కాబట్టి, బ్రహ్మయొక్క శాశ్వతత్వాన్ని వర్ణించేందుకు డాక్టర్‌ రాధాకృష్ణన్‌, ‘నేను ఉన్నవాడను అనువాడను అయియున్నాను’ అనే మాట ఉపయోగించడంలో సర్వోన్నతుడైన బ్రహ్మను బైబిలులో తెలియపర్చబడిన యెహోవా దేవునితో సమానున్ని చేయడానికి ప్రయత్నించాడని అనిపిస్తుంది. బ్రహ్మను గూర్చి వర్ణింపబడిన కొన్ని లక్షణాలు, బైబిలులోని యెహోవా దేవుని లక్షణాలవలె ఉండటం వాస్తవమే. ఉదాహరణకు, క్రీ.పూ. 5 మరియు 3వ శతాబ్దాల మధ్యకాలంలో “దేవుళ్లకు దేవుడు” అని బ్రహ్మను సూచిస్తూ భగవద్గీతలో వ్రాయబడిన విషయం, క్రీ.పూ. 15వ శతాబ్దంలో అనగా క్రీ.పూ. 1473లో, ద్వితీయోపదేశకాండము 10:17లో వ్రాయబడినదానికి, అది ఒక ప్రతిధ్వనియై యుంది, అది ఇలా చదువబడుతుంది: “ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును [దేవుళ్లకు దేవుడు] పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు; ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.”

34. భూమి, ఆకాశాలను సృజించినది ఎవరు?

34యెహోవా అనేది దేవుడు తనకు తాను ఇచ్చుకున్న నామం. ఆ కారణం చేతనే బైబిలు సృష్టి కార్యం యొక్క ఘనతను యెహోవా దేవునికి ఆపాదిస్తూ ఇలా తెలియజేస్తుంది: “దేవుడైన యెహోవా భూమిని, ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజింపబడినప్పుడు వాటివాటి ఉత్పత్తి క్రమము ఇదే.” (ఆదికాండము 2:4) అందువలన, యెహోవా ‘భూమ్యాకాశాలను కలుగజేసిన ఆ ప్రారంభకుడు’ అయి ఉన్నాడు.

35. (ఎ) జలప్రళయ హతశేషులైన మన పూర్వికులు ఏ దేవునికి బలి అర్పించారు? (బి) కాబట్టి ఋగ్వేదంలోని ఆ ప్రాచీనకాలంనాటి ప్రశ్నకు జవాబేమిటి?

35 ప్రాచీన కాలంలో జలప్రళయాన్ని రప్పించి, ఆ జలప్రళయంలో భక్తిహీనులను నాశనం చేసి, నీతిమంతులైన ఎనిమిదిమంది ప్రాణములను సురక్షితంగా కాపాడినది కూడా యెహోవాయే. బైబిలిలా తెలియజేస్తుంది: “యెహోవా నోవహుతో ఇట్లు చెప్పెను: ‘ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి. ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును, నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను.’ తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.” (ఆదికాండము 7:1, 4, 5) జలప్రళయ హతశేషులైన ఆ ఎనిమిదిమంది నీతిమంతుల వంశంనుండి ప్రస్తుత మానవుల సంతతి ఉద్భవించింది గనుక మనం నేడు కృతజ్ఞతగలవారమై ఉండాలి, అదే ప్రకారం మన పూర్వికులు చూపిన మంచిమాదిరిని మనం అనుకరించాలి. జలప్రళయ హతశేషులు, తమను రక్షించిన ఓడలోనుండి భూమిమీదికి వచ్చిన తర్వాత తమ కృతజ్ఞతను వ్యక్తపర్చేందుకు వారు యెహోవాకు దహనబలిని అర్పించారని దయచేసి జ్ఞాపకముంచుకోండి. ఆ వృత్తాంతమిలా విశదపరుస్తుంది: “అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించెను.” (ఆదికాండము 8:20, 21) కాబట్టి, ఋగ్వేదంలో వ్రాయబడిన ప్రకారం, “మనం బలి అర్పింపవలసిన దేవుడెవరు?” అనే ప్రాచీనకాలంనాటి ప్రశ్నకు నిజమైన జవాబు ఇక్కడుంది.

