కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

31వ అధ్యాయం

మనకు బాధ కలిగినప్పుడు ఎవరు ఓదారుస్తారు?

మనకు బాధ కలిగినప్పుడు ఎవరు ఓదారుస్తారు?

ఎప్పుడైనా మీరు, ఎవ్వరూ లేనట్లు అనిపించి బాధపడ్డారా?— మీరంటే ఎవ్వరికీ ఇష్టంలేదని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా?— కొంతమంది పిల్లలకు అలాగే అనిపిస్తుంది. కానీ, ‘నేను నిన్ను మర్చిపోను’ అని దేవుడు మాటిస్తున్నాడు. (యెషయా 49:15) దాని గురించి ఆలోచిస్తేనే ఎంతో బావుంది, అవునా?— అవును, యెహోవా దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు!

తప్పిపోయిన ఈ గొర్రెపిల్లకు ఎలా అనిపించివుంటుంది?

బైబిల్లోని కొన్ని కీర్తనలు రాసిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ‘నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా, యెహోవా నన్ను చేరదీస్తాడు.’ (కీర్తన 27:10) ఆ మాటలు మనకు ఎంతో ఓదార్పునిస్తాయి, అవునా?— అవును, యెహోవా మనకు ఇలా చెప్తున్నాడు, ‘భయపడకు, నేను నీకు తోడుగావున్నాను. నేనే నీకు సహాయం చేస్తాను.’యెషయా 41:9, 10.

అయితే కొన్నిసార్లు సాతాను మనల్ని కష్టపెడుతున్నప్పుడు యెహోవా అడ్డుకోడు. అంతేకాదు, యెహోవా తన సేవకులను, సాతాను పరీక్షిస్తున్నప్పుడు కూడా ఆపడు. ఒకసారి అపవాది యేసును ఎంత బాధపెట్టాడంటే, ఆయన యెహోవాకు ప్రార్థన చేస్తూ, ‘నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు వదిలేశావు’ అని ఏడ్చాడు. (మత్తయి 27:46) తాను బాధపడుతున్నా యెహోవా తనను ప్రేమిస్తున్నాడని యేసుకు తెలుసు. (యోహాను 10:17) అంతేకాదు, యెహోవా సేవకులను సాతాను పరీక్షిస్తున్నప్పుడు, వాళ్లను బాధపెడుతున్నప్పుడు యెహోవా ఆపడని కూడా యేసుకు తెలుసు. దేవుడు సాతానును ఎందుకు అలా చేయనిస్తున్నాడనే దానిగురించి మరో అధ్యాయంలో తెలుసుకుందాం.

చిన్నప్పుడు ఎవరికైనా కొన్నిసార్లు భయమేస్తుంటుంది. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా తప్పిపోయారా?— అప్పుడు మీకు భయమేసిందా?— చాలామంది పిల్లలకు భయమేస్తుంది. మన గొప్ప బోధకుడు తప్పిపోవడం గురించి ఒక కథ చెప్పాడు. అయితే, తప్పిపోయింది పిల్లవాడు కాదు, ఒక గొర్రెపిల్ల.

కొన్ని విషయాల్లో మీరు గొర్రెపిల్లల వంటివాళ్లు. ఎలా అలా చెప్పవచ్చు? గొర్రెలు అంత పెద్ద జంతువులు కాదు. ఎవరో ఒకరు వాటిని చూసుకోవాలి, వాటిని కాపాడాలి. ఆ పనిచేసేవాళ్లను గొర్రెలకాపరులు అంటారు.

