అప్పగింపబడి తీసికొనిపోబడును
అధ్యాయము 124
అప్పగింపబడి తీసికొనిపోబడును
హింసింపబడిన యేసుయొక్క ప్రశాంతమైన ఉన్నతత్వముచే కదిలింపబడి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నించినప్పుడు, ప్రధాన యాజకులు మరింత ఉగ్రులగుదురు. వారి దుష్ట ఆలోచనకు ఏదియు అడ్డు తగలకూడదని వారు తీర్మానించుకొందురు. కావున వారు మరలా “ఆయనను వ్రేలాడదీయుము, వ్రేలాడదీయుము” (NW) అని కేకలు వేసిరి.
అందుకు పిలాతు, “మీరే ఆయనను తీసికొనిపోయి వ్రేలాడదీయుడని” (NW) వారితో చెప్పును. (వారు ముందు చెప్పుకొనిన దానికి భిన్నముగా, తగిన ఆధారమున్న మతనేరముల నిమిత్తము నేరస్థులను శిక్షించు అధికారమును యూదులు కలిగియుండవచ్చును.) ఆ పిమ్మట, చివరకు ఐదవసారి పిలాతు యేసు నిర్దోషియని, చెప్పుచు ఇట్లనును: “ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు.”
తమ రాజకీయ ఆరోపణలు ఎలాంటి ఫలితమివ్వకపోవుటను యూదులు చూచినప్పుడు, వారు కొన్ని గంటలక్రితం మహాసభ ఎదుట యేసును విచారణప్పుడు చేసిన మతసంబంధమైన దైవదోషారోపణలు మరలా చేయుదురు. “మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున అతడు చావవలెనని” వారందురు.
పిలాతుకు ఈ ఆరోపణ క్రొత్తది, మరియు అది అతని మరింత భయబ్రాంతుని చేయును. ఇప్పటికి అతడు తన భార్య స్వప్నము, యేసు అసాధారణమైన వ్యక్తిత్వపు శక్తి సూచించినట్లు, యేసు సాధారణ పురుషుడు కాడని గ్రహించును. అయితే “దేవుని కుమారుడా”? యేసు గలిలయవాడని పిలాతుకు తెలుసు. గానీ, ఆయన పూర్వమందు జీవించియుండు సాధ్యత కలదా? పిలాతు ఆయనను మరలా రాజసౌధములోనికి తీసికొనిపోయి ఇట్లడుగును: “నీవెక్కడనుండి వచ్చితివి?”
యేసు మౌనముగా ఉండును. అంతకుముందు ఆయన పిలాతుకు తన రాజునని తన రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదని చెప్పియున్నాడు. ఇప్పుడు ఇంకా వివరించుట ఏ విధముగాను ఉపయుక్తము కాదు. అయితే యేసు జవాబుచెప్పుటకు నిరాకరించుట పిలాతు అహంకారమును దెబ్బతీయును, కావున అతడు కోపియై యేసుతో ఇట్లనును: “నీవు నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను వ్రేలాడదీయుటకు (NW) నాకు అధికారము కలదనియు నీ వెరుగవా?”
అందుకు యేసు మర్యాదపూర్వకముగా, “పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు” అని ప్రత్యుత్తరమిచ్చును. భూసంబంధమైన వ్యవహారములను నిర్దేశించుటకు మానవ పాలకులకు దేవుడనుగ్రహించు అధికారమును ఆయన సూచించుచున్నాడు. ఆ పిమ్మట యేసు ఇంకను ఇట్లనెను: “అందుచేత నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదు.” అవును, యేసును అన్యాయముగా శిక్షించినందుకు పిలాతుకంటే ప్రధాన యాజకుడగు కయప, అతని అనుయాయులు మరియు ఇస్కరియోతు యూదా ఎక్కువ బాధ్యత వహించుదురు.
యేసు విషయమై మరింత ముగ్ధుడై అయితే యేసు దైవిక మూలమును కలిగియుండవచ్చునను భయముతో, పిలాతు ఆయనను విడిపించుటకు మరలా ప్రయత్నించును. అయితే యూదులు పిలాతు మాటలను త్రిప్పికొట్టుదురు. వారు మరలా తమ రాజకీయ ఆరోపణను చేయుచు, కుయుక్తితో ఇట్లు బెదిరింతురు: “నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే.”
ఇటువంటి చిక్కుల మధ్యను, పిలాతు యేసును మరలా ఒకసారి బయటకు తెచ్చి, “ఇదిగో మీరాజు” అని వారికి మళ్లీ విన్నపము చేయును.
“ఇతని సంహరించుము, సంహరించుము, వ్రేలాడదీయుము.” (NW)
“మీ రాజును వ్రేలాడవేయుదునా?” (NW) అని పిలాతు తెగించి అడుగును.
యూదులు రోమా అధికారము క్రిందనున్నట్లు మాట్లాడుచున్నారు. నిజానికి, వారు రోమా అధికారమును ధిక్కరింతురు! అయినను, వేషధారణతో వారి ప్రధాన యాజకులు ఇట్లనుచున్నారు: “కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు.”
రాజకీయ హోదా మరియు ప్రతిష్ట విషయమై భయపడి, పిలాతు చివరకు యూదుల నిర్దాక్షిణ్యపు మాటలకు లోబడును. అతడు యేసును వారికి అప్పగించును. సైనికులు ఆయన మీదనున్న ఊదారంగు అంగీని చించివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగింతురు. వ్రేలాడదీయుటకు యేసును తీసుకువెళ్తూ, ఆయన హింసాకొయ్యను ఆయనచేతనే మోయింతురు.
నీసాను 14, శుక్రవారము, ఇప్పుడు మధ్యాహ్న సమయము కావస్తున్నది. గురువారము ఉదయమునుండి యేసు ఇలా ఒకదానివెంట మరొకటిగా విపరీతముగా బాధననుభవించుచున్నాడు. తనపై మోపబడిన ఎంతో బరువైన కొయ్యను ఆయనిక మోయలేకపోవుటను అర్థము చేసికొనవచ్చును. కావున ఆ దారిన వెళ్లుచున్న ఆఫ్రికాలోని కురేనీయుడగు సీమోనను ఒకని పట్టుకొని, ఆయనకొరకు దానిని అతనిపై పెట్టిరి. వారు వెళ్లుచుండగా అనేకమంది ప్రజలు, స్త్రీలు యేసు కొరకు రొమ్ముకొట్టుకొనుచు, దుఃఖించుచు వెంబడింతురు.
ఆ స్త్రీలవైపు తిరిగి, యేసు ఇట్లనును: “యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇదిగో—గొడ్రాండును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి. . . . వారు పచ్చిమ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో?”
యేసు యూదా జనాంగమనబడిన మ్రానును సూచించుచున్నాడు, అది యేసు ఉండుటనుబట్టి మరియు ఆయనయందు విశ్వాసముంచిన శేషము నిలిచియుండుటను బట్టి దానిలో ఇంకను జీవమను తేమ కలదు. అయితే వీరు జనాంగమునుండి తీసివేయబడినప్పుడు, కేవలము ఆత్మీయముగా చచ్చిన మ్రాను, అవును, ఎండిన జనవ్యవస్థ మాత్రమే మిగిలియుండును. ఆహా, దేవుని సంహారకులుగా పనిచేయు రోమా సైన్యము యూదా జనాంగమును సర్వనాశనముచేసినప్పుడు అది ఎంత దుఃఖకారణమగునో! యోహాను 19:6-17; 18:31; లూకా 23:24-31; మత్తయి 27:31, 32; మార్కు 15:20, 21.
▪ తమ రాజకీయ ఆరోపణలు విఫలమైనప్పుడు మతనాయకులు యేసుపై ఏ ఆరోపణ చేయుదురు?
▪ పిలాతు ఎందుకు మరింత భయకంపితుడగును?
▪ యేసుకు సంభవించుదానికి ఎవరు ఎక్కువ బాధ్యులగుదురు?
▪ యేసును సంహరించుటకు అప్పగించులాగున, యాజకులు చివరకు ఎట్లు పిలాతుపై ప్రభావము చూపుదురు?
▪ తన కొరకు దుఃఖించుచున్న స్త్రీలతో యేసు ఏమిచెప్పును, మరియు మ్రాను “పచ్చిగా” మరియు “ఎండిన” దిగా ఉన్నదని సూచించుటలో ఆయన భావమేమి?