36. (ఎ) అర్మగిద్దోను యుద్ధంలో ఎవరు మాత్రమే తప్పించబడతారు? (బి) వారికి ఏ విధంగా తెలియజేయబడుతుంది?

36 భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవాయే, అర్మగిద్దోననే మహాయుద్ధం మూలంగా ఈ దుష్టయుగానికి కూడ అంతం తెస్తాడు. యెహోవా దేవున్ని నిజంగా తెలిసికొని, యెహోవా నామంపట్ల మరియు ఆయన అసాధారణ వ్యక్తిత్వం పట్ల ఎవరైతే భక్తి పూర్వకమైన విశ్వాసాన్ని కల్గి ఉంటారో వారు అర్మగిద్దోనును తప్పించుకుని, ఆ పిమ్మట, శుభ్రంచేయబడిన భూమిమీద నివసిస్తారు. బైబిలిలా చెబుతుంది: “‘యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేయువాడెవడో వాడు రక్షింపబడును.’ [అట్లయితే] వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై—ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి, అని వ్రాయబడియున్నది!” (రోమీయులు 10:13-15, NW) పరలోకదేవుడైన యెహోవాను గురించి మరియు మానవుల యెడల కలిగివున్న ప్రేమ పూర్వకమైన ఆయన సంకల్పాలను గురించి మనం తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యమై ఉంది.

37. (ఎ) “అంతము” రాకముందు ఏ పని జరుగవలసి ఉంది? (బి) ఇప్పుడు ఇది ఏ విధంగా నిర్వర్తించబడుతుంది?

37 ఇందు నిమిత్తం అర్మగిద్దోను యుద్ధం యొక్క హెచ్చరిక సందేశాన్ని మరియు తప్పించుకోవడాన్ని సాధ్యపర్చే సువార్తను యెహోవాసాక్షులు నేడు భూమియందంతటా ప్రకటిస్తున్నారు. కాబట్టి, ఆసన్నమైన అర్మగిద్దోను యొక్క సూచనలో ఒక భాగంగా, ఈ యుగాంతానికి కేవలం కొంచెం ముందుగా ప్రపంచమంతటా సువార్తపని జరుగుతుందని ప్రవచించబడింది. ఈ సందర్భంలో మత్తయి 24:14లోగల బైబిలు ప్రవచనాన్ని మనమిలా చదువుతాం: “మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.” ప్రస్తుతం ప్రపంచమంతటా 200 కంటే ఎక్కువ దేశాల్లో, 160కి పైగా వేర్వేరు భాషల్లో అన్నిటికంటె అతిప్రాముఖ్యమైన ఈ పనిని యెహోవాసాక్షులు చేస్తున్నారు. మరియు ఇప్పుడు, జీవాన్ని కాపాడే ఈ పని మీ స్వంత గృహానికి వచ్చింది!

అర్మగిద్దోను తర్వాత—ఏమిటి?

38. ఇతిహాసం ప్రకారం కలియుగం తర్వాత ఏమి జరుగుతుంది?

38 కలియుగం తర్వాత కృతయుగం వస్తుందన్నది చాలామంది ప్రజల నమ్మకం. కృతయుగం “స్వర్ణ యుగమని” చెప్పబడింది. అప్పుడు, లోకంలో కీడు ఉండదు, మానవులందరూ ఒక్క దేవునినే ఆరాధిస్తారు. ఈ యుగం సత్యయుగమని కూడా పిలువబడుతుంది, అది సత్యం ప్రసిద్ధమై ఉండే యుగం అంటే అబద్ధం పూర్తిగా లేనటువంటి శకము.

39. (ఎ) నూతన విధానంలో జీవనం క్రొత్తగా ప్రారంభించడానికి అనుకూలపర్చే ఏ పరిస్థితులను హతశేషులు కల్గి ఉంటారు? (బి) ప్రపంచమంతటనున్న ఏ పరిస్థితులను నీతి ఉత్పన్నం చేస్తుంది?

