కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12వ అధ్యాయం

యేసు ప్రార్థన చేయడం నేర్పించాడు

యేసు ప్రార్థన చేయడం నేర్పించాడు

మీరు యెహోవా దేవునితో మాట్లాడతారా?— మీరు ఆయనతో మాట్లాడడం ఆయనకు ఇష్టం. దేవునితో మాట్లాడడాన్నే ప్రార్థన అంటారు. యేసు పరలోకంలో ఉన్న తన తండ్రితో తరచూ మాట్లాడేవాడు. ఆయన కొన్నిసార్లు, దేవునితో మాట్లాడడానికి ఎవ్వరూ లేని చోటుకు వెళ్లేవాడు. ఒకసారి, ‘ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండమీదకు వెళ్లి, సాయంకాలమైపోయినా అక్కడే ఒంటరిగా ఉన్నాడు’ అని బైబిలు చెప్తోంది.—మత్తయి 14:23.

అయితే, మీరు ఒంటరిగా యెహోవాకు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్లవచ్చు?— రాత్రి నిద్రపోయే ముందు మీరు యెహోవాతో ఒంటరిగా మాట్లాడవచ్చు. ‘ప్రార్థన చేసేటప్పుడు, నీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, నీ తండ్రికి ప్రార్థన చేయి’ అని యేసు చెప్పాడు. (మత్తయి 6:6) మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు యెహోవాకు ప్రార్థన చేస్తారా?— మీరు తప్పనిసరిగా అలా చేయాలి.

యేసు ఒంటరిగా ఉన్నప్పుడు, అలాగే వేరేవాళ్లతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు

యేసు తనతో పాటు వేరేవాళ్లు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. ఆయన తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు, అతని సమాధి దగ్గర ప్రార్థన చేస్తుండగా ఆయనతోపాటు వేరేవాళ్లు కూడా ఉన్నారు. (యోహాను 11:41, 42) యేసు తన శిష్యులతో కూటాలు జరుపుకోవడానికి కలుసుకున్నప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు కూడా కూటాల్లో ప్రార్థన చేస్తారు. మీరు ఆ కూటాలకు వెళ్తున్నారా?— అక్కడ సాధారణంగా ఒక పెద్దాయన ప్రార్థన చేస్తాడు. ఆయన మీ తరఫున దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి, ప్రార్థనలో ఆయన ఏంచెప్తున్నాడో జాగ్రత్తగా వినండి. అప్పుడే మీరు ప్రార్థన చివర్లో “ఆమెన్‌” అనగల్గుతారు. ప్రార్థన చివర్లో “ఆమెన్‌” అని ఎందుకు అంటారో తెలుసా?— అలా అంటే మీకు ఆ ప్రార్థన నచ్చిందని అర్థం. ఆ ప్రార్థనలో చెప్పిన వాటిని మీరు ఒప్పుకుంటున్నారని, మీరు కూడా వాటి గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారని అర్థం.

కూటాల్లో ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎందుకు జాగ్రత్తగా వినాలి?

యేసు తినేముందు కూడా ప్రార్థన చేశాడు. ఆహారం ఇచ్చినందుకు ఆయన యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాడు. మీరు ఎప్పుడూ తినేముందు ప్రార్థన చేసుకుంటారా?— తినేముందు, ఆహారాన్ని ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం మంచిది. అందరూ కలిసి భోజనంచేసే ముందు, పెద్దవాళ్లు ఎవరైనా ప్రార్థన చేస్తుండవచ్చు. అయితే, మీరు ఒక్కరే తినేటప్పుడు ఏంచేయాలి? లేదా, యెహోవాకు కృతజ్ఞతలు చెప్పని వాళ్లతో కలిసి తినేటప్పుడు ఏంచేయాలి?— అప్పుడు మీరే ప్రార్థన చేసుకోవాలి.

మీరు ఎప్పుడూ బయటకు వినబడేలా ప్రార్థన చేసుకోవాలా? లేదా మనసులో ప్రార్థన చేసుకుంటే యెహోవా వినగలడా?— నెహెమ్యాకు ఏమి జరిగిందో తెలుసుకుంటే ఆ ప్రశ్నలకు సమాధానం తెలుస్తుంది. ఈయన యెహోవాను ఆరాధించేవాడు, అర్తహషస్త అనే పర్షియా రాజు ఉండే రాజభవనంలో పనిచేసేవాడు. ఒకరోజు నెహెమ్యా ఎంతో బాధగా ఉన్నాడు. ఎందుకంటే, తన ప్రజల ముఖ్యపట్టణమైన యెరూషలేము గోడలు పడద్రోయబడ్డాయని ఆయనకు తెలిసింది.

నెహెమ్యాలా మీరు ఎప్పుడు మనసులో ప్రార్థన చేసుకోవచ్చు?

నెహెమ్యా బాధపడడానికి కారణమేమిటని రాజు ఆయనను అడిగినప్పుడు, ఆయన వెంటనే మనసులో ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత తాను ఎందుకు బాధపడుతున్నాడో చెప్పాడు. అంతేకాదు, యెరూషలేము గోడలు తిరిగి కట్టడానికి తాను అక్కడికి వెళ్లేందుకు అనుమతించమని రాజును అడిగాడు. అప్పుడు ఏంజరిగింది?—

అవును, నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నెహెమ్యా వెళ్లడానికి రాజు ఒప్పుకున్నాడు! గోడలు కట్టడానికి ఎంతో కలప కూడా ఇచ్చాడు. కాబట్టి, మనం ఎవరికీ వినబడకుండా మనసులో ప్రార్థన చేసుకున్నా దేవుడు మన ప్రార్థన విని, మనం అడిగినవాటిని ఇవ్వగలడు.—నెహెమ్యా 1:2, 3; 2:4-8.

