కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

40వ అధ్యాయం

దేవుణ్ణి ఎలా సంతోషపెట్టవచ్చు?

దేవుణ్ణి ఎలా సంతోషపెట్టవచ్చు?

దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనం ఏమి చేయాలి? మనం ఆయనకు ఏమైనా ఇవ్వగలమా?— ‘అడవి మృగాలన్నీ నావే’ అని యెహోవా చెప్పాడు. ‘వెండి నాది, బంగారు నాది’ అని కూడా ఆయన అన్నాడు. (కీర్తన 24:1; 50:10; హగ్గయి 2:8) అయినా, మనం దేవునికి ఇవ్వగల్గింది ఒకటుంది. ఏమిటది?—

తనను సేవించాలా వద్దా అనేది ఎంచుకునే అవకాశం యెహోవా మనకు ఇస్తాడు. మనం ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడో అది మనచేత బలవంతంగా చేయించాలని ఆయన అనుకోడు. మనం తనను సేవించాలా వద్దా అనేది ఎంచుకోగలిగేలా దేవుడు మనల్ని ఎందుకు చేశాడో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

మీకు రోబోట్‌ అంటే ఏమిటో తెలిసేవుండవచ్చు. రోబోట్‌ అంటే, దానిని తయారుచేసిన వాళ్లు అది ఏ పని చేయాలని తయారుచేస్తారో ఆ పని చేసే ఒక యంత్రం. కాబట్టి, రోబోట్‌లు వాటి సొంతగా ఏ పనీ చేయలేవు. యెహోవా మనందరినీ రోబోట్‌లలా చేసివుండవచ్చు. ఆయన కోరింది మాత్రమే మనం చేసేలా ఆయన మనల్ని చేసివుండగలిగేవాడు. కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకో తెలుసా?— కొన్ని ఆటబొమ్మలు రోబోట్‌లలా ఉంటాయి. ఒక బటన్‌ నొక్కితే వాటిని తయారుచేసినవాళ్లు వాటిని దేనికోసం తయారుచేశారో, ఆ ఆటబొమ్మలు అదే పనిచేస్తాయి. అలాంటి ఆటబొమ్మను మీరు ఎప్పుడైనా చూశారా?— సాధారణంగా ప్రోగ్రాం చేయబడిన అలాంటి ఆటబొమ్మలతో కొంతకాలం ఆడుకున్న తర్వాత వాటిమీద విసుగొస్తుంది. దేవుడు మనం రోబోట్‌లలా ఉండాలనుకోవడం లేదు. ఆయనకు లోబడడానికే ప్రోగ్రాం చేయబడినట్లు మనం ఆయనకు లోబడడం ఆయనకు ఇష్టం లేదు. యెహోవా మనకు తనమీద ఉన్న ప్రేమతో, తనకు లోబడివుండాలనే ఇష్టంతో మనం తన సేవ చేయాలని కోరుకుంటున్నాడు.

దేవుడు మనల్ని రోబోట్‌లలా ఎందుకు చేయలేదు?

మనం ఇష్టంతో తనకు లోబడినప్పుడు మన పరలోక తండ్రికి ఎలా అనిపిస్తుంది?— మీ ప్రవర్తన మీ తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తుంది?— బుద్ధిగల కుమారుడు ‘తన తండ్రిని సంతోషపెడతాడు,’ కానీ, బుద్ధిలేని కుమారుడు ‘తన తల్లికి దుఃఖం కలిగిస్తాడు’ అని బైబిలు చెప్తోంది. (సామెతలు 10:1) మీరు మీ అమ్మానాన్నలు చెప్పింది చేసినప్పుడు వాళ్లు సంతోషించడం మీరు చూశారా?— కానీ మీరు వాళ్ల మాట వినకపోతే వాళ్లకు ఎలా అనిపిస్తుంది?—

మీరు యెహోవాను, అమ్మానాన్నలను ఎలా సంతోషపెట్టవచ్చు?

మన పరలోక తండ్రియైన యెహోవా గురించి ఒకసారి ఆలోచించండి. మనం ఆయనను ఎలా సంతోషపెట్టవచ్చో ఆయన మనకు చెప్తున్నాడు. దాని గురించి సామెతలు 27:11 ఏంచెప్తుందో చూద్దామా? అక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ, “నా కుమారుడా [లేదా, నా కుమారీ అని కూడా మనం అనవచ్చు], జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును” అన్నాడు. నిందించడం లేదా ఎగతాళి చేయడం అంటే ఏమిటో తెలుసా?— ఎవరైనా చేయగలనని చెప్పిన దానిని వాళ్లు చేయలేరంటూ వాళ్లను చూసి నవ్వడాన్నే ఎగతాళి చేయడం అంటారు. సాతాను యెహోవాను ఎలా ఎగతాళి చేశాడు?— దాని గురించి చూద్దాం.

గుర్తుందా, సాతాను తానే అందరికన్నా గొప్పవాడిగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తను చెప్పిందే వినాలని కోరుకున్నట్లు 8వ అధ్యాయంలోచూశాం. యెహోవా, ఆయనను ఆరాధించే వాళ్లకు నిత్యజీవం ఇస్తాడు కాబట్టే ప్రజలు ఆయనను ఆరాధిస్తున్నారని సాతాను అంటాడు. అతను ఆదాము, హవ్వ యెహోవా చెప్పిన మాటను మీరేలా చేసిన తర్వాత దేవుణ్ణి నిందించాడు. అతను దేవునితో ఇలా అన్నాడు, ‘నువ్వు ఇచ్చేవాటి కోసమే ప్రజలు నిన్ను సేవిస్తారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు, ఎవ్వరినైనా నీకు దూరమయ్యేలా చేయగలను.’

ఆదాము, హవ్వ పాపం చేసిన తర్వాత సాతాను యెహోవాను ఏమని నిందించాడు?

ఆ మాటలు ఉన్నవి ఉన్నట్టుగా బైబిల్లో ఎక్కడా కనిపించవన్నది నిజమే. కానీ యోబు అనే ఒకాయన గురించి చదివితే సాతాను దేవునితో అలాంటి మాటలే అన్నట్లు తెలుస్తుంది. యోబు దేవునికి నమ్మకంగా ఉంటాడా లేదా అనేది వాళ్లిద్దరికీ అంటే దేవునికి, సాతానుకు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమైంది. అప్పుడు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి, మన బైబిల్లో యోబు 12 అధ్యాయాలు చదువుదాం.

యోబు 1వ అధ్యాయంలో, దూతలు యెహోవాను చూడడానికి వచ్చినప్పుడు, సాతాను కూడా పరలోకంలో ఉన్నాడని ఉంది. అప్పుడు యెహోవా సాతానును, ‘నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు?’ అని అడిగాడు. భూమి అంతా తిరిగి చూసి వస్తున్నానని సాతాను చెప్పాడు. అందుకు యెహోవా అతనిని ఇలా అడిగాడు, ‘నువ్వు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? ఆయన నా సేవ చేస్తూ, ఏ చెడ్డ పనులు చేయడంలేదు.’—యోబు 1:6-8.

సాతాను వెంటనే యెహోవా మాటకు అడ్డు చెప్తూ, ‘యోబుకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టే అతను నిన్ను ఆరాధిస్తున్నాడు. నువ్వు అతనిని కాపాడడం, ఆశీర్వదించడం మానేస్తే, అతను నిన్ను నీ ముఖంమీదే దూషిస్తాడు’ అని అన్నాడు. అందుకు యెహోవా, ‘సరే సాతాను, యోబుకు నీ ఇష్టమొచ్చింది చెయి, కానీ ఆయనకు మాత్రం ఏ హానీ జరగకూడదు’ అని చెప్పాడు.—యోబు 1:9-12.

అప్పుడు సాతాను ఏంచేశాడు?— కొంతమంది మనుషులు వచ్చి యోబు పశువులను, గాడిదలను దొంగిలించి వాటిని చూసుకునే వాళ్లను చంపేలా చేశాడు. తర్వాత మెరుపులు తగిలి ఆయన గొర్రెలు చచ్చిపోయాయి, వాటి కాపరులు చనిపోయారు. ఆ తర్వాత కొంతమంది వచ్చి ఆయన ఒంటెలను దొంగిలించి, వాటిని కాసేవాళ్లను చంపేశారు. చివరకు, సాతాను ఒక పెద్ద సుడిగాలిని రప్పించాడు. దానివల్ల యోబు పదిమంది పిల్లలు ఉన్న ఇల్లు కూలి, వాళ్లందరూ చనిపోయారు. ఇంత జరిగినా యోబు యెహోవాను సేవించడం మానుకోలేదు.—యోబు 1:13-22.

యెహోవాకు సాతాను మరోసారి కనిపించినప్పుడు, యోబు ఇంకా విశ్వాసంగా ఉన్నాడని ఆయన అతనికి గుర్తుచేశాడు. అప్పుడు సాతాను దేవుని మాటకు అడ్డుచెప్తూ, ‘నువ్వు నన్ను అతని శరీరానికి హానిచేయనిస్తే, అతను నీ ముఖంమీదే నిన్ను దూషిస్తాడు’ అన్నాడు. కాబట్టి, యోబు శరీరానికి హాని చేయవచ్చుగానీ ఆయనను చంపకూడదని యెహోవా సాతానును హెచ్చరించాడు.

యోబు ఏమి సహించాడు, దానివల్ల యెహోవా ఎందుకు సంతోషించాడు?

సాతాను యోబుకు శరీరమంతా పుళ్లు వచ్చేలా చేశాడు. అవి ఘోరంగా వాసన వచ్చేవి కాబట్టి ఆయన దగ్గరకు వెళ్లడానికి ఎవ్వరూ ఇష్టపడేవాళ్లు కాదు. చివరికి యోబు భార్య కూడా ఆయనతో, ‘దేవుని దూషించి చచ్చిపో!’ అంది. యోబు స్నేహితులమని చెప్పుకున్న కొంతమంది ఆయనను చూడడానికి వచ్చి, ఆయనను ఇంకా బాధపెట్టారు. ఎలాగంటే, యోబు ఏవో ఘోరమైన పనులు చేసివుంటాడని, అందుకే ఆయనకు ఆ కష్టాలు వచ్చాయని వాళ్లు అన్నారు. సాతాను అన్ని కష్టాలు, బాధలు పెట్టినా యోబు నమ్మకంగా యెహోవాను సేవిస్తూనే ఉన్నాడు.—యోబు 2:1-13; 7:5; 19:13-20.

యోబు నమ్మకంగా ఉండడం చూసి యెహోవాకు ఎలా అనిపించివుంటుంది?— యెహోవా చాలా సంతోషించాడు. ఎందుకంటే, ఆయన సాతానుతో ఇలా అనగలిగాడు, ‘యోబును చూడు! ఆయన ఇష్టంతోనే నన్ను సేవిస్తున్నాడు.’ సాతాను అబద్ధికుడని నిరూపించడానికి యెహోవా ఒక ఉదాహరణగా చూపించగలిగిన యోబులా మీరు ఉంటారా?— ఎవ్వరినైనా యెహోవాను సేవించకుండా చేయగలనని సాతాను చేసిన సవాలుకు సమాధానం చెప్పగలిగేలా ఉండడం నిజంగా ఒక గొప్ప గౌరవం. యేసు నిజంగా దాన్ని ఒక గొప్ప గౌరవంగా ఎంచాడు.

మన గొప్ప బోధకుడు తనతో తప్పు చేయించే అవకాశాన్ని సాతానుకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఆయనను చూసి ఆయన తండ్రి ఎంత సంతోషపడివుంటాడో ఒక్కసారి ఆలోచించండి! యేసు గురించి చెప్తూ యెహోవా, ‘నా కుమారుణ్ణి చూడు! ఆయనకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నాకు పూర్తిగా నమ్మకంగా ఉన్నాడు!’ అని సాతానుతో చెప్పగలిగాడు. తన తండ్రి హృదయాన్ని సంతోషపెట్టినందుకు యేసు ఎంత ఆనందపడివుంటాడో కూడా ఆలోచించండి. ఆ ఆనందం వల్లే యేసు, హింసాకొయ్యపై చనిపోతున్నప్పుడు కలిగిన బాధను కూడా ఓర్చుకున్నాడు.—హెబ్రీయులు 12:1, 2.

మీరు మన గొప్ప బోధకుడైన యేసులా ఉండి, యెహోవాను సంతోషపెట్టాలని అనుకుంటున్నారా?— అయితే, మీరు ఏంచేయాలని యెహోవా కోరుకుంటున్నాడో తెలుసుకుంటూ దాన్ని చేస్తూ ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు!

దేవుణ్ణి సంతోషపెట్టడానికి యేసు ఏమి చేశాడో, మనం ఏంచేయాలో చెప్తున్న, సామెతలు 23:22-25; యోహాను 5:30; 6:38; 8:28; 2 యోహాను 4 వచనాలు చదవండి.