39 అర్మగిద్దోనును తప్పించుకున్న వారు నూతన మానవవిధానానికి మూల సభ్యులై, నీతియెడల పట్టువిడువని భక్తి కలవారై ఉంటారు. అర్మగిద్దోను భూమిపై ఉన్న సమస్త అవినీతిని తీసివేసి భూమిని పరిశుభ్రం చేస్తుంది, మానవజాతి నూతనంగా మళ్లీ ప్రారంభమౌతుంది. కాబట్టి దేవుని వాక్యమిలా చెబుతుంది: “మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) అప్పుడు భూమిపై నివసించే వారి పాపాలను, అసంపూర్ణతలను, మానసిక మరియు శారీరక బలహీనతలను స్వస్థపర్చేందుకు బలి సంబంధమైన తన ఏర్పాట్లను యెహోవా దేవుడు అన్వయిస్తాడు. తుదకు, పరదైసు భూమిపై జీవించే హక్కు యథాస్థాయికి పూర్తిగా తేబడుతుంది. దారిద్ర్యం, అధిక ధరలు, ఆకలి బాధలు, గృహాలు లేకపోవడం, క్రిక్కిరిసి ఉండే మురికి వాడలు, వికృతరూపం కల్గించే కుష్టరోగం, క్షీణింపజేసే రోగాలు, శిశు మరణాలైనా, ఆసుపత్రుల అవసరతయైనా అక్కడ ఇక ఉండవు. బానిసలలా బలవంతాన కష్టంచేసే శ్రామికులుండరు, కూలివారుండరు, నిరుద్యోగం ఉండదు, భిక్షమెత్తుకొని బ్రతికే వారుండరు, కులవర్గ భేదాలుండవు, జీవితంలో హెచ్చుతగ్గులుండవు. దానికి ప్రతిగా, మంచి ఆరోగ్యం, నిత్య యౌవనం, సమృద్ధిగా ఉండే మంచి ఆహారం, తృప్తికలిగించే పని, సురక్షిత పరిసరాలు అక్కడ ఉంటాయి.

40-42. నూతనయుగంలో (ఎ) ఆహార సంబంధంగా? (బి) రోగం మరియు మరణం సంబంధంగా? (సి) నివాసగృహ సంబంధంగా? (డి) ఉద్యోగ సంబంధంగా? (ఇ) క్రూరమృగాల సంబంధంగా ఏ పరిస్థితులు విస్తారంగా ఉంటాయి?

40 బైబిలు ప్రవక్తయైన యెషయా ఇచ్చే హృదయానందకరమైన హామీలను కొన్నింటిని మీ అంతట మీరే చదవండి. ఆయనిలా వ్రాశాడు: “ఈ పర్వతము మీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును. మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును. సమస్తజనములమీద పరచబడిన తెరను ఈ పర్వతముమీద ఆయన తీసివేయును. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును. భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.” “[ఆ సమయములో] గ్రుడ్డివారి కన్నులు తెరువబడును. చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును.”—యెషయా 25:6-8; 35:5, 6.

41 యెషయా ఇంకనూ ఇలా వ్రాశాడు: “ఇదిగో నేను [యెహోవా] క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు వారు కట్టుకున్న యిండ్లలో వేరొకరు కాపురముండరు; వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును. నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృథాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు; వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు, వారి సంతానపువారు వారియొద్దనే యుందురు. వారికీలాగున జరుగును—వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను; వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.”—యెషయా 65:17, 21-24.

42 “తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును, సింహము ఎద్దువలె గడ్డి తినును; సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”—యెషయా 65:25.

43, 44. (ఎ) చనిపోయిన మన పూర్వికులకు మరియు ముందుండినవారికి ఏమి సంభవిస్తుంది? మరియు దేని మూలంగా? (బి) అద్భుతమైన ఈ ఆశీర్వాదాలను ఎవరు అనుభవిస్తారు?

43 చనిపోయినవారు సహితం జ్ఞాపకం చేసుకోబడతారు. అన్ని మతాలకు మరియు అన్ని వంశాలకు చెందిన లెక్కలేనన్ని లక్షలాది మంది తమ మరణనిద్రనుండి జీవానికి తేబడతారు. ఇది, ఆత్మ పరకాయ ప్రవేశం లేక పునర్‌జన్మ కాదు. మారుగా, సర్వ శక్తిమంతుడైన దేవుడు వారిని పునఃసృష్టిస్తాడు, ఎప్పటికిని మరచిపోనటువంటి జ్ఞాపకాలనుండి వారివారి మొదటి జీవన నమూనాలను మరియు వ్యక్తిత్వాలను ఇస్తాడు గనుక వాళ్ళను ప్రేమించేవారు వారిని గుర్తుపట్టగల్గుతారు. ఎంతటి ఆనందమో! నిత్య దైవీక సంకల్పంలో పరిపూర్ణంగా పునరావాసం పొందే అవకాశం పునరుత్థానం చేయబడిన మృతులకు ఇవ్వబడుతుంది. బైబిల్లో రూఢిగా ఇలా వ్రాయబడింది: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [దేవుని కుమారుని] శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.

