33వ అధ్యాయం
యేసుకు మనల్ని కాపాడే శక్తి ఉంది
యేసు పెద్దయ్యాక, చిన్న వయసులో తనను యెహోవా ఎలా కాపాడాడో తెలుసుకున్నప్పుడు ఆయనకు ప్రార్థనచేసి, కృతజ్ఞతలు చెప్పివుంటాడా?— యోసేపు, మరియ తనను ఐగుప్తుకు తీసుకువెళ్లడంద్వారా తనను కాపాడారని తెలుసుకున్నప్పుడు, యేసు వాళ్లతో ఏమి చెప్పివుంటాడని మీకు అనిపిస్తుంది?—
యేసు ఇప్పుడు చిన్నపిల్లవాడు కాదని మనకు తెలుసు. ఒకప్పటిలా ఆయన ఇప్పుడు భూమ్మీద కూడా జీవించట్లేదు. కానీ, ఈ రోజుల్లో కొంతమంది యేసును పశువుల తొట్టిలో పడుకునివున్న చిన్నపిల్లవాడని అనుకుంటున్నట్లు గమనించారా?— ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో, చాలామంది యేసు ఇంకా చిన్నపిల్లవాడని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
యేసు ఇప్పుడు భూమ్మీద లేకపోయినా ఆయన బ్రతికేవున్నాడని మీరు నమ్ముతున్నారా?— అవును, ఆయన చనిపోయిన తర్వాత దేవుడు ఆయనను తిరిగి లేపాడు, ఇప్పుడాయన పరలోకంలో శక్తిమంతుడైన రాజు. ఆయన తన సేవకులను కాపాడడానికి ఏమి చేయగలడని మీరు అనుకుంటున్నారు?— యేసు భూమ్మీద ఉన్నప్పుడు తనను ప్రేమించేవాళ్లను ఎలా కాపాడగలడో చూపించాడు. ఒకసారి యేసు తన శిష్యులతో కలిసి పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వాళ్లను ఎలా కాపాడాడో చూద్దాం.
అది సాయంకాలం. యేసు గలిలయ సముద్రమనే పెద్ద సరస్సు దగ్గర ఉదయం నుండీ బోధిస్తున్నాడు. ఆ సరస్సు పొడవు 20 కిలోమీటర్లు, వైశాల్యం 12 కిలోమీటర్లు. ఆయన తన శిష్యులతో, ‘సరస్సు అద్దరికి పోదాము’ అని అన్నాడు. వాళ్లు ఒక చిన్న పడవలో సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్తున్నారు. యేసు చాలా అలసిపోవడంతో పడవలో వెనక భాగానికి వెళ్లి ఒక దిండుమీద తలవాల్చి పడుకున్నాడు. వెంటనే ఆయన గాఢనిద్రలోకి జారుకున్నాడు.
పడవ నడిపిస్తూ శిష్యులు మెలకువగా ఉన్నారు. కొంతసేపటి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఆ తర్వాత పెద్ద గాలి వీయడం మొదలైంది. ఆ గాలి అంతకంతకు బలంగా వీస్తుండడంవల్ల, పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతున్నాయి. ఆ అలలు పడవలోకి వచ్చిపడటంతో, పడవలోకి నీళ్లు చేరుతున్నాయి.
తాము మునిగిపోతామేమోనని శిష్యులు భయపడ్డారు. కానీ యేసు భయపడలేదు. ఆయనింకా పడవలో వెనుక భాగాన పడుకునేవున్నాడు. చివరకు శిష్యులు ఆయనను లేపి, ‘ప్రభువా, ప్రభువా, రక్షించు! గాలివానలో నశించిపోతున్నాం’ అన్నారు. వెంటనే యేసు లేచి, ‘నిమ్మళించు, నిశ్శబ్దంగా ఉండు!’ అని గాలితో, అలలతో అన్నాడు.
వెంటనే గాలి వీయడం తగ్గింది, సరస్సు సద్దుమణిగింది. శిష్యులు లూకా 8:22-25; మార్కు 4:35-41.
చాలా ఆశ్చర్యపోయారు. ఇలాంటిదాన్ని వాళ్లు ముందెప్పుడూ చూడలేదు. ‘ఎవరీయన? ఈయన గాలిని, నీళ్లను ఆజ్ఞాపిస్తే అవి ఆయనకు లోబడుతున్నాయి!’ అని వాళ్లు ఒకరితో ఒకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు.—యేసు ఎవరో మీకు తెలుసా?— ఆయనకు అంత శక్తి ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా?— యేసు తమతో ఉన్నప్పుడు శిష్యులు భయపడకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఆయన సామాన్య మనిషి కాదు. ఎవ్వరూ చేయలేని అద్భుతమైన పనుల్ని యేసు చేయగలడు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంపై ఒకసారి యేసు చేసినదాని గురించి చెప్తాను వినండి.
ఈ సంఘటన కొంతకాలం తర్వాత జరిగింది. ఒకరోజు సాయంకాలం యేసు తన శిష్యులను పడవలో సముద్రం అవతలి ఒడ్డుకు తనకంటే ముందుగా వెళ్లమన్నాడు. ఆయన ఒక్కడే కొండమీదకు వెళ్లాడు. అది చాలా ప్రశాంతమైన స్థలం కాబట్టి, అక్కడ తన తండ్రియైన యెహోవా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్లాడు.
