కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అత్యంత ప్రఖ్యాతిగాంచిన ప్రసంగము

అత్యంత ప్రఖ్యాతిగాంచిన ప్రసంగము

అధ్యాయము 35

అత్యంత ప్రఖ్యాతిగాంచిన ప్రసంగము

అది బైబిలు చరిత్రలోనే ఎంతో గుర్తుంచుకొనవలసిన దృశ్యము: కొండమీద యేసు ఒకప్రక్కగా కూర్చొని తన కొండమీది ప్రసంగమునిచ్చుచున్నాడు. ఈ ప్రాంతము బహుశ కపెర్నహూముకు దగ్గర, గలిలయ సముద్రమునకు సమీపమున కలదు. రాత్రంతయు ప్రార్థనలో గడిపిన తర్వాత, యేసు అంతకుముందే తన శిష్యులలో 12 మందిని తన అపొస్తలులుగా ఏర్పరచుకొనెను. ఆ పిమ్మట ఆయన వారందరితోకలిసి, కొండమీద సమతలముగావున్న ఈ ప్రాంతమునకు వచ్చాడు.

ఇప్పటికే యేసు బాగా అలసిపోయాడని, కొంచెముసేపు నిద్రించుటకు ఆయన ఇష్టపడునని మీరు తలంచుదురు. కాని బహుజన సమూహము అక్కడికి వచ్చారు, వారిలో కొందరు దాదాపు 96 నుండి 112 కిలోమీటర్ల దూరములోగల యూదయ, యెరూషలేమునుండి వచ్చారు. ఇంకొందరు ఉత్తరదిక్కునగల సముద్రతీరమందలి తూరు, సీదోనునుండి వచ్చారు. యేసు బోధవిని, తమ వ్యాధులకు స్వస్థతపొందవలెనను ఉద్దేశ్యముతో వారు వచ్చారు. వారిలో కొందరు సాతానుయొక్క దుష్ట దూతలగు, దయ్యములచే పీడింపబడుచున్న వారును ఉన్నారు.

యేసు క్రిందికి దిగివచ్చుచుండగా, రోగులు ఆయనను ముట్టుకొనవలెనని ఆయన దగ్గరకురాగా, ఆయన వారిని బాగుచేయును. ఆ తర్వాత, యేసు కొండమీద ఎత్తైన ప్రదేశమునకు వెళ్లి, తనకెదురుగా విశాలప్రదేశములో జనసమూహములు కూర్చొనుచుండగా, వారికి బోధింపనారంభించును. ఒక్కసారి దానిని ఆలోచించుము! ఇప్పుడు అంతమందిలో తీవ్రమైన అస్వస్థతతో బాధపడు వ్యక్తి ఒక్కడును లేడు!

ఇంతటి ఆశ్చర్యకరమైన అద్భుతములు చేయగల బోధకుని వినుటకు ప్రజలు ఆతురుతతో ఎదురుచూచుచున్నారు. అయితే, యేసు ముఖ్యముగా, తనకు సమీపముగా తన చుట్టు చేరియున్న తన శిష్యుల ప్రయోజనార్థమై తన ప్రసంగమునిచ్చును. అయితే దానినుండి మనముకూడ ప్రయోజనముపొందు నిమిత్తము మత్తయి మరియు లూకా వీరిరువురు దానిని వ్రాసియున్నారు.

మత్తయి వ్రాసిన వృత్తాంతము లూకా వ్రాసిన దానికి నాలుగురెట్లు పెద్దదిగాయున్నది. అంతేకాకుండ, మత్తయి వ్రాసిన భాగములను, యేసు తన పరిచర్యకాలములో మరొక సందర్భములో చెప్పినట్లు లూకా వ్రాసాడు. వీటిని మనము, మత్తయి 6:9-13 ను లూకా 11:1-4 తో, మరియు మత్తయి 6:25-34 ను లూకా 12:22-31 తో పోల్చుటద్వారా గమనించవచ్చును. అయినను ఇది మనలను ఆశ్చర్యపరచకూడదు. ఎందుకంటే, యేసు అదే సంగతులను అనేకమార్లు బోధించియున్నాడు, కాగా ఈ బోధలలో కొన్నింటిని లూకా మరొక సందర్భములో వ్రాయుటకు ఎంచుకొనెను.

