కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అందరూ కాదుగాని ఒక జనాంగమే తప్పిపోయింది

అందరూ కాదుగాని ఒక జనాంగమే తప్పిపోయింది

అధ్యాయము 79

అందరూ కాదుగాని ఒక జనాంగమే తప్పిపోయింది

ఆ పరిసయ్యుని ఇంటిబయట గుమికూడిన ప్రజలతో యేసు చర్చించిన కొద్దిసేపటికి, కొందరు ఆయనతో ఇట్లందురు, “[రోమా గవర్నరు పొంతి] పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను.” వీరు బహుశ, యెరూషలేములోనికి నీటిని రప్పించుటకు ఎత్తైన ఒక రాతికాలువను నిర్మించుటకు పిలాతు ఆలయ ఖజానానుండి ద్రవ్యమును ఉపయోగించుటను యూదులు వ్యతిరేకించినప్పుడు హతమార్చబడిన వేలాదిమంది గలిలయులై యుండవచ్చును. గలిలయులు తమస్వంత దుష్టక్రియల కారణముగా ఈ విపత్తుననుభవించిరని యేసుకు ఈ విషయమును చెప్పుచున్నవారు, సూచించుచుండవచ్చును.

అయితే యేసు వారిని సరిదిద్దుచు ఇట్లనును: “ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా?” “కారని” యేసు సమాధానమిచ్చును. ఆ పిమ్మట ఆ సందర్భమును ఉపయోగించి, “మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు” అని ఆయన యూదులను హెచ్చరించును

ఇంకను మాట్లాడుచు, యేసు మరొక స్థానిక దుర్ఘటనను, బహుశ ఆ ఎత్తైన రాతికాలువ నిర్మాణమునకుకూడ సంబంధముగల సంఘటనను జ్ఞప్తికితెచ్చును. ఆయన ఇట్లడుగును: “మరియు సిలోయములోని గోపురము పడిచచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్న వారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?” కారు, వారి చెడుతనము వలన ఈ ప్రజలు మరణించలేదు అని యేసు అనును. బదులుగా, అటువంటి దుర్ఘటనలకు సాధారణముగా “అనుకొనకుండా జరుగు సంఘటనలు, కాలము” (NW) కారణమైయున్నవి. అయితే యేసు మరొకసారి “మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరు ఆలాగే నాశనమగుదురని” వారిని హెచ్చరించుటకు ఆ సందర్భమును ఉపయోగించును.

తర్వాత యేసు వారికి యుక్తమైన ఉపమానము నొకదానిని చెప్పుచు ఇలా వివరించును: “ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడియుండెను అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమియు దొరకలేదు గనుక అతడు ‘ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని’ ఆ ద్రాక్ష తోటమాలితో చెప్పును. ఆయితే వాడు ‘అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరముకూడ ఉండనిమ్ము; అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని’ అతనితో చెప్పెను.”

యూదా జనాంగములో విశ్వాసమును కలుగజేయుటకు యేసు మూడు సంవత్సరములకంటె ఎక్కువ ప్రయాసపడెను. అయితే ఆయన శ్రమకు ఫలితముగా కేవలము కొన్నివందలమంది శిష్యులు మాత్రమే తయారయిరి. ఇప్పుడు, ఆయన తన పరిచర్యలోని ఈ నాల్గవ సంవత్సరములో, యూదయ మరియు పెరీయలలో ఆసక్తిగా ప్రకటించుచు, బోధించుటద్వారా సూచనార్థకమైన యూదామత అంజూరపు వృక్షముచుట్టు త్రవ్వి దానిలో యెరువు వేయుటకు, ఆయన తీవ్ర ప్రయత్నములు చేయుచున్నాడు. అయినను ఏ ప్రయోజనములు కలుగలేదు! ఆ జనాంగము మారుమనస్సు పొందుటకు నిరాకరించి అలా నాశన మార్గంలో ఉండును. ఆ జనాంగమందలి శేషము మాత్రమే ప్రతిస్పందింతురు.

ఆ తర్వాత కొద్దిరోజులకే యేసు ఒక విశ్రాంతిదినమున సమాజమందిరములో బోధించుచున్నాడు. అక్కడ ఆయన, దయ్యంపట్టి బలహీనపడిన కారణంగా 18 సంవత్సరముల నుండి నడుము బాగా వంగిపోయిన ఒక స్త్రీని చూస్తాడు. కనికరముతో యేసు ఆమెతో, “అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి,” ఆమెమీద చేతులుంచగానే ఆమె వెంటనే చక్కగా నిలువబడి దేవుని మహిమపరచ నారంభించును.

అయితే సమాజమందిరపు అధికారి మండిపడి, “పనిచేయదగిన ఆరుదినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని” అభ్యంతరము చెప్పును. ఆ విధముగా, స్వస్థపరచు యేసు శక్తిని ఆ అధికారి గుర్తించును, అయితే స్వస్థతకొరకు ప్రజలు విశ్రాంతి దినమున వచ్చుటను ఆయన ఖండించును.

అందుకు యేసు, “వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలుకొనిపోయి, నీళ్లుపెట్టును గదా. ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన ఈమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని ప్రత్యుత్తరమిచ్చును.

యేసును వ్యతిరేకించు యూదులు దీనిని విని సిగ్గుపడనారంభింతురు. అయితే, జనసమూహములు యేసు చేయుచున్న మహత్కార్యములన్నిటిని చూచి సంతోషింతురు. దీన్ని గమనించిన యేసు, ఒక సంవత్సరము క్రితము గలిలయ సముద్రములో పడవలోనుండి దేవుని రాజ్యమునుగూర్చి తాను చెప్పిన రెండు ప్రవచనార్థక ఉపమానములను మరలా చెప్పును. లూకా 13:1-21; ప్రసంగి 9:11; మత్తయి 13:31-33.

ఏ దుర్ఘటనలు ఇక్కడ ప్రస్తావించబడినవి, మరియు యేసు వాటినుండి ఏ పాఠమును తెలియజేయును?

ఫలింపని అంజూరపు వృక్షమునుండియు, దానిని ఫలవంతముచేయు ప్రయత్నముల నుండియు ఎటువంటి అన్వయింపు చేయవచ్చును?

యేసు స్వస్థపరచు శక్తిని సమాజమందిరపు అధికారి ఎట్లు గుర్తించును, అయినను యేసు ఆ మనుష్యుని వేషధారణను ఎట్లు బయల్పరచును?