కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

19వ అధ్యాయం

గొడవలు పడితే తప్పులేదా?

గొడవలు పడితే తప్పులేదా?

అందరిమీద అధికారం చెలాయించాలని చూసే అమ్మాయిలుగానీ అబ్బాయిలుగానీ మీకు తెలుసా?— మీరు అలాంటి వాళ్లతో ఉండడానికి ఇష్టపడతారా? లేదా ఏ గొడవల్లో తలదూర్చని సమాధానపరులతో ఉండడానికి ఇష్టపడతారా?— ‘సమాధానపర్చేవాళ్లు సంతోషంగా ఉంటారు. వాళ్లు దేవుని కుమారులు అనబడతారు’ అని మన గొప్ప బోధకుడు చెప్పాడు.—మత్తయి 5:9.

కానీ, కొంతమంది అప్పుడప్పుడు మనకు కోపం తెప్పించే పనులు చేస్తుంటారు, అవునా?— అలాంటప్పుడు వాళ్లమీద బదులు తీర్చుకోవాలని అనిపించవచ్చు. ఒకసారి యేసు శిష్యులు కూడా, ఆయనతో కలిసి యెరూషలేముకు వెళ్తున్నప్పుడు అలాగే అనుకున్నారు. అసలు ఏంజరిగిందో తెలుసుకుందాం.

వాళ్లు కొంతదూరం వెళ్లాక, వాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చోటు చూడమని చెప్పి యేసు తన శిష్యుల్లో కొంతమందిని సమరయలోని ఒక గ్రామానికి తన కంటే ముందుగా పంపించాడు. సమరయ ప్రజలు వేరే మతంవాళ్లు కాబట్టి వాళ్లు యేసుకు, ఆయన శిష్యులకు చోటు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆరాధన కోసం యెరూషలేము పట్టణానికి వెళ్లేవాళ్లను సమరయులు ఇష్టపడేవాళ్లు కాదు.

సమరయులమీద బదులు తీర్చుకోవడానికి యాకోబు, యోహాను ఏం చేయాలని అనుకున్నారు?

మీకే గనుక అలా జరిగివుంటే మీరు ఏమి చేసివుండేవాళ్లు? మీకు కోపం వచ్చివుండేదా? వాళ్లతో గొడవపడాలనుకుని ఉండేవాళ్లా?— యేసు శిష్యులైన యాకోబు యోహానులు అలాగే అనుకున్నారు. వాళ్లు యేసుతో, ‘ఆకాశం నుండి అగ్ని దిగి వీళ్లను నాశనం చేయమని మేము ఆజ్ఞాపించాలా?’ అని అడిగారు. వాళ్లు అలాంటివాళ్లు కాబట్టే, యేసు వాళ్లను ‘ఉరిమెడివాళ్లు’ అని పిలిచాడు! కానీ వేరేవాళ్లకు అలా చేయడం సరికాదని యేసు వాళ్లకు చెప్పాడు.—లూకా 9:51-56; మార్కు 3:17.

నిజమే వేరేవాళ్లు కొన్నిసార్లు మనల్ని బాధపెడుతుంటారు. కొంతమంది పిల్లలు ఆటల్లో మనల్ని తమతో కలుపుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. “నిన్ను మాతో కలుపుకోం” అని కూడా వాళ్లు చెప్పవచ్చు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే మనకు చాలా బాధ అనిపిస్తుంది కదా? అప్పుడు ఏదైనా చేసి వాళ్లతో గొడవపెట్టుకోవాలని మనకు అనిపించవచ్చు. కానీ మనం అలా చేయవచ్చా?—

మీరు మీ బైబిల్లో సామెతలు 24వ అధ్యాయం, 29వ వచనాన్ని చూస్తే దాని గురించి తెలుస్తుంది. అక్కడిలా ఉంది, ‘వాడు నాకు చేసినట్టే నేను వాడికి చేస్తానని, వాడి క్రియల చొప్పున వాడికి ప్రతిఫలమిస్తానని అనుకోవద్దు.’

దాని అర్థమేమిటో తెలుసా?— ఎవ్వరితోను గొడవపెట్టుకోవడానికి చూడకూడదని ఆ వచనం చెప్తోంది. వేరేవాళ్లు మనల్ని బాధపెట్టినందుకు మనం కూడా వాళ్లను బాధపెట్టాలని అనుకోకూడదు. కానీ, ఎవరైనా మీతో గొడవపెట్టుకోవాలని చూస్తుంటే అప్పుడు ఏంచేయాలి? మిమ్మల్ని రెచ్చగొట్టడానికి మిమ్మల్ని ఏడిపిస్తూ పేర్లు పెట్టి పిలుస్తుండవచ్చు. మీరు భయపడుతున్నారంటూ మిమ్మల్ని చూసి వెటకారంగా నవ్వుతుండవచ్చు. మీరు పిరికివాళ్లని అనవచ్చు. అప్పుడు మీరేమి చేయాలి? మీరు వాళ్లతో గొడవపడాలా?—

దీని గురించి కూడా బైబిలు ఏంచెప్తుందో చూద్దాం. ఇప్పుడు బైబిలును మత్తయి 5వ అధ్యాయం, 39వ వచనానికి తెరవండి. అక్కడ యేసు, ‘దుష్టుని ఎదిరించవద్దు; నిన్ను కుడిచెంప మీద కొట్టినవాడికి ఎడమచెంప కూడా చూపించు’ అని చెప్పాడు. ఆయన మాటలకు అర్థమేమిటి? ఎవరైనా మిమ్మల్ని ముఖంమీద ఒకవైపు గుద్దితే రెండోవైపు కూడా గుద్దించుకోవాలని ఆయన చెప్తున్నాడా?—

కాదు, యేసు అలా చెప్పాలని అనుకోలేదు. చెంపమీద కొట్టడానికి, ముఖంమీద గుద్దడానికి తేడా ఉంది. చెంపమీద కొట్టడం ఒక రకంగా చేత్తో నెట్టడం లాంటిదే. ఎవరైనా మనతో గొడవపడడానికి మనల్ని చెంపమీద కొట్టొచ్చు. మనకు కోపం తెప్పించాలని వాళ్లు అలా చేస్తారు. మనం కోపం తెచ్చుకుని వాళ్లను చేత్తో నెట్టేస్తే ఏమి జరుగుతుంది?— గొడవ మొదలయ్యే ప్రమాదం ఉంటుంది.

తన శిష్యులు వేరేవాళ్లతో గొడవపెట్టుకోవడం యేసుకు ఇష్టంలేదు. అందుకే ఆయన, మనల్ని ఎవరైనా చెంపమీద కొడితే మనం వాళ్లను తిరిగి కొట్టకూడదని చెప్పాడు. మనం కోపం తెచ్చుకుని గొడవపడకూడదు. ఒకవేళ గొడవపడితే, గొడవ మొదలు పెట్టినవాళ్లకూ, మనకూ పెద్ద తేడా ఏమీ ఉండదు.

గొడవ మొదలైతే ఏమి చేయడం అన్నిటికన్నా మంచిది?— అక్కడి నుండి వెళ్లిపోవడం మంచిది. అవతలివాళ్లు మిమ్మల్ని మళ్లీ మళ్లీ నెట్టేస్తుండవచ్చు. కానీ, ఆ తర్వాత వాళ్లే ఆపేస్తారు. మీరు అక్కడి నుండి వెళ్లిపోతున్నారంటే, మీకు బలంలేదని కాదు. సరైనది చేసే ధైర్యం మీకు ఉంది కాబట్టే మీరు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు.

ఎవరైనా మనతో గొడవ పెట్టుకోవాలని చూస్తే మనం ఏం చేయాలి?

అలాకాకుండా మీరు వాళ్లతో గొడవపడి, గెలిచారు అనుకుందాం. అప్పుడు ఏమి జరుగుతుంది?— మీ చేతుల్లో దెబ్బలు తిన్నవాళ్లు ఇంకొంతమందిని తీసుకొస్తారు. వాళ్లు పెద్ద కర్రతో లేదా కత్తితో మీ మీద దాడి చేయవచ్చు. మనం వేరేవాళ్లతో గొడవపడకూడదని యేసు ఎందుకు చెప్పాడో ఇప్పుడు మీకు అర్థమైందా?—

వేరేవాళ్లు గొడవపడుతుంటే మనం ఏంచేయాలి? మనం వాళ్లల్లో ఒకరి తరఫున మాట్లాడవచ్చా?— సరైనది ఏమిటో బైబిలు మనకు చెప్తోంది. బైబిలును సామెతలు 26వ అధ్యాయం, 17వ వచనానికి తెరవండి. అక్కడిలా ఉంది, ‘తనకు పట్టని గొడవనుబట్టి కోపం తెచ్చుకునేవాడు, కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.’

వేరేవాళ్ల గొడవల్లో తలదూర్చడం కుక్క చెవులు పట్టుకుని లాగినట్లు ఎందుకు అవుతుంది? మీకే నష్టం జరగవచ్చు, కాబట్టి అలా చేయకండి!

కుక్క చెవులు గట్టిగాలాగి పట్టుకుంటే ఏమవుతుంది? దానికి నొప్పి పుట్టి, మిమ్మల్ని కరుస్తుంది, అవునా? అది మీ చేతుల్లో నుండి తప్పించుకోవాలని ఎంత ఎక్కువ ప్రయత్నిస్తుంటే మీరు అంత గట్టిగా దాని చెవులు పట్టుకోవాల్సివస్తుంది, అప్పుడు దానికి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. దాన్ని వదిలిపెడితే మిమ్మల్ని గట్టిగా కరవచ్చు. అది కరవకుండా దాని చెవులను మీరు ఎప్పటికీ పట్టుకునే ఉండగలరా?—

వేరేవాళ్ల గొడవల్లో జోక్యం చేసుకుంటే మన పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. గొడవ ఎవరు మొదలుపెట్టారో లేదా వాళ్లు ఎందుకు గొడవపడుతున్నారో మనకు తెలియకపోవచ్చు. ఒకవ్యక్తిని కొంతమంది కొడుతుండవచ్చు, అతను ఏదో దొంగతనం చేసివుండవచ్చు. మనం వెళ్లి అతనికి సహాయం చేస్తే, దొంగకు సహాయం చేసినట్లు అవుతుంది. అది మంచిపని కాదు కదా?

కాబట్టి, వేరేవాళ్లు గొడవపడుతుంటే మనం ఏంచేయాలి?— స్కూల్లో అయితే పరిగెత్తుకుంటూ వెళ్లి టీచరుకు చెప్పవచ్చు. ఒకవేళ బయట అయితే మీ అమ్మానాన్నలకు చెప్పాలి లేదా పోలీసులకు ఫోన్‌ చేయాలి. వేరేవాళ్లు గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నా, మనం మాత్రం సమాధానపరులుగా ఉండాలి.

ఎవరైనా గొడవపడుతుంటే మీరు ఏం చేయాలి?

యేసు నిజమైన శిష్యులు, గొడవల్లో చిక్కుకోకుండా ఉండడానికి అన్నివిధాలా ప్రయత్నిస్తారు. అలా మనం, సరైనది చేసే ధైర్యం మనకుందని చూపిస్తాం. యేసు శిష్యులు ‘గొడవపడకుండా, అందరితో సాధువుగా’ అంటే ప్రేమగా ఉండాలని బైబిలు చెప్తోంది.—2 తిమోతి 2:24-26.

గొడవలకు దూరంగా ఉండడానికి సహాయం చేసే ఇంకా కొన్ని మంచి సలహాలున్న, రోమీయులు 12:17-21; 1 పేతురు 3:10, 11 వచనాలు ఇప్పుడు చదువుదాం.