కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

11వ అధ్యాయం

దేవుని దూతలు సహాయం చేస్తారు

దేవుని దూతలు సహాయం చేస్తారు

కొంతమంది, కళ్లారా చూడనిదే ఏదీ నమ్మము అంటారు. కానీ అలా అనడం తెలివితక్కువతనం. మన కంటికి కనిపించకపోయినా నిజంగా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటో చెప్తారా?—

మనం పీల్చే గాలి గురించి ఒకసారి ఆలోచించండి. అది ఉందని మనకు తెలుస్తుందా?— మీ చేతిమీద ఒకసారి ఊదుకోండి. మీ చేతికి గాలి తగిలినట్టు తెలిసిందా?— చూశారా, గాలి మీకు తగులుతుంది కానీ అది మీకు కనిపించట్లేదు. అవునా?—

మీకు గుర్తుందా, మన కంటికి కనిపించని ఆత్మప్రాణుల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. వాళ్లలో కొంతమంది మంచివాళ్లని, మిగతావాళ్లు చెడ్డవాళ్లని చూశాం. మన కంటికి కనిపించని, కొంతమంది మంచి ఆత్మప్రాణుల పేర్లు చెప్పండి.— అవును, యెహోవా దేవుడు, యేసు, ఇంకా మంచి దేవదూతలు. అలాగైతే, చెడ్డ దూతలు కూడా ఉన్నారా?— ఉన్నారని బైబిలు చెప్తోంది. వాళ్ల గురించి మీరు ఏమి తెలుసుకున్నారో చెప్పండి.—

ఒక విషయమైతే ఖచ్చితంగా చెప్పవచ్చు, మంచి దేవదూతలు, చెడ్డ దూతలు మనకన్నా చాలా శక్తిమంతులు. దేవదూతల గురించి గొప్ప బోధకుడికి చాలా తెలుసు. ఎందుకంటే, ఆయన భూమ్మీద పసిబిడ్డగా పుట్టకముందు ఒక దేవదూత. పరలోకంలో ఆయన ఇతర దేవదూతలతో పాటు ఉండేవాడు. కోట్లసంఖ్యలో ఉన్న దేవదూతలు ఆయనకు తెలుసు. ఈ దేవదూతలందరికీ పేర్లు ఉన్నాయా?—

దేవుడు నక్షత్రాలకు పేర్లు పెట్టాడని చూశాం. అందువల్ల, దేవదూతలకు కూడా పేర్లు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. బైబిలు “దేవదూతల భాష” గురించి మాట్లాడుతోంది కాబట్టి, వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని చెప్పవచ్చు. (1 కొరింథీయులు 13:1) వాళ్లు దేని గురించి మాట్లాడుకుంటారు? భూమ్మీద జీవిస్తున్న మన గురించి మాట్లాడుకుంటారా?—

సాతాను, అతని దూతలైన దయ్యాలు మనం యెహోవా మాట వినకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి, వాళ్లు దాని గురించి మాట్లాడుకోవాలి. మనం కూడా వాళ్లలాగే, యెహోవాకు నచ్చని విధంగా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు. కానీ దేవుని మాట వినే దేవదూతల సంగతేమిటి? వాళ్లు కూడా మన గురించి మాట్లాడుకుంటారా?— అవును, మాట్లాడుకుంటారు. వాళ్లు మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. యెహోవాను ప్రేమించి, ఆయనను ఆరాధించిన వాళ్లకు కొందరు దేవదూతలు ఎలా సహాయం చేశారో ఇప్పుడు చూద్దాం.

