17వ అధ్యాయం
సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?
మనందరం సంతోషంగా ఉండాలని అనుకుంటాం, అవునా?— కానీ చాలామంది సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా?— సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలో వాళ్లకు తెలీదు. సంతోషంగా ఉండాలంటే ఎన్నో వస్తువులు ఉండాలని వాళ్లు అనుకుంటారు. కానీ వాళ్లు అవన్నీ సంపాదించుకున్నా ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేరు.
సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలో చూద్దాం. ‘తీసుకోవడంకన్నా ఇవ్వడంలో ఎక్కువ సంతోషం ఉంది’ అని మన గొప్ప బోధకుడు అన్నాడు. (అపొస్తలుల కార్యములు 20:35) కాబట్టి, సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?— అవును, వేరే వాళ్లకు మనం ఏదైనా ఇచ్చినప్పుడు లేదా వాళ్ల కోసం మనం ఏదైనా చేసినప్పుడు సంతోషంగా ఉంటాం. ఆ విషయం మీకు తెలుసా?—
దాని గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. వేరేవాళ్ల దగ్గర బహుమతి తీసుకున్నవాళ్లు సంతోషంగా ఉండలేరని యేసు చెప్పాడా?— లేదు, ఆయనలా చెప్పలేదు.
మనకు ఎవరైనా బహుమతి ఇస్తే ఎంతో బావుంటుంది, అవునా?— అందరూ అలాగే అనుకుంటారు. ఎవరైనా మనకు మంచి బహుమతులు ఇచ్చినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది.కానీ, మనం వేరేవాళ్లకు ఏదైనా ఇచ్చినప్పుడు మనకు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుందని యేసు చెప్పాడు. మనకు అందరికన్నా ఎక్కువ బహుమతులు ఎవరు ఇచ్చారో తెలుసా?— సరిగ్గా చెప్పారు, యెహోవా దేవుడు.
దేవుడు, ‘అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇస్తున్నాడు’ అని బైబిలు చెప్తోంది. ఆయన వర్షం కురిపించి, సూర్య కాంతిని ఇస్తున్నాడు కాబట్టే, మొక్కలు పెరిగి, మనం తినడానికి కావాల్సిన ఆహారం దొరుకుతోంది. (అపొస్తలుల కార్యములు 14:17; 17:25) యెహోవా సంతోషంగా ఉండే దేవుడు. వేరేవాళ్లకు ఇవ్వడం వల్ల కూడా ఆయన సంతోషంగా ఉంటున్నాడు. మనం కూడా వేరేవాళ్లకు ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం.
మరైతే, వేరేవాళ్లకు మనం ఏమి ఇవ్వవచ్చు?— బహుమతి కొని ఇవ్వాలంటే డబ్బులు అవసరమవుతాయి. ఏదైనా ఒక దుకాణంలో బహుమతి కొనాలంటే దానికి మీరు డబ్బులు ఇవ్వాలి. మీరు అలాంటి బహుమతి ఇవ్వాలనుకుంటే, దాన్ని కొనడానికి కావల్సిన డబ్బులు పోగయ్యేవరకు దాచుకోవాలి.
అయితే డబ్బు పెట్టి కొనక్కరలేని వాటిని కూడా బహుమతులుగా ఇవ్వవచ్చు. ఉదాహరణకు, బాగా ఎండగా ఉన్నప్పుడు తాగడానికి చల్లని నీళ్లు ఇస్తే ఎంతో హాయిగా ఉంటుంది. కాబట్టి, దాహంతో ఉన్నవాళ్లకు ఈ బహుమతి ఇచ్చినప్పుడు, ఇవ్వడం వల్ల వచ్చే సంతోషాన్ని మీరు పొందుతారు.
ఒకరోజు మీరూ మీ అమ్మా కలిసి బిస్కెట్లు చేశారనుకుందాం. అలా చేయడం సరదాగా ఉంటుంది. అవన్నీ మీరే తినేస్తే వచ్చే సంతోషంకన్నా ఇంకా ఎక్కువ సంతోషం పొందాలంటే, ఆ బిస్కెట్లలో కొన్నిటిని ఏంచేస్తే బావుంటుంది?— అవును, వాటిలో కొన్నిటిని మీ స్నేహితులకు ఇవ్వవచ్చు. ఇకముందు మీరలా చేస్తారా?—
వేరేవాళ్లకు ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుందని గొప్ప బోధకునికి, ఆయన అపొస్తలులకు తెలుసు. వాళ్లు వేరేవాళ్లకు ఏమి ఇచ్చారో తెలుసా?— వాళ్లు ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదాన్ని ఇచ్చారు! వాళ్లకు దేవుని గురించి సత్యం తెలుసు, వాళ్లు ఆ మంచివార్తను సంతోషంగా వేరేవాళ్లకు చెప్పారు. దానికి వాళ్లు ఎవ్వరి దగ్గరా డబ్బు తీసుకోలేదు.