44 ఈ అద్భుతాలన్నీ మీరు కోరుకునేవే కాదా? అవి మీ హృదయపూర్వకమైన అభిలాషలు కాదా? ఈ ఆనందాన్ని మరియు ఈ అనుగ్రహాన్ని మీరు వ్యక్తిగతంగా అనుభవించగలరు. వేగంగా సమీపిస్తున్న అర్మగిద్దోను యుద్ధ హతశేషుల కొరకు దాచబడిన దీవెనలు ఇవే.

45, 46. ఈ వాగ్దానాలు నమ్మదగినవని మనమెలా నిశ్చయత కలిగి ఉండవచ్చు?

45 అయితే, అర్మగిద్దోను తర్వాతి లోకాన్ని గూర్చిన ఈ ప్రమాణాలు నమ్మదగినవేనా? అర్మగిద్దోను ఒక కల్పిత కథ కాదని మనమెలా నిశ్చయతను కలిగివుండగలం? ఎందుకంటే,—ప్రాచీనకాల జలప్రళయం ఒక కల్పిత కథ కాదు. మానవుడు కల్పిత కథ కాదు. మానవుని సృష్టికర్తయైన దేవుడు కల్పిత కథ కాదు! ఈ వాగ్దానాలు నిజమని మనం రూఢిగా నమ్మవచ్చు, ఎందుకంటే దేవుడు అబద్ధమాడనేరడు. (తీతు 1:2) ఆలోచించండి! దయ మరియు ప్రేమపూర్వకమైన తలిదండ్రులను చిన్న పిల్లలు ఎందుకు నమ్ముతారు? చిన్నపిల్లలు, సాధారణంగా, తమ తలిదండ్రుల ప్రేమపూర్వక శ్రద్ధను అనుమానించేందుకు తమతో సహవసించే వారిచే ఒత్తిడి చేయబడరు. చిన్నపిల్లలు తమ తలిదండ్రుల వాగ్దానాలను అనుమానించేందుకు కారణమేమీ ఉండదు. తమ తలిదండ్రులు వారిని పోషించినందు వల్లనేకదా వారు ఇంతవరకు వచ్చారు? కాబట్టి, మానవ తత్వాల మరియు వాగ్దానాల విఫలత, ఆశాభంగాలు, మానవజాతిపట్ల దేవునికున్న ప్రేమపూర్వక శ్రద్ధయందు మీరు విశ్వాసాన్ని కోల్పోయేలా చేసేందుకు అనుమతించకండి. అందుబాటులో ఉన్న రుజువులను దయచేసి పరిశీలించండి. దేవుని వాగ్దానాలపై మీరు నిలిపిన నిరీక్షణ తప్పుగా నిలుపబడినది కాదని దృఢనిశ్చయత కల్గి ఉండండి. అర్మగిద్దోను యుద్ధం చేసేందుకు, నూతన విధానాన్ని సృజించేందుకు అవసరమైన బుద్ధి, శక్తి మరియు ఇష్టత కేవలం యెహోవాకు మాత్రమే ఉన్నాయి. యెహోవా ఓదార్పునిస్తూ, ఇలా హామీ ఇస్తున్నాడు:

46 “దేవుడు తానే వారి దేవుడై యుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను . . . అప్పుడు సింహాస నాసీనుడై యున్నవాడు—ఇదిగో! సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు,—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని . . . చెప్పుచున్నాడు.”—ప్రకటన 21:3-5; హెబ్రీయులు 6:18 పోల్చండి.

47. దేవుని నూతన విధానం యొక్క శాశ్వతత్వాన్ని చెడగొట్టని “కాలం” విషయం ఏమిటి?

47 అయినా, ఈ మంచి విషయాలు ఎంతకాలం వరకు నిలిచి ఉంటాయి? కొందరు చెబుతున్నట్లు మరొక యుగం వరకేనా లేక ఒక కాలచక్రం వరకేనా? అదెందుకలా ఉండాలి? కాలం చక్రంలా తిరుగదు. కాలానికి ఒక దిశే ఉంది—అది ముందుకే. కాలం అనేది కేవలం అవ్యక్తమైనది, అదొక సంక్షిప్త పదము. కాలం దానియందుగల అస్థిరత్వాల నడకలపై ప్రభావాన్ని చూపలేదు. ఒక శకాన్ని, లేక యుగాన్ని గుర్తుచేసే విశిష్టలక్షణాలు బయటనున్న తెలివిగల శక్తులచేత ఉత్పన్నం చేయబడుతున్నాయి. కాబట్టి చెడుప్రభావాలన్నీ, చెడుశక్తులన్నీ శాశ్వతంగా నాశనం చేయబడినప్పుడు, మంచితనం కొరకైన ఒకే శక్తితో శాశ్వతత్వం నింపబడి ఉంటుంది.

48. నూతన విధానం యొక్క కాలపరిమితిని సర్వోత్కృష్టంగా నిర్ణయించేదేమిటి?

48 అయినా, రాబోయే విధానం యొక్క కాలపరిమితిని నిర్ణయించేది ముఖ్యంగా ఒక రకమైన సార్వత్రిక, స్వయం చలనంగల గడియారం కాదుగాని, అది దేవుని చిత్తమై ఉంది. కాబట్టి, ఎంతకాలంవరకు ఈ మంచి సంగతులు నిలిచి ఉంటాయో మనం నిజంగా తెలుసుకోవాలనుకుంటే, మనం నిజంగా అడిగేదేమంటే, ‘భూమి ఎడల మానవులయెడల దేవుని చిత్తమేమై ఉంది?’

49. భవిష్యత్తు సంబంధమైన దేవుని చిత్తాన్ని గూర్చి ఎక్కడనుండి మాత్రం మనం నేర్చుకొనగలం? ఏ ఇతర సమాచారాన్ని ఈ మూలం మాత్రమే మనకిస్తుంది?

49 పరిశుద్ధ గ్రంథాలలో దేనియందైనా మనం ఆ ప్రశ్నకు జవాబు కనుగొనగలమా? మరెక్కడైనా మనం దాన్ని కనుగొనగలమా? ఔను కనుకొనగలం, అయితే బైబిల్లో మాత్రమే దానిని కనుగొనగలం. ఋగ్వేదంలో “మనం బలి అర్పింపవలసిన దేవుడెవరు?” అని అడుగబడిన ప్రశ్నకు దేవుడిచ్చిన జవాబు బైబిల్లో ఉంది. సర్వాన్ని సృష్టించిన వాని నామం యెహోవా అని బైబిలు మనకు చెబుతున్నది. చరిత్ర అంతటిలో మానవజాతితో దేవుని వ్యవహారాలను గూర్చిన స్పష్టమైన వృత్తాంతాన్ని బైబిల్లో మాత్రమే మనం కల్గి ఉన్నాం. మన కాలంలో—అంటే అంత్య దినాల్లో ఉండబోయే సంగతులను గూర్చిన స్పష్టమైన చిత్రాన్ని మనకు ఇస్తున్న ఏకైక పరిశుద్ధ గ్రంథం కూడా బైబిలే. భవిష్యత్తు కొరకైన దేవుని చిత్తమేమై ఉందో బైబిలు మనకు విశదంగా తెలియజేస్తుంది.

50. దేవుని చిత్తాన్ని గూర్చిన జ్ఞానం ఏ ఆశ్చర్యకరమైన భవిష్యత్‌ దృష్టిని మనకు కలుగజేస్తుంది?

50 మరి యెహోవా దేవుడు ఇచ్ఛయించినది నిజంగా అద్భుతమైనది. బైబిలు ప్రకారం ఒక నీతియుక్తమైన విధానాన్ని స్థాపించాలని ఆయన ఇచ్ఛయించాడు, అది కేవలం ఒక శకం, లేక యుగం వరకు నిలిచి ఉండటం కొరకు కాదుగాని అది నిత్యమూ నిలిచి ఉంటుంది. ఆ ఏర్పాటు యొక్క ఆశీర్వాదాలను అనుభవించే అవకాశం మనలో ప్రతి ఒక్కరికి అందించబడింది. (కీర్తన 37:10, 11, 27-29) దేవుని ఎడల తమ విశ్వాసాన్నిబట్టి కుటుంబాలచేత విడిచి పెట్టబడిన కొందరిని గురించి, ‘వారిలో ప్రతివాడును నూరు రెట్లు ఈ కాలములో పొందును, ఇదిగాక రాబోయే విధానములో భూపరదైసు నందు నిత్యజీవమును స్వతంత్రించుకొనును’ అని బైబిలు చెబుతుంది.—లూకా 18:29, 30; హబక్కూకు 2:14.