బబులోను దేశంలో ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు దానియేలు. ఆ దేశంలోవున్న చాలామంది ప్రజలు యెహోవాను ప్రేమించేవాళ్లు కాదు. ఎవరైనా యెహోవా దేవునికి ప్రార్థనచేస్తే వాళ్లను శిక్షించాలనే చట్టాన్ని కూడా ఆ ప్రజలు తయారుచేసుకున్నారు. కానీ దానియేలు మాత్రం యెహోవాకు ప్రార్థించడం మానలేదు. మరి వాళ్లు దానియేలును ఏంచేశారు?—

ఆ చెడ్డవాళ్లు దానియేలును సింహాల గుహలో పడేసేలా చేశారు. అందులో ఇంకెవ్వరూ లేరు, ఆయనొక్కడే ఉన్నాడు. ఆయన చుట్టూ ఆకలితో ఉన్న కొన్ని సింహాలు ఉన్నాయి. అప్పుడు ఏమి జరిగింది?— ‘దేవుడు తన దూతను పంపి, సింహాల నోళ్లు మూయించాడు’ అని దానియేలు చెప్పాడు. ఆయనకు చిన్న గాయం కూడా కాలేదు! దేవదూతలు, యెహోవా సేవచేసే వాళ్ల కోసం అద్భుతమైన పనులు చేయగలరు.—దానియేలు 6:18-22.

దానియేలును రక్షించడానికి దేవుడు ఏంచేశాడు?

ఒకసారి పేతురును చెరసాలలో బంధించారు. పేతురు మన గొప్ప బోధకుడైన యేసుక్రీస్తు స్నేహితుడని మీకు గుర్తుండే ఉంటుంది. యేసు నిజంగా దేవుని కుమారుడని పేతురు చెప్పినప్పుడు కొంతమందికి నచ్చలేదు. అందుకే వాళ్లు ఆయనను చెరసాలలో వేశారు. పేతురు తప్పించుకుని పారిపోకుండా సైనికులను కాపలా ఉంచారు. పేతురుకు ఎవరైనా సహాయం చేశారా?—

పేతురు, తనకు కాపలావున్న ఇద్దరు సైనికుల మధ్య పడుకునివున్నాడు, ఆయన చేతులు గొలుసులతో కట్టేసివున్నాయి. కానీ బైబిలు ఇలా చెప్తోంది, ‘యెహోవా దూత అతని దగ్గరకు వచ్చాడు; అతను ఉన్న గదిలో వెలుగు ప్రకాశించింది. ఆ దేవదూత “త్వరగా లే” అంటూ పేతురును తట్టి లేపాడు.’

పేతురు చెరసాలలో నుండి బయటకు రావడానికి ఒక దేవదూత ఎలా సహాయం చేశాడు?

అప్పుడు పేతురు చేతికున్న గొలుసులు ఊడిపోయాయి! దేవదూత పేతురుతో, ‘నీవు పై వస్త్రం వేసుకుని, చెప్పులు తొడుక్కొని నా వెంట రా’ అని చెప్పాడు. పేతురుకు దేవదూత సహాయం చేస్తున్నాడు కాబట్టి కాపలా కాస్తున్న సైనికులు వాళ్లను ఆపలేకపోయారు. వాళ్లు ఇనుప ద్వారం దగ్గరకు వచ్చారు, అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆ ద్వారం దానికదే తెరుచుకుంది! దేవదూత పేతురును విడిపించాడు! ఎందుకు? ఆయన ప్రకటనా పనిని చేస్తూనే ఉండడానికి విడిపించాడు.—అపొస్తలుల కార్యములు 12:3-11.

దేవదూతలు మనకు కూడా సహాయం చేయగలరా?— అవును, చేయగలరు. అంటే, మనకు అసలు ఏమీ జరగకుండా వాళ్లు చూసుకుంటారని దాని అర్థమా?— కాదు, తెలివితక్కువ పనులు చేసినప్పుడు కూడా మనకు ఏమీ జరగకుండా వాళ్లు చూసుకుంటారని అనుకోకూడదు. కానీ ఒక్కోసారి తెలివితక్కువ పనులు చేయకపోయినా సరే మనకు ఏమైనా జరగవచ్చు. మనకు ఏమీ జరగకుండా చూడాలని దేవుడు దేవదూతలకు చెప్పలేదు. కానీ ఆయన వాళ్లకు ఒక ప్రత్యేకమైన పని చేయమని చెప్పాడు.

దేవుణ్ణి ఆరాధించమని భూమ్మీది ప్రజలందరికీ చెప్తున్న ఒక దేవదూత గురించి బైబిలు మాట్లాడుతోంది. (ప్రకటన 14:6, 7) ఇంతకీ ఈ దేవదూత ఆ విషయాన్ని ఎలా చెప్తున్నాడు? అందరికీ వినబడేలా ఆయన ఆకాశం నుండి గట్టిగా అరుస్తున్నాడా?— లేదు, భూమ్మీద యేసు అనుచరులు వేరేవాళ్లకు దేవుని గురించి చెప్తారు, ఈ పనిలో దేవదూతలు వాళ్లకు సహాయం చేస్తారు. దేవుని గురించి నిజంగా తెలుసుకోవాలని అనుకుంటున్న వాళ్లకు ఆయన గురించి వినే అవకాశం తప్పక దొరికేలా దేవదూతలు చూస్తారు. మనం కూడా దేవుని గురించి ఇతరులకు ప్రకటించవచ్చు, ఈ పనిలో దేవదూతలు మనకు సహాయం చేస్తారు.

దేవుణ్ణి ప్రేమించనివాళ్లు మనల్ని కష్టపెట్టారనుకోండి లేదా జైలులో పెట్టారనుకోండి, దేవదూతలు మనల్ని విడిపిస్తారా?— వాళ్లు విడిపించగలరు. కానీ వాళ్లు ప్రతీసారి అలా చేయకపోవచ్చు.

దేవదూత పౌలుకు ఏంచెప్తున్నాడు?

యేసు అనుచరుడైన పౌలు ఒకసారి ఖైదీగా ఉన్నాడు. అప్పుడు ఆయనను ఓడలో తీసుకువెళ్తుండగా పెద్ద తుఫాను వచ్చింది. కానీ దేవదూతలు వెంటనే ఆయనను విడిపించలేదు. ఇంకా వేరేవాళ్లు దేవుని గురించి తెలుసుకోవాల్సివుంది కాబట్టి ఆయనను విడిపించలేదు. అప్పుడు ఒక దేవదూత, ‘పౌలూ భయపడకు. నువ్వు కైసరు ఎదుట నిలబడాలి’ అని చెప్పాడు. అవును, అప్పటి ప్రపంచ చక్రవర్తియైన కైసరుకు ప్రకటించగలిగేలా పౌలును ఆయన దగ్గరకు తీసుకువెళ్లాలి. పౌలు ఎక్కడ ఉన్నా దేవదూతలకు తెలుస్తుంది కాబట్టి వాళ్లు ఆయనకు సహాయం చేసేవాళ్లు. మనం నిజంగా దేవునికి సేవచేస్తే వాళ్లు మనకు కూడా సహాయం చేస్తారు.—అపొస్తలుల కార్యములు 27:23-25.

దేవదూతలు మరో పెద్ద పని చేయబోతున్నారు, వాళ్లు ఆ పని త్వరలోనే చేస్తారు. దేవుడు దుష్టులను నాశనం చేసే సమయం చాలా దగ్గరపడింది. నిజమైన దేవుణ్ణి ఆరాధించని వాళ్లందరూ నాశనం చేయబడతారు. ఆ రోజు, దేవదూతలు కంటికి కనిపించరు కాబట్టి వాళ్లు ఉన్నారని నమ్మమనేవాళ్లు తాము అనుకున్నది అబద్ధమని తెలుసుకుంటారు.—2 థెస్సలొనీకయులు 1:6-8.

అంటే మనం ఏంచేయాలి?— మనం దేవదూతల వైపుంటే వాళ్లు మనకు సహాయం చేస్తారు. మరి మనం వాళ్లవైపు ఉన్నామా?— మనం వాళ్లవైపు ఉండాలంటే యెహోవా సేవచేయాలి. మనం యెహోవా సేవచేస్తుంటే, ఆయనను సేవించమని వేరేవాళ్లకు కూడా చెప్తాం.

దేవదూతలు మనుషులకు ఎలా సహాయం చేస్తారో తెలుసుకోవడానికి, కీర్తన 34:7; మత్తయి 4:11; 18:10; లూకా 22:43; అపొస్తలుల కార్యములు 8:26-31 వచనాలను చదవండి.