కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అత్యానందముగా మారిన కన్నీరు

అత్యానందముగా మారిన కన్నీరు

అధ్యాయము 47

అత్యానందముగా మారిన కన్నీరు

రక్తస్రావముగల స్త్రీ స్వస్థపరచబడటం యాయీరు చూచినప్పుడు యేసు యొక్క అద్భుత శక్తిపై తన విశ్వాసం పెరిగిందనుటలో సందేహములేదు. చావుకు సిద్ధమైయున్న తన 12 సంవత్సరముల వయస్సుగల కూతురును బాగుచేయుమని యాయీరు ఆ దినమున అంతకుముందే యేసును అడిగియున్నాడు. అయితే ఇప్పుడు యాయీరు భయపడినంతా జరిగిపోవును. యేసు ఆ స్త్రీతో ఇంకను మాట్లాడుచుండగా, కొందరు వేగముగావచ్చి యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి.”

ఆ వార్త ఎంతగా కృంగదీసెను! సమాజములో బహుగా గౌరవింపబడుచున్న ఈ మనుష్యుడు, తన కుమార్తె మరణవార్త వినగానే ఇప్పుడు పూర్తిగా నిస్సహాయుడగును. అయితే, యేసు వీరి సంభాషణ విని, యాయీరు వైపు తిరిగి “భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని” ప్రోత్సహించును.

దుఃఖములో మునిగియున్న ఆ వ్యక్తి వెంట యేసు అతని ఇంటికి వచ్చును. వారు వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరు గొల్లున ఏడ్చుచూ, తమ్మునుతాము చరుచుకొనుచూ ప్రలాపించుదురు. యేసు లోపలికి ప్రవేశించి “మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని” వారితో చెప్పును.

దీనిని విన్న ప్రజలు ఆ బాలిక నిజముగా చనిపోయెనని ఎరిగియున్నందున, వారు యేసును పరిహసింతురు. అయినను యేసు ఆమె నిద్రించుచున్నదని చెప్పెను. దేవుడు తనకిచ్చిన శక్తితో గాఢ నిద్రలోనున్న వారిని లేపినంత తేలికగా మృతులను లేపవచ్చునని ఆయన ప్రజలకు చూపించనైయుండెను.

ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు మరియు ఆ బాలిక తలిదండ్రులను తప్ప మిగతావారినందరిని యేసు బయటకు పంపివేసెను. తనతోపాటు ఈ ఐదుగురిని ఆ బాలిక ఉన్న గదిలోనికి తీసికొనిపోవును. ఆ పిమ్మట యేసు ఆ చిన్నదాని చేయిపట్టుకొని “తలీ’తా’కుమీ” అనును. ఆ మాటకు “చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని” అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగును! ఈ దృశ్యమును చూచిన ఆమె తలిదండ్రుల ఆనందమునకు అవధులు లేకపోవును.

ఆమెకు తినుటకు ఏదైన ఇవ్వమని వారికి చెప్పిన తరువాత జరిగిన విషయములను ఎవ్వరికి తెల్పవద్దని యేసు యాయీరునకును అతని భార్యకును ఆజ్ఞాపించును. యేసు ఈ విధముగా చెప్పినప్పటికిని, ఈ వార్త ఆ ప్రాంతమంతయు వ్యాపించును. ఇది యేసు చేసిన రెండవ పునరుత్థానము. మత్తయి 9:18-26; మార్కు 5:35-43; లూకా 8:41-56.

▪ యాయీరు ఏ వార్తను వినెను, మరియు యేసు అతనినెట్లు ప్రోత్సహించును?

▪ వారు యాయీరు యింటికి వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లున్నది?

▪ బాలిక కేవలము నిద్రపోవుచున్నదని యేసు ఎందుకు చెప్పును?

▪ యేసుతో పాటు ఈ పునరుత్థానమును చూచిన మిగతా ఐదుగురు ఎవరు?