అపొస్తలుడైన పౌలుకు లూకా అనే మంచి స్నేహితుడు ఉండేవాడు. ఆయన యేసు శిష్యుడు. ఒకరోజు వాళ్లిద్దరూ ఒక స్త్రీని కలిశారు. ఆమె కూడా ఇవ్వడంవల్ల వచ్చే సంతోషాన్ని పొందాలని అనుకుంది. వాళ్లు ఆమెను ఒక నది దగ్గర కలుసుకున్నారు. ప్రజలు ఆ నది దగ్గరకొచ్చి ప్రార్థనలు చేస్తారని విని పౌలు, లూకా అక్కడకు వెళ్లారు. వాళ్లు అక్కడికి వెళ్లేసరికి నిజంగానే కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తూ కనిపించారు.
పౌలు ఆ స్త్రీలకు యెహోవా దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్లలో ఒకామె పేరు లూదియ, ఆమె వాళ్లు చెప్పేది చాలా జాగ్రత్తగా విన్నది. తర్వాత లూదియ తాను విన్న మంచివార్త తనకెంతో నచ్చిందని చూపించడానికి ఒక పని చేయాలని అనుకుంది. అందుకే ఆమె, ‘నాకు యెహోవామీద విశ్వాసం ఉందని మీకు అనిపిస్తే, నా ఇంటికివచ్చి ఉండండి’ అని పౌలును, లూకాను బ్రతిమాలుకుంది. ఆమె తన ఇంటికి రావడానికి వాళ్లను ఒప్పించింది.—అపొస్తలుల కార్యములు 16:13-15.
దేవుని సేవకులు తన ఇంటికి వచ్చినందుకు లూదియ చాలా సంతోషపడింది. వాళ్లు ఆమెకు యెహోవా గురించి, యేసు గురించి, ఎప్పటికీ జీవించి ఉండాలంటే ఏంచేయాలనే దానిగురించి తెలుసుకోవడానికి సహాయం చేశారు కాబట్టి ఆమె వాళ్లను ప్రేమించింది. ఆమె పౌలుకు, లూకాకు భోజనం పెట్టి, వాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి చోటు ఇవ్వగలిగినందుకు ఎంతో సంతోషించింది. లూదియ నిజంగా ఇవ్వాలని అనుకుంది కాబట్టే ఇచ్చినప్పుడు ఆమె చాలా సంతోషపడింది. దాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి. వేరేవాళ్లకు బహుమతి ఇవ్వమని మనకు ఎవరైనా చెప్పవచ్చు. కానీ ఇష్టంలేకుండా, బలవంతంగా ఇస్తే మనకు సంతోషం అనిపించదు.
మీ దగ్గర మీకు ఇష్టమైన చాక్లెట్లు కొన్ని ఉన్నాయనుకోండి. అందులో కొన్ని ఎవరికైనా ఇమ్మంటే ఇవ్వడానికి ఇష్టపడతారా?— కానీ, మీకు బాగా ఇష్టమైన స్నేహితుణ్ణి కలిసినప్పుడు అవి మీ దగ్గర ఉన్నాయనుకోండి, అప్పుడేం చేస్తారు?
వాటిలో కొన్నిటిని అతనికి ఇవ్వాలనే ఆలోచన ఎవరూ చెప్పకుండానే మీకు వచ్చినప్పుడు, మీకు సంతోషం అనిపిస్తుంది, అవునా?—కొంతమందిని మనం ఎంత ఇష్టపడతామంటే మనకోసం ఏదీ దాచుకోకుండా మనవన్నీ వాళ్లకు ఇచ్చేయాలని అనుకుంటాం. దేవుని మీద మనకు ప్రేమ పెరిగేకొద్దీ ఆయన గురించి కూడా మనకు అలాగే అనిపించాలి.
సరిగ్గా అలాగే అనుకున్న ఒక పేద స్త్రీ గురించి మన గొప్ప బోధకునికి తెలుసు. ఆమెను ఆయన యెరూషలేములోవున్న దేవాలయంలో చూశాడు. ఆమె దగ్గర రెండు చిన్న నాణేలు తప్ప ఇంకేమీ లేవు. కానీ ఆమె ఆ రెండు నాణేలను దేవాలయంలోని చందా పెట్టెలో వేసింది. అలా చేయమని ఆమెను ఎవ్వరూ బలవంతం చేయలేదు. అక్కడున్న చాలామందికి ఆమె ఏంచేసిందో కూడా తెలీదు. ఆమె అలా ఇవ్వాలని అనుకుంది కాబట్టి, యెహోవాను నిజంగా ప్రేమించింది కాబట్టి అలా చేసింది. ఆమె ఇవ్వగలిగినందుకు ఎంతో సంతోషించింది.—లూకా 21:1-4.
మనం ఎన్నో రకాలుగా వేరేవాళ్లకు ఇవ్వవచ్చు. వాటిలో కొన్ని ఏమిటి?— మనం నిజంగా ఇష్టపడి ఇస్తే మనకు సంతోషం కలుగుతుంది. అందుకే గొప్ప బోధకుడు, ‘ఇస్తూ ఉండండి’ అని మనకు చెప్తున్నాడు. (లూకా 6:38) అలా చేస్తే, మనం ఇతరులను సంతోషపెడతాం. మనకు చెప్పలేనంత సంతోషం కలుగుతుంది!
వేరేవాళ్లకు ఇస్తే మనం ఎందుకు సంతోషంగా ఉంటామో, మత్తయి 6:1-4; లూకా 14:12-14; 2 కొరింథీయులు 9:7 వచనాలు చదివి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం.