కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ అధ్యాయం

యేసు ఎందుకు గొప్ప బోధకుడయ్యాడు?

యేసు ఎందుకు గొప్ప బోధకుడయ్యాడు?

రెండువేల సంవత్సరాలకన్నా ఎక్కువకాలం క్రితం ఒక బాబు పుట్టాడు. ఆ బాబు చాలా ప్రత్యేకమైనవాడు. ఆ బాబు జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి అయ్యాడు. ఆ రోజుల్లో విమానాలు, కార్లు లేవు. టీవీ, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ వంటివి అసలే లేవు.

ఆ బాబుకు యేసు అని పేరు పెట్టారు. ఆ బాబు పెద్దయ్యాక ఎంతో జ్ఞానవంతుడయ్యాడు, అందరికన్నా తెలివిగా నిర్ణయాలు తీసుకునేవాడు. యేసు గొప్ప బోధకుడు కూడా అయ్యాడు. ఆయన ఎంతో కష్టమైన సంగతులను సుళువుగా అర్థమయ్యేలా బోధించేవాడు.

ప్రజలు ఎక్కడ కలిస్తే అక్కడ యేసు వాళ్లకు బోధించేవాడు. సరస్సు ఒడ్డున, పడవలో కూర్చుని బోధించేవాడు. ప్రయాణిస్తున్నప్పుడు, వేరేవాళ్ల ఇళ్లకు వెళ్లినప్పుడు బోధించేవాడు. ఆయనకు కారులేదు, ఆయన బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణించలేదు. ఆయన ప్రజలకు బోధిస్తూ ఒకచోటు నుండి మరోచోటికి కాలినడకన వెళ్లేవాడు.

మనం వేరేవాళ్ల నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. కానీ, అన్నిటికన్నా ముఖ్యమైన విషయాలను గొప్ప బోధకుడైన యేసు నుండి నేర్చుకోవచ్చు. యేసు బోధించిన విషయాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో మనం వాటిని చదువుతున్నప్పుడు, యేసే మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది.

యేసు ఎందుకంత గొప్ప బోధకుడయ్యాడు? దానికి ఒక కారణం ఏమిటంటే, ఆయనకు కూడా ఒక బోధకుడున్నాడు. కాబట్టి, వినడం ఎంత ప్రాముఖ్యమో ఆయనకు తెలుసు. మరైతే యేసు ఎవరు చెప్పింది విన్నాడు? ఆయనకు ఎవరు బోధించారు?— ఆయన తండ్రి. దేవుడే ఆయన తండ్రి.

యేసు మనిషిగా భూమ్మీదకు రాకముందు పరలోకంలో దేవుని దగ్గర ఉండేవాడు. భూమ్మీద పుట్టకముందు పరలోకంలో జీవించినవారు ఇంకెవ్వరూ లేరు కాబట్టి ఆయన చాలా ప్రత్యేకమైనవాడు. యేసు పరలోకంలో మంచి కుమారునిగా ఉంటూ తన తండ్రి మాట వినేవాడు. అందుకే, ఆయన దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలను ప్రజలకు బోధించగలిగాడు. యేసులా మీరు కూడా మీ అమ్మానాన్నల మాట వినాలి.

యేసు గొప్ప బోధకుడు అవడానికి మరో కారణం ఏమిటంటే ఆయన ప్రజలను ఎంతో ప్రేమించాడు. ప్రజలు దేవుని గురించి నేర్చుకోవడానికి వాళ్లకు సహాయం చేయాలని ఆయన అనుకున్నాడు. యేసు పెద్దవాళ్లనేకాదు, పిల్లలను కూడా ప్రేమించాడు. పిల్లలు కూడా యేసుతో ఉండడానికి ఇష్టపడేవాళ్లు ఎందుకంటే ఆయన వాళ్లతో మాట్లాడుతూ, వాళ్లు చెప్పేది వినేవాడు.

పిల్లలు యేసుతో ఉండడానికి ఎందుకు ఇష్టపడేవాళ్లు?

ఒకరోజు కొంతమంది తల్లిదండ్రులు, తమ చిన్నపిల్లల్ని యేసు దగ్గరకు తీసుకొచ్చారు. కానీ యేసుకు ఆ చిన్నపిల్లలతో కూర్చుని మాట్లాడేంత తీరిక లేదని ఆయన స్నేహితులు అనుకున్నారు. అందుకే వాళ్లను అక్కడినుండి వెళ్లిపొమ్మని చెప్పారు. అప్పుడు యేసు ఏమన్నాడు?— ‘చిన్నబిడ్డల్ని నా దగ్గరకు రానివ్వండి, వాళ్లను ఆటంకపర్చకండి’ అని అన్నాడు. పిల్లలు తన దగ్గరకు రావాలని యేసు ఇష్టపడ్డాడు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు, గొప్పవాడు. అయినా ఆయన సమయం తీసుకుని చిన్నపిల్లలకు బోధించాడు.—మార్కు 10:13, 14.

యేసు పిల్లలకు ఎందుకు బోధించాడో, వాళ్లు చెప్పేది ఎందుకు విన్నాడో తెలుసా? ఒక కారణమేమిటంటే, తన పరలోక తండ్రి అయిన దేవుని గురించి చెప్పి వాళ్లను సంతోషపెట్టాలని కోరుకున్నాడు. మరి ఇతరులను సంతోషపెట్టాలంటే మీరేమి చేయాలి?— దేవుని గురించి మీరు తెలుసుకున్న విషయాలు వాళ్లకు చెప్పాలి.

ఒకసారి యేసు ఓ ప్రాముఖ్యమైన పాఠం నేర్పించడానికి ఒక చిన్న పిల్లవాణ్ణి తన శిష్యుల మధ్యలో నిలబెట్టాడు. వయసులో పెద్దవాళ్లయిన ఆ శిష్యులు తమ తీరు మార్చుకుని ఆ చిన్న పిల్లవాడిలా ఉండాలని యేసు చెప్పాడు.

కాస్త పెద్ద పిల్లలు, పెద్దవాళ్లు చిన్నపిల్లలను చూసి ఏమి నేర్చుకోవచ్చు?

ఆయన ఎందుకలా చెప్పాడు? పెద్దవాళ్లు లేదా కాస్త పెద్ద పిల్లలు చిన్నపిల్లల్లా ఎలా ఉండగలరు?— పెద్దవాళ్లకు తెలిసినన్ని విషయాలు చిన్నపిల్లలకు తెలియవు. అందుకే చిన్నపిల్లలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి తన శిష్యులు చిన్నపిల్లల్లా నేర్చుకోవడానికి ఇష్టపడాలని యేసు చెప్తున్నాడు. మనమందరం ఇతరుల నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మన అభిప్రాయాలకన్నా యేసు బోధలు ఎంతో ప్రాముఖ్యమైనవని మనందరం అర్థంచేసుకోవాలి.—మత్తయి 18:1-5.

యేసు గొప్ప బోధకుడు అవడానికి ఇంకో కారణం ఏమిటంటే, ప్రజలు ఆసక్తిగా వినేలా ఎలా బోధించాలో ఆయనకు తెలుసు. ఆయన సులువుగా అర్థమయ్యేలా స్పష్టంగా వివరించేవాడు. దేవుని గురించిన కొన్ని విషయాలను ప్రజలు సులువుగా అర్థంచేసుకోవడానికి ఆయన పక్షులను, పువ్వులను, ఇతర సాధారణ విషయాలను ఉదాహరణలుగా ఉపయోగించేవాడు.

ఒకరోజు యేసు కొండమీద ఉన్నప్పుడు చాలామంది ఆయన దగ్గరకొచ్చారు. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా యేసు ఆ కొండమీద కూర్చుని వాళ్లకు కొన్ని విషయాలు చెప్పాడు. దాన్నే కొండమీది ప్రసంగం అంటారు. ఆయనిలా అన్నాడు, ‘ఆకాశంలో ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు. ధాన్యాన్ని కొట్లలో దాచుకోవు. అయినా పరలోకంలో ఉన్న దేవుడు వాటికి ఆహారం ఇస్తాడు. మీరు వాటికన్నా విలువైనవాళ్లు కారా?’

పక్షులు, పువ్వుల గురించి చెప్తూ యేసు ఏమి బోధించాడు?

యేసు ఇంకా ఇలా చెప్పాడు, ‘అడవిపువ్వులను చూసి నేర్చుకోండి. అవి కష్టపడకుండానే పెరుగుతాయి. అయినా అవి ఎంత అందంగా ఉంటాయో చూడండి! ధనవంతుడైన సొలొమోను రాజు కూడా వీటికన్నా అందంగా తయారయ్యేవాడు కాదు. దేవుడు పువ్వుల గురించే శ్రద్ధ తీసుకుంటే, మీ గురించి కూడా శ్రద్ధ తీసుకోడా?’—మత్తయి 6:25-33.

యేసు ఏమి నేర్పిస్తున్నాడో మీకు అర్థమైందా?— తినడానికి భోజనం, వేసుకోవడానికి బట్టలు ఎక్కడనుండి వస్తాయనే దానిగురించి ఎక్కువగా ఆలోచించవద్దని యేసు చెప్తున్నాడు. అవన్నీ మనకు అవసరమని దేవునికి తెలుసు. వాటికోసం పనిచేయవద్దని యేసు చెప్పలేదు. కానీ మనం దేవునికే మొదటిస్థానం ఇవ్వాలని యేసు బోధించాడు. మనమలా చేస్తే దేవుడే మనకు భోజనం, బట్టలు ఉండేలా చూస్తాడు. దేవుడలా చేస్తాడనే నమ్మకం మీకుందా?—

యేసు మాట్లాడడం ముగించిన తర్వాత ప్రజలు ఏమనుకున్నారు?— ఆయన బోధకు ప్రజలు ఆశ్చర్యపోయారని బైబిలు చెప్తోంది. ఆయన చెప్తున్నప్పుడు వాళ్లకు చాలా ఆసక్తిగా వినాలనిపించింది. వాళ్లు ఆయన చెప్పింది విని, సరైనది చేయగలిగారు.—మత్తయి 7:28.

కాబట్టి, మనం యేసును చూసి నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. మనమెలా నేర్చుకోవచ్చో మీకు తెలుసా?— ఆయన బోధించిన విషయాలు ఒక పుస్తకంలో రాసివున్నాయి. అది ఏ పుస్తకమో మీకు తెలుసా?— అది పరిశుద్ధ బైబిలు. అందుకే, యేసు చెప్పింది వినాలంటే బైబిలును జాగ్రత్తగా చదవాలి. నిజానికి యేసు చెప్పేది వినమని దేవుడే స్వయంగా ఎలా చెప్పాడో బైబిల్లో ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని గురించి మనమిప్పుడు చూద్దాం.

ఒకరోజు యేసు తన స్నేహితుల్లో ముగ్గురిని తీసుకొని ఒక కొండమీదకి వెళ్లాడు. వాళ్ల పేర్లు యాకోబు, యోహాను, పేతురు. వీళ్ల గురించి తర్వాత చాలా తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ ముగ్గురూ యేసుకు చాలా దగ్గరి స్నేహితులు. అది ఒక ప్రత్యేకమైన సందర్భం. అప్పుడు యేసు ముఖం సూర్యుడిలా ప్రకాశించింది. ఆయన బట్టలు కూడా తెల్లగా మిలమిల మెరిసిపోయాయి. దాన్ని మీరు ఈ చిత్రంలో చూడవచ్చు.

‘ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి’

అప్పుడు యేసుకు, ఆయన స్నేహితులకు పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది. ‘ఈయన నా ప్రియ కుమారుడు, ఈయననుబట్టి నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి’ అని చెప్పడం వాళ్లు విన్నారు. (మత్తయి 17:1-5) ఆ స్వరం ఎవరిదో మీకు తెలుసా?— దేవునిది! తన కుమారుని మాట వినమని దేవుడే చెప్పాడు.

మరి మనం ఏమి చేయాలి? దేవుని మాటకు లోబడి, ఆయన కుమారుడైన గొప్ప బోధకుడు చెప్పింది వింటామా?— మనందరం ఆయన చెప్పేది వినాలి. ఆయన చెప్పేది మనం ఎలా వినవచ్చో మీకు గుర్తుందా?—

యేసు జీవితం గురించి బైబిల్లోవున్న విషయాలను చదవడం ద్వారా ఆయన చెప్పేది వినవచ్చు. గొప్ప బోధకుడు మనకు చెప్తున్న ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని తెలుసుకుంటున్నప్పుడు మీరెంతో సంతోషిస్తారు. వాటిని మీ స్నేహితులకు చెప్పినప్పుడు కూడా మీకు సంతోషం కలుగుతుంది.

యేసు చెప్పేది వినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మీ బైబిలును తెరిచి, యోహాను 3:16; 8:28-30; అపొస్తలుల కార్యములు 4:12 వచనాలను చదవండి.