ఆ ప్రసంగమందలి లోతైన ఆత్మీయవిషయములే కాకుండ, యేసు దానిద్వారా చెప్పిన సత్యముల సామాన్యత మరియు స్పష్టత ఆయన చేసిన ప్రసంగమును అత్యంత విలువైనదిగా చేయుచున్నది. సామాన్యమైన అనుభవములను, ప్రజలకు పరిచయముగల సంగతులను ఉపయోగించుచు, ఆ విధముగా దేవుని మార్గమందు శ్రేష్ఠమైన జీవితముకొరకు వెదకు వారందరికి ఆయన తన ఆలోచనలు సులభముగా అర్థమయ్యేట్లు చెప్పెను.

నిజముగా ధన్యులు ఎవరు?

ప్రతివారు సంతోషముగా ఉండవలెనని కోరుకొందురు. దీనిని గ్రహించి యేసు నిజముగా ధన్యులైయుండు వారిని వర్ణించుచు, తన కొండమీది ప్రసంగమును ప్రారంభించెను. మనము ఊహించగలుగునట్లుగానే, ఇది వెంటనే ఆయన విస్తారమైన ప్రేక్షకుల శ్రద్ధనుచూరగొనెను. అయినను, ఆయన తొలిపలుకులు అనేకమందికి పరస్పర విరుద్ధముగా కన్పించియుండవచ్చును.

తన శిష్యుల తట్టు చూచి, యేసు వారితో ఇట్లనును: “బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్యులు మిమ్మును ద్వేషించినప్పుడు . . . మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులువేయుడి; ఇదిగో! మీ ఫలము పరలోకమందు గొప్పదైయుండును.”

ఇది యేసు ప్రసంగముయొక్క పరిచయమునుగూర్చి లూకా వ్రాసిన వృత్తాంతము. అయితే మత్తయి వ్రాసినదాని ప్రకారము, సాత్వికులు, కనికరముగలవారు, హృదయశుద్ధిగలవారు, సమాధానపరచువారుకూడ ధన్యులని యేసు చెప్పును. వీరు ఎందుకు ధన్యులంటే, వారు భూమిని స్వతంత్రించుకొందురు, వారు కనికరము పొందుదురు, వారు దేవుని చూచెదరు, వారు దేవుని కుమారులనబడుదురు అని యేసు అనును.

అయితే ధన్యులని చెప్పుటలో, అది తమాషా చేయునప్పుడు ఒకడు కలిగియుండు సంతోషము లేక ఉల్లాసము వంటిదని యేసు భావము కాదు. నిజమైన ధన్యత లోతైనది, తృప్తికరమైన ఆలోచనను కలుగజేయునది, జీవితములో సంతుష్టిని మరియు ఏదో నెరవేర్చామను భావనను కల్గించునదైయున్నది.

కాబట్టి నిజముగా ధన్యులైన ప్రజలు ఎవరనగా, తమ ఆత్మీయ అవసరతను గుర్తించి, తమ పాపపరిస్థితి విషయమై దుఃఖించుచు, దేవుని తెలుసుకొని ఆయనను సేవించువారని, యేసు చూపించుచున్నాడు. దేవుని చిత్తము చేయుచున్నందున, ఆ పిమ్మట వారు ద్వేషింపబడినను, లేక హింసింపబడినను వారు ధన్యులు, ఎందుకనగా తాము దేవుని చిత్తముచేయుచున్నామని, నిత్యజీవపు ప్రతిఫలము తమకు లభించునని వారు ఎరిగియున్నారు.

అయితే, యేసు చెప్పు సంగతులను వినుచున్నవారిలో అనేకులు ఈనాటి కొందరివలెనే ధనవంతులై సుఖభోగములను అనుభవించుట ఒక వ్యక్తిని ధన్యునిచేయునని వారు నమ్మిరి. అయితే యేసు మరొకరకముగా భావించాడు. వారనుకున్న దానికి విరుద్ధంగా తనను వినువారికి ఆశ్చర్యం కలిగించే సంగతిని యేసు ఇట్లు తెలియజేయును:

“అయ్యో ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొందియున్నారు. అయ్యో ఇప్పుడు (కడుపు) నిండియున్నవారలారా మీరాకలిగొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు. మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదేవిధముగా చేసిరి.”

యేసు భావమేమి? ధనము కలిగియుండుట, నవ్వుతు సుఖభోగములను వెంబడించుట, మనుష్యుల హర్షామోదములు పొందుట ఎందుకు శ్రమ తెచ్చును? ఎందుకనగా ఒకవ్యక్తి వీటిని కలిగియుండి వాటిని అనుభవించునప్పుడు, మాత్రమే నిజమైన ధన్యతను తేగల, దేవునిసేవను అవి అతని జీవితమునుండి వైదొలగజేయును. అదేసమయములో, కేవలము బీదవానిగాయుండుట, ఆకలిగొనియుండుట, దుఃఖక్రాంతుడైయుండుట ఒకని ధన్యుని చేయదని యేసు భావమైయున్నది. అయితే తరచు, అటువంటి దీనావస్థలోయున్న వ్యక్తులు యేసు బోధలకు ప్రత్యుత్తరమిచ్చి, ఆ విధముగా వారు నిజమైన ధన్యతతో ఆశీర్వదింపబడుదురు.

ఆ పిమ్మట, తన శిష్యులనుద్దేశించి యేసు ఇట్లనును: “మీరు లోకమునకు ఉప్పయి యున్నారు.” అక్షరార్థముగా వారు ఉప్పని ఆయన భావము కాదు. బదులుగా, ఉప్పు పదార్థములు చెడిపోకుండ నిలువవుంచుటకు పనిచేయును. యెహోవా ఆలయములో బలిపీఠమునొద్ద ఒకపెద్ద ఉప్పుకుప్ప ఉండెడిది, అక్కడ పనిచేయు యాజకులు అర్పణలన్నింటితోను ఉప్పును అర్పించెడివారు.

యేసు శిష్యులు “లోకమునకు ఉప్పయి ఉన్నారు,” అలా వారు ప్రజలను పరిరక్షించు ప్రభావమును కలిగియుందురు. అవును, వారు సాక్ష్యమిచ్చు వర్తమానము దానికి ప్రత్యుత్తరమిచ్చు వారందరి జీవితములను రక్షించును! అది అటువంటి వ్యక్తుల జీవితములలో స్థిరత్వము, యథార్థత, నమ్మకత్వము అను లక్షణములను తీసికొనివచ్చును, అది వారిలో ఎటువంటి ఆత్మీయ మరియు నైతిక పతనము సంభవించకుండ కాపాడును.

“మీరు లోకమునకు వెలుగైయున్నారు” అని యేసు తన శిష్యులకు చెప్పును. దీపము వెలిగించి కుంచము క్రిందపెట్టరు, కాని దీపస్తంభముమీద పెట్టుదురు, కాబట్టి యేసు తన శిష్యులతో ఇట్లనును: “మనుష్యుల యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” యేసు శిష్యులు తమ సాక్ష్యపు పనిద్వారా, ఆలాగే బైబిలు సూత్రముల కనుగుణ్యమైన తమ ప్రకాశవంతమైన ప్రవర్తనా మాదిరిద్వారా దీనిని చేయుదురు.

తన అనుచరులకు ఒక ఉన్నతమైన ప్రమాణము

యేసు, దేవుని ధర్మశాస్త్రము నతిక్రమించువాడనియెంచి, మతనాయకులు ఇటీవలనే ఆయనను చంపుటకు రహస్యాలోచన చేసిరి. కావున యేసు తన కొండమీది ప్రసంగమును కొనసాగించుచు, “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు” అని వివరించును.

దేవుని ధర్మశాస్త్రముయెడల ఎంతో గౌరవము గలవాడైయుండి, ఇతరులును అటువంటి గౌరవము కలిగియుండవలెనని యేసు వారిని ప్రోత్సహించెను. వాస్తవమునకు, ఆయనిట్లు చెప్పును: “కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును,” అంటే అటువంటి వ్యక్తి పరలోకరాజ్యములో ప్రవేశింపనేరడని దాని భావము.

దేవుని ధర్మశాస్త్రము నతిక్రమించుట కాదు, దానిని ఒకవ్యక్తి ఉల్లంఘించుటకు కారణమగు దృక్పధములను సహితము యేసు ఖండించెను. “నరహత్య చేయవద్దని” చెప్పిన ధర్మశాస్త్ర నియమమును గుర్తుచేసిన తర్వాత యేసు, “నేను మీతో చెప్పునదేమనగా,—తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును” అని చెప్పును.

తోటి సహవాసియెడల కోపమును అట్లే నిలుపుకొనుట ఎంత గంభీరమైనదంటే, అది నరహత్యకు దారితీయవచ్చును. సమాధాన పడుటకు ఒకడు ఎంతమేరకు వెళ్లవలెనో, ఉదహరించుచు, యేసు ఇట్లనెను: “నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల, అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.”

పది ఆజ్ఞలలో ఏడవదానివైపు శ్రద్ధ మళ్లించుచు, యేసు ఇంకను ఇట్లనును: “‘వ్యభిచారము చేయవద్దని’ చెప్పబడిన మాట మీరు విన్నారుగదా.” అయితే యేసు వ్యభిచారముయెడల స్థిరమైన భావమును సహితము ఖండించెను. ఆయన ఇట్లు చెప్పెను: “ఒక స్త్రీని మోహపుచూపుతో (అదేపనిగా) చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.”

ఇక్కడ యేసు కేవలము మనసులోకి వచ్చిపోవు అవినీతి తలంపునుగూర్చి మాట్లాడుటలేదు. అయితే ‘అదేపనిగా చూచుటను’ గూర్చి మాట్లాడుచున్నాడు. అలా అదేపనిగా చూచుట మోహపు కోరికను పెంచి, అవకాశము చిక్కినట్లయిన అది వ్యభిచరించుటకు నడుపును. ఇది సంభవించకుండ ఒకవ్యక్తి దీనిని ఎట్లు అడ్డగించగలడు? దానికొరకు ఎంత తీవ్రమైన చర్యలు అవసరమైయున్నవో ఉదహరించుచు యేసు ఇట్లనెను: “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము. . . . నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము.”

తరచు ప్రజలు తమప్రాణమును కాపాడుకొనుటకు అక్షరార్థముగా రోగగ్రస్తమైన ఒకానొక చిన్న అవయవమును తీసివేయుటకు అంగీకరింతురు. అయితే యేసు చెప్పిన ప్రకారము, అవినీతికరమైన తలంపులను మరియు చర్యలను విసర్జించుటకు, మిగుల విలువైన కన్ను లేక చెయ్యివంటి దేనినైనను, ‘పారవేయుట’ మరెంతో ఆవశ్యకమై యున్నది. లేనట్లయిన, అటువంటి వ్యక్తులు నిత్యనాశనమునకు సూచనగాయున్న గెహెన్నాలో (యెరూషలేము సమీపములో ఎప్పుడు కాలుతువుండు చెత్తకుప్ప) పడవేయబడుదురని యేసు వివరించెను.

హాని మరియు ఆటంకము కలిగించు ప్రజలతో ఎట్లు వ్యవహరించవలెనోకూడ యేసు చర్చించెను. “దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము” అని ఆయన ఉపదేశించెను. తనుగాని, తన కుటుంబముగాని ముట్టడికి గురియైనప్పుడు ఒకడు తనను సంరక్షించుకొనవద్దని యేసు భావముకాదు. చెంపమీద కొట్టుట భౌతికముగా ఒకని గాయపరచుటకు కాదుగాని, అతని అవమానపరచుట కొరకైయున్నది. కాబట్టి ఎవరైనా పోట్లాటను లేక వాదమును రేపుటకు ప్రయత్నించుచు, అక్షరార్థముగా చెంపదెబ్బకొట్టినను లేక అవమానకరముగా గుచ్చుకొనునట్లు మాట్లాడినను, అందుకు ప్రతికారము చేయుట తప్పిదమని యేసు చెప్పుచున్నాడు.

పొరుగువానిని ప్రేమించుమని చెప్పిన దేవుని ధర్మశాస్త్రమువైపు శ్రద్ధమళ్లించుచు, యేసు ఇట్లనెను: “మీ శత్రువులను ప్రేమించుడి; మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి.” అలాచేయుటకు శక్తివంతమైన కారణము తెలియజేయుచు ఆయన ఇంకను ఇట్లనెను: “[ఆ విధముగా] మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యున్నారని” నిరూపించుదురు. “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు.”

తన ప్రసంగమందలి ఈ భాగమును యేసు ఈ ప్రబోధనతో ముగించును: “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి.” ఖచ్ఛితమైన భావమందు మనుష్యులు పరిపూర్ణులై యుండగలరని యేసు భావము కాదు. బదులుగా వారు దేవుని అనుకరించుటద్వారా, వారి శత్రువులను సహితము ఆకట్టుకొనుటకు తమప్రేమను విస్తరింపజేయగలరు. దీనికి సమాంతరముగాయున్న లూకా వృత్తాంతము యేసు మాటలను ఈ విధముగా తెల్పినది: “మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు, మీరును కనికరముగలవారై యుండుడి.”

ప్రార్థన, మరియు దేవునియందలి నమ్మకము

యేసు తన ప్రసంగమును కొనసాగించుచు, దైవభక్తిగల వారివలె కన్పించుటకు ప్రయత్నించు ప్రజల వేషధారణను ఖండించును. “మీరు ధర్మము చేయునప్పుడు, వేషధారులు . . . చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దని” ఆయన చెప్పెను.

యేసు ఇంకను చెప్పినదేమనగా, “మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థనచేయుట వారికిష్టము.” బదులుగా, “నీవు ప్రార్థనచేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుమని” ఆయన ఉపదేశించును. యేసు తానుగా బహిరంగముగా ప్రార్థించెను, కాబట్టి ఆయన వాటిని ఖండించుటలేదు. బదులుగా వినువారిని ఆకర్షించునట్లు వారి అభినందనలను పొందుటకుచేయు ప్రార్థనలను ఆయన ఖండించుచున్నాడు.

యేసు వారికి మరింత ఉపదేశమిచ్చుచు, “మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు (పలికిన మాటలనే మరలా మరలా పలుకుట) వచింపవద్దు” అనును. ఇక్కడ చెప్పిన మాటను మరియొకసారి చెప్పుట తప్పిదమని యేసు భావము కాదు. ప్రార్థించునప్పుడు, ఒకసారి ఆయన తానుగా “పలికిన మాటనే” అనేకమార్లు పలికెను. అయితే జపమాలనుపయోగించుచు పలికిన మాటలనే పదేపదే పలుకుచు ప్రార్థనచేయు వారివలె, జ్ఞాపకముంచుకొనిన వాక్యములను “మరలా మరలా పలుకుటను” ఆయన సమ్మతింపలేదు.

ప్రార్థనచేయుటలో తనను వినువారికి సహాయకరమగునట్లు, యేసు వారికి ఏడు విన్నపములు చేరియున్న మాదిరి ప్రార్థనను నేర్పెను. అందులో మొదటి మూడు దేవుని సార్వభౌమాధిపత్యమును, ఆయన సంకల్పములకు గుర్తింపునిచ్చును. అవి దేవుని నామము పరిశుద్ధపరచబడుటకు, ఆయన రాజ్యము వచ్చుటకు, ఆయన చిత్తము నెరవేర్చబడుటకు చేయు విన్నపములైయున్నవి. మిగతా నాలుగు వ్యక్తిగత అవసరతల కొరకు, అనగా అనుదిన ఆహారము, పాప క్షమాపణ, ఒకని శక్తికిమించి శోధింపబడకుండుట మరియు దుష్టునినుండి తప్పింపబడుట కొరకు చేయునవైయున్నవి.

తరువాత, వస్తుసంబంధ విషయములకు అధిక ప్రాధాన్యతనిచ్చుటలోగల ఉరిని ప్రస్తావిస్తూ యేసు, “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరని,” ఉద్బోధించెను. అటువంటి ధనము పాడైపోవునదియేగాక, అది దేవుని దయను ఏమాత్రము సంపాదించి పెట్టదు.

కాబట్టి యేసు ఇట్లనెను: “పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి.” ఇది మీ జీవితములో దేవుని సేవను మొదట ఉంచుటయైయున్నది. ఆ విధముగా కూడబెట్టుకొనిన దేవుని దయను, లేక దాని దివ్య ప్రతిఫలమును ఎవరును తీసివేయలేరు. ఆ పిమ్మట యేసు ఇట్లనును: “నీ ధనమెక్కడనుండునో అక్కడనే నీ హృదయము ఉండును.”

ఇంకను ఐశ్వర్యాసక్తియందు దాగియున్న ఉరిని తెల్పుచూ యేసు ఈ ఉపమానము చెప్పును: “దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును. సరిగా పనిచేయు కన్ను శరీరమునకు చీకటిలో వెలిగింపబడిన దీపమువంటిదై యున్నది. అయితే సరిగా చూచుటకు, కన్ను తేటగాయుండవలెను, అనగా కేవలము ఒకదానిమీదనే దృష్టినిలుపవలెను. దృష్టి సరిగా నిలుపలేకపోవుట వస్తుదాయకమైన వాటిని తప్పుగా అంచనావేయునట్లు నడిపించును గనుక, దేవుని సేవకంటే ఐశ్వర్యాసక్తులకు ప్రధమ స్థానమిచ్చుట జరుగును. తత్ఫలితముగా “దేహమంతయు” చీకటిమయమగును.

“ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు” అను బలమైన ఉపమానముతో యేసు ఈ విషయమును ముగించును.

ఈ సలహాయిచ్చిన తరువాత, దేవుని సేవను ముందుపెట్టినట్లయిన, వస్తుదాయక అవసరతలనుగూర్చి చింతించనవసరములేదని తనను వినువారికి యేసు అభయమిచ్చుచున్నాడు. “ఆకాశ పక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు” అని చెప్పుచు, ఆయన వారినిట్లడుగును: “మీరు వాటికంటె బహుశ్రేష్ఠులు కారా?”

ఆ తదుపరి, యేసు అడవిపువ్వులను సూచించుచు, “సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదని, . . . అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించిన యెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా” అని చెప్పి, యేసు చివరికి ఇలా అనును: “కాబట్టి ‘ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో’ అని చింతింపకుడి. . . . ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”

జీవమునకు మార్గము

యేసు బోధలకు కట్టుబడియుండుట జీవమార్గమైయున్నది. అయితే చేయుటకు ఇది సులభమైనదేమి కాదు. పరిసయ్యులు, ఉదాహరణకు ఇతరులను కఠినముగా తీర్పుతీర్చుటకు చూచెడివారు, బహుశ అనేకమంది వారిని అనుకరించి యుండవచ్చును. కాబట్టి తన కొండమీది ప్రసంగమును కొనసాగించుచు యేసు ఇట్లు ప్రబోధించును: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.”

మరీ కఠినస్థులైన పరిసయ్యుల నడిపింపును అనుసరించుట ప్రమాదకరము. లూకా వృత్తాంతము ప్రకారము యేసు ఈ ప్రమాదమును ఇట్లు వివరించెను: “గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారిచూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా.”

ఇతరులతో మరీ కఠినముగా ఉండి, వారి తప్పిదములను పెద్దవిచేసి వారిని తూలనాడుట గంభీరమైన నేరమైయున్నది. కాబట్టి యేసు ఇట్లడుగుచున్నాడు: “నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి, ‘ నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని’ చెప్పనేల? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.”

అంటే యేసు శిష్యులు ఇతర ప్రజల విషయములో వివేచన చూపకూడదని దానిభావము కాదు, ఆయనిట్లనుచున్నాడు: “పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి.” దేవునివాక్య సత్యములు పరిశుద్ధమైనవి. అవి సూచనార్థక ముత్యములైయున్నవి. అయితే ఒకవేళ కొంతమంది వ్యక్తులు కుక్కలవలె, లేక పందులవలె ఈ విలువైన సత్యములయెడల మెప్పు చూపించనట్లయిన, యేసుయొక్క శిష్యులు ఆ ప్రజలను విడిచి వాటిని మరియెక్కువగా స్వీకరించు వారిని వెదకవలెను.

యేసు అంతకుముందు తన కొండమీది ప్రసంగములో ప్రార్థననుగూర్చి చర్చించినను, ఆయన ఇప్పుడు దానియందు పట్టుదల కలిగియుండుటను నొక్కిచెప్పుచున్నాడు. “అడుగుడి మీకియ్యబడును” అని ఆయన ఉద్భోదిస్తున్నాడు. ప్రార్థనలకు ప్రత్యుత్తరమిచ్చు దేవుని సిద్ధమనస్సును ఉదహరించుచు, యేసు ఇట్లనుచున్నాడు: “మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? . . . మీరు చెడ్డవారైయుండియు మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవులనిచ్చును.”

ఆ తర్వాత యేసు, సాధారణముగా బంగారు సూత్రమని పిలువబడు ప్రవర్తనా నియమమునుగూర్చి చెప్పును. ఆయనిట్లనును: “కావున మనుష్యులు మీకు ఏమిచేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” ఈ నియమము ప్రకారము జీవించుటలో ఇతరులకు మేలుచేయుటలకై అనుకూల చర్యలు తీసుకొనుటయు, ఇతరులు మిమ్ములనెట్లు చూడవలెనని మీరు తలంచుదురో మీరును వారికి అట్లే చేయుట ఇమిడియున్నది.

యేసు ఉపదేశము బయల్పరచినట్లు జీవమార్గము అంత సులభమైనది కాదు. “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దానిద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.”

