కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ అధ్యాయం

చెప్పిన మాట వినడం మనల్ని కాపాడుతుంది

చెప్పిన మాట వినడం మనల్ని కాపాడుతుంది

ఏది నచ్చితే అది చేయడం మీకు ఇష్టమా? ఏమి చేయాలో మీకు ఎవరూ చెప్పకుండా ఉంటే బావుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకు ఏమనిపిస్తే అది చెప్పండి.—

మీరు ఎందుకు పెద్దవాళ్ల మాట వినాలి?

కానీ మీకేది మంచిది? మీకు ఏది నచ్చితే అది చేసెయ్యడం మంచిదేనా? లేక మీ తల్లిదండ్రులు చెప్పింది చేస్తే బావుంటుందా?— మీరు తల్లిదండ్రుల మాట వినాలని దేవుడు చెప్తున్నాడు. ఆయనలా చెప్పడానికి మంచి కారణమే ఉండివుంటుంది. అదేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

మీకెన్ని సంవత్సరాలు?— మీ నాన్నకు ఎన్ని సంవత్సరాలు?— మీ అమ్మకు, నానమ్మకు, తాతయ్యకు ఎన్ని సంవత్సరాలో తెలుసా?— అవును వాళ్లు మీకంటే ఎన్నో సంవత్సరాల ముందు నుండి ఉన్నారు. ఎంత ఎక్కువకాలం ఉంటే అన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు. సంవత్సరాలు గడిచేకొద్దీ వాళ్ళు ఎన్నో వింటారు, ఎన్నో చూస్తారు, ఎన్నో చేస్తారు కూడా. కాబట్టి చిన్నవాళ్లు పెద్దవాళ్ల దగ్గర నేర్చుకోవచ్చు.

మీకన్నా చిన్నవాళ్లు ఎవరైనా మీకు తెలుసా?— వాళ్ల కంటే మీకు ఎక్కువ తెలుసు కదా?— ఎందుకు?— ఎందుకంటే వాళ్ల కంటే మీరే ముందు పుట్టారు. అందుకే మీరు వాళ్లకంటే ఎక్కువ నేర్చుకోగలిగారు.

మరి మీకన్నా, నాకన్నా మనందరికన్నా ముందు నుండి ఉన్నది ఎవరో తెలుసా?— యెహోవా దేవుడు. ఆయనకు మీకన్నా, నాకన్నా ఎక్కువ తెలుసు. ఆయన మనకు ఏదైనా చేయమని చెప్తే, అది చేయడం కొన్నిసార్లు కష్టమనిపించినా, అది చేయడమే సరైనది. గొప్ప బోధకునికి కూడా దేవుడు చెప్పింది చేయడం ఒక సందర్భంలో కష్టం అనిపించింది, ఆ విషయం మీకు తెలుసా?—

దేవుడు ఒకసారి యేసుకు చాలా కష్టమైన పని చేయమని చెప్పాడు. మనం ఇక్కడ చూస్తున్నట్లు, యేసు దాని గురించి దేవునికి ప్రార్థించాడు. ‘నీ చిత్తమైతే ఈ కష్టమైనదాన్ని తీసివేయి’ అని ఆయన ప్రార్థించాడు. అలా ప్రార్థించడం ద్వారా దేవుడు కోరింది చేయడం ఎప్పుడూ సులభం కాదని యేసు చూపించాడు. అయితే ప్రార్థన ముగింపులో యేసు ఏమన్నాడో తెలుసా?—

యేసు చేసిన ప్రార్థన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

‘నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరుగును గాక’ అన్నాడు. (లూకా 22:41, 42) యేసు, తన ఇష్టం కాదుగానీ దేవుని ఇష్టమే జరగాలని కోరుకున్నాడు. ఆయన తనకు మంచి అనిపించింది చేయాలనుకోలేదు గానీ దేవుడు కోరిందే చేశాడు.

దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?— దేవుడు మనకు ఏదైనా చేయమని చెప్తే, అది చేయడం కొన్నిసార్లు కష్టమనిపించినా, అది చేయడమే ఎప్పుడూ సరైనదని నేర్చుకుంటాం. అంతేగాక మరో విషయం కూడా నేర్చుకోవచ్చు. అదేమిటో తెలుసా?— దేవుడు, యేసు ఒకటే అని కొంతమంది అంటారు, కానీ అది నిజం కాదని కూడా నేర్చుకోవచ్చు. యెహోవా దేవుడు తన కుమారుడైన యేసు కంటే పెద్దవాడు, కాబట్టి ఆయనకే ఎక్కువ తెలుసు.

మనం దేవుని మాట వింటే మనం ఆయనను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. ‘మనం ఆయన ఆజ్ఞల్ని పాటించడమే దేవుని ప్రేమించడం; ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు’ అని బైబిలు చెప్తోంది. (1 యోహాను 5:3) ఇప్పుడు మీకు అర్థమైందా, మనమందరం దేవుని మాట వినాలి. మరి మీరు ఆయన మాట వింటారా?—

మనం ఇప్పుడు బైబిలు తీసి, దేవుడు పిల్లలను ఏమి చేయమంటున్నాడో చూద్దాం. మనం ఎఫెసీయులు 6వ అధ్యాయం, 1-3 వచనాలు చదువుదాం. అక్కడ ఇలా ఉంది, ‘పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి; ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించండి, అప్పుడు మీరు భూమ్మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.’

చూశారా, మీరు మీ అమ్మానాన్నల మాట వినాలని యెహోవా దేవుడే మీకు చెప్తున్నాడు. వారిని ‘సన్మానించడం’ అంటే ఏమిటి? అంటే వారిని గౌరవించాలని అర్థం. మీరలా చేస్తే మీకు ‘మేలు కలుగుతుంది’ అని దేవుడు మాటిస్తున్నాడు.

మాట వినడం వల్ల ప్రాణాలు కాపాడుకున్న కొంతమంది గురించి ఇప్పుడు చెప్తాను. వాళ్లు చాలాకాలం క్రితం పెద్ద పట్టణమైన యెరూషలేములో ఉండేవాళ్లు. ఆ పట్టణంలో చాలామంది దేవుని మాట వినలేదు, అందుకే దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడని యేసు హెచ్చరించాడు. నీతిని ప్రేమించడంద్వారా వాళ్లు ఆ నాశనాన్ని ఎలా తప్పించుకోవచ్చో కూడా చెప్పాడు. ‘యెరూషలేమును సైనికులు చుట్టుముట్టడం మీరు చూడగానే దాని నాశనం దగ్గరపడిందని తెలుసుకోండి. అప్పుడు యెరూషలేములో ఉండేవాళ్లు కొండలకు పారిపోవాలి’ అని యేసు చెప్పాడు.—లూకా 21:20-22.

యేసు చెప్పిన మాట వినడంవల్ల ఈ ప్రజలు ఎలా కాపాడబడ్డారు?

యేసు చెప్పినట్లే, రోమా సైన్యాలు దండెత్తి వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాయి. కానీ ఎందువల్లనో సైనికులు తిరిగి వెళ్లిపోయారు. దాంతో ప్రమాదం తప్పిందని చాలామంది అనుకున్నారు. అందువల్ల వాళ్లు పట్టణంలోనే ఉండిపోయారు. కానీ వాళ్లు ఏంచేయాలని యేసు చెప్పాడు?— అప్పుడు మీరొకవేళ యెరూషలేములో ఉంటే ఏమిచేసి ఉండేవాళ్లు?— యేసు మాట నమ్మినవాళ్లు తమ ఇళ్లను వదిలి, యెరూషలేము నుండి దూరంగా కొండలకు పారిపోయారు.

అది జరిగి సంవత్సరం అవుతున్నా యెరూషలేముకు ఏమీ జరగలేదు. రెండవ సంవత్సరమూ అలాగే గడిచిపోయింది. మూడవ సంవత్సరంలో కూడా ఏమీ జరగలేదు. అయితే అలా యెరూషలేమును విడిచి వెళ్లినవాళ్లు తెలివితక్కువ వాళ్లని కొందరు అనుకున్నారు. కానీ నాలుగవ సంవత్సరంలో రోమా సైన్యాలు తిరిగివచ్చి యెరూషలేమును చుట్టుముట్టాయి. అయితే, ఇప్పుడిక పారిపోవడానికి అవకాశం లేదు. ఈసారి ఆ సైన్యాలు పట్టణాన్ని నాశనం చేసేశాయి. పట్టణంలోవున్న చాలామంది చనిపోయారు, మిగతావాళ్లను బంధీలుగా తీసుకువెళ్లారు.

మరి యేసు చెప్పినట్టు చేసినవాళ్లకు ఏమైంది?— వాళ్లు సురక్షితంగా ఉన్నారు. వాళ్లు యెరుషలేముకు చాలా దూరంలో ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఏమీకాలేదు. చెప్పిన మాట వినడమే వాళ్లను కాపాడింది.

చెప్పిన మాట వినడం మిమ్మల్ని కూడా కాపాడుతుందా?— వీధిలోకి వెళ్లి ఆడుకోకూడదని మీ అమ్మానాన్నా చెప్పారనుకోండి. వాళ్లు ఎందుకలా చెప్తారు?— ఎందుకంటే మీరు ఆడుకుంటున్నప్పుడు ఏదైనా బండి మిమ్మల్ని గుద్దేయవచ్చు. కానీ, ‘ఇప్పుడు బళ్లు ఏవీ రావడం లేదు. నాకేమీ కాదు. వేరే పిల్లలు వీధిలో ఆడుకుంటుంటారు, వాళ్లకు ఎప్పుడూ ఏమీ జరగలేదు’ అని అప్పుడప్పుడూ మీకు అనిపించవచ్చు.

యెరూషలేములోవున్న చాలామంది అలాగే అనుకున్నారు. రోమా సైన్యాలు వెళ్లిపోయిన తర్వాత ఇంకేమీ ఫర్వాలేదు అనుకున్నారు. వేరేవాళ్లు పట్టణంలోనే ఉండిపోయారు కాబట్టి వీళ్లు కూడా ఉండిపోయారు. వాళ్లను ముందుగానే హెచ్చరించినా వాళ్లు వినలేదు. అందుకే వాళ్లు తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు.

ప్రమాదం జరుగుతుందని అనిపించకపోయినా, మీరు ఎందుకు చెప్పిన మాట వినాలి?

మరో ఉదాహరణ చూద్దాం. మీరు ఎప్పుడైనా అగ్గిపుల్లలతో ఆడారా?— అగ్గిపుల్లలు వెలిగించడం సరదాగా అనిపించవచ్చు. కానీ వాటితో ఆడడం చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు మీ ఇల్లంతా కాలిపోవచ్చు, మీ ప్రాణానికే ప్రమాదం రావచ్చు!

ఏదో కొన్నిసార్లు మాట వింటే సరిపోదని గుర్తుంచుకోండి. చెప్పిన మాట ఎప్పుడూ వినడం మిమ్మల్ని నిజంగా కాపాడుతుంది. ‘పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి’ అని ఎవరు చెప్తున్నారు?— దేవుడే. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే అలా చెప్తున్నాడని మర్చిపోకండి.

చెప్పిన మాట వినడం ఎందుకు ప్రాముఖ్యమో చూపించే, సామెతలు 23:22; ప్రసంగి 12:13; యెషయా 48:17, 18; కొలొస్సయులు 3:20 వచనాలను చదవండి.