23వ అధ్యాయం
ఒంట్లో బాలేకుండా ఎందుకు అవుతుంది?
ఒంట్లో బాలేకుండా ఉన్నవాళ్లు ఎవరైనా మీకు తెలుసా?— అప్పుడప్పుడు మీకు కూడా ఒంట్లో బాలేకుండా ఉండవచ్చు. మీకు జలుబు చేయవచ్చు, కడుపు నొప్పి రావచ్చు. కొంతమందికి ఒంట్లో అస్సలు బాలేకుండా ఉంటుంది. కనీసం లేచి నిలబడాలన్నా వాళ్లకు వేరేవాళ్ల సహాయం అవసరం. వయసు పైబడుతున్నకొద్దీ అలా అవుతుంటుంది.
ప్రతీ ఒక్కరికీ అప్పుడప్పుడు ఒంట్లో బాలేకుండా అవుతుంది. ప్రజలు ఎందుకు అనారోగ్యంపాలై, ముసలివాళ్లయి, చనిపోతారో తెలుసా?— ఒకరోజు, కొంతమంది అస్సలు నడవలేని ఒకాయనను యేసు దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు యేసు, ప్రజలెందుకు అనారోగ్యంపాలై, చనిపోతారో వివరించాడు. దాని గురించి చెప్తాను వినండి.
యేసు గలిలయ సముద్రం దగ్గర్లోవున్న పట్టణంలోని ఒక ఇంట్లో కొంతకాలంపాటు ఉన్నాడు. చాలామంది ఆయనను చూడడానికి వచ్చారు. అక్కడ ఎంతోమంది జనం ఉండడంవల్ల ఇంకెవ్వరూ లోపలికి రావడానికి చోటు లేదు. మరెవ్వరూ కనీసం తలుపు దగ్గరకైనా రావడానికి వీల్లేకుండా పోయింది. అయినాసరే జనం వస్తూనే ఉన్నారు! పక్షవాతం వచ్చిన ఒక వ్యక్తిని కొంతమంది యేసు దగ్గరకు తీసుకొని వచ్చారు. అతను అస్సలు నడవలేకపోతుండడంవల్ల నలుగురు మనుషులు అతనిని పడక మీద మోసుకొచ్చారు.
జబ్బుపడిన ఇతనిని వాళ్లు యేసు దగ్గరకు తీసుకురావాలని ఎందుకు అనుకున్నారో తెలుసా?— యేసు అతనికి సహాయం చేయగలడని, అతనిని బాగుచేయగలడని వాళ్లు నమ్మారు. ఇంటినిండా అంతమంది జనం ఉండగా, పక్షవాతం వచ్చిన వ్యక్తిని వాళ్లు యేసు దగ్గరకు ఎలా తీసుకొచ్చారో తెలుసా?—
ఈ చిత్రాన్ని చూస్తే వాళ్లు ఎలా తీసుకొచ్చారో తెలుస్తుంది. ముందుగా వాళ్లు అతనిని ఇంటి మీదకు మోసుకుని వెళ్లారు. ఆ ఇంటి పైకప్పు బల్లపరుపుగా ఉంది. అప్పుడు పైకప్పును కొంతవరకు తీసేశారు. అక్కడి నుండి, పక్షవాతం వచ్చిన వ్యక్తిని పడకతో పాటు గదిలోకి దించారు. వాళ్లకు ఆయన మీద ఎంత నమ్మకం ఉందో!
జరుగుతున్నదాన్ని చూసి అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. పక్షవాతం వచ్చిన వ్యక్తిని పడకతో సహా వాళ్ల మధ్యలోకి దించారు. వాళ్లు చేసిన పనికి యేసు కోపగించుకున్నాడా?— అస్సలు కోపగించుకోలేదు! వాళ్లకు నమ్మకం ఉందని చూసి ఆయన ఎంతో సంతోషించాడు. ఆయన పక్షవాతం వచ్చిన వ్యక్తితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అన్నాడు.
యేసు అలా అనడం తప్పని అక్కడున్న కొంతమంది అనుకున్నారు. ఆయన పాపాలు క్షమించగలడని వాళ్లు అనుకోలేదు. అందుకే యేసు, తాను నిజంగా పాపాలు క్షమించగలనని చూపించడానికి, ‘నీవు లేచి నీ పడక ఎత్తుకొని యింటికి వెళ్లు’ అని పక్షవాతం వచ్చిన వ్యక్తితో చెప్పాడు.
యేసు అలా అనగానే అతనికి బాగైంది! అతనికి పక్షవాతం నయమైంది. అతను తనంతట తానే లేచి, నడవగలిగాడు. ఈ అద్భుతం చూసినవాళ్లంతా ఆశ్చర్యపోయారు. అంత గొప్ప అద్భుతాన్ని వాళ్ల జీవితంలో అప్పటివరకు ఎప్పుడూ చూడలేదు! ప్రజల వ్యాధులను కూడా నయం చేయగల గొప్ప బోధకుడిని ఇచ్చినందుకు వాళ్లు యెహోవాను స్తుతించారు.—మార్కు 2:1-12.
ఈ అద్భుతం నుండి మనకేమి అర్థమౌతుంది?— పాపాలను క్షమించి, వ్యాధులు నయం చేసే శక్తి యేసుకు ఉందని అర్థమౌతుంది. కానీ మనం అంతకన్నా చాలా ప్రాముఖ్యమైన మరో విషయాన్ని కూడా తెలుసుకుంటాం. మనుష్యులకు వ్యాధులు వచ్చేది పాపం వల్ల అని తెలుసుకుంటాం.
మనందరికీ కొన్నిసార్లు ఒంట్లో బాగుండదు, అంటే మనందరం పాపులమని అర్థమా?— అవును, మనందరం పాపంతోనే పుట్టామని బైబిలు చెప్తోంది. పాపంతో పుట్టడం అంటే ఏమిటో తెలుసా?— మనం అపరిపూర్ణతతో పుట్టామని అర్థం. కొన్నిసార్లు మనం ఏదైనా తప్పు చేయకూడదని అనుకున్నా చేసేస్తుంటాం. మనందరికీ పాపం ఎలా వచ్చిందో తెలుసా?—
మొదటి మనిషి అయిన ఆదాము దేవుడు చెప్పింది వినకపోవడం వల్ల మనం పాపంతో పుట్టాం. ఆయన దేవుని ఆజ్ఞ మీరినప్పుడు పాపం చేశాడు. ఆయన వల్ల మనందరికీ పాపం వచ్చింది. ఆయన నుండి మనకు పాపం ఎలా వచ్చిందో
తెలుసా? మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను వినండి.ఎవరైనా ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు చేయడం లేదా బ్రెడ్ చేసే గిన్నెలో బ్రెడ్ చేయడం మీరు చూసివుంటారు. ఆ పాత్రకు లేదా గిన్నెకు సొట్ట పడితే ఏమవుతుందో తెలుసా?— అందులో చేసే ప్రతి ఇడ్లీకీ లేదా ప్రతీ బ్రెడ్‌కూ ఆ సొట్ట వస్తుంది, అవునా?—
ఆదాము ఆ పాత్ర లేదా గిన్నెలాంటి వాడు, మనం ఇడ్లీ లేదా బ్రెడ్‌లాంటి వాళ్లం. ఆయన దేవుని ఆజ్ఞ మీరినప్పుడు అపరిపూర్ణుడయ్యాడు. అలా ఆయనకు కూడా సొట్టపడినట్లు లేదా లోపం ఏర్పడినట్లు అయ్యింది. ఆయనకు పిల్లలు పుట్టినప్పుడు, వాళ్లు ఎలా ఉంటారు?— ఆ పిల్లలందరికీ అపరిపూర్ణత వస్తుంది.