51. మానవజాతి ఏ విధంగా మాత్రమే నిజమైన న్యాయాన్ని, తృప్తిని అనుభవించగలదు?

51 ఇతిహాసం ప్రకారం—కురుక్షేత్ర మహాయుద్ధం జరిగిన కాలంనుండి, వాస్తవంగా, ఎంతో చరిత్ర గడిచిపోయింది. ఆ కాలంలో జరిగిన ఎన్నో యుద్ధాలచేత, అన్యాయాన్ని తీసివేసి సమాధానాన్ని కాపాడేందుకు మానవుడు చేసిన ప్రయత్నాల వలన మానవుని సంతోషం క్షీణించింది మరియు అవన్నీ చాలావరకు అపజయాన్నే ప్రతిఫలింపజేశాయి. నిత్య సంతోష సమాధానాలు మానవ ప్రయత్నాలవల్ల రాలేదన్నది విచారకరము. ఎందుకు? ఎందుకంటే, అసమానమైన పుస్తకమగు పరిశుద్ధ బైబిల్లో తెలియపర్చబడిన రీతిగా యెహోవా దేవుని సలహాను అనుకరిస్తే అట్టి ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి, ఇప్పుడు మీరేమి చేస్తారు?

52. ఇప్పుడు ఏమి చేయడంవలన యెహోవా యొక్క అర్మగిద్దోను యుద్ధదినంలో మీరు దాచబడవచ్చు?

52 ‘యెహోవాను వెదకుడి’ మరియు ‘నీతిని, వినయాలను వెదుకుడి’ అనే దైవీక ఆహ్వానాన్ని మీరు స్వీకరిస్తారా? మీరు స్వీకరించినట్లయితే, ‘ఒకవేళ ఆయన ఉగ్రతదినమున మీరు దాచబడవచ్చు.’ మీరు అలా చేయాలని మరియు “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధ”మైన అర్మగిద్దోను హతశేషులైన ధన్యులలో మీరు ఒకరై ఉండాలన్నది మా ప్రార్థన.—జెఫన్యా 2:3; ప్రకటన 16:14, 16.

[అధ్యయన ప్రశ్నలు]

1. అనేకుల సహజ అభీష్టమేమిటి, అయితే దానిని పొందడం ఎందుకు కష్టమై ఉంది?

[Box/Picture on page 14]

అన్నీ ఒకే తరంలో

1914

ప్రపంచ యుద్ధాలు

హింసాత్మక నేరాలు

విపరీతమైన కరవులు

అంటువ్యాధులు

భూగోళవ్యాప్త కాలుష్యం

ఈ విధానాంతం

[7వ పేజీలోని చిత్రం]

భూమిని శుభ్రం చేయడానికి అర్మగిద్దోను యావత్‌ప్రపంచ యుద్ధమై ఉంటుంది

[9వ పేజీలోని చిత్రం]

అర్మగిద్దోను హతశేషులు, మానవజాతిని సజీవంగా ఉంచేందుకు మన సృష్టికర్తచేత యోగ్యులని తీర్పుతీర్చబడతారు

[24వ పేజీలోని చిత్రం]

1914 నుండి అర్మగిద్దోను యుద్ధ సూచన కనబడుతుంది

[29వ పేజీలోని చిత్రం]

విష్ణువు శేషుని మీద నిద్రించడం—హిందూ ఇతిహాసమందలి సంరక్షణా వాహనం

[20వ పేజీలోని చిత్రం]

బైబిలులో చెప్పబడిన జలప్రళయం—అర్మగిద్దోను యొక్క ముంగుర్తు

[36వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులచేత ప్రపంచమంతట ప్రకటించబడ్తున్న జీవాన్ని రక్షించేపని ఈ యుగాంతానికి ముంగుర్తయి ఉంది