యేసు చెప్పిన కథలోని గొర్రెలకాపరి దగ్గర వంద గొర్రెలున్నాయి. కానీ వాటిలో ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది. అది కొండ అవతల ఏముందో చూడాలని అనుకుని ఉంటుంది. కానీ, కొంతసేపటికి అది మిగతా గొర్రెల నుండి దూరంగా వెళ్లిపోయింది. అలా వెళ్లి, తాను ఒంటరిగా మిగిలిపోయానని ఆ గొర్రెపిల్ల తెలుసుకున్నప్పుడు దానికెలా అనిపించివుంటుంది?—

ఒక గొర్రెపిల్ల తప్పిపోయిందని చూసుకున్నప్పుడు గొర్రెలకాపరి ఏంచేస్తాడు? అలా వెళ్లడం గొర్రెపిల్ల తప్పేనని అతను దాని గురించి పట్టించుకోకుండా ఉంటాడా? లేదా 99 గొర్రెలను భద్రంగా ఉండే చోట ఉంచి, తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెపిల్లను వెదకడానికి వెళ్తాడా? ఒక్క గొర్రెపిల్ల కోసం అంతగా శ్రమపడడం అవసరమా?— మీరే ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల అయితే, గొర్రెలకాపరి మీకోసం వెతకాలని మీరు కోరుకుంటారా?—

తన గొర్రెను రక్షించి తీసుకొచ్చిన గొర్రెలకాపరిలా ఎవరున్నారు?

గొర్రెలకాపరి తప్పిపోయిన గొర్రెపిల్లతో సహా గొర్రెలన్నిటినీ ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన, తప్పిపోయిన దానిని వెతుక్కుంటూ వెళ్లాడు. గొర్రెలకాపరి రావడం చూసి, తప్పిపోయిన గొర్రెపిల్ల ఎంత సంతోషించివుంటుందో ఒకసారి ఆలోచించండి! గొర్రెపిల్ల దొరికినందుకు గొర్రెలకాపరి చాలా ఆనందించాడని యేసు చెప్పాడు. గొర్రెలకాపరి, తప్పిపోని 99 గొర్రెలను చూసి సంతోషించినదానికన్నా తప్పిపోయి దొరికిన ఒక గొర్రెపిల్లను చూసి ఎక్కువ సంతోషించాడు. యేసు చెప్పిన కథలోని గొర్రెలకాపరిలా ఎవరు ఉన్నారు? గొర్రెలకాపరి తన గొర్రెలను చూసుకున్నంతగా మనల్ని ఎవరు చూసుకుంటారు?— పరలోకంలోవున్న తన తండ్రి అయిన యెహోవా అలా చూసుకుంటాడని యేసు చెప్పాడు.

యెహోవా దేవుడు తన ప్రజల్ని చూసుకునే గొప్ప కాపరి. ఆయన తనను సేవించేవాళ్లందర్నీ అంటే మీలాంటి చిన్నపిల్లలతో సహా తన సేవకులందర్నీ ప్రేమిస్తాడు. మనలో ఎవ్వరూ బాధపడాలని, నాశనం కావాలని ఆయన కోరుకోడు. దేవుడు మన గురించి అంత బాగా పట్టించుకుంటున్నాడని తెలుసుకోవడం నిజంగా ఎంతో ఓదార్పునిస్తుంది!—మత్తయి 18:11-14.

యెహోవా, మీ నాన్నలాంటివాడని లేదా మిమ్మల్ని శ్రద్ధగా చూసుకునే మరొకరిలాంటివాడని మీకు అనిపిస్తుందా?

మీకు యెహోవా దేవుని మీద నిజంగా నమ్మకం ఉందా?— ఆయన మీ నాన్నలాంటివాడని లేదా మిమ్మల్ని శ్రద్ధగా చూసుకునే మరొకరిలాంటివాడని మీకు అనిపిస్తుందా?— నిజమే మనం యెహోవాను చూడలేం. ఎందుకంటే ఆయనకున్న శరీరం మన కంటికి కనిపించదు. ఆయన నిజంగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనల్ని చూడగలడు. మనకు సహాయం ఎప్పుడు అవసరమనేది ఆయనకు తెలుసు. మనం ప్రార్థనలో ఆయనతో మాట్లాడవచ్చు. మనం భూమ్మీదున్న ఎవరితోనైనా ఎలా మాట్లాడతామో అలాగే ఆయనతో కూడా మాట్లాడవచ్చు. మనం అలా చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు.