శిష్యులు పడవలో సముద్రం అవతలి ఒడ్డుకు బయలుదేరారు. కానీ కొంతసేపటికి పెద్ద గాలి వీయడం మొదలైంది. గాలి అంతకంతకు బలంగా వీచింది. అప్పటికి బాగా చీకటిపడింది. పడవలో ఉన్నవాళ్లు తెరచాపను దించి, తెడ్లతో పడవను నడుపుతున్నారు. కానీ గాలి వారికి ఎదురుగా వీస్తుండడంతో వాళ్లు ఎంతో దూరం వెళ్లలేకపోతున్నారు. పెద్ద పెద్ద అలల్లో పడవ వెనుకకు, ముందుకు ఊగిపోతోంది, నీళ్లు లోపలికి తన్నుకొస్తున్నాయి. పడవలో ఉన్నవాళ్లు తీరానికి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నారు, కానీ వారివల్ల కావట్లేదు.
అప్పటికి యేసు ఇంకా కొండమీదే ఉన్నాడు. ఆయన అక్కడ చాలాసేపటి నుండి ఉన్నాడు. కానీ తన శిష్యులు పెద్ద పెద్ద అలల మధ్య ప్రమాదంలో చిక్కుకోవడం ఆయనకు కనిపించింది. అందుకే ఆయన కొండ దిగి, సముద్ర తీరానికి వచ్చాడు. యేసు తన శిష్యులకు సహాయం చేయాలనుకుని, అల్లకల్లోలంగావున్న సముద్రం మీద నడవడం మొదలుపెట్టాడు!
నీళ్ల మీద నడవడానికి ప్రయత్నిస్తే ఏమి జరుగుతుంది?— నీళ్లలో మునిగి, చచ్చిపోయే ప్రమాదం ఉంది. కానీ యేసు అలా కాదు. ఆయనకు ప్రత్యేకమైన శక్తి ఉంది. పడవ దగ్గరకు చేరుకోవడానికి యేసు చాలాసేపు నడవాల్సివచ్చింది. యేసు నీళ్ల మీద నడుచుకుంటూ తమవైపు రావడం శిష్యులకు కనిపించేటప్పటికి దాదాపు తెల్లవారుతోంది. కానీ వాళ్లు తమకు కనిపిస్తున్నదాన్ని నమ్మలేకపోయారు. వాళ్లు చాలా భయపడిపోయి గట్టిగా అరిచారు. అప్పుడు యేసు వాళ్లతో, ‘ధైర్యంగా ఉండండి; నేనే, భయపడకండి’ అన్నాడు.
యేసు పడవలోకి ఎక్కిన వెంటనే తుఫాను ఆగిపోయింది. ఆయన శిష్యులు మళ్లీ ఆశ్చర్యపోయారు. వాళ్లు ఆయనకు వంగి నమస్కరిస్తూ, ‘నిజంగా నువ్వు దేవుని కుమారుడివే’ అన్నారు.—మత్తయి 14:22-33; యోహాను 6:16-21.
మనం కూడా ఆ కాలంలో ఉండి, యేసు అలాంటివి చేస్తున్నప్పుడు చూసివుంటే ఎంత బావుండేదో కదా?— యేసు ఆ అద్భుతాలను ఎందుకు చేశాడో తెలుసా?— ఎందుకంటే, ఆయన తన శిష్యులను ప్రేమించాడు, వాళ్లకు సహాయం చేయాలనుకున్నాడు. అంతేకాదు, ఆయన తనకున్న గొప్ప శక్తిని చూపించడానికి ఆ అద్భుతాలను చేశాడు. భవిష్యత్తులో దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలిస్తున్నప్పుడు దాన్ని ఉపయోగిస్తానని చూపించడానికి కూడా వాటిని చేశాడు.
అపొస్తలుల కార్యములు 12:2; ప్రకటన 1:9.
ఈ రోజుల్లో కూడా, యేసు అనుచరులు దేవుని రాజ్యం గురించి వేరేవాళ్లతో మాట్లాడకుండా చేయాలని సాతాను ప్రయత్నిస్తున్నప్పుడు, యేసు తరచూ తన శక్తిని ఉపయోగించి వాళ్లను కాపాడతాడు. కానీ యేసు, తన శిష్యులకు జబ్బులు రాకుండా కాపాడడానికి, వాళ్లకు జబ్బులుంటే నయం చేయడానికి తన శక్తిని ఉపయోగించడు. యేసు అపొస్తలులు కూడా చివరకు చనిపోయారు. యోహాను సోదరుడైన యాకోబు చంపబడ్డాడు, యోహానైతే చెరసాలలో వేయబడ్డాడు.—ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతుంది. యెహోవాను ఆరాధించినా, ఆరాధించకపోయినా ప్రజలందరూ జబ్బుపడి, చనిపోతారు. కానీ, యేసు భూమ్మీద దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించేటప్పుడు పరిస్థితులు ఇలా ఉండవు. యేసు తనకు విధేయత చూపించేవాళ్లందర్నీ ఆశీర్వదించడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు కాబట్టి, ఎవ్వరూ ఇంకెప్పుడూ భయపడాల్సిన అవసరం ఉండదు.—యెషయా 9:6, 7.
దేవుడు తన రాజ్యానికి రాజుగా నియమించే యేసుకు ఎంత గొప్ప శక్తి ఉంటుందో, దానియేలు 7:13, 14; మత్తయి 28:18; ఎఫెసీయులు 1:20-22 వచనాలు చెప్తున్నాయి.