ఒక విషయం ఆలోచించండి. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తల వంచుకోవాలా? మోకాళ్ల మీద కూర్చోవాలా? మీకు ఏమనిపిస్తుంది?— కొన్నిసార్లు యేసు మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థన చేశాడు. మరికొన్నిసార్లు నిలబడి ప్రార్థన చేశాడు. ఇంకా కొన్నిసార్లయితే ఆకాశంవైపు తలెత్తి ప్రార్థన చేశాడు. లాజరు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగే చేశాడు.

దీన్నిబట్టి ఏమి తెలుస్తుంది?— అవును, ప్రార్థన చేస్తున్నప్పుడు నిలబడి ఉన్నామా, కూర్చుని ఉన్నామా అనేది ముఖ్యం కాదు. కొన్నిసార్లు తల వంచుకుని, కళ్లు మూసుకోవడం మంచిది. మరికొన్నిసార్లు, యేసు చేసినట్లు మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. అయితే, పగలు-రాత్రి అనే తేడా లేకుండా దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేయవచ్చనీ, అది ఆయన వింటాడనీ మర్చిపోకండి. ప్రార్థన గురించి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, యెహోవా మన ప్రార్థన వింటున్నాడని మనం నిజంగా నమ్మాలి. మీరు చేసే ప్రార్థనలు యెహోవా వింటాడని నమ్ముతున్నారా?—

ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేవునితో దేని గురించి మాట్లాడవచ్చు?

మనం యెహోవాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఏమి చెప్పాలి?— మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో దేని గురించి మాట్లాడతారు?— యెహోవా మన కోసం ఎన్నో చేస్తున్నాడు, మరి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి కదా?— మనకు ఆహారాన్ని ఇస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. అయితే ఆయన మనకు నీలాకాశం, పచ్చని మొక్కలు, అందమైన పువ్వులు ఇచ్చినందుకు ఆయనకు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పారా?— వాటిని కూడా ఆయనే చేశాడు.

ఎలా ప్రార్థన చేయాలో నేర్పించమని యేసు శిష్యులు ఆయనను ఒకసారి అడిగారు. అప్పుడు మన గొప్ప బోధకుడు వాళ్లకు అది నేర్పించాడు. అంతేకాదు, వేటి గురించి ముఖ్యంగా ప్రార్థన చేయాలో ఆయన చెప్పాడు. అవేమిటో తెలుసా?— బైబిల్లో, మత్తయి 6వ అధ్యాయం, 9 నుండి 13 వచనాల్లో ఆ ప్రార్థన ఉంది. దాన్ని చాలామంది ప్రభువు ప్రార్థన అంటారు. దాన్ని మనం కలిసి చదువుదాం.

ఇక్కడ మనం, దేవుని పేరు గురించి యేసు ప్రార్థన చేయమన్నాడని చూస్తాం. దేవుని పేరు పరిశుద్ధపర్చబడాలని లేదా పవిత్రమైనదిగా ఎంచబడాలని ఆయన ప్రార్థన చేయమన్నాడు. దేవుని పేరేమిటి?— అవును, దేవుని పేరు యెహోవా. అంతేకాదు, మనం ఆయన పేరును ప్రేమించాలి.

ఆ తర్వాత, దేవుని రాజ్యం గురించి ప్రార్థన చేయాలని ఆయన బోధించాడు. ఆ రాజ్యం ప్రాముఖ్యమైనది, ఎందుకంటే అది భూమ్మీద శాంతిని తీసుకువచ్చి, దాన్ని పరదైసులా అంటే ఒక అందమైన తోటలా మారుస్తుంది.

దాని తర్వాత, దేవుని చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లే భూమ్మీద కూడా జరగాలని గొప్ప బోధకుడు ప్రార్థన చేయమన్నాడు. మనం దాని గురించి ప్రార్థన చేస్తే, దేవుడు చెప్పింది చేయాలి.

ఆ తర్వాత, ఆ రోజుకు అవసరమైన ఆహారం కోసం ప్రార్థన చేయాలని యేసు నేర్పించాడు. మనం తప్పులు చేసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవాలని కూడా ఆయన నేర్పించాడు. మనల్ని క్షమించమని దేవుణ్ణి తప్పకుండా అడగాలి. కానీ ఆయన మనల్ని క్షమించడానికి ముందు, మనల్ని బాధపెట్టిన వాళ్లను మనం క్షమించాలి. అది మీకు సులువేనా?—

చివర్లో, దుష్టుని నుండి అంటే అపవాది అయిన సాతాను నుండి రక్షణ కోసం యెహోవా దేవునికి ప్రార్థించాలని యేసు నేర్పించాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వీటన్నిటి గురించి దేవుణ్ణి అడగవచ్చు.

యెహోవా మన ప్రార్థనలు వింటాడని మనం నమ్మాలి. మనకు సహాయం చేయమని అడగడమే కాదు, ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పాలి. మనం నిజాయితీగా ప్రార్థన చేసినప్పుడు, ఏవి అడగవచ్చో వాటినే అడిగినప్పుడు, ఆయన సంతోషిస్తాడు. ఆయన మనకు వాటిని ఇస్తాడు. మీరు అది నమ్ముతారా?—

ప్రార్థన గురించి మరిన్ని చక్కని సలహాలు, రోమీయులు 12:12; 1 పేతురు 3:12; 1 యోహాను 5:14 వచనాల్లో ఉన్నాయి.