కాబట్టి, మీకు ఎప్పుడైనా బాధగా అనిపించినా లేదా మీకు తోడు ఎవ్వరూ లేరని అనిపించినా ఏంచేయాలి?— యెహోవాతో మాట్లాడండి. మీరు ఆయనకు దగ్గరైతే ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడు, మీకు సహాయం చేస్తాడు. మీకు ఎవ్వరూ లేనట్లు అనిపించినప్పుడు కూడా యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తాడని మర్చిపోవద్దు. ఇప్పుడు మనం బైబిలు తీసి చూద్దాం. కీర్తన 23 అధ్యాయం, 1వ వచనం నుండి ఇలా ఉంది, “యెహోవా నా కాపరి. నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.”

4వ వచనంలో ఏముందో గమనించండి, “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైవుందువు; నీ దుడ్డుకఱ్ఱయు, నీ దండమును నన్ను ఆదరించును.” యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాళ్లయితే ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు ఓదార్పు పొందుతారు. మీరూ అలాగే అనుకుంటున్నారా?—

ప్రేమగల గొర్రెలకాపరి తన మందను శ్రద్ధగా చూసుకున్నట్టే, యెహోవా కూడా తన ప్రజలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన వాళ్లకు సరైన మార్గాన్ని చూపిస్తాడు, వాళ్లు సంతోషంగా ఆ మార్గంలో నడుస్తారు. తమ చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. గొర్రెలకాపరి గొర్రెలకు హానిచేసే జంతువుల నుండి వాటిని రక్షించడానికి తన దుడ్డుకఱ్ఱను లేదా దండమును ఉపయోగిస్తాడు. గొర్రెలకాపరి అయిన దావీదు యువకుడిగా ఉన్నప్పుడు సింహం నుండి, ఎలుగుబంటి నుండి తన గొర్రెలను ఎలా రక్షించాడో బైబిలు చెప్తోంది. (1 సమూయేలు 17:34-36) యెహోవా తమను కూడా కాపాడతాడని దేవుని ప్రజలకు తెలుసు. వాళ్లు, దేవుడు తమకు తోడుగా ఉన్నాడు కాబట్టి తాము భద్రంగా ఉన్నామనే ధైర్యంతో ఉండవచ్చు.

తన గొర్రెలను కాపాడే గొర్రెలకాపరిలా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మనకు సహాయం చేయగలరు?

యెహోవా తన గొర్రెలను నిజంగా ప్రేమిస్తాడు, ఆయన వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ‘గొఱ్ఱెలకాపరిలా ఆయన తన మందను మేపుతాడు. ఆయన తన చేతులతో గొఱ్ఱెపిల్లలను ఒక దగ్గర చేర్చుతాడు. వాటిపట్ల ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటాడు’ అని బైబిలు చెప్తోంది.—యెషయా 40:11.

యెహోవా దేవుడు అలాంటివాడని తెలుసుకోవడం మీకు సంతోషంగా లేదా?— మీరు కూడా ఆయన గొర్రెల్లో ఒకరిగా ఉండాలనుకుంటున్నారా?— గొర్రెలు తమ కాపరి చెప్పినట్లు వింటాయి. అవి ఆయనకు దగ్గరగా ఉంటాయి. మీరు యెహోవా చెప్పినట్లు వింటారా?— మీరు ఆయనకు దగ్గరగా ఉంటారా?— అప్పుడు, మీరు భయపడాల్సిన పనే ఉండదు. యెహోవా మీకు తోడుగా ఉంటాడు.

యెహోవా తనను సేవించేవాళ్లను ప్రేమతో, శ్రద్ధగా చూసుకుంటాడు. దీని గురించి బైబిలు ఏంచెప్తుందో, కీర్తన 37:25; 55:22; లూకా 12:29-31 వచనాల్లో చదువుదాం.