కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనేకమంది శిష్యులు యేసును వెంబడించుటకు మానుకొందురు

అనేకమంది శిష్యులు యేసును వెంబడించుటకు మానుకొందురు

అధ్యాయము 55

అనేకమంది శిష్యులు యేసును వెంబడించుటకు మానుకొందురు

పరలోకమునుండి దిగివచ్చిన ఆహారముగా తన పాత్రనుగూర్చి యేసు కపెర్నహూములోని సమాజ మందిరములో బోధించుచున్నాడు. అద్భుతరీతిలో రొట్టెలు, మరియు చేపలు భుజించిన తర్వాత, గలిలయ సముద్ర తూర్పుభాగమునుండి తిరిగివచ్చుచు ఆయనను కనుగొనిన ప్రజలతో ఆయన ప్రారంభించిన చర్చయొక్క విస్తరణే ఈ ప్రసంగము.

యేసు తన ప్రసంగమును కొనసాగించుచు, “నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే” అనును. కేవలము రెండు సంవత్సరముల క్రితమే, సా.శ. 30 వసంత కాలములో, యేసు నీకొదేముతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని రక్షకునిగా దయచేసెనని చెప్పెను. అట్లు యేసు, ప్రపంచమందలి మానవజాతిలో ఎవరైనను సూచనార్థకముగా తన శరీరమును తినినట్లయిన, అనగా తాను త్వరలో అర్పింపనైయున్న బలియందు విశ్వాసముంచుటద్వారా, నిత్యజీవమును పొందవచ్చునని ఆయన ఇప్పుడు చూపించుచున్నాడు.

అయినప్పటికిని, ప్రజలు యేసు మాటలకు అభ్యంతరపడుచు, “ఈయన తన శరీరమును, ఏలాగు తిననియ్యగలడు?” అని అడుగుదురు. ఆయన శరీరమును తినుట సూచనార్థముగా చేయబడునని తనను వినువారు గ్రహించవలెనని యేసు కోరుచున్నాడు. అందువలన, దీనిని నొక్కిచెప్పుటకుగాను, అక్షరార్థమైన భావములో తీసికొన్నచో మరింత అభ్యంతరకరముగానుండు మరొక విషయమును ఆయన వారికి తెల్పును.

యేసు ఇట్లు ప్రకటించును: “మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనేకాని మీలో మీరు జీవము గలవారుకారు. నాశరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. నాశరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. నాశరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.”

నిజమే, యేసు నరమాంసభక్షణను సూచించుచున్నట్లయిన ఆయన బోధ ఆక్షేపణ కలిగించునదిగా ఉండును. అయితే యేసు అక్షరార్థముగా మాంసము భుజించుటను లేక రక్తము త్రాగుటను ప్రచారముచేయుట లేదు. ఆయన నొక్కిచెప్పుచున్న విషయమేమనగా, నిత్యజీవమును పొందువారందరు, ఆయన తన పరిపూర్ణ మానవ శరీరమును అర్పించి, తన ప్రాణరక్తమును ధారపోయుటద్వారా ఇచ్చు బలియందు తప్పక విశ్వాసముంచవలెను. అయినను ఆయన శిష్యులలో అనేకులు ఆయన బోధను అర్థము చేసికొనుటకు ప్రయత్నించలేదు. పైగా వారిట్లు అభ్యంతరపడిరి: “ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వినగలడు?”

తన శిష్యులలో అనేకమంది సణుగుకొనుచున్నారని యెరిగి యేసు, “దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు? ఎందుకు నేను మీతో చెప్పియున్న మాటలు . . . ఆత్మయు జీవమునైయున్నవిగాని మీలో విశ్వసించని వారు కొందరున్నారు” అని వారితో చెప్పును.

యేసు ఇంకను కొనసాగించుచు, “తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని” అనును. దానితో, ఆయన శిష్యులలో అనేకమంది ఆయనను వెంబడించుటకు మానుకొందురు. కాగా యేసు తన 12 మంది అపొస్తలులవైపు తిరిగి, “మీరుకూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని వారిని అడుగును.

పేతురు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చును, “ప్రభువా, ఎవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నాము.” ఈ విషయములో పేతురు ఇతర అపొస్తలులు యేసు బోధను పూర్తిగా అర్థము చేసికొనకపోయినను, యథార్థతను వారెంత శ్రేష్ఠముగా వ్యక్తపరచారో!

పేతురు ప్రత్యుత్తరమునకు సంతృప్తిచెందినను యేసు ఇట్లు చెప్పును: “నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు కొండెములు చెప్పువాడు.” (NW) ఆయన యూదా ఇస్కరియోతునుగూర్చి మాట్లాడుచున్నాడు. బహుశ ఇక్కడే యూదాలో దుష్ప్రర్తన “ఆరంభమైనట్లు” లేక పొడచూపినట్లు యేసు పసిగట్టి యుండవచ్చును.

తనను రాజుగా చేయదలచిన ప్రజల ప్రయత్నమును వ్యతిరేకించుచు యేసు అంతకుముందే వారిని నిరుత్సాహపరచెను, కావున వారిట్లనుకొని యుండవచ్చును, ‘మెస్సీయయొక్క సరియైన స్థానమును చేపట్టనియెడల ఈయన మెస్సీయ ఎట్లు కాగలడు?’ ఈ విషయముకూడ ప్రజల మనస్సులలో ఇంకను మెదలుచుండును. యోహాను 6:51-71; 3:16.

యేసు ఎవరికొరకు శరీరమును ఇచ్చును, మరియు వీరు ఆయన ‘శరీరమును’ ఎట్లు భుజింతురు?

యేసు ఇంకను చెప్పిన ఏ మాటలు ప్రజలకు గగుర్పాటును కలిగించియుండవచ్చును, అయినను ఆయన దేనిని నొక్కి తెలుపుచున్నాడు?

యేసును వెంబడించుటకు అనేకులు మానుకొనినప్పుడు, పేతురు ప్రత్యుత్తరమేమై యున్నది?