చాలామంది పిల్లల్లో, బయటకు కనిపించే పెద్దపెద్ద అపరిపూర్ణతలు ఉండవు. వాళ్లు చెయ్యో, కాలో లేకుండా పుడతారని కాదు. కానీ అపరిపూర్ణత వల్ల వాళ్లు కూడా అనారోగ్యం పాలవుతారు, కొంతకాలానికి చనిపోతారు.
అయితే, కొంతమంది వేరేవాళ్లకన్నా ఎక్కువగా జబ్బు పడుతుంటారు. ఎందుకలా అవుతుంది? వాళ్లు ఎక్కువ పాపంతో పుట్టినందుకు అలా అవుతుందా?— లేదు, పుట్టుకతో వచ్చే పాపం అందరిలోనూ సమానంగా ఉంటుంది. మనందరికీ పుట్టుకతోనే అపరిపూర్ణత వస్తుంది. కాబట్టి, ప్రతీ ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. దేవుని నియమాలన్నీ పాటించడానికి ప్రయత్నించేవాళ్లకు, చెడ్డ పనులు చేయని వాళ్లకు కూడా అనారోగ్యం వస్తుంటుంది.
మరి, కొంతమంది మిగతా వాళ్లకన్నా ఎక్కువగా ఎందుకు జబ్బుపడుతుంటారు?— దానికి చాలా కారణాలున్నాయి. బహుశా వాళ్ల దగ్గర సరిపడినంత ఆహారం ఉండకపోవచ్చు. లేదా వాళ్లు తినాల్సినవి తినకపోవచ్చు. చాక్లెట్లు, తీపి పదార్థాలు ఎక్కువగా తింటుండవచ్చు. బాగా రాత్రయ్యే వరకు మేల్కొని ఉండటం వల్ల వాళ్లకు నిద్ర సరిపోకపోవచ్చు. లేదా చలికాలంలో వెచ్చగా ఉంచే బట్టలు వేసుకోకపోవచ్చు. కొంతమంది శరీరం చాలా బలహీనంగా ఉండడం వల్ల
వాళ్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్లకు రోగాలు వస్తూనేవుంటాయి.అసలు అనారోగ్యమే ఉండని కాలం ఎప్పటికైనా వస్తుందా? మనం ఎప్పటికైనా పాపం లేకుండా ఉండగలుగుతామా?— పక్షవాతం వచ్చిన వ్యక్తికి యేసు ఏమి చేశాడు?— యేసు ఆయన పాపాలను క్షమించి, ఆయనను బాగు చేశాడు. అలా యేసు, సరైనది చేయాలని ఎంతో కష్టపడుతున్న వాళ్లందరి కోసం భవిష్యత్తులో తాను ఏమి చేయబోతున్నాడో చూపించాడు.
పాపం చేయడం మనకు ఇష్టంలేదని, చెడ్డవాటిని మనం అసహ్యించుకుంటున్నామని చూపిస్తే యేసు మనల్ని బాగు చేస్తాడు. మనలో ఇప్పుడున్న అపరిపూర్ణతను భవిష్యత్తులో ఆయన తీసివేస్తాడు. దేవుని రాజ్యానికి రాజుగా ఆయన అలా చేస్తాడు. మనలోని పాపం ఒకేసారి పోదు. మనలో ఉన్న పాపం పూర్తిగా పోవడానికి కొంతకాలం పడుతుంది. మనలోని పాపం పూర్తిగా పోయినప్పుడు, మనం ఇక ఎప్పటికీ జబ్బుపడం. మనకు పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. అప్పుడు ఎంత బావుంటుందో!
పాపం వల్ల అందరికీ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి, యోబు 14:4; కీర్తన 51:5; రోమీయులు 3:23; 5:12; 6:23 వచనాలు చదవండి.