తప్పుదోవ పట్టింపబడు ప్రమాదము గొప్పగాయున్నది, కావున యేసు ఇలా హెచ్చరించును: “అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.” మంచిచెట్లను, కానిచెట్లను వాటి ఫలములనుబట్టి గుర్తించునట్లే, అబద్ధప్రవక్తలను వారి ప్రవర్తన మరియు బోధలద్వారా గుర్తుపట్టవచ్చని యేసు చెప్పును.

యేసు ఇంకను చెప్పుచు, ఒకవ్యక్తి చెప్పుకొనునది కాదుగాని, అతడు చేయునది అతని తన శిష్యునిగా చేయునని వివరించును. కొంతమంది యేసు తమ ప్రభువని చెప్పుకొందురు, అయితే వారు తన తండ్రి చిత్తము చేయనట్లయితే, వారినిగూర్చి ఆయన ఇట్లనును: “అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండు.”

చివరగా, యేసు తన ప్రసంగమునకు ఎప్పటికిని గుర్తుంచుకొను రీతిలో ముగింపునిచ్చుచున్నాడు. “ఈ నామాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టెనుగాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు” అని ఆయన చెప్పును.

మరొక ప్రక్క, యేసు చెప్పునదేమనగా, “ఈ నామాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పది.”

యేసు తన ప్రసంగమును ముగించినప్పుడు, జనసమూహములు ఆయన బోధనా విధానమునకు ఆశ్చర్యపడుదురు, ఏలయనగా ఆయన వారి మతనాయకులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించును. లూకా 6:12-23; మత్తయి 5:1-12; లూకా 6:24-26; మత్తయి 5:13-48; 6:1-34; 26:36-45; 7:1-29; లూకా 6:27-49.

ఎప్పటికిని గుర్తుంచుకొనదగు తన ప్రఖ్యాత ప్రసంగమును ఇచ్చునప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఎవరు ఉన్నారు మరియు ఆయన దానినిచ్చుటకు కొంచెముముందు ఏమి జరుగును?

ప్రసంగమందలి కొన్ని బోధనలను లూకా మరొక సందర్భములో వ్రాయుట ఎందుకు ఆశ్చర్యము కలిగించకూడదు?

యేసు ప్రసంగమును ఏది అంత విలువకరము చేసినది?

నిజముగా ఎవరు ధన్యులు, ఎందుకు?

శ్రమ ఎవరికి, ఎందుకు?

యేసు శిష్యులు ఎట్లు “లోకమునకు ఉప్పుయి ఉన్నారు” మరియు “లోకమునకు వెలుగై” యున్నారు?

దేవుని ధర్మశాస్త్రము యెడల యేసు ఎట్లు ప్రగాఢ గౌరవమును చూపును?

నరహత్య, వ్యభిచారమునకు కారణమగు వాటిని పెరికివేయుటకు యేసు ఎటువంటి ఉపదేశమునిచ్చును?

ఇంకొక చెంపను త్రిప్పుడి అనుటలో యేసు భావమేమి?

దేవుడు పరిపూర్ణుడైయున్నట్లు, మనము ఎట్లు పరిపూర్ణులముగా ఉండగలము?

ప్రార్థన విషయములో యేసు ఏ ఉపదేశమునిచ్చును?

పరలోక ధనము ఎందుకు ఉన్నతమైనది, దానిని మనము ఎట్లు సంపాదించుకొనగలము?

ఒకడు ఐశ్వర్యాసక్తిని విసర్జించుటకు సహాయకరముగా ఏ ఉపమానములు చెప్పబడెను?

చింతించవలసిన అవసరము లేదని యేసు ఎందుకు చెప్పును?

ఇతరులకు తీర్పు తీర్చుటనుగూర్చి యేసు ఏమిచెప్పును; అయినను తన శిష్యులు ప్రజల విషయములో వివేచన చూపవలెనని ఆయన ఎట్లు చూపించును?

ప్రార్థననుగూర్చి యేసు ఇంకేమి చెప్పును, మరియు ఆయన ప్రవర్తన విషయమై ఎటువంటి నియమమును ఇచ్చును?

జీవమార్గము అంత సులభము కాదని, మరియు తప్పుదోవ పట్టింపబడు ప్రమాదము కలదని యేసు ఎట్లు చూపించును?

యేసు తన ప్రసంగమును ఎట్లు ముగించును, అది ఎటువంటి ప్రభావము